తొలి విజయంతోనే శ్రీనివాసవర్మకు అమాత్య యోగం
కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రిగా పదవి
సాక్షి, భీమవరం: ఆయన పేరు భూపతిరాజు శ్రీని వాసవర్మ అయినా.. ప్రజలకు తెలిసింది బీజేపీ వర్మగానే. ఎంపీ అభ్యర్థిగా తన పేరును పార్టీ ప్రకటించినా.. సీటు మార్పు కోసం మిత్రపక్ష నేతల పైరవీలతో బీ ఫాం ఆయన చేతికందే వరకు ఉత్కంఠభరితంగానే సాగింది. అవాంతరాలు అధిగమించి నరసాపురం ఎంపీగా గెలుపొందడమే కాదు.. తొలి విజయంతోనే కేంద్రంలో అమాత్య పదవిని అందుకున్నారు నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీనివాసవర్మ స్వాతంత్య్ర సమరయోధుడు భూపతిరాజు బాపిరాజు మనువడు.
1991లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత 1995లో బీజేపీ భీమవరం పట్టణ అధ్యక్షుడిగా, 1997లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శిగా, 1999లో నరసాపురం పార్లమెంట్ కన్వీనర్‌గా, 2001లో పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, 2010 నుంచి పదేళ్ల పాటు జిల్లా అధ్యక్షుడిగా, 2020 నుంచి రాష్ట్ర కార్యదర్శిగా పదవులు నిర్వర్తించారు. అధికారంతో నిమిత్తం లేకుండా అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకైనపాత్ర పోషిస్తూ వచ్చారు.
గతంలో నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీచేసిన యూవీ కృష్ణంరాజు, గోకరాజు గంగరాజుల విజయంలో కీలకంగా వ్యవహరించారు. 2014 మున్సిపల్ ఎన్నికల ద్వారా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన ఆయన భీమవరం నాలుగో వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. మున్సిపాలిటీ ప్యానెల్ చైర్మన్‌గా సేవలందించారు. పార్టీలతో నిమిత్తం లేకుండా అందరితోను కలుపుగోలుతనంగా ఉంటారని పేరొందారు. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం తన సొంత స్థలాన్ని ఇచ్చారు.
సీటు సాధించుకున్నారు
నరసాపురం ఎంపీ సీటు విషయమై మొదట్లో పెద్ద హైడ్రామానే నడిచింది. ఎంపీ అభ్యర్థిగా తాను పోటీలో ఉండాలని సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భావించారు. బీజేపీ తమ అభ్యర్థిగా శ్రీనివాసవర్మ పేరును ప్రకటించింది. సీటు మార్పు కోసం రఘురామకృష్ణంరాజు ప్రయత్నాలు చేసినట్టు పెద్ద ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో శ్రీనివాసవర్మే తమ అభ్యర్థి అని.. సీటు మార్పు ప్రచారాన్ని బీజేపీ నాయకులు మీడియా ద్వారా ఖండించాల్సి వచ్చింది.
పైస్థాయిలో ఉన్న పలుకుబడితో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నాలకు శ్రీనివాసవర్మ తెరదించారు. పార్టీ నుంచి బీఫాం అందుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో 2.76 లక్షల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఎంపీగా తొలి విజయంతోనే శ్రీనివాసవర్మను కేంద్ర మంత్రి పదవి వరించింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రిగా శ్రీనివాసవర్మకు కేబినేట్‌లో చోటు దక్కడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment