అరబ్ ‘వసంతం’ వాడుతోందా! | Is arab spring vanishing? | Sakshi
Sakshi News home page

అరబ్ ‘వసంతం’ వాడుతోందా!

Published Thu, Aug 29 2013 1:15 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM

అరబ్ ‘వసంతం’ వాడుతోందా!

అరబ్ ‘వసంతం’ వాడుతోందా!

ఇటీవల ‘క్రిస్టియన్ సైన్స్ మోనిటర్’ పత్రిక అరబ్బు వసంతం విఫలమైందా అని ప్రశ్నిస్తూ వ్యాసం ప్రచురించింది.
 
 ‘అరబ్ వసంతకాలం’ నిష్ర్కమించి శిశిరం ప్రవేశించినట్టు కనిపిస్తున్నది. రెండు మూడు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతున్న పాలకులకూ, పార్టీలకూ వ్యతిరేకంగా ఇసుక ఎడారులు, చమురు క్షేత్రాలలో పెల్లుబికిన తిరుగుబాట్లకే పత్రికా ప్రపంచం ‘వసంతం’ అని పేరు పెట్టింది.  డిసెంబర్ 18, 2010న మొదలైన ఈ ‘వసంతకాలం’ ట్యునీసియా, ఈజిప్ట్, లిబియా, యెమెన్, బహ్రెయిన్, సిరియా, అల్జీరియా, ఇరాక్, జోర్డాన్, కువైట్, మొరాకో, సూడాన్, ఒమన్, పశ్చిమ సహారాలను చుట్టుముట్టింది.
 
 ఈ సంచలనం వయ సు రెండేళ్లే. అయినా ఆ దేశాలలో కొన్ని ‘వసంతాగమనం’ పరిపూర్ణం కాలేదనీ, రెండో దశ వసంతకాలం అవసరమని భావిస్తున్నా యి. 1981లో అధికారం చేపట్టిన హోస్నీ ముబారక్‌ను ఈజిప్ట్ ప్రజలూ, సైన్యం తొల గించి, బ్రదర్‌హుడ్ అనుబంధ ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ మొర్సీని ఎన్నుకున్నారు. మళ్లీ ఆ ప్రజలూ, సైన్యం, ప్రతిపక్షాలే మొర్సీని తొలగించాయి. 33 ఏళ్ల క్రితం యెమెన్ అధికారం చేపట్టిన అలీ అబ్దుల్లా సలేని ఫిబ్రవరి 2012లో ప్రజలు గద్దెదించా రు. లిబియా నియంత గడ్డాఫీ 44 ఏళ్ల తరువాత అక్టోబర్ 2011లో అత్యంత విషాదకరంగా మరణించాడు.
 
 ఈజిప్ట్‌లో మొర్సీ పతనం ట్యునీసియా చేత ‘విప్లవ’ పరిపూర్ణత గురించి యోచించచేందుకు దోహదం చేసింది. ‘అరబ్ వసం తం’ మొదట అంకురించింది ట్యూనీసియాలోనే. ప్రజాసమస్యలు, దిగజారిన ఆర్థిక పరి స్థితి, అవినీతి, బంధుప్రీతి, నిరుద్యోగాలతో కొన్ని అరబ్ దేశాలు దుర్భరస్థితిని అనుభవి స్తున్నాయి. 1975-2005 మధ్య అరబ్ జనా భా 314 మిలియన్లకు చేరి, రెట్టింపయింది. కారణం దశాబ్దాలపాటు పాలకులు తిష్టవేసుకుని ఉండటమే. ‘అరబ్ వసంత’ వేళకే (2010 డిసెంబర్) ట్యునీసియా ఉద్యమబాటలో ఉంది. 1987లో జైనే ఎల్ అబిదైన్ బెన్ అలీ ట్యునీసియా అధికారం చేపట్టాడు. డిసెం బర్ 17, 2010న ట్యునీసియాలో సిది బౌజిద్ అనేచోట మహ్మద్ బౌజిజి అనే తోపుడు బండి వ్యాపారి నుంచి పళ్లను స్వాధీనం చేసుకుని పోలీసులు జప్తు చేశారు. మామూళ్లు ఇవ్వనందునే ఇదంతా జరిగిందని వార్తలు వచ్చాయి. ఇది భరించలేక ఆ చిరువ్యాపారి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అప్పటికే వీథులలోకి వచ్చిన ప్రజలు ఈ ఘటనతో ఉద్యమాన్ని తీవ్రం చేశారు. ఉద్యమం రాజధాని ట్యునిస్‌కు పాకిం ది. 2011 జవవరి14న అధ్యక్షుడు బెన్ అలీ సౌదీ అరేబియాకు పారిపోయాడు. తాత్కా లిక ప్రభుత్వం ఏర్పడింది. ట్యునీసియా జాతీయ పుష్పం మల్లెపువ్వు. కాబట్టి ఈ ఉద్యమానికి జాస్మిన్ రివల్యూషన్ (మల్లెల విప్ల వం) అని పేరు పెట్టారు. ఈ అల్లర్లలో 78 మంది చనిపోయారు.
 
 అక్టోబర్ 23,  2011న ట్యునీసియా తొలి సారి స్వేచ్ఛగా ఎన్నికలు జరుపుకుంది. ఇస్లామిస్ట్ మితవాద రాజకీయ పక్షం అల్ నహ్దా అధికారంలోకి వచ్చింది. అలీ ఎల్ అరీద్ అధికారంలోకి వ చ్చాడు.  మరో రెండు చిన్న సెక్యులర్ పార్టీలు -కాంగ్రెస్ ఫర్ ది రిపబ్లిక్ పార్టీ, బ్లాక్ ఫర్ లేబర్ అండ్ లిబర్టీస్-తో కలిపి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదే రాజ్యాంగ రచన బాధ్యతను కూడా చేపట్టింది. కొత్త ప్రభుత్వం బెన్ అలీ కాలం నాటి ఖైదీలను విడుదల చేసి, వంద రాజకీయ పార్టీలకు గుర్తింపునిచ్చింది. మీడియా మీద ఆంక్షలు తొలగించింది. రాజ్యాంగ చర్చలతో పాటు ఇవన్నీ జరుగు తూండగానే ప్రజాస్వామిక వ్యవస్థకు వ్యతిరేకులైన సలాఫిస్టులు (సలాఫిస్ట్ అన్సార్ అల్ షరియా ఉద్యమం. ఇది ఉగ్రవాద ఉద్యమం) వీథి పోరాటాలు మొదలుపెట్టారు. ఇవి బాగా విస్తరించి అల్ నహ్దా ప్రభుత్వ నేత అరీద్ వైదొలగాలన్న డిమాండ్‌కు ఊపు నిచ్చాయి. బెన్ అలీ దేశం విడిచి పారిపోయే నాటికి 13 శాతంగా ఉన్న నిరుద్యోగిత తరువాత 18 శాతానికి పెరిగిపోయింది.
 
 2012 నాటికి ఎనభైవేల మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు.ద్రవ్యోల్బణం ఆరు శాతం పెరిగింది. 2012 సంవత్సరంతో పోలిస్తే విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు 1.3 శాతానికి పడిపోయాయి. దీనార్ విలువ పడిపోయింది. ఇస్లామిస్ట్ మూవ్‌మెంట్ నుంచి వచ్చిన అరీద్‌ను దింపి, తటస్థనేతను దేశాధినేతను చేయాలని ఉద్యమకారులు కోరుతున్నారు. అంటే ఇస్లామిస్టులకు, సెక్యులరిస్టులకు వైరుధ్యాలు తీవ్రమైనాయి. వాస్తవానికి కొత్త ప్రభుత్వం ఈ అంశంతో పాటు చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నది. వివిధ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలతో వచ్చిన విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఈ అలజడుల మధ్యనే ఈ ఏడాది ఫిబ్రవరి 6న రాహోయి పార్టీ నాయకుడు చోక్రి బిలేడ్‌ను కాల్చి చంపారు. జూలై 25న వామపక్ష ప్రముఖుడు మహ్మద్ బ్రహ్మిని హత్య చేశారు. ఈ రెండు హత్యలు కూడా సలాఫిస్టుల పనేనని అనుమానాలు ఉన్నాయి.
 
 ట్యునీసియా  తిరుగుబాటు స్వచ్ఛమైన పాలన కోసం ఉద్దేశించినది. మత ఛాందస వర్గాలను అధికారానికి దూరంగా ఉంచే కృషి కూడా ఇందులో ఉంది. కానీ ప్రజలు సత్వర ఫలితాలను కోరుతున్నారు. ఇటీవల ‘క్రిస్టియన్ సైన్స్ మోనిటర్’ పత్రిక అరబ్బు వసం తం విఫలమైందా అని ప్రశ్నిస్తూ వ్యాసం ప్రచురించింది. నిజానికి చాలా మంది మేధావులు ఈ అభిప్రాయంతోనే ఉండవచ్చు. కానీ ఇది ప్రజాస్వామ్యానికి ఎదురుదెబ్బే గానీ, గొడ్డలిపెట్టు కాదు.
 - డా॥గోపరాజు నారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement