Arab
-
ఇజ్రాయెల్‌కు సాయం చేయకండి: అరబ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఇరాన్-ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాలస్తీనా, లెబనాన్‌లపై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే.. ఇరాన్ ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఈనేపథ్యంలో ఇరాన్ పొరుగున ఉన్న అరబ్ దేశాలకు, అమెరికా మిత్ర దేశాలకు తీవ్ర హెచ్చరికలు చేసింది.తమపై(ఇరాన్) దాడులు జరిపేందుకు ఇజ్రాయెల్‌కు సాయం చేయవ ద్దని హెచ్చరించింది. అలా కాదని అరబ్ దేశాలు వారి భూబాగాలు, గగనతలాన్ని ఉపయోగించి దాడులకు పాల్పడితే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ వంటి చమురు సంపన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని రహస్య దౌత్య మార్గాల ద్వారా ఈ హెచ్చరికను పంపింది. అయితే ఇవన్నీ యూఎస్ సైనిక దళాలకు ఆతిథ్యం ఇచ్చే దేశాలు.ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా అధినేత నస్రల్లా మృతి అనంతరం ఇరాన్ 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ పెద్దతప్పు చేసిందని, భారీ మూల్యం చెల్లించుకుంటుందని, ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. అయితే ఇరాన్‌లోని అణుస్థావరాలతో పాటు.. చమురు క్షేత్రాలనూ లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉందని ఐడీఎఫ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథయంలోనే ఇస్లామిక్ రిపబ్లిక్‌పై ఎలాంటి దాడులు జరగకూడదని,అలా జరిగితే ప్రతీకార దాడులకు పాల్పడతామని అరబ్ దేశాలను హెచ్చరించింది. -
ప్రపంచంలో ఏకైక 10 స్టార్ హోటల్ ఎక్కడుంది?
బుర్జ్ అల్ అరబ్ ప్రపంచంలోనే ఏకైక టెన్ స్టార్ హోటల్. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో ఉంది. ఇది ఒక కృత్రిమ ద్వీపంలో ఉంది. బుర్జ్ అల్ అరబ్ ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన హోటళ్లలో ఒకటి. అయితే దాని ఎత్తులో 39 శాతం నివాసయోగ్యం కాదు. బుర్జ్ అల్ అరబ్ 1999 సంవత్సరంలో నిర్మితమయ్యింది. దీని నిర్మాణానికి ఒక బిలియన్ డాలర్లు (రూ. 8330 కోట్లు)కు మించి ఖర్చయింది. ఈ కృత్రిమ ద్వీపం జుమేరా బీచ్‌కు 280 మీటర్లు (920 అడుగులు) దూరంలో ఉంది. బుర్జ్ అల్ అరబ్ ఒక ప్రైవేట్ వంతెన ద్వారా ప్రధాన భూభాగానికి అనుసంధానమై ఉంది. దీనిని ఓడకు గల తెరచాపను పోలివుండేలా నిర్మించారు. దీని పైకప్పుపై హెలిప్యాడ్ కూడా ఉంది. ఇది భూమి నుండి 210 మీటర్లు (689 అడుగులు) ఎత్తులో ఉంది.బుర్జ్ అల్ అరబ్ జుమేరాలో రోజువారీ గది ధర రూ. రూ. 2,58,679 నుండి రూ. 1,055,372 వరకు ఉంది. సందర్శకులు ప్రత్యేక హెలికాప్టర్ సర్వీస్ లేదా రోల్స్ రాయిస్ ద్వారా హోటల్‌కు చేరుకోవచ్చు. దీనిలోని అన్ని సూట్లలో అరేబియా గల్ఫ్ అందాలు కనిపించేలా కిటికీలు ఉంటాయి. ఈ సూట్లలో ఉచిత వైఫై, వైడ్ స్క్రీన్ ఇంటరాక్టివ్ హెచ్డీ టీవీ, రియాక్టర్ స్పీకర్, ఇతర ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. బుర్జ్ అల్ అరబ్ జుమేరాలో ఎనిమిది రెస్టారెంట్లు, ఒక స్పా, పలు సీ వ్యూ గదులు ఉన్నాయి. అలాగే రూఫ్‌టాప్ బార్, రెండు స్విమ్మింగ్ పూల్స్, 32 గ్రాండ్ కాబానాస్, ఒక రెస్టారెంట్ ఉన్నాయి. -
మనవాళ్ళకి ఎందుకంత ఆందోళన?
ప్రస్తుతం ఇజ్రాయెల్– పాలస్తీనియన్ల మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం స్వయం ప్రకటిత మేధావులమని చెప్పుకునే మనదేశంలోని కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో ఒకటే గోల! హమాస్ చర్యలను ప్రామాణీకరిస్తూ సంఘీభావ ర్యాలీలు తీయడం, హమాస్ దాడుల తరహాలో భారతదేశంలో కూడా దాడులు చేయాలంటూ దేశ సమగ్రతకు సవాలు విసిరే విధంగా వీడియోల పోస్టింగులు!! భారతదేశం భద్రతను దృష్టిలో ఉంచుకున్న భారత ప్రభుత్వం హమాస్ తీవ్రవాద చర్యలను నిర్ద్వంద్వంగా ఖండించింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు తన సంఘీభావాన్ని కూడా ప్రకటించింది. ఈ ఘర్షణల్లో ఇరువైపులా బలి అవుతున్న సామాన్య ప్రజల మృత్యు ఘోషకు తీవ్ర సంతాపం కూడా తెలియజేసింది. శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయాన్ని కూడా అందిస్తోంది. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న జిహాదీ ఉగ్రవాదాన్నీ, రక్షణ పరంగా ఇజ్రాయెల్‌కు మనకు ఉండే ఒప్పందాలను దృష్టిలో ఉంచుకొని, మన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ హితాన్ని కోరే వాళ్ళందరూ స్వాగతించారు. కానీ కొందరు వ్యతి రేకిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ హమాస్ చర్యలను సమర్థిస్తోంది. దీని వెనుక ఈ దేశంలోని ముస్లింలను సంతుష్టీకరించే ప్రయోజనం ఉంది. ఇక అసలు విషయానికి వస్తే 1948కు ముందు ఇజ్రాయెల్ అనే పేరుతో ఒక భూ భాగమే లేదనేది అక్షర సత్యం. 1947 ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ప్రపంచ పటంలో లేవు అనేది కూడా సత్యమే కదా? వాటి మునుగడను భారతదేశం కాదంటుందా? ఇజ్రాయెల్ మను గడను ప్రశ్నించే వారికి ఈ సమాధానం సరిపోదా? పెట్టుబడిదారీ పశ్చిమ దేశాలు మధ్య ఆసియాలో తమ రాజకీయ అవసరాల కోసమే ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, లెబనాన్ దేశాల మధ్యలో ఇజ్రాయెల్ ను సృష్టించాయి. ‘జెరూసలేం’ ప్రాంతం తమ ఆధ్యాత్మిక, మత, సాంస్కృతిక భావాలకు కేంద్రం అని రెండువేల ఏళ్లుగా యూదు జాతీయులు చెప్పుకొంటు న్నారు. యూదులపై దయతో పశ్చిమ దేశాలు వారికి ఒక భూభాగాన్ని కేటాయించాయని చెప్తే సత్య దూరమవుతుంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పశ్చిమ దేశాలు 60 లక్షల మంది యూదులను నిర్దాక్షిణ్యంగా, అమానుషంగా మట్టుబెట్టాయనేది చరిత్ర చెప్పే చెరపలేని సాక్ష్యం. ఇక పాలస్తీనా ఒక స్వతంత్ర భూభా గమనీ, దానిని దురహంకార పూరితమైన ఇజ్రాయెల్ దేశం ఆక్రమించిందనీ మన దేశంలోని చారిత్రిక పరిజ్ఞానం లేని కొంతమంది మూర్ఖపు వాదనలు చేస్తూ, దేశ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం పాలస్తీనా భూభాగాలుగా చెప్పుకొనే గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలు 1967 వరకు వరుసగా ఈజిప్టు, జోర్డాన్ దేశాలలో భాగాలు. జోర్డాన్ నదికి పడమర వైపున ఉండే ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తున్నారనేది గమనార్హం. ఇస్లాం మతస్థులకు ‘జెరూసలేం’ పవిత్ర స్థలం కూడా. అందుకే ఇజ్రాయెల్ ఏర్పాటును ముస్లిం దేశాలన్నీ వ్యతిరేకించాయి. ఇక క్రైస్తవులకు ‘జెరూసలేం’, ‘బెత్లె హేము’ పవిత్ర స్థలాలు. క్రైస్తవుల ప్రాబల్యం నిలుపుకోవాలంటే అక్కడ పశ్చిమ దేశాలకు తమకు అనుకూలమైన దేశం ఒకటి ఉండాలి. ఇజ్రాయెల్ ఏర్పాటు వెనుక ఉన్న సూత్రం ఇదే! అరబ్ – ఇజ్రాయెల్ ఐదు యుద్ధాల్లో ముస్లిం దేశాలను ఇజ్రాయెల్ మట్టి కరిపించడం వెనక దాగి ఉన్న రహస్యం కూడా ఇదే! పశ్చిమ దేశాలన్నీ కూడా ఇజ్రాయెలీలకు ఇతోధిక సహాయ సహకారాలు అందిస్తున్నాయనేది వాస్తవం. ఇక హమాస్ చర్యలు పాలస్తీనియన్ల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించి వేస్తాయనేది కాదనలేని సత్యం. గాజా స్ట్రిప్‌లోని ఇంటర్నల్ బంకర్లను ధ్వంసం చేసేంతవరకూ ఇజ్రాయెల్ ఆగదు. ఇదే జరిగితే అనేకమంది సామాన్య ప్రజలు బలి అవుతారు. అంతర్జాతీయ సమాజం ఈ విషయంపై దృష్టిని సారించి, హమాస్ తీవ్రవాదుల చెరలో బందీ లుగా ఉన్న యూదులను విడిపించే ఏర్పాట్లు చేయాలి. అదే విధంగా ఇజ్రాయెల్ దుందు డుకు చర్యలకు అడ్డుకట్ట కూడా వేయాలి. - వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
Israel Palestine Conflict: హమాస్ దాడి వెనుక...
ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడి ఒక్క ఆ దేశాన్నే గాక ప్రపంచమంతటినీ నిర్ఘాంతపరిచింది. నెలల తరబడి పక్కాగా ప్రణాళిక వేసుకుని మరీ చేసిన ఈ దాడి వెనక, ఇదే సమయాన్ని ఎంచుకోవడం వెనక కారణాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకరకంగా పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ ప్రభుత్వ మితిమీరిన దూకుడు విధానాలు ఈ దాడిని సమరి్థంచునేందుకు హమాస్‌కు అవకాశం కూడా కలి్పంచినట్టు కన్పిస్తోంది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న తెల్లవారుతూనే ఉరుముల్లేకుండానే పిడుగులు పడ్డాయి. జనం పిట్టల్లా రాలిపోయారు. రక్తం ఏరులై పారింది. బందీలుగా చిక్కిన వంద మందికి పైగా సైనికులు, పౌరులు నరకం చూస్తున్నారు. ఇంతటి ఉత్పాతానికి కారణమైన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడి గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ బలాబలాలు, నానాటికీ పెరుగుతున్న ఇజ్రాయెల్ దూకుడు దాన్ని ఇందుకు పురిగొలి్పన కారణాల్లో ప్రధానమైనవని భావిస్తున్నారు. అరబ్–ఇజ్రాయెల్ బంధం అరబ్ దేశాలతో సాధారణ సంబంధాల స్థాపనకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలు కాస్తో కూస్తో ఫలించేలా కని్పస్తుండటం హమాస్‌ను కలవరపరిచిన రెండో అంశం. కొంతకాలంగా పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్‌పై అరబ్ దేశాల ఒత్తిడి తగ్గుతూ వస్తుండటం మరింత ఆందోళనకు కారణమైంది. ఇదే సమయంలో అరబ్ దేశాల పెద్దన్నగా భావించే సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌తో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తుండటంతో హమాస్ అప్రమత్తమైంది. ఇదిలాగే కొనసాగితే పాలస్తీనాకు పూర్తి స్వాతంత్య్రం ఇక కల్లోని మాటేనన్న అంచనాకు వచి్చంది. ఇరాన్ దన్ను ఇరాన్‌తో కొన్నేళ్ల కిందటి దాకా క్షీణ దశలో ఉన్న సంబంధాలను హమాస్ క్రమంగా పట్టాలకెక్కించుకుంటూ వచి్చంది. 2022లో హమాస్ ప్రతినిధుల బృందం సిరియాలో ఇరాన్ నేతలతో పలుమార్లు భేటీ అయింది. అనంతరం లెబనాన్, ఇరాన్లలో జరిగిన పలు సమావేశాల ద్వారా సంబంధాల పునరుద్ధరణ జోరందుకుంది. ఇవన్నీ ఇజ్రాయెల్‌పై భారీ ఆకస్మిక దాడికి కావాల్సిన హేతుబద్ధమైన కారణాలు, అవకాశాలతో పాటు సాయుధ, ఆర్థిక తదితర వనరులను కూడా హమాస్‌కు చేకూర్చాయి. ఇప్పుడే ఎందుకు? హమాస్‌ను తాజా దాడి వెనక ప్రధానంగా మూడు కారణాలు కని్పస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది అతివాద ఇజ్రాయెల్ సర్కారు దూకుడు విధానాలు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్, జెరూసలేంల్లో యూదు సెటిలర్ల హింసను అది బాహాటంగా ప్రోత్సహించడం పాలస్తీనియన్ల ఆగ్రహానికి కారణమైంది. చివరికి ప్రతీకారేచ్ఛగా మారింది. సరిగ్గా అదే సమయంలో వెస్ట్‌బ్యాంక్‌లో పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా దక్షిణాది నుంచి సైన్యాన్ని ఇజ్రాయెల్ ఉత్తరానికి తరలించడం హమాస్‌కు కలిసొచి్చంది. ఇప్పుడేం జరగనుంది? ముస్లింలకు అతి పవిత్రమైన అల్ అక్సా మసీదు వద్ద యథాతథ స్థితిని ఇజ్రాయెల్ ఉల్లంఘించకుండా చూడాలన్న స్వల్పకాలిక లక్ష్యాన్ని ఈ దాడి ద్వారా హమాస్ సాధించినట్టే కని్పస్తోంది. కానీ దీర్ఘకాలంలో సాధించదలచిన ఇజ్రాయెల్ వినాశనం, ముస్లిం రాజ్య ఏర్పాటు లక్ష్యాలు నెరవేరడం దేవుడెరుగు, గాజా స్ట్రిప్‌ను నామరూపాల్లేకుండా చేయకుండా ఇజ్రాయెల్‌ను అడ్డుకోవడమే హమాస్‌కు తలకు మించిన భారం కాగలదంటున్నారు. ఇజ్రాయెలీ బందీలను అడ్డుపెట్టుకున్నంత కాలమే హమాస్ ఆటలు సాగేలా కని్పస్తున్నాయి. అంతమెప్పుడు? ఈ పోరుకు ముగింపు ఎప్పుడు, ఎలా జరగనుందన్నది ప్రస్తుతానికైతే అస్పష్టమే. దీనికి సమీప భవిష్యత్తులో ఏదో రకంగా తెర పడాలంటే బహుశా అంతర్జాతీయ సమాజపు జోక్యమే ఏకైక మార్గమని భావిస్తున్నారు. ఆ సందర్భంగా తన దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెలీ సైనికులు, పౌరులకు బదులుగా ఖైదులో ఉన్న పాలస్తీనియన్లను విడిపించుకోవడం హమాస్ ఉద్దేశంగా కని్పస్తోంది. ఆలోపు ఇజ్రాయెల్ భారీ ప్రతీకార దాడులకు దిగకుండా అడ్డుకునేందుకు కూడా బందీలు ఉపయోగపడతారని భావిస్తోంది. గాజాలో పౌర ఆవాసాలపై ఇజ్రాయెల్ భూతల దాడులకు దిగిన మరుక్షణం బందీలను హతమార్చడం మొదలు పెడతామని హమాస్ అధికార ప్రతినిధి అబూ ఉబైదా ఇప్పటికే హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో గాజాలోకి చొచ్చుకెళ్లి దాడులకు దిగడంపై ఇజ్రాయెల్ ఇప్పటికైతే ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. మరోవైపు ఈ దాడి ద్వారా గాజా, వెస్ట్‌బ్యాంక్ ప్రాంతాల్లో తనకు పెరిగిన ప్రతిష్ట రాజకీయంగా మరింతగా బలపడేందకు పనికొస్తుందని కూడా హమాస్ ఆశిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణకు అరబ్ పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: దుబాయ్ తొలిరోజు పర్యటనలో భాగంగా మంత్రి కె.తారకరామారావు మంగళవారం పలు వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధి బృందాలతో సమావేశమయ్యారు. సుమారు రూ. 1,040 కోట్లకుపైగా పెట్టుబడులు తెలంగాణలో పెట్టేందుకు తొలిరోజే అంగీకరించాయి. తెలంగాణ ప్రభుత్వం భారీగా పెట్టుబడులను రప్పించి, యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని కేటీఆర్ వారికి వివరించారు. మంత్రి కేటీఆర్‌తో లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. ప్రతిఏటా సుమారు వెయ్యి కోట్ల ఆక్వా ఉత్పత్తులను ఈ ప్రాంతం నుంచి సేకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకు అవసరమైన కోల్డ్ స్టోరేజీ, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి వాటిపై పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. తమ పెట్టుబడి ద్వారా ఈ ప్రాంతంలో 500 మందికి నేరుగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొంది. మలబార్ గ్రూప్ పెట్టుబడి రూ.125 కోట్లు తెలంగాణలో ఇప్పటికే బంగారం రిఫైనరీ రంగంలో తెలంగాణలో పెట్టుబడి పెట్టిన మలబార్ సంస్థ తాజాగా ఫర్నిచర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం రూ.125 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్టు తెలియజేసింది. దీనిద్వారా వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు కేటీఆర్‌తో మలబార్ గ్రూపు ప్రతినిధి బృందం సమావేశమైంది. ఆ సంస్థ చైర్మన్ ఎంపీ అహ్మద్ వీడియో కాన్ఫరెన్ ్స ద్వారా మంత్రితో మాట్లాడారు. రూ.700 కోట్లతో నాఫ్కో ప్లాంట్ రాష్ట్రంలో రూ.700 కోట్లతో అగ్నిమాపక సామగ్రి తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో ప్రకటించింది. ఈ మేరకు నాఫ్కో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతీజ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేటీఆర్‌తో సమావేశమైంది. న్యాక్‌తో కలిసి అంతర్జాతీయస్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న కేటీ ఆర్ ప్రతిపాదనకు నాఫ్కో అంగీకరించింది. కాగా, తెలంగాణలో తమ కార్యకలాపాల విస్తరణకు రూ. 215 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రపంచ దిగ్గజ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్ ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో డీపీ వరల్డ్ గ్రూప్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అనిల్ మెహతా, ప్రాజెక్టు డెవలప్మెంట్ డైరెక్టర్ సాలుష్ శాస్త్రి మంగళవారం దుబాయ్‌లో భేటీ అయ్యారు. డీపీ వరల్డ్ హైదరాబాద్‌లో తన ఇన్ లాండ్ కంటైనర్ డిపో ఆపరేషన్ కోసం రూ.165 కోట్లు, మేడ్చల్ ప్రాంతంలో 5,000 ప్యాలెట్ కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజ్ వేర్హౌస్ను రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. -
మతోన్మాదం యూరప్ కొంప ముంచుతుందా?
యూరప్‌లో మతోన్మాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. స్వీడన్ తర్వాత ఇప్పుడు మరో యూరోపియన్ దేశం డెన్మార్క్‌లో ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను తగలబెట్టినా ఆ ప్రక్రియను ఆపే చర్యలేవీ జరగడంలేదు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో మితవాద సంస్థ ఖురాన్‌ను తగులబెట్టడంపై సౌదీ అరేబియా మొదలుకొని పాకిస్తాన్ వరకు అన్ని ముస్లిం దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. డెన్మార్క్ దౌత్యవేత్త సమక్షంలో.. ఖురాన్ దహనం చేసిన ఘటనపై ఆగ్రహించిన సౌదీ అరేబియా.. డెన్మార్క్ దౌత్యవేత్త సమక్షంలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అదే సమయంలో డెన్మార్క్‌లో జరిగిన ఘటనపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ కూడా తీవ్ర విమర్శలు గుప్పించింది. తాజాగా జరిగిన సమావేశంలో సౌదీ అధికారులు డెన్మార్క్ రాయబారి ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను తక్షణం ఆపాలని డెన్మార్క్‌కు వారు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి సంఘటనలు అన్ని మతాల సందేశాలకు, అంతర్జాతీయ చట్టాలు, ప్రమాణాలకు విరుద్ధమని సౌదీ పేర్కొంది. ఖురాన్‌ను తగులబెట్టడం వల్ల వివిధ మతాల మధ్య విద్వేషాలు వ్యాపిస్తాయని తెలిపింది. ముస్లిం దేశాల్లో తీవ్ర ఆగ్రహం దీనికిముందు డెన్మార్క్‌కు చెందిన పేట్రియాటర్ ఒక వీడియోను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఖురాన్‌ను తగులబెట్టడం ఆ వీడియోలో కనిపిస్తుంది. తాజాగా స్వీడన్, డెన్మార్క్‌లలో కూడా ఖురాన్‌ను దగ్ధం ఘటన అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. మక్కా, మదీనా వంటి నగరాలు కలిగిన దేశమైన సౌదీ అరేబియా.. స్వీడన్లో ఖురాన్‌ను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక ఇరాకీ శరణార్థి స్టాక్‌హోమ్‌లోని ప్రధాన మసీదు బయట ఖురాన్‌ను తగులబెట్టాడు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో సౌదీ అరేబియా, ఇరాక్ సంయుక్తంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ) అసాధారణ సమావేశానికి పిలుపునిచ్చాయి. దీనిలో స్వీడన్, డెన్మార్క్‌లలో ఖురాన్ దహనం చేసిన అంశంపై చర్చించనున్నారు. మరోవైపు స్వీడన్ ప్రధాని తమ దేశానికి ఉగ్రదాడుల భయం ఎదురుకావడంతో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేశారు. ఇస్లామిక్ దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు స్వీడన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది కూడా చదవండి: ఆ పాప నా మనవరాలే : బైడెన్ -
‘బంగినపల్లి’కి అరబ్ దేశాల్లో క్రేజ్
కర్నూలు(అగ్రికల్చర్): అద్భుతమైన రుచి.. ఆకట్టుకునే రూపం.. గుబాళించే సువాసన.. మన బంగినపల్లి మామిడి సొంతం. భారతీయులతోపాటు అరబ్, యూరోప్ దేశాల ప్రజలు కూడా ఈ మధుర ఫలాన్ని లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా బంగినపల్లి (బేనీషా) మామిడికి పుట్టినిల్లు అయిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగుచేస్తున్న పండ్లకు అరబ్ దేశాల్లో అత్యంత ఎక్కువగా క్రేజ్ ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 25వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. గత ఏడాది సగటున ఎకరాకు 2 నుంచి 3 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం 3-4 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో లక్ష టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. దీనిలో 80 నుంచి 90 శాతం వరకు బంగినపల్లి ఉంటుంది. బంగినపల్లి రకం మామిడిని విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో రెండు, మూడేళ్లుగా రైతులు నాణ్యతపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గూడూరు, ఓర్వకల్, వెల్దుర్తి, ప్యాపిలి, బేతంచెర్ల, బనగానపల్లి, కల్లూరు, కర్నూలు, దేవనకొండ, డోన్, క్రిష్ణగిరి తదితర మండలాల్లో కొంతమంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగు చేస్తున్నారు. చీడపీడల బెడద, కెమికల్స్ ప్రభావం మామిడిపై పడకుండా ఫ్రూట్ కవర్స్ కూడా వినియోగిస్తున్నారు. దీంతో పండ్ల నాణ్యత పెరుగుతోంది. రైతులకు ఉద్యానవనశాఖ అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. చదవండి: AP: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ బడా వ్యాపారులు వచ్చి కొనుగోలు.. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల నుంచి బడా వ్యాపారులు ఇక్కడికి వచ్చి మామడి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. తోటల్లోనే 20 కిలోల బాక్సుల్లో పండ్లను ప్యాకింగ్ చేసి ఆయా నగరాలకు తరలిస్తున్నారు. అక్కడ ప్రాసెసింగ్ చేసి అరబ్, యురోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పండిన పండ్లలో 40 శాతం ముంబైకి తీసుకువెళ్లి, అక్కడి నుంచి అరబ్ దేశాలైన దుబాయ్, సౌదీ, కువైట్‌కు ఎగుమతి చేస్తున్నారు. గత ఏడాది 2,500 టన్నుల వరకు వివిధ దేశాలకు ఎగుమతి చేశారు. టన్ను ధర రూ.80 వేల నుంచి రూ.1.05లక్షల వరకు లభించింది. ఈ ఏడాది 5వేల టన్నుల వరకు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మామిడి కొనుగోలు కోసం మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు తరలివస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో మామిడికి ఎన్నడూ లేని విధంగా టన్ను ధర రూ.లక్షకు పైగా పలికింది. ఇటీవల మార్కెట్‌కు మామిడి తాకిడి పెరిగిన తర్వాత ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టన్ను ధర రూ.40 వేల వరకు లభిస్తోంది. నాణ్యత స్పష్టంగా కనిపిస్తోంది ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాం. ఎన్నడూ లేని విధంగా ఈసారి మామిడిలో నాణ్యత పెరిగింది. 50 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చేశాం. ఇందులో 85 శాతం చెట్లు బేనీషా రకానికి చెందినవే. ఎగుమతులకు అనువైన నాణ్యత ఉండాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా రసాయనాలు వాడటం లేదు. ఇందువల్ల మామిడిలో నాణ్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి నేరుగా విదేశాలకు ఎగుమతి కావడంలేదు. ముంబై, తమిళనాడు, హైదరాబాద్ వ్యాపారులు వచ్చి మామిడి కొంటున్నారు. – గొల్ల శ్రీరాములు, గూడూరు -
అమెరికా, రష్యా, యూఏఈల వ్యోమగాములతో..
కేప్ కెనవెరాల్: అరబ్ దేశాల నుంచి మొట్టమొదటి వ్యోమగామి సహా మూడు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములతో స్పేస్ఎక్స్ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేరుకుంది. ఆరు నెలల ఈ మిషన్‌లో యూఏఈ రెండో వ్యోమగామి సుల్తాన్ అల్–నెయాడీ పాలుపంచుకుంటున్నారు. నెయాడీతోపాటు అమెరికాకు చెందిన స్టీఫెన్ బోవెన్, వారెన్ హొబర్గ్, రష్యాకు చెందిన అండ్రీ ఫెడ్యాయెవ్ ఉన్నారు. వీరు అక్కడికి చేరుకున్నాక ఐఎస్ఎస్లో గత ఏడాది అక్టోబర్ నుంచి ఉంటున్న అమెరికా, రష్యా, జపాన్ వ్యోమగాములు భూమిపైకి చేరుకోవాల్సి ఉంది. -
అరబ్ వ్యక్తిపై మూక దాడి.. టీవీలో లైవ్..
జెరూసలేం : గత కొద్దిరోజులుగా ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాలు పరస్పరం రాకెట్ బాంబు దాడులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గాజా లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన రాకెట్ దాడుల్లో ఇప్పటివరకు 83 మంది మరణించారు. వీరిలో 17 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దాదాపు 487 మంది గాయపడ్డారు. పాలస్తీనా కూడా ఇజ్రాయెల్‌పై బాంబు దాడులు చేస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఓ అరబ్ వ్యక్తిపై మూక దాడి చేయటం, ఆ దాడి దృశ్యాలు ఓ టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కావటం చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాత్రి ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని తెల్ అవివ్‌లోని బ్యాట్ యమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో వెళుతున్న అరబ్ వ్యక్తిని డజన్ కంటే ఎక్కువ మంది ఉన్న ఓ మూక అడ్డగించింది. అతడ్ని బయటకు లాగి విచక్షణా రహితంగా దాడి చేసింది. ఈ దాడి దృశ్యాలు అక్కడి పబ్లిక్ ఛానల్ కాన్ టీవీలో ప్రసారం అయ్యాయి. దాడిలో అరబ్ వ్యక్తి తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. ఘటన జరిగిన 15 నిమిషాల తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. నడి వీధిలో స్పృహ లేకుండా పడి ఉన్న అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ చీఫ్ రబ్బీ యిట్జాక్ యోసేఫ్ ఈ దాడిని ఖండించారు. ‘‘ ఉగ్రవాద సంస్థలు అమాయక ప్రజలపై దాడులు చేస్తున్నాయి. అది తల్చుకుంటే గుండె బరువెక్కుతోంది.. బాధేస్తుంది. అలాగని మనం రెచ్చిపోకూడదు.. హింసకు పాల్పడకూడదు’’ అని హితవు పలికారు. ‘రిలీజియస్ జియోనిజమ్’ పార్టీ అధ్యక్షుడు బెట్జలెల్ స్మార్ట్‌రిచ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘‘ జివిస్ సోదరులారా.. ఆపండి! ఎట్టిపరిస్థితుల్లోనూ అహింసకు పాల్పడవద్దు’’ అని అన్నారు. -
అరబ్‌షేక్‌కు గృహిణిని విక్రయించిన దళారీ
చాంద్రాయణగుట్ట: అరబ్ షేక్‌ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. దళారీలను అడ్డుపెట్టుకుని పేద మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అంబర్‌పేటకు చెందిన వివాహిత ఫాతిమా ఉన్నీసాకు బార్కాస్ కొత్తపేట నబీల్ కాలనీలో ఇల్లు ఉంది. ఆర్థిక అవసరాల నిమిత్తం ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్న ఫాతిమా ఉన్నీసా దళారీ మహ్మద్ సాబెర్ అలియాస్ వోల్టా సాబెర్‌ను చెప్పింది. ఇల్లు కొనేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని సాబెర్ ఫిబ్రవరి 25న ఫాతిమాకు ఫోన్ చేశాడు. ఇల్లు చూపించేందుకని ఆమె తన చెల్లెలు వివాహిత రఫత్ ఉన్నీసా(25)తో కలిసి వెళ్లింది. అక్కడికి వెళ్లగానే ముందస్తు పథకంలో భాగంగా అక్కడకు వచ్చిన అరబ్ షేక్ ఇబ్రహీం షుక్రుల్లా (60) ఫాతిమాను పెళ్లి చేసుకుంటా నని అడిగాడు. దానికామె అంగీకరించకపోవటంతో ఆమె చెల్లి రఫత్‌ను కూడా అడిగాడు. ఆమె కూడా తిరస్కరించి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. సాబె ర్ అనే దళారి రంగంలోకి దిగి, రఫత్‌ను విక్రయిస్తామని షేక్ దగ్గరనుంచి డబ్బులు తీసుకున్నాడు. ఈ క్రమంతో సాబెర్ తన భార్య సమీనా ద్వారా రఫత్‌ను తన ఇంటికి వచ్చేలా ఒప్పించాడు. ఆమె రాగానే, నేరుగా షేక్ వద్దకు తీసుకెళ్లి ఇంట్లోకి నెట్టి బయటికి వచ్చేశారు. అప్పట్నుంచి ఆ షేక్ ఆమె పట్ల క్రూరంగా లైంగిక దాడికి దిగాడు. సిగరెట్లతో కాల్చుతూ చిత్ర హింసలకు గురి చేశాడు. తన చెల్లెలు జాడ కోసం ఫాతిమా దళారీ సాబెర్‌ను గట్టిగా అడగడంతో అసలు విషయం వెల్లడించాడు. ఆ చిరునామాకు వెళ్లేసరికి షేక్ తన పాస్‌పోర్టును వదిలి పారిపోయాడు. ఫాతిమా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అరబ్ దేశాలకు ‘అనంత’ అరటి
అనంతపురం అగ్రికల్చర్: కరువుసీమ అనంతపురం జిల్లాలో పండిన నాణ్యమైన అరటి పంట తొలిసారిగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి కాబోతోంది. ఇందుకు ఈనెల 30న ముహూర్తం ఖరారైంది. ఉద్యాన శాఖ, గుజరాత్‌కు చెందిన దేశాయ్ కంపెనీ అవసరమైన ఏర్పాట్లుచేశాయి. జిల్లాలోని తాడిపత్రి నుంచి ఈ ఎగుమతిని ప్రారంభించడానికి 43 బోగీలు కలిగిన ప్రత్యేక రైలు వ్యాగన్‌ను ఏర్పాటుచేస్తున్నారు. తొలివిడతగా 890 మెట్రిక్ టన్నుల అరటిని నిబంధనల మేరకు ప్యాకింగ్ చేసి కంటైనర్లలో సిద్ధంగా ఉంచారు. ‘హ్యాపీ బనానా’ పేరుతో ఇక్కడి అరటి సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్, దుబాయ్ ప్రాంతాలకు వెళ్లనుంది. అరటి హబ్‌గా ‘అనంత’ ఇప్పటివరకు వివిధ కంపెనీలు ఇక్కడ అరటిని కొనుగోలు చేసి తర్వాత ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసినట్లు చెబుతున్నా.. తొలిసారిగా అరబ్ దేశాలకు నేరుగా ఇక్కడ నుంచే ఎగుమతి చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అరటి సాగుకు ప్రసిద్ధి చెందిన ‘అనంత’.. మున్ముందు అరటి హబ్‌గా మారే అవకాశముందని అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 30–35 మండలాల్లో అరటి తోటల సాగవుతున్నా.. ఇందులో 70–80 శాతం సాగు విస్తీర్ణం పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, యాడికి, నార్పల, తాడిమర్రి, బత్తలపల్లి, ఆత్మకూరు మండలాల్లో ఉంది. జిల్లా వ్యాప్తంగా 16,402 హెక్టార్లలో అరటి సాగవుతుండగా.. 11.65 లక్షల మెట్రిక్ టన్నుల మేర పంట రావచ్చని అంచనా. అలాగే.. ఇక్కడి నేలలు, నీరు, వాతావరణం కారణంగా నాణ్యమైన అరటి వస్తుందని చెబుతున్నారు. అందువల్లే ఈ ప్రాంత అరటికి బెంగళూరు, చెన్నై, కోల్‌కత లాంటి దేశీయ మార్కెట్లతో పాటు యూరప్, మధ్య ఆసియా దేశాల్లో మంచి డిమాండ్ ఉంటుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. 100 % టిష్యూ కల్చర్ రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జిల్లాలో గ్రానైన్ (జీ–9) అనే అరటి రకం 100 శాతం టిష్యూ కల్చర్ పద్ధతిలో సాగుచేస్తున్నారు. అలాగే, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 100 శాతం డ్రిప్ పద్ధతి, 100 శాతం ఫర్టిగేషన్ పద్ధతి (నేరుగా ఎరువులు అందించే విధానం) అవలంబిస్తున్నారు. ఎకరాకు మొదటి పంటకు రూ.70 నుంచి రూ.80 వేలు ఖర్చుచేస్తున్నారు. రెండో పంటకు రూ.40 నుంచి రూ.50 వేలు, మూడో పంటకు అంతే పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు. రెండున్నర సంవత్సరాల్లో మూడు పంటలు తీస్తారు. అలాగే, ఎకరాకు 25–30 టన్నుల వరకు అరటిని పండిస్తున్నారు. దేశంలోనే అత్యధిక ఉత్పాదక శక్తిలో ‘అనంత’ రెండో స్థానంలో ఉంది. కాగా, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో టన్ను అరటికి రూ.8 వేల కనీస మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై అరటి రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు.. గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్న అరటి ప్రస్తుతం టన్ను రూ.12,500 ధర పలుకుతోంది. ‘అనంత’కు గర్వకారణం తొలిసారిగా జిల్లా నుంచి ఈనెల 30న నేరుగా అరబ్ దేశాలకు 890 మెట్రిక్ టన్నులు అరటిని ఎగుమతి చేస్తుండటం ‘అనంత’కు గర్వకారణం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం, దేశాయ్ కంపెనీ సహకారంతో ప్రత్యేక రైలు వ్యాగన్‌ను ఏర్పాటుచేశాం. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యానశాఖ కమిషనర్లు ఇక్కడకు విచ్చేస్తున్నారు. ఉద్యాన శాఖ ఏడీలు, ఏపీడీలు, హెచ్‌వోలు దీనిపై అవసరమైన ఏర్పాట్లుచేశారు. -
అల్‌హార్తికి మాన్ బుకర్ బహుమతి
లండన్: సాహిత్యరంగంలో అందించే ప్రఖ్యాత మాన్‌బుకర్ ప్రైజ్ 2019కిగానూ ఓ అరబ్ మహిళను వరించింది. ఒమన్‌కు చెందిన రచయిత్రి జోఖా అల్హార్తి(40) రాసిన ‘సెలస్టియల్ బాడీ’ నవలకు ఈసారి మాన్ బుకర్ ప్రైజ్ దక్కింది. లండన్‌లోని రౌండ్‌హౌస్‌లో బుకర్ప్రైజ్ను అందుకున్న అల్హార్తి.. ఈ అవార్డును గెలుచుకున్న తొలి అరబ్ మహిళగా చరిత్ర సృష్టించారు. బ్రిటన్ నుంచి 1951లో స్వాతంత్య్రం పొందాక ఒమన్‌లో చోటుచేసుకున్న మార్పులను, బానిసత్వం పరిస్థితులను ఈ నవలలో అల్హార్తి వర్ణించారు. ఈ అవార్డు కింద అందే రూ.44.60 లక్షల(64,000 డాలర్ల)ను అల్హార్తి, అనువాదకురాలు మార్లిన్ చెరిసగం పంచుకోనున్నారు. -
అజేయ భారత్ యాత్ర
సంగీత శ్రీధర్.. అజేయ భారత్ యాత్రకు శ్రీకారం చుట్టారు. వివిధ రంగాల్లో వేగంగా పురోగమిస్తోన్న భారత్‌ను ప్రపంచం ముందు సమున్నతంగా ఆవిష్కరించేందుకు సాహసోపేత యాత్ర చేపట్టారు. యాభై ఏళ్ల సంగీత స్వయంగా వాహనం నడుపుతూ ఇప్పటి వరకు 27 రాష్ట్రాల్లో, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించారు. 39 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకొని 175వ రోజు సోమవారం ఆమె హైదరాబాద్‌చేరుకున్నారు. ఇప్పటి వరకు 280 నగరాల్లో పర్యటించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని, స్వచ్ఛ భారత్‌ను, మహిళల స్వయం సమృద్ధి, స్వావలంబన, సామాజిక భద్రత లక్ష్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. యాత్ర లక్ష్యాన్ని, విశేషాలను, తన అనుభవాలను ఇలా వివరించారు. అరబ్– ఇండియా గుడ్‌విల్ జర్నీ.. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన నేను రెండున్నర దశాబ్దాలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్నాను. ఒమన్ సాంకేతికశాఖ మంత్రిత్వశాఖలో ఈ–గవర్నెన్స్ అడ్వయిజర్‌గా కీలక విధుల్లో ఉన్నాను. మా వారు శ్రీధర్ ఓ ఆయిల్ కంపెనీ సీఈఓ. కుమారుడు అస్వత్ అమెరికాలో స్థిరపడ్డాడు. చాలాకాలం క్రితమే అరబ్‌లో స్థిరపడిన నేను గతేడాది ఆగస్టు 18న ‘యూఏఈ– ఇండియా గుడ్ విల్ జర్నీ’ పేరుతో ఈ సాహస యాత్రను చేపట్టాను. అన్ని రకాల సదుపాయాలు ఉన్న టాటా హెక్సా వాహనంలో స్వయంగా డ్రైవింగ్ చేస్తూ పర్యటిస్తున్నా. ముంబై నుంచి మొదలైన యాత్రలో ఇప్పటి వరకు ఉత్తర భారతంలోని అన్ని రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో పర్యటించా. ఈశాన్య రాష్ట్రాలను చుట్టేశా. అండమాన్ నికోబార్ మినహా ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించాను. ప్రస్తుతం హైదరాబాద్‌కు వచ్చా. విజయవాడ, ఒంగోలు తదితర నగరాల మీదుగా తమిళనాడు, కేరళ, కర్ణాటక దక్షిణాది రాష్ట్రాలను పూర్తి చేసుకొని మార్చి నాటికి తిరిగి ముంబై చేరుకుంటా. ‘ఎక్కడికెళ్లినా ప్రజలు అపూర్వంగా ఆదరిస్తున్నారు. అన్ని నగరాల్లో తమ సొంత ఇంటి వ్యక్తిలా చూసుకుంటున్నారు. దేశమంతా ఇప్పుడు నాకు ఒక కుటుంబంలా అనిపిస్తోంది’. స్వచ్ఛభారత్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని చోట్ల టాయిలెట్ల నిర్మాణాన్ని, పారిశుద్ధ్య నిర్వహణను ప్రధానంగా ప్రచారం చేస్తున్నాను. ఈ పర్యటనలో నాకెదురైన అనుభవాలపై త్వరలో పుస్తకం రాస్తాను. వాహనమే నా ‘లైఫ్ లైన్’.. నేను పయనిస్తున్న టాటా హెక్సా వాహనమే నా లైఫ్‌లైన్. 300 ఓల్టుల విద్యుత్‌ను అందజేసే సోలార్ ప్యానల్స్ ఉన్న ఈ వాహనంలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. కంప్యూటర్, ఫోన్, ల్యాప్‌టాప్ తదితర అవసరాలకు సరిపడా విద్యుత్ లభిస్తుంది. భోజనం, వసతి, నిద్ర అన్నీ వాహనంలోనే. స్నానం తదితర అవసరాల కోసం పబ్లిక్ టాయిలెట్లను వినియోగిస్తున్నా. పరిశుభ్రమైన, స్వచ్ఛమైన టాయిలెట్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. ‘మ్యాప్ మై ఇండియా’ ఆధారంగా వాహనం వెళ్లాల్సిన మార్గం నిర్ధారణ అవుతుంది. ట్రాఫిక్ రద్దీ, రూట్కోర్సు, ప్రయాణ సమయం వంటి వివరాలన్నీ నమోదవుతాయి. ప్రతి రోజు జర్నీ వివరాలను యూఏఈ నుంచి నా భర్త శ్రీధర్ పర్యవేక్షిస్తుంటారు. ప్రతిరోజు ఒక్క పూట మాత్రమే భోజనంచేస్తూ మిగతా వేళల్లో పండ్లు, సలాడ్లతో గడిపేస్తున్నా. సంపూర్ణ ఆరోగ్యంతో, విజయవంతంగా నా యాత్ర కొనసాగిస్తున్నా. -
నాలుగు ఫిర్యాదులు
ఖలీఫా ఉమర్ (రజి) పరిపాలనా కాలమది. అరబ్బు సామ్రాజ్యంలోని ఒక ప్రాంతానికి సయీద్ ఆమిర్‌ను గవర్నర్‌గా నియమించారాయన. కొన్ని నెలల తరువాత గవర్నర్ల పాలనా తీరును పరిశీలించే క్రమంలో ఖలీఫా ఉమర్ (రజి) సయీద్ ఆమిర్ (రజి) ప్రాంతానికి వెళ్లారు. ఖలీఫా తనిఖీ చేయడానికి వచ్చారని తెలిసి ప్రజలంతా మస్జిదులో హాజరయ్యారు. ఖలీఫా... పక్కనే ఉన్న గవర్నర్ సయీద్ బిన్ ఆమిర్ గురించి ఏమైనా ఫిర్యాదులున్నాయా? అని ప్రజలనుద్దేశించి అడిగారు. కొంతమంది కలగజేసుకుని గవర్నర్ గురించి నాలుగు ఫిర్యాదులు చేశారు. ‘‘గవర్నర్ గారు ఫజర్ నమాజు తరువాత కలవరు’’ అన్న ఫిర్యాదుకు సంజాయిషీ ఇవ్వమని కోరారు. అందుకు సయీద్ బిన్ ఆమిర్ ‘‘అయ్యా, మా ఆవిడ అనారోగ్యంతో బాధపడుతోంది. ఇంటి పనులన్నీ నేనే స్వయంగా చేయాలి. ఉదయాన్నే నమాజు తరువాత ఇల్లు ఊడ్చి, అంట్లు కడిగి, రొట్టెల పిండి కలిపి రొట్టెలు చేస్తున్నాను. మంచానికే పరిమితమైన నా భార్య అవసరాలు తీరుస్తున్నాను. బట్టలు ఉతుకుతున్నాను. ఇంటిపనులన్నీ చేస్తున్నాను కాబట్టి ఆ వేళలో ప్రజలకోసం సమయం కేటాయించలేకపోతున్నాను. నౌకరును పెట్టుకునేంత స్థోమత నాకు లేదు’’ అని సమాధానమిచ్చారు. ‘వారంలో ఒకరోజు ప్రజలను కలవరు’ అన్నది మరో ఫిర్యాదు. దానికి సయీద్ బిన్ ఆమిర్ ‘‘ఈ విషయం నేనెంతో రహస్యంగా ఉంచదలుచుకున్నాను. ప్రజలు మీముందు ఫిర్యాదు చేశారు కాబట్టి చెప్పక తప్పడం లేదు. నాకున్నది ఒకే ఒక్క జత బట్టలు. వాటిని వారానికోసారి ఉతికి ఆరేస్తాను. అవి ఆరేదాకా నా భార్య బట్టలు తొడుక్కుంటాను. అందుకే వారంలో ఒకరోజు బయటికి రాను’ అని చెప్పారు. ‘నువ్వు రాత్రుళ్లు ఎవ్వరినీ కలవవు’ అన్నది మూడో ఫిర్యాదు. ‘‘నా తల వెంట్రుకలు, గెడ్డం అన్నీ నెరసిపోయాయి. ప్రభువు పిలుపు ఎప్పుడొస్తుందో తెలియదు. నా పాపాల చిట్టా చాంతాడంత ఉంది. పగలంతా ప్రజాసేవలో గడపడం మూలాన దైవారాధనకు తీరిక దొరకడం లేదు కాబట్టి రాత్రుళ్లు అల్లాహ్ ఆరాధనలో లీనమవుతాను’ అని చెప్పాడు. ‘ఒక్కోసారి స్పృహతప్పి పడిపోతాడు’ అన్నది నాలుగో ఫిర్యాదు‘నేను నలభై ఏళ్ల వయస్సులో కలిమా చదివి విశ్వాసినయ్యాను. నలభై ఏళ్ల వరకూ నేను చేసిన పాపాలు గుర్తుకొచ్చినప్పుడల్లా స్పృహ తప్పిపడిపోతున్నాను. ప్రళయం రోజు నా పాపాల గురించి అల్లాహ్ నిలదీస్తే నేనేం జవాబు చెప్పాలన్నదే నా భయమంతా. నాకోసం ప్రార్థించండి’’ అని అన్నాడు. అలాగే, ‘ఖలీఫా గారూ ఈ నాలుగు ఫిర్యాదులకు మీరేం శిక్ష వేసినా నేను భరించేందుకు సిద్ధమే’ అని చెప్పాడు. ‘‘ఓ అల్లాహ్ ఇలాంటి మరింతమంది గవర్నర్లను నాకివ్వు’’ అంటూ రోదిస్తూ ఖలీఫా ఉమర్ తన రెండు చేతుల్ని పైకెత్తి అల్లాహ్‌ను వేడుకున్నారు. – ముహమ్మద్ ముజాహిద్ -
మేకప్ తీశాక గుర్తుపట్టలేక విడాకులు...
అరబ్: కొత్తగా పెళ్లైన దంపతులు ఎంజాయ్ చేద్దామని షార్జాలోని అల్‌మాంజర్ బీచ్‌కు వెళ్లారు. బీచ్‌లో దిగి బయటకు వచ్చాక మేకప్ పోవడంతో భర్త తన భార్యను గుర్తు పట్టలేకపోయాడు. మేకప్‌తో తనను మోసం చేసిందని, ఇప్పుడు ఆమె అందంగా లేదంటూ విడాకులు కోరాడు. ఈ వింత సంఘటన యూఏఈలో వెలుగు చూసింది. 28 సంవత్సరాల వయసున్న ఆ మహిళ డాక్టర్. అబ్దుల్ అజీజ్ అసఫ్ అనే సైకాలజిస్టును కలిసి ఈ విషయం గురించి ప్రస్తావించారు. మహిళ వివరాలను గోప్యంగా ఉంచుతూ ఈ విషయాన్ని గురించిన సమాచారాన్ని గల్ఫ్‌న్యూస్‌కు వెల్లడించారు. పెళ్లికి ముందు జరిగిన పలు సర్జరీలతో పాటు, కంటి చుట్టూ వేసుకున్న మేకప్ విషయాన్ని కూడా అతడి వద్ద దాచిందని ఆ సైకాలజిస్ట్ వెల్లడించారు. దీంతో పెళ్లికొడుకు విడాకులు కోరాడని, చివరకు ఆ మహిళ ముందుకు వచ్చి నిజం చెబుతానని ప్రయత్నించినా అతడిని ఒప్పించలేకపోయామని అన్నారు. వారికి పెళ్లయి ఆరు నెలలు కావడం గమనార్హం. -
ఓ కమల కన్నీటి కథ
కట్టుకున్న భార్యను కన్నుల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన భర్త.. మద్యానికి బానిసై, చేసిన అప్పులు తీర్చడానికి తన భార్యను గల్ఫ్‌లోని వ్యాపారికి అమ్మేశాడు. ఆ బాధితురాలికి అక్కడి అరబ్బు షేక్‌లు నరకం చూపించారు. వారి బారి నుంచి ఎలాగో తప్పించుకుని తనను గల్ఫ్‌కు రప్పించిన ఏజెంట్ దగ్గరికి వెళ్లి గోడు వెళ్లబోసుకుంటే ఆ ఏజెంటు తన భార్యతో కలిసి ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. చీకటి గదిలో బంధించారు. బతికి బయటపడతానో లేదో అనే సందేహంతో రోజులు వెళ్లదీసిన ఆమెకు ఎట్టకేలకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, తెలంగాణ జాగృతి ప్రతినిధి నవీన్ చారీల చొరవతో విముక్తి లభించింది. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన అంగ కమల వ్యథ ఇది. భర్త చేతిలో మోసపోయి దేశం కాని దేశంలో ఆమె పడిన కష్టాలు.. ఆమె మాటల్లోనే..! ప్రేమించి పెళ్లాడాడు నా భర్త సుదర్శన్‌ది మా ఊరే. 25 ఏళ్ల కిందట నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతనికి భార్యా పిల్లలు ఉన్నారు. ప్రేమించానని వెంటపడటంతో కాదనలేకపోయాను. మాకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఇంటర్ వరకు చదివి కూలి పని చేస్తున్నాడు. చిన్న కొడుకు ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. పెళ్లయ్యాక కొన్నేళ్ల పాటు మా కాపురం సజావుగానే సాగింది. గల్ఫ్ దేశాల్లో పని చేసే సుదర్శన్ ఆరు నెలలకు, ఏడాదికి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. తర్వాత కొన్నేళ్ల నుంచి గల్ఫ్‌కు వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు. రోజూ తాగి వచ్చి కొట్టేవాడు. అడ్డు వచ్చిన పిల్లల్ని కూడా కొట్టేవాడు. భరించలేక మూడేళ్ల కింద నేను, పిల్లలు మా అమ్మ దగ్గరికి వెళ్లిపోయాం. తాను మారానని మళ్లీ వచ్చాడు సుదర్శన్. కూలీ పని చేస్తే ఎక్కువ సంపాదించుకోలేమని తాను మళ్లీ్ల గల్ఫ్‌కు వెళుతున్నాననీ, తనతో పాటు అక్కడకు వస్తే ఎక్కువ సంపాదించుకోవచ్చని చెప్పాడు. పాస్‌పోర్టు తెప్పించాడు. చాకిరి చేస్తూ చావు దెబ్బలు ఒమన్‌లో అరబ్బు షేక్‌ల ఇండ్లలో పని చేస్తే నెలకు రూ.20 వేల వరకు వేతనం ఉంటుందని, తను కూడా ఒమన్‌లోనే మంచి కంపెనీలో పని వెతుక్కున్నానని చెప్పాడు. మొదట నన్ను ఒమన్‌కు పంపిస్తున్నానని, కొన్ని రోజుల తరువాత తాను అక్కడకు వస్తానని, అంతవరకు తన స్నేహితుడు భాస్కర్ నాకు ఒమన్‌లో అండగా ఉంటాడని చెప్పాడు. ఒమన్‌లో ఇంటిపని వీసా తీయించి ఈ ఏడాది మే 18న నన్ను ఒంటరిగానే పంపించాడు. నా భర్త చెప్పినట్లు భాస్కర్, అతని భార్య మణిలు నా కోసం ఎయిర్‌పోర్టుకు వచ్చి నన్ను తీసుకెళ్లారు. నన్ను వాళ్ల ఇంట్లోనే ఉంచుకున్నారు. అక్కడ నాకు.. భాస్కర్‌కు చెందిన కార్లు కడిగి తుడిచే పని అప్పగించారు. తీవ్రమైన ఎండలో పని చేయడంతో నా చేతులకు బొబ్బలు వచ్చాయి. ఈ పని చేయలేనని, మరే పనైనా చెప్పమని ప్రాధేయపడ్డాను. దీంతో ఒక షేక్ ఇంటిలో పని చేయడానికి పంపించాడు. కోటలాంటి ఇంట్లో ఆకలి మంటలు ఆ షేక్ ఇల్లు చిన్న కోటలా ఉంది. ఆ ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దవారు కలిసి మొత్తం పది మంది ఉండేవారు. వారందరికి సేవ చేయడంతో పాటు ఇంటి పని చేసేదాన్ని. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పగలు, రాత్రి అనే తేడా లేకుండా పని చెబుతూనే ఉండేవారు. పని చేయలేకపోతుంటే కొట్టేవారు. కనీసం నేను తిన్నానా లేదా అని కూడా ఆలోచించేవారు కాదు. అరబ్బి భాష రాకపోవడంతోనే సైగలతోనే వారికి నా బాధను తెలిపాను. అయినా కనికరం చూపేవారు కాదు. తిని పారేసిన ఖర్బూజాను తిన్నాను పని భారంతో ఆకలి బాధ అంతా ఇంతా ఉండేది కాదు. కడుపు మాడుతున్నా షేక్‌లు చెప్పిన పని చేసేదాన్ని. ఆకలి అవుతుందని సైగ చేస్తే పాచి పోయిన రొట్టె ఇచ్చేవారు. కడుపు మంటను చల్లార్చుకోవడానికి తినడానికి ఇష్టం లేక పోయినా రొట్టెను తినడానికి కష్టపడ్డాను. చివరకు వారు తిని పడేసిన ఖర్బూజ ముక్కలను చెత్త బుట్ట నుంచి తీసుకుని తిని ఆకలి బాధ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాను. అలా మొదటి షేక్ ఇంట్లో పదిహేను రోజుల పాటు పని చేశాను. ఆ షేక్ ఇంట్లో చాకిరి చేస్తూ చావు దెబ్బలు తిన్న నేను ఆఫీస్‌కు పంపించాలని అడిగితే భాస్కర్ వద్దకు పంపించారు. నన్ను ఇంటికి పంపించి వేయాలని భాస్కర్‌ను అడిగితే అతని భార్య మణితో కొట్టించాడు. మరో షేక్ ఇంటికి పని కోసం పంపించాడు. రెండో షేక్ ఇంట్లో మరింత నరకం చూసాను. అక్కడ పదిహేను రోజుల పాటు పని చేసి ఆఫీస్‌కు పంపించాలని వేడుకుంటే మళ్లీ భాస్కర్ వద్దకే పంపించారు. ఇద్దరు షేక్‌ల ఇండ్లలో పని చేస్తే నయాపైసా వేతనం ఇవ్వలేదు. కొన్నవాడు చెబితే తెలిసింది! అరబ్బు షేక్‌ల ఇండ్లలో పని చేయలేనని, తనను ఎలాగైనా ఇంటికి పంపించాలని భాస్కర్‌ను కోరితే అప్పుడు చెప్పాడు.. నా భర్త నన్ను అతనికి అమ్మేశాడని. నన్ను అమ్మడం ఏమిటని ఫ్రీ వీసా ఉందంటేనే ఒమన్‌కు వచ్చానని చెప్పినా భాస్కర్ వినలేదు. నన్ను కొనడానికి సుదర్శన్‌కు డబ్బులు ఇచ్చానని భాస్కర్ చెప్పడంతో తట్టుకోలేక పోయాను. నాపై పెట్టిన పెట్టుబడి తనకు రాలేదని చెబుతూ భాస్కర్ అతని భార్య మణి కలిసి నన్ను చిత్రహింసల పాలు చేశారు. రెండే రెండు మాటలు ఈ విషయాలన్నీ ఇంటికి చేరవేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. భాస్కర్ ఇంటిలో నాతో పాటు మరికొందరు ఆడవాళ్లు బందీలుగా ఉన్నారు. వారికి నా వేదన చెప్పడంతో భాస్కర్, మణిలకు తెలియకుండా ఇంటికి ఫోన్ చేసుకునే ఏర్పాటు చేశారు. నా కొడుక్కు నేను ఫోన్ చేసి ‘ఒమన్‌లో బతకడం కష్టంగా ఉంది.. ఇంటికి రప్పించండి’ అని రెండే రెండు మాటలు చెప్పాను. దీంతో మా బంధువులు భాస్కర్‌కి ఫోన్ చేసి మాట్లాడితే రూ.70 వేలు చెల్లిస్తేనే నన్ను ఇంటికి పంపిస్తానని చెప్పాడు. భాస్కర్ చెప్పిన విధంగా పాలకొల్లులో ఉన్న భాస్కర్ వ్యాపార భాగస్వామి రాజు ఖాతాలో రూ.70వేలను మా వారు జమ చేశారు. అయినప్పటికి నన్ను భాస్కర్ ఇంటికి పంపించలేదు. అంతేకాదు, నేను ఇంటికి ఫోన్ చేశానని తెలుసుకుని చీకటి గదిలో బంధించాడు. ఎంతో కష్టం మీద మరోసారి ఇంటికి ఫోన్ చేసి నా బాధను Ðð ళ్లబోసుకున్నాను. దీంతో మా కుటుంబ సభ్యులు స్థానికంగా నా కోసం ప్రయత్నాలు చేయడంతో ఈ జూలై 26న ఇంటికి చేరుకున్నాను. గుజరాత్ వరకే టిక్కెట్ బుక్ చేశాడు నాపై కక్ష పెంచుకున్న భాస్కర్ ఇంటికి పంపించడానికి ఒమన్ నుంచి హైదరాబాద్‌కు కాకుండా గుజరాత్ వరకే టిక్కెట్ కొని ఇచ్చాడు. ఈ టిక్కెట్ కోసం మా ఇంటివారు భాస్కర్‌కు రూ.12వేలు పంపించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన నేను హైదరాబాద్‌కు రావడానికి విమానం మారాల్సి ఉంటుందని అనుకున్నాను. కానీ నాకు ఇచ్చిన టిక్కెట్ గుజరాత్ వరకే ఉండటంతో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు నన్ను బయటకు గెంటేశారు. నా అవస్థను జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన మహేష్ గుర్తించి ఎయిర్‌పోర్టు అధికారులతో మాట్లాడాడు. విమానం టిక్కెట్ ఇవ్వడంలో జరిగిన మోసాన్ని ఆయన గుర్తించి తన వద్ద ఉన్న సొమ్ముతో మరో టిక్కెట్‌ను హైదరాబాద్ వరకు కొనుగోలు చేసి ఇక్కడకు చేర్పించాడు. మహేష్ నాకు దేవుడిలా అహ్మదాబాద్‌లో కలిశాడు. అతను లేకుంటే నేను ఏమైపోయేదానినో ఊహిస్తేనే భయం వేస్తోంది. నేను రాగానే నా భర్త పరారయ్యాడు నేను ఇంటికి వస్తున్న విషయం తెలుసుకున్న నా భర్త సుదర్శన్ నేను రావడంతోనే పరార్ అయ్యాడు. ఒమన్‌లో నేను పడిన కష్టాలు అందరిని కలచివేసింది. కమ్మర్పల్లి పోలీసులకు నా భర్త మోసంపై ఫిర్యాదు చేశాం. ఇప్పుడింకా పరారీలో ఉన్నాడు. నా లాంటి కష్టం మరెవరికి రాకూడదు. నా అంత దురదృష్టవంతురాలు ఎవరు ఉండరేమో. నా పిల్లలను చూస్తానని అనుకోలేదు. నన్ను వంచించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. – ఎన్. చంద్రశేఖర్, సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) -
ఇంటర్నెట్ కలిపింది ఇద్దరిని..
అన్నానగర్: ఇంటర్నెట్ ద్వారా పరిచయమైన కడలూరు ఉపాధ్యాయురాలిని అరబ్ దేశానికి చెందిన పారిశ్రామికవేత్త గురువారం హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. కడలూరుకి చెందిన గుణశేఖరన్ కుమార్తె చారులత (32). ఇంజినీర్ పట్టభద్రురాలైన ఈమెకు ఇంటర్నెట్ చాటింగ్ ద్వారా మూడేళ్ల కిందట అరబ్ దేశానికి చెందిన థామస్లూకాస్ రోహన్ స్నేహితుడిగా పరిచయం అయ్యాడు. రెండేళ్ల కిందట చారులత తన స్నేహితుడిని ఇంటికి పిలిచింది. థామస్లూకాస్ కడలూరు వచ్చి పలు స్థలాలు సందర్శించి తన దేశానికి తిరిగి వెళ్లాడు. కొన్ని నెలల తరువాత చారులత అరబ్ దేశానికి వెళ్లింది. ఆ దేశంలో ఆమెకు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం దొరికింది. దీని తరువాత స్నేహితులు, ప్రేమికులుగా మారారు. గత మార్చి 23న అరబ్ దేశంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. తరువాత వారు హిందూ సంప్రదాయం ప్రకారం తమిళనాడులో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం థామస్ లూకాస్ రోహన్, చారులత వీరితో సహా నలుగురు కడలూరు వచ్చారు. వీరికి విరుదాచలం కొళంజియప్పర్ ఆలయంలో గురువారం ఉదయం 10.30 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. -
కష్టాలు మాఫీ
కంటికి కనిపించే భౌగోళిక సరిహద్దుల్ని దాటడం సులువే. కానీ కనిపించని భాషా సరిహద్దును దాటడమే కష్టం. బతుకు బాట వేసుకోవడానికి గల్ఫ్ దేశాల దారి పట్టిన శ్రామికులలో చాలామంది భాష తెలియక అక్కడి చట్టాల ఉల్లంఘన జాబితాలో చేరిపోతుంటారు. అలాంటి వారి కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏటా ఓ ‘మన్నింపు’ అవకాశం ఇస్తుంటుంది. ఈ ఏడాది కూడా ఆగస్టు ఒకటి నుంచి అక్టోబర్ చివరి వరకు ‘యుఏఈ ఆమ్నెస్టీ 2018’ పేరుతో కష్టాలను మాఫీ చేసేందుకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇండియా, బంగ్లాదేశ్, చైనా, ఇథియోపియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, కెన్యా, శ్రీలంక, ఇండోనేషియా దేశాలు ఇప్పటికే తమ ప్రతినిధులను ఎమిరేట్స్‌కు పంపేశాయి. అయితే ఇండియా నుంచి వెళ్లిన ప్రతినిధుల్లో ఒక్క తెలుగు అధికారి కూడా లేకపోవడంతో.. గతంలో అరబ్ ఎమిరేట్స్ ఎంబసీలో ఉద్యోగం చేసి, అక్కడ.. చదువు సరిగ్గా రాని తెలుగు వాళ్లు పడే ఇబ్బందులు స్వయంగా చూసిన నంగి దేవేందర్ రెడ్డి తన వంతుగా ‘యుఏఈ ఆమ్నెస్టీ 2018’లో ఒక స్టాల్ పెట్టించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... పేరు తప్ప ఇంకేం చదవలేరు ‘‘ఇండియా నుంచి వెళ్లిన అధికారులు ఇంగ్లిష్, హిందీలోనే మాట్లాడతారు. ‘తెలుగు వచ్చిన అధికారి ఒక్కరైనా ఉండేటట్లు చూడండి’ అని అడిగాం. అయినా పట్టించుకున్న వాళ్లు లేరు. భారత దేశం అంటే హిందీ మాట్లాడే ప్రజలుండే దేశమేననే అపోహలో ఉండే కేంద్ర ప్రభుత్వానికి, దక్షిణ రాష్ట్రాల మీద పెద్ద పట్టింపు ఉండదు. ‘కనీసం మాకు ఒక స్టాల్ పెట్టుకునే అవకాశమైనా ఇవ్వండి’ అని వేడుకుంటే ఆ మొరను మాత్రం ఆలకించారు. ఆగస్టు 1 నుంచి మొదలౌతున్న ‘యుఏఈ ఆమ్నెస్టీ 2018’లో ‘నవ తెలంగాణ సమితి’ పేరు మీద స్టాల్ పెట్టాం. పేరుకిది తెలంగాణ సమితి అయినప్పటికీ తెలుగువాళ్లందరికీ మా బృందం సేవలు అందిస్తుంది. మన దేశం నుంచి గల్ఫ్‌కి వెళ్లే వాళ్లలో మలయాళం, తెలుగు వాళ్లే ఎక్కువ. మలయాళీయులు బాగా చదువుకుని వైట్ కాలర్ జాబ్స్ చేసుకుంటున్నారు. తెలుగు వాళ్లు.. ముఖ్యంగా తెలంగాణ వాళ్లు మాత్రం భవన నిర్మాణ కార్మికులుగా వెళ్తున్నారు. వాళ్లలో తమ పేరు తప్ప ఇంగ్లిష్‌లో మరే పదాన్ని కూడా చదవలేని వాళ్లే ఎక్కువ. ఆమ్నెస్టీ పీరియడ్ గురించి తెలుసుకుని అప్లయ్ చేసుకోవడం కూడా తెలియదు. అసలు ఆమ్నెస్టీ అనే పదం కూడా తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా ‘అవుట్ పెట్టినారంట. వీసా గడువు తీరిపోయిన వాళ్లను, కలివెలి వీసా (రాంగ్ వీసా) తో వెళ్లిన వాళ్లను అవుట్లో ఇండియాకి పంపించేస్తార’ని మాత్రమే. వేడికి అన్నం పాచిపోయేది గల్ఫ్‌లో భవన నిర్మాణరంగంలో పని చేసే వాళ్లు రోజూ ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి వండుకుని, బాక్స్ సర్దుకుని, ఇతర పనులన్నీ చేసుకుని ఐదున్నరకంతా సైట్కెళ్లే వెహికల్ ఎక్కాలి. తిరిగి బసకొచ్చేసరికి రాత్రి ఎనిమిది– తొమ్మిదవుతుంది. పగలంతా ఎర్రటి ఎండలో పని చేయాలి, ఉదయం వేడిగా ఉన్నప్పుడే బాక్సులో పెట్టుకున్న అన్నం అక్కడి ఎండలకు ఒక్కోసారి పాచిపోతుంది కూడా. అలాగే తింటే ఆరోగ్యాలు పాడవుతాయి. 45 డిగ్రీల ఎండల్లో చెమట రూపంలో రెండు లీటర్ల నీరు పోతుంది. రోజుకి పది లీటర్లకు తక్కువ కాకుండా నీళ్లు తాగితే తప్ప బతికి బట్ట కట్టడం కష్టం. ఇదేమీ తెలియక పనులు చేసుకుంటూ కొన్నాళ్లకే బీపీ, షుగర్ల బారిన పడుతుంటారు. హఠాన్మరణాలన్నీ హార్ట్ ఎటాక్‌లే. వర్క్ ప్రెషర్ ఎక్కువై గుండె ఆగిపోయేవాళ్లు కొందరైతే, బాడీ డీ హైడ్రేట్ అయి లోబీపీతో గుండె ఆగిపోయేవాళ్లు కొందరు. రోజంతా ఎండలో పని చేసి గదికొచ్చి స్నానం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వాళ్లెందరో. వీటన్నింటి మీద వారిలో చైతన్యం కలిగిస్తే కనీసం తగినంత నీళ్లయినా తాగుతారనేది మా ప్రయత్నం. గల్ఫ్‌లో మంచి ఉద్యోగాల్లో ఉన్న తెలుగు వాళ్లందరం కలిసి మెడికల్ క్యాంపులు పెట్టి మందులిప్పించాం. ఇప్పటికీ ఇప్పిస్తున్నాం. నెలకు ఐదారు మరణాలు నేను 2010 నుంచి ఐదేళ్ల పాటు బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీలో ఉద్యోగం చేశాను. కనీసం నెలకు ఐదారు మరణాలుండేవి. గడచిన నాలుగేళ్లలో ఒక్క తెలంగాణలోనే 800 గల్ఫ్ మరణాలు సంభవించాయి. ఇవన్నీ చూస్తుంటే మనకు గల్ఫ్ అంటే భూతల నరకమేమో అనిపిస్తుంది. అయితే పనిలో నైపుణ్యం పెంచుకుని, ప్రభుత్వ ఆథరైజ్డ్ సంస్థ ద్వారా, ఒరిజినల్ వీసాతో వెళితే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. రహదారి సరిగ్గా లేనప్పుడే పక్కదారులు డెవలప్ అవుతాయి. పొరపాట్లు జరుగుతున్నది అక్కడే. ముందే ట్రైనింగ్ తీసుకోవాలి మనకు హైదరాబాద్‌లో 45 ఎకరాల ట్రైనింగ్ సెంటర్ ‘న్యాక్’ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) ఉంది. తాపీ పని నుంచి, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వంటి భవన నిర్మాణానికి అవసరమైన అన్ని విభాగాల్లోనూ ఇంజనీరింగ్ స్కిల్స్‌లో ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. నెలకు వెయ్యిమందికి శిక్షణ ఇవ్వగలిగిన సంస్థ మన దగ్గర ఉన్నప్పటికీ ఆ విషయం మన గ్రామాల్లోని యువకులకు తెలియడం లేదు. గ్రామాల్లో వేలాది మంది పని లేక, పని చేయడం చేతకాక ఉన్నారు. కనీసం గల్ఫ్ వంటి చోట్లకు వెళ్లే వాళ్లయినా న్యాక్‌లో ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికేట్, వర్క్ పర్మిట్‌తో వెళ్తే.. ఉద్యోగ భద్రత ఉంటుంది. ‘ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ వయా రెక్టిఫై యువర్ స్టేటస్’ నినాదంతో ఇవాళ్టి నుంచి మొదలౌతున్న ‘యుఏఈ ఆమ్నెస్టీ 2018’ లో అక్కడున్న మనవాళ్లు తప్పు దిద్దుకోవడానికి రెండు అవకాశాలున్నాయి. అక్కడే ఉండాలంటే ఇల్లీగల్ వీసాను లీగలైజ్ చేసుకుని కొనసాగవచ్చు. వచ్చేయాలనుకుంటే ఇండియాకి వచ్చేయవచ్చు. ఎలాంటి సహకారం కావాలన్నా టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించాలి. ‘క్షమాభిక్షకు అవకాశం ఆగస్టు 1 నుంచి అక్టోబరు 31 వరకు ఉంటుంది’’ అని వివరించారు దేవేందర్. ‘అవుట్’ పెట్టినట్లే తెలీదు! ఆమ్నెస్టీ వార్తలు గల్ఫ్‌లో అరబిక్, ఇంగ్లిష్ పత్రికల్లో ప్రచురితమవుతాయి. వాటిని మనవాళ్లు చదవలేరు. నగరాల్లో ఉద్యోగం చేసే ఏ కొందరికో తెలుస్తుంది. వాళ్లు సాధ్యమైనంత వరకు ఇతర తెలుగువాళ్లకు చేరవేస్తుంటారు. కానీ మనవాళ్లు పని చేసే వర్క్సైట్లు నగరాలకు 30–40 కిలోమీటర్ల దూరాన ఉంటాయి. వాళ్లకు అవుట్ (ఆమ్నెస్టీ) పెట్టినట్లే తెలియదు. కనీసం మన తెలుగు పత్రికలైనా విస్తృతంగా ప్రచురిస్తే... గల్ఫ్ వెళ్లిన వాళ్ల కుటుంబీకులు ఇక్కడ చదివి, వారానికో–నెలకో ఫోన్లో దొరికినప్పుడు సమాచారమిస్తారనేది నా ప్రయత్నం. – నంగి దేవేందర్ రెడ్డి, కన్వీనర్, టీపీసీసీ గల్ఫ్ ఎన్ఆర్ఐ సెల్ గల్ఫ్‌లో పనిచేసే భారతీయులు అనేక కారణాలతో వెనక్కి వచ్చేయాల్సి వుంటుంది. ప్రభుత్వాలు ‘ప్రకృతి విపత్తు నిర్వహణ’ కోసం ఏర్పాటు చేసినట్లే – గల్ఫ్ బాధితుల కోసం కూడా శాశ్వత పథకాన్ని పెట్టాలి. ‘ప్రవాసి మిత్ర’ ద్వారా మేము ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నాం. బాధితులకు పునరావాసం కూడా కల్పించాలి. – భీంరెడ్డి, ప్రవాసి మిత్ర అధ్యక్షులు సహాయం కోసం టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లు: దుబాయ్‌లోని భారత్ కాన్సులేట్, అబుదాబి లోని భారత రాయభార కార్యాలయాల్లో సహాయ కేంద్రాలున్నాయి. దుబాయ్ వాళ్లు సంప్రదించాల్సిన ఫోన్ నంబరు :0097150565463909 లేదా indianindubai.amnesty@gmail.com అబుదాబిలో ఉన్న వాళ్లు... 00917508995583 లేదా indemb.uaeamnesty18@gmail.com యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తెలుగు వారికి సేవలందిస్తున్న వారు: టీపీసీసీ గల్ఫ్ ఎన్ఆర్ఐ సెల్ కో ఆర్డినేటర్ మారుతి ముత్యాల: 00971566670013; కేవీఎస్ రెడ్డి: 00971527714549 గమనిక: క్రిమినల్ కేసులున్న వాళ్లకు ఈ సహాయం వర్తించదు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఐ ఫోన్ 6ను కట్నంగా అడిగాడు...
ఇప్పటివరకూ పెళ్లిళ్లలో కట్నాల కింద క్యాష్, కార్లు, బంగారం, బైక్‌లు, భవనాలు అడగటమే చూశాం. తాజాగా ఆ లిస్ట్‌లో యాపిల్ ఐ ఫోన్ 6 కూడా చేరింది. అయితే ఇక్కడ మాత్రం ఇది వరకట్నం కాదు.. కన్యాశుల్కం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్లంటే మంచి క్రేజ్ నెలకొంది. ఐఫోన్ ధర కూడా భారీ మొత్తంలో ఉన్న విషయం తెలిసిందే. ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలంటారు. సౌదీలో ఓ అమాయకుడు ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. తీరా చూస్తే ఆమెకు ఓ అన్న ఉన్నాడు. తన చెల్లెలికి ప్రపోజ్ చేయాలంటే.. ముందుగా తనకు ఓ ఐఫోన్ 6 కన్యాశుల్కంగా ఇచ్చుకోవాలని షరతు పెట్టాడు. ఫోన్ ఇచ్చేవరకు పెళ్లి చేసే ప్రసక్తి మాత్రం లేనే లేదని కచ్చితంగా చెప్పేశాడు. తీరా చూస్తే ఐఫోన్ 6 ఇంతవరకు సౌదీలోకి అడుగుపెట్టనే లేదు. ఆఫోన్ రావాలి, కొనివ్వాలి.. ఆ తర్వాతే పెళ్లి అని చెప్పాడు. దాంతో.. 'ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు' అని తనమీద తానే జాలిపడుతూ ఐఫోన్ ఎప్పుడు వస్తుందాని అతగాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంగొత్త ఫీచర్లతో టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా ఆవిష్కరించిన ఐఫోన్ 6 స్మార్ట్ఫోన్లు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫోన్లు ఈనెల 19న మార్కెట్లోకి విడుదలయ్యాయి. అయితే అమెరికా ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, సింగపూర్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్‌లో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇతర దేశాల్లో వీటి రాక కాస్త ఆలస్యం కానున్నాయి. దాంతో సౌదీ పెళ్లికొడుకు వివాహం కూడా అప్పటి వరకూ వాయిదా పడనుంది. సౌదీలో ఈ ఫోన్ అందుబాటులో వచ్చేవరకూ కాబోయే దంపతులు నిఖా కోసం అప్పటివరకూ వేచి చూడాల్సిందే. అరబ్ దేశాల్లో కట్నాలు ఇవ్వటం సాంప్రదాయకమే. వారు తమ తాహత్తుకు తగ్గట్టు బహుమతులు ఇచ్చుకోవటం సాధారం. అయితే కొన్ని కుటుంబాలు మాత్రం తమకు కావాల్సిన ఖరీదైన వస్తువులను డిమాండ్ చేసి మరీ వసూలు చేస్తుంటారు. అయితే కట్నాల జాబితాలో ఐఫోన్ 6 కావాలని కోరటం ఇదే తొలిసారట. ఇక అడ్వాన్స్డ్ ఫీచర్లతో రూపొందిచిన ఈ ఫోన్ పట్ల చిన్నా పెద్దా, యువత ఆసక్తి కనబరుస్తోంది. అక్టోబర్ 17న భారత మార్కెట్లోకి అధికారికంగా ఈ ఫోన్ రాబోతోంది. ఆన్ లైన్లో, బ్లాక్ మార్కెట్లో ఈ ఫోన్ ధర లక్ష రూపాయల వరకు పలుకుతున్నట్లు సమాచారం. -
అరబ్ భూమిలో ఆ ఇద్దరు!
ఆ ఇద్దరి శక్తిసామర్థ్యాలను ప్రశంసించడానికి లేదా గుర్తు తెచ్చుకోవడానికి ‘లీడింగ్ గ్లోబల్ థింకర్స్’ జాబితా ఒక కారణం అయితే కావచ్చు గానీ, అది మాత్రమే ప్రమాణం కాదు. విజయపథం వైపు వారి ప్రయాణానికి అది మాత్రమే కొలమానం కాదు. హైఫా, నౌర అనే ఇద్దరు మహిళలు... ఏ అమెరికాలోనో, బ్రిటన్‌లోనో పుట్టి విజయాలు సాధించి ఉంటే పెద్దగా చెప్పుకునే వాళ్లం కాదేమో. కానీ వాళ్లు విజయాలు సాధించింది, మహిళలు విజయాలు సాధించడానికి అంతగా అనుకూలం కాని అరబ్ భూమిలో! అంతర్జాతీయ కీర్తి ముందు హైఫా గురించి. ఆమెకు సినిమాలు అంటే ఇష్టం. సినిమా డెరైక్టర్ కావాలనేది ఆశయం. ఆడపిల్లలు సినిమాలు చూడడమే అనైతికం అని భావించే సౌదీలో... ఒక ఆడపిల్ల సినిమా డెరైక్టర్ కావాలనుకోవడానికి చాలా ధైర్యమే ఉండాలి. అది హైఫాలో ఉంది. ఆమె తండ్రి కవి. బహుశా ఆయన స్వతంత్ర భావాలే కూతురుకీ వచ్చి ఉంటాయి. హైఫా ఎలాంటి నియమ నిబంధనల మధ్యా పెరగలేదు. 2009లో ‘యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ’ లో డెరైక్టింగ్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ సాధించించి సినిమా ఎలా తీయాలో తెలుసుకున్నారు హైఫా. అంతేకాదు... ‘వా-జె-ద’ రూపంలో తన దగ్గర కథ కూడా సిద్ధంగా ఉంది. మరి డబ్బులు కావాలి కదా! మధ్యప్రాచ్యంలో ప్రతి కళాసంస్థకు, యూరప్‌లోని ప్రతి ప్రొడక్షన్ కంపెనీకి ఆర్థిక సహాయం కోసం ఈ-మెయిల్స్ పంపారు హైఫా. అనేక ప్రయత్నాల తరువాత, అవమానాల తరువాత ఆమె ప్రయత్నం ఫలించింది. ‘వా-జె-ద’ షూటింగ్ మొదలైంది. షూటింగ్ జరిపే క్రమంలో సహజంగానే ఆమెకు రకరకాల అవాంతరాలు ఎదురయ్యాయి. కొందరైతే తమ ఇంటి పరిసరాల్లో షూటింగ్ చేయడానికి ససేమిరా అన్నారు. ‘‘సౌదీ అరేబియాలో షూటింగ్ చేయడం అనేది చట్టవ్యతిరేకం కాదు. ఎందుకంటే అక్కడ చట్టం అంటూ ఉంటే కదా’’ అంటారు హైఫా వ్యంగ్యంగా. అంతమాత్రాన ఆమె సౌదీ ప్రజలకు వ్యతిరేకం ఏమీ కాదు. ‘‘సౌదీయులకు హస్యచతురత ఎక్కువ. అది ప్రతి మాటలోనూ కనిపిస్తుంది’’ అంటారు ఆమె. ఈ నేపథ్యంలో తనకు వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్లను కూడా గుర్తుకు తెచ్చుకొని అందులోని చమత్కారానికి నవ్వుకుంటారు హైఫా. సౌదీ అరేబియాలో పూర్తిగా చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రం ‘వా-జె-ద’. సైకిల్ తొక్కడానికి అనుమతి లేని దేశంలో ఒక బాలిక సైకిల్ కొనడానికి పడిన పాట్లు ఈ సినిమాలో గొప్పగా చూపారు. ‘వా-జె-ద’ ఆస్కార్‌కు కూడా నామినేట్ అయింది. ఇప్పుడు సౌదీలో ఆమె భావాలకు నిశ్శబ్దంగా మద్దతు లభిస్తోంది. చిత్రానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. సౌదీ తొలి మహిళా డెరైక్టర్ హైఫా గ్లోబల్ థింకర్‌గా నిలిచారు. ఇప్పుడు ఆ దేశంలో మరెందరో హైఫాలు తయారుకావడానికి ఒక కొత్త దారి ఏర్పడింది. కళకు పునరుజ్జీవనం ఇక నౌరా గురించి. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఎ.ఇ.)లో సృజనాత్మక రంగాన్నీ, వేదికలను ఒంటి చేత్తో నిలిపిన ఘనత ఆమెది. యు.ఎ.ఇ.లో 1980 దశాబ్దారంభం ప్రాంతీయ నాటకాలకు బంగారు కాలం. కానీ... కాలం గడుస్తున్న కొద్దీ అక్కడ నాటకం కొడిగట్టింది. రీజనల్ డ్రామా మార్కెట్టుకు గడ్డుకాలం దాపురించింది. ఈ క్రమంలో... ‘ఎందుకిలా జరిగింది’ అనే ప్రశ్న నౌరాను తరచు వేధించసాగేది. లండన్ బిజినెస్ స్కూలులో చదువుకున్న నౌరా యు.ఎ.ఇ. గవర్నమెంట్ గ్యాస్ కంపెనీ ‘డాల్ఫిన్ ఎనర్జీ’లో మేనెజ్మెంట్ విభాగంలో చేరారు. ఉన్నత ఉద్యోగం... కానీ, ఎక్కడో అసంతృప్తి. తనకు ఇష్టమైన అభిరుచులు... ఫొటోగ్రఫీ, పుస్తకాలు, రచన... ఆమెను ఒక దగ్గర నిలవనివ్వలేదు. 2007లో రెండువందల పేజీల ఒక డాక్యుమెంట్‌ను చదవడం ద్వారా ఆమె అసంతృప్తికి పరిష్కారం దొరికింది. అది ‘టూఫోర్54’ అనే ఫ్రీ మీడియా సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్. ఆ సంస్థ తొలి సీఇవోగా ఎంపిక కావడం ద్వారా తన కోరికను నెరవేర్చుకున్నారు నౌరా. ‘టుఫోర్54’ అనేది టెలివిజన్, రేడియో, ఫిల్మ్, పబ్లిషింగ్, ఆన్లైన్, మ్యూజిక్, గేమింగ్, యానిమేషన్ విభాగాల అభివృద్ధికి పని చేసే ప్రభుత్వ సంస్థ. అది వర్క్‌షాపులు నడపడమే కాకుండా అవసరమైన చోట సబ్సిడీలు కూడా ఇస్తుంటుంది. ‘‘ఒక అరుదైన ప్రాజెక్ట్‌కు ఆడపిల్ల సిఇవో కావడం ఏమిటి? ఆ పోస్ట్‌కు మగవాళ్లు మాత్రమే సరిపోతారు. అబ్బాయిల మాదిరిగా అమ్మాయిలు దూసుకోపోలేరు’’ అనుకుంది అక్కడి పురుషాధిక్యసమాజం. అయినా చాలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయింది నౌరా. అయిదేళ్లలో ఆ దేశంలో ‘క్రియేటివ్ బిజినెస్’ను కొత్తపుంతలు తొక్కించింది. ‘టుఫోర్54’ పక్కా బిజినెస్‌లాగే అనిపించినా దానిలో కళాపునరుజ్జీవం ఉంది. ‘సృజనాత్మక వ్యక్తీకరణ లేకుండా యు.ఎ.ఇ. ఎప్పటికీ సుసంపన్నమైన సాంస్కృతిక వికాసానికి చేరుకోదు’ అనే వాస్తవాన్ని నమ్ముతుందామె. ఆ నమ్మకానికి నౌరా ఆధ్వర్యంలోని ‘టుఫోర్54’ ఒక నిదర్శనంలా నిలుస్తోంది. -
సన్మార్గ ప్రదాత... మహాప్రవక్త ముహమ్మద్ (స)
ప్రవక్త చూపిన నిరాడంబరత, త్యాగనిరతి, విశ్వసనీయత, వాగ్దానపాలన, మిత్రులు, సహచరుల పట్ల అమితమైన అంకితభావం, స్థిరచిత్తం, ఆయనలోని ధైర్యసాహసాలు, దైవం పట్ల, తన ధ్యేయం పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసం అన్ని అవరోధాలనూ అధిగమించగలిగింది. మానవజాతి సంస్కరణకు విశేష కృషి జరిపిన మహనీయుల్లో ముహమ్మద్ ప్రవక్త (స) అగ్రగణ్యులు. ఆయన మానవ సమాజాన్ని ఏదో ఒకకోణంలో మాత్రమే స్పృశించలేదు. మానవుడి పుట్టుక మొదలు మరణం వరకు జీవితంలోని సమస్త రంగాల సంస్కరణకు ఆయన ప్రయత్నించారు. ఎలాంటి అసమానతలూ, ఉచ్చనీచాలూ, భేదభావాలూ లేని ఉన్నత నైతిక, మానవీయ సమాజాన్ని ఆయన ఆవిష్కరించారు. ముహమ్మద్ ప్రవక్త (స) ప్రభవనకు పూర్వం నాటి అరబ్ సమాజం ఎలా ఉండేదో ఊహిస్తే ఒళ్లు జలదరిస్తుంది. అజ్ఞానాంధకార విష వలయంలో పడి కొట్టుమిట్టాడుతున్న సమాజమది. ‘కర్రగల వాడిదే బర్రె’ అన్న చందంగా బలవంతుడు బలహీనుడిని పీక్కుతినేవాడు. బడుగు, బలహీన వర్గాల హక్కులు, నిర్దాక్షిణ్యంగా కాలరాయబడేవి. అవినీతి, అక్రమాలు, దోపిడి, దౌర్జన్యాలు, సారాయి, జూదం, అశ్లీలత, వడ్డీ పిశాచం, హత్యలు, అత్యాచారాలు, ఆడపిల్లల సజీవ ఖననం, భ్రూణహత్యలు తదితర సామాజిక నేరాలకు అడ్డూ అదుపూ ఉండేది కాదు. ఆ కాలంలో స్త్రీజాతికి అసలు ఏమాత్రం విలువ ఉండేది కాదు. ఒకరకంగా చెప్పాలంటే స్త్రీ వ్యక్తిత్వాన్ని, ఉనికినే అంగీకరించేది కాదు ఆనాటి పురుషాధిక్య సమాజం. అలాంటి సమాజంలో, అలాంటి వాతావరణంలో జన్మించిన ముహమ్మద్ ప్రవక్త (స) తన ఇరవై మూడేళ్ల దైవ దౌత్యకాలంలో అంతటి ఆటవిక సమాజాన్ని అన్నివిధాలా సమూలంగా సంస్కరించారు. దేవుని ఏకత్వం, పరలోక విశ్వాసం అన్న భావజాలాన్ని ప్రజల హృదయాల్లో ప్రతిష్ఠించి, దేవుని ముందు జవాబుదారీ భావనను ప్రోది చేశారు. అన్ని రంగాల్లో, అన్ని విధాలా పతనమై పోయిన ఒక జాతిని కేవలం ఇరవైమూడేళ్ల కాలంలో సంపూర్ణంగా సంస్కరించడమంటే మామూలు విషయం కాదు. యావత్తూ అరేబియా ద్వీపకల్పం విగ్రహారాధనను వదిలేసి, దేవుని ఏకత్వం వైపు పరివర్తన చెందింది. తెగల మధ్య అంతర్ యుద్ధాలు అంతమై, జాతి సమైక్యమైంది. అవినీతి, అక్రమాలు, దోపిడి, సారాయి, జూదం, వడ్డీ, అంటరానితం, శిశుహత్యలు, అత్యాచారాలు అన్నీ పూర్తిగా సమసిపోయాయి. స్త్రీ అంగడి సరుకు అన్న భావన నుండి స్త్రీని గౌరవించనిదే దైవప్రసన్నత దుర్లభమన్న విశ్వాసం వేళ్లూనుకుంది. అన్నిరకాల అసమానతలు అంతమైపోయాయి. బడుగు, బలహీనవర్గాల హక్కులు పరిరక్షించబడ్డాయి. మానవ సమాజంలో అన్ని విధాలా శాంతి సౌభాగ్యాలు పరిఢవిల్లాయి. అందుకే ధర్మబోధకులందరిలో అత్యధికంగా సాఫల్యాన్ని పొందిన ప్రవక్త ముహమ్మద్ మాత్రమేనని ఎన్సైక్లోపిడియా ఆఫ్ బ్రిటానికా ఘనంగా కీర్తించింది. అంతేకాదు, ప్రారంభకాలపు మూలగ్రంథాలు ఆయన్ని విశ్వసనీయమైన వ్యక్తిగా, సత్యసంధుడైన మనిషిగా పరిచయం చేస్తాయని ప్రకటించింది. ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన మహాపురుషులను గురించి మైకేల్ హెచ్. హార్ట్ ఒక పుస్తకం రాశారు. అందులో రాసిన వందమంది మహాపురుషుల జాబితాలో ‘ముహమ్మద్’ ప్రవక్త (స)పేరు అందరికన్నా అగ్రస్థానంలో మనకు కనిపిస్తుంది. థామస్ కార్లయిల్, తాను రాసిన ‘హీరోస్ అండ్ హీరో వర్షిప్’ గ్రంథంలో ముహమ్మద్ వ్రపక్తను ‘హీరో ఆఫ్ ది హీరోస్’ అని అభివర్ణించారు. అంతేకాదు, మహాత్మాగాంధీ మహనీయ ముహమ్మద్ ప్రవక్త (స)ను గురించి తాను రాసిన ‘యంగ్ ఇండియా’లో ఇలా అన్నారు. ‘లక్షలాదిమంది మానవుల హృదయాలను నిర్ద్వంద్వంగా గెలుచుకున్న ఆ ఉత్తమ వ్యక్తి గురించి తెలుసుకున్నాను. కేవలం ప్రవక్త చూపిన నిరాడంబరత, త్యాగనిరతి, విశ్వసనీయత, వాగ్దానపాలన, మిత్రులు, సహచరుల పట్ల అమితమైన అంకితభావం, స్థిరచిత్తం, ఆయనలోని ధైర్యసాహసాలు, దైవం పట్ల, తన ధ్యేయం పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసం అన్ని అవరోధాలనూ అధిగమించగలిగింది.’ అజ్ఞాన తిమిరంలో తచ్చాడే మానవజాతికి జ్ఞానకాంతుల వెలుగులో సన్మార్గం చూపిన మహాత్ముడు ఇహలోకం వీడి దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తోంది. అయినప్పటికీ ఆ మహనీయుని బోధనలు మన వద్ద సురక్షితంగా ఉన్నాయి. వాటిని మనం ఆచరించగలిగితే నేడు మన సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ అధిగమించి ఓ సుందర సత్సమాజాన్ని ఆవిష్కరించుకోవచ్చు. - యండీ ఉస్మాన్‌ఖాన్ -
అరబ్ ‘వసంతం’ వాడుతోందా!
ఇటీవల ‘క్రిస్టియన్ సైన్స్ మోనిటర్’ పత్రిక అరబ్బు వసంతం విఫలమైందా అని ప్రశ్నిస్తూ వ్యాసం ప్రచురించింది. ‘అరబ్ వసంతకాలం’ నిష్ర్కమించి శిశిరం ప్రవేశించినట్టు కనిపిస్తున్నది. రెండు మూడు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతున్న పాలకులకూ, పార్టీలకూ వ్యతిరేకంగా ఇసుక ఎడారులు, చమురు క్షేత్రాలలో పెల్లుబికిన తిరుగుబాట్లకే పత్రికా ప్రపంచం ‘వసంతం’ అని పేరు పెట్టింది. డిసెంబర్ 18, 2010న మొదలైన ఈ ‘వసంతకాలం’ ట్యునీసియా, ఈజిప్ట్, లిబియా, యెమెన్, బహ్రెయిన్, సిరియా, అల్జీరియా, ఇరాక్, జోర్డాన్, కువైట్, మొరాకో, సూడాన్, ఒమన్, పశ్చిమ సహారాలను చుట్టుముట్టింది. ఈ సంచలనం వయ సు రెండేళ్లే. అయినా ఆ దేశాలలో కొన్ని ‘వసంతాగమనం’ పరిపూర్ణం కాలేదనీ, రెండో దశ వసంతకాలం అవసరమని భావిస్తున్నా యి. 1981లో అధికారం చేపట్టిన హోస్నీ ముబారక్‌ను ఈజిప్ట్ ప్రజలూ, సైన్యం తొల గించి, బ్రదర్హుడ్ అనుబంధ ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ మొర్సీని ఎన్నుకున్నారు. మళ్లీ ఆ ప్రజలూ, సైన్యం, ప్రతిపక్షాలే మొర్సీని తొలగించాయి. 33 ఏళ్ల క్రితం యెమెన్ అధికారం చేపట్టిన అలీ అబ్దుల్లా సలేని ఫిబ్రవరి 2012లో ప్రజలు గద్దెదించా రు. లిబియా నియంత గడ్డాఫీ 44 ఏళ్ల తరువాత అక్టోబర్ 2011లో అత్యంత విషాదకరంగా మరణించాడు. ఈజిప్ట్‌లో మొర్సీ పతనం ట్యునీసియా చేత ‘విప్లవ’ పరిపూర్ణత గురించి యోచించచేందుకు దోహదం చేసింది. ‘అరబ్ వసం తం’ మొదట అంకురించింది ట్యూనీసియాలోనే. ప్రజాసమస్యలు, దిగజారిన ఆర్థిక పరి స్థితి, అవినీతి, బంధుప్రీతి, నిరుద్యోగాలతో కొన్ని అరబ్ దేశాలు దుర్భరస్థితిని అనుభవి స్తున్నాయి. 1975-2005 మధ్య అరబ్ జనా భా 314 మిలియన్లకు చేరి, రెట్టింపయింది. కారణం దశాబ్దాలపాటు పాలకులు తిష్టవేసుకుని ఉండటమే. ‘అరబ్ వసంత’ వేళకే (2010 డిసెంబర్) ట్యునీసియా ఉద్యమబాటలో ఉంది. 1987లో జైనే ఎల్ అబిదైన్ బెన్ అలీ ట్యునీసియా అధికారం చేపట్టాడు. డిసెం బర్ 17, 2010న ట్యునీసియాలో సిది బౌజిద్ అనేచోట మహ్మద్ బౌజిజి అనే తోపుడు బండి వ్యాపారి నుంచి పళ్లను స్వాధీనం చేసుకుని పోలీసులు జప్తు చేశారు. మామూళ్లు ఇవ్వనందునే ఇదంతా జరిగిందని వార్తలు వచ్చాయి. ఇది భరించలేక ఆ చిరువ్యాపారి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అప్పటికే వీథులలోకి వచ్చిన ప్రజలు ఈ ఘటనతో ఉద్యమాన్ని తీవ్రం చేశారు. ఉద్యమం రాజధాని ట్యునిస్కు పాకిం ది. 2011 జవవరి14న అధ్యక్షుడు బెన్ అలీ సౌదీ అరేబియాకు పారిపోయాడు. తాత్కా లిక ప్రభుత్వం ఏర్పడింది. ట్యునీసియా జాతీయ పుష్పం మల్లెపువ్వు. కాబట్టి ఈ ఉద్యమానికి జాస్మిన్ రివల్యూషన్ (మల్లెల విప్ల వం) అని పేరు పెట్టారు. ఈ అల్లర్లలో 78 మంది చనిపోయారు. అక్టోబర్ 23, 2011న ట్యునీసియా తొలి సారి స్వేచ్ఛగా ఎన్నికలు జరుపుకుంది. ఇస్లామిస్ట్ మితవాద రాజకీయ పక్షం అల్ నహ్దా అధికారంలోకి వచ్చింది. అలీ ఎల్ అరీద్ అధికారంలోకి వ చ్చాడు. మరో రెండు చిన్న సెక్యులర్ పార్టీలు -కాంగ్రెస్ ఫర్ ది రిపబ్లిక్ పార్టీ, బ్లాక్ ఫర్ లేబర్ అండ్ లిబర్టీస్-తో కలిపి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదే రాజ్యాంగ రచన బాధ్యతను కూడా చేపట్టింది. కొత్త ప్రభుత్వం బెన్ అలీ కాలం నాటి ఖైదీలను విడుదల చేసి, వంద రాజకీయ పార్టీలకు గుర్తింపునిచ్చింది. మీడియా మీద ఆంక్షలు తొలగించింది. రాజ్యాంగ చర్చలతో పాటు ఇవన్నీ జరుగు తూండగానే ప్రజాస్వామిక వ్యవస్థకు వ్యతిరేకులైన సలాఫిస్టులు (సలాఫిస్ట్ అన్సార్ అల్ షరియా ఉద్యమం. ఇది ఉగ్రవాద ఉద్యమం) వీథి పోరాటాలు మొదలుపెట్టారు. ఇవి బాగా విస్తరించి అల్ నహ్దా ప్రభుత్వ నేత అరీద్ వైదొలగాలన్న డిమాండ్‌కు ఊపు నిచ్చాయి. బెన్ అలీ దేశం విడిచి పారిపోయే నాటికి 13 శాతంగా ఉన్న నిరుద్యోగిత తరువాత 18 శాతానికి పెరిగిపోయింది. 2012 నాటికి ఎనభైవేల మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు.ద్రవ్యోల్బణం ఆరు శాతం పెరిగింది. 2012 సంవత్సరంతో పోలిస్తే విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు 1.3 శాతానికి పడిపోయాయి. దీనార్ విలువ పడిపోయింది. ఇస్లామిస్ట్ మూవ్మెంట్ నుంచి వచ్చిన అరీద్ను దింపి, తటస్థనేతను దేశాధినేతను చేయాలని ఉద్యమకారులు కోరుతున్నారు. అంటే ఇస్లామిస్టులకు, సెక్యులరిస్టులకు వైరుధ్యాలు తీవ్రమైనాయి. వాస్తవానికి కొత్త ప్రభుత్వం ఈ అంశంతో పాటు చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నది. వివిధ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలతో వచ్చిన విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఈ అలజడుల మధ్యనే ఈ ఏడాది ఫిబ్రవరి 6న రాహోయి పార్టీ నాయకుడు చోక్రి బిలేడ్ను కాల్చి చంపారు. జూలై 25న వామపక్ష ప్రముఖుడు మహ్మద్ బ్రహ్మిని హత్య చేశారు. ఈ రెండు హత్యలు కూడా సలాఫిస్టుల పనేనని అనుమానాలు ఉన్నాయి. ట్యునీసియా తిరుగుబాటు స్వచ్ఛమైన పాలన కోసం ఉద్దేశించినది. మత ఛాందస వర్గాలను అధికారానికి దూరంగా ఉంచే కృషి కూడా ఇందులో ఉంది. కానీ ప్రజలు సత్వర ఫలితాలను కోరుతున్నారు. ఇటీవల ‘క్రిస్టియన్ సైన్స్ మోనిటర్’ పత్రిక అరబ్బు వసం తం విఫలమైందా అని ప్రశ్నిస్తూ వ్యాసం ప్రచురించింది. నిజానికి చాలా మంది మేధావులు ఈ అభిప్రాయంతోనే ఉండవచ్చు. కానీ ఇది ప్రజాస్వామ్యానికి ఎదురుదెబ్బే గానీ, గొడ్డలిపెట్టు కాదు. - డా॥గోపరాజు నారాయణరావు