కర్నూలు(అగ్రికల్చర్): అద్భుతమైన రుచి.. ఆకట్టుకునే రూపం.. గుబాళించే సువాసన.. మన బంగినపల్లి మామిడి సొంతం. భారతీయులతోపాటు అరబ్, యూరోప్ దేశాల ప్రజలు కూడా ఈ మధుర ఫలాన్ని లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా బంగినపల్లి (బేనీషా) మామిడికి పుట్టినిల్లు అయిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగుచేస్తున్న పండ్లకు అరబ్ దేశాల్లో అత్యంత ఎక్కువగా క్రేజ్ ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 25వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. గత ఏడాది సగటున ఎకరాకు 2 నుంచి 3 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం 3-4 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో లక్ష టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. దీనిలో 80 నుంచి 90 శాతం వరకు బంగినపల్లి ఉంటుంది. బంగినపల్లి రకం మామిడిని విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో రెండు, మూడేళ్లుగా రైతులు నాణ్యతపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గూడూరు, ఓర్వకల్, వెల్దుర్తి, ప్యాపిలి, బేతంచెర్ల, బనగానపల్లి, కల్లూరు, కర్నూలు, దేవనకొండ, డోన్, క్రిష్ణగిరి తదితర మండలాల్లో కొంతమంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగు చేస్తున్నారు. చీడపీడల బెడద, కెమికల్స్ ప్రభావం మామిడిపై పడకుండా ఫ్రూట్ కవర్స్ కూడా వినియోగిస్తున్నారు. దీంతో పండ్ల నాణ్యత పెరుగుతోంది. రైతులకు ఉద్యానవనశాఖ అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
చదవండి: AP: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్
బడా వ్యాపారులు వచ్చి కొనుగోలు..
ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల నుంచి బడా వ్యాపారులు ఇక్కడికి వచ్చి మామడి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. తోటల్లోనే 20 కిలోల బాక్సుల్లో పండ్లను ప్యాకింగ్ చేసి ఆయా నగరాలకు తరలిస్తున్నారు. అక్కడ ప్రాసెసింగ్ చేసి అరబ్, యురోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పండిన పండ్లలో 40 శాతం ముంబైకి తీసుకువెళ్లి, అక్కడి నుంచి అరబ్ దేశాలైన దుబాయ్, సౌదీ, కువైట్‌కు ఎగుమతి చేస్తున్నారు.
గత ఏడాది 2,500 టన్నుల వరకు వివిధ దేశాలకు ఎగుమతి చేశారు. టన్ను ధర రూ.80 వేల నుంచి రూ.1.05లక్షల వరకు లభించింది. ఈ ఏడాది 5వేల టన్నుల వరకు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మామిడి కొనుగోలు కోసం మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు తరలివస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో మామిడికి ఎన్నడూ లేని విధంగా టన్ను ధర రూ.లక్షకు పైగా పలికింది. ఇటీవల మార్కెట్కు మామిడి తాకిడి పెరిగిన తర్వాత ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టన్ను ధర రూ.40 వేల వరకు లభిస్తోంది.
నాణ్యత స్పష్టంగా కనిపిస్తోంది
ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాం. ఎన్నడూ లేని విధంగా ఈసారి మామిడిలో నాణ్యత పెరిగింది. 50 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చేశాం. ఇందులో 85 శాతం చెట్లు బేనీషా రకానికి చెందినవే. ఎగుమతులకు అనువైన నాణ్యత ఉండాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా రసాయనాలు వాడటం లేదు. ఇందువల్ల మామిడిలో నాణ్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి నేరుగా విదేశాలకు ఎగుమతి కావడంలేదు. ముంబై, తమిళనాడు, హైదరాబాద్ వ్యాపారులు వచ్చి మామిడి కొంటున్నారు.
– గొల్ల శ్రీరాములు, గూడూరు
Comments
Please login to add a commentAdd a comment