పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపర్చిన భారత బృందం
టోక్యో ఒలింపిక్స్ ముగిసిన వెంటనే భారత ఆటగాళ్ల సన్నాహాలు మొదలయ్యాయి. సాధారణంగా ఉండే నాలుగేళ్లతో పోలిస్తే ఒక ఏడాది తక్కువ సమయం ఉండటంతో అన్ని క్రీడల్లోనూ పారిస్ లక్ష్యంగానే హడావిడి కనిపించింది. అధికారులు, ప్రభుత్వం కూడా రెండంకెల పతకాలు ఖాయమంటూ నమ్మకం పెట్టుకున్నాయి. అందుకు తగినట్లుగా ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా అండగా నిలిచింది.
అథ్లెట్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకుండా ఒలింపిక్స్ సన్నద్ధత కోసమే 16 క్రీడాంశాల్లో సౌకర్యాల కల్పన, విదేశాల్లో ప్రత్యేక శిక్షణ, పోటీల్లో పాల్గొనేందుకు రూ. 470 కోట్లు ఖర్చు కూడా చేసింది. 117 మందితో మన బృందం బరిలోకి దిగింది. అద్భుతాల గురించి కాకపోయినా ఎక్కువ మంది కచ్చితంగా బాగా ఆడతారనే అంచనాలు, ఆశలు మాత్రం అందరిలోనూ ఉన్నాయి.
కానీ ఒక్కో రోజు కరుగుతున్న కొద్దీ పరిస్థితి మారిపోతూ వచ్చింది. పతకం కోసం ఎంతో ఎదురు చూడాల్సిన స్థితి. చివరకు ఒక రజతం, ఐదు కాంస్యాలతో మన టీమ్ ముగించింది. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే పతకాల సంఖ్య తగ్గడమే కాదు... స్వర్ణం కూడా లేకపోవడంతో పతకాల పట్టికలో కూడా భారత్ చాలా దిగువకు పడిపోయింది. –సాక్షి క్రీడా విభాగం
పారిస్: అథ్లెటిక్స్‌లో భారత మహిళల 4్ఠ400 రిలే జట్టు పారిస్ ఒలింపిక్స్‌లో 3 నిమిషాల 32.51 సెకన్ల టైమింగ్ నమోదు చేసింది... ఇదే ఈవెంట్‌లో 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో భారత బృందం టైమింగ్ 3 నిమిషాల 32.49 సెకన్లు మాత్రమే! అంటే 40 సంవత్సరాల తర్వాత కూడా మన జట్టు టైమింగ్ మెరుగుకాకపోగా, అంతకంటే పేలవంగా రిలే టీమ్ ముగించింది. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, విదేశాల్లో శిక్షణ, మంచి డైట్ వంటివి మాత్రమే ఫలితాన్ని ఇవ్వలేవనే దానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.
నిజాయితీగా చెప్పాలంటే అథ్లెటిక్స్‌లో మన ఆటగాళ్ల విషయంలో పెద్దగా అంచనాలు లేవు కానీ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మేమూ ఉన్నామని గుర్తు చేసే కనీస స్థాయి ప్రదర్శన కూడా రాలేదు. మొత్తం 29 మంది అథ్లెట్లు పాల్గొంటే జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒక్కడే తన స్థాయిని ప్రదర్శించాడు. భారత ప్రదర్శన విషయంలో ఈ ఒక్క క్రీడాంశాన్నే విమర్శించడానికి లేదు. ఓవరాల్‌గా కూడా టోక్యో ఒలింపిక్స్ ప్రదర్శనను దాటలేకపోగా, అది పునరావృతం కూడా కాలేదు. ప్రతీ ఒలింపిక్స్ తర్వాత జరిగే సమీక్ష తరహాలోనే ఈసారి కూడా దాదాపు అవే కారణాలు.
మన ప్రమాణాలు బాగా పెరిగాయని చెప్పుకోవడమే తప్ప అసలైన సమయంలో పోటీకి దిగినప్పుడు ఇంకా మనం చాలా అంశాల్లో వెనుకబడి ఉన్నామని తేలిపోయింది. చాలా మంది భారత ఆటగాళ్లకు ఒలింపిక్స్‌లో పాల్గొనడమే ఒక ఘనతగా కనిపిస్తోంది తప్ప అంతకు మించి ముందుకు వెళ్లడం సాధ్యం కావడం లేదు. 20 కిలోమీటర్ల రేస్‌వాక్‌లో 43 మంది పాల్గొంటే 41వ స్థానంలో నిలిచిన ప్రియాంక గోస్వామి గేమ్స్ విలేజ్ గదిలో సరదాగా ‘రీల్స్’ చేస్తున్న వీడియో చూస్తే ఆమె తన ఆట పట్ల ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతుంది.
తాము అడిగిన కోచ్‌లు, ఫిజియోలు... తాము కోరిన చోట శిక్షణ... ఇలా ఒక్కటేమిటి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచింది. అయినా మెడల్స్ విషయంలో మన రాత మారలేదంటే లోపం ఆటగాళ్లలోనే ఉన్నట్లు అర్థం. తమకు సౌకర్యాలు లేవనే మాట ఇకపై ఆటగాళ్ల నుంచి రాకూడదని... ప్లేయర్లు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకోన్ చేసిన వ్యాఖ్య ఈ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లందరికీ వర్తిస్తుంది.
పతకవీరులు...
టోక్యోలో 19 ఏళ్ల టీనేజర్‌గా బరిలోకి దిగి తీవ్రంగా నిరాశపర్చిన షూటర్ మనూ భాకర్ ఈసారి నాటి తప్పులను సరిదిద్దుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ విభాగాల్లో రెండు కాంస్యాలు గెలిచి తనను తాను నిరూపించుకుంది. మిక్స్‌డ్‌లో ఆమె భాగస్వామిగా సరబ్‌జోత్ సింగ్ కూడా కాంస్యాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో అనూహ్యంగా స్వప్నిల్ కుసాలే మూడో స్థానంలో నిలవడంతో భారత్ ఖాతాలో మూడో కాంస్యం చేరింది.
భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ కాంస్యం సాధించడం మన అభిమానులకు ఊరట కాగా... యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా కంచు మోత మోగించి తానేంటో చూపించాడు. అయితే పట్టికలో భారత్ స్థానాన్ని పైకి చేర్చగల స్వర్ణం మాత్రం మనకు రాలేదు. ‘టోక్యో’ పసిడితో సత్తా చాటిన నీరజ్ చోప్రా గత మూడేళ్ల ప్రదర్శనను చూస్తే ఈసారి గోల్డ్ ఖాయమనిపించింది.
అయితే దురదృష్టవశాత్తూ అది చేజారినా... రజతంతో కాస్త మెరుగైన పతకం మన ఖాతాలో చేరింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో మెడల్స్ గెలిచిన అరుదైన జాబితాలో నీరజ్ చేరగా... ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో మనూ భాకర్ తన కీర్తిని పెంచుకుంది.
అంచనా తప్పారు...
టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తర్వాతి నుంచి ప్రదర్శన, తాజా ఫామ్, ఆటగాళ్ల స్థాయిని బట్టి చూసుకుంటే కొందరు ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపర్చారు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు విఫలం కాగా... కచ్చితంగా పతకం సాధిస్తారనుకున్న డబుల్స్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లోనే పరాజయంపాలయ్యారు. బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్, వరల్డ్ రికార్డు ఉన్న షూటర్ సిఫ్ట్ కౌర్ సామ్రా కనీసం పతకానికి చేరువగా కూడా రాలేకపోవడం గమనార్హం.
బాక్సింగ్‌లో నిశాంత్ దేవ్, అమిత్ పంఘాల్ కూడా అంచనా తప్పగా... గత ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఓడింది. ఇక ఆర్చరీ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. నాలుగో ఒలింపిక్స్‌లో కూడా దీపిక కుమారి ఉత్త చేతులతోనే తిరిగొచ్చింది. ఇక టేబుల్ టెన్నిస్, జూడో, స్విమ్మింగ్, రోయింగ్, సెయిలింగ్, గోల్ఫ్, ఈక్వె్రస్టియన్‌లు మనం పతకాలు ఆశించే క్రీడలు కావు. టెన్నిస్‌లో రోహన్ బోపన్న తన ఏటీపీ టోర్నీల స్థాయి ఆట ఇక్కడ ప్రదర్శించలేకపోయాడు.
నాలుగో స్థానాలతో సరి...
విజయం సాధించిన వాడినే ప్రపంచం గుర్తుంచుకుంటుంది. రెండో స్థానానికి కూడా విలువుండదు... స్పోర్ట్స్‌లో మోటివేషనల్ స్పీచ్‌లు ఇచ్చేటప్పుడు చాలా మంది తరచుగా వాడే మాట ఇది. కానీ మన భారతీయులు ఇప్పుడు నాలుగో స్థానాన్ని చూసి కూడా అయ్యో... కొద్దిలో చేజారిందే అనుకుంటున్నాం. ఇది ఏదో ఆత్మ సంతృప్తి కోసమే తప్ప ఒలింపిక్స్‌లో నాలుగో స్థానానికి ఎలాంటి విలువ లేదు. అదృష్టం కలిసొస్తే మరో ఆరు పతకాలు మన ఖాతాలో చేరేవేమో కానీ అలాంటి వాటికి ఆటల్లో చోటు లేదు.
మనూ భాకర్, అర్జున్ బబూతా, మహేశ్వరి–అనంత్‌జీత్ జోడీ (షూటింగ్), మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), బొమ్మదేవర ధీరజ్–అంకిత జోడీ (ఆర్చరీ) అసలు సమయంలో తమ ఆట స్థాయిని పెంచలేకపోయారు. చివరగా... గెలుపు కూడా ఓటమిగా మారిన వైనం వినేశ్ ఫొగాట్ విషయంలో జరిగింది. ఫైనల్ చేరిన తర్వాత వచ్చిన పతకం బరువు ఎక్కువై చేజారడం వినేశ్‌కే కాదు భారతీయులందరికీ వేదన కలిగించింది.
Comments
Please login to add a commentAdd a comment