ప్రవక్త చూపిన నిరాడంబరత, త్యాగనిరతి, విశ్వసనీయత, వాగ్దానపాలన, మిత్రులు, సహచరుల పట్ల అమితమైన అంకితభావం, స్థిరచిత్తం, ఆయనలోని ధైర్యసాహసాలు, దైవం పట్ల, తన ధ్యేయం పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసం అన్ని అవరోధాలనూ అధిగమించగలిగింది.
మానవజాతి సంస్కరణకు విశేష కృషి జరిపిన మహనీయుల్లో ముహమ్మద్ ప్రవక్త (స) అగ్రగణ్యులు. ఆయన మానవ సమాజాన్ని ఏదో ఒకకోణంలో మాత్రమే స్పృశించలేదు. మానవుడి పుట్టుక మొదలు మరణం వరకు జీవితంలోని సమస్త రంగాల సంస్కరణకు ఆయన ప్రయత్నించారు. ఎలాంటి అసమానతలూ, ఉచ్చనీచాలూ, భేదభావాలూ లేని ఉన్నత నైతిక, మానవీయ సమాజాన్ని ఆయన ఆవిష్కరించారు.
ముహమ్మద్ ప్రవక్త (స) ప్రభవనకు పూర్వం నాటి అరబ్ సమాజం ఎలా ఉండేదో ఊహిస్తే ఒళ్లు జలదరిస్తుంది. అజ్ఞానాంధకార విష వలయంలో పడి కొట్టుమిట్టాడుతున్న సమాజమది. ‘కర్రగల వాడిదే బర్రె’ అన్న చందంగా బలవంతుడు బలహీనుడిని పీక్కుతినేవాడు. బడుగు, బలహీన వర్గాల హక్కులు, నిర్దాక్షిణ్యంగా కాలరాయబడేవి. అవినీతి, అక్రమాలు, దోపిడి, దౌర్జన్యాలు, సారాయి, జూదం, అశ్లీలత, వడ్డీ పిశాచం, హత్యలు, అత్యాచారాలు, ఆడపిల్లల సజీవ ఖననం, భ్రూణహత్యలు తదితర సామాజిక నేరాలకు అడ్డూ అదుపూ ఉండేది కాదు. ఆ కాలంలో స్త్రీజాతికి అసలు ఏమాత్రం విలువ ఉండేది కాదు. ఒకరకంగా చెప్పాలంటే స్త్రీ వ్యక్తిత్వాన్ని, ఉనికినే అంగీకరించేది కాదు ఆనాటి పురుషాధిక్య సమాజం.
అలాంటి సమాజంలో, అలాంటి వాతావరణంలో జన్మించిన ముహమ్మద్ ప్రవక్త (స) తన ఇరవై మూడేళ్ల దైవ దౌత్యకాలంలో అంతటి ఆటవిక సమాజాన్ని అన్నివిధాలా సమూలంగా సంస్కరించారు. దేవుని ఏకత్వం, పరలోక విశ్వాసం అన్న భావజాలాన్ని ప్రజల హృదయాల్లో ప్రతిష్ఠించి, దేవుని ముందు జవాబుదారీ భావనను ప్రోది చేశారు. అన్ని రంగాల్లో, అన్ని విధాలా పతనమై పోయిన ఒక జాతిని కేవలం ఇరవైమూడేళ్ల కాలంలో సంపూర్ణంగా సంస్కరించడమంటే మామూలు విషయం కాదు. యావత్తూ అరేబియా ద్వీపకల్పం విగ్రహారాధనను వదిలేసి, దేవుని ఏకత్వం వైపు పరివర్తన చెందింది. తెగల మధ్య అంతర్ యుద్ధాలు అంతమై, జాతి సమైక్యమైంది.
అవినీతి, అక్రమాలు, దోపిడి, సారాయి, జూదం, వడ్డీ, అంటరానితం, శిశుహత్యలు, అత్యాచారాలు అన్నీ పూర్తిగా సమసిపోయాయి. స్త్రీ అంగడి సరుకు అన్న భావన నుండి స్త్రీని గౌరవించనిదే దైవప్రసన్నత దుర్లభమన్న విశ్వాసం వేళ్లూనుకుంది. అన్నిరకాల అసమానతలు అంతమైపోయాయి. బడుగు, బలహీనవర్గాల హక్కులు పరిరక్షించబడ్డాయి. మానవ సమాజంలో అన్ని విధాలా శాంతి సౌభాగ్యాలు పరిఢవిల్లాయి. అందుకే ధర్మబోధకులందరిలో అత్యధికంగా సాఫల్యాన్ని పొందిన ప్రవక్త ముహమ్మద్ మాత్రమేనని ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ బ్రిటానికా ఘనంగా కీర్తించింది. అంతేకాదు, ప్రారంభకాలపు మూలగ్రంథాలు ఆయన్ని విశ్వసనీయమైన వ్యక్తిగా, సత్యసంధుడైన మనిషిగా పరిచయం చేస్తాయని ప్రకటించింది.
ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన మహాపురుషులను గురించి మైకేల్ హెచ్. హార్ట్ ఒక పుస్తకం రాశారు. అందులో రాసిన వందమంది మహాపురుషుల జాబితాలో ‘ముహమ్మద్’ ప్రవక్త (స)పేరు అందరికన్నా అగ్రస్థానంలో మనకు కనిపిస్తుంది. థామస్ కార్లయిల్, తాను రాసిన ‘హీరోస్ అండ్ హీరో వర్షిప్’ గ్రంథంలో ముహమ్మద్ వ్రపక్తను ‘హీరో ఆఫ్ ది హీరోస్’ అని అభివర్ణించారు. అంతేకాదు, మహాత్మాగాంధీ మహనీయ ముహమ్మద్ ప్రవక్త (స)ను గురించి తాను రాసిన ‘యంగ్ ఇండియా’లో ఇలా అన్నారు. ‘లక్షలాదిమంది మానవుల హృదయాలను నిర్ద్వంద్వంగా గెలుచుకున్న ఆ ఉత్తమ వ్యక్తి గురించి తెలుసుకున్నాను. కేవలం ప్రవక్త చూపిన నిరాడంబరత, త్యాగనిరతి, విశ్వసనీయత, వాగ్దానపాలన, మిత్రులు, సహచరుల పట్ల అమితమైన అంకితభావం, స్థిరచిత్తం, ఆయనలోని ధైర్యసాహసాలు, దైవం పట్ల, తన ధ్యేయం పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసం అన్ని అవరోధాలనూ అధిగమించగలిగింది.’
అజ్ఞాన తిమిరంలో తచ్చాడే మానవజాతికి జ్ఞానకాంతుల వెలుగులో సన్మార్గం చూపిన మహాత్ముడు ఇహలోకం వీడి దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తోంది. అయినప్పటికీ ఆ మహనీయుని బోధనలు మన వద్ద సురక్షితంగా ఉన్నాయి. వాటిని మనం ఆచరించగలిగితే నేడు మన సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ అధిగమించి ఓ సుందర సత్సమాజాన్ని ఆవిష్కరించుకోవచ్చు.
- యండీ ఉస్మాన్‌ఖాన్
సన్మార్గ ప్రదాత... మహాప్రవక్త ముహమ్మద్ (స)
Published Sun, Jan 12 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement
Advertisement