
మన రాజ్యాంగం
భారత్‌కు స్వాతంత్య్రం తథ్యమని రెండో ప్రపంచ యుద్ధానంతర పరిస్థితులు తేల్చేశాయి. స్వాతంత్య్ర సమరం మాదిరిగానే రాజ్యాంగ నిర్మాణం కూడా ఒక సుదీర్ఘ ప్రయాణం. అది ఉత్తేజకరమైనది కూడా. స్వాతంత్య్రం ఇచ్చే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్ 1947 జూలై 18న చట్టం చేయడానికి చాలాముందే రాజ్యాంగ రచన నిర్ణయం జరిగింది. 1946లో వచ్చిన కేబినెట్ మిషన్ సిఫారసుల మేరకు రాజ్యాంగ రచన ఆరంభమయింది.
భారత్‌కు రాజ్యాంగం ఇవ్వాలన్న ఆలోచన 1895 నాటి ‘రాజ్యాంగ బిల్లు’లో కనిపిస్తుంది. ఆపై ఐదున్నర దశాబ్దాల తరువాతే భారత్‌కు రాజ్యాంగం అవతరించింది. దేశం గణతంత్ర రాజ్యమైంది. కాబట్టి మన రాజ్యాంగ రచనకు 130 ఏళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. దీనినే ‘స్వరాజ్ బిల్’ అని అంటారు. బ్రిటిష్ ఇండియాలో జాతీయవాదం పదునెక్కుతున్న తరుణంలో ఇలాంటి ప్రయత్నం జరిగింది.
ఇంతకీ భారత రాజ్యాంగ బిల్లు 1895 రూపకర్తలు ఎవరో తెలియదు. అనీబిసెంట్ అంచనా ప్రకారం ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించిన బాలగంగాధర తిలక్ కావచ్చు. అయితే, బ్రిటిష్ ఇండియా మనకు రాజ్యాంగం ఇవ్వలేదు. స్వతంత్ర భారతంలోనే అది సాధ్యమైంది. అనీబిసెంట్ 1925లో, సైమన్ కమిషన్ 1928లో వచ్చి వెళ్లిన తరువాత మోతీలాల్, జవహర్‌లాల్, తేజ్‌బహదూర్ సప్రూ సంఘం రాజ్యాంగం అందించేందుకు (నెహ్రూ నివేదిక) ప్రయత్నించింది.
1919 భారత ప్రభుత్వ చట్టం ఫలితాలను పరిశీలించి, రాజ్యాంగ సంస్కరణలను తీసుకురావడానికి నియమించినదే సైమన్ కమిషన్ (1928). ఇది భారతీయులను దారుణంగా పరిహాసం చేసింది. భారతదేశ రాజ్యాంగ సంస్కరణలపై సిఫారసులు చేయడానికి ఏడుగురు సభ్యులను ఇంగ్లండ్ నియమించింది. ఇందులో ఒక్క భారతీయుడు లేరు. ఫలితమే ‘సైమన్ ! గో బ్యాక్’ ఉద్యమం. తరువాత బ్రిటిష్ ప్రభుత్వ సవాలు మేరకు మోతీలాల్ నాయకత్వంలో అధినివేశ ప్రతిపత్తిని కోరుతూ (కామన్‌వెల్త్‌లో ఉంటూనే కొంత స్వయం అధికారం ఉండడం), రాజ్యాంగాన్ని కోరుతూ ఒక వినతిపత్రం తయారు చేశారు.
1909, 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు రాజ్యాంగ నిర్మాణానికి సోపానాలుగా ఉపకరించాయి. 1895 రాజ్యాంగ బిల్లు తరువాత దాదాపు నలభయ్యేళ్లకు 1934లో ఎం.ఎన్ . రాయ్ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఈ ఆలోచనను 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించినా, ఆరేళ్ల తరువాతే అది కార్యరూపం దాల్చింది. భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్ 1947 జూలై 18న చట్టం చేయడానికి చాలాముందే ఈ పరిణామం జరిగింది.
1946లో వచ్చిన కేబినెట్ మిషన్ సిఫారసుల మేరకు భారత రాజ్యాంగ రచనకు ప్రయత్నం ఆరంభమయింది. ఫలితంగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్‌లో ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు కూడా ఉన్నారు. మొదట 389 మంది సభ్యులు పరిషత్‌లో ఉన్నారు. అఖండ భారత్ పరిధితో జరిగే రాజ్యాంగ రచనను ముస్లింలకు ప్రత్యేక దేశం కోరుకున్న ముస్లింలీగ్ వ్యతిరేకించింది. ఆ సంస్థ సభ్యులు పరిషత్‌ను బహిష్కరించారు. తరువాత దేశ విభజన జరిగింది. ఫలితంగా పరిషత్ సభ్యుల సంఖ్య 299కి తగ్గింది.
వీరిలో 229 మంది బ్రిటిష్ ఇండియా నుంచి ఎన్నికయ్యారు. 70 మంది స్వదేశీ సంస్థానాలు నియమించిన వారు ఉన్నారు. మొదట పరిషత్ తాత్కాలిక చైర్మన్ గా సచ్చిదానంద సిన్హా ఎన్నికయ్యారు. తరువాత డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా హరీంద్రకుమార్ ముఖర్జీ, ముసాయిదా సంఘం అధ్యక్షుడిగా డా. బి.ఆర్. అంబేడ్కర్, రాజ్యాంగ వ్యవహారాల సలహాదారుగా బెనెగళ్ నరసింగరావు ఎన్నికయ్యారు.
1946 డిసెంబర్ 9న పరిషత్ మొదటి సమావేశం జరిగింది.
రెండేళ్ల పదకొండు నెలల పదిహేడు రోజులు పరిషత్ పని చేసింది. మొత్తం సమావేశాలు 11. ఇందుకైన ఖర్చు రూ. 64 లక్షలు. 22 అధ్యాయాలతో, 395 అధికరణలతో రాజ్యాంగం ఆవిర్భవించింది. 1950 జనవరి 24న ‘జనగణ మన’ను జాతీయ గీతంగా స్వీకరించారు. 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం వెనుక అక్షరాలా ఐదున్నర దశాబ్దాల చరిత్ర ఉంది.
1946 డిసెంబర్ 13న పరిషత్ తొలిసారిగా సమావేశమైంది. రాజ్యాంగ రచనకు లాంఛనంగా ఉపక్రమించింది. పరిషత్ లక్ష్యాలను నిర్దేశించే తీర్మానాన్ని జవహర్‌లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. రాజ్యాంగం ప్రధాన ధ్యేయం భారత్‌ను సర్వసత్తాక స్వతంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించడం. 1947 జనవరి 22న రాజ్యాంగ పరిషత్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. మొదటి సమావేశం తరువాత రాజ్యాంగంలో ఏయే అంశాలు ఉండాలో పరిశీలించడానికి కొన్ని సంఘాలను ఏర్పాటు చేశారు.
ప్రాథమిక హక్కులు, మైనారిటీల వ్యవహారాల సలహా సంఘం, కేంద్ర అధికారాల నిర్ణాయక సంఘం వంటివి! అవన్నీ వాటి నివేదికలను 1947 ఏప్రిల్, ఆగస్ట్ నెలల మధ్య సమర్పించాయి. అన్ని అంశాల మీద 1947 ఆగస్ట్ 30న చర్చ ముగిసింది. ఈ సంఘాలు ఇచ్చిన నివేదికలు, వాటిపై జరిగిన చర్చల సారాంశం అధారంగా రాజ్యాంగ పరిషత్ సలహాదారు బి.ఎన్ .రావ్ ఒక ముసాయిదాను తయారు చేశారు. 1947 అక్టోబర్‌లో ఈ పని పూర్తి చేసి, రాజ్యాంగ ముసాయిదా సంఘానికి సమర్పించారు. దీనిపై ముసాయిదా సంఘం నెలల తరబడి చర్చించి, తుది ముసాయిదాను రూపొందించి, 1948 ఫిబ్రవరి 21 నాటికి రాజ్యాంగ పరిషత్ చైర్మన్‌కు సమర్పించింది.
తరువాత తుది ముసాయిదాను అచ్చు వేయించి ప్రజలకు, మేధావులకు అందుబాటులో ఉంచారు. చాలా వ్యాఖ్యలు, విమర్శలు, సలహాలు, సూచనలు వచ్చాయి. వీటన్నింటినీ కేంద్ర, ప్రాంత రాజ్యాంగ కమిటీలు పరిశీలించాయి. వీటి మీద 1948 అక్టోబర్ 23, 24, 27 తేదీలలో పరిషత్ చర్చలు జరిపింది. తరువాత 1948 అక్టోబర్ 26న ముసాయిదాను మరోసారి ముద్రించారు. ముసాయిదా మీద రెండోసారి కూడా 1949 అక్టోబర్ 17 వరకు చర్చ జరిగింది.
ఈ దశలోనే రాజ్యాంగ సవరణకు చాలా సూచనలు వచ్చాయి. కానీ వాటిలో ఎక్కువ సవరణలను పరిషత్ తిరస్కరించింది. స్వీకరించిన కొన్ని సూచనలు, సవరణల కోసం మళ్లీ చర్చలు జరిపారు. సవరించిన కొత్త రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 3న రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడికి అందించారు. అంతిమంగా 1949 నవంబర్ 14న రాజ్యాంగ పరిషత్ ఆమోదం కోసం ప్రవేశపెట్టారు.
తరువాత 1949 నవంబర్ 26న మూడోసారి కూడా చదవడం, చర్చించడం పూర్తి చేశారు. అంతకు ముందే రాజ్యాంగ ఆమోదం కోసం డాక్టర్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పరిషత్ ఆమోదించింది. ఆమోదం పొందిన రాజ్యాంగం మీద 1950 జనవరి 24న సభ్యులంతా సంతకాలు చేశారు. రెండు రోజుల తరువాత 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
అయితే, భారత రాజ్యాంగం సుదీర్ఘం, న్యాయవాదుల స్వర్గం అంటూ ప్రతికూల వ్యాఖ్య వచ్చింది. ఆ వ్యాఖ్య చేసినవాడు ఐవర్ జెన్నింగ్స్. ఏడుగురు సభ్యులతో 1947 ఆగస్ట్ 29న ముసాయిదా సంఘాన్ని ఎన్నుకున్నారు. వారిలో అంబేడ్కర్ ఒకరు. కానీ సంఘం అధ్యక్షునిగా నెహ్రూ జెన్నింగ్స్‌ను ప్రతిపాదించారు. చివరికి గాంధీజీ అభిప్రాయం మేరకు అంబేడ్కర్ చైర్మన్ అయ్యారు. ఒకటి వాస్తవం. భిన్న జాతులు, సంస్కృతులు, భాషలు ఉన్న భారత్ ఐక్యంగా పురోగమించడానికి అంతస్సూత్రంగా పనిచేస్తున్నది భారత రాజ్యాంగమే!
-డాక్టర్ గోపరాజు నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment