జనాభాతో సంబంధం లేకుండా పతకాల వేటలో ముందంజ
పారిస్ ఒలింపిక్స్‌లో మెరిసిన చిన్న దేశాల క్రీడాకారులు
మహిళల 100 మీటర్ల పరుగులో సెయింట్ లూసియాకు చెందిన అల్‌ఫ్రెడ్ జూలియన్ 10.72 సెకన్లలో లక్ష్యానికి చేరి స్వర్ణం గెలిచింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో డొమెనికాకు చెందిన లెఫాండ్ థియా 15.02 మీటర్ల దూరం దూకి పసిడి పతకం కైవసం చేసుకుంది. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.. సెయింట్ లూసియా జనాభా 1,80,000 కాగా.. డొమెనికా జనాభా 73 వేలు మాత్రమే.
కరీబియన్ దీవుల్లోని అతి చిన్న దేశాలు విశ్వక్రీడల్లో సత్తా చాటుతున్నాయనడానికి ఇది నిదర్శనం. ఒలింపిక్స్ చరిత్రలో పసిడి గెలిచిన అతి తక్కువ జనాభా గల దేశంగా డొమినికా రికార్డుల్లోకెక్కింది. ఇవే కాకుండా.. పట్టుమని 10 లక్షల జనాభా కూడా లేని పదికి పైగా దేశాలు ఒలింపిక్స్‌లో చక్కటి ప్రదర్శన కనబరిచాయి. –సాక్షి క్రీడా విభాగం
ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు వందకు పైగా దేశాలు పతకాలు సాధించాయి. వాటిలో జనాభా పరంగా స్వర్ణం గెలిచిన అతిచిన్న దేశంగా డొమెనికా నిలిచింది. విశ్వక్రీడల్లో ఆ దేశానికి ఇదే తొలి పతకం కావడం మరో విశేషం. ఇప్పటి వరకు తమ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా గుర్తింపు లేకున్నా... ఈ మెడల్ అనంతరం డొమినికాను ప్రపంచ చాంపియన్‌గా అందరూ గుర్తిస్తారని... ఆ దేశానికి తొలి పతకం అందించిన ట్రిపుల్ జంపర్ లెఫాండ్ థియా ఆశాభావం వ్యక్తం చేసింది.
భిన్న భౌగోళిక పరిస్థితులు ఉండే డొమెనికాలో... క్రీడలకు ఇచ్చే ప్రాధాన్యం అంతంత మాత్రమే. అలాంటి చోటు నుంచి ‘పారిస్’ క్రీడలకు నలుగురు అథ్లెట్లు అర్హత సాధించగా అందులో లెఫాండ్ థియా సాధించిన బంగారు పతకం... ఆ దేశానికి కీర్తి ప్రతిష్టలు కట్టబెట్టింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్ నుంచి డొమెనికా విశ్వక్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తుండగా.. 28 ఏళ్ల తర్వాత ఆ దేశానికి మొదటి పతకం దక్కింది. ఈ ఏడాది ప్రపంచ ఇండోర్ చాంపియన్íÙప్‌లో పతకం నెగ్గి ఆశలు రేపిన లెఫాండ్... ‘పారిస్’ క్రీడల్లోనూ అదే జోరు కొనసాగించింది.
మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో 15.02 మీటర్ల దూరం లంఘించి పసిడి పతకం కైవసం చేసుకుంది. ‘ఇప్పుడు మేం కూడా ప్రపంచ చాంపియన్‌లమే. డొమెనికాకు ఒలింపిక్స్‌లో తొలి పతకం. అది కూడా పసిడి. చాలా గొప్పగా అనిపిస్తోంది. ఈ ఫలితంతో మా దేశంలో క్రీడలకు మరింత ప్రాధాన్యత దక్కుతుందనే నమ్మకం పెరిగింది. మా దేశ జనాభా సుమారు 73 వేలు. దేశానికి తొలి స్వర్ణం అందించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్‌గా నిలవడం... అందులోనూ పతకం గెలవడం చాలా గర్వంగా ఉంది.
చిన్న దేశం అంటే... పరిమిత వనరులు ఉంటాయనుకుంటారు. అయితే సంఖ్య కన్నా నాణ్యత ముఖ్యం అని నా ఉద్దేశం. ఈ విజయాన్ని దేశమంతా ఆస్వాదిస్తుంది. డొమెనికా స్టేడియంలో అథ్లెటిక్స్ కోసం మెరుగైన ట్రాక్ కూడా లేదు. ఇప్పుడు ఈ పతకం వల్ల దేశంలో క్రీడా మౌలిక వసతులు మెరుగు పడతాయని ఆశిస్తున్నా. భవిష్యత్తు తరాలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు నా వంతు కృషి చేస్తా’ అని పతకం గెలిచిన అనంతరం లెఫాండ్ వివరించింది.
జూలియన్ కథే వేరు...
పారిస్ ఒలింపిక్స్ మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం, 200 మీటర్లలో రజతం నెగ్గిన సెయింట్ లూసియా అథ్లెట్ జూలియన్ అ్రల్ఫెడ్ కథే వేరు! అమెరికా అథ్లెట్లు షకారీ రిచర్డ్‌సన్, జెఫెర్‌సన్ మెలీస్సాలతో పోటీపడి అగ్రస్థానం దక్కించుకున్న జూలియన్... ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరింది. ప్రాక్టీస్ చేసేందుకు షూస్ కాదు కదా... కనీసం చెప్పులు కూడా లేని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన జూలియన్... చిన్నతనంలో ఎక్కువగా స్కూల్ యూనిఫామ్‌లోనే పరుగు పెట్టేది. రన్నింగ్ కోసం ప్రత్యేక దుస్తులు కొనే స్థోమత లేని జూలియన్... చిన్నప్పటి నుంచే పరుగును ప్రేమించింది.
ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాలని ఊహ తెలిసినప్పటి నుంచి లక్ష్యంగా పెట్టుకున్న జూలియన్... పారిస్‌లో తన కల సాకారం చేసుకుంది. ‘ఇది నాకు, నా దేశానికి ఎంతో విలువైంది. యావత్ దేశం సంబరాలు జరుపుకోవడం ఖాయం. చిన్నప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండా పరుగులు తీసే దాన్ని. కనీస వసతులు లేకుండానే ఈ స్థాయికి వచ్చా. ఈ ప్రదర్శన అనంతరం మా దేశంలో స్టేడియం నిర్మాణం జరుగుతుందనుకుంటున్నా. యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడం పెరుగుతుందని భావిస్తున్నా. దేశానికి అంబాసిడర్ అనే భావన కలుగుతోంది.
ప్రపంచంలో చాలా మందికి సెయింట్ లూసియా గురించి తెలిసి ఉండకపోవచ్చు. అదెక్కడ ఉంది అని నన్ను ఎంతో మంది అడిగారు. కాని ఇప్పుడు ఒలింపిక్ చాంపియన్ కాబట్టి... ప్రజలు సెయింట్ లూసియా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. దేశం కోసం పరుగెత్తడాన్ని గౌరవంగా భావిస్తా. ఇంటికి వెళ్లాక ప్రజలతో కలిసి సంబరాలు చేసుకుంటా’అని జూలియన్ చెప్పింది.
వీరిద్దరే కాదు... 1,25,000 జనాభా ఉన్న గ్రెనెడా అథ్లెట్లు ‘పారిస్’ క్రీడల్లో రెండు కాంస్యాలు సాధించగా... 2,82,000 జనాభా ఉన్న బార్బడోస్ ఒక పతకం నెగ్గింది. ఇక సుమారు 4 లక్షల జనాభా గల బహామస్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఇప్పటి వరకు 8 స్వర్ణాలు, 2 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 16 పతకాలు గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment