నరసాపురం ఎంపీడీవో ఆత్మహత్యపై కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు!
పోలీసుల అదుపులో రాజస్థాన్ సైబర్ ముఠా సభ్యుడు?
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణ అదృశ్యం, ఆత్మహత్య ఘటన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రాజస్థాన్‌కు చెందిన సైబర్ నేరగాళ్ల వేధింపుల కారణంగానే ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం, ఆత్మహత్యపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. వెంకటరమణ సెల్‌ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. వాటి ఆధారంగా రాజస్థాన్‌లోని బర్కత్‌పూర్‌కు చెందిన సైబర్‌ముఠా వలలో ఎంపీడీవో చిక్కుకున్నట్లు గుర్తించారని తెలిసింది.
సుమారు 30మంది ఉన్న ఈ సైబర్ నేరస్తుల ముఠా ఓ యువతి న్యూడ్ వీడియోను ఆధారంగా చేసుకుని ఎంపీడీవోను ఇరుకునపెట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆయనను బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్లు కూడా గుర్తించారని తెలిసింది. మరింత డబ్బులు కావాలని సైబర్ ముఠా ఒత్తిడి చేయడంతో బయటకు చెప్పుకోలేక ఎంపీడీవో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్మ చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రాజస్థాన్‌లోని బర్కత్‌పూర్‌కు చెందిన సైబర్‌ముఠా సభ్యుడిని ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఎంపీడీవో అదృశ్యమైన తర్వాత ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
నరసాపురంలోని మాధవాయిపాలెం ఫెర్రీ కాంట్రాక్టర్ సీహెచ్ రెడ్డప్ప ధవేజీ ప్రభుత్వానికి రేవు నిర్వహణకు సంబంధించిన లీజు డబ్బులు బకాయి ఉండటంతోనే ఎంపీడీవో కనిపించకుండాపోయారని కూటమి నేతలు ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్ ధవేజీ మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అనుచరుడని, లీజు డబ్బులు చెల్లించకుండా ప్రసాదరాజు ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. అందువల్లే ఒత్తిడికి గురైన ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఎంపీడీవో తన కుటుంబ సభ్యులకు వాట్సాప్‌లో పెట్టిన సూసైడ్ నోట్ కథనాన్ని తెరపైకి తెచ్చారు. అయితే, ఎంపీడీవో ఆత్మహత్యకు, ఫెర్రీ వ్యవహారానికి సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment