సంగీత శ్రీధర్.. అజేయ భారత్ యాత్రకు శ్రీకారం చుట్టారు. వివిధ రంగాల్లో వేగంగా పురోగమిస్తోన్న భారత్‌ను ప్రపంచం ముందు సమున్నతంగా ఆవిష్కరించేందుకు సాహసోపేత యాత్ర చేపట్టారు. యాభై ఏళ్ల సంగీత స్వయంగా వాహనం నడుపుతూ ఇప్పటి వరకు 27 రాష్ట్రాల్లో, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించారు. 39 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకొని 175వ రోజు సోమవారం ఆమె హైదరాబాద్‌చేరుకున్నారు. ఇప్పటి వరకు 280 నగరాల్లో పర్యటించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని, స్వచ్ఛ భారత్‌ను, మహిళల స్వయం సమృద్ధి, స్వావలంబన, సామాజిక భద్రత లక్ష్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. యాత్ర లక్ష్యాన్ని, విశేషాలను, తన అనుభవాలను ఇలా వివరించారు.
అరబ్– ఇండియా గుడ్‌విల్ జర్నీ..
తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన నేను రెండున్నర దశాబ్దాలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్నాను. ఒమన్ సాంకేతికశాఖ మంత్రిత్వశాఖలో ఈ–గవర్నెన్స్ అడ్వయిజర్‌గా కీలక విధుల్లో ఉన్నాను. మా వారు శ్రీధర్ ఓ ఆయిల్ కంపెనీ సీఈఓ. కుమారుడు అస్వత్ అమెరికాలో స్థిరపడ్డాడు. చాలాకాలం క్రితమే అరబ్‌లో స్థిరపడిన నేను గతేడాది ఆగస్టు 18న ‘యూఏఈ– ఇండియా గుడ్ విల్ జర్నీ’ పేరుతో ఈ సాహస యాత్రను చేపట్టాను. అన్ని రకాల సదుపాయాలు ఉన్న టాటా హెక్సా వాహనంలో స్వయంగా డ్రైవింగ్ చేస్తూ పర్యటిస్తున్నా. ముంబై నుంచి మొదలైన యాత్రలో ఇప్పటి వరకు ఉత్తర భారతంలోని అన్ని రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో పర్యటించా. ఈశాన్య రాష్ట్రాలను చుట్టేశా. అండమాన్ నికోబార్ మినహా ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించాను. ప్రస్తుతం హైదరాబాద్‌కు వచ్చా. విజయవాడ, ఒంగోలు తదితర నగరాల మీదుగా తమిళనాడు, కేరళ, కర్ణాటక దక్షిణాది రాష్ట్రాలను పూర్తి చేసుకొని మార్చి నాటికి తిరిగి ముంబై చేరుకుంటా. ‘ఎక్కడికెళ్లినా ప్రజలు అపూర్వంగా ఆదరిస్తున్నారు. అన్ని నగరాల్లో తమ సొంత ఇంటి వ్యక్తిలా చూసుకుంటున్నారు. దేశమంతా ఇప్పుడు నాకు ఒక కుటుంబంలా అనిపిస్తోంది’. స్వచ్ఛభారత్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని చోట్ల టాయిలెట్ల నిర్మాణాన్ని, పారిశుద్ధ్య నిర్వహణను ప్రధానంగా ప్రచారం చేస్తున్నాను. ఈ పర్యటనలో నాకెదురైన అనుభవాలపై త్వరలో పుస్తకం రాస్తాను.
వాహనమే నా ‘లైఫ్ లైన్’..
నేను పయనిస్తున్న టాటా హెక్సా వాహనమే నా లైఫ్‌లైన్. 300 ఓల్టుల విద్యుత్‌ను అందజేసే సోలార్ ప్యానల్స్ ఉన్న ఈ వాహనంలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. కంప్యూటర్, ఫోన్, ల్యాప్‌టాప్ తదితర అవసరాలకు సరిపడా విద్యుత్ లభిస్తుంది. భోజనం, వసతి, నిద్ర అన్నీ వాహనంలోనే. స్నానం తదితర అవసరాల కోసం పబ్లిక్ టాయిలెట్లను వినియోగిస్తున్నా. పరిశుభ్రమైన, స్వచ్ఛమైన టాయిలెట్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. ‘మ్యాప్ మై ఇండియా’ ఆధారంగా వాహనం వెళ్లాల్సిన మార్గం నిర్ధారణ అవుతుంది. ట్రాఫిక్ రద్దీ, రూట్‌కోర్సు, ప్రయాణ సమయం వంటి వివరాలన్నీ నమోదవుతాయి. ప్రతి రోజు జర్నీ వివరాలను యూఏఈ నుంచి నా భర్త శ్రీధర్ పర్యవేక్షిస్తుంటారు. ప్రతిరోజు ఒక్క పూట మాత్రమే భోజనంచేస్తూ మిగతా వేళల్లో పండ్లు, సలాడ్‌లతో గడిపేస్తున్నా. సంపూర్ణ ఆరోగ్యంతో, విజయవంతంగా నా యాత్ర కొనసాగిస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment