ఓఎన్‌జీసీ, రిలయన్స్ వంటి సంస్థలకు ఊరట
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు దిగివచి్చన నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి చేసే చమురుపై, విమాన ఇంధనం, డీజిల్, పెట్రోల్ ఎగుమతులపై దాదాపు రెండున్నరేళ్లుగా విధిస్తున్న విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను కేంద్రం తొలగించింది. అలాగే పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై విధిస్తున్న రహదారులు, మౌలిక సదుపాయాల సెస్సును కూడా ఉపసంహరించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం రాజ్యసభ ముందుంచారు.
దీనితో దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్‌జీసీ), ఆయిల్ ఇండియా వంటి సంస్థలకు, అలాగే ఎగుమతులు చేసే రిలయన్స్, నయారాలాంటి కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది. ఆయిల్ కంపెనీలకు వచ్చే అసాధారణ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తారు. 2022 జూలై 1న దేశీయంగా తొలిసారి దీన్ని విధించారు. ఆయిల్ బ్యారెల్‌ను 75 డాలర్లకు మించి ఎంత రేటుకు విక్రయించినా, వచ్చే ఆ లాభాలపై ప్రభుత్వం ఈ ట్యాక్స్‌ను విధిస్తూ వస్తోంది.
2022లో దేశీయంగా ఉత్పత్తి చేసే క్రూడాయిల్‌పై టన్నుకు రూ. 23,250 చొప్పున, ఎగుమతి చేసే పెట్రోల్ .. ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 6 చొప్పున, డీజిల్‌పై లీటరుకు రూ. 13 చొప్పున దీన్ని విధించింది. తద్వారా 2022–23లో రూ. 25,000 కోట్లు, 2023–24లో రూ. 13,000 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం రూ. 6,000 కోట్ల వరకు సమీకరించింది. దీన్ని ఎత్తివేయాలంటూ చాలాకాలంగా పరిశ్రమతో పాటు కేంద్ర పెట్రోలియం..సహజ వాయువు శాఖ లాబీయింగ్ చేస్తున్నాయి. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే క్రూడాయిల్ బాస్కెట్ రేటు సగటున 73.02 డాలర్ల స్థాయిలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment