200 మీటర్ల స్ప్రింట్ విజేత లెట్సిల్ టెబోగో
బోట్స్‌వానా చరిత్రలో తొలి ఒలింపిక్ స్వర్ణం
నోవా లైల్స్‌కు కాంస్యం
పారిస్: ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో ఆసక్తికర ఈవెంట్‌లలో ఒకటైన పురుషుల 200 మీటర్ల పరుగులో కొత్త చాంపియన్ అవతరించాడు. బోట్స్‌వానాకు చెందిన లెట్సిల్ టెబోగో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 21 ఏళ్ల టెబోగో 19.46 సెకన్లలో పరుగు పూర్తి చేశాడు.
టోక్యోలో రజతం సాధించిన బెడ్‌నారెక్ (అమెరికా; 19.62 సెకన్లు) ఈసారి కూడా రజతంతో సరి పెట్టుకున్నాడు. 100 మీటర్ల పరుగు విజేత అయిన మరో అమెరికా అథ్లెట్ నోవా లైల్స్‌కు (19.70 సెకన్లు) కాంస్యం దక్కింది. గత ఒలింపిక్స్‌లోనూ లైల్స్‌కు కాంస్యమే లభించింది. కోవిడ్‌తో బాధపడుతూనే బరిలోకి దిగిన లైల్స్ అంచనాలకు తగినట్లుగా రాణించలేకపోయాడు.
ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికాకు పొరుగున బోట్స్‌వానా ఉంది. 26 లక్షల జనాభా కలిగిన ఈ దేశ చరిత్రలో ఇదే తొలి ఒలింపిక్ స్వర్ణ పతకం కావడం విశేషం. గత ఏడాది బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్íÙప్‌లో టెబోగో 100 మీటర్లలో రజతం, 200 మీటర్ల పరుగులో కాంస్యం సాధించాడు. అతని కెరీర్ ఎదుగుదలలో తల్లి ఎలిజబెత్ సెరాతివా పాత్ర ఎంతో ఉంది. అయితే అతను ఒలింపిక్ సన్నాహాల్లో ఉన్న సమయంలో 44 ఏళ్ల వయసులో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించింది.
తన చేతి వేలి గోర్లపై తల్లి పేరు రాసుకొని అతను రేస్‌లో పాల్గొన్నాడు. పరుగు పూర్తి కాగానే జాతీయ పతాకాన్ని ఒంటిపై కప్పుకున్న టెబోగో భుజాలపై తన రెండు షూస్ వేసుకొని భావోద్వేగంతో కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అందులో ఒక షూను తీసి అతను కెమెరాకు చూపించాడు. దానిపై అతని తల్లి పేరు, పుట్టిన తేదీ రాసి ఉన్నాయి.
ప్రేక్షక సమూహంలో ఉన్న అతని చెల్లెలు కూడా అన్న ప్రదర్శనకు జేజేలు పలకింది. ‘నేను ఒలింపిక్ పతకం గెలవాలని ఆమె ఎంతో కోరుకుంది’ అని టెబోగో చెప్పాడు. మరోవైపు టెబోగో విజయంతో బోట్స్‌వానా దేశంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విజయంపై ప్రజలంతా సంబరాలు చేసుకోవాలంటూ దేశాధ్యక్షుడు మాగ్‌వీట్సీ మసీసీ శుక్రవారం ‘హాఫ్ డే’ సెలవు ప్రకటించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment