Goparaju Narayana Rao
-
ఐదున్నర దశాబ్దాల శ్రమ
భారత్‌కు స్వాతంత్య్రం తథ్యమని రెండో ప్రపంచ యుద్ధానంతర పరిస్థితులు తేల్చేశాయి. స్వాతంత్య్ర సమరం మాదిరిగానే రాజ్యాంగ నిర్మాణం కూడా ఒక సుదీర్ఘ ప్రయాణం. అది ఉత్తేజకరమైనది కూడా. స్వాతంత్య్రం ఇచ్చే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్ 1947 జూలై 18న చట్టం చేయడానికి చాలాముందే రాజ్యాంగ రచన నిర్ణయం జరిగింది. 1946లో వచ్చిన కేబినెట్ మిషన్ సిఫారసుల మేరకు రాజ్యాంగ రచన ఆరంభమయింది.భారత్‌కు రాజ్యాంగం ఇవ్వాలన్న ఆలోచన 1895 నాటి ‘రాజ్యాంగ బిల్లు’లో కనిపిస్తుంది. ఆపై ఐదున్నర దశాబ్దాల తరువాతే భారత్‌కు రాజ్యాంగం అవతరించింది. దేశం గణతంత్ర రాజ్యమైంది. కాబట్టి మన రాజ్యాంగ రచనకు 130 ఏళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. దీనినే ‘స్వరాజ్ బిల్’ అని అంటారు. బ్రిటిష్ ఇండియాలో జాతీయవాదం పదునెక్కుతున్న తరుణంలో ఇలాంటి ప్రయత్నం జరిగింది. ఇంతకీ భారత రాజ్యాంగ బిల్లు 1895 రూపకర్తలు ఎవరో తెలియదు. అనీబిసెంట్ అంచనా ప్రకారం ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించిన బాలగంగాధర తిలక్ కావచ్చు. అయితే, బ్రిటిష్ ఇండియా మనకు రాజ్యాంగం ఇవ్వలేదు. స్వతంత్ర భారతంలోనే అది సాధ్యమైంది. అనీబిసెంట్ 1925లో, సైమన్ కమిషన్ 1928లో వచ్చి వెళ్లిన తరువాత మోతీలాల్, జవహర్లాల్, తేజ్‌బహదూర్ సప్రూ సంఘం రాజ్యాంగం అందించేందుకు (నెహ్రూ నివేదిక) ప్రయత్నించింది.1919 భారత ప్రభుత్వ చట్టం ఫలితాలను పరిశీలించి, రాజ్యాంగ సంస్కరణలను తీసుకురావడానికి నియమించినదే సైమన్ కమిషన్ (1928). ఇది భారతీయులను దారుణంగా పరిహాసం చేసింది. భారతదేశ రాజ్యాంగ సంస్కరణలపై సిఫారసులు చేయడానికి ఏడుగురు సభ్యులను ఇంగ్లండ్ నియమించింది. ఇందులో ఒక్క భారతీయుడు లేరు. ఫలితమే ‘సైమన్ ! గో బ్యాక్’ ఉద్యమం. తరువాత బ్రిటిష్ ప్రభుత్వ సవాలు మేరకు మోతీలాల్ నాయకత్వంలో అధినివేశ ప్రతిపత్తిని కోరుతూ (కామన్వెల్త్లో ఉంటూనే కొంత స్వయం అధికారం ఉండడం), రాజ్యాంగాన్ని కోరుతూ ఒక వినతిపత్రం తయారు చేశారు. 1909, 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు రాజ్యాంగ నిర్మాణానికి సోపానాలుగా ఉపకరించాయి. 1895 రాజ్యాంగ బిల్లు తరువాత దాదాపు నలభయ్యేళ్లకు 1934లో ఎం.ఎన్ . రాయ్ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఈ ఆలోచనను 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించినా, ఆరేళ్ల తరువాతే అది కార్యరూపం దాల్చింది. భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్ 1947 జూలై 18న చట్టం చేయడానికి చాలాముందే ఈ పరిణామం జరిగింది. 1946లో వచ్చిన కేబినెట్ మిషన్ సిఫారసుల మేరకు భారత రాజ్యాంగ రచనకు ప్రయత్నం ఆరంభమయింది. ఫలితంగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్‌లో ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు కూడా ఉన్నారు. మొదట 389 మంది సభ్యులు పరిషత్‌లో ఉన్నారు. అఖండ భారత్ పరిధితో జరిగే రాజ్యాంగ రచనను ముస్లింలకు ప్రత్యేక దేశం కోరుకున్న ముస్లింలీగ్ వ్యతిరేకించింది. ఆ సంస్థ సభ్యులు పరిషత్‌ను బహిష్కరించారు. తరువాత దేశ విభజన జరిగింది. ఫలితంగా పరిషత్ సభ్యుల సంఖ్య 299కి తగ్గింది. వీరిలో 229 మంది బ్రిటిష్ ఇండియా నుంచి ఎన్నికయ్యారు. 70 మంది స్వదేశీ సంస్థానాలు నియమించిన వారు ఉన్నారు. మొదట పరిషత్ తాత్కాలిక చైర్మన్ గా సచ్చిదానంద సిన్హా ఎన్నికయ్యారు. తరువాత డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా హరీంద్రకుమార్ ముఖర్జీ, ముసాయిదా సంఘం అధ్యక్షుడిగా డా. బి.ఆర్. అంబేడ్కర్, రాజ్యాంగ వ్యవహారాల సలహాదారుగా బెనెగళ్ నరసింగరావు ఎన్నికయ్యారు.1946 డిసెంబర్ 9న పరిషత్ మొదటి సమావేశం జరిగింది. రెండేళ్ల పదకొండు నెలల పదిహేడు రోజులు పరిషత్ పని చేసింది. మొత్తం సమావేశాలు 11. ఇందుకైన ఖర్చు రూ. 64 లక్షలు. 22 అధ్యాయాలతో, 395 అధికరణలతో రాజ్యాంగం ఆవిర్భవించింది. 1950 జనవరి 24న ‘జనగణ మన’ను జాతీయ గీతంగా స్వీకరించారు. 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం వెనుక అక్షరాలా ఐదున్నర దశాబ్దాల చరిత్ర ఉంది.1946 డిసెంబర్ 13న పరిషత్ తొలిసారిగా సమావేశమైంది. రాజ్యాంగ రచనకు లాంఛనంగా ఉపక్రమించింది. పరిషత్ లక్ష్యాలను నిర్దేశించే తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. రాజ్యాంగం ప్రధాన ధ్యేయం భారత్‌ను సర్వసత్తాక స్వతంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించడం. 1947 జనవరి 22న రాజ్యాంగ పరిషత్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. మొదటి సమావేశం తరువాత రాజ్యాంగంలో ఏయే అంశాలు ఉండాలో పరిశీలించడానికి కొన్ని సంఘాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక హక్కులు, మైనారిటీల వ్యవహారాల సలహా సంఘం, కేంద్ర అధికారాల నిర్ణాయక సంఘం వంటివి! అవన్నీ వాటి నివేదికలను 1947 ఏప్రిల్, ఆగస్ట్ నెలల మధ్య సమర్పించాయి. అన్ని అంశాల మీద 1947 ఆగస్ట్ 30న చర్చ ముగిసింది. ఈ సంఘాలు ఇచ్చిన నివేదికలు, వాటిపై జరిగిన చర్చల సారాంశం అధారంగా రాజ్యాంగ పరిషత్ సలహాదారు బి.ఎన్ .రావ్ ఒక ముసాయిదాను తయారు చేశారు. 1947 అక్టోబర్‌లో ఈ పని పూర్తి చేసి, రాజ్యాంగ ముసాయిదా సంఘానికి సమర్పించారు. దీనిపై ముసాయిదా సంఘం నెలల తరబడి చర్చించి, తుది ముసాయిదాను రూపొందించి, 1948 ఫిబ్రవరి 21 నాటికి రాజ్యాంగ పరిషత్ చైర్మన్‌కు సమర్పించింది.తరువాత తుది ముసాయిదాను అచ్చు వేయించి ప్రజలకు, మేధావులకు అందుబాటులో ఉంచారు. చాలా వ్యాఖ్యలు, విమర్శలు, సలహాలు, సూచనలు వచ్చాయి. వీటన్నింటినీ కేంద్ర, ప్రాంత రాజ్యాంగ కమిటీలు పరిశీలించాయి. వీటి మీద 1948 అక్టోబర్ 23, 24, 27 తేదీలలో పరిషత్ చర్చలు జరిపింది. తరువాత 1948 అక్టోబర్ 26న ముసాయిదాను మరోసారి ముద్రించారు. ముసాయిదా మీద రెండోసారి కూడా 1949 అక్టోబర్ 17 వరకు చర్చ జరిగింది. ఈ దశలోనే రాజ్యాంగ సవరణకు చాలా సూచనలు వచ్చాయి. కానీ వాటిలో ఎక్కువ సవరణలను పరిషత్ తిరస్కరించింది. స్వీకరించిన కొన్ని సూచనలు, సవరణల కోసం మళ్లీ చర్చలు జరిపారు. సవరించిన కొత్త రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 3న రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడికి అందించారు. అంతిమంగా 1949 నవంబర్ 14న రాజ్యాంగ పరిషత్ ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. తరువాత 1949 నవంబర్ 26న మూడోసారి కూడా చదవడం, చర్చించడం పూర్తి చేశారు. అంతకు ముందే రాజ్యాంగ ఆమోదం కోసం డాక్టర్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పరిషత్ ఆమోదించింది. ఆమోదం పొందిన రాజ్యాంగం మీద 1950 జనవరి 24న సభ్యులంతా సంతకాలు చేశారు. రెండు రోజుల తరువాత 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.అయితే, భారత రాజ్యాంగం సుదీర్ఘం, న్యాయవాదుల స్వర్గం అంటూ ప్రతికూల వ్యాఖ్య వచ్చింది. ఆ వ్యాఖ్య చేసినవాడు ఐవర్ జెన్నింగ్స్. ఏడుగురు సభ్యులతో 1947 ఆగస్ట్ 29న ముసాయిదా సంఘాన్ని ఎన్నుకున్నారు. వారిలో అంబేడ్కర్ ఒకరు. కానీ సంఘం అధ్యక్షునిగా నెహ్రూ జెన్నింగ్స్‌ను ప్రతిపాదించారు. చివరికి గాంధీజీ అభిప్రాయం మేరకు అంబేడ్కర్ చైర్మన్ అయ్యారు. ఒకటి వాస్తవం. భిన్న జాతులు, సంస్కృతులు, భాషలు ఉన్న భారత్ ఐక్యంగా పురోగమించడానికి అంతస్సూత్రంగా పనిచేస్తున్నది భారత రాజ్యాంగమే!-డాక్టర్ గోపరాజు నారాయణరావు -
కాలం చెక్కిలిపై.. చెరగని కన్నీటి చారిక!
శతాబ్దాల బానిస గతానికి స్వతంత్రం అంతం పలికింది. భారత భవితవ్యానికి మాత్రం దేశ విభజన సవాళ్లు విసిరింది. స్వాతంత్య్రం కొరకు పోరాడిన వారు అంటూ చిరకాలంగా కొన్ని కుటుంబాలనే భారతీ యులు ఆరాధించారు. విభజన విషాదంలో అకారణంగా కన్ను మూసి, అందరినీ పోగోట్టుకుని, స్వాతంత్య్రోద్యమ సంబరాలు ఎరుగని వారినీ ఇప్పుడు తలుచుకోవాలని అనుకుంటున్నాం. దేశ విభజన విషాదాల సంస్మరణ దినం (ఆగస్ట్ 14) అందుకు అవకాశం ఇస్తున్నది.స్వాతంత్య్ర సమరంలోని చాలా ఘట్టాలు చరిత్ర పుటలకు చేరనట్టే, విభజన విషాదమూ మరుగున ఉండిపోయింది. కేవలం తేదీలు, కారణాలు, ఫలితాల దృష్టి నుంచి సాగే చరిత్ర రచన కంటే, చరిత్రకు ఛాయ వంటి సృజనాత్మక సాహిత్యమే విభజన విషాదాన్ని గుర్తు చేసే బాధ్యతను ఎక్కువగా స్వీకరించింది. ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదలు నిన్న మొన్నటి జస్వంత్ సింగ్ వరకూ తమ పుస్తకాలలో చరిత్రగా విభజన గాథను విశ్లేషించారు. నవల, కవిత, కథ, నాటక ప్రక్రియలు విభజన విషాదాన్ని ఆవిష్కరించిన తీరూ స్మరణీయమే.భీష్మ సహానీ ‘తమస్’ (అంధ కారం) విభజన కాలాన్ని చర్చించిన నవలా సాహిత్యంలో మకుటాయమానమైనదనిపిస్తుంది. విభజనకు కారణం మతమా? మత రాజకీయమా అన్నది చర్చించారాయన. చల్లారుతున్న మతోద్రిక్తతలు పంది కళే బరం మసీదు మెట్ల మీద కనిపించడం వల్ల తిరిగి భగ్గు మనడం ఇందులో ఇతివృత్తం. ఇంతకీ నాథూ అనే తోళ్ల కార్మికుడికి, పారిశుద్ధ్య కార్మికుడికి మాయమాటలు చెప్పి మురాద్ అలీ అనే వ్యాపారి చేయించిన పని ఇది. భారత జాతీయ కాంగ్రెస్ నాయకుల గిల్లికజ్జాలు, పోలీసు ఉన్నతాధికారిగా ఉన్న ఆంగ్లేయుడు దేశం వీడు తున్న క్షణంలోనూ ప్రదర్శించిన ‘విభజించి పాలించు’ బుద్ధినీ కూడా ఇందులో పరిచయం చేశారాయన.చివరికి శాంతియాత్రకు మురాద్ అలీ ముందు ఉండడం పెద్ద మలుపు. ఈ నవలను డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెనిగించారు. మహిళల మీద విభజన చేసిన దాడిని చాలామంది వర్ణించారు. అమృతాప్రీతమ్ నవల ‘పింజర్’ (అస్తిపంజరం) వాటిలో ప్రత్యేకమైనది. పెళ్లి నిశ్చయమైన పూరో అనే హిందూ యువతిని రషీద్ అనే ముస్లిం యువకుడు అపహరించడం ఇందులో కీలకం. ఆమె తప్పించుకు వచ్చినా తల్లిదండ్రులు స్వీకరించ డానికి నిరాకరి స్తారు. మతం మారి రషీద్‌నే ఆమె పెళ్లి చేసుకుంటుంది. చివరికి ఆమె అవసరమే పుట్టింటివారికి వస్తుంది.స్వాతంత్య్రోద్యమం, దాని ఫల శ్రుతి వేర్వేరేనని గుర్తించాలన్నట్టు విభజన గాథలను వివరించేందుకు రైలు ప్రయాణాలను పలు వురు తమ ఇతివృత్తాలకు నేప థ్యంగా స్వీకరించారనిపిస్తుంది. వాటిలో ప్రముఖమై నది ‘ట్రెయిన్ టు పాకిస్తాన్’. కుష్వంత్ సింగ్ ఈ నవలను జుగ్గు (సిక్కు), నురాన్ (ముస్లిం)ల ప్రేమ వ్యవహారంతో ముడిపెట్టి అల్లారు. ముస్లిం శరణార్థులతో పాకిస్తాన్ వెళుతున్న రైలును కొందరు హిందువులు, సిక్కులు తగలబెడితే అందులో నుంచి నురాన్ను జుగ్గు రక్షిస్తాడు. భారత్ నుంచి ముస్లింల శవాలతో, వక్షోజాలు నరికిన మహిళల శరీరాలతో పాకిస్తాన్‌కు రైలు రావడం బప్సి సిధ్వా నవల ‘ఐస్‌క్యాండీ మ్యాన్’లో మలుపు.గుల్జార్ రాసిన ‘రావి నదికి ఆవల’ కథ విభజనతో భారత ఉపఖండం ఆత్మను కోల్పోయిన వైనం ఉంది. ఇది కూడా రైలు ప్రయాణం నేపథ్యంగానే సాగుతుంది. ఆయనదే ‘భయం’ (కావూఫ్) కథలో యాసిన్ అనే ముస్లిం యువకుడు లోకల్ ట్రైన్లో పొందిన వింత అనుభవం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఒక స్టేషన్లో మరో యువకుడు ఎక్కాడు. అతడు హిందువులా కనిపించాడు. అతడితో తనకు ప్రాణహాని తప్పదని రైలు భయాందర్ వంతెన మీదకు వచ్చాక గుమ్మం దగ్గర ఆదమరచి ఉన్న ఆగంతకుడిని యాసిన్ బయ టకు నెట్టేశాడు.మరుక్షణం ఒక ఆక్రందన ‘అల్లా’ అంటూ! భీష్మ సహానీ రాసిన ‘రైలు అమృత్సర్ చేరింది’ కథ కూడా పట్టాల మీద నడిచిన అనుభవమే. పాకిస్తాన్ నుంచి భారత్ వస్తున్న ఒక హిందూ శరణార్థిని (బాబు) ముస్లింలు ఏడిపిస్తారు. వాళ్లు మధ్యలో దిగిపోతారు. ఇతడు మాత్రం రైలు భారత్‌లో ప్రవేశించాక అంతదాకా అణచి ఉంచుకున్న కోపాన్ని ఇక్కడ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న ముస్లిం మీద చూపిస్తాడు. అంతకు ముందే దాచి పెట్టిన ఇనప రాడ్‌తో తల బద్దలు కొడతాడు. పెషావర్–బొంబాయి మధ్యలో జరి గిన హిందూ ముస్లిం హింసాకాండ దృశ్యాలను కిషన్ చందర్ తన కథ ‘పెషావర్ ఎక్స్‌ప్రెస్’ కథలో అక్షర బద్ధం చేశారు. ఆ దారిలో రైలు ఆగిన ప్రతి స్టేషన్ రక్త పాతంతోనే కనిపిస్తుంది. ఒక చోట స్త్రీలను నగ్నంగా ఊరేగించడం కూడా కనిపిస్తుంది. గతంలోని కక్షలను వెలికి తీసి మరీ పరస్పరం దాడులకు దిగారు. పింజ ర్లో పూరోను రషీద్ ఎత్తుకుపోవడానికి కారణం, రెండు మూడు తరాల క్రితం ఆ ముస్లిం కటుంబం నుంచి ఒక మహిళను రుణం గొడవలో పూరో తాతలు ఎవరో అపహరించారు.ముస్లిం లీగ్ వైఖరి కారణంగానే విభజన జరిగిందన్నది నిజం. కానీ ఆ పరిణామాన్ని జీర్ణించుకోలేక పోయినవారు అన్ని వర్గాలలోను ఉన్నారు. సాదత్ హసన్ మంటో రాసిన ‘టోబా టేక్సింగ్’ కథకు ఇతివృత్తం ఇదే. రెండు మతాల వారిని రెండు దేశాలు పంచుకున్నట్టే మతిస్థిమితం లేనివారిని కూడా పంచు కుంటారు. కానీ లాహోర్ పిచ్చాసుపత్రిలో ఉన్న టోబా టేక్సింగ్ను భారత్‌కు అప్పగిస్తున్నప్పుడు అతడు వాఘా సరిహద్దులో సగం పాక్ వైపు, సగం భారత్ వైపు తన దేహం ఉండేలా పడి మరణిస్తాడు.విభజన నిర్ణయం తరువాత సరిహద్దు రేఖ గీయ డానికి వచ్చినవాడు సెరిల్ రాడ్‌క్లిఫ్. కేవలం ఐదువారా లలో అతడు ఆ పని ముగించాడు. కానీ రేఖ మీద నెత్తుటి తడి ఏడు దశాబ్దాలైనా ఆరలేదు. ఆ పరిణామం ఎంతటి పాశవికతకు దారి ఇచ్చిందో అమెరికా కవి డబ్ల్యూ హెచ్ ఎడెన్ ‘పార్టిషన్’ పేరుతో రాసిన తన కవితలో నిక్షిప్తం చేశాడు. ‘డ్రాయింగ్ ది లైన్’ పేరుతో రాడ్‌క్లిఫ్ చర్యనే నాటకంగా మలిచాడు బ్రిటిష్ రచయిత హోవార్డ్ బెంటన్. దీనిని 2013లోనే ప్రదర్శించారు. భారత విభజన ప్రపంచ చరిత్రలోనే విషాద కరమైనదిగా చెప్పడం సత్యదూరం కాదు. విభజన మూల్యం 20 లక్షల ప్రాణాలు. కోటీ నలభై ల„ý లు లేదా కోటీ ఎనభై లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇది ఇప్పటికి దొరికిన లెక్క. ఇందులో స్త్రీల దుఃఖం మరీ ఘోరమైనది. ఊర్వశీ బుటాలియా విభజన వేళ స్త్రీ పడిన వేదనను, క్షోభను, గుండె కోతను అన్వేషించారు. చాలాకాలం వరకు 75 వేల మంది మహిళలు విభజనకు బాధితులని అనుకున్నారు. కానీ లక్షమంది స్త్రీలను బలి చేశారని, ‘ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్’ పుస్తకంలో రాశారు.ఇన్ని కోట్ల మంది బాధితులలో ప్రతి ఒక్కరికీ ఒక విషాద గాథ ఉంది. ప్రతి కన్నీటి బొట్టుకు ఒక కథ ఉంది. నెలల తరబడి సాగిన ఈ హత్యాకాండలో చలికీ, వానకీ, ఎండకీ, మతోన్మాదానికీ, ఆకలికీ సరిహద్దుల వెంట రాలిపోయిన ప్రతి ప్రాణం ఒక నవలకు ఇతివృత్తం కాగలినదే. ఉన్మాదుల నుంచి రక్షణ కోసం గురుద్వారా వెనుక బావులలో పిల్లలతో సహా దూకేసిన వందలాది మంది మహిళల గుండె ఆక్రోశాన్ని, చావును సమీపంగా చూసిన పసి ఆక్రందనలను ఇప్పుడైనా గమ నించాలి. అందుకే ఆ గ్రంథాల వెల్లువ. మానవతను అతి హీనంగా ఛిద్రం చేస్తూ కాలం కల్పించే దుస్సంఘ టనల్లో దేశ విభజన కూడా ఒకటి!– డా. గోపరాజు నారాయణరావు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆ తడబాటుతోనే ఈ ఎడబాటు..
శతాబ్దాల పాటు విదేశీ పాలనలో సర్వం కోల్పోయిన జాతి మేల్కొని స్వాతంత్య్రం సాధించుకోవడం చరిత్రాత్మకమే! భారత స్వాతంత్య్రోద్యమం ప్రధానంగా అహింసాయుతంగా సాగినా, స్వరాజ్యం రక్తపుటడుగుల మీదనే వచ్చిందన్న సత్యం దాచకూడనిది. స్వాతంత్య్రం, దేశ విభజన ఏకకాలంలో జరిగాయి. నాటి హింసకు ఇరవై లక్షల మంది బలయ్యారు. కోటీ నలభయ్ లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారత విభజన ప్రపంచ చరిత్రలోనే అత్యంత రక్తపాతంతో కూడిన ఘటనగా నమోదైంది.విస్మరించలేని వాస్తవాలు స్వాతంత్య్ర సమరంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రస్థానంలో నిలిచిన సంగతితో పాటు గిరిజన, రైతాంగ పోరాటాలు, విదేశీ గడ్డ మీద నుంచి జరిగిన ఆందోళనలు, తీవ్ర జాతీయవాదులు సాగించిన ఉద్యమాలు, బ్రిటిష్ ఇండియా చట్టసభలలో ప్రవేశించిన భారతీయ మేధావులు నాటి చట్టాలను దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మలచడానికి చేసిన కృషి విస్మరించలేనివి. అటవీ చట్టాల బాధతో కొండకోనలలో ప్రతిధ్వనించిన గిరిజనుల ఆర్తనాదాలు, అండమాన్ జైలు గోడలు అణచివేసిన దేశభక్తుల కంఠశోష ఇప్పటికైనా వినడం ధర్మం.విభజన సృష్టించిన హింసాకాండ..రెండో ప్రపంచయుద్ధం ప్రారంభమైన రెండేళ్లకే వలసల నుంచి ఇంగ్లండ్ వైదొలగడం అవసరమన్న అభిప్రాయం ఆ దేశ నేతలలో బలపడింది. ఆ నేపథ్యంలోనే 1942 నాటి క్విట్ ఇండియా ఘట్టం భారత్ స్వాతంత్య్రోద్యమాన్ని చివరి అంకంలోకి ప్రవేశపెట్టింది. ‘భారత్‌ను విడిచి వెళ్లండి!’ అన్నది భారత జాతీయ కాంగ్రెస్ నినాదం. ‘భారత్‌ను విభజించి వెళ్లండి!’ అన్నది ముస్లిం లీగ్ సూత్రం. ఇదే ప్రతిష్టంభనను సృష్టించింది. స్వాతంత్య్రం రావడానికి సరిగ్గా సంవత్సరం ముందు (16 ఆగస్ట్ 1946) ముస్లిం లీగ్ ఇచ్చిన ‘ప్రత్యక్ష చర్య’ పిలుపు, పర్యవసానాలు ఆ ప్రతిష్టంభనకు అవాంఛనీయమైన ముగింపును ఇచ్చాయి. భారత్‌లో అంతర్యుద్ధం తప్పదన్న భయాలు ఇంగ్లండ్‌కు కలిగించిన పరిణామం కూడా అదే! అంతర్యుద్ధం అనుమానం కాదు, నిజమేనని పంజాబ్ ప్రాంత ప్రముఖుడు మాస్టర్ తారాసింగ్ ప్రకటించారు.అటు పంజాబ్లోను, ఇటు బెంగాల్లోను మతఘర్షణలు తారస్థాయికి చేరాయి. ఈ దృశ్యానికి పూర్తి భిన్నమైన చిత్రం మరొకటి ఉంది. 1946లో జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ భాగస్వాములుగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం విభేదాలతో సతమతమవుతున్నది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో విభజన ప్రయత్నాలు శరవేగంగా జరిగాయి. భారత స్వాతంత్య్రానికి 1947 ఫిబ్రవరి 20న లేబర్ పార్టీ ప్రధాని క్లెమెంట్ అట్లీ ముహూర్తం ఖరారు చేశాడు. 1947 మార్చి 5న బ్రిటిష్ పార్లమెంట్లో చర్చ జరిగింది. నిజానికి అది భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే అంశం కాదు. ఉపఖండ విభజన గురించి. ఫిబ్రవరి 20 నాటి ప్రకటన ప్రకారం 1948 జూన్ మాసాంతానికి భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలి. కానీ ఆ ఘట్టాన్ని 11 మాసాల ముందుకు తెచ్చినవాడు లార్డ్ లూయీ మౌంట్‌బాటన్ , ఆఖరి వైస్రాయ్. ఈ తడబాటే, ఈ తొందరపాటే ఉపఖండాన్ని నెత్తురుటేరులలో ముంచింది.గాంధీజీకి నెరవేరని కోరిక..విభజన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాడన్న నెపంతో 1947 ఫిబ్రవరిలో వైస్రాయ్ వేవెల్ను వెనక్కి పిలిపించి, 1947 మార్చి 22న మౌంట్‌బాటన్ ను పంపించారు. భారత్ విభజనను ఆగమేఘాల మీద పూర్తి చేసేందుకే మౌంట్‌బాటన్ ను నియమించారు. ఈ దశలోనే గాంధీజీకీ, జాతీయ కాంగ్రెస్‌కూ మధ్య ‘మౌన’సమరం మొదలయింది. ‘విభజనను కాంగ్రెస్ ఆమోదిస్తే అది నా శవం మీద నుంచే జరగాలి’ అని మౌలానా అబుల్ కలాం ఆజాద్‌తో గాంధీజీ వ్యాఖ్యానించినా దాని ప్రభావం కనిపించలేదు. 1947 మేలో మౌంట్‌బాటన్ విభజన ప్రణాళికను కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ల ముందు పెట్టాడు. ఇది స్వదేశీ సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చింది. దీనిని మొదట నెహ్రూ వ్యతిరేకించినా, తరువాత అంగీకరించారు. స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితులలో 565 సంస్థానాలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారాన్ని విభజన ప్రణాళిక ఇచ్చింది.గాంధీజీ లేకుండానే విభజన నిర్ణయం..1947 జూన్ 3న మౌంట్‌బాటన్ భారత్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, విభజన గురించి ప్రకటించారు. కేవలం తొమ్మిది మంది సమక్షంలో విభజన నిర్ణయం ఖరారైంది. నెహ్రూ, పటేల్, జేబీ కృపలానీ (కాంగ్రెస్), జిన్నా, లియాఖత్ అలీ ఖాన్ (లీగ్) బల్దేవ్సింగ్ తదితరులు మాత్రమే ఉన్నారు. ఈ కీలక సమావేశంలో గాంధీజీ లేని సంగతి గమనించాలి. మౌంట్‌బాటన్ పథకానికే 1947 జూలై 5న ఇంగ్లండ్ సింహాసనం ఆమోదముద్ర వేసింది. మూడు రోజుల తరువాత బ్రిటిష్ పార్లమెంట్ అంగీకారం తెలియచేసింది. ఆగస్ట్ 15వ తేదీకి ఐదు వారాల ముందు 1947 జూలై 8న సరిహద్దు కమిషన్ ఆ పని ఆరంభించింది. కాంగ్రెస్, లీగ్‌ల నుంచి చెరొక నలుగురు సభ్యులుగా ఉన్నారు. సర్ సిరిల్ జాన్ రాడ్‌క్లిఫ్ ఆ కమిషన్ అధ్యక్షుడు. భారతదేశం గురించి ఏమాత్రం అవగాహన లేనివాడని ఆయన మీద ఆరోపణ. కాలదోషం పట్టి మ్యాపుల ఆధారంగా విభజన రేఖలు వచ్చాయి. బెంగాల్, పంజాబ్‌ల విభజనకు కూడా కమిషన్ లు ఏర్పడినాయి.ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పటేల్, మేనన్..యూనియన్ జాక్ దిగితే భారత్‌కు సార్వభౌమాధికారం వస్తుంది. కానీ సంస్థానాలు స్వయం నిర్ణయం తీసుకుంటే కొత్త సార్వభౌమాధికారానికి పెను సవాలు ఎదురవుతుంది. ఈ ప్రమాదాన్ని సకాలంలో గుర్తించిన వారు సర్దార్ పటేల్, బ్రిటిష్ ఇండియాలో రాష్ట్రాల వ్యవహారాల ఇన్ చార్జ్ వీపీ మేనన్ . ఆ సమస్యను పరిష్కరించినవారూ వారే! దేశం మీద స్వతంత్ర భారత పతాకం ఎగిరే నాటికే కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని సంస్థానాలను వారు భారత యూనియన్ లోకి తేగలిగారు. ఇది స్వతంత్ర భారతావని భవిష్యత్తును తీర్చిదిద్దిన నిర్మాణాత్మక ఘట్టం. సాంస్కృతిక ఐక్యతకు రాజకీయ ఐక్యతను జోడిరచిన పరిణామం. 1947 ఆగస్ట్ 15న భారత్ స్వతంత్ర దేశమైంది. – డాక్టర్ గోపరాజు నారాయణరావు -
గుజరాత్, హిమాచల్ ఫలితాలు; వాస్తవాలు గ్రహించాల్సింది ఎవరు?
డిసెంబర్ 8న వెలువడిన గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వివిధ కోణాల నుంచి చారిత్రకంగా విశేష ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఆ రాష్ట్ర చరిత్రలో ఒకే రాజకీయ పార్టీకి 156 శాసనసభ స్థానాలు లభించడం మొదలు, వరసగా ఏడవసారి అధి కారంలోకి రావడం వరకు ఐదారు కీలక అంశాలు ఉన్నాయి. ఈ ఫలితాలతో పాటే వెలువడిన హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర సంప్రదాయాన్ని పునరావృతం చేశాయి. అక్కడ ఒక పార్టీకి రెండుసార్లు వరసగా అధికారం ఇచ్చే పద్ధతి లేదు. 25 స్థానాలకు పరిమితమైన బీజేపీ, 40 స్థానాలు సాధించిన కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తున్నది. ఓడిన పార్టీల నేతల నోటి నుంచి వచ్చే మొదటిమాట గెలుపోటములు రాజకీయాలలో సహజం. యాపిల్ సాగు శాసించే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో బీజేపీకీ, కాంగ్రెస్కీ ఓట్లలో తేడా ఒక శాతం కంటే తక్కువ. దీనితో బీజేపీ ఓడినా గెలిచినట్టే. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఘనతలు బీజేపీ అండతో పోరాడిన ప్రధాని నరేంద్ర మోదీవే. ఈ ఫలితాలు చూసిన తరువాత తప్పక వేసుకోవలసిన ప్రశ్న ఈ ఎన్నికల నుంచి వాస్తవాలు గ్రహించవలసిన వారు నిజంగా ఎవరు? బీజేపీ వ్యతిరేకత తప్ప మరొక ఎజెండా జోలికిపోని రాజకీయ పార్టీలా? ప్రజా తీర్పు ప్రజాతీర్పే, బీజేపీ పట్ల మా గుడ్డి వ్యతిరేకత మాదే అన్న ధోరణిలో ఉండిపోతున్న మేధావులూ, ఉదారవాదులా? మేం ప్రజాతీర్పును గౌరవిస్తున్నామంటూ రాజకీయ పార్టీలు చూపిస్తున్న కనీస మర్యాదను మేధావులుగా, ఉదారవాదులుగా చలామణీ అవుతున్నవారు చూపిస్తున్నారా అంటే సమాధానం దొరకదు. వీరందరి అభిమతం ప్రజాస్వామ్య పరిరక్షణే కావచ్చు. దానిని శంకించనక్కర లేదు. కానీ ప్రజాతీర్పును గౌరవించడం దగ్గర బీజేపీ యేతర శిబిరం ప్రదర్శిస్తున్న ఆత్మహత్యాసదృశమైన వైఖరి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేదు. వీరు ఒక రాజకీయ పార్టీ మీద, ఒక దేశ సార్వభౌమాధికారం మీద విమర్శల విషయంలో ఉండవలసిన లక్ష్మణరేఖను విస్మరిస్తున్నారు. ముస్లింల మీద జరిగిన కొన్ని దాడులను చూపిస్తూ హిందూ మెజారిటేరియన్ వాదాన్ని అంతర్జాతీయంగా రుద్దాలన్న ప్రయత్నం పట్ల సాధారణ భారతీ యులు ఆగ్రహంతో ఉన్నారని 2019 లోక్‌సభ ఎన్నికలు, తాజా గుజరాత్ ఎన్నికలలో రికార్డు స్థాయి ఫలితాలు చెప్పాయి. ఈ మేధావులు కష్టపడి నిర్మిస్తున్న హిందూ మెజారిటేరియన్ సిద్ధాంతం ముస్లింలకు రక్షణ కల్పించేది కాదు. నిజానికి మైనారిటీలకు అనాలి. కానీ వీరు మైనారిటీ అంటే కేవలం ముస్లింలు అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఇదే హిందూ ఫోబియాకు జన్మనిచ్చింది. అది బీజేపీకి ఉపయోగపడుతోంది. సాధారణ హిందువు, సాధారణ ముస్లిం కోరుకునేది శాంతినే! పీఎఫ్ఐ లాంటి పచ్చి హిందూ, భారత వ్యతిరేక సంస్థల ప్రభావంలో పడినవారు తప్ప సాధారణ ముస్లింలు మత కల్లోలాలను కోరుకోరు. బీజేపీ పాలనలో నిస్సందేహంగా మత కల్లోలాలు లేవు. ఢిల్లీ మత కల్లోలాలు, దసరా సందర్భంగా జరిగిన తాజా అలజడులు పీఎఫ్ఐ వంటి సంస్థల కారణంగానే జరిగాయి. అది ఇంటెలిజెన్స్ సమాచారం కూడా. ఆ వర్గం నుంచి ఒక్క అభ్యర్థిని కూడా నిలపకున్నా, గుజరాత్ తాజా ఫలితాల ప్రకారం ముస్లింలు అత్యధికంగా ఉన్న 19 నియోజక వర్గాలలో 17 బీజేపీకి దక్కాయి. బీజేపీ పట్ల తమకు గుడ్డి వ్యతికత అయితే లేదని వారే ప్రకటించినట్టయింది. గుజరాత్ శాసనసభలో ముస్లింల సంఖ్య తగ్గడం ఇవాళ్టి పరిణామం మాత్రం కాదు. 1980 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో 12 మంది ముస్లింలు చట్టసభకు వెళ్లారు. అప్పుడే కాంగ్రెస్ ΄పార్టీ ‘ఖామ్’ పేరుతో ఒక ఓటుబ్యాంక్ సమీకరణను తెర మీదకు తెచ్చింది. అదే క్షత్రియ, హరిజన్, ముస్లిం, ఆదివాసీ, ముస్లిం సమీకరణ. గడచిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు మహమ్మద్ జావెద్ ఫిర్జాదా, ఘియాజుద్దీన్ షేక్, ఇమ్రాన్ ఖెడావాలా గెలిచారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ఆరుగురు ముస్లింలను అభ్యర్థులుగా నిలిపింది. వీరిలో ఖెడావాలా మాత్రమే బీజేపీ, ఎఐఎంఐఎం సవాళ్లను ఎదుర్కొని సభలో ప్రవేశించ బోతున్నారు. గుజరాత్‌తో సంబంధం లేకున్నా, ఈ ఎన్నికలతో పాటే జరిగిన రాంపూర్ (ఉత్తరప్రదేశ్) నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం గురించి చెప్పడం అసందర్భం కాబోదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ఈ నియోజకవర్గంలో ఏడు దశాబ్దాలుగా ముస్లిం అభ్యర్థులే గెలుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆజంఖాన్ మీద క్రిమినల్ కేసులు, అరెస్టు తదితర కారణాలతో పదవి రద్దయింది. దీనితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ తరఫున అసీమ్ రజా బరిలో ఉండగా, బీజేపీ అభ్యర్థిగా ఆకాశ్ సక్సేనా నిలిచారు. సక్సేనా 33,000 భారీ ఆధిక్యంతో సమాజ్‌వాదీ అభ్యర్థిని ఓడించారు. గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటన, దానితో 135 దుర్మరణం పాలైన సంగతిని ఒక వర్గం మీడియా మృతుల మీద సానుభూతిగా కంటే, బీజేపీకి వ్యతిరేకాస్త్రంగానే భావించినట్టు కనిపిస్తుంది. ఆ ఘటన బీజేపీ గెలుపు మీద ప్రభావం చూపుతుందని ప్రచారం చేసింది. ఆ జిల్లాలో (మోర్బీ) మూడు అసెంబ్లీ నియోజక వర్గాలు మోర్బీ, టంకారా, వాంకనెర్ ఉన్నాయి. వీటిని 2017 ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాలను గెలుచుకుంది. బీజేపీ విజయాన్ని... కాంగ్రెస్ ఓట్లు చీల్చడం, హిందూత్వ వంటి అసహజ విశ్లేషణలతో తక్కువ చేయడానికి ప్రయత్నించడం కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కానేకాదు. మరి హిమాచల్‌లో జరిగిన దానిని ఏమనాలి? బీజేపీ ఓటును ‘ఆప్’ చీల్చినందునే కాంగ్రెస్ గెలిచిందంటే ఒప్పుకుంటారా? బీజేపీని ప్రస్తుతం ప్రజలు ఆదరిస్తున్నారు. దీనిని అంగీకరించడమంటే... బీజేపీని బలోపేతం చేయడం కాదు, ప్రజా తీర్పును గౌరవించడం! ఆ పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడమనేది రాజ్యాంగ హక్కు. ఈ రెండింటినీ గుర్తించాలి. ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి రస్మృతి, పౌరసత్వ సవరణ చట్టం వీటన్నిటికీ రాజ్యాంగ ఆమోదం ఉంది. కానీ వీటన్నిటి లోనూ మైనారిటీ వ్యతిరేకతనే మేధావులు వెతకడానికి ప్రయత్నించారు. దేశ ప్రయోజనాల కోసం ఏ అడుగు వేసినా, ఏది చేసినా బీజేపీని బోనులో నిలబెట్టే ప్రయత్నం మానడం లేదు. మెజారిటీ ప్రజల మౌనాన్ని వీరు అలుసుగా తీసుకుంటున్న మాట కూడా వాస్తవం. ఆ మౌనం వెనుక ఏమున్నదో ఇప్పటికే ఎన్నో పర్యాయాలు రుజువైంది. బీజేపీని ఓడించడానికి అవాస్తవాలను జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ప్రచారం చేయడం సాధారణ ప్రజలకీ, యువతరానికీ కూడా మింగుడు పడడం లేదు. పీఎఫ్ఐ, కొందరు మౌల్వీలు చేస్తున్న హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక వ్యాఖ్యలను ఖండించడం దగ్గర మేధావులు, ఉదారవాదులు ప్రదర్శిస్తున్న ఊదాసీన వైఖరి, సెలెక్టివ్ పంథా కూడా మైనారిటీలకూ, మెజారిటీలకూ మధ్య అగాధాన్ని తగ్గించడానికి బదులు పెంచుతోందన్న స్పృహ వారికి లేదు. ఇప్పుడు అయోధ్య అంశం లేదు. జ్ఞానవాపి, మధుర ఎన్నికల అంశాలుగా లేవు. అయినా బీజేపీ రికార్డు విజయం సాధించింది. కారణం సంక్షేమ పంథా. షాహీన్ బాగ్కీ, బీజేపీ వ్యతిరేక రైతు ఉద్యమానికీ ఇచ్చిన గౌరవం ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టినప్పుడు మేధావులు ఎందుకు ఇవ్వలేకపోయారన్న ప్రశ్న సగటు భారతీయుడిని ఎప్పటికీ తొలుస్తూనే ఉంటుంది. పరిణామాలను పక్షపాతం ఆధారంగా విశ్లేషించడం కాదు, ప్రజాతీర్పులు, ప్రజల అభిప్రాయాల కోణం నుంచి చూడాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ! రాజకీయ పార్టీ మీద ఆగ్రహం వ్యవస్థల మీద, ఆ వ్యవస్థలకు సంబంధించిన విలువల మీద ఆగ్రహంగా మారకూడదు. (క్లిక్ చేయండి: విమర్శను ఆహ్వానించే స్ఫూర్తి లేదా?) - డాక్టర్ గోపరాజు నారాయణరావు సీనియర్ జర్నలిస్ట్ -
ఆజాద్ హింద్ ఫౌజ్.. ఖుషీ కే గీత్ గాయే జా..!
ఆ ప్రశ్న ఎందుకు వేశానా అనిపించింది. అలా అడిగాక మొదట అతడు చేసిన పని, తటాల్న నాకేసి చూడడం. నన్ను చూస్తూనే బుగ్గల మీద ఎడం చేత్తో రాసుకున్నాడు, కొన్ని సెకన్లు. దంతాలు ఊడి లోతుకుపోయిన బుగ్గలు. ఓ నిమిషం తరువాత అతడి ముఖంలో చిన్న నవ్వు. అప్పుడే కళ్లూ మెరిశాయి, ఒక్కసారిగా. ‘చూశాను బాబూ!’ స్థిరంగా అన్నాడతడు. అతని గొంతుపెగిలాక నా మనసు శాంతించింది. పాట అందుకుంటే రెండు వీధుల అవతల ఉన్నా ఖంగుమంటూ వినిపించే ఆ గొంతు అంత మార్దవంగా, అంత మంద్రంగా స్పందించడం కొంచెం వింతే. ఎంత గొప్పగా పాడతాడో ఆ పాటలన్నీ ‘కదం కదం బఢాయే జా, ఖుషీ కే గీత్ గాయే జా.. ఏ జిందగీ హై కౌవ్ుకీ, తో కౌవ్ు పే లుటాయే జా..’ ఒళ్లు గగుర్పొడుస్తుంది. సాగిపో సాగిపో మున్ముందుకు, ఆనందగీతికలను ఆలపిస్తూ సాగిపో, నీ జీవితాన్ని మాతృభూమి కోసం అర్పించుకో ఎంత బలమైన భావన. ఇదే కాదు శుభ్ సుఖ్ చైన్ కీ బర్ఖా బర్సే, ఎక్ల చొలో, హవ్‌ు దిల్లీ దిల్లీ జాయేంగే, చలో దిల్లీ వంటి పాటలూ పాడతాడు. శ్రీరాములు, కొల్లి శ్రీరాములు.. ఒంటి మీద ఖాకీ మిలటరీ యూనిఫారవ్ు. టక్ చేసుకున్నాడు. అప్పటిదే కాబోలు ఆ యూనిఫారవ్ు. శిథిలమైపోయినట్టున్నా, రంగు మాత్రం వెలిసిపోలేదు. అతడు ఒక వయసులో ఎలా ఉన్నాడో చెబుతూ, ఆ శరీరం మీద ఇప్పుడు వేలాడిపోతోంది. దాని వయసు కనీసం యాభయ్ ఏళ్లు. కాళ్లకి బూట్లతోనే బాసిం పట్టు వేసుకుని నేల మీద కూర్చున్నాడు. బూట్లు కూడా అప్పటివేనేమో! స్లాబ్ పనివాళ్ల బూట్లలా ఉన్నాయి. ఆ రూపం చిన్నతనం నుంచి మేం చూస్తున్నదే. మామూలు బట్టల్లో ఏనాడూ చూసిందిలేదు. జుట్టు మరీ ముగ్గుబుట్ట కాలేదు. కొద్దిగా నల్ల వెంట్రుకలూ ఉన్నాయి. నడినెత్తి మీద నుంచి వెనక్కే. ముందంతా బట్టతల, వెనక జులపాలు. నల్లటి శరీరం. నుదురు కింద లోతుకు పోయిన కళ్లు. ఆ మహావ్యక్తిని చూసిన కళ్లు ఇవే! అదృష్టం చేసుకున్నాయి! ‘ఎక్కడ చూశావు శ్రీరాములు?’ ‘బర్మాలో బాబూ!’ ఏదో లోకంలో ఉన్నట్టే ఆ మాటలన్నాడు. నేను ఐదో తరగతిలో ఉండగా, ఓ ఆగస్ట్ 15 పండుగకి ఒక సన్నివేశంలో అతడిని చూసినప్పటి నుంచి నాకు ఓ రకమైన సానుభూతి.. శ్రీరాములంటే. నాన్నగారు చెప్పినదానిని బట్టి గౌరవం కూడా. మా ఇంటి బయటకొచ్చి నిలబడినా మేం చదువుకున్న ఆ స్కూలు కనిపిస్తూనే ఉంటుంది. కొంచెం ఇవతలే అమ్మవారి గుడి. దానికి దగ్గరగా గ్రామ పంచాయతీ కార్యాలయం. ఆ ఘటన జరిగింది ఆ కార్యాలయం ముందే. శ్రీరాములుకి గుర్తుందో లేదో! దారే కాబట్టి ఆ కార్యాలయం ముందు నుంచి పాడుకుంటూ అతడు ఎప్పుడు నడిచి వస్తున్నా, వెళుతున్నా నాకు మాత్రం ఆ సన్నివేశమే గుర్తుకొస్తుంది. తరువాత అతడిని చూస్తున్న కొద్దీ నాకూ అనిపించేది, ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం రాలేదు. ఎందరికో ఉన్న అభిప్రాయమే. అలా చూస్తూనే ఉన్నాం. ఏళ్లు గడచిపోయాయి. పదిరోజులకీ, పదిహేను రోజులకీ ఒకసారి ఇంటిముందుకొచ్చి అరుస్తాడు, అటెన్షన్లో నిలబడే, ‘బోసుబాబు అనుచరుడినొచ్చానయ్యా! ధర్మం చెయ్యండి!’ బిచ్చగాళ్లు వచ్చినప్పుడు వేయడానికి సావిట్లో నల్లటి రేకు డబ్బా ఉంటుంది, బియ్యంతో. రెండు కేజీల వరకు పడుతుంది. అంతకంటే పెద్ద డబ్బాలో వడ్లు ఉంటాయి. కొందరికి బియ్యం, కొందరికి ధాన్యం. ఎవరికైనా దోసెడు. నాన్నగారు ఎప్పుడో చెప్పేశారు, శ్రీరాములిని అలా చూడకండని. అందుకే ఎప్పుడొచ్చి నిలబడినా డబ్బా నిండుగా బియ్యం పట్టుకొచ్చి అతడి పాత్రలో పోస్తాం. శ్రీరాములుని చూడగానే ‘జైహింద్’ అనేవారు పిల్లలు. అతడు ఉరిమినట్టు ఇంకా గట్టిగా అనేవాడు, కాలుని నేలకి బలంగా తాటించి, సెల్యూట్ చేస్తూ. ఆ నినాదం ఇచ్చినందుకు పిల్లలని సంతోషపెట్టడం తన కర్తవ్యం అనుకునేవాడు కాబోలు. ఒక్కొక్క వస్తువుని లేదా జంతువుని కొన్ని భాషలలో ఏమంటారో చెప్పేవాడు. ‘కుక్క.. తెలుగులో కుక్క, హిందీలో కుత్తా, ఇంగిలీసులో డాగ్, బర్మాలో హావె, తమిళంలో నాయీ, బెంగాలీలో కుకురో..’ అంటూ చెప్పేవాడు. కానీ ఈ ప్రవర్తనే అతడి మీద మతి స్థిమితం లేనివాడి ముద్ర వేసింది. అది నిజమే, శ్రీరాములుకి మతి చలించిందని నాన్నే చెప్పారు. అలా జరిగిందీ ఒక సందర్భంలోనే. ఇలా కథలు కథలుగా చెప్పుకునేవారు. ఎప్పటి నుంచో శ్రీరాములుతో మాట్లాడాలని చూస్తుంటే, అనుకోకుండా ఈ రోజు సాధ్యపడింది, నేను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు. అతడి మీద ఇంకాస్త వృద్ధాప్యం పడింది. అప్పుడే ఏదో గుర్తుకు వచ్చినట్టు, పై జేబులోంచి బంతిలా చుట్టిన ఒక గుడ్డ తీశాడు, ఖాకీదే. మడత విప్పాక తెలిసింది, అది ఖాకీ టోపీ. ఎంతో భక్తిగా, పద్ధతిగా శిరస్సున అలంకరించుకున్నాడు. ఆ టోపీతో ముఖం ఏదో ప్రత్యేకతని సంతరించుకుంది. సుభాష్‌చంద్ర బోస్ రూపం నా దృష్టిపథంలోకి వచ్చి నిలిచింది వెంటనే. అలాంటిదే టోపీ. ఔను, శ్రీరాములు ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పనిచేసి వచ్చాడు. లోపలికి రమ్మని పదిసార్లు పిలిస్తే మొత్తానికి వచ్చాడు. దూరంతో కూడిన చనువు, మా ఇంట్లో. నేరుగా పెరట్లోకి వెళ్లాం. బావి చూడగానే నీళ్లు తోడుకుని తాగాడు. తడి ముఖంతో, చేతులతో అక్కడే మొక్కల మధ్య ఖాళీ స్థలంలో నేల మీద చతికిలపడ్డాడు. కాస్త ఎత్తుగా ఉండే నూతిపళ్లెం అంచున నేను కూర్చున్నాను. ‘విలేకరుగారు, అమ్మగారు..?’ ఉన్నారా అన్నట్టు అడిగాడు. ‘లేరు, పెళ్లికెళ్లారు. ఏమైనా చెప్పాలా?’ అన్నాను. విలేకరుగారంటే మా నాన్నగారే. ఆ చుట్టుపక్కల ఆయనకు అదే పేరు. ఆంధ్రప్రభకి గ్రామీణ విలేకరి. ఏమీ లేదన్నట్టు తలాడించి, మళ్లీ మౌనం దాల్చాడు శ్రీరాములు. వాస్తవానికి అతడు ఏదో జ్ఞాపకపు గాలానికి చిక్కుకున్నాడనాలి. రెండు నిమిషాల తరువాత మళ్లీ అడిగాను. ‘సుభాష్ బోస్ ఎలా ఉండేవారు?’ ‘శివాలయంలో నందంత అందంగా, కొట్టొచ్చినట్టు ఉండేవారు బాబూ!’ ఒక ఉద్యమ నేత మీద ఎంత గౌరవం ఉంటుందో బాగా అర్థమయింది. ఆ మాట అంటున్నప్పుడు అతడి రెండు చేతులూ నమస్కరిస్తున్నట్టు కలసి గాల్లోకి లేచాయి. నేత్రాలు అర్ధనిమీలితాలయ్యాయి. మద్దూరి అన్నపూర్ణయ్య గారని, ఆయన సుభాష్‌చంద్ర బోస్‌ని రాజమండ్రి తీసుకువచ్చినప్పుడు శ్రీరాములు మొదటిసారి విన్నాడట ఆ పేరు. ఈ బోస్గారే సింగపూర్‌లో ఐఎన్ఏతో ఉద్యమం మొదలుపెట్టాడని తెలిసిందట. ఒక వేకువన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడట. ఇంకొకరు ఎవరో చెబితే కలకత్తా వెళ్లి, అక్కడి నుంచి బర్మా చేరుకుని మొత్తానికి ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరాడట. ఎవరో ఆజాద్ హింద్ ఫౌజ్ వీరుడు రాసిన స్వీయానుభవమే ఎక్కడో చదివాను. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఓటమితో ఫౌజ్ సైనికులను బ్రిటిష్ ప్రభుత్వం ఢిల్లీ తీసుకువచ్చి ఎర్రకోటలో సైనిక విచారణ పేరుతో హింసించారు. యుద్ధఖైదీల్లా కాదు, నేరగాళ్లని చూసినట్టు చూశారు. రెండురోజులకీ మూడురోజులకీ ఒకసారి తిండి పెట్టేవారు. అలాంటి పరిస్థితిలో కొందరిని పరుగెట్టమని, వెనక నుంచి కాల్చి చంపారు కూడా. బతికి బయటపడి ఢిల్లీ నుంచి శ్రీరాములు కోనసీమలో తన స్వగ్రామానికి వచ్చాడని నాన్నగారు చెప్పేవారు. ఆ ఒక్కరోజే అతడు హీరో. ఎలా వెళ్లాడో, ఎలా వచ్చాడో! స్వాతంత్య్రం వచ్చింది. ఊరూవాడా ఉత్సవాలు జరిగాయి. స్వాతంత్య్ర పోరాటం తరువాత చాలామంది స్వాతంత్య్ర సమరయోధులకి జీవనపోరాటం ఎదురైంది. అలాంటి వాళ్లలో శ్రీరాములూ ఉన్నాడు. అసలు ప్రశ్న. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన విషయం శ్రీరాములుకి స్పృహలో ఉందో లేదో! నాకు ఎప్పటికీ గుర్తుంటుందన్న ఆ సందర్భం ఆగస్ట్ 15నే జరిగింది. అంటే శ్రీరాములు అనే ఓ స్వాతంత్య్ర సమరయోధుడి జీవితంలో ఆ రోజు కూడా భిక్షాటనతోనే గడిచింది. శ్రీరాములు గాథంతా నాన్నగారు వార్తాకథనంగా రాశారు. చాలామంది సమరయోధులకి పింఛను వచ్చింది. భూములు దక్కాయి. ఉచిత ప్రయాణాలు అమరాయి. తామ్రపత్రాలూ వచ్చాయి. దేశం కోసం జవానుగా మారి చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన శ్రీరాములుకి ఏమీ రాలేదు. కారణం, అతడు దేశం కోసం దేశం బయట నుంచి పోరాడాడట. అది నిజమేనని చెప్పే రికార్డేదీ లేదట. ప్రస్తుతం అతడికి భుక్తి గడవడం కష్టంగా ఉందనీ, ఇస్తే ఏ ఉద్యోగమైనా చేస్తాడంటూ కథనం ముగించారట నాన్న. ఎవరో సహృదయుడు స్పందించాడట. మద్రాస్‌లో ఉంటాడట. పెద్ద ఆఫీసరట. నూట యాభయ్ రూపాయల జీతంతో, ఉండడానికి క్వార్టర్స్ సహా అన్నీ ఇస్తానని పత్రికా కార్యాలయానికి ఉత్తరం రాస్తే, అది నాన్నగారికి చేర్చారు వాళ్లు. ఎందుకో ఏమో, అప్పుడే మూడువారాలైనా మా ఊరివైపు రాలేదట శ్రీరాములు. విషయం చెప్పి, ఇంటికే కబురు చేశారు నాన్న. శ్రీరాములు భార్యే కాబోలు ఎవరితోనో కబురు పెట్టింది, ఇప్పుడు అతడిని అంత దూరం పంపలేమన్నదే దాని సారాంశం. నాన్న వాకబు చేశారు. శ్రీరాములుకు మతి చలించిందని తెలిసింది. బోస్ బతికే ఉన్నాడా? విమాన ప్రమాదంలో మరణించాడా? ఇదే ధ్యాసట కొంతకాలం. కారణం దేశమంతా ఇదే చర్చట. ఎలా తెలుసుకున్నాడో, ఏం తెలుసుకున్నాడో, అంతిమంగా బోస్ మరణించడమే నిజమన్న నిర్ణయానికి వచ్చాడట శ్రీరాములు. అప్పటి నుంచి మనిషి మారిపోయాడు. ఇది జరిగిన కొద్దిరోజులకే చేతికి భిక్షాపాత్ర వచ్చింది. బ్రిటన్ మీద యుద్ధం ప్రకటించిన సైన్యం తన కవాతులో పాడుకున్న దేశభక్తి గీతాలు భిక్షాపాత్రా, కడుపూ నింపుకోవడానికి అభ్యర్థనలుగా ఉపయోగపడుతున్నాయి. ‘మా పొలాలు చూడు అని నీకు చెప్పడానికి మనసొప్పక చెప్పలేదయ్యా శ్రీరాములు. నీకేమిటీ ఖర్మ? వచ్చి మా పొలం పనుల్లో సాయపడు. ఎంతో కొంత ఇస్తాను.’ నాన్నది చిన్నపాటి సేద్యమే అయినా, సాటి స్వాతంత్య్ర సమరయోధుడికి సాయం చేయాలనుకుని, ఈ మాట అన్నారట. ఒక నమస్కారం పెట్టి వెళ్లిపోయాడట. భిక్షాటనలోనే ఉండిపోయాడు. ‘ఇదిగో! ఇది ఉంచు!’ అని పది రూపాయలు, నా పాకెట్ మనీ, అతడి చేతిలో పెట్టాను. మళ్లీ మొహమాటం. ‘తీసుకో ఫరవాలేదు’ అంటే, జేబులో పెట్టుకుని లేచాడు. ‘సెలవిప్పించండి!’ అన్నాడు, సెల్యూట్ భంగిమలో. నేను కూడా లేచాను. సింహద్వారం దాకా వెళ్లాను. నెమ్మదిగా మెట్లు దిగి వీథిలోకి వెళ్లిపోయాడు శ్రీరాములు. ఎదురుగా కనిపిస్తోంది పంచాయతీ కార్యాలయం. ముందు నుంచే నడిచి వెళుతున్నాడతడు. ఆ రోజూ, అతడు పాడిన సందర్భం ఎలాంటి ప్రయత్నమూ లేకుండానే గుర్తుకు వచ్చాయి. ఆ ఆగస్ట్ 15కి కూడా బడి దగ్గర నుంచి మమ్మల్నందరినీ ఉరేగింపుగా తీసుకొచ్చి పంచాయతీ కార్యాలయం ముందు బారులు తీర్చారు. తరగతుల వారీగా నిలబెడుతున్నారు. ఆ పనంతా వీరస్వామి మాస్టారిదే. పిల్లలంతా సిరా నీలం రంగు నిక్కరు, తెల్లచొక్కాలతో, ఆడపిల్లలు కూడా అలాంటి కూడికతోనే గౌన్లు, స్కర్టులతో ముచ్చటగా ఉన్నారు. మా పైనంతా రంగురంగుల కాగితపు జెండాల తోరణాలు. నిటారుగా ఉన్న ఒక సరుగుడు కర్రని కార్యాలయం ముందు పాతిపెట్టారు. దానికే వేలాడుతోంది మువ్వన్నెల జెండా. జెండా కొయ్య మొదట్లో వరసగా మూడు కుర్చీలు. మధ్య కుర్చీలో బోసినవ్వుల గాంధీ ఫొటో. ఒక పక్క నెహ్రూ బొమ్మ, రెండో పక్క బాబూ రాజేంద్రప్రసాద్ బొమ్మ. మూడు ఫొటోలకి మువ్వన్నెల ఖాదీ దండలు. గోలగోలగా ఉందంతా. కార్యాలయం లోపల ఊరి పెద్దలు పది పన్నెండు మంది ఖద్దరు దుస్తుల్లో తిరుగుతున్నారు, హడావిడి చేస్తూ. బడిపిల్లల గోల కంటే ఎక్కువే ఉంది. ఉదయం తొమ్మిది గంటల వేళకి సర్పంచ్‌గారు కష్టపడి జెండా ఎగరేశారు. వెంటనే వీరాస్వామి మేస్టారు ‘జెండా ఊంఛా రహే హమారా.. విజయీ విశ్వతిరంగా ప్యారా’ అంటూ పిడికిలెత్తి ఉద్విగ్నంగా పాడితే మేమంతా ఉత్సాహంగా అనుసరించాం. ఇంకొద్ది సేపటికి మేం ఎదురుచూస్తున్న చాక్లెట్ల పంపకం మొదలయింది. అప్పుడే లోపల పెద్దల చేతికి తలొక ప్యాకెట్ వచ్చింది. ఇడ్లీ కాబోలు. చాక్లెట్లు చేతుల్లో పడినవాళ్లు పరుగెత్తుతున్నారు. ఐదో తరగతి వాళ్లందరం చివర్న ఉన్నాం. లోపల పెద్దలు తినడం పూర్తి చేసి బయటకొచ్చి చేతులు కడుగుతున్నారు. ఒకళ్ల తరువాత ఒకళ్లు.. ఆ నీళ్లు నెమ్మదిగా ముందుకొస్తున్నాయి, సరిగ్గా జెండా కర్ర దిశగా, ఆ మహానుభావుల ఫొటోలు ఉన్న కుర్చీల కిందకే. వీరాస్వామి మాస్టారు, సరోజినీ టీచరమ్మ, మార్తమ్మ టీచరు, హెడ్మాస్టరు శివలపంతులు గారు, ఆయా వెంకమ్మ అట్టపెట్టెలలో తెచ్చిన చాక్లెట్లు పంచుకుంటూ వస్తున్నారు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు శ్రీరాములు. నేరుగా పంచాయతీ కార్యాలయం ముందుకెళ్లి గట్టిగా అరిచాడు, ‘బాబూ! బోసుబాబు అనుచరుణ్ణొచ్చాను. నాక్కూడా ఓ పొట్లం ఇప్పించండి బాబూ!’ ఒక్క నిమిషం ఆగి మళ్లీ అరిచాడు శ్రీరాములు. చేయి కడుక్కోవడానికి బయటకు వచ్చిన ఓ ఖద్దరుధారికి ఆ అరుపు చిర్రెత్తించింది. ఏదో అనబోయాడు గాని, గొంతులో నీళ్లు దిగేదాకా ఆగాడు. ఈసారి పాట అందుకున్నాడు శ్రీరాములు. ‘హవ్‌ు దిల్లీ దిల్లీ జాయేంగే, చలో దిల్లీ..’ ‘ఛ, అవతలకి పో!’ భరించలేనట్టే అసహనంతో అరిచాడు పెద్దమనిషి. పెద్దలకి కలిగిన అసౌకర్యానికి భయపడిన ప్యూను వెంటనే ప్రత్యక్షమై, ‘పైకెళ్లు.. పో, పైకెళ్లు..’ మీదకెళుతూ అన్నాడు, పొమ్మని బిచ్చగాళ్లకి చెప్పేమాట. అలాంటి చీదరింపులకి అలవాటు పడిపోయినట్టు నిర్లిప్తంగా ఉండిపోయాడు శ్రీరాములు. అంతా అటే చూశారు. నిమిషం తరువాత భారంగా కదిలాడు శ్రీరాములు. పంచాయతీ కార్యాలయం దాటి, ముందుకు వెళ్లిపోయాడు. చెట్లపల్లి వారి ఇంటి పక్క నుంచి వెళ్లే కాలిబాటని అనుసరించాడు. రెండు మూడు నిమిషాల తరువాత గాలి మోసుకొచ్చింది పాట. ‘కదం కదం బఢాయే జా.. ఖుషీ కే గీత్ గాయే జా.. ఏ జిందతీ హై కౌవ్ుకీ, తో కౌవ్ు పే లుటాయే జా..’ సావిట్లోకి అడుగుపెట్టిన తరువాత దూరం నుంచి శ్రీరాములు కంఠం లీలగా. గెలవాలన్న నిశ్చయం, ఓడిపోతున్నానన్న దిగులుతో కలసి జుగల్బందీ చేస్తున్నట్టుంది. ‘.. ఖుషీ కే గీత్ గాయే జా.. కదం కదం బఢాయే జా..’ జెండా కొయ్య మొదట్లో వరసగా మూడు కుర్చీలు. మధ్య కుర్చీలో బోసినవ్వుల గాంధీ ఫొటో. ఒక పక్క నెహ్రూ బొమ్మ, రెండో పక్క బాబూ రాజేంద్రప్రసాద్ బొమ్మ. మూడు ఫొటోలకి మువ్వన్నెల ఖాదీ దండలు. ∙డా. గోపరాజు నారాయణరావు -
పన్నుపోటు మీద తిరుగుబాటు
సహాయ నిరాకరణోద్యమం సాగుతున్న క్రమంలోని అద్భుత ఘట్టమే చీరాల–పేరాల ఉద్యమం. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య దీనికి నేతృత్వం వహించారు. నాటి గుంటూరు జిల్లాలో చేనేత, రంగుల అద్దకం వంటి వృత్తులతో జీవించే జనాభాతో ఉన్నదే చీరాల యూనియన్. చీరాల, జాండ్రపేట, పేరాల, వీరరాఘవపేట గ్రామాలు కలిపి చీరాల పంచాయతీ యూనియన్. 1919 నవంబర్‌లో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం చీరాల–పేరాల కలిపి మునిసిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్టు ఆకస్మికంగా ప్రకటించింది. మునిసిపాలిటీ ఆవిర్భవిస్తే అప్పటిదాకా రూ.4 వేలుగా ఉన్న పన్నులు పదిరెట్లు, అంటే రూ.40 వేలకు చేరతాయి. ఈ పరిణామం ప్రజలకు ఆందోళన కలిగించింది. 1920 ఫిబ్రవరి 20న రేట్ పేయర్స్ అసోసియేషన్ పేరుతో స్థానికులు నిరసన ప్రదర్శనలు చేశారు. అయినా రెండు నెలలలోనే చీరాలను మునిసిపాలిటీగా మార్చినట్టు ప్రకటన వచ్చింది. ఆర్డీఓ చైర్మన్‌గా, పదకొండు మంది కౌన్సిలర్లతో ప్రభుత్వమే కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. పన్నులు కట్టలేమని ప్రజలు ఆర్డీఓకు విన్నవించుకున్నారు. ‘ముందు పన్నులు కట్టండి, తరువాత అప్పీలు సంగతి చూద్దాం’ అన్నాడాయన. ఈమాట నమ్మి ఆరుమాసాల పన్నులు చెల్లించారు. కానీ ప్రభుత్వం కనికరించే సూచనలేవీ కానరాలేదు. అప్పుడు బ్రిటిష్ రాజభక్తి నరనరాన నింపుకున్న జస్టిస్ పార్టీ మద్రాస్ ప్రెసిడెన్సీని ఏలుతున్నది. అలాంటి జస్టిస్ పార్టీ ప్రభుత్వానికి కళ్లు బైర్లు కమ్మే పరిణామం చీరాలలో జరిగింది. ప్రజల ఆవేదన వాస్తవమేనంటూ ప్రభుత్వం నియమించిన పదకొండు మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. చివరకు మద్రాస్ ప్రెసిడెన్సీ స్థానిక స్వయంపాలన వ్యవహారాల మంత్రి రాజా రామరాయణింగార్ (పానగల్ రాజా) కౌన్సిల్ అభిప్రాయాన్ని చెత్తబుట్టలో వేసి 1921 ఏప్రిల్ 1న ఒక చైర్మన్‌ను నియమించారు. దీంతో మండిపడ్డ జనం టోల్‌గేట్‌ను ధ్వంసం చేసి, రైలు పట్టాల మీద వేసి దహనం చేశారు. వందమంది రిజర్వు పోలీసుల సాయంతో చైర్మన్ ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు. పన్నులు కట్టని నేరానికి పన్నెండు మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. వారిలో ఒకరు రావూరి అలిమేలుమంగమ్మ, నిరుపేద మహిళ. గాంధీయుగం ఆరంభమైన తరువాత రాజకీయ నేరారోపణతో దేశం మొత్తం మీద జైలుకు వెళ్లిన తొలి మహిళ అలిమేలుమంగమ్మ. గోపాలకృష్ణయ్య నాయకత్వం ‘బ్రిటిష్ సామ్రాజ్యంలో రవి అస్తమించడంటారు. ఎందుకో తెలుసా? చీకట్లో ఇంగ్లిష్ వాళ్లని నమ్మడం మరీ కష్టం!’ అని ఒక సందర్భంలో వ్యాఖ్యానించిన ధైర్యశాలి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. జాతీయోద్యమంలో చేరిన ఆయన అప్పటికే భార్య ఆరోగ్యం కోసం చీరాల వచ్చారు. తిలక్ స్వరాజ్య నిధి వసూలులో భాగంగా బెజవాడ నుంచి ఏప్రిల్ 6న చీరాల వచ్చిన గాంధీ పన్నుల చెల్లింపునకు నిరాకరించి జైలుకు వెళ్లిన అలిమేలుమంగమ్మ సహా అందరినీ సత్కరించారు. అప్పుడే గాంధీని గోపాలకృష్ణయ్య సలహా కోరగా, ‘మీరు చేసే కార్యం విజయవంతమైతే కాంగ్రెస్ మిమ్మల్ని అభినందిస్తుంది. అపజయం పొందితే ఆ బాధ్యత కాంగ్రెస్ తనపై పెట్టుకోదు’ అంటూ మెలిక పెట్టారు. చీరాల శివార్లలోని భూములలో రావ్ునగర్ పేరిట ఒక గ్రామాన్ని నిర్మించారు గోపాలకృష్ణయ్య. 1921 ఏప్రిల్ 25 నడి రాత్రి వేసవి చీరాలపేరాల ప్రజలు పేద, ధనిక; ఉన్నత, చిన్న కులాల తేడా లేకుండా అంతా తమ సామగ్రితో తాత్కాలికంగా నిర్మించిన రావ్‌ునగర్‌కు ప్రయాణమయ్యారు. గోపాలకృష్ణయ్య అక్కడే పంచాయతీ, న్యాయ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ‘అక్కడ గవర్నర్ పాలన లేదు, ఉన్నదల్లా గోపాలకృష్ణయ్య పాలనే’ అని ఆ ఏడాది మార్చి 31న విజయవాడలో చిత్త రంజన్‌దాస్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడతాయి. తనను నమ్మి రావ్‌ునగర్‌కు వచ్చిన పేదలను ఆదుకోవడం గోపాలకృష్ణయ్యకు శక్తికి మించిన పనే అయింది. టంగుటూరి ప్రకాశం పంతులు రూ.3 వేలు విరాళం ఇచ్చారు. నిధి వసూలు కోసం 1921 సెప్టెంబర్ 28న బరంపురంలో జరిగిన ఆంధ్ర మహాసభలకు దుగ్గిరాల హాజరయ్యారు. ఆ వేదిక మీద మంత్రి రామరాయణింగార్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. దాంతో గుంటూరు జిల్లా కలెక్టర్ టీజీ రూథర్‌ఫర్డ్ సంతకంతో ఆ రోజు సాయంత్రం వారెంట్ జారీ అయింది. గోపాలకృష్ణయ్య రెండు నెలల పాటు ఎక్కడా నోరు విప్పరాదని దాని సారాంశం. ఆ ఆదేశాన్ని ఉల్లంఘిస్తున్నట్టు ప్రకటించారాయన. అక్టోబర్ 1న అరెస్టు చేసి తిరుచ్చి జైలుకు తరలించారు. 1922 అక్టోబర్‌లో విడుదలయ్యారు. గోపాలకృష్ణయ్య జైలుకు వెళ్లాక రామ్‌నగర్ ఉద్యమం సడలి పోయింది. చీరాలపేరాల ప్రజలు పన్నులు చెల్లించకుండా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేశారు. కానీ గాంధీ తన అహింసా సిద్ధాంతం ప్రాతిపదికగా జరిగిన ఓ గొప్ప ప్రజా ఉద్యమానికి సహాయ నిరాకరణ చేయడమే చారిత్రక వైచిత్రి. ఏమైనా, పదకొండు మాసాల పాటు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వినూత్నంగా నిరసన చెప్పడం చరిత్రలో అపురూపమైన విషయం. నాటి ప్రజానీకం ఓడినా, చీరాలపేరాల ఉద్యమం చరిత్రలో తన స్థానాన్ని గెలుచుకుంది. - డా. గోపరాజు నారాయణరావు -
19 మందికి ఉరిశిక్ష.. 110 మందికి యావజ్జీవ కారాగారం
‘స్వరాజ్య’ నినాదం, ఏడాదిలో స్వాతంత్య్రమే లక్ష్యం. 1920–22 మధ్య జరిగిన సహాయ నిరాకరణోద్యమ వ్యూహం ఇదే. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో గాంధీజీ మొదలు పెట్టిన తొలి విస్తృత సత్యాగ్రహమిది. రౌలట్ చట్టం (ఎలాంటి విచారణ లేకుండా భారతీయులను శిక్షించే, ప్రవాసానికి పంపే చట్టం), జలియన్‌వాలా బాగ్ దురంతం, దానికి కారకులైన వారిని శిక్షించకుండా వదిలిపెట్టడం వంటి పరిణామాలు తమకు కావలసింది స్వరాజ్యమేనన్న భావనను భారతీయులలో బలపరచాయి. తమ దేశంలో తాము నిస్సందేహంగా ద్వితీయ శ్రేణి పౌరులుగానే బతుకుతున్నామన్న వాస్తవం మరింతగా అనుభవానికి వచ్చింది. అదే గాంధీ ఉద్యమానికి ఊతమిచ్చింది. 1920 నాటి కలకత్తా కాంగ్రెస్‌లో గాంధీ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీనిలో ముస్లింలను మమేకం చేసేందుకు ఖిలాఫత్ ఉద్యమాన్ని గాంధీజీ జత చేశారు. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమ ఛాయలు 1920 నాటి సహాయ నిరాకరణోద్యమంలోనూ కనిపిస్తాయి. సహాయ నిరాకరణ అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదులను త్యజించాలి. ప్రభుత్వ విద్యా సంస్థలను, కోర్టులను, ఎన్నికలను బహిష్కరించాలి. ఉద్యోగాలు వదిలిపెట్టాలి. పన్నులు చెల్లించరాదు. అలాగే స్వదేశీ. ఇవే ఈ ఉద్యమంలో అనుసరించాల్సిన పద్ధతులు. వీటి ప్రచారానికి గాంధీజీ దేశంలో పర్యటించారు. సహాయ నిరాకరణోద్యమ ప్రభావం భారతదేశమంతటా కనిపించింది. మధ్య పరగణాలలోని అయోధ్యలో ఈ ఉద్యమం పేరుతో రైతాంగ పోరాటం బలపడింది. సహాయ నిరాకరణ సమావేశం, రైతు ఉద్యమ సభ ఒకటే అనిపించాయి. రాజస్థాన్ ప్రాంతంలో రైతులు, గిరిజనులు తమ జీవితాలు బాగు చేసుకున్నారు. అవినీతిపరులైన పూజారుల నుంచి గురుద్వారాలను విముక్తం చేయడానికి పంజాబ్‌లో అకాలీ ఉద్యమం దీనిని ఉపయోగించుకుంది. జాతీయ విద్య, జాతీయ పరిశ్రమలు కొత్త అడుగులు నేర్చాయి. ఇందులో అన్నిటి కంటే విజయవంతమైనది విదేశీ వస్త్ర బహిష్కరణ. 1920–21 ఆర్థిక సంవత్సరంలో రూ.102 కోట్లు ఉన్న విదేశీ వస్త్రాల దిగుమతులు 1921–22 ఆర్థిక సంవత్సరానికి రూ.57 కోట్లకు పడిపోయాయి. నిజంగానే ఒక్క ఏడాదిలో బ్రిటిష్ పాలన నుంచి భారత్ విముక్తమవుతుందన్న ఆశ అక్షరాలా వెల్లువెత్తింది. కానీ మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్‌దాస్ వంటి పెద్దలు వారిస్తున్నా వినకుండా, పెల్లుబికిన జాతీయతా భావాన్ని గుర్తించకుండా గాంధీజీ ఈ ఉద్యమాన్ని హఠాత్తుగా రద్దు చేశారు. కారణం చౌరీచౌరా దురంతం. మధ్య పరగణాలలోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఉంది చౌరీచౌరా గ్రామం. బ్రిటిష్ ఇండియా సైన్యంలో పదవీ విరమణ చేసిన భగవాన్ అహిర్ ఆ ప్రాంతంలో సహాయ నిరాకరణోద్యమానికి నాయకత్వం వహించారు. గాంధీ పిలుపు మేరకు ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వానికి, పెద్ద రైతులకు వ్యతిరేకంగా ఎన్నో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నాజర్ అలీ, లాల్ మహమ్మద్, అబ్దుల్లా, కాళీచరణ్, లౌతీ కుమార్, మహాదేవ్సింగ్, మెఘు అలీ, రావ్‌ు లఖన్, సీతారాం, మోహన్, శ్యామ్‌సుందర్ వంటి వారు ఆయన సహచరులు. సహాయ నిరాకరణోద్యమ ఆశయాల మేరకు అహిర్ నాయకత్వంలో నిత్యావసరాల ధరల పెరుగుదలకు, మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలు గౌరీ బజార్ అనే చోట 1922 ఫిబ్రవరి 2న నిరసన ప్రదర్శన చేశారు. చౌరీచౌరా పోలీసులు చెదరగొట్టే పేరుతో వారిని చావగొట్టారు. కొందరు నాయకులను అరెస్టు చేసి అదే స్టేషన్లో బంధించారు. ఇందుకు నిరసనగానే ఫిబ్రవరి 4న చౌరీచౌరాతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు రెండున్నరవేల మంది పోగై ఆందోళనకు దిగారు. ‘గాంధీ వర్ధిల్లాలి’ అంటూ నినదిస్తూ, అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని కోరారు. ఈ క్రమంలోనే ఒక మద్యం దుకాణం ముందు పికెటింగ్ చేశారు. పోలీసులు మళ్లీ జులుం ప్రదర్శించడంతో ప్రదర్శనకారులు విశ్వరూపం చూపారు. పరిస్థితిని అదుపు చేయడానికి సబ్ఇన్స్పెక్టర్ గుప్తేశ్వర్సింగ్ కాల్పులకు ఆదేశించాడు. ఆ కాల్పులలో ముగ్గురు మరణించారు. కొంతమంది గాయపడ్డారు. కోపోద్రిక్తులైన ప్రజలు తరమడంతో పోలీసులు స్టేషన్ భవనంలోకి పారిపోయారు. ప్రజలు దానికి నిప్పు పెట్టారు. 23 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. ప్రభుత్వం వెంటనే చౌరీచౌరాలో, చుట్టుపక్కల సైనిక శాసనం విధించింది. చౌరీచౌరా ఘటనకు బాధ్యత వహిస్తున్నానంటూ, పరిహారమంటూ, మృతుల ఆత్మకు శాంతి కలగాలంటూ గాంధీజీ ఐదు రోజుల నిరశన వ్రతం చేశారు. ఆ దుర్ఘటన ద్వారా భగవంతుడే తన కళ్లు తెరిపించాడనీ, అహింస అనే గొప్ప తాత్త్వికతతో ఉద్యమించే స్థాయి తన సోదర భారతీయులకు రాలేదన్న సంగతి తాను గుర్తించలేకపోయానని ఆయన ప్రకటించారు. ఫిబ్రవరి 12న ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ప్రభుత్వం గాంధీని అరెస్టు చేసి, ఆరేళ్లు శిక్ష విధించింది. అయితే ఆయనను 1924లోనే అనారోగ్యం వల్ల విడుదల చేశారు. ఇక్కడితో సహాయ నిరాకరణోద్యమం ఆగిపోయింది. కానీ చౌరీచౌరాలో కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటిష్ ఇండియాలో న్యాయ శాసనాలు ఎంత వివక్షతో కూడి ఉన్నాయో తరువాతి పరిణామాలు రుజువు చేశాయి. సజీవ దహనమైన పోలీసులు 23 మంది (కొందరు 21 మంది అని, ఇంకొందరు 22 మంది అని కూడా నమోదు చేశారు). మొత్తం 228 మంది మీద కేసులు నమోదు చేశారు. ఎనిమిది మాసాలు విచారణ జరిగింది. అరెస్టయిన వారిలో ఆరుగురు పోలీసు నిర్బంధంలోనే చనిపోయారు. కేసు విచారించిన గోరఖ్‌పూర్ సెషన్స్ న్యాయస్థానం 172 మందికి ఉరిశిక్ష విధించింది. ఇంతమందికి న్యాయస్థానం మరణదండన విధించిన ఘటన ప్రపంచంలో ఉన్నదా అనేది అనుమానమే. దీని మీద దేశంలో ఆందోళన మొదలయింది. ‘బిహార్ బంధు’ పత్రిక నిర్బంధం మధ్యనే ఈ విచారణ గురించి, ఆ ఘోరమైన శిక్ష గురించి వ్యాసాలు ప్రచురించింది. కవితాత్మకంగా రాసిన ఒక వ్యాసంలో ‘ఉరికంబం ఎక్కబోతున్న ఆ 170 మందిని పరామర్శించగలవా భారతీయుడా’ అంటూ ఆవేదనతో ప్రశ్నించింది. అలహాబాద్ నుంచి వెలువడే ‘అభ్యుదయ’ పత్రిక చౌరీచౌరాయే ఘోరమైన ఘటన అనుకుంటే, ఆ కేసులో తీర్పు మరింత ఘోరమైనదని వ్యాఖ్యానించింది. ఇది న్యాయం చేయడం కాదు, న్యాయాన్ని హత్య చేయడమేనని కాన్పూర్ నుంచి వెలువడే ‘ప్రతాప్’ పత్రిక వ్యాఖ్యానించింది. ఆ తీర్పును ఎంఎన్ రాయ్ చట్టబద్ధ హత్యగా వర్ణించారు. తీర్పును వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కేసును అలహాబాద్ హైకోర్టులో అప్పీలు చేశారు. 1923 ఏప్రిల్ 20న హైకోర్టు కేసును పునఃపరిశీలించింది. అక్కడ మదన్మోహన్ మాలవీయ కేసు వాదించారు. చివరికి కోర్టు 19 మందికి మరణ దండన ఖరారు చేసింది. 110 మందికి యావజ్జీవ కారాగారం విధించింది. మిగిలిన వారికి కూడా కొద్దిపాటి శిక్షలు వేశారు. అలా మాలవీయ ప్రమేయంతో 151 మంది మరణదండన నుంచి బయటపడ్డారు. ఇందులో చాలామంది స్వాతంత్య్రం వచ్చాకే విడుదలయ్యారు. సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం స్వరాజ్యోద్యమంలో కొత్త గొంతులకు ఆస్కారమిచ్చింది. అందుకు ఉదాహరణ అల్లూరి శ్రీరామరాజు, చంద్రశేఖర్ ఆజాద్. -డా. గోపరాజు నారాయణరావు -
నిశ్శబ్ద నిప్పులవాన
బఘా జతిన్ పేరు హిందూ–జర్మన్ కుట్ర రెండో దశతో గాఢంగా ముడిపడి ఉంది. ఈ దశ అనేక మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతుంది. అఖిల భారత స్థాయి సాయుధ సమరంతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చడానికి 1915 ఫిబ్రవరిలో చేసిన తొలి ప్రయత్నం విఫలమైన తరువాత జుగాంతర్ విప్లవసంస్థ సభ్యులు తమ నేత బఘా జతిన్ (బఘా అంటే పులి. ఊరి మీద పడిన పులితో పోరాడి చంపినందుకు వచ్చిన బిరుదు. అసలు పేరు జతిన్ ముఖర్జీ)ను రహస్య ప్రదేశానికి పంపి మరో విప్లవానికి నాడే నాంది పలికారు. ఆ ప్రదేశమే ఒడిశా సాగరతీరం బాలసోర్. కలకత్తా కేంద్రంగా నడిచే హ్యారీ అండ్ సన్స్ వ్యాపార సంస్థకు శాఖ పేరుతో యూనివర్సల్ ఎంపోరియమ్ను బాలసోర్‌లో నెకొల్పారు. నిజానికి అది విప్లవకారుల సమావేశ స్థలి. జతిన్ బాలసోర్‌కు 30 మైళ్ల దూరంలోని కప్తిపదా గ్రామంలో అజ్ఞాతవాసం చేసేవారు. జర్మనీ ప్రభు వంశీకుడు, రాజకీయ ప్రముఖుడు పాపెన్ ఆయుధాలను పంపించాడు. బెర్లిన్ కమిటీ ప్రతినిధిగా తనకు తాను ప్రకటించుకుని అమెరికాలో ఉంటున్న చంద్రకాంత్ చక్రవర్తి మధ్యవర్తిత్వంతో స్కూనర్ అనీ లారెన్స్ ఓడకు ఆ ఆయుధాలను ఎక్కించారు. ఈ ఓడ 1915 మార్చి ప్రాంతంలో శాన్‌డీగో నుంచి బయలుదేరింది. మెక్సికోకు సమీపంలో ఉన్న సోకొరో అనే దీవికి వెడుతున్న చమురు నౌక దీని వెనకే ఉంది. దాని పేరు ఎస్ఎస్ మావెరిక్. నిజానికి ఇదే అనీ లారెన్స్‌కు మార్గదర్శి. కానీ మావెరిక్కు ఒక దశలో వచ్చిన మరమ్మతుతో అనీ లారెన్స్‌కు దూరమైంది. అనీ లారెన్స్ కోసం ఎంతో వెతికిన మీదట మావెరిక్ మళ్లీ వాషింగ్టన్కు వెళ్లిపోయింది. దీనితో అందులోని ఆయుధాలు అమెరికా కస్టమ్స్ అధికారులకు పట్టుబడిపోయాయి. ఈ విషయాన్ని అమెరికా ఇంగ్లండ్‌కు చేరవేసింది. మావెరిక్ను కెప్టెన్ పసిఫిక్ మీదుగా డచ్ ఈస్టిండీస్కు చేర్చుతూ తమ నౌకలో ఆయుధాలు ఏమీ రాలేదనీ, కొంత విప్లవ సాహిత్యం, కొందరు విప్లవకారులు మాత్రమే వచ్చారని జర్మనీకి తెలియచేసింది. ఈ విషయం తెలియక పాపెన్ రెండో దఫా ఆయుధ సంపత్తిని కూడా బెర్లిన్ కమిటీ మరొక ప్రతినిధి హన్స్ టాషెర్ ద్వారా ఓడ ఎక్కించాడు. 1915 జూన్ నెల మధ్యలో హాలెండ్ అమెరికన్ స్టీవ్‌ు షిప్ ఎస్ఎస్ డెంబర్లో ఇవి ఈస్ట్ ఇండీస్‌లోని సురాబాయా వెళ్లాయి. ఇదంతా బ్రిటిష్ పాలకులను మూకుమ్మడిగా హత్య చేయాలన్న ఒక పథకం. అందుకు ఎంచుకున్న సమయం 1915 డిసెంబర్ 25. అదే క్రిస్మస్ కుట్ర. ఏటా క్రిస్మస్కు బెంగాల్ గవర్నర్ బ్రిటిష్ ప్రముఖులకు విందు ఇస్తాడు. ఆ సమయంలో దాడి చేయడమే ఈ పథకం లక్ష్యం. థాయ్‌లాండ్, బర్మాలలో జర్మనీ ప్రతినిధులు ఎమిల్, థియోడర్ హెల్ఫ్రిచ్. జుగాంతర్ సభ్యుడు జతీంద్రనాథ్ లాహిరి ద్వారా వీరంతా 1915 మార్చి ప్రాంతంలో జతిన్ ముఖర్జీతో లంకె ఏర్పరుచుకోగలిగారు. ఆ తరువాతే జతీంద్రనాథ్ లాహిరీ, నరేంద్రనాథ్ భట్టాచార్యలను బాఘా జతిన్ బటేవియాకు పంపాడు. అక్కడ జర్మన్ దౌత్యవేత్త ద్వారా హెల్ఫ్రిచ్ సోదరులను నరేంద్రనాథ్ కలుసుకోగలిగాడు. అక్కడే మావెరిక్ ఓడ ద్వారా ఆయుధాలు బంగాళాఖాతం తీరానికి చేరుతాయన్న వార్త అందుకున్నారు. బాలసోర్‌లో జతిన్ బృందం వాటిని స్వాధీనం చేసుకోవాలి. జుగాంతర్ సంస్థకు 1915 జూన్–ఆగస్ట్ నెలల మధ్య హెల్ఫ్రిచ్ సోదరుల నుంచి హ్యారీ అండ్ సన్స్ ద్వారా 33,000 రూపాయలు నిధులుగా అందాయి. కలకత్తాకు చెందిన 14వ రాజపుట్ రెజిమెంట్ తన మాట వింటుందని, బాలసోర్ దగ్గర కలకత్తాతో సంబంధాలు కత్తిరిస్తే బెంగాల్‌పై పట్టు సాధించవచ్చునని బాఘా జతిన్ భావించాడు. బెంగాల్‌ను స్వాధీనం చేసుకోవడానికి విప్లవకారులకు చాలినంత సమయం ఉండేటట్టు చేయడానికి థాయ్‌లాండ్ నుంచి వచ్చే ఆయుధాలతో బర్మాలో తిరుగుబాటు చేయాలని కూడా పథకం వేశాడు. దీనికే సయాంబర్మా పథకమని పేరు. ఈ పథకాన్ని 1914 అక్టోబర్‌లో గదర్ పార్టీ రూపొందించింది. ఇందుకోసం చైనా, అమెరికా గదర్ పార్టీ శాఖల సభ్యులు, షాంఘై నుంచి ఆత్మారావ్ు, థకార్సింగ్, బంతాసింగ్; శాన్ఫ్రాన్సిస్కో నుంచి సంతోఖ్‌సింగ్, భగ్వాన్సింగ్ వంటి వారు బర్మా మిలిటరీ పోలీసులను థాయ్‌లాండ్‌లో చొప్పించే పని చేపట్టాలని కూడా నిర్ణయించారు. 1915లోనే ఆత్మారావ్ు కలకత్తా, పంజాబ్‌లలో పర్యటించి జుగాంతర్ సంస్థ సభ్యులు సహా, ఇతర విప్లవకారులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. సయాంలో ఉన్న భారతీయులకు సాయుధ శిక్షణ ఇవ్వడానికి హేరంబాలాల్ గుప్తా, షికాగోలోని జర్మనీ దౌత్యవేత్త మనీలా మార్గం ద్వారా నలుగురిని పంపించారు. బర్మా మిలిటరీ పోలీసులను థాయ్‌లాండ్‌లో చొప్పించే పని అయ్యాక సంతోఖ్‌సింగ్ తిరిగి షాంఘై వెళ్లి, రెండు బృందాలను బర్మాకు పంపే ఏర్పాట్లు చేశాడు. కానీ ఇందులో కొన్ని ప్రయత్నాలను అమెరికా నిరోధించగలిగింది. అయినా థాయ్‌లాండ్‌లోని జర్మనీ దౌత్యవేత్త రెమీ థాయ్–బర్మా సరిహద్దులలోని అడవులలో ఒక శిబిరం ఏర్పాటు చేసి చైనా, కెనడాల నుంచి వచ్చే గదర్ పార్టీ సభ్యులకు సాయుధ శిక్ష ఇచ్చే ఏర్పాట్లు చేశారు. షాంఘైలో ఉన్న జర్మన్ కౌన్సిల్ జనరల్ నిప్పింగ్ పెకింగ్ భద్రతాదళాలలో పనిచేస్తున్న ముగ్గురు అధికారులను స్వాటో అనే చోటికి పంపాడు. అక్కడున్న నార్వే ప్రతినిధికి ఆయుధాల స్మగ్లింగ్‌లో తర్ఫీదు ఇవ్వడానికి ఆ ముగ్గురిని పంపాడు. అదే సమయంలో జతిన్ నాయకత్వంలో బెంగాల్ మీద, అండమాన్‌లోని పీనాల్ కాలనీ మీద జర్మనీ బృందం దాడి చేయాలని కూడా యోచించారు. వందమంది ఉండే జర్మనీ బృందానికి వాన్ ముల్లర్ అనే మాజీ నౌకాదళ అధికారి నాయకత్వం వహిస్తాడు. ఈ పథకమంతా బటేవియాలో ఉండే జర్మనీ జాతీయుడు, తోటల యజమాని విన్సెంట్ క్రాఫ్ట్దే. 1915 మే 14న దీనినే ఇండియన్ కమిటీ ఆమోదించింది. కానీ హఠాత్తుగా పోలీసులకు సమస్తం తెలిసిపోయింది. బెంగాల్, ఒడిశాలలోని రహస్య ప్రదేశాలను చుట్టుముట్టారు. హ్యారీ అండ్ సన్స్ మీద దాడులు జరిగాయి. కప్తిపదాలో జతిన్ ఉన్న సంగతి తెలిసిపోయింది. అతడిని అక్కడ నుంచి వెళ్లిపొమ్మని ముందే సమాచారం వచ్చినా, జతీశ్, నిరేన్ అనేవారి కోసం ఎదురుచూడడంతో కొన్ని గంటలు ఆలస్యమైంది. వారంతా అడవుల గుండా బాలసోర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ పోలీసులకు ఎదురుపడ్డారు. కాల్పులు జరిగాయి. చాలామంది జతిన్ అనుచరులు చనిపోయారు. బాగా గాయపడిన జతిన్ బాలసోర్ ఆసుపత్రిలో చేర్చగా అక్కడే చనిపోయాడు. సయాం, బర్మాలలో కూడా దాడులు జరిగాయి. ఆరుగురు గదర్ వీరులను పట్టుకుని ఉరితీశారు. ఇన్ని దేశాల సహకారంతో ఇంత పకడ్బందీగా వేసిన పథకం ఎలా బయటపడిపోయింది? అండమాన్‌కు ఆయుధాలు చేర్చాలన్న నిప్పింగ్ పథకం గురించి బ్రిటిష్ నిఘా విభాగానికి ఎలా తెలిసింది? ఎవరైతే ఈ పథకం రచించాడో, అతడు విన్సెంట్ క్రాఫ్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చేశాడు. ఇతడు డబుల్ ఏజెంట్ (శత్రుదేశం కోసం పనిచేసే దేశ పౌరుడు). బెంగాల్లో 1909లో తొలి క్రిస్మస్ కుట్ర జరిగింది. మళ్లీ 1915లో జరిగింది. రెండో కుట్రలో జర్మనీ నిర్వహించిన పాత్రతోనే తరువాత ఆ దేశం మీద సుభాష్‌చంద్ర బోస్ నమ్మకం పెంచుకున్నారా? కావచ్చు. -
ఆత్మహత్య చేసుకున్నప్పటికీ భౌతికకాయాన్నే ఉరి తీశారు...సేఫ్టీవాల్వ్ అందుకే...!
ఈస్టిండియా కంపెనీ అనుభవాలను గుణపాఠాలుగా మలచుకోక తప్పని ఒక క్లిష్ట వాతావరణం బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి ఎదురైంది. భారతీయులతో, స్థానిక పాలకులతో కంపెనీ వ్యవహరించిన విధానం స్థానికులను తిరుగుబాట్లకు ప్రేరేపించేదే! కంపెనీకి విదేశాలతో గొడవ పెట్టుకునే అవకాశం లేదు. కొన్ని పనులకు బ్రిటిష్ రాణి అనుమతి తీసుకోక తప్పేది కాదు. కానీ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ పరిధి పెద్దది. ఇరుగు పొరుగు దేశాల వ్యవహారాలలో జోక్యం చేసుకుంది. కంపెనీ నీచత్వం సరే, దానికేమీ తీసిపోని రాణి పాలన కారణంగాను 1857 తరువాత కూడా ప్రజానీకంలో చల్లారని ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. రాణి వాటిని చల్లార్చే ప్రయత్నమేమీ చేయలేదు. అన్ని వైపుల నుంచి ఆగ్రహ జ్వాలలు చుట్టుముట్టాయి. ఈ వేడిని తగ్గించే ఒక వ్యూహంలో భాగంగానే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు కోసం ఏ ఓ హ్యూమ్ అక్షరాలా కాలికి బలపం కట్టుకుని మద్రాస్, బొంబాయి, పూనా నగరాలు తిరిగాడు. ఒక సేఫ్టీవాల్వ్ ఏర్పాటు అవసరమని బ్రిటిష్ ఇండియా ఎందుకు అంతగా తహతహలాడిందో తెలియాలంటే జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు ముందు నాటి రగులుతున్న భారతదేశం ఎలా ఉన్నదో చూడాలి. 1885కు ముందు, అంటే కాంగ్రెస్ స్థాపనకు ముందు ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ ఇండియా హయాంలలో దేశం నలుమూలలా ఆగ్రహావేశాలు చెలరేగాయి. హిందీ ప్రాంతాలు సరే, అస్సాం, బెంగాల్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్ర, నిజాం ప్రాంతాలలో కూడా తిరుగుబాట్లు జరిగాయి. తిరగబడిన దాదాపు అందరినీ ఉరికంబాలు ఎక్కించారు. నెర్కట్టుంసేవల్ పాలెగార్ (పాలెగాడు) పులిదేవర్. ఇది తిరునేల్వేలి దగ్గర ఉంది.1757లో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా ఇతడు పోరాడాడు. ఊండివరన్, వెన్నికలాది ఈయన సైన్యాధిపతులు. కంపెనీ మీద తిరగబడిన తొలి భారతీయునిగా ఇతడికి పేరుంది. అప్పుడే బెంగాల్లో సిరాజుద్దౌలాకీ కంపెనీకీ మధ్య ప్లాసీ యుద్ధం జరిగింది. మరుధు పాండియార్లు (పెరియ మరుధు, చిన్న మరుధు) వీరు 18వ శతాబ్దం చివరిలో శివగంగై పాలకులు. వీరు కంపెనీ ఆధిపత్యం మీద తిరుగుబాటు చేశారు. ఈ ఇద్దరినీ ఉరి తీశారు. 18వ శతాబ్దంలో దక్షిణాదిన కనిపించే మరొక వీరుడు వీరపాండ్య కట్టబొమ్మ కరుతయ్య నాయకర్. పాంచాలన్కురుచిని పాలించేవాడు. ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యాన్ని ప్రశ్నించినందుకు 1799లోనే ఉరి తీశారు. 1808–09 నాటి వేలు తంపి తిరుగుబాటు కూడా చరిత్రలో ఎంతో కీలకమైనది. తిరువాన్కూర్ దివాన్ వేలు తంపిని పదవి నుంచి తొలగించాలని కంపెనీ కుట్ర పన్నింది. సైన్య సహకార పద్ధతితో సంస్థానాన్ని దోచేస్తున్న కంపెనీ ఆగడాలను అడ్డుకొనే ప్రయత్నం చేయడమే తంపి చేసిన పాపం. చివరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పటికీ భౌతికకాయాన్నే ఉరి తీశారు. మహారాష్ట్ర ప్రాంతం సతారాలో 1822–25 ప్రాంతాలలో జరిగిన రామోసీల తిరుగుబాటు కూడా కంపెనీని భయపెట్టింది. రామోసీలు అంటే పోలీసు, సైనిక వ్యవస్థలో ఉండే అత్యంత కింది స్థాయి ఉద్యోగులు. వీరే చిత్తూర్‌సింగ్ నాయకత్వంలో తిరగబడ్డారు. చిత్రంగా వీరు పెంచిన భూమిపన్నుకు వ్యతిరేకంగా ఆ తిరుగుబాటు చేశారు. ఆంధ్ర ప్రాంతాన్ని కబళించే ప్రయత్నం 1766 నుంచి కంపెనీ ఎలా చేసిందో ప్రొఫెసర్ కెఎస్ఎస్ శేషన్ ‘ఎర్లీ యాంటీ బ్రిటిష్ రివోల్ట్స్ ఇన్ ఆంధ్ర 1766–1857’ పుస్తకంలో వివరించారు. స్థానిక పాలకుల పట్ల ఈస్టిండియా కంపెనీ చూపిన అవమానకర వైఖరితోనే ఆ తిరుగుబాట్లు జరిగాయని శేషన్ అంటారు. సర్కార్ గడ్డ మీద మైదాన ప్రాంతంలో పెద్ద జమీందార్లు, మన్య ప్రాంతాలలో చిన్న జమీందార్లు కూడా తిరుగుబాట్లు చేశారు. తమను ఆర్కాట్ నవాబు అధికారం నుంచి తొలగించడం, నవాబుకు కంపెనీ అండ ఉండడం వంటి కారణాలతో ఈ తిరుగుబాట్లు సాగాయి. 1846 నాటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం, విశాఖపట్నం, మొమినాబాద్, బొల్లారం తిరుగుబాట్లు కూడా అలాంటివే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తండ్రి మల్లారెడ్డి పాలెగాడు. కర్నూలు జిల్లాలో కంపెనీ దమనకాండకు నిరసనగా పోరుబాట పట్టిన ఐదువేల మంది రైతులకు నరసింహారెడ్డి నాయకత్వం వహించాడు. ఈయన సేనాపతి వడ్డె ఓబన్న. రైత్వారీ విధానం, పన్ను పెంపు మీద రైతులు తిరగబడ్డారు. ఇతడి చేతిలో పెద్ద ఎత్తున కంపెనీలు సేనలు హతమయ్యాయి. 1847 ఫిబ్రవరి 22న నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరి తీయడంతో ఉద్యమం చల్లారిపోయింది. 19వ శతాబ్దంలో తూర్పు భారతంలో ముఖ్యంగా అస్సాంలో కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగాయి. యాండాబు ఒప్పందం (1826) మేరకు అస్సాం కంపెనీ అధీనంలోకి వచ్చింది. యథాప్రకారం కంపెనీ కిందకు అస్సాం రావడం, కల్లోలం ఆరంభం కావడం ఏకకాలంలో జరిగాయి. తిరుగుబాట్లలో అటు పై వర్గాల వారు, మధ్య, దిగువ తరగతుల వారు కూడా పాల్గొన్నారు. అలాంటి ప్రయత్నం చేసిన వారిలో మొదటివాడు గోంధార్ కున్వార్. కుందురా దీకా ఫుఖాన్, దామోదర్, హర్నాథ్ ఇతర స్థానిక పాలకులు కూడా అతడికి సహకరించారు. వీరంతా కలసి 1828లో సాడియా అనే చోట కంపెనీ ఆయుధాగారం మీద దాడి చేశారు. ఇది విఫలమైంది. మళ్లీ పియాలీ బర్ఫూఖన్ నాయకత్వంలో మరొక తిరుగుబాటు జరిగింది. ఈయనకు జీయురాం దూలియా బారువా, బేణుధర్ కున్వార్, రూప్‌చంద్ కున్వార్, దేయురాం దిహింగియా, బౌవ్‌ు చింగ్‌ఫూ, హర్నాథ్ తదితరులు సహకరించారు. రంగపూర్‌లో ఉన్న బ్రిటిష్ శిబిరాన్ని దగ్ధం చేయాలని పియాలీ బర్ఫూఖన్ నాయత్వంలో జరిగిన కొత్త ప్రయత్నం విజయవంతమైంది. కానీ పియాలీ, జియురాం బారువా, ఇంకొందరు ఆందోళనకారులను కంపెనీ అధికారులు పట్టుకున్నారు. పియాలీ, జియురాంలను ఉరి తీసి, మిగిలిన వారిని ద్వీపాంతరం పంపారు. ఇదే సమయంలో ఎగువ అస్సాంలో పనిచేసే కొందరు కంపెనీ బ్రిటిష్ జాతీయులను చంపాలని గదాధర్ గొహిన్ అనే మరొక వీరుడి నాయకత్వంలో ప్రయత్నించారు. కానీ ఇది విఫలయింది. గదాధర్‌ను జైలులో పెట్టారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆ జ్వాలను అస్సాంకు తీసుకుని వెళ్లినవాడు మణిరాం దివాన్. ఆ సమయంలో కలకత్తా వెళ్లి, మరొక ఉద్యమకారుడు మధు మల్లిక్ సాయంతో పథకం వేశాడు. 1857 ఘటన వార్తలను అస్సాం సంస్థానం ఆఖరి పాలకుడు కందర్పేశ్వర్ సింగ్, సలహాదారు పియాలీ బారువాకు మణిరాం అందించేవాడు. ఈ పథకంలో ఇంకా మాయారాం నజిర్, నీలకంఠ చోలాధర ఫుఖాన్, మారంగికోవె గొహిన్, ద్యుతిరాం బారువా, బహదూర్ గాన్బురా, ఫార్ముద్ అలీ, త్రినయ, కమల బారువా పనిచేశారు. సాహాబాద్ అనేచోట ఉన్న సిపాయీల మద్దతే వీరికి కీలకమైంది. ఈ పథకం ప్రకారం సిపాయీలంతా, అస్సాం పాలకుని నాయకత్వంలో కంపెనీ అధికారుల మీద తిరగబడాలి. ఇంతలో మణిరాం కలకత్తా నుంచి ఆయుధాలతో వచ్చి కలుస్తాడు. పథకం అమలులో కొద్దిపాటి ఆలస్యం కావడంతో కంపెనీ వెంటనే అప్రమత్తమై తిరుగుబాటులో ఉన్నవారందరినీ అదుపులోకి తీసుకుంది. కలకత్తా నుంచి పనిచేస్తున్న మణిరాంను కూడా అరెస్టు చేశారు. కందర్పేశ్వర్‌సింగ్‌ను కారాగారంలో పెట్టారు. చాలామందిని ద్వీపాంతరం పంపారు. మణిరాం, పియాలీ జోర్హాట్ కారాగారంలోనే చనిపోయారు. 1861, 1894లలో ఫులగారి, పత్థర్‌ఘాట్ అనేచోట రైతాంగ పోరాటాలు జరిగాయి. ఇలాంటివి ఇంకా ఎన్నో! - డా. గోపరాజు నారాయణరావు చదవండి: Needle Free Injection: సూదిలేని ఇంజెక్షన్ వచ్చేసింది.. నొప్పి లేకుండా... -
నాటి దుశ్చర్యలో వెలుగుచూడని నిజాలెన్నో..
జలియన్‌వాలా బాగ్ సభ మీద 1919 ఏప్రిల్ 13న జనరల్ డయ్యర్ పేల్చిన తూటాలు 1,650. అక్కడకి 31 మైళ్ల దూరంలో ఉన్న లాహోర్‌లో 1940 మార్చి 19న ఊరేగింపుగా వెళుతున్న ఒక సమూహం మీద డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ పీసీడీ బీటీ ఆదేశాల మేరకు పోలీసులు కాల్చినవి 1,620. ముప్పయి మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం 200 మంది చనిపోయారు, ఛిద్రమైన శవాలను ట్రక్కుల్లోకి విసిరి తీసుకుపోయారు. నిర్బంధాలను ఎత్తివేయాలని కోరుతూ శాంతియుతంగా ప్రదర్శన జరుపుతున్న ఖక్సర్ తెహ్రీక్ కార్యకర్తలపై 1,620 తూటాలు కాల్చినట్టు అక్కడి పోలీస్ స్టేషన్ గుమాస్తా (మొహరీర్) నమోదు చేశాడు. కాల్పుల వార్తను ప్రపంచ పత్రికలు ప్రచురించాయి. సర్ డగ్లస్ యంగ్ అధ్యక్షునిగా హైకోర్టు న్యాయమూర్తులతో దర్యాప్తు సంఘం నియమించారు కూడా. కానీ నివేదిక వెలుగు చూడలేదు. ఇంతకీ ఏమిటీ ఖక్సర్ తెహ్రీక్? భారత స్వాతంత్య్ర సమరంలో జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్, గదర్ పార్టీ, హిందూ మహాసభ, స్వరాజ్య పార్టీ హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ వంటివెన్నో కనిపిస్తాయి. అలాంటిదే ఖక్సర్ తెహ్రీక్. ఖక్సర్ అంటే అర్థం అణకువ కలిగినవాడు. నలభై లక్షల సభ్యత్వంతో (1942 నాటికి), దేశంలోను, విదేశాలలో కూడా శాఖలు నెలకొల్పింది. దీని మీద భయంకరమైన నిర్బంధం ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం అణచివేతే కాదు, మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలోని అఖిల భారతీయ ముస్లిం లీగ్ కూడా ఖక్సర్‌ను పరమ శత్రువులాగే చూసింది. ఎంత శత్రుత్వం అంటే, 1943 జూలై 20న బొంబాయిలో జిన్నా మీద ఆయన ఇంట్లోనే హత్యాయత్నం జరిగింది. ఆ పని చేసిన రఫీక్ సాబిర్ ఖక్సర్ సభ్యుడని అనుమానించారు. పంజాబ్ ప్రీమియర్, ముస్లింలీగ్ ప్రముఖుడు సర్ సికిందర్ హయత్‌ఖాన్ కూడా ఖక్సర్ మీద కక్ష కట్టాడు. స్వరాజ్య ఉద్యమం దేనికి? బ్రిటిష్ పాలన అంతానికి! ఈ విషయం మీద ఉన్న స్పష్టత స్వతంత్ర భారత ప్రభుత్వం గురించి ఎక్కువమందికి లేదంటే అతిశయోక్తి కాదు. ఆ విషయం ఆలోచించిన సంస్థ ఖక్సర్. హిందూముస్లిం ప్రభుత్వమే స్వతంత్ర భారత్‌ను పాలించాలన్నది సంస్థ ఆశయాలలో ఒకటి. 1936 నవంబర్ 29న సియాల్కోట్లో నిర్వహించిన సమావేశంలో ఒక ప్రణాళికను రూపొందించుకుంది (మష్రికి మనుమడు నాసివ్ు యూసఫ్ సేకరించిన వివరాలు, ఇతర చరిత్రకారులు సేకరించిన విషయాలు ఎన్నో). దైవం ఆధిపత్యాన్ని అంగీకరించడం, జాతీయ సమైక్యత, మానవ సేవ వంటి సిద్ధాంతాలను ఖక్సర్ స్వీకరించింది. సమాజంలోని అంతరాలను సరిచేయడమనే సంస్థ సూత్రాన్ని గౌరవిస్తూ పారను చిహ్నంగా తీసుకుంది. ఎక్కువ ముస్లిం సిద్ధాంతాల ఛాయలు ఉన్నా, ఖక్సర్లో సభ్యుడు కావడానికి మతం, ప్రాంతం, కులం, వర్ణం అడ్డు కాలేదు. కానీ వేయేళ్లు ఈ దేశాన్ని పాలించిన ముస్లింల పూర్వ వైభవం ఖక్సర్ ఆశయాలలో ఒకటన్నది నిజం. ఖక్సర్ దేశ విభజనను వ్యతిరేకించింది. అందుకే అఖండ భారత్ కోసం, విభజనను నిరోధించడానికి చివరి యత్నంగా 1946లో ఒక రాజ్యాంగాన్ని కూడా తెచ్చింది. మొత్తం 17 ఏళ్ల పాటు స్వాతంత్య్ర సమరంలో ఈ సంస్థ పాల్గొన్నది. లాహోర్ కేంద్రంగా ఉద్యమించిన ఖక్సర్ తెహ్రీక్‌ను 1931లో అల్లామా ఇనాయతుల్లా అల్ మష్రికి (25 ఆగస్ట్ 1888– 27 ఆగస్ట్ 1963) స్థాపించాడు. సంస్థ నిబంధనలకు కచ్చితంగా లోబడి ఉండడమే కాదు, సభ్యులు ఉద్యమానికి సమయం ఇవ్వడంతో పాటు, దేశం కోసం ఎవరి వ్యయం వారే భరించాలి. అచ్చంగా బ్రిటిష్ పోలీసుల యూనిఫామ్‌ను పోలి ఉన్న దుస్తులు ధరించేవారు. దాని మీద సోదరత్వం అన్న నినాదం (ఉఖూవ్వాత్) ఉండేది. నాయకుడు సహా అంతా ఇదే ధరించేవారు. మష్రికి అనేకసార్లు కారాగారం అనుభవించాడు. 1942 జనవరి 19న వెల్లూరు జైలు నుంచి విడుదలచేసి... మద్రాస్ ప్రెసిడెన్సీ దాటకూడదని ఆంక్షలు పెట్టారు. సంస్కరణ, వ్యక్తి నిర్మాణం, దేశం కోసం త్యాగం ఖక్సర్ ఆశయాలు. ఇరుగు పొరుగులకు సేవ కార్యక్రమంలో అంతర్భాగం. ఇక్కడ ముస్లింలు, ముస్లిమేతరులు అన్న భేదం లేదు. పరిసరాలను శుభ్రం చేస్తూ, పేదలు, వృద్ధులు, రోగులకు సేవలు అందించాలి. మష్రికి ఇస్లామిక్ పండితుడు, మేధావిగా గుర్తింపు పొందాడు. అమృత్‌సర్‌కు చెందిన ముస్లిం రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టిన మష్రికి కేంబ్రిడ్జ్ నుంచి గణితశాస్త్ర పోస్ట్ గ్రాడ్యుయేట్. 1912లో స్వదేశం వచ్చి 25 ఏళ్లకే కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు. 29 ఏళ్లకి విద్యాశాఖ అండర్ సెక్రటరీ అయ్యాడు. మొగల్ దర్బార్‌లో కీలక పదవులు అనుభవించిన కుటుంబం వారిది. తండ్రి ఖాన్ అటా మహ్మద్ ఖాన్ న్యాయవాది. ‘వకీల్’ అనే పక్షపత్రిక నడిపేవారు. కాంగ్రెస్ స్థాపన సమయంలో దేశంలో ఎంతో ఖ్యాతి వహించిన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వంటివారికి అటా ఖాన్ సన్నిహితుడు. వీటన్నింటికీ మించి ఖురాన్‌కు మష్రికి రాసిన వ్యాఖ్యానం (తాజ్కిరా) నోబెల్ సాహిత్య బహుమానం పరిశీలనకు పంపారు. తత్త్వశాస్త్రం మీద కొన్ని రచనలు చేశాడు. మష్రికి 1939లో బ్రిటిష్ ప్రభుత్వానికి తుది హెచ్చరికలు చేయడం ఆరంభించాడు. సంవత్సరంలోనే ఖక్సర్ తన లక్ష్యాన్ని చేరుకుంటుందని ప్రకటించాడు. అలా జరగకపోతే సంస్థను రద్దు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మరొక రెండున్నర లక్షలమందిని సభ్యులుగా చేర్చాలని అనుచరులను ఆదేశించాడు. ఖక్సర్ ప్రమాదకరంగా తయారైందని 1939లోనే పంజాబ్ గవర్నర్ హెన్రీ డఫీల్డ్ వైస్రాయ్ లిన్లిత్గోకు ఇచ్చిన నివేదికలో వెల్లడించాడు. ఇలాంటి నివేదికే మధ్య పరగణాల నుంచి కూడా వెళ్లింది. ఒకసారి ఢిల్లీలో మాట్లాడిన తరువాత మష్రికి మీద జిన్నా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మష్రికి ఒక ఉన్మాది అని వ్యాఖ్యానించాడు. ఇదే బ్రిటిష్ ప్రభుత్వానికి ఉపకరించింది. మరింత కర్కశంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. నాటి పంజాబ్ ప్రీమియర్ హయత్‌ఖాన్, ‘రెండు రోజులలోనే ఖక్సర్ పనిపడతానని’ చెప్పాడని మష్రికి అనుచరుడు రజా షేర్ జమీన్ తన పుస్తకంలో నమోదు చేశాడు. రెండో ప్రపంచ యద్ధంలో పరిస్థితులను బట్టి భారత్‌లో తలనొప్పులు లేకుండా చేసుకోవడానికి హయత్ఖాన్కు ఖక్సర్ అణచివేతకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనితోనే సంస్థ నిషేధానికి ఎత్తులు మొదలయినాయి. దుష్ప్రచారమూ మొదలయింది. జర్మనీ నాజీలతో ఖక్సర్కు సంబంధాలు ఉన్నాయని ‘ది ట్రిబ్యూన్’ పత్రికలో ఒక వ్యాసం వెలువడింది. పంజాబ్ అసెంబ్లీలో కూడా పథకం ప్రకారం సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ఖక్సర్ ఉద్యమంలో మతోన్మాదమే ఉందని హయత్‌ఖాన్ సమాధానం ఇచ్చాడు. నిజానికి అందులో ముస్లింలు, హిందువులు, సిక్కులు కూడా ఉన్నారు. అప్పుడే లాహోర్‌లో 1940 మార్చి 19న ఖక్సర్ ప్రదర్శన మీద కాల్పులు జరిగాయి. ఆ రోజే నిషేధించారు.లాహోర్ ప్రదర్శన మీద కాల్పులు, జిన్నా మీద హత్యాయత్నం రెండూ పథకం ప్రకారం జరిగినవేననీ, వాటి వెనుక, బ్రిటిష్ ప్రభుత్వం, జిన్నా ఉన్నారంటూ మష్రికి 1943లో పత్రికా ప్రకటన ఇచ్చాడు. ఒక దశలో జిన్నా రాజకీయంగా బలహీనపడినప్పుడు ఖక్సర్ సభ్యులు లీగ్ జెండా కిందకు రావాలని ఆశించాడని చెబుతారు. 1947 జూలై 4న సంస్థను మష్రికి రద్దు చేశాడు. అయినా అతడి మరణానంతరం పాకిస్తాన్లో దానిని పునరుద్ధరించారు. - డా. గోపరాజు నారాయణరావు చదవండి: 900 యేళ్లనాటి ఈ గ్రామానికి రెండే ద్వారాలు... కారణం అదేనట.. -
మన తొలి ప్రభుత్వం అలా ఏర్పడింది.. ఆయన ప్రధానైతే కథ వేరేలా.. !
ఈ సువిశాల భారతం ఒకే ప్రభుత్వం కింద ఉన్న కాలం చరిత్రలో తక్కువే. క్రీస్తుపూర్వమో, మధ్య యుగాలలోనో కొంతకాలం కొంతమంది మన పాలకులు మొత్తం భారతావనిని పాలించే అవకాశం దక్కించుకున్నారు. అప్పుడు కూడా కొన్ని భూభాగాలు చక్రవర్తులో, పాదుషాలో వారి అధీనంలో లేవు. అయినా యావద్భారతావనిని వారు ఏలారని అనుకోవచ్చు. కొన్ని శతాబ్దాల క్రితం భారతదేశం కోల్పోయిన ఆ అవకాశం మళ్లీ 1946లోనే వచ్చింది. తాత్కాలిక ప్రాతిపదికనే కావచ్చు, అప్పుడే భారత దేశానికి భారతీయులతో కూడిన ప్రభుత్వం కొలువైంది. ఇది చరిత్రలో అపురూపం. రాజకీయ ఏకత్వానికి ఆధునిక యుగంలో అదే తొలి అడుగు. కొద్దినెలలే అయినా ఆ తాత్కాలిక సంకీర్ణం అఖండ భారతాన్ని పాలించిందన్న విషయం ప్రత్యేకమైనదే. కానీ రక్తపాతాల మధ్య భారత విభజన పనిని పూర్తి చేసినదీ ఆ ప్రభుత్వమే. రెండో ప్రపంచ యుద్ధం తరువాత తన వలస దేశాలలో యూనియన్ జాక్‌ను అవనతం చేయాలని ఇంగ్లండ్ నిర్ణయించుకుంది. ఎంత ఇష్టం లేకపోయినా అలా వదులుకోవలసిన దేశాలలో భారత్ మొదటిది. దీనికి తొలిమెట్టు పాలనా వ్యవహారాలలో బ్రిటిష్ ప్రభుత్వం పక్కకు తొలగి, జాతీయ సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించడమే. బ్రిటిష్ ఇండియా ఏర్పాటు చేస్తున్న ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వాములు కావలసిందని వైస్రాయ్ లార్డ్ ఆర్చిబాల్డ్ వేవెల్ 1946 జూలై 22న భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు జవహర్లాల్ నెహ్రూకు, ముస్లింలీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు లేఖలు రాశాడు. ఆ ప్రభుత్వంలో 14 శాఖలు ఉంటాయనీ, ఆరు కాంగ్రెస్‌కు, ఐదు లీగ్‌కు, మైనారిటీలకు మూడు వంతున ఇవ్వాలని నిర్ణయించినట్టు కూడా అదే లేఖలో వివరించాడు వేవెల్. ముఖ్యమైన శాఖల విషయంలో కాంగ్రెస్, లీగ్‌ల మధ్య సమతౌల్యం పాటిస్తామనీ చెప్పాడు. కానీ ఈ ప్రతిపాదనను ఆ ఇద్దరూ నిరాకరించారు. భారత కార్యదర్శి సలహా మేరకు వేవెల్ ముస్లింలీగ్‌ను పక్కన పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 1946 ఆగస్ట్ 12న కాంగ్రెస్‌ను ఆహ్వానించాడు. అదే సమయంలో తన ప్రతిపాదనలు ఏమైనప్పటికీ వాటిని జిన్నాతో చర్చించే అధికారం కూడా అప్పగించాడు వేవెల్. నెహ్రూ జిన్నాతో చర్చించారు. కానీ ప్రయోజనం కనిపించలేదు. మరొక పక్క మత కల్లోలాలు తీవ్రమవుతున్నాయి. నెహ్రూను తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచి తప్పు చేశానేమోనని వేవెల్ శంకించడం మొదలుపెట్టాడు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుతో దేశంలో తిరుగుబాటు వస్తుందేమోనని బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ భయపడ్డాడు. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు కూడా వైస్రాయ్ వేవెల్ తీసుకున్నాడు. ఇన్ని పరిణామాల తరువాత 1946 సెప్టెంబర్ 2న కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వంలో భాగస్వామి అయింది. ఈ ప్రభుత్వంలో చేరేవారిని అంతకు ముందే ఆవిర్భవించిన భారత రాజ్యాంగ పరిషత్ నియమించింది. భారత రాజ్యాంగ పరిషత్‌లో 389 మంది సభ్యులకు అవకాశం కల్పించారు. ఇందులో 292 మందిని 11 ప్రావిన్సుల శాసనసభల ప్రజా ప్రతినిధులు ఎన్నుకున్నారు. 93 మంది సంస్థానాల ప్రతినిధులు. మరొక నలుగురు ఢిల్లీ, అజ్మీర్–మార్వాడా, కూర్గ్, బ్రిటిష్ బలూచిస్తాన్ల నుంచి వచ్చిన సభ్యులు. 1946 ఆగస్ట్ నాటికి 11 ప్రావిన్స్‌ల చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. అంటే 292 స్థానాలు. ఇందులో కాంగ్రెస్ 208 స్థానాలు గెలిచింది. ముస్లింలీగ్ 73 స్థానాలు గెలిచింది. హిందువులు ఆధిక్యం ఉన్నచోట కాంగ్రెస్, ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట లీగ్ ప్రధానంగా గెలిచాయి. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైనా, ముస్లిం లీగ్ కాంగ్రెస్‌కు సహకరించడానికి నిరాకరించింది. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ఒక విస్తృత ధ్యేయాన్ని నిర్వర్తించడానికి ఏర్పాటు చేశారు. విభజన ప్రక్రియను సజావుగా సాగించి, అధికార బదలీని వేగవంతం చేయడానికి అది ఏర్పాటైందన్నది నిజం. బ్రిటిష్ ప్రభుత్వం విన్నపం మేరకు కాంగ్రెస్ ఇందులో చేరడానికి అంగీకరించింది. మరోవైపు ముస్లింల కోసం వేరొక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని లీగ్ కొత్త కోర్కెను తెర మీదకు తెచ్చింది. రాజ్యాంగ పరిషత్‌లో మెజారిటీ కాంగ్రెస్‌దే కాబట్టి, కాంగ్రెస్ అంటే హిందువుల సంస్థ అనే లీగ్ నిశ్చితాభిప్రాయం కాబట్టి లీగ్ ఈ గొంతెమ్మ కోర్కె కోరింది. తమతో కలసి పనిచేయడానికి లీగ్ నిరాకరించినందున పార్టీకే చెందిన 12 మందిని కాంగ్రెస్ ఎంపిక చేసింది. వీరిలో ముగ్గురు ముస్లింలు. తరువాత మనసు మార్చుకున్న ముస్లిం లీగ్ అక్టోబర్ 26న తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. కానీ తమ మంత్రులు నెహ్రూకు జవాబుదారీగా ఉండబోరని షరతు పెట్టింది. ముగ్గురు ముస్లిం లీగ్ సభ్యులకు అవకాశం కల్పించడానికి వీలుగా ముగ్గురు కాంగ్రెస్ వారు రాజీనామా చేశారు. వారు శరత్చంద్ర బోస్, సయ్యద్ అలీ జహీర్, షఫత్ అహ్మద్ ఖాన్. తాత్కాలిక ప్రభుత్వంలోని కార్యనిర్వాహక విభాగానికి వైస్రాయ్ కార్యనిర్వాహక మండలి అనుబంధంగా పని చేస్తుంది. తాత్కాలిక ప్రభుత్వానికి ఉపాధ్యక్షుడిగా (అధ్యక్షుడు వైస్రాయ్), జవహర్లాల్ నెహ్రూ ఎంపికయ్యారు. విదేశ వ్యవహారాలు, కామన్వెల్త్ శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఇంకా వల్లభ్‌భాయ్ పటేల్ (హోం, సమాచార, ప్రసార శాఖలు), బల్దేవ్ సింగ్ (రక్షణ), డాక్టర్ జాన్ మత్తయ్ (పరిశ్రమలు, రవాణా), సి. రాజాజీ (విద్య, కళలు), సిహెచ్ భాభా (పనులు, గనులు, విద్యుత్), బాబూ రాజేంద్ర ప్రసాద్ (ఆహారం, వ్యవసాయం), అసఫ్ అలీ (రైల్వే), జగ్జీవన్ రావ్ (కార్మిక), ముస్లిం లీగ్ నుంచి లియాఖత్ అలీ ఖాన్ (ఆర్థిక), టిటి చుంద్రిగర్ (వాణిజ్యం), అబ్దుర్ రబ్ నిష్తార్ (కమ్యూనికేషన్లు), గజాన్ఫార్ అలీ ఖాన్ (ఆరోగ్యం), జోగీంద్రనాథ్ మండల్ (న్యాయం. ఈయన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వంలో అదే శాఖను నిర్వహించి, తరువాత భారత్ వచ్చారు). భారత్‌లో తొలిసారి భారతీయులతో ఏర్పడిన సంకీర్ణం ఏర్పాటులో గాంధీజీ పాత్ర ఏమిటి? కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నెహ్రూ ఎంపిక కావాలన్న తన ఆకాంక్షను 1946 ఏప్రిల్ 20న గాంధీజీ వ్యక్తం చేశారు. అప్పటికే జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎక్కడ లేని ప్రాముఖ్యం వచ్చింది. స్వతంత్ర భారతదేశ ప్రధానిగా కాంగ్రెస్ అధ్యక్షుడే ఎన్నికవుతాడు. నిజానికి ఆ పదవిని తాను కూడా ఆశించానని మౌలానా అబుల్‌కలాం ఆజాద్ తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. కానీ ఈ ఇద్దరినీ కాకుండా 15 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు గాను 12 సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను ఎన్నుకున్నాయి. మిగిలిన మూడు కమిటీలు ఓటు చేయలేదు. ఈ సంగతి స్వయంగా గాంధీజీయే నెహ్రూకు చెప్పారు. రెండో స్థానం నెహ్రూకు ఆమోదయోగ్యం కాదనీ గాంధీయే చెప్పడంతో పటేల్ నెహ్రూకు అనుకూలంగా రంగం నుంచి తప్పుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వం 1947 ఆగస్ట్ 15 వరకు పనిచేసింది. గాంధీజీ కోరుకున్నట్టు నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26 నాటికి రాజ్యాంగ నిర్మాణం పూర్తి చేసింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అదే సంవత్సరం సర్దార్ పటేల్ కన్నుమూశారు. మరి...ఆయనను ప్రధానిని చేసి ఉంటే? - డా. గోపరాజు నారాయణరావు చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! -
జలియన్‌వాలాబాగ్ దురంతం: ఒక జాతి ఆత్మను తాకిన తూటా..
1919 ఏప్రిల్ 13: ఆ రోజు జరిగిన నెత్తుటికాండను అంచనా వేయడంలో నాటి ప్రపంచం, విఖ్యాత మేధావులు అవమానకరంగా విఫలమయ్యారు. కాలమే చెప్పింది, మానవాళి చరిత్రలో అదెంత బీభత్సమో! అదే జలియన్‌వాలాబాగ్ దురంతం. అది భారతీయ ఆత్మ మీద దాడి. ఆ కాల్పులలో 379 మంది చనిపోయారని ప్రభుత్వం చెప్పింది. మృతుల సంఖ్య 1500 వరకు ఉంటుందని నాటి భారతీయుల వాదన. ఈ ఘటన మీద విచారణకు నియమించినదే విలియం హంటర్ కమిషన్. సాక్షులను ఢిల్లీ, అహ్మదాబాద్, బొంబాయి, లాహోర్లకు పిలిచారు. లాహోర్‌లోని అనార్కలీ బజార్లో ఉన్న టౌన్‌హాలు అందుకు వేదిక. 1919 నవంబర్ 19న అక్కడికే వచ్చి వాంగ్మూలం ఇచ్చాడు జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయ్యర్. నిరాయుధుల మీద 90 మంది సైనికుల చేత కాల్పులు జరిపించినవాడు ఇతడే. చాలా ఆలస్యంగా ఘటన వివరాలు బయటకు వచ్చాయి. జాతీయ కాంగ్రెస్ కూడా విచారించింది. తుపాకీ గుళ్లకు బలైన వాళ్లలో ఏడుమాసాల పసిగుడ్డు సహా 42 మంది చిన్నారులూ ఉన్నారని మదన్మోహన్ మాలవీయ చెప్పారు. ప్రభుత్వం లెక్క కూడా దీనికి దగ్గరగానే ఉంది. ఇక వెలుగు చూడని అంశాలూ ఎన్నో! 1919 ఆఖర్లో ఓ రోజు నెహ్రూ అమృత్సర్ నుంచి ఢిల్లీ వరకు ప్రయాణించారు. రాత్రి బండి. ఆయన ఎక్కిన బోగీ దాదాపు నిండిపోయి ఉంది. ఒక్క బెర్త్, అదీ అప్పర్ బెర్త్, ఖాళీగా ఉంది. ఎక్కి నిద్రపోయారు. తెల్లవారుతుంటే తెలిసింది, ఆ బోగీలో ఉన్నవారంతా సైనికాధికారులని. అప్పటికే వాళ్లంతా పెద్ద పెద్ద గొంతులతో మాట్లాడుకుంటున్నారు. ఒకడు మరీ పెద్ద గొంతుతో, కటువుగా మాట్లాడుతున్నాడు. అతడు అంత బిగ్గరగా చెబుతున్నవి, అప్పటికి దేశాన్ని కుదిపేస్తున్న అమృత్సర్, జలియన్‌వాలాబాగ్ అనుభవాలే. అసలు ఆ పట్టణమంతా తనకి ఎలా దాసోహమైందో చెబుతున్నాడు. తిరుగుబాట్లూ, ఉద్యమాలూ అంటూ అట్టుడికినట్టుండే పంజాబ్ తన ప్రతాపంతో ఎలా మోకరిల్లిందో వర్ణిస్తున్నాడు. ముదురు ఊదారంగు చారల దుస్తులలో ఉన్నాడతడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పదిలక్షల మంది భారతీయులు పోరాడారు. 60వేల మంది చనిపోయారు. యుద్ధం తరువాతైనా ఏదో ఒరుగుతుందని ఎదురుచూశారు. ఏం లేకపోగా, అణచివేత ఎక్కువయింది. అందుకే ఒక తిరుగుబాటు మనస్తత్వం వచ్చింది. రాజ్యాంగ సంస్కరణలు జరుగుతాయన్న ఆశ మధ్య తరగతిలో ఉంది. అంటే స్వయంపాలనకు అవకాశం. దీని గురించి ప్రజలు మాట్లాడుకోవడం ఆరంభించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇది బాగా ఉండేది. ఇక పంజాబ్‌లో అయితే మొదటి ప్రపంచ యుద్ధం కోసం రకరకాల పేర్లతో తమ యువకులను సైన్యంలో చేర్చుకున్న సంగతి గుర్తు చేసుకుంటున్నారు. అదే కాకుండా కామగాటమారు నౌక ఉదంతం, అనంతర పరిణామాలు వారిని బాధిస్తున్నాయి. ప్రపంచ యుద్ధం నుంచి తిరిగి వచ్చిన సైనికులు గతంలో మాదిరిగా లేరు. దేశదేశాల సైనికులతో కలసి పనిచేసి ప్రపంచ జ్ఞానంతో వచ్చారు. దశాబ్దాలుగా భారతీయ సైనికులకు జరుగుతున్న అన్యాయం పట్ల గుండె మండిపోతోంది. అలాంటి సందర్భంలో రౌలట్ చట్టం వచ్చింది. ఎలాంటి విచారణ, ఆరోపణ లేకుండానే ఎవరినైనా అరెస్టు చేసే అధికారం ఈ చట్టంతో అధికారులకు వచ్చింది. దేశమంతా ఆగ్రహోదగ్రమైంది. మితవాద కాంగ్రెస్ నాయకులకు కూడా ఆవేశం వచ్చింది. రౌలట్ చట్టాన్ని తీసుకురావద్దని గాంధీజీ కోరారు. ఆ చట్టానికి వ్యతిరేకత తెలియచేయడానికి సత్యాగ్రహ సభ పేరుతో ఉద్యమం ప్రారంభించారు. పంజాబ్ మరీ ఉద్రేకపడింది. ఫలితం జలియన్‌వాలాబాగ్. పంజాబ్‌కూ మిగిలిన దేశానికీ మధ్య బంధం తెగిపోయింది. సైనిక శాసనం నడుమ చిన్న వార్త కూడా రావడం లేదు. ఆ దురంతం జరిగిందని తెలుసు. అది ఎంత ఘోరంగా ఉందోనని దేశంలో గుబులు. సైనిక శాసనం ఎత్తేశారు. దీనితో కాంగ్రెస్ నాయకులు వెల్లువెత్తారు. పండిట్ మదన్మోహన్ మాలవీయ, స్వామి శ్రద్ధానంద నాయకత్వంలో పునరావాస కార్యక్రమం ప్రారంభించారు. వాస్తవాల సేకరణ పనిలో మోతీలాల్, చిత్తరంజన్‌దాస్ ఉన్నారు. దాస్‌కు సహాయకుడు నెహ్రూ (నెహ్రూ స్వీయచరిత్ర, 1936 నుంచి). పది నుంచి పదకొండు నిమిషాలు సాగిన కాల్పులే. కానీ ఆ తుపాకుల నెత్తుటి చరిత్ర అంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంది. దీనితో పాటు ఆనాటి ఆర్తనాదాలు కూడా. కాల్పులు జరపకుండా జనం అక్కడ నుంచి వెళ్లిపోవడానికి అవకాశం ఉన్నా అలా చేయని సంగతిని హంటర్ కమిషన్ ముందు జనరల్ డయ్యర్ ఒప్పుకున్నాడు. ఎందుకు? అలా చేస్తే వాళ్లు తనను చూసి నవ్వుతారన్న అనుమానం. ఇంకా ఎక్కువ మందిని చంపాలంటే మిషన్ గన్లే ఉపయోగించేవాడినని అన్నాడు. గాయపడిన వాళ్ల సంగతి పట్టించుకోవడం తన పని కాదనీ అన్నాడు. ఆ ఘట్టం గురించి చెబుతున్నప్పుడు ‘బీభత్సమైనది’ అనేవాడు. ‘ది బుచర్ ఆఫ్ అమృత్సర్: జనరల్ రెజినాల్డ్ డయ్యర్’ పేరుతో నీజెల్ కోలెట్ రాసిన జీవితకథలో విస్తుపోయే విషయాలు ఉన్నాయి. తాను ఎంత చట్టవిరుద్ధంగా ప్రవర్తించాడో డయ్యర్కూ తెలుసు. అందుకే ఘటన జరిగిన రెండుమూడు రోజులు కథనాలు మార్చి వినిపించాడు. కానీ పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఓడ్వయ్యర్ నుంచి మద్దతు లభించింది. తరువాత చాలామంది బ్రిటిష్ ప్రముఖులు గొప్ప పని చేశాడని పొగడ్తలతో ముంచెత్తారు. స్వర్ణదేవాలయం పెద్దలు జనరల్ డయ్యర్‌ను ‘గౌరవ సిక్కు’ను చేశారు (రిచర్డ్ కావెండిష్, హిస్టరీ టుడే వాల్యూమ్ 59, ఇష్యూ 4, ఏప్రిల్ 2009). 1920 జూలై 8న బ్రిటిష్ పార్లమెంట్ ప్రభువుల సభలో చర్చ జరిగింది. ఎక్కువమంది డయ్యర్‌ను సమర్థించారు. యుద్ధ వ్యవహారాల కార్యదర్శి విన్స్టన్ చర్చిల్ మాత్రం అది బ్రిటిష్ విధానం కాదని అన్నాడు. హంటర్ కమిషన్ తీవ్ర విమర్శలతో డయ్యర్‌ని ఆ ఏడాదే ఉద్యోగం నుంచి తొలగించి ఇంగ్లండ్ పంపేశారు. అయినా ‘బాగ్ హీరో’గా ‘మార్నింగ్ పోస్ట్’ అనే బ్రిటిష్ పత్రిక తన నిధితో డయ్యర్‌ను సత్కరించదలిచింది. ఇంగ్లండ్ పత్రికలు సరే, బ్రిటిష్ ఇండియా నుంచి ‘కలకత్తా స్టేట్స్‌మన్’, ‘మద్రాస్ మెయిల్’ వంటి పత్రికలూ నిధి సేకరించాయి. మొత్తం 28,000 పౌండ్లు. కానీ అది తీసుకోవడానికి డయ్యర్ నిరాకరించాడు. అప్పటికే అతనిలో అభద్రతాభావం పేరుకుపోయింది. పైగా ఆర్టియోసెరిలోసిస్ వ్యాధి. చిన్నపాటి ఉద్వేగానికి గురైనా చావు తప్పదు. అంతేకాదు, బాగ్ ఘటన పేరుతో తాను మళ్లీ ప్రపంచానికి గుర్తుకు రావడం ఇష్టం లేదన్నాడు. బ్రిస్టల్ పట్టణం శివార్లలో ఎవరికీ పట్టనట్టు ఉండే సోమర్సెట్ కుగ్రామంలోని చిన్న కొండ మీద కట్టిన కాటేజ్‌లో భార్య అనీతో కలసి రహస్యంగా జీవించాడు. అక్కడే 1927 జూలై 23న చనిపోయాడు. మొదట గుండెపోటు వచ్చింది. అప్పుడు కూడా అతడు బాగ్ గురించే ప్రస్తావించాడంటారు జీవితకథ రాసిన కోలెట్. డయ్యర్‌కు రెండుసార్లు అంత్యక్రియలు జరిగాయట. మొదట అతని స్వగ్రామంలో, మళ్లీ సైనిక లాంఛనాలతో. అలా ముగిసింది అతని జీవితం. ఆరోజు రైలు ప్రయాణంలో నెహ్రూ చూసిన ఆ ఊదారంగు చారల దుస్తులలో ఉన్న వ్యక్తి ఢిల్లీలో దిగిపోయాడు. లాహోర్‌లో ఏర్పాటు చేసిన విచారణ సంఘం ముందు హాజరై వస్తున్నాడు. అతడే జనరల్ డయ్యర్. - డా. గోపరాజు నారాయణరావు -
రతన్‌బాయి- జిన్నా.. వారిది విచిత్ర వివాహం
దేశ విభజన, దేహ విభజన వేర్వేరు కావు. పోలండ్, జర్మనీ, వియత్నాం, కొరియా, యెమెన్ వంటి దేశాలు విడిపోయాయి. కొన్ని మళ్లీ ఏకమైనాయి. ఏ దేశ విభజనైనా విషాదాంతమే. ఫలశ్రుతి ఒక్కటే. జీవితాలు ఛిన్నాభిన్నం. అనుబంధాల నిలువుకోత. వలసలు, తరిమివేయడం, రక్తపాతం.. 1947 నాటి భారత విభజనలోనూ అదే పునరావృతమైంది. దేశ/దేహ విభజన ఒకటేనంటూ గుండెను చీల్చుకు వచ్చిన అనుభవం ఆ విభజన కారకుడిగా చరిత్ర బోనులో నిలబడిన మహమ్మద్ అలీ జిన్నాకే ఎదురైంది. 1947 ఆగస్ట్ 7న ఉదయమే బొంబాయిలోని మజ్గావ్లో ఉన్న ఇస్నాషరి శ్మశానవాటికకు వెళ్లాడు జిన్నా. చేతిలో పుష్పగుచ్ఛం. ఒకచోట ఇత్తడి రెయిలింగ్ మధ్య ఉన్న నాలుగు అడుగుల ఎత్తు, ఆరడుగుల పొడువు ఉన్న పెద్ద పేటిక వంటి పాలరాతి సమాధి ముందు నిలిచాడు. ముందు భాగంలో శిలాఫలకం మీద నల్లటి అక్షరాలు రతన్‌బాయి మహమ్మద్ అలీ జిన్నా (జననం 20 ఫిబ్రవరి 1900–మరణం 20 ఫిబ్రవరి 1929) పుష్పగుచ్ఛం ఆ సమాధి మీద పెట్టాడు. రతన్‌బాయి పెటిట్ లేదా రతన్‌బాయి జిన్నా లేదా రూతీ జిన్నా భార్యే. ఆ ఇద్దరిదీ ఒక విచిత్ర వివాహం. చిత్రమైన ప్రేమగాథ. బొంబాయి కోటీశ్వరులలో ఒకడైన దిన్షా మానేక్‌జీ పెటిట్, దీన్ల ముద్దుల పట్టి రూతీ. నూలు మిల్లులను బొంబాయికి తెచ్చిన పార్సీ కుటుంబం. దిన్షా పెటిట్, జిన్నా ఆప్తమిత్రులు. పెటిట్ కేసులను వాదించే న్యాయవాదుల బృందంలో జిన్నా ఒకడు. పెటిట్ సన్నిహితుడు, కాంగ్రెస్ ప్రముఖుడు ఫిరోజ్‌షా మెహతా.. జిన్నాకూ ఆప్తుడే. అలా పెటిట్ కుటుంబీకులకూ సన్నిహితుడయ్యాడు జిన్నా. 1916 సంవత్సరంలో తమ కుటుంబంతో పాటు డార్జిలింగ్ వచ్చి అక్కడి తమ వేసవి విడిదిలో అతిథిగా ఉండవలసిందని జిన్నాను కోరాడు దిన్షా. నిజానికి ఏటా వేసవికి ఫ్రాన్స్‌లో గడపి వస్తుంది ఆ కుటుంబం. ప్రపంచ యుద్ధం కారణంగా అప్పుడు డార్జిలింగ్‌ను ఎంచుకున్నారు. ఆ ప్రయాణం జిన్నా జీవితాన్ని మలుపు తిప్పింది. ‘రూతీ జిన్నా: ది స్టోరీ, టోల్డ్ అండ్ అన్‌టోల్డ్’ (ఖ్వాజా రజా హైదర్), ‘రోజెస్ ఇన్ డిసెంబర్’ (ఎంసీ చాగ్లా), ‘ఫ్రీడవ్‌ు ఎట్ మిడ్నైట్’ (ల్యారీ కోలిన్స్, డొమినీక్ లాపీరె) పుస్తకాలు ఈ ఘట్టాలను నమోదు చేశాయి. పెటిట్ కుమార్తె ..‘ఫ్లవర్ ఆఫ్ బాంబే’గా పేర్గాంచిన అందాలరాశి, పదహారేళ్ల రతన్‌బాయి జిన్నా ప్రేమలో పడింది. అప్పటికి జిన్నా వయసు 41 ఏళ్లు. ఆమె తండ్రి వయసూ దాదాపు అంతే. అంతదాకా జిన్నాకు పెళ్లి కాలేదా? అయింది. 1893లో జిన్నాను చదువు కోసం లండన్ పంపించే ముందు అతడి తల్లి ముందుజాగ్రత్తగా ఎమీ బాయి అనే దగ్గర బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి చేసింది. కానీ అతడు తిరిగి దేశం వచ్చే సరికి ఎప్పుడూ చూడనీ, మాట్లాడనీ భార్య, తల్లి కూడా ప్లేగుతో చనిపోయారు. మళ్లీ వివాహం చేసుకోలేదు. అంత వయసున్న జిన్నాను మైనారిటీ తీరని ఆ అమ్మాయి ఎందుకు ప్రేమించింది? జిన్నాకు ఆ రోజుల్లో ఉన్న ఖ్యాతి వల్లనే. కరాచీ వదిలి బొంబాయి వచ్చిన జిన్నా పెద్ద బారిస్టర్ అయ్యాడు. 1904 నాటికే భారత జాతీయ కాంగ్రెస్‌లో ముఖ్యుడయ్యాడు. 1910 నాటికే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడయ్యాడు. గోపాలకృష్ణ గోఖలేకే కాదు, బాలగంగాధర్ తిలక్‌కూ, అనిబీసెంట్కూ, మదన్మోహన్ మాలవీయకూ సన్నిహితుడు. సరోజినీ నాయుడు.. జిన్నాను హిందూ ముస్లిం స్నేహ వారధిగా శ్లాఘించేవారు. కొన్ని అభిరుచులు కూడా జిన్నాను ఆ రూతీకి చేరువ చేశాయి. అందులో మొదటిది సాహిత్యం. డార్జిలింగ్ తేయాకు తోటలలో, జలపాతాల దగ్గర, బౌద్ధారామాలలో అంకురించిన ఆ ప్రేమను సమాజం అంగీకరిస్తేనే వింత తప్ప, అంగీకరించపోతే వింతేకాదు. ఆ ఇద్దరు మాట్లాడుకోకుండా దిన్షా పెటిట్ కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చాడు. కానీ పద్దెనిమిదేళ్లు నిండగానే రూతీ మలబార్ హిల్స్‌లోనే ఉన్న జిన్నా పాత ఇంటికి వచ్చేసింది కట్టుబట్టలతో, తన కుక్కపిల్లతో. 1918 ఏప్రిల్ 18న ఆమె మతం మార్చి (రూతీ ‘మరియం’ అయింది), మరునాడు ఆ ఇంటిలోనే రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ‘జే’ అంటూ జిన్నాను ఆప్యాయంగా పిలిచేదామె. గాఢంగా ప్రేమించింది. ప్రేమయాత్ర కోసం కశ్మీర్ వెళ్లారు. దాల్ సరస్సులో రూ. 50,000తో బోట్‌హౌస్‌కు అలంకారాలు చేయించిందామె. కాంగ్రెస్‌లో జిన్నా మితవాది. గోఖలే సలహాతో ముస్లింలీగ్‌లో చేరాడు. జిన్నాలోని మితభాషిని క్షమించింది గానీ, ఇంగ్లిష్ పాలనను ఆరాధించే మితవాదిగా, ముస్లింలీగ్ నేతగా మాత్రం సహించలేక పోయిందనిపిస్తుందామె. ‘జిన్నా ‘‘సర్ జిన్నా’’ అయితే, నేను వేరుగా ఉండడానికే ఇష్టపడతాన’ని చెప్పింది. అత్యాధునికంగా ముస్తాబై జిన్నాతో వెళుతుంటే లీగ్ సభ్యులు మండిపడేవారు. దేనికీ జిన్నా ఆమెను వారించలేదు. బ్రిటిష్ జాతంటే ఆమెకు ద్వేషం. వైస్రాయ్ లార్డ్ రీడింగ్‌కే కళ్లు బైర్లు కమ్మే సమాధానమిచ్చింది. ఢిల్లీలో వైస్రాయ్ ఇచ్చిన విందుకు జిన్నాతో పాటే వెళ్లింది. పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ‘నేను జర్మనీ వెళ్లాలి. కానీ వెళ్లలేను’ అన్నాడు రీడింగ్. ‘ఎందుకు?’ అనడిగింది రూతీ.‘వాళ్లకి బ్రిటిషర్లంటే పరమ ద్వేషం!’ అన్నాడు. ‘అయితే ఇక్కడికి మాత్రం ఎందుకొచ్చారు?’ అన్నదామె. జిన్నా, గాంధీ విభేదాలు తారస్థాయికి చేరినప్పుడు కూడా రూతీ నాగ్‌పూర్ కాంగ్రెస్ సదస్సుకు వెళ్లింది. అంతకు ముందే 1919 ఆగస్ట్ 14న వారికి కూతురు దీనా (వాడియా) పుట్టింది. తరువాత జిన్నా ముస్లింలీగ్ రాజకీయాలలో తలమునకలైపోయాడు. సంస్థ కేంద్రం ఢిల్లీకి మారింది. రూతీ వెళ్లలేదు. జిన్నా, అతడి అవివాహిత సోదరి ఫాతిమాల మీద నిరసనతో రూతీ మలబార్‌హిల్స్ నివాసం వదిలి తాజ్ హోటల్‌కు మకాం మార్చింది. అప్పటికే ఆమెకు పేగు క్యాన్సర్. సరిగ్గా పుట్టిన రోజునే అంటే 1929 ఫిబ్రవరి 20న ఆ హోటల్లోనే అనంతమైన దిగులుతో కన్నుమూసింది. అమ్మమ్మ అండతో దీనా పార్సీ మతస్థుడు నెవిల్లే వాడియాను జిన్నా ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు నుస్లీ, డయానా. డయానా రెండు కాళ్లకూ పోలియో. తరువాత ఆ భార్యభర్తలు విడిపోయారు. నెవిల్లే విదేశాలలో. దీనా పిల్లలతో బొంబాయిలో. తనతో పాకిస్తాన్ వచ్చేయమని కూతురిని ఆర్తితోనే అడిగాడు జిన్నా. ఒక లేఖ రాసి ఆ ఇద్దరు పిల్లలతోనే తాతయ్యకి పంపింది దీనా. ‘నాన్నా! మీ ప్రయాణం సుఖంగా సాగాలి. మీరు సాధించుకున్న పాకిస్తాన్ సౌభాగ్యంతో వర్ధిల్లాలి. సదా మీ ఆశీస్సులు కోరుతూ, దీనా.’ అంతే. ఆగస్ట్ 7న బొంబాయిలోనే విమానం ఎక్కాక వెనక్కి తిరిగి 51 ఏళ్ల అనుబంధమున్న బొంబాయిని కంటి నిండుగా చూసుకున్నాడు జిన్నా. పాకిస్తాన్ వెళ్లాక ఇక్కడున్న తన రూతీ సమాధిని చూసే అవకాశం, జ్ఞాపకంగా ఎప్పుడైనా ఓ గులాబీనుంచే సందర్భం వస్తాయా? ప్రతి ఆగస్ట్ 14న పాకిస్తాన్ ఆవిర్భావ దినోత్సవానికి జెండా ఎగురవేస్తుంటే భారత్‌లోనే ఉండిపోయిన ఒక్కగానొక్క కూతురు దీనా పుట్టినరోజు గుర్తుకు రాకుండా ఉంటుందా? కానీ అలాంటి హింసాత్మక సంఘర్షణకు గురయ్యే పరిస్థితి నుంచి కాలమే అతడిని కరుణించింది. 1948 సెప్టెంబర్ 11న, పాకిస్తాన్ ఏర్పడిన మరుసటి ఏడాదే మేధస్సుతో కాకుండా, హృదయంతో స్పందించడం మొదలు పెడుతున్న వేళ బారిస్ట్టర్ జిన్నా చనిపోయాడు. -డా. గోపరాజు నారాయణరావు -
గాంధీజీ ఫొటోల్లో అదే అద్భుతం.. ఆ ఘనత మార్గరెట్దే!
విభజన వేళ భారత్‌లో జరిగిన హింస ప్రపంచ చరిత్ర కనీ వినీ ఎరుగనిదని చరిత్రకారుల ఏకాభిప్రాయం. ఆ విషాదగాథ ఆధారంగా వందల గ్రంథాలు వచ్చాయి. వేల పేజీల సృజనాత్మక సాహిత్యం వచ్చింది. మతావేశాలతో చెలరేగిన ఆ కల్లోలాలలో కోటి నుంచి రెండు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. మృతులు పది లక్షలని అంచనా. అపహరణకు గురైన వారు కావచ్చు, లైంగిక అత్యాచారాలకు బలైన వారు కావచ్చు– బాలికలు, యువతలు 75,000 నుంచి లక్ష. చరిత్ర చూడని భయానక శరణార్థి సమస్య వచ్చింది. ‘తమస్’ (భీష్మ సహానీ)’, ‘ఎ ట్రెయిన్ టు పాకిస్తాన్’ (కుష్వంత్‌సింగ్), ‘ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్’ (ఊర్వశీ బుటాలియా), ‘ఏ టైమ్ ఆఫ్ మ్యాడ్నెస్’, ‘మిడ్నైట్ చిల్డ్రన్’ (సల్మాన్ రష్దీ), పార్టిషన్ (బార్న్‌వైట్–స్పున్నర్), ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ (ల్యారీ కోలిన్, డొమినిక్ లాపిరె), ‘మిడ్నైట్ ఫ్యూరీస్’ (నిసీద్ హజారీ) వంటి నవలలు, చరిత్ర పుస్తకాలలో, అమృతా ప్రీతమ్, ఇస్మత్ చుగ్తాయ్, గుల్జార్, సాదత్ హసన్ మంటో వంటి వారి వందలాది కథలలో ఆ విషాదం అక్షరబద్ధమైంది. జిన్నా ప్రత్యక్షచర్య పిలుపే ఇందుకు కారణం. కానీ విభజన నాటి విషాదాన్ని కెమెరా ద్వారా చిత్రబద్ధం చేసిన వారు మార్గరెట్ బర్కి వైట్. తేనెపట్టును తలపిస్తూ రైళ్లను ముసురుకున్న మానవ సమూహాలు, కిలో మీటర్ల మేర ఎడ్లబళ్లు, మంచం సవారీ మీద వృద్ధులు, భుజాల మీద పిల్లలు, బరువైన కావళ్లు, ఓ ఎత్తయిన ప్రదేశంలో తల పట్టుకు కూర్చున్న అబ్బాయి, కలకత్తా వీధులలో దిక్కులేకుండా పడి ఉన్న శవాల గుట్టలు.. ఇవన్నీ ఏదో సందర్భంలో, ఏదో ఒక పత్రికలో చూసి ఉంటాం. ఇవన్నీ మార్గరెట్ వైట్ (1904–1971) ధైర్య సాహసాల వల్ల చారిత్రక ఫ్రేములకెక్కినవే. ఒక మహా మానవ విషాదాన్ని ఆమె చారిత్రక దృష్టితో దృశ్యీకరించారు. ఆ నలుపు తెలుపు ఫొటోల్లోనూ ఎర్రటి నెత్తురు చూసిన అనుభూతి తెచ్చారామె. రెండో ప్రపంచయుద్ధం ముగియగానే ఇంగ్లండ్ భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడం ఖాయమని తేలింది. అప్పుడు మార్గరెట్ అమెరికా నుంచి వెలువడుతున్న ‘లైఫ్’ పత్రికలో పని చేసేవారు (తరువాత ‘టైమ్’ మ్యాగజీన్‌కు మారారు). చాలామంది అంతర్జాతీయ పత్రికల ప్రతినిధులూ, ఫొటోగ్రాఫర్ల మాదిరిగానే ఆమె కూడా (మార్చి, 1946) భారత్‌కు వచ్చారు. అసలు ఆమె ఉద్దేశం గాంధీజీ మీద వార్తా కథనం. కానీ ఆయన కార్యదర్శి చరఖా వడకడం వస్తేనే లోపలికి వెళ్లనిస్తామని చెప్పాడు. చాలా తొందరగా నేర్చుకుని వచ్చారామె. తీరా, ఆ రోజు సోమవారం. గాంధీజీకి మౌనవ్రతం. అయితే సహజ కాంతిలోనే ఫొటోలు తీయాలని, మూడు డిమాట్ ఫ్లాష్‌లు మాత్రమే ఉపయోగించాలన్న షరతులతో మొత్తానికి అనుమతించారు. గాంధీజీ రాట్నం ముందు కూర్చుని పేపర్ క్లిపింగ్స్ చూసుకుంటున్నారు. అలాగే ఫొటో తీశారు మార్గరెట్. గాంధీకి అత్యంత ప్రియమైన రాట్నం ముందు కూర్చుని ఉన్న ఫొటోల్లో ఇదే అద్భుతం. సహజ కాంతిలో తీయడంతో గాంధీజీ రుషిలా కనిపిస్తారు. చాలాసార్లు గాంధీ వెంటే పర్యటించారామె. జిన్నా, అంబేడ్కర్, నెహ్రూ వంటి ప్రముఖులందరి ఫొటోలు తీశారు. వార్తలు రాయడానికి ఈమెతోనే వచ్చారు ‘లైఫ్’ పత్రికా రచయిత్రి లీ ఎలీనన్. మార్గరెట్ కెమెరా పనితనానికి లీ కలం బలం తోడైంది. ఇలాంటి సమయంలో భారత్‌లో మహిళలు పనిచేయలేరని చాలామంది హితవు పలికారు. రవాణా సదుపాయాలు ఉండవని చెప్పారు. యువతులను అపహరించడం సర్వసాధారణం. ప్రాణాలకు ముప్పు సరే. అవన్నీ నిజమే అయినా మార్గరెట్ తట్టుకుని నిలబడ్డారు. అప్పటికి ఆమె వయసు పాతిక లోపే. ఒక పాత జీప్‌లో కెమెరా సామగ్రి, టైప్ రైటర్, ఇతర వస్తువులతో లాహోర్ వెళుతుంటే ఒకచోట శరణార్థుల గుంపు దాడి చేసింది కూడా. కానీ సైనికులు రక్షించారు. అమృత్సర్ దగ్గర బియాస్ నది వద్ద రైలు పట్టాలకు ఎడమ వైపున ఈగలు వాలుతున్న 17 శవాలను గమనించారామె. ఒక నదిలో కుళ్లి ఉబ్బిన శవాల వైపే చూస్తున్న రాబందులను చూశారు. ఆకలితో చనిపోయిన నాలుగేళ్ల బాలుడిని లాహోర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ పక్కన ఖననం చేస్తున్న దృశ్యం చూశారు. జబ్బు పడిన మహిళను భుజం మీద మోసుకుంటూ వస్తున్న సిక్కును కెమెరాలో బంధించారు. ఈ సిక్కుతో పాటే భారత్‌కు బయలుదేరిన భారీ గుంపు (కఫిలా)లో 103 మందిని మధ్యలోనే చంపారు. ఇవన్నీ ఆమె ‘హాఫ్ వే టు ఫ్రీడమ్’ అన్న స్వీయ రచనలో నమోదు చేశారు. మరునాడే అమెరికా ప్రయాణమనగా, మార్గరెట్ గాంధీజీని కలుసుకున్నారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. ప్రయాణం రోజే గాంధీజీ హత్య జరిగింది. ఆదరాబాదరా వెళ్లారామె. శవం దగ్గరకు రానిచ్చినా, ఫొటోకు అనుమతి ఇవ్వలేదు. అయినా కెమెరాకు రహస్యంగా పని చెప్పబోయారు. ఫ్లాష్ వెలిగింది. అంతా ఆగ్రహించారు. కెమెరాలో రీలు లాగేసి, అక్కడ నుంచి గెంటేశారు. కెమెరా లెన్స్ లేదా ఆమె కళ్లు గమనించినదే అయినా అదంతా దేశ విభజన నాటి విషాద చరిత్రే. కానీ ఆ కంటికీ, ఆ లెన్స్కీ అందని విషాదం ఇంకా ఎంతో... ఎంతెంతో... ఉండిపోయింది. -డా. గోపరాజు నారాయణరావు -
కాలరేఖలు: మహాత్ముడి మౌనం
స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం సాగిన సమరంలోని ప్రతి కదలిక.. ప్రతి సందర్భం చిరస్మరణీయం! నిత్య ప్రేరణ.. స్ఫూర్తి!! భారత స్వాతంత్య్ర పోరాటంలోని అలాంటి ఘట్టాలను అమృతోత్సవ నేపథ్యంలో ప్రతి వారం ‘కాలరేఖలు’ పేరుతో కథనాలుగా అందిస్తున్నాం. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక నేపథ్యంలో స్మరించుకోవలసిన మరొక తేదీ–జూన్ 3, 1947. భారతదేశానికి ‘అధికార బదలీ’ చేస్తున్నట్టు ఇంగ్లండ్ ప్రకటించిన రోజు. దాదాపు తొమ్మిది దశాబ్దాల స్వరాజ్య సమరం ఆ రోజుతో ముగుస్తుంది. ఆ పోరు చాలా పంథాలలో సాగినా జాతీయ కాంగ్రెస్‌కు ఆ కీర్తి దక్కింది. ముస్లింలీగ్ ఆశయం నెరవేరింది. హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్న ప్రాంతాన్ని భారత్ అని, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ అని ఇంగ్లిష్ ప్రభువులు నామకరణం చేశారు. పెద్ద దేశం! ఇన్ని సంస్కృతులు, భాషలు, వైవిధ్యం ఉన్న ప్రజలను విభజించడానికి ప్రాతికపదిక ఏమిటి? భారతీయులకు ‘అధికార బదలీ’ (స్వతంత్రం అన్నమాట లేదు) చేస్తున్నట్టు 1947 ఫిబ్రవరి 20న నాటి బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ (లేబర్ పార్టీ) వారి పార్లమెంట్లో ప్రకటించాడు. అందుకు ముహూర్తం జూన్, 1948. అక్షరాలా జూన్, 1948. ఈ ప్రక్రియని వేగంగా పూర్తి చేయడానికి ఏరి కోరి పంపిన వ్యక్తి, ఆఖరి వైస్రాయ్ లార్డ్ లూయీ ఫ్రాన్సిస్ అల్బర్ట్ విక్టర్ ‘డికీ’ మౌంట్‌బాటన్. విభజన వాదంతో భారత్ రక్తమోడుతున్న క్షణాలలో, మార్చి 22న మౌంట్‌బాటన్ భారత్‌లో అడుగుపెట్టాడు. వెంటనే నేతలతో చర్చించాడు. విభజనకి గాంధీజీ అంగీకరించలేదు. ‘నా శవం మీద విభజన జరగాలి’ అన్నాడాయన. ఆ వేసవిలో నెహ్రూను సిమ్లాకు ప్రత్యేక అతిథిగా పిలిచి విభజన ప్రణాళికను ఆయన ముందుంచాడు వైస్రాయ్. నెహ్రూ మండిపడ్డాడు. తరువాత విభజన పట్ల కాస్త మెత్తబడినా మిగిలిన విషయాలకు జాతీయ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగానే ఉన్నారు. దీనితో తన వ్యక్తిగత సిబ్బందిలోని ఏకైక భారతీయుడు వీపీ మేనన్ (రాజ్యాంగ వ్యవహారాల సలహాదారు)ను కొత్త ప్రణాళిక తయారు చేయమని మౌంట్‌బాటన్ ఆదేశించాడు. ఆ ప్రణాళికను తీసుకుని మౌంట్‌బాటన్ లండన్ వెళ్లాడు. దీనిలో కీలకాంశమూ విభజనే. దీనిని ఆమోదించడానికి అట్లీ మంత్రిమండలి తీసుకున్న సమయం ఐదు నిమిషాలే. మే 31న మౌంట్‌బాటన్ భారత్ తిరిగి వచ్చాడు. మళ్లీ చర్చలు. పటేల్, రాజాజీ వంటివారు ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డారు. ఇది తక్కువ ప్రమాదకర ఆలోచన అన్నాడు నెహ్రూ. నిజానికి విభజన కోరి తప్పు చేశామని ముస్లింలీగ్ పశ్చాత్తాపపడుతుందని నాడు చాలామంది నమ్మినట్టు సమకాలికుల అభిప్రాయంగా నమోదైంది. 1947 జూన్2న వైస్రాయ్ హౌస్ (నేటి రాష్ట్రపతి భవన్)లో సమావేశం. అది జరగడానికి రెండు మూడు గంటల ముందు కూడా జిన్నా అంగీకరించలేదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలతో పాటు అస్సాం కూడా పాకిస్తాన్లో ఉండాలని ఆయన కోరిక. అది కుదరకపోవడంతో ‘చిమ్మెటలు కొట్టేసిన గుడ్డ’ ఎందుకు అన్నాడు. అయితే ముస్లింలీగ్ నేతలతో తానే మాట్లాడతానని మౌంట్‌బాటన్ బెదిరించడంతో ఎట్టకేలకు జిన్నా అంగీకరించాడు. మధ్యాహ్నం రెండు గంటలకు జాతీయ కాంగ్రెస్ నేత/ తాత్కాలిక ప్రభుత్వ (1946 సెప్టెంబర్ 2న ఏర్పడింది) ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ, హోమ్ మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్‌పటేల్, కాంగ్రెస్ అధ్యక్షుడు జేబీ కృపలానీ, ముస్లింలీగ్ తరఫున మహమ్మద్ అలీ జిన్నా, లియాఖత్ అలీ ఖాన్ (నెహ్రూ మంత్రిమండలిలో ఆర్థికమంత్రి), అబ్దుల్ రబ్ నిష్తార్ (మరొక మంత్రి), సిక్కుల తరఫున బలదేవ్ సింగ్ (రక్షణ మంత్రి) పిలుపు మేరకు వచ్చారు. మౌంట్‌బాటన్, వైస్రాయ్ సలహాదారు ఎరిక్ మీవిల్లె, సిబ్బంది ప్రధాన అధికారి లార్డ్ ఇస్మే ఉన్నారు. మొత్తం తొమ్మిది మంది. విభజన ప్రణాళిక లేదా మౌంట్‌బాటన్ పథకం లేదా జూన్ 3 పథకానికి వీరే ఆమోదముద్ర వేశారు. విభజనతో కూడిన అధికార బదలీ గురించి జూన్ 3న రేడియోలో మౌంట్‌బాటన్, నెహ్రూ, జిన్నా, బల్దేవ్ సింగ్ అధికారికంగా వెల్లడించారు. ఆ సాయంత్రమే బ్రిటిష్ పార్లమెంట్ దిగువ సభ ఆమోదించింది. జూన్ 15న వాగ్వాదాల మధ్య ఏఐసీసీ కూడా అంగీకరించింది. ఒక ప్రశ్న! విభజిస్తూనే కావచ్చు, భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఈ సమావేశంలో స్వతంత్ర సమర సారథి గాంధీజీ ఎక్కడ? గాంధీ ఆ సమావేశంలో ఉండడం మౌంట్ బాటన్‌కు ఇష్టంలేదు. ఆయన అంతరంగాన్ని బట్టే కాంగ్రెస్‌నేతలు వ్యవహరించారు. నిజానికి ఆ రోజు ఉదయం పదకొండు గంటల వేళ మను, అభాల సాయంతో గాంధీ వైస్రాయ్ హౌస్‌కు వెళ్లారు. ఒక లేఖ ఇచ్చి ‘మౌనంగా’ నిష్క్రమించారు. అంతే. ఆ లేఖలో ఏముంది? ‘నన్ను మన్నించండి! నేను మాట్లాడలేను. కానీ ప్రతి సోమవారం మౌనవ్రతం పాటించాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు రెండు మినహాయింపులు చేసుకున్నాను. అవి, అత్యవసర అంశాల మీద అత్యున్నత స్థాయి వ్యక్తులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, లేదా అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించవలసినప్పుడు తప్ప. అయితే ఇప్పుడు నేను మౌనం వీడరాదనే మీరు కోరుకుంటున్నారు. నా ఉపన్యాసాలలో మీకు వ్యతిరేకమైన మాట ఎప్పుడైనా మాట్లాడానా? లేదని మీరు ఒప్పుకుంటే ఈ ఆంక్ష అనవసరం. అయినా మీతో తప్పనిసరిగా మాట్లాడవలసిన ఒకటి రెండు విషయాలు ఉన్నాయి. అవైనా ఇవాళ కాదు. మళ్లీ మనం కలుసుకునే అవకాశం వస్తే మాట్లాడతాను.’ -డా. గోపరాజు నారాయణరావు -
ప్రజల మనిషికి బహువచనమే లోపలి మనిషి
ఏ సాహిత్య ప్రక్రియ అయినా శూన్యం నుంచి రాదు. అది చరిత్ర నుంచి ప్రేరణ పొందుతూనే, వర్తమానంతో ప్రభావితమవుతూ ఉంటుంది. ఇందుకు గొప్ప ఉదాహరణ పీవీ నరసింహారావు ‘లోపలి మనిషి’ నవల (ఆంగ్లంలో ‘ది ఇన్సైడర్’, తెలుగు ‘లోపలి మనిషి’, అనువాదం: కల్లూరి భాస్కరం). గాఢమైన జీవితానుభవం, ఇతివృత్తంగా స్వీకరించిన చారిత్రక ఘటనల నుంచి ఉన్మీలనమైన తాత్త్విక కాంతిధార వెంటాడుతూ ఉంటే పీవీ ఈ నవల రాసి సాంత్వన పొందారనిపిస్తుంది. రాజకీయ సంస్థ పరిధిలో ఆయన లోపలి మనిషి. రాజకీయ వంచనతో, విలువల శైథిల్యంతో జాతి కన్న కల భగ్నమైపోతుంటే నిరసన గళం విప్పిన ప్రజల మనిషి కూడా. శతాబ్దాల పరాయి పాలన నుంచి విముక్తం కావడానికి ఎన్నో స్రవంతులనూ, పంథాలనూ కలుపుకుని పోరాడి గెలిచిన ఒక పురాతన జాతి తొలి అడుగులే తడబడుతుంటే, సంకెళ్లు తెగిపడ్డాయన్న స్పృహ లుప్తమై, కొత్త చరిత్ర నిర్మాణం వైపు కాకుండా, మళ్లీ బానిసత్వ చిహ్నాలను ముద్రించుకోవడానికి తహతహలాడుతూ ఉంటే సహించలేని లోపలి మనిషి, వాటి గురించి ప్రజల మనిషి చేత పలికించడమే ఈ నవల విశిష్ట శైలి. స్వేచ్ఛాభారతంలోనూ దగా పడుతున్న ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకున్న లోపలి మనిషి, ప్రజల మనిషికి బహువచనంలా వినిపిస్తాడు. లోపలి మనిషి పీవీ. ప్రజల మనిషి ఆనంద్, ఈ నవలానాయకుడు. ఆగస్ట్ 15, 1947 అనే ఆ ఒక్క తేదీతో సమాన చారిత్రక ప్రాధాన్యమున్న తేదీగా మరొకదానికి పట్టం కట్టడం అసాధ్యం. అదే, అఫ్రోజాబాద్ సంస్థానమైతే ‘1948’ కాలచక్రంలోని ఒకానొక సంవత్సరం కాదు, కొత్త ఉషోదయం. ఈ ఉషస్సుకు ముందుటి అంధకారంలోనే ‘లోపలి మనిషి’ ప్రస్థానం ఆరంభమవుతుంది. భారతదేశమంతటా గాంధీజీ అహింసా సిద్ధాంతంతో భారత జాతీయ కాంగ్రెస్ పరాయి పాలన పునాదులు కదిలిస్తున్నది. అఫ్రోజాబాద్ సముద్రంలో దీవిలా మిగిలింది (562 స్వదేశీ సంస్థానాలలో ఒకటైన హైదరాబాద్‌కు రచయిత పెట్టిన పేరు). అక్కడ నవాబు ప్రపంచ కోటీశ్వరుడు. కానీ ఒంటి నిండా గుడ్డ ఉన్న పౌరులు అతి తక్కువ. వార్తాపత్రిక, రేడియో నిషిద్ధం. అయినా కాంగ్రెస్ ఉద్యమ ప్రభావమే కాదు, ఆయుధాన్ని నమ్మిన తీవ్ర జాతీయోద్యమ సెగ సైతం సంస్థానంలోకి ప్రవేశించింది. హఫీజ్ అనే విప్లవకారుడు అందించిన విప్లవ సాహిత్యం, భగత్‌సింగ్ తండ్రికి రాసిన చరిత్రాత్మక లేఖ ఆనంద్‌ను అప్పటికే నిజాం మీద ఆరంభమైన సాయుధపోరు వైపు అడుగులు వేయించాయి. స్వతంత్ర భారతంలో తొలిపొద్దు సందేశం– దేశానికి స్వాతంత్య్రం, దేశ విభజన ఏకకాలంలో జరిగాయనే. ఆపై గాంధీజీ హత్య. తరువాత గొడ్డలి పిడి తత్త్వాన్ని గుర్తు చేస్తూ కశ్మీర్ కోసం పాకిస్తాన్ మొదటి దాడి. నలభై ఆరుశాతం భూభాగంలో విస్తరించి ఉన్న సంస్థానాల విలీనంతో విశాల భారత ఆవిష్కరణ... వరుసగా జరిగాయి. తరువాత– తొలి సార్వత్రిక ఎన్నికలు. ‘టికెట్లు కోరుకునేవారిలో చాలామందిని ఆకర్షించేది అధికారమే కానీ, మరొకటి కాదని సాధారణ పరిశీలకులకు సైతం తెలిసిన వాస్తవం’(పే 98) అనతికాలంలోనే ఆవిర్భవించింది. పాతికేళ్ల స్వతంత్ర భారత ఉత్థానపతనాల మీద వ్యాఖ్య ఈ నవల. అందులో ఎన్నికలకి ఇచ్చిన స్థానం చాలా పెద్దది. ఎన్నికలలో రచయిత మహా పతనమే చూశారు. దేని పతనం? ప్రజాస్వామ్య పతనం. ‘దేశ పరిపాలన విషయంలో ప్రజాభిమతాన్ని ప్రతిబింబించడమనే వాస్తవిక ప్రయోజనాన్ని క్రమంగా ఎన్నికలు కోల్పోతూ వస్తున్నాయ’ (పే. 324)ని నిర్ధారణకొస్తాడతడు. దేశంలో సగం ఉన్న మహిళ ఎన్నికలలో పోటీ చేయాలంటే, మొదట జాతీయ కాంగ్రెస్ శల్యపరీక్షలో, ‘నా పడకగదిలోంచి ఆమె నడవనప్పుడు ఎన్నికల్లో కూడా ముందుకు సాగలేదు’ (పే. 221) అని చెప్పే పరిశీలకుల దగ్గర ఎలా నెగ్గాలి? లాల్‌బహదూర్ శాస్త్రి వంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడు కలగచేసుకోవడంతో పరిశీలకుడు అప్పటికి (ఆనంద్ సన్నిహితురాలు అరుణ టికెట్టు రగడ) ఓడిపోయాడు. ప్రథమ ప్రధాని నెహ్రూ గురించీ, వ్యక్తిత్వం గురించీ ఇంతటి సమదృష్టితో పరిశీలించిన రచన మరొకటి ఉండదేమో! నెహ్రూ అంటే ఒక మహావృక్షం. అలీనవాదం, మిశ్రమ ఆర్థికత, సోషలిజం, ప్రభుత్వ రంగం, పంచవర్ష ప్రణాళికలు, నిరాయుధీకరణ, అకాడమీల స్థాపన, ఫెడరలిజం, సెక్యులరిజం – ఆ మహావృక్షం శాఖలే. అయినా, ‘నెహ్రూ అనే దేవత లక్షల మంది దెయ్యాలున్న పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడన్నదే’ (పే 284) ఆనాటి అభిప్రాయం. నెహ్రూ ఆదర్శాలకీ, సమకాలిక సమాజానికీ మధ్య ఇంత దూరం! ‘ఎంతో తలపండిన రాజకీయవాదులు కూడా అలీన విధానాన్ని తేలికగా జీర్ణించుకోలేకపోయారు’ (పే 343). సోషలిజం నెహ్రూ స్వప్నం. కానీ అది వేదికలకీ, ఉపన్యాసాలకీ పరిమితం కావాలన్నదే కాంగ్రెస్ పెద్దల అభిమతం. లౌకికవాదం విషయంలో నెహ్రూ ఏకాకి. ‘భారతదేశంలో జాతీయవాది అనదగిన ఏకైక ముస్లిం ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ’ (పే 400) అని ఆయన వ్యతిరేకులు ఎత్తి పొడిచేవారు. 1962 నాటి చైనా యుద్ధంలో భారత్ ఓటమి దరిమిలా ఆయన తన ఈ పాత ప్రపంచం నుంచి తనను తానే బలవంతంగా బయటకు తెచ్చుకున్నారు. ఇక్కడ ఆనంద్ ఆరోపణ ఏమిటి? ‘నెహ్రూ మహాత్మా గాంధీని, ఆయన ఆదర్శాలను ముందుకు సాగించినట్టు నెహ్రూను, నెహ్రూ ఆదర్శాలను సాగించేవారు ఒక్కరూ లేరు’ (పే 386). ఆఖరికి నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ కూడా అందుకు మినహాయింపు కాదన్నదే అతడి నిశ్చితాభిప్రాయం. ఇందిర పాత్ర చిత్రణ దగ్గర పీవీలోని స్వరాజ్య సమరయోధుడు, స్వతంత్ర భారత రాజకీయాల ప్రత్యక్ష సాక్షి మరింత కఠినంగా మారిపోవడం గమనిస్తాం. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నిక, అందులో ఇందిర పాత్ర (పార్టీ సమావేశంలో నీలం సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి, లోపాయికారిగా ఉపరాష్ట్రపతి వివి గిరిని అభ్యర్థిగా నిలిపి గెలిపించారు, దానికి అంతరాత్మ ప్రబోధం అని పేరు పెట్టారు) భారతీయులు రెండుగా చీలిపోయారన్న అపోహకు బీజం వేశాయని (ప్రపంచం దృష్టిలో, ముఖ్యంగా పాక్ దృష్టిలో) ఆనంద్ అభిప్రాయపడతాడు. ఆమె హయాంలో సాగిన అసమ్మతి రాజకీయాలు, ముఖ్యమంత్రుల మార్పు దేశ ప్రతిష్టకే భంగకరమని ఆనంద్ బాధ. ‘ఎంతో గొప్పవాడైన తన తండ్రిని కూడా జనం మరచిపోయేంత ఘనకీర్తిని సంపాదించాలన్న తపనతో ఆమె వేగిపోతోంది’ (పే 454) అనుకుంటాడు లోపలి మనిషి. తన తరువాత ఈ వైభవం కొడుకు సంజయ్‌కి సంక్రమించాలన్న తపననూ ఆమెలో గమనిస్తాడు. భూమి సమస్య; ప్రాధాన్యం, రాష్ట్రాల పునర్విభజన,రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, భారత జాతీయ కాంగ్రెస్‌కు కాంగ్రెస్ (ఐ) అనే ‘తోక’, పత్రికారంగం పతనం, నక్సల్బరీ, పాక్, చైనా సంబంధాలు, కామరాజ్ పథకం, హిందూ ముస్లిం సమస్య .... ఇలా నవలలో ఆనంద్ చేత లోపలి మనిషి మాట్లాడించిన చారిత్రకాంశాల జాబితా విస్తారమైనది. ఆ జాబితా స్వతంత్ర భారతదేశ చరిత్ర పుటలలోని ప్రతి అధ్యాయపు ఛాయే. చరిత్రకు ఛాయ సాహిత్యమే. ‘లోపలి మనిషి’ నవలాకారుడు సాహిత్యం లోతులు తెలిసినవారు. బహుభాషా పండితుడు. అందుకే పత్రికారంగం, భాషా వివాదాలు ఆయన దృష్టిపథం నుంచి తప్పించుకోలేదు. స్కూప్, స్పెషల్ కరస్పాండెంట్లు, కొసన ప్రశ్నార్థకం ఉన్న శీర్షికలతో వెలువడే వార్తలు, అవి సృష్టించే కృతక వాతావరణం వంటి అంశాలను పీవీ చిత్రించారు. నెహ్రూ వారసులెవరు అంటూ డజన్ల కొద్దీ పుస్తకాలు వెలువడుతుంటే, కొన్ని ప్రమాదకర సమస్యలు దేశంలో ఉద్యమ రూపంలో వీధులకెక్కాయి. అవి ప్రాంతీయమైనవి, భాషాపరమైనవి, మతపరమైనవి. నిజానికి అంతా రాజకీయమే. అస్సాం సాహిత్య సభ 1959లో వారి భాషను అధికార భాషగా ప్రకటించాలని కోరింది. అక్కడ బెంగాలీ మాట్లాడేవారు ఉన్నారు. ఇది హింసాత్మకమైంది. ఇంతకంటే దారుణం– తమిళనాడు హిందీ వ్యతిరేకాందోళన. ‘తమిళతల్లి’ కోసం ఆత్మాహుతులు జరిగిపోతున్న కాలం. ఒక మంత్రి ఇంట జరిగిన పెళ్లిలో ఉత్తర భారత నర్తకుడు బిర్జూ మహరాజ్ కార్యక్రమం ఏర్పాటయిందని తెలిసి తెలుగుప్రాంతం నుంచి వెళ్లిన ఆనంద్ తదితర నేతలు కంగుతిన్నారు. ఈ హిందీ వ్యతిరేకోద్యమ ఘట్టానికి కొసమెరుపు– ఎంపీ అయిన ఓ హిందీ వ్యతిరేకోద్యమ నేత ఆనంద్‌కు పరిచయం. ఒక విమానాశ్రయంలో ఇద్దరూ తారసపడ్డారు. తమిళ ఎంపీ వెంట కొడుకు ఉన్నాడు. వారి మధ్య సంభాషణ ఇది. ‘మీకు తెలుసో లేదో, మావాడు ఢిల్లీలో చదువుతున్నాడు. హిందీలో వీడిక్లాసులో ఎప్పుడూ వీడే ఫస్టు’ అన్నాడు ఎంపీ. ‘మీకు హిందీ రాదు. పైగా ఆ భాషకు వ్యతిరేకం. ఎప్పుడూ ఆందోళన చేస్తూనే ఉంటారు’ విస్మయంతో అడిగాడు ఆనంద్. ఇందుకు మరింత విస్మయం కలిగించే జవాబు, ‘చూడండి, అవి రాజకీయాలు...’ (పే. 321). సమాఖ్య వ్యవస్థలో కేంద్రం బలహీనంగా ఉందన్న అభిప్రాయం బలపడినప్పుడూ, తమను పట్టించుకునే వెసులుబాటు ఢిల్లీకి లేదు కాబోలునని వెనుకబడిన ప్రాంతాల ప్రజలు నిరాశ పడినప్పుడు నక్సలిజం వంటి సమస్యలు అనివార్యమనే పీవీ చెబుతారు. ‘భూస్వామ్య వ్యవస్థ వైఫల్యాలను మీ పార్టీ (కాంగ్రెస్) వాడుకుంటే, ఇప్పుడు నక్సలైట్లు మీ విధానంలోని వైఫల్యాలను వాడుకుంటున్నారు. అవి మరింత కొట్టొచ్చినట్టు కనిపించే వైఫల్యాలు’ అని బలరాం అనే పాత్ర (భూస్వామి) వ్యక్తం చేసిన అభిప్రాయంలో ప్రతిబింబించేది ఇదే. భూమి సమస్యకు కొనసాగింపుగానే పీవీ నక్సల్ సమస్యను చూశారు. అయినా ఆయన దృష్టిలో భారతీయతకు ఆకృతిని ఇచ్చినదే భూమి. సోషలిజం కాంగ్రెస్ పార్టీ నినాదం. కానీ భూసంస్కరణలు తేవడానికి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆనంద్ చేసిన ప్రయత్నం భంగపడింది. చివరికి అది అతడి పదవిని బలిగొన్నది(వాస్తవంలో ఇందుకు బలిపశువైనవారు పీవీయే). ఇదే ఈ నవలకు ముగింపు. ‘లోపలి మనిషి’ పీవీ ఆత్మకథాత్మక నవలగా చెబుతున్నారు. కానీ ఇది నాటి ఎందరో విజ్ఞుల ఆత్మావలోకనం. దానికి అక్షరరూపం ఇచ్చినవారు దాదాపు పీవీ ఒక్కరే. ఎంతటి చరిత్రపురుషులనైనా దేవుళ్లుగా ప్రతిష్టించవద్దంటుందీ నవల. చరిత్రను మింగే స్థాయిలో చరిత్ర పురుషులను ఆరాధించకూడదని ఘోషిస్తుంది. - డా‘‘ గోపరాజు నారాయణరావు -
స్వాతంత్ర్య పిపాసి
‘స్వాతంత్య్రం నా జన్మహక్కు. అందుకు సంబంధించిన స్పృహ నాలో చైతన్యవంతంగా ఉన్నంతకాలం నేను వృద్ధుడిని కాను. ఆ స్ఫూర్తిని ఏ ఆయుధమూ ఖండించలేదు. ఏ నిప్పూ దహించలేదు. ఏ నీరూ తడిపి ముద్ద చెయ్యలేదు. ఏ గాలీ ఎండిపోయేటట్టు చేయలేదు. మనం స్వయం పాలన కోరాలి. సాధించుకోవాలి.’ హోమ్‌రూల్ లీగ్ తొలి వార్షికోత్సవం (1917) నాసిక్‌లో జరిగినప్పుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ ఇచ్చిన ఉపన్యాసంలో కొన్ని మాటలవి. ఆ ఉపన్యాసం యువకుల కోసం చేశారు. తనది వృద్ధుడి శరీరమే అయినా ఆత్మ మాత్రం ఎప్పటికీ శిథిలం కాదని కూడా అన్నారు తిలక్. స్వాతంత్య్రం అన్న భావనను ఆత్మతో అనుసంధానం చేసి, తరం తరువాత తరం దానిని అనుభవించాలని ఆయన ఆకాంక్షించారు. ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు. దానిని సాధించి తీరుతాను’ అంటూ బాలగంగాధర తిలక్ భారత జాతికి ఇచ్చిన నినాదంలో ఎన్నో రాజకీయ చింతనల సారాంశం దట్టించుకుని ఉన్నట్టు అనిపిస్తుంది. స్వాతంత్య్రోద్యమ చరిత్ర భారతదేశ ప్రతిష్టను ఇనుమడింప చేసింది. అలాంటి భారత స్వాతంత్రోద్యమ చరిత్రకు తాత్విక భూమిక తిలక్ (జూలై 23, 1856–ఆగస్టు 1, 1920) నినాదం. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ నినాదం స్వరాజ్య ఉద్యమం మీద చూపిన ప్రభావం అంచనాకు అందనిది. తిలక్ మహరాజ్ ఇంగ్లిష్ విద్యను అందుకున్న తొలి తరం భారతీయులలో అగ్రగణ్యులు. ఆంగ్ల విద్య ప్రభావంతో భారతీయులు అనుభవిస్తున్న బానిసత్వం గురించి తెలుసుకున్న వర్గంలో కూడా తిలక్ అగ్రగణ్యులే. అంతేకానీ ఇంగ్లిష్ విద్యతో ఆంగ్లేయులకు మరింత బానిసలుగా మారిపోయిన వర్గంలో ఆయన పడిపోలేదు. ఆయన ఆంగ్ల విద్యను అభ్యసించారే కానీ, ఆంగ్ల సంస్కృతిని అలవర్చుకోలేదు. రాజా రామ్మోహన్రాయ్, దయానందుడు, వివేకానందుడు వంటి వారి కృషి ఫలితంగా భారతదేశం సాంస్కృతిక పురుజ్జీవనం వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఆ అడుగులలో అడుగు కలిపిన మహానుభావులు కొందరు ఉన్నారు. అందులో తిలక్ ఒకరు. ఇంగ్లిష్ చదువుకున్నా, మూలాలు ఇక్కడి మట్టిలోనే ఉండాలని భావించిన విజ్ఞులు తిలక్ కాలంలో కనిపిస్తారు. సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ ఫలశ్రుతి తిలక్, ఆయన సమకాలికులు కొందరి ఆలోచనలలో కనిపిస్తుంది. మహదేవ గోవింద రెనడే, జ్యోతిరావ్ ఫూలే, లోక్‌హితవాది, బాల్శాస్త్రి జంభేకర్ అలాంటివారే. జాతీయవాదానికీ, భారతీయ సమాజ సంస్కరణకీ వీరు దేశీయమైన ఆలోచనలనే పునాదిగా స్వీకరించారు. తిలక్ కూడా అంతే. ఆయన సంస్కృత పండితుల కుటుంబం నుంచి వచ్చారు. స్వయంగా సంస్కృత పండితుడు. వారిది శోత్రియ కుటుంబం. అయినా హెగెల్, కాంట్, స్పెన్సర్, మిల్, బెంథామ్, వాల్టేర్, రూసోల సిద్ధాంతాలను శిరోధార్యంగా భావించారు. తండ్రి గంగాధర తిలక్ ఉపాధ్యాయుడు. సంస్కృత పండితుడు. తన పదహారవ ఏటనే తిలక్ తండ్రిని కోల్పోయారు. తిలక్ అసలు పేరు కేశవ్ గంగాధర తిలక్. అదే బాలగంగాధర తిలక్ అయింది. చదువంతా పుణేలో సాగింది. పూనా దక్కన్ కళాశాల నుంచి ఆయన గణితశ్రాస్తం ప్రధానాంశంగా పట్టా తీసుకున్నారు. కెరునానా ఛాత్రే గణితశాస్త్రంలో తిలక్ అభిమాన గురువు. అలాగే ఆచార్య వర్డ్స్ వర్త్ కూడా తిలక్‌ను అభిమానించేవారు. ఆయన మహాకవి వర్డ్స్‌వర్త్ మనుమడు. తరువాత తిలక్ న్యాయశాస్త్రం కూడా అభ్యసించారు. తన చిన్ననాటి స్నేహితుడు గోపాల్గణేశ్ అగార్కర్, ఇంకా మహాదేవ బల్లాల్ నామ్‌జోషి, విష్ణుశాస్త్రి చిప్లూంకర్ కలసి తిలక్ దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. యువతకు నాణ్యమైన విద్యను అందించడమే ఈ సంస్థ ధ్యేయం. భారతీయ చింతన ప్రాతిపదికగా జాతీయ భావాలను పెంపొందించడమే ఆ సొసైటీ ఆశయం. ఈ వ్యవస్థాపకులంతా సంవత్సరం పాటు ఉచితంగానే విధులు నిర్వహించారు. తిలక్ గణితం, సంస్కృతం బోధించేవారు. మేఘదూతం కూడా ఆయనే చెప్పేవారు. న్యూ ఇంగ్లిష్ స్కూలు, ఫెర్గూసన్ కళాశాల దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీయే స్థాపించింది. పూనా కేంద్రంగా ఇవి పనిచేసేవి. తిలక్ ఎంతటి ఆలోచనాపరుడో, అంతటి కార్యశీలి. మొదట ఆయన విద్యావేత్త. తరువాత పత్రికా రచయిత. గ్రంథకర్త. రైతాంగ ఉద్యమాలలో భాగస్వామ్యం ఉన్నవారు. పూనా సార్వజనిక్ సభ నాయకత్వం గోఖలే తరువాత తిలక్ చేతికి వచ్చింది. 1896లో మహారాష్ట్రలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. సార్వజనిక్ సభ కార్యకర్తలను ఆయా ప్రాంతాలకు పంపించి, వాస్తవాలను సేకరించి వాటిని తన పత్రిక కేసరిలో ప్రచురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు తిలక్ కృషి చేశారు. 1872లోనే రూపొందించిన ఫేమిన్ కోడ్‌ను బయటకు తీసి, మరాఠీ భాషలోకి అనువదించి రైతుల కోసం తిలక్ తన పత్రికలో వెలువరించారు. ఆ కోడ్ మేరకు ప్రభుత్వాన్ని రైతులు నిలదీయవచ్చునని తిలక్ ప్రబోధించారు. అయితే ప్రొఫెసర్ పరాంజపే అనే మేధావి కూడా రైతుల సభల ఏర్పాటు చేసి ఫేమిన్ కోడ్‌లో ఏమి ఉందో, ప్రభుత్వాన్ని ఏ మేరకు నిలదీసే అవకాశం ఉందో ఉపన్యాసాలు ఇచ్చినందుకు పోలీసులు నిర్బంధించారు. దీనితో తిలక్ స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి ఫేమిన్ కోడ్‌ను మరాఠీలోకి అనువదించి మరీ ప్రచురించిన తనను మొదట అరెస్టు చేయాలని పట్టుపట్టారు. కానీ తిలక్‌ను అరెస్టు చేయకుండా ఉండడమే కాదు, ప్రొఫెసర్ పరాంజపేను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. తిలక్ భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించిన ఐదేళ్ల తరువాత మొదటిసారి సభలకు హాజరయ్యారు. చాలాకాలం ఆ సంస్థలో కొనసాగినా మితవాదుల ధోరణి ఆయనకు సమ్మతంగా ఉండేది కాదు. విన్నపాలు, వినతులు వలస ప్రభుత్వాన్ని లొంగదీయలేవని తిలక్ సిద్ధాంతం. కానీ ఆయన కాంగ్రెస్‌లోని చాలామంది ప్రముఖులను విశేషంగా గౌరవించేవారు. దాదాభాయ్ నౌరోజీ అంటే ఎంతో గౌరవం. భారత పేదరికం బ్రిటిష్ పుణ్యమేనన్న నౌరోజీ సిద్ధాంతాన్ని సమర్థించడమే కాకుండా, తన పత్రికలో ఎంతో ప్రాచుర్యం కల్పించారు. అలాగే గోఖలేతో చాలా అంశాలలో తిలక్‌కు విభేదాలు ఉండేవి. ముఖ్యంగా వయో పరిమితి బిల్లు విషయంలో ఇద్దరికీ తీవ్ర విభేదాలు వచ్చాయి. అయినా గోఖలేను తిలక్ సగౌరవంగా చూసేవారు. కానీ 1907 నాటి సూరత్ కాంగ్రెస్ సభలు తిలక్‌ను ఘోర అవమానానికి గురి చేశాయి. అదే ఆ సంస్థలో చీలికకు నాందీ వాచకమైంది. ఆ సభలకు అధ్యక్షుడు అరబిందొ ఘోష్ కావడం మరొక విశేషం. కాంగ్రెస్ సాధారణ భారతీయుడికి చేరువ కావాలన్నదే తిలక్ ఆశయం. కానీ అప్పటికి ఆ సంస్థ మహారాష్ట్ర, బెంగాల్ సహా పలు ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు, ఉపాధ్యాయుల అధీనంలో ఉండేది. ఇంగ్లిష్ తెలిసినవారికే ప్రవేశం మరొక ఆటంకం. అయినా ఉదారవాదంలో ప్రజానీకం మనసును తాకే అంశాలు లేవన్నదే తిలక్ అభిప్రాయంగా కనిపిస్తుంది. జాతీయ కాంగ్రెస్‌లో పని చేస్తున్నప్పటికీ తిలక్ తనదైన మార్గం నుంచి తప్పుకోలేదు. ఇది కాంగ్రెస్‌లోని మితవాదులకు రుచించేది కాదు. ఆయన 1893లో గణేశ్ చతుర్థిని సామూహిక ఉత్సవంగా నిర్వహించే సంప్రదాయాన్ని పుణే, బొంబాయిలలో తీసుకువచ్చారు. అది దేశవ్యాప్తమైంది. తరువాత శివాజీ ఉత్సవాలను కూడా ప్రారంభించారు. శివాజీ పట్టాభిషేకం జరిగిన రాయగఢ్ కోటలోనే ఆయన సమాధి కూడా ఉంది. కానీ అది శిథిలావస్థకు చేరింది. దీనిని పునరుద్ధరించేందుకు తిలక్ పెద్ద ఉద్యమమే నిర్వహించారు. మతం మనుషులను ఒక శక్తిగా నిలబెడుతుందని తిలక్ నమ్మకం. ‘మతం, వాస్తవిక జీవనం వేర్వేరు కావు. సన్యాసం స్వీకరించడమంటే జీవితాన్ని త్యజించడం కాదు. అందులో ఉన్న నిజమైన స్ఫూర్తి ఏదంటే – దేశం మొత్తాన్ని కూడా నీ కుటుంబంగానే భావించడం. నీ కుటుంబం కోసమే కాకుండా, ఈ ప్రపంచం కోసం కూడా పనిచేయడం. దీని తరువాత మెట్టు మానవ సేవ. ఆ తరువాతి అడుగు భగవంతుడి సేవ’ అన్నారు తిలక్. అలా మతం ద్వారా ప్రజల మధ్య ఐక్యత సాధించాలన్నదే తిలక్ ఉద్దేశం. అలాగే శివాజీ జీవితానికీ, పోరాటానికీ తిలక్ ఇచ్చిన నిర్వచనం ప్రత్యేకమైనది. హిందువుల హక్కులను హరిస్తూ, వారి మత విశ్వాసాలను దారుణంగా అవమానిస్తున్న మొగలుల మీద యుద్ధం చేసిన వీరునిగా తిలక్ విశ్లేషించేవారు. అలాగే అప్జల్‌ఖాన్ మరణం గురించి కూడా. అఫ్జల్ఖాన్ అనే బిజాపూర్ సైనికాధికారిని చంపడం వెనుక మత భావనను వెతక్కూడదని తిలక్ చెప్పారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాడు కాబట్టే శివాజీ అఫ్జల్‌ను చంపాడని చెప్పేవారు. ఆనాడు ఆంగ్లేయుల యాజమాన్యంలో ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా దీనినే వక్రీకరించి, తిలక్ హత్యను సమర్థిస్తున్నారని ప్రచారం ప్రారంభించింది. ఏప్రిల్15, 1896లో తిలక్ శివాజీ ఉత్సవాలను కూడా ప్రారంభించారు. దేశం కోసం మరణించడం అనే ఊహ మీద తిలక్ స్పందన కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఒకసారి అభినవ్ భారత్ సభ్యులు ఒక అంశం మీద సలహా కోసం తిలక్‌ను కలుసుకున్నారు. ఇది సావర్కర్ నాయకత్వంలో నడిచేది. అందులో ఎవరో ‘తాము దేశం కోసం చనిపోవడానికి కూడా సిద్ధమ’ని అన్నారు. అందుకు తిలక్, ‘అవసరమైతే మరణించడం సరే, కానీ దేశమాత సేవకు జీవించడం కూడా అవసరమే’ అని చెప్పారు.బ్రిటిష్‌జాతి మీద జాతీయ కాంగ్రెస్‌లోని మితవాదులు పెట్టుకున్న నమ్మకం ఒట్టి భ్రమ అన్నది మొదటి నుంచి తిలక్ వాదన. అదే బెంగాల్ విభజనతో రుజువైంది. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో లాలా లజపతిరాయ్, బిపిన్పాల్లతో కలసి తిలక్ ముఖ్యమైన పాత్ర పోషించారు. నిజానికి ముస్లింలు, హిందువులకు మధ్య ఘర్షణలను నివారించడంలో బ్రిటిష్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తిలక్ కేసరిలో వాదించేవారు. బెంగాల్‌ను మత ప్రాతిపదికనే కర్జన్ 1905లో విభజించాడు. లాల్, పాల్‌లతో పాటు చిత్తరంజన్‌దాస్, రవీంద్రనాథ్ టాగోర్ వంటి బెంగాలీ ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పటికి యువతరంలో అరవింద్ ఘోష్ అంటే ఎంతో ఆకర్షణ ఉండేది. ఘోష్‌తో తిలక్ అనుబంధం ప్రత్యేకమైనది. 1902లో ఆ ఇద్దరు మొదటిసారి అహమ్మదాబాద్ జాతీయ కాంగ్రెస్ సభలలో కలుసు కున్నారు. ఘోష్‌ను కాంగ్రెస్ డేరా బయటకు తీసుకు వెళ్లి తిలక్ చాలాసేపు మాట్లాడారు. ఇద్దరి అభిప్రాయాలు దాదాపు ఒక్కటే. మితవాదుల పంథా సరికాదన్నది అందులో ఒకటి. అలాగే స్వాతంత్య్రోద్యమం మరింత విస్తరించాలి. విప్లవాత్మకం కావాలి. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం జాతీయ స్థాయికి వెళ్లడానికి నాలుగు సూత్రాలను ముందుకు తెచ్చారు. అవి–స్వరాజ్, జాతీయ విద్య, స్వదేశీ, విదేశీ వస్తు బహిష్కరణ. ఇవి తిలక్ అందించినవేనని కొందరు రాశారు. వీటితోనే ఉద్యమం భారతీయులందరికీ చేరువ కాగలదని తిలక్ నమ్మారు. ఇవి ఆచరించదగినవే అయినా, మరింత విప్లవ దృష్టితో ఉద్యమం రావాలన్నది ఘోష్ అభిప్రాయం. ఇవన్నీ జరిగిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం మౌనంగా ఉంటుందనీ, తిలక్‌ని ఊరికే వదులుతుందనీ ఎవరూ అనుకోలేదు. అదే జరిగింది కూడా. అలాంటి అవకాశం కోసమే పొంచి ఉన్న పోలీసులకి ఏప్రిల్ 30, 1908న జరిగిన ముజఫర్‌పూర్ బాంబుదాడి, తరువాతి పరిణామాలు అవకాశం కల్పించాయి. బొంబాయిలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు భారతీయుల పట్ల అత్యంత నిర్దయగా వ్యవహరించినందుకు ప్రతీకారంగా ఆ రోజున ప్రఫుల్ల చాకి, ఖుదీరాం బోస్ అనే యువకులు బొంబాయి ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్‌ఫోర్డ్ మీద బాంబు విసిరారు. అది గురి తప్పి ఇద్దరు స్త్రీలు మృతి చెందారు. ఆ ఇద్దరు యువకుల ఉద్దేశాన్ని మాత్రం తిలక్ కేసరి పత్రికలో శ్లాఘించారు. పైగా వెంటనే స్వరాజ్యం ఇవ్వాలని కోరారు కూడా. దీని మీదనే జూలై 3,1908న దేశద్రోహ నేరం ఆరోపించి అరెస్టు చేశారు. ఈ కేసును తిలక్ కోసం బొంబాయి హైకోర్టులో మహమ్మదలీ జిన్నా వాదించారు. కానీ ఓడిపోయారు. అదంతా ఒక పథకం. తిలక్‌కు ప్రవాస శిక్ష విధించినందుకు దావర్ అనే న్యాయమూర్తికి ఆలస్యం లేకుండా సర్ బిరుదు వచ్చింది. జిన్నా తిలక్ వద్దకు వచ్చి చేతులు పట్టుకుని ఎంత బాధపడ్డారో ఎంసీ చాగ్లా తన ఆత్మకథ ‘రోజెస్ ఇన్ డిసెంబర్’లో అద్భుతంగా వర్ణించారు. 1908 నుంచి 1914 వరకు తిలక్ బర్మాలోని (నేటి మయన్మార్) మాండలే జైలులో శిక్ష అనుభవించారు. అక్కడే గీతా రహస్య పుస్తకం రచించారు. బొంబాయిలోని సర్దార్ గృహ తిలక్ నివాసం. ఆగస్టు1(1920) వేకువన ఆయన మరణించినట్టు చెప్పే వార్త నగరంలో దావానలంలా వ్యాపించింది. ఆ ముందు రాత్రి అంతిమ క్షణాలు లెక్కిస్తున్న తిలక్‌ను రక్షించేందుకు ప్రముఖ వైద్యులంతా శ్రమించారు. అలాంటి సమయంలో కూడా తిలక్ అన్నమాట ఒక్కటే, ‘స్వరాజ్యాన్ని సాధించలేకపోతే భారతదేశానికి భవిష్యత్తు లేదు.’ - డా. గోపరాజు నారాయణరావు -
భారతీయుల సోదరి
‘‘ఈ ప్రభుత్వం ఎంత దుర్భరంగా తయారవుతోందో నీవు ఊహించలేవు. టిబెట్ దండయాత్ర, కొత్తగా తెచ్చిన విద్యాచట్టం, బెంగాలు విభజన, అధికార రహస్యాల చట్టం, పురాతన కట్టడాల చట్టం మొదలైన ప్రతి చర్య అణచివేత చర్యే! ఎంతో నిరంకుశంగా సాగుతున్న ఈ పాలన భారతీయులలోని స్వాతంత్య్ర భావనలను నీరుగార్చడానికి చేస్తున్నవే!’’ ఈ మాటలు మెక్లౌడ్ అనే ఒక విదేశీ యువతికి భారతదేశం నుంచి 1904లో వెళ్లిన ఓ ఉత్తరంలో కనిపిస్తాయి. ఆ లేఖ, అందులో ఆగ్రహావేశాలను రంగరించుకున్న ఈ అక్షరాలు భారతదేశంలో ఏ జాతీయవాదీ రాయలేదు. ఇవి రాసినది మళ్లీ ఒక విదేశీ వనితే. పేరు సిస్టర్ నివేదిత. ఇది అప్పటి వైస్రాయ్ కర్జన్ మీద ఆగ్రహం కూడా. అతడు ఎన్నో అబద్ధాలు చెబుతున్నా, భారతీయుల ఆత్మగౌరవం దెబ్బ తినే విధంగా మాట్లాడుతున్నా ఇక్కడి వారెవ్వరూ ఖండించకపోవడం కూడా సోదరి నివేదితకు బాధగా కూడా అనిపించింది. ఇలాంటి వైఖరి ప్రధానంగా జాతీయ కాంగ్రెస్‌లోని మితవాదులదే. అందుకే ఆమె గోపాలకృష్ణ గోఖలే వంటివారికి కూడా సున్నితంగా హితబోధ చేసింది. ఆగ్రహించడానికి ఉపయోగించే భాషకు మర్యాదను అద్దడంతోనే జీవితమంతా గడిపేస్తే భవిష్యత్తరాల గతి ఏమిటన్నదే ఆమె ప్రశ్న. ఇంతకీ ఆ ఉత్తరం అందుకున్న జోసఫైన్ మెక్లౌడ్ అమెరికా దేశీయురాలు. షికాగోలో వివేకానందుని ఉపన్యాసాలను విని గొప్ప గౌరవ భావంతో, ఆయన వెంట ఇంగ్లండ్ వచ్చి, అక్కడ కూడా ఆయన ప్రసంగాలను విన్న భక్తురాలు.విదేశీ దండయాత్రలతో, విదేశీ పాలనతో భారతీయులు ఏం కోల్పోయారో పాశ్చాత్యులే బాగా గ్రహించారనిపిస్తుంది. ఈ పురాతన సంస్కృతిలోని ఔన్నత్యాన్ని నిజాయితీగా, సూక్ష్మంగా వారే గమనించారని అనిపిస్తుంది. అందులో సిస్టర్ నివేదిత కూడా ఒకరు. ఆమె కంటే ముందు అనిబీసెంట్ మనం కోల్పోయినదేమిటో మనకి చెప్పడానికి ప్రయత్నించారు. ఇద్దరూ ఐర్లాండ్ మూలాలు ఉన్నవారే. జీవన విధానం, కళలు, ఆలోచనలు తిరిగి భారతీయం కావాలని ఆకాంక్షించిన వారే. సిస్టర్ నివేదిత ఆధ్యాత్మిక చింతన కోసమే, మానవ సేవ కోసమే మనదేశం వచ్చారు. తరువాత ఆమె మార్గం భారతీయుల రాజకీయోద్యమం వైపు మళ్లింది. గడప దాటని భారతీయ మహిళకు అక్షరాలు అందించడానికి ఆమె అంకితమయ్యారు.సిస్టర్ నివేదిత అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. మార్గరెట్ (అక్టోబర్ 28, 1867–అక్టోబర్ 13, 1911) ఆనాటి ఉత్తర ఐర్లాండ్‌లోని దూంగన్నాన్ అనే పట్టణంలో పుట్టారు. ఇది టైరోన్ కౌంటీలో ఉంది. ఆమె తాత జాన్ నోబెల్ స్కాట్లాండ్కి చెందినవారు. మార్గరెట్ తండ్రి శామ్యూల్ రిచ్మండ్ నోబెల్, తల్లి మేరీ ఇసాబెల్. శామ్యూల్ మత గురువు. మానవులకు సేవ చేయడమంటే, దైవానికి సేవ చేయడమేనని శామ్యూల్ పదే పదే చెప్పేవారు. అది ఆచరించి చూపించారు కూడా. పేదల బాగోగులు చూడ్డానికి వెళుతున్నపుడు మార్గరెట్ ఆయన వెంట ఉండేది. ఆమే పెద్ద కూతురు. పైగా ఆయనకి ఎంతో ముద్దు. కానీ పిన్న వయసులోనే, ముప్పయ్ నాలుగేళ్లకే శామ్యూల్ కన్నుమూశారు. అందుకు కారణం, పేదల సేవలో ఉంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమే. దీనితో తల్లి తన పిల్లలను తీసుకుని తన తండ్రి రిచర్డ్ హ్యామిల్టన్ దగ్గరకు వెళ్లింది. ఆయన ఆదాయం తన కుటుంబానికీ, కూతురు కుటుంబానికీ చాలేది కాదు. దీనితో మేరీ తండ్రితో కలసి అతిథిగృహాన్ని నిర్వహించింది. శామ్యూల్ తండ్రి జాన్, మేరీ తండ్రి హ్యామిల్టన్ ఇద్దరూ ఐర్లాండ్ స్వాత్రంత పోరాటంలో, హోంరూల్ ఉద్యమంలో ప్రముఖులు. మార్గరెట్ మీద తండ్రి ప్రభావం ప్రగాఢంగా ఉంది. ఆయనతో సాన్నిహిత్యం, ఆయన నోటి నుంచి విన్న బోధనలు సత్యాన్వేషణకి పురికొల్పాయి. ఆమె ఏమి ఆలోచించినా అందులో సత్యం ఎంత అన్న దాని కోసమే తహతహలాడినట్టు కనిపిస్తుంది. అయితే ఆమె చదువంతా చర్చి సంబంధిత పాఠశాలల్లోనే సాగింది. తరువాత హాలిఫాక్స్ విశ్వవిద్యాలయంలో చేరింది. ఇక్కడ నుంచే ఆమెలో ఒక గుంజాటన మొదలైంది. తను చదివిన దానికీ, సత్యం దిశగా సాగుతున్న తన ఆలోచనలకీ పొంతన కుదరడం లేదన్న సంగతి అప్పుడే గ్రహించారామె.1884లో కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకుంటూ మార్గరెట్ కేస్విక్లోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. తరువాత రగ్బీ అనే చోటికి వెళ్లి అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేసిన బడిలో చదువు చెప్పింది. ఆపై ఉత్తర వేల్స్ బొగ్గుగనుల ప్రాంతం వెళ్లింది. ఇక్కడే వేల్స్‌కి చెందిన యువ ఇంజనీర్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. నిశ్చితార్థం జరగకుండానే అతడు చనిపోయాడు. ఇదే ఆమె జీవితాన్ని మార్చివేసింది. అక్కడ నుంచి వచ్చేసి లండన్ దగ్గర కింగ్స్లే గేట్ దగ్గర సొంతంగా పాఠశాలను ఆరంభించిందామె. ఇందులో ప్రయోగాత్మకంగా విద్యను బోధించేది. పిల్లలు తరగతి గదిలో కూర్చుని చదువుకోవలసిన అవసరం ఉండదు. ఆటపాటలతోనే చదువు నేర్పే విధానం ప్రవేశపెట్టింది. ఇక్కడే ఆమెతో పాటు ఒక ఆర్ట్ టీచర్ కూడా పనిచేశాడు. అతడే ఎబ్నెజర్ కూకే. ఇతడు కూడా ఆనాడు ఇంగ్లండ్ బడులలో మార్పు తేవడానికి ఉద్దేశించిన సంస్కరణోద్యమంలో ప్రముఖుడు. ఆర్ట్ ఎడ్యుకేషన్‌కి పితాహుడన్న పేరు కూడా ఉంది. హాలిఫాక్స్ విశ్వవిద్యాలయం విద్యార్థి వసతి గృహంలో ఉండే నిర్దిష్టత కారణంగా ఏర్పడే చీకాకు నుంచి తప్పించుకోవడానికి, అందులో కలిగే విసుగు నుంచి బయటపడడానికి ఆమె తీవ్రంగా చదివేది. రచనలు చేసేది. అంతవరకు కూడా చదువు, మత బోధనలు సమాంతరంగానే సాగాయి. బాల ఏసును ఆరాధించేది. కానీ ఆ బోధనలేవీ సత్యానికి సమీపంగా తీసుకువెళుతున్నట్టు అనిపించలేదు. ఫలితం– క్రైస్తవం మీద విముఖత. అప్పటి యూరప్ వాతావరణం కూడా ఆమె ఆలోచనలకు పదును పెట్టింది. ఆ ఖండం అనుసరించిన సంస్కృతి, నమ్ముకున్న భావాలు అక్కడి ప్రజలు చిరకాలంగా ఆచరిస్తున్న మతం పట్ల వ్యతిరేకతతో, అనుమానంతో నిండిపోయాయి. మానసికంగా వచ్చిన ఈ శూన్యాన్ని భర్తీ చేసుకోవడానికి మార్గరెట్ జీవశాస్త్రం అభ్యసించింది. కొంతకాలం బౌద్ధం అధ్యయనం చేసింది. ఏడేళ్ల పాటు అలాంటి డోలాయమాన స్థితిలో ఆమె ఉండిపోయింది. ఆ సమయంలోనే చాలా దేశాల కళారీతులను కూడా అధ్యయనం చేసింది. అప్పుడే ఒకప్పటి సహచరుడు ఎబెనెజర్ ఒక సమావేశానికి రమ్మని పిలిచాడు.1895 సంవత్సరం సెప్టెంబర్ నెల. ఆ ఆదివారం పగలు కూడా విపరీతమైన చల్లగా ఉంది. అలాంటి సమయంలో మార్గరెట్ లండన్‌లోని లేడీ ఇసాబెల్ మార్గెసన్ అనే కులీనురాలి ఇంటికి వెళ్లింది. ఎబెనెజర్ ఆహ్వానించిన సమావేశం ఆ ఇంటిలోనే ఏర్పాటైంది. ‘ఆ సమయంలో తాను లండన్‌లో కనుక లేకుంటే తన జీవితం తల లేని మొండెంలా మిగిలేది’ అని మార్గరెట్ స్వయంగా ఒకసారి చెప్పుకున్నారు. పదిహేను మందో పదహారు మందో అర్థచంద్రాకారంగా కూర్చున్నారు. వారి నడుమ కాషాయ వస్త్రాలతో, నడుముకు అంగవస్త్రం బిగించి కూర్చుని ఉన్నారా ‘‘హిందూ యోగి’’. ఆయనే వివేకానందుడు. షికాగో సర్వమత సమ్మేళనంలో పాల్గొన్న తరువాత అక్కడే పరిచయమైన కొందరు ఇంగ్లండ్ మిత్రుల ఆహ్వానం మేరకు మూడు మాసాలు ఉండడానికి వచ్చారాయన. కానీ ఆయన వెల్లడించిన అభిప్రాయాలు విశ్వజనీనంగా, హేతుబద్ధంగా ఉన్నప్పటికీ అక్కడి తెల్లజాతి మేధావులు వాటిని కొట్టి పారేశారు. కానీ అవే మార్గరెట్‌ను ఆలోచింపచేశాయి. ఆయన ఎక్కడ ప్రసంగించినా వెళ్లి విన్నది. చివరికి ఇంగ్లండ్ వీడుతున్న వేళలో ‘‘గురువర్యా!’’ అని సంబోధించిందామె. రెండవసారి ఏప్రిల్, 1896లో వివేకానంద మళ్లీ లండన్ వెళ్లారు. ఆమె మరోసారి ఆయనను కలుసుకుంది. ఎన్నో ప్రశ్నలు వేసింది. ఆయన జవాబులతో తనను వెంటాడుతున్న అనేక సందేహాలు నివృత్తి అయ్యాయి కూడా. రెండేళ్ల తరువాత తన కుటుంబాన్నీ, మిత్రులనీ అందరినీ వదిలిపెట్టి ‘మొంబాసా’ అనే నౌక మీద బయలుదేరి శాశ్వతంగా భారతదేశంలో ఉండిపోవడానికి వచ్చేసింది. జనవరి 28,1898న కలకత్తా చేరుకున్నారు. మార్చి 11న కలకత్తాలోనే స్టార్ థియేటర్లో రామకృష్ణా మిషన్ ప్రారంభ సమావేశం జరిగింది. అందులో మార్గరెట్ మాట్లాడింది. వారం తరువాత వచ్చిన తేదీ మార్చి 17ను మార్గరెట్ ఎంతో ముఖ్యమైనదంటూ తన డైరీలో రాసుకున్నారు. ఆ రోజే ఆమె శారదామాతను కలకత్తాలో మొదటిసారి కలుసుకున్నారు. శారదామాత ఆమెను ఖూకీ (చిన్న కూతురు) అని సంబోదిస్తే, మార్గరెట్ శారదామాతను ‘అమ్మా’ అనే సంబోధించారు. ఇద్దరి మధ్య ఆ అనుబంధం అలాగే కొనసాగింది. అప్పటికే కలకత్తా చేరుకున్న మెక్లౌడ్, ముల్లర్ అనే మరో ఆంగ్ల యువతలను కూడా తన కూతుళ్లని చెబుతూ శారదామాత వారితో కలసి భోజనం చేశారు. నిజానికి అది ఆ కాలానికి ఒక అసాధారణ చర్య. వెలివేతకు దారి తీసేదే. అయినా శారదామాత వారితో సఖ్యంగా ఉన్నారు. నిజానికి మార్చి11న ఒక సంఘటన జరిగింది. కాషాయ రంగు చీర ధరించిన ముల్లర్‌ను గంగ ఒడ్డున చూసిన స్థానికులు కొందరు వాదానికి దిగారు. కాషాయవస్త్రం ధరించే అధికారం ఒక విదేశీ వనితకు ఎవరిచ్చార ని వారు ప్రశ్నించారు. వారు చెప్పిన వివరణను బట్టి చివరికి స్థానికులు చల్లబడ్డారు. కానీ ఎంతో శోత్రియ కుటుంబంలో పుట్టిన, రామకృష్ణ పరమహంస వంటి యోగికి భార్య అయిన శారదామాత వారితో కలసి భోజనం చేశారు. తరువాత మార్గరెట్ స్వామి వివేకానంద సూచన మేరకు ఆ మార్చి 25న బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నారు. ఆ సమయంలో స్వామి ఆమెకు ఇచ్చిన పేరే నివేదిత. అంటే భగవంతునికి సమర్పించినది అని అర్థం. ‘సోదరి నివేదిత’ అని పిలిచారంతా. ఆ రోజు నుంచి ఆమె భారతదేశం కోసం అవిశ్రాంతంగా శ్రమించారు. వంగ భాష నేర్చుకున్నారు. ఆ సంవత్సరమే అంటే, నవంబర్ 13, 1898న, కాళీపూజ రోజున మార్గరెట్ కలకత్తాలోనే బాగ్ బజార్లో బాలికల కోసం పాఠశాల ఆరంభించారు. బాలికలు, యువతలు గడప దాటడానికి కూడా అంగీకరించని కాలంలో నివేదిత ప్రారంభించిన పాఠశాలకు ఎవరు వస్తారని అంతా ప్రశ్నించారు. కానీ ఆమె ఇంటింటికీ వెళ్లి వారిని ఒప్పించి ఆడపిల్లలను చేర్పించారు. ఈ పాఠశాల నిర్వహణకు నిధులు సమస్యగా ఉండేది. నివేదిత ఏమీ అధైర్య పడకుండా రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా వచ్చే డబ్బును ఆ పాఠశాల కోసం వెచ్చించారు. ఆమె పట్టుదల వెనుక పెద్ద ఉద్దేశమే ఉంది. స్వామి వివేకానంద మార్గరెట్‌ను భారతదేశానికి ఆహ్వానించినదే ఇలాంటి సేవలు అందించడానికి. పైగా ఆ పాఠశాలని నివేదిత కోరిక మేరకు శారదామాత స్వయంగా వచ్చి ప్రారంభించారు. ఆ మరుసటి సంవత్సరమే కలకత్తా నగరంలో ప్లేగ్ వ్యాధి వచ్చింది. ఆ సమయంలో సోదరి నివేదిత ప్రాణాలను సయితం లెక్క చేయక రోగులకు సేవలు చేశారు. అప్పుడే మళ్లీ నివేదిత విదేశీ యాత్రకు వెళ్లి, 1902లో దేశానికి తిరిగి వచ్చారు. జూలై 4న వివేకానంద అంతిమ శ్వాస విడిచారు. ఆయనకి నివాళిగా దేశమంతటా ఏర్పాటు చేసిన సభలలో ప్రసంగాల కోసం పర్యటిస్తూ ఉండగా బెంగాల్ విభజన జరిగింది. దీనికి ఆమె తీవ్రంగా స్పందించారు. ఉద్యమం వైపు దృష్టి మళ్లింది. బహుశా తండ్రి తరఫు తాతయ్య, అమ్మ తరఫు తాతయ్య ప్రభావం కూడా ఆమె మీద ఎక్కడో ఉంది. అందుకే ఐర్లాండ్ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చారు. నిజానికి భారతదేశానికి వచ్చే ముందు ఆమె ఆశయం–బ్రిటిష్ వారికీ, భారతీయులకు మధ్య సయోధ్యను కుదర్చడం ఆమె ఉద్దేశం. అందుకే ఒక భారతీయ స్త్రీ తన సంప్రదాయాన్ని ఎంతగా అభిమానిస్తుందో అదే తీరులో తాను బ్రిటిష్ పతాకాన్ని గౌరవిస్తానని ఆమె చెప్పారు. బెంగాల్ విభజన తరువాత ఆంగ్ల జాతి మీద ఆమెకు ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. అరవింద్ ఘోష్ వంటివారితో, అనుశీలన్ సమితితో ఆమెకు ప్రత్యక్ష సంబంధాలు ఉండేవి. మితవాదుల ధోరణి రాజకీయ ప్రయోజనాలను సాధించపెట్టలేదని ఆమె పరోక్షంగా విమర్శించేవారు. కానీ రామకృష్ణ మిషన్ సభ్యులు రాజకీయాలలో పాల్గొనడం నిషిద్ధం. అందుకే ఆమె విదేశీ వస్తు బహిష్కరణ, వందేమాతరం ఉద్యమాలను సమర్ధించడం కోసం ఆ సంస్థను వీడుతున్నట్టు బాహటంగానే ప్రకటించారు. ఆ మరుసటి సంవత్సరమే బెంగాల్‌ను కరువు కాటువేసింది. ఆ వెంటనే వరదలు వచ్చాయి. బాధితుల కోసం ఆమె నిరంతరం శ్రమించారు. దీనితో ఆమె మలేరియా బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. 1911 సంవత్సరంలో నివేదిత, ఆమె కొందరు మిత్రులు, జగదీశ్ చంద్రబోస్ దంపతులు (ఆయన పరిశోధనకు ఆమె గొప్ప స్ఫూర్తిగా నిలిచారు. కలకత్తా వచ్చిన కొత్తలోనే ఆ దంపతులతో ఆమె సాహచర్యం మొదలైంది.) డార్జిలింగ్ వెళ్లారు. అక్కడే నివేదిత హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. కొద్దికాలం పాటు అక్కడే ఉండిపోయారు. చివరికి అక్టోబర్ 13న అక్కడే కన్నుమూశారు. చివరిగా ఆమె నోటి నుంచి వెలువడిన శ్లోకం...‘‘అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ... ఓం శాంతి శాంతి శాంతిః’ - డా. గోపరాజు నారాయణరావు -
నటస్థానం
బాపట్ల అమెరికన్ మిషనరీ వారి ఉపాధ్యాయ శిక్షణ సంస్థకి ఆ పెద్దాయన సైకిల్ మీద వచ్చాడు, ఓ విద్యార్థిని వెతుక్కుంటూ. పేరు– చోరగుడి హనుమంతరావు. ఆనాడు ప్లీడరు గుమస్తాలంతా కలసి నిర్వహిస్తున్న నాటక సంస్థలో హరిశ్చంద్రుడి పాత్ర ధరించేవాడు. మొత్తానికి చిత్రలేఖనం తరగతిలో ఉన్న ఆ అబ్బాయిని పట్టుకుని బయటకు తీసుకొచ్చి ఆ రాత్రి ప్రదర్శించబోయే ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం పాసులు నాలుగు చేతిలో పెట్టాడు. ఆపై చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పాడు, కొన్ని గంటలలో ప్రదర్శించబోయే ఆ నాటకంలో ఒక వేషం కూడా వెయ్యాలని! ‘ఏ పాత్ర? మాతంగ కన్యా?’ అన్నాడా కుర్రాడు. అదో చిన్న పాత్ర. ‘కాదు, చంద్రమతి’ అన్నాడు హనుమంతరావు. హడలిపోయాడా కుర్రాడు. ఒక్కసారి కూడా ముఖానికి రంగు పూసుకోలేదు. పోర్షన్ కూడా రాదు. ఎలా? వణికిపోయాడు.‘ఏం ఫర్వాలేదు. నీకు పద్యాలన్నీ వచ్చు, అది నాకు తెలుసు. అదే చాలు. మిగతా నేను చూసుకుంటా!’ అని చేతులు పట్టుకున్నంత పని చేశాడాయన. సరేననక తప్పలేదు. వెళ్లిపోతూ ఇంకోమాట కూడా చెప్పారు హనుమంతరావు, ‘ఒరేయ్ నాయనా! నువ్వు రాకపోతే ఊరి పరువుపోతుంది. ఇంక మేం తలెత్తుకోలేం. పైగా ముఖ్యఅతిథులు ఎవరో తెలుసు కదా! తిరుపతి వేంకటకవులు. వారు ప్రతి కళాకారుడినీ ఆశుకవిత్వంతో దీవిస్తారు!’ భయం భయంగా చంద్రమతి పాత్ర వేయడానికి కృత్యాద్యవస్థ మీద ఒప్పుకున్న ఆ కుర్రాడు స్థానం నరసింహారావు. అత్యంత నాటకీయంగా రంగస్థల ప్రవేశం చేసిన స్థానం నరసింహారావు (23.9.1902–21.2.1971) తరువాత మహా నటుడయ్యారు. పద్మశ్రీ బిరుదు అందుకున్నారు. ఆయనకు అందమైన ఆకారం గాని, అవయవ సౌష్టవం గాని లేవు. అలా అని అందవికారి మాత్రం కాదు. సన్నగా పొడుగ్గా ఉండేవారు. పెద్ద పెద్ద చెవులు. పొడుగు ముక్కు. కోలముఖం. కానీ మంచి పలువరస. చామనచాయ శరీరం. తనకూ అందం ఉందని తృప్తి పడేవారు, అద్దంలో చూసుకుని. ఆకాలంలో ఫిట్స్ (చిన్నబిడ్డ గుణం అనేవారు) వచ్చిన పిల్లలకి పొగచుట్టతో నుదిటి మీద వాత పెట్టేవారు. అలాంటి మచ్చ జీవితాంతం ఉండిపోయేది. అది కూడా ఉండేది. అలాగే చెవికి పోగు. అది వంశ పారంపర్యంగా వచ్చింది. తాత తగిలించుకున్నదే తరువాత తండ్రి ఇంకొంత బంగారం వేయించి, బాగు చేయించి నరసింహారావుగారి చెవికి పెట్టారట. దీనికి తోడు ‘ముక్కునాదం’. అంటే మాట్లాడితే ముక్కుతో మాట్లాడినట్టు ఉంటుంది. కురచగా కత్తిరించిన జుట్టు, వెనకాల పిలకతో ఉండే ఆ పిల్లవాడిని తోటి పిల్లలు ఆటపట్టించేవారు. అలాంటి ఒక కుర్రవాడు స్త్రీ పాత్ర పోషణకి విఖ్యాతి గాంచాడు. తన ఆకృతితో పాటు ప్రవృత్తితో కూడా పొసగే ఒక బృందం కోసం ఆయన అన్వేషించారు. స్థానం వారికి చిన్నతనం నుంచీ భక్తి మెండు. ఆ క్రమంలో దొరికింది ఒక భజన బృందం. నరాలశెట్టి వెంకయ్య అని ఒక తోటమాలి కొడుకు అందులో ఉండేవాడు. ఊరికి దూరంగా వారి పూలతోటలు ఉండేవి. అందులో కూలిపోతున్న ఓ పాక ఉండేది. ఈ భజన బృందం వెళ్లి ఆ పాకలో భజన చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆ తోటమాలిని కోరారు. అంతా కలసి బాగు చేశారు. ప్రతి శనివారం జరిగే ఆ భజనకే సీతారాం బావాజీ అనే ఒక సాధువు తంబురాతో వచ్చేవాడు. అతడి సమక్షంలోనే మొదట రాగయుక్తంగా పాడడానికి, శాస్త్రీయంగా పాడడానికి స్థానం వారి జీవితంలో బీజం పడింది. స్త్రీ పాత్ర విషయంలోనూ అలాగే జరిగింది. ఆయన చిన్నతనంలో కూచిపూడి భాగవతులు వచ్చి బాపట్లలో ప్రదర్శనలు ఇచ్చేవారు. అందులో వెంపటి వెంకటనారాయణ అనే ఆయన భామ వేషం అద్భుతంగా కట్టేవారట. ఆ స్త్రీ వేషం తన మనసులో ఎంతో ఆదరంతో మనసులో నిలిచి పోయి ఉండేదని చెప్పారు. ఈ దృశ్యాలన్నీ అంతిమంగా హఠాత్తుగా రంగస్థల ప్రవేశం చేయడానికి దోహదం చేశాయి. 1921లో బాపట్లలోనే తిరుపతి వేంకటకవులకీ, కొప్పరపు కవులకీ శతావధానం పోటీ జరిగింది. నెగ్గిన తిరుపతి వేంకటకవులని సత్కరించాలని భావించారు. ఆ సందర్భంగా ప్లీడరు గుమస్తాల బృందం చేత సత్య హరిశ్చంద్ర నాటకం వేయించాలని నిర్ణయించారు. ఆహ్వానాలు వెళ్లిపోయాయి. కానీ చంద్రమతి వేషధారి అస్వస్థుడై రాలేకపోతున్నట్టు చివరి నిమిషంలో తెలిసింది. ప్రత్యామ్నాయం ఏదీ సా«ధ్యం కాలేదు. చంద్రమతి పాత్రధారి మరొకరు దొరకలేదు. మరో నాటకం వేద్దామంటే పాత్రధారులంతా లేరు. గుండెల్లో రాయి పడింది. అప్పుడే ఆపద్బాంధవుడిలా స్థానం దొరికాడు చోరగుడి హనుమంతరావుకి. వారి నాటకం రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు వెళ్లి కూర్చోవడంతో పద్యాలన్నీ వచ్చేశాయి. ఒకసారి ఎవరూ లేనప్పుడు పాడుకుంటూ ఉంటే హనుమంతరావుగారు విన్నారు. ఆ ధైర్యంతోనే చంద్రమతి వేషం వేయించారు. స్థానం వారికి చిన్నతనంలోనే చిత్రలేఖనం కూడా అబ్బింది. ఆ కళతోనే, వేరే ఒకరి ఇంట రహస్యంగా తన వేషం తనే వేసుకున్నారాయన. చిన్న చిన్న లోపాలు ఉన్నా అరంగేట్రంలోనే తిరుపతి కవుల ఆశీస్సులు అందుకున్నారు స్థానం. కానీ ఇవేమీ తెలియని తల్లి, తండ్రిపోయాకా (తల్లి ఆదెమ్మ, తండ్రి హనుమంతరావు) ఇవేమి ‘అపరబుద్ధులు’ అంటూ కొడుకుని చీదరించుకుంది. చెవులు వెనుక మిగిలిపోయిన రంగు మరింత ఆగ్రహం తెప్పించిందామెకు. దానితో ఇంకెప్పుడూ ముఖానికి రంగు పూసుకోనని హామీ కూడా ఇచ్చేశారాయన. కానీ, ఆ విష్కంభం స్వాతంత్య్రోద్యమ ఘట్టంతో తొలగిపోయింది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారి రామదండుకు ఆర్థికసాయం అందించాలనీ, అందుకు మళ్లీ సత్యహరిశ్చంద్ర ప్రదర్శించాలనీ అంతా నిర్ణయించారు. ప్రదర్శన చీరాలలో. కానీ స్థానం వారి తల్లి కొడుకు వేషం వేయడానికి ససేమిరా అన్నారు. చివరికి పెద్ద వకీలును రాయబారిగా పంపించి ఒప్పించారు. ఈసారి పోర్షన్ అంతా చదివి నటించారు. వెయ్యి రూపాయలు వచ్చాయి. గోపాలకృష్ణయ్యగారు కూడా ఎంతో మెచ్చుకున్నారు. కొన్ని మెలకువలు కూడా చెప్పారు. ఈ పరిణామంతో కాబోలు ఇంకొన్ని ప్రదర్శనలు ఇవ్వడానికి స్థానం వారి మాతృమూర్తి కూడా అంగీకరించారు. కొద్దినెలలకే తెలుగు ప్రాంతమంతా తిరిగి నాటకాలు వేయడం మొదలైంది. వరంగల్‌లో ‘కృష్ణలీల’ నాటకంలో యశోద వేషం వేసినందుకు బంగారు పతకం వచ్చింది. ఆయన జీవితంలో పొందిన తొలి స్వర్ణ పతకం ఇదే. అనతికాలంలోనే ఆయన పేరు మారుమోగిపోయింది. కాపురం బాపట్ల నుంచి తెనాలికి మారింది. శ్రీరామవిలాస సభ అనే నాటక సమాజాన్ని స్థాపించి నటననే జీవికగా చేసుకున్నారు. రోషనార (రోషనార నాటకం), తామీనా (రుస్తుం సొహరాబ్ నాటకంలో), సంయుక్త (రాణీ సంయుక్త), శకుంతల (అభిజ్ఞాన శాకుంతలం), సత్యభామ (శ్రీకృష్ణ తులాభారం), చిత్రాంగి (సారంగధర), దేవదేవి (విప్రనారాయణ), కోకిల (కోకిల నాటకం), మల్లమ్మ (బొబ్బిలి), మధురవాణి (కన్యాశుల్కం), అనసూయ (అనసూయ నాటకం), మురాదేవి (చంద్రగుప్త), చింతామణి (చింతామణి), సుభద్ర (వీరాభిమన్య), సరళ (ఛత్రపతి శివాజీ), విద్యాధరి (కాళిదాసు), చండిక (చండిక నాటకం) వంటి పాత్రలు వేశారు. కానీ స్థానం వారంటే రంగస్థలం మీద సత్యభామకు మారురూపమయ్యారు. స్థానం నరసింహారావుగారు నటనను ఒక తపస్సులా భావించారు. ఇదంతా ఆయన స్వీయచరిత్ర ‘నటస్థానం’లో అద్భుతంగా ఆవిష్కరించారు (స్థానం వారి అల్లుడు నేలకంటి వేంకటరమణమూర్తి 1974లో ఈ పుస్తకం ప్రచురించారు). నటులకు ఉండవలసిన లక్షణాలు, దర్శకునికి ఉండవలసిన ప్రత్యేకతలు, రంగస్థల కళాకారులకు ఉండవలసిన నిబద్ధత గురించి ఎన్నో విషయాలు ఆ పుస్తకంలో అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే స్త్రీపాత్రతో ఆయనకు ఎదురైన నమ్మశక్యం కానట్టు ఉండే అనుభవాలు, కొన్ని చేదు అనుభవాలను కూడా ఆయన నమోదు చేశారు. ఇవే కాకుండా తన జీవితంలో తారసిల్లిన అనేక మంది కళాకారుల గురించి స్థానం వివరించారు. ఒకరకంగా 1920వ దశకం నాటి తెలుగు నాటక రంగ చరిత్ర ఆ పుస్తకంలో కనిపిస్తుంది. ముత్తరాజు వెంకటసుబ్బారావుగారు రాసిన శ్రీకృష్ణ తులాభారం నాటకం స్థానం వారి కీర్తిని అజరామరం చేసింది. మాధవపెద్ది వెంకటరామయ్య (కృష్ణుడు), పిల్లలమర్రి సుందరరామయ్య (నారదుడు), వంగర వెంకటసుబ్బయ్య (వసంతకుడు) పాత్రలు వేసేవారు. కృష్ణుడు తన స్వాధీనుడేనని చెప్పే ఒక సందర్భాన్నీ, అందుకు తగిన పాటనీ సత్యభామకు కూర్చడానికి స్థానం చేసిన ఆలోచన ఒక అద్భుతం. మొత్తానికి ఒక పాట ఆయన మనసుకు తట్టింది. ఒకసారి కడప దగ్గర ఈ నాటక బృందం చిన్న ఏరు దాటుతూ ఉండగా, ఒక ఎద్దుల బండి ఇసకలో కూరుకుపోయింది. నటులంతా గెంటుతున్నారు. ఒకరు మాత్రం బద్ధకంగా కూర్చున్నారు. మరొక నటుడు దీనిని స్థానం వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ క్షణంలోనే ఆయన సరదాగా ‘మిరజాల గలడా నా యానతి’ అన్నారట. అదే గొప్ప పాటకు ప్రాణం పోసింది. ‘మిరజాలగలడా నా యానతి, వ్రతవిధాన మహిమన్ సత్యాపతి!’ అన్నదే ఆ పాట. విశాఖజిల్లా మాడుగలలో ఒకసారి నాటకం వేశారు– శ్రీకృష్ణ తులాభారం. స్థానం వారు స్టార్ నటులు కాబట్టి ఒక ధనికుల ఇంట వేరే గది ఇచ్చి, అక్కడే వేషధారణ చేసుకుని రావడానికి ఏర్పాట్లు జరిగాయి. వేషం పూర్తయ్యాక ఇక బయలుదేరదామని అనుకుంటూ ఉండగా కరెంటు పోయింది. లోపల ఫ్యాను ఆగిపోయింది. గాలి కోసం అక్కడే ఉన్న పెరట్లో కుర్చీ వేయించుకుని కూర్చున్నారు స్థానం. అప్పుడే కొందరు ముత్తయిదువలు పేరంటం పిలుపుకోసం వచ్చారు. ఇల్లాలికి బొట్టు పెట్టి, అక్కడే కుర్చీలో కూర్చున్న సత్యభామకు కూడా బొట్టు పెట్టి పేరంటానికి పిలిచారు. ఎంతో హాస్యాన్ని పండించే వాస్తవాలను కూడా ఆయన రాశారు. ఒకసారి సురభి వారి బృందంలో సత్యభామ పాత్రధారిణికి ఇబ్బంది రావడంతో స్థానం వారిని తీసుకుని వెళ్లారు. ప్రదర్శన మొదలైంది. సత్యభామ వెళ్లి కృష్ణుడిని కౌగిలించుకోబోతే, కృష్ణుడు అమాంతం తప్పుకుంటున్నాడు. ఇందుకు కారణం ఒక్కటే– ఆ కృష్ణ పాత్రధారి స్త్రీ. కాబట్టి స్థానం వారు వెళ్లి కౌగిలించుకున్నా బెదిరిపొయింది. అలాగే, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రోషనార నాటక ప్రదర్శనకు కలెక్టర్ అనుమతి నిరాకరించాడు. అందుకు కారణం– ఆ నాటక ప్రదర్శనకు కొందరు ముస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీనితో గోదావరి దాటి తూర్పుగోదావరిలోని లంకలలో ఆ నాటకం ప్రదర్శించారు. స్థానం వారికి జరిగిన సత్కారాలకు లెక్కలేదు. 1956లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ఇచ్చింది. రంగూన్లో బంగారు కిరీటంతో అలంకరించారు. ఆనాటి మహా కవులు, రచయితలు అంతా ఆయనను అక్షరాలతో సత్కరించారు. స్థానం వారి ప్రత్యేకతను చరిత్ర విస్మరించలేదు. కన్నతల్లి ఆయనకు పురుష జన్మనిచ్చింది. కళామతల్లి స్త్రీ జన్మనిచ్చింది. - డా. గోపరాజు నారాయణరావు -
ఆధునిక భారత ఇంజినీరింగ్ పితామహుడు
కొన్ని దశాబ్దాల క్రితం నాటి మాట. ఓ ఉక్కు కర్మాగారం పనితీరును పరిశీలించడానికి భారత నిపుణుల బృందం ఒకటి అమెరికా వెళ్లింది. మొదట సాధారణ యంత్రాల పని తీరును ఈ బృందానికి వివరించిన అమెరికన్ సాంకేతిక నిపుణుడు చివరిగా ఒక భారీ యంత్రం దగ్గరకు తీసుకుపోయాడు. ఆ యంత్రం పని విధానం ఏమిటో పరిశీలించాలంటే 75 అడుగుల ఒక నిచ్చెన ఎక్కవలసి వచ్చింది. అప్పటిదాకా ఆ భారీ కర్మాగారమంతా తిరిగి ఉన్న బృందంలోని చాలామంది చేతులెత్తేశారు. అప్పుడు ఒకాయన తన కోటు, బూట్లు తొలగించి ఆ నిచ్చెన ఎక్కడం ఆరంభించారు. ఆపై ఆయన వెనుక చాలామంది వెళ్లారు. కానీ మధ్యలోనే దిగిపోయారు. మొదటిగా నిచ్చెన ఎక్కడం ఆరంభించిన ఆ భారతీయుడు– నిజానికి వృద్ధుడు– మాత్రం మెట్లన్నీ ఎక్కారు. అప్పటికే ఆయన భారతదేశపు ఇంజనీర్లలో సర్వోన్నతునిగా సమున్నత శిఖరాల మీద నిలిచి ఉన్నవారు. ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అప్పటికీ, ఇప్పటికీ విశ్వేశ్వరయ్య భారతీయ ఇంజనీరింగ్ రంగంలో సమున్నతుడే. ఇంజనీరింగ్ చదువు వేరు. ఇంజనీర్‌గా ఆలోచించడం, బతకడం వేరు. అసలైన ఇంజనీర్‌గా బతికారు కాబట్టే మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని (సెప్టెంబర్ 15) ఇంజనీర్స్ డే గా భారతదేశం జరుపుకుంటోంది. ఒక ఇంజనీర్ ఒక దేశానికి చేయగలిగిన సేవ ఎలాంటిదో కూడా విశ్వేశ్వరయ్య జీవితం బోధిస్తుంది. ‘సర్ ఎమ్వీ’గా పిలుచుకునే విశ్వేశ్వరయ్య జీవితం గురించి, ప్రతిభను గురించి; నీతి, నిజాయితీ, విలువల గురించి మైసూర్లో కథలు కథలుగా చెప్పుకునేవారట. ఆయన కార్యాలయానికి వెళుతున్న సమయాన్ని చూసి గడియారాలు సరి చూసుకోవచ్చుననేది అందులో ఒకటి మాత్రమే. ఆయన చెప్పిన మాటలు కూడా చిరస్మరణీయాలుగా మిగిలాయి. ‘గుర్తుంచుకో! నీది రైల్వే క్రాసింగ్లను పరిశుభ్రంగా ఉంచే పనే కావచ్చు. కానీ ప్రపంచంలో మరే క్రాసింగ్ కూడా లేనంత పరిశుభ్రంగా నీవు శుభ్రం చేసిన క్రాసింగ్ ఉండాలి’ అన్నారాయన. ఎంత గొప్పమాట! విశ్వేశ్వరయ్యను ఆధునిక భారత నిర్మాతలలో ఒకరిగా గౌరవిస్తారు. మేధస్సు, నిజాయితీ, పనినే దైవంగా భావించే తత్వం ఆయనను ఆ స్థాయికి తీసుకుపోయాయి. ప్రతిభకు ఆయన కొత్త ప్రమాణాలను అద్దారు. ఇదంతా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన బాలుడు, భారతీయ ఇంజనీరింగ్ రంగ పితామహునిగా తనను తాను ఆవిష్కరించుకున్న ఇతిహాసం. ఎందుకంటే–బానిసత్వంలో కావచ్చు, వలసవాదుల పాలనలో కావచ్చు. దేశీయమైన జ్ఞాన సంపదనూ, సృజననూ, కళనూ అన్నింటికీ మించి ఆ నేల నుంచి జనించిన చింతనా ధోరణిని అలాంటి చీకటియుగంలో రక్షించుకోవడం అన్నింటికంటే పెద్ద సవాలు. ఈ సవాలును ఎదుర్కొన డంలో యోధులూ, నేతలూ, పాలకులూ నిర్వహించే పాత్ర చరిత్రలో ఎప్పుడూ ఉత్తేజకరమైనదే. సరిగ్గా పరిశీలిస్తే శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, కళాకారులు, రచయితలు నిర్వహించే పాత్ర కూడా ఆ యోధులు, నేతలు, పాలకులు నిర్వహించిన పాత్రకు సమాంతరంగా కనిపిస్తుంది. బానిసత్వం నుంచి వలసవాదుల ఏలుబడిలోకి, ఆపై స్వేచ్ఛా స్వాతంత్య్రాలలోకి సాగిన ప్రయాణమే ఆధునిక భారత చరిత్ర. ఒక పక్క బానిసదేశమన్న ముద్ర ఉన్నప్పటికీ, ఆ ముద్రను ప్రపంచం పట్టించుకోకుండా చేసినది– ఇక్కడ పుట్టిన ప్రతిభే. సీవీ రామన్, హోమీ జహంగీర్ బాబా, శ్రీనివాస రామానుజన్, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, యల్లాప్రగడ సుబ్బారావు, పీసీ రే, జేసీ బోస్, శాంతిస్వరూప్ భట్నాగర్, విక్రమ్ సారాభాయ్, సత్యేంద్రనాథ్ బోస్ వంటివారు– వంచిపెట్టినా పైకి లేచే జ్వాలల్లా – వలస పాలనలో ఉన్నప్పటికీ భారతదేశపు వెలుగులు ఎలాంటివో లోకానికి చాటారు. వీరితో పాటు ప్రేమ్‌చంద్, శరత్‌బాబు, బంకింబాబు, సుబ్రహ్మణ్యభారతి, స్వామీ వివేకానంద వంటివారు కూడా విదేశీ పాలన, సంకెళ్లు సృజనకు అడ్డుకావని నిరూపించినవారే. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కూడా అలాంటి విశిష్ట భారతీయుడే. భారత స్వాతంత్య్ర సమరంలో కీలకంగా ఉండి, స్వతంత్ర భారత ప్రభుత్వంలో కూడా ముఖ్య భూమికను పోషించిన మహనీయులలో ఎవరికీ తీసిపోని అద్భుతమైన వ్యక్తులే వీరింతా. స్వతంత్ర భారత పునర్నిర్మాణంలో అటు నేతలదీ, ఇటు నిపుణులదీ సరిసమానమైన పాత్ర.‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య లేదా ‘ఎమ్వీ’(సెప్టెంబర్ 15, 1860–ఏప్రిల్ 14, 1962) కుటుంబం ప్రస్తుత ప్రకాశం జిల్లా నుంచే ఏనాడో కర్ణాటక (నాటి మైసూర్ సంస్థానంలో ముద్దనహళ్లి) తరలిపోయింది. తండ్రి శ్రీనివాసశాస్త్రి సంస్కృత పండితుడు, ఆయుర్వేద వైద్యుడు. తల్లి వెంకాచమ్మ. 12వ ఏటనే తండ్రిని కోల్పోయిన ఎమ్వీ అష్టకష్టాలు పడి విద్యార్థి వేతనాలతో ఇంజనీరింగ్ చదివారు. ఒక్కొక్కమెట్టు ఎక్కి, ‘భారతరత్న’ (1955) అయ్యారు. ఐదో జార్జి చక్రవర్తి కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ‘సర్’ పురస్కారంతో (1915) సత్కరించింది. ఎమ్వీ ప్రతిభను, భారత దేశ పునర్నిర్మాణంలో ఆయన నిర్వహించిన పాత్రను పరిశీలిస్తే అద్భుతమనిపిస్తుంది. వ్యవసాయాభివృద్ధికీ, పారిశ్రామికాభివృద్ధికీ కూడా ఇంజనీర్‌గా ఆయన తన వంతు కృషి చేశారు. విద్యుదుత్పానకు పథకాలు చేపట్టారు. ఇనుము ఉక్కు పరిశ్రమల స్థాపనకు తోడ్పడ్డారు. నౌకాశ్రయాల నిర్మాణానికి తన మేధస్సును వినియోగించారు. సాంకేతిక విద్యాభివృద్ధికి కళాశాలలు స్థాపించారు. చివరిగా మైసూరు సంస్థానానికి దివాన్‌గా పనిచేసి రాజనీతిజ్ఞతను కూడా ప్రదర్శించారు. ఇది మేధోపరంగా విశ్వేశ్వరుడి విశ్వరూపం. 1924లో ఆయన కృష్ణరాజ సాగర్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు. కావేరి మీద నిర్మించిన ఈ డ్యామ్ వల్ల 1,20,000 ఎకరాలు పచ్చదనాన్ని పులుముకున్నాయి. ప్రతి భారతీయుడు చూడాలని కలలు గనే బృందావన్ గార్డెన్స్ ఈ డ్యామ్ నిర్మాణం ఫలితమే. ఇది భారతదేశంలో నిర్మించిన పెద్ద డ్యామ్‌లలో ఒకటి. విశాఖ నౌకానిర్మాణ సంస్థకు సముద్ర కోత వల్ల ముప్పు ఏర్పడింది. దీనిని పరిష్కరించినవారు ఎమ్వీ. 1900 సంవత్సరం మొదటి దశకంలో వరదలతో అతలాకుతమైన హైదరాబాద్ నగరాన్ని ఆదుకున్నవారు కూడా ఆయనే. 1909లో ఆయనను ఇంజనీరింగ్ సలహాదారుగా నియమించిన నిజాం ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేసింది. మైసూర్ బ్యాంక్ (1913లో ఎమ్వీ స్థాపించిన ఈ బ్యాంకే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది), ప్రభుత్వ సబ్బుల కర్మాగారం (1916), భత్కల్ నౌకాశ్రయం, భద్రావతి ఇనుము– ఉక్కు కర్మాగారం, జోగ్ జలపాతం (షిమోగ) దగ్గర శరావతి హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు (1035 మెగావాట్ల సామర్థ్యం కలిగినది), బెంగళూరు– మైసూరు రైలు రోడ్డు మార్గం వంటివన్నీ విశ్వేశ్వరయ్యగారి చేతుల మీదుగా నిర్మితమైనవే. వరదలు వచ్చినప్పుడు వాటికవే తెరుచుకునే తలుపులను ఏర్పాటు చేసిన ఘనత కూడా ఆయనదే. 1912లో మైసూరు మహారాజు ఎమ్వీని దివాన్‌గా నియమించాలని నిర్ణయించారు. ఈ విషయం ఆయనకు కూడా చెప్పారు. తన నిర్ణయం చెప్పడానికి ముందు ఎమ్వీ ఒక చిన్న సభ ఏర్పాటు చేశారు. తన ఇంటిలోనే తన బంధువర్గాన్ని పిలిచి విషయం చెప్పారు. అంతా సంతోషించారు. ఆలస్యమెందుకన్నారు. అయితే ఒక్క షరతు మీద చేరతానని ఎమ్వీ చెప్పారు. అదేమిటంటే, తాను దివాన్ పదవిలో ఉండగా బంధువర్గం నుంచి ఏ ఒక్కరు వచ్చి తమకు సాయం చేయమని అడగరాదు. ఈ నిబంధనను ఆయన బంధువర్గం మీద విధించడమే కాదు, తన మీద తాను కూడా విధించుకున్నారు. ఒకసారి ఒక మిత్రుడు రాత్రివేళ ఎమ్వీతో ఏదో పని మీద వచ్చాడు. అప్పటికి ఆయన దీపం వెలుగులో కలంతో ఏదో రాసుకుంటున్నారు. మిత్రుడు వచ్చి కూర్చున్నాక, పని పూర్తి చేసుకుని, ఆ దీపాన్ని ఆర్పేశారు ఎమ్వీ. ఆ కలం కూడా మూసేశారు. అక్కడే ఉన్న మరో దీపం, మరో కలం తీసుకుని మిత్రుడి పని గురించి అడిగారు. ముందు ఈ దీపాలు, కలాల మార్పు ఏమిటో చెప్పమన్నాడామిత్రుడు. మిత్రుడు వచ్చినప్పుడు ఎమ్వీ చేస్తున్నది ప్రభుత్వ పని. ఆ పని అయిపోగానే ఆ దీపం ఆర్పేశారాయన. ప్రభుత్వం ఇచ్చిన భత్యంతో వెలిగించేది. రెండో దీపం తన సొంతం. మిత్రుడి కోసం అది వెలిగించారు. ఆ దీపం మాటేమో గానీ, ఎమ్వీ నిజాయితీ ఎలాంటి వారికైనా జ్ఞాననేత్రాన్ని తెరిపించే వెలుగే. 100 ఏళ్లు పరిపూర్ణ, అర్థవంతమైన జీవితాన్ని గడిపి 101వ ఏట కన్నుమూశారు విశ్వేశ్వరయ్య. బ్రహ్మ అనే కంటికి కనిపించని ఇక ఇంజనీర్ నిర్మించిన సజీవ పరిపూర్ణ నిర్మాణం ఎమ్వీ. -
అందమైన లోకం
ఫ్రాన్స్ విద్యాశాఖమంత్రి నాజత్ బెలాసెమ్ చిన్నప్పుడు వాళ్లమ్మ చెప్పింది. లోకం అందమైనది కాదు... క్రూరం అయినదని... మనకిష్టమైనదే అయినా... కష్టమైనదని... ... అందుకే చదువుకొమ్మని. ఇప్పుడు నాజత్ అదే చెబుతోంది. ‘ఆడపిల్లల్ని చదివించండి... ప్రపంచం అందంగా మారుతుంది’ అని. ఒక అందమైన లోకానికి మహిళలు వేస్తున్న రహదారుల్లో ఒక రహదారి... నాజత్ కె నామ్ పర్. నాజత్కి అంకితం. ‘స్వేచ్ఛ’... ‘సమత్వం’... ‘సౌభ్రాత్రం’.. ఇవి అందరికీ తెలిసిన మూడు మాటలు. ఇవే పదాలు ఒకప్పటి ఫ్రెంచ్ విప్లవానికి బీజాక్షరాలు. 1789 నాటి ఆ విప్లవాన్ని శాసించిన మంత్రాలు. ఆ విప్లవ కాలంలో రక్తస్నానం చేసిన ఆ మూడు పదాలు మళ్లీ ఇప్పుడు ‘లిప్‌స్టిక్ పూసిన’ ఆమె పెదాల నుంచి ఒక్కసారిగా విరబూశాయి. అందరి దృష్టినీ ఆకర్షించాయి.ఆమె.. ప్రస్తుత ఫ్రెంచ్ అధ్యక్షుడు హోలాండ్ ప్రభుత్వంలో విద్య, పరిశోధన శాఖ మంత్రి. ఆ శాఖను చేజిక్కించుకున్న తొలి మహిళ. ఆ శాఖను చూస్తున్న అతి పిన్న వయస్కురాలు. అంతేకాదు, ఫ్రాన్స్ మంత్రిమండలిలలో తొలిసారిగా మంత్రి అయిన ముస్లిం మహిళ.. నాజత్ బెలాసెమ్. నాజత్ బెలాసెమ్ పుట్టుకతో ఫ్రెంచ్ జాతీయురాలు కానేకాదు!మొరాకో నుంచి వలస వచ్చిన ఓ కుటుంబ సభ్యురాలు. మరో విశేషం కూడా ఉంది. ఆమె ఈ సంగతిని పట్టించుకుంటారో లేదో గానీ, ఇప్పుడున్న ప్రపంచ మహిళా రాజకీయవేత్తలలో ఆమె మహోన్నత సౌందర్యరాశి అని ఎన్నో పత్రికలూ, దేశాలూ ఎలుగెత్తి చాటుతున్నాయి. కాపరి కుటుంబం! ఎంతో ఆధునికమైన అలంకరణతో ఉండే ఖరీదైన కార్యాలయంలో నాజత్ ఇప్పుడు కనిపిస్తున్నారు. కానీ 1980 నాటి పరిస్థితిని విస్మరించడం బహుశా ఆమెకు అత్యంత కష్టమైన పనులలో ఒకటి కావచ్చు. ఆమె మంత్రి అయిన తరువాత కూడా తన తొలినాటి జ్ఞాపకాలు రెండేనని చెప్పారు. మొదటిది– ఇంటికి సమీపంలోని బావి నుంచి నీళ్లు మోసుకొచ్చే తన అక్కయ్య ఫాతిమాకు సాయపడినప్పటి దృశ్యం. ఎర్రమట్టి గోడలతో ఉన్న ఇంటికి ఇద్దరు నీళ్లు తెచ్చేవారు. రెండు– గొర్రెలను కాస్తున్న తన తాతయ్యకు సాయపడిన సమయాలు.నిజమే, నాజత్ 1977లో ఒక గొర్రెల కాపరుల కుటుంబంలో పుట్టింది. ఒకవైపు ఎడారి, కొండలు; మరోవైపు అట్లాంటిక్ సముద్రం, మధ్యదరా సాగరం ఉండే మొరాకో (ఉత్తర ఆఫ్రికా) దేశంలో మారుమూల గ్రామంలో ఆ కుటుంబం ఉండేది. తండ్రి అహ్మద్. నిర్మాణ రంగ కార్మికుడు. వారి ఊరి పేరు నాదర్. ఉప్పు నీటి సరస్సుల మ«ధ్యన ఉంది. నాదర్ అంటే దీపస్తంభం (లైట్‌హౌస్). ప్రవాసుల జీవితాలు, శరణార్థుల జీవితాలు పరమ దుర్భరంగా మారిపోతున్న కాలంలో ఆ నాదర్ నుంచి వచ్చిన నాజత్ జీవితం ఈ కాలం మీద ప్రసరిస్తున్న లైట్‌హౌస్ వెలుగేననిపిస్తుంది. ఆమె నానమ్మ స్పెయిన్ నుంచి వచ్చింది. అమ్మమ్మది అల్జీరియా. 1982లో అహ్మద్ కుటుంబం ఉత్తర ఫ్రాన్స్‌లోని అమియన్స్ నగరానికి వలస వచ్చింది. తరువాత అహ్మద్ మరో ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అయినా ఆమె తను వలస వచ్చిన నేలనే తన నేలగా చేసుకోగలిగింది. ఆశ్రయం ఇచ్చిన దేశపు మంత్రి మండలి సభ్యురాలైంది. ఇదే ప్రపంచాన్ని విస్మయ పరుస్తున్నది. నిబంధనల పెంపకం నాజత్ ఈ స్థాయికి చేరడం, అంత వేగంగా ఎదగడం నల్లేరు మీద నడకలా మాత్రం సాగలేదు. ఏడుగురు పిల్లలు. అందులో రెండవ సంతానం నాజత్. ఆమె మాత్రమే తానొక రాజకీయవేత్తను కావాలని కలగన్నది. ఒక కాందిశీక కుటుంబం ఆమెది. తాను ముస్లిం. అయినా ఫ్రాన్స్‌లో రాజకీయంగా ఎదగాలని ఆశించింది. మామూలుగా చెప్పాలంటే ఒక జన్మలో సాకారమయ్యే కల అనిపించదు. అలాంటి కలను సాకారం చేయడానికే అడుగులు వేసింది. ముస్లిం మతాచారాలను పాటించడం లేదని నాజత్ మంత్రి అయిన తరువాత బాహాటంగా చెప్పుకోగలుగుతున్నారు కానీ ఆమె తండ్రి ఆ మతాచారాలతోనే పిల్లలను పెంచారు. నాజత్, ఆమె అక్క ఫాతిమాలు పాఠశాలకు వెళ్లినప్పుడు, తరువాత కళాశాలల్లో చేరినప్పుడు తండ్రి చేసిన హెచ్చరిక ఒక్కటే– మగ పిల్లలతో మాట్లాడరాదు. ఒక వయసు వచ్చిన తరువాత మరింత తీవ్రంగా అమలు చేసిన నిబంధన– నైట్క్లబ్ల కేసి చూడకూడదు. ఫ్రెంచ్ నైట్క్లబ్ల బాగోతం తెలిసిన వాళ్లు ఎవరైనా ఆ ఆంక్షను సమర్థించకుండా ఉండరు. ప్రపంచ ఫ్యాషన్లకు రాజధాని వంటి ఫ్రాన్స్ దేశంలో యువతులను యువకులతో మాట్లాడవద్దంటే అది సాధ్యమయ్యేదేనా? చదువు మానేస్తే సాధ్యమే. కానీ నాజత్ తల్లి మమ్మాకు పిల్లలు చదువుకుని సొంత కాళ్ల మీద నిలబడాలన్న కోరిక బలంగా ఉండేది. నాజత్ రాజకీయ రంగాన్ని ఎన్నుకున్నా, ఆమె అక్క ఫాతిమా మాత్రం న్యాయశాస్త్రం చదవి, ఆ దేశంలోనే న్యాయవాదిగా స్థిరపడింది. తొలి అవరోధం ‘నువ్వు రాజనీతి శాస్త్రం చదివి ఉద్ధరించేదేదీ ఉండదు’ అని ముందే నిరాశ పరుద్దామని చూశాడొక అధ్యాపకుడు. ప్రాథమిక విద్యను పూర్తి చేసి పారిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ స్టడీస్ సంస్థలో చేరాలనుకున్నప్పుడు నాజత్‌కు ఎదురైన మొదటి అనుభవం అదే. అయినా ఆమె చేరారు. 2002లో అక్కడ దిగ్విజయంగా చదువు పూర్తి చేసి పట్టా అందుకున్నారు. ఇక్కడ ఉండగానే నాజత్‌కు బోరిస్ వాల్లౌడ్తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. ఆ ఇద్దరు మూడేళ్ల తరువాత పెళ్లి చేసుకున్నారు– రహస్యంగా. ఈ మధ్యలోనే నాజత్ సోషలిస్టు పార్టీలో చేరి హక్కుల కార్యకర్తగా, రచయితగా ఆవిర్భవించారు. నిజానికి ప్రాథమిక విద్య పూర్తి కాకుండానే ఆమె ఫ్రెంచ్ భాషలో అనర్గళంగా మాట్లాడడం, రాయడం కూడా నేర్చుకున్నారామె. హోల్లాండ్ అధ్యక్షుడైన తరువాత మొదట మహిళా హక్కుల మంత్రిత్వ శాఖను నిర్వహిస్తూనే, ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇది 2012లో జరిగింది. మరో రెండు సంవత్సరాలకు ఆమె విద్య, పరిశోధన శాఖ మంత్రి అయ్యారు. అప్పుడు నాజత్ ఎవరో అందరికీ గుర్తుకు వచ్చింది. ఆమె ఎక్కడ నుంచి వచ్చిందో కూడా జ్ఞప్తికి తెచ్చుకున్నారు. నాజత్ మతం, దానితో ఫ్రాన్స్‌కు ఉన్న వైమనస్యం – అన్నీ తవ్వితీశారు. అందంపై కామెంట్స్! నాజత్ మతం, మూలాలు గుర్తుకు వచ్చిన వారికి అదే సమయంలో ఆమె అందం కూడా కనిపించింది. ‘అసలు ఈవిడ విద్యా సంస్కరణల గురించి ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీలో వెల్లువెత్తుతున్న ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి తన అందాన్ని కవచంగా చేసుకుంటున్నారు. లోనెక్తో ఉండే నల్లటి డ్రెస్ వేసుకురావడంలోని అంతరార్థం కూడా అదే. లిప్‌స్టిక్ పూసిన పెదవుల మీద నుంచి దరహాసాలు చిందిస్తూ జవాబులు చెప్పకుండా తప్పించుకుంటున్నారు. ఆనీహాల్ అనే సినిమాలో ఊడీ ఆలెన్ లోదుస్తు అంచును ప్రదర్శించినట్టే, నాజత్ కూడా ప్రదర్శిస్తూ సభ్యుల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనలు ఈ పార్లమెంట్లో మున్నెన్నడూ లేవు’ అంటూ మితవాద వర్గానికి చెందిన పత్రికా రచయిత్రి బ్రైహెల్లీ దుమ్మెత్తి పోశారు. ఈ ధోరణి కేవలం నాజత్నే విమర్శించేది కాదనీ, మొత్తం మహిళా లోకాన్నే కించపరుస్తున్నదనీ హోల్లాండ్ మంత్రిమండలి సభ్యులు ఎదురుదాడి చేశారు. మరోవైపు –ఫ్రెంచ్ సెక్యులరిజాన్ని పాఠశాలల్లో అమలు చేయడానికి చూస్తూ తమ మనోభావాలను గాయపరుస్తున్నదని ఆ దేశ ముస్లింలు నాజత్ మీద విమర్శలు గుప్పించారు. నిజం చెప్పాలంటే నాజత్ ఆ శాఖకు రాక ముందే ఫ్రెంచ్ ప్రాథమిక జాతి వివక్ష భావాలతో, అంతరాలతో నిండిపోయి ఉంది. దీనిని సంస్కరించడానికే ఆమె పూనుకున్నారు. అది మతవాదులకు నచ్చలేదు. అందుకే ఆమెపై ఇన్ని విమర్శలు. పడుపువృత్తి నిర్మూలన నాజత్‌కు ఇద్దరు కవల (మగ)పిల్లలు. అందులో ఒక అబ్బాయి 2015 జనవరి 7 న తీవ్రమైన జ్వరంతో పాఠశాలకు వెళ్లలేదు. ఉదయం పదకొండు ప్రాంతంలో పారిస్ కేంద్రంగా వెలువడే వారపత్రిక ‘చార్లీ హెబ్డో’ మీద ఉగ్రవాద దాడి జరిగింది. 12 మంది చనిపోయారు. దీని మీద ఫ్రాన్స్ మొత్తం విరుచుకుపడింది. ప్రపంచం మండిపడింది. ఇలాంటి పరిస్థితిలో మంత్రిమండలి సభ్యురాలిగా ఉన్న నాజత్ వంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంటికి వెళ్లే సరికి టీవీలో పేలుడు అనంతర దృశ్యాలు, చావులు చూసి బిక్కచచ్చిపోయి ఉన్న కొడుకు. అక్కడితో ఆగలేదు. చార్లీ హెబ్డో మృతులకు సంతాపసూచకంగా దేశం మొత్తం ఒక నిముషం మౌనం పాటించాలని నిర్ణయించింది. దీనిని కొందరు ముస్లిం బాలురు వ్యతిరేకించారు. అంటే నాజత్ మంత్రి కాక ముందే ఫ్రెంచ్ పాఠశాలల్లో తిష్ట వేసి ఉన్న మత వివక్షకు కూడా ఇదే నిదర్శనం. అయితే ఎలాంటి విమర్శలు వచ్చినా నాజత్ వెనుకడుగు వేయలేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు తల్లి చెప్పిన మాటను మాత్రం ఆమె గుర్తుకు తెచ్చుకుంటారు. ‘లోకం నువ్వు అనుకున్నంత అందమైనది కాదు’ అనే మాట అది. నిజమే, లోకం అన్ని సందర్భాలలోను అందంగా ఉండదు. ఎవరు ఏమన్నా ఇప్పుడు ఫ్రాన్స్‌తో పాటు, అసలు ఐరోపా ఖండం నుంచే పడుపు వృత్తిని నిర్మూలించాలని ఆమె నాజత్ సమాయత్తమవుతున్నారు. పోప్‌కే సమాధానం! మత పరమైన విషయాలపై నాజత్ మీద ఎందరో దాడికి దిగారు. అయితే మొదటిగా దాడికి దిగిన వ్యక్తి సామాన్యుడు కాదు. సాక్షాత్తు పోప్ ఫ్రాన్సిస్. ఫ్రెంచ్ పాఠశాలల్లో నాజత్ జండర్ థియరీని బోధించేటట్టు చేస్తున్నారని పోప్ ఆరోపించడం కలకలమే సృష్టించింది. ‘మూర్ఖులు చెబుతున్నదంతా పోప్ అంతటివారు నమ్మడమే నాకు కోపాన్నీ, బాధనీ కలిగిస్తోంద’ని నాజత్ జవాబు చెప్పారు. విశేషం ఏమిటంటే, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోల్లాండ్ కూడా ఈ విషయంలో పోప్ వ్యాఖ్యలను మద్దతు ఇవ్వలేదు. సరికదా, నేను అధ్యక్ష పదవిని చేపట్టక ముందు నుంచీ నాజత్ నాకు తెలుసు, ఆమె అలాంటి థియరీలను ప్రోత్సహించదు అని సమర్థించారు. మొరాకోను మరిచిపోలేను సిరియా నుంచి, మెక్సికో నుంచి వలసలు జరుగుతున్నాయి. సిరియా నుంచి నాటు పడవలో బయలుదేరిన కుటుంబానికి చెందిన ఎరుపు రంగు దుస్తుల చిన్నారి సముద్రపు అలలో శవమై కనిపించిన దృశ్యం ప్రపంచాన్ని కుదిపింది. ఆ బాధ నాజత్‌కు తెలుసు. కన్న ఊరునీ, దేశాన్నీ వదిలిరావడం అత్యంత బాధాకరమైన అనుభవం అంటారామె. నిజమే, నాజత్ కూడా మొరాకో పౌరసత్వాన్ని వదులుకోలేదు. ‘‘నేను ఫ్రాన్స్‌ని నా జన్మభూమే అనుకుంటున్నాను. రాజకీయవేత్తగా పదేళ్ల నుంచి ఫ్రాన్స్ సమాజం బాగునే మనసా వాచా కాంక్షిస్తున్నాను. సేవ చేస్తున్నాను. అయితే మొరాకో పౌరసత్వం ఇప్పటికీ కొనసాగించడానికి కారణం– నా మూలాలను నేను మరచిపోకుండా ఉండేందుకే’ అంటారు నాజత్. – గోపరాజు నారాయణరావు -
‘మదర్’ ఇక సెయింట్
మొదటి ప్రపంచ యుద్ధానికి భూమిక సిద్ధమవుతున్న సమయంలో, అదే నేల మీద ఒక శాంతిదూత జన్మించడం గొప్ప చారిత్రక వైచిత్రి. ఆ మహా సంగ్రామానికి అల్బేనియా, కొసావో వంటి ప్రాంతాలు ఆవేశాన్ని రగిలిస్తున్న సమయంలోనే ప్రస్తుతం మేసిడోనియా అని పిలుస్తున్న ప్రాంతంలో సోపె అనేచోట ఆగస్ట్ 26, 1910న ఆ బాలిక భూమ్మీద పడింది. ఆగ్నెస్ అని పేరు పెట్టారు. అనంతరకాలాలలో ఆమె ప్రపంచశాంతికి కృషి చేసి, నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు. అదికూడా భారతదేశంలోని కోల్‌కతా కేంద్రంగా. ఆమె ప్రపంచ శాంతి కోసం తపిస్తూనే దీనులకు, హీనులకు, అధోజగత్ సహోదరులకు, అన్నా ర్తులకు, రోగపీడితులకు, అనాథలకు చల్లని సేవలు అందించారు. ఆమె మదర్ థెరిసా. మదర్ థెరిసా కన్నుమూసిన 19 సంవత్సరాలకు ఆమెను రోమన్ కేథలిక్ చర్చి సెయింట్‌హుడ్ హోదాతో గౌరవిస్తున్నది. జీసస్ ప్రవ చించిన ప్రేమ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పం ఆమెకు కౌమారంలోనే అంకురించింది. పన్నెండేళ్ల బాలికగా ఉన్నప్పుడే పరిశుద్ధ జీవనం గురించి ఆలోచించారు. 18వ ఏట సోపెలోని సొంత ఇంటిని వదిలిపెట్టి క్రైస్తవ సన్యాసినిగా మారిపోయారు. ఐరిష్ వర్గానికి చెందిన సిస్టర్స్ ఆఫ్ లొరెటొలో చేరారు. తరువాత డబ్లిన్‌లోని బ్లెస్డ్ వర్జిన్ మేరీ అనే సంస్థలో కొన్ని మాసాలు తర్ఫీదు పొందారు. మే 24, 1931న సన్యాసినిగా అధికారిక ప్రమాణం స్వీకరించిన థెరిసా అక్కడ నుంచి కోల్‌కతా చేరుకున్నారు. నాటి నుంచి సెప్టెంబర్ 5, 1997లో తుదిశ్వాస విడిచేవరకు ఆమె మానవసేవలోనే పునీతమయ్యారు. 1931లోనే థెరిసా కోల్‌కతాలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యా యినిగా సేవలు చేయడం ఆరంభించారు. కానీ 1948వ సంవత్సరం నాటికి ఆమె హృదయం పేదల సేవ కోసం పరితపించింది. అందుకు నాటి కోల్‌కతా (కలకత్తా)లో ఉన్న దుర్భర దారిద్య్రమే కారణం. దానికి తోడు భారత విభజన రక్తసిక్త అనుభవాలు కూడా బెంగాల్కుఎక్కువే. ఇవన్నీ కలసి మానవ జీవితాన్ని కొన్ని దశాబ్దాల పాటు అతలా కుతలం చేశాయి. ఈ నేపథ్యంలోనే థెరిసా సామాజిక సేవకురాలిగా రంగంలోకి దిగారు. క్రైస్తవ మిషనరీలు, మునిసిపాలిటీ కూడా ఆమె సేవా కార్యక్రమాలకు నిధులు అందించేవి. మతం ఒక మాధ్యమం మానవసేవకు జీవితాన్ని అంకితం చేసిన థెరిసా, అందుకు క్రైస్తవాన్ని మాధ్య మంగా ఎంచుకున్నారు. ఒక వైద్యుడు, ఒక నర్సు, ఇరుగు పొరుగు అందించే సేవలకు భిన్నంగా మానవీయ కోణాన్ని అద్దుకుని ఆమె క్రీస్తు ప్రేమ సందేశంతో విశ్వ మానవతకు సేవకిగా అవతరించారు. ఆమె సేవా దృక్పథం మతమనే వాహకం ద్వారా వ్యక్తమైంది. ఆమె సేవలు అందించడానికి ఎంచుకున్న వర్గం పేదలలో అతి పేదలు. మురికివాడల జనం. ఇది 20వ శతాబ్దంలో ఒక అపురూప సమ్మేళనమే. ఈ సేవలకు మెచ్చే వాటికన్ థెరిసాను అపురూప రీతిలో నాడు సత్కరించింది. ఆమె సొంతంగా ఒక సేవా విభాగాన్ని ఆరంభించడానికి ‘ఆర్డర్’ ఇచ్చింది. ఈ అసాధారణ గుర్తింపు అక్టోబర్ 7, 1950న ఆమెకు దక్కింది. తరువాత ఇదే మిషన రీస్ ఆఫ్ చారిటీగా (ఎంఓసీ) కార్యరూపం దాల్చింది. అనాథలను ఆదుకోవడమే ఎంఓసీ ప్రధాన ధ్యేయం. కేవలం 12 మంది సభ్యులతో మొదలైన ఎంఓసీ ఇప్పుడు 4,000 మంది సన్యాసినులతో ప్రబల సేవా సంస్థగా ఆవిర్భవించింది. వీరంతా అనాథాశ్రమాలను నిర్వహిస్తున్నారు. నా అనేవారు లేక దుర్భర జీవితం గడుపు తున్నవారు, కుటుంబాలు విడిచిపెట్టేసిన పిల్లల్ని, కుటుంబాలకు దూరమైన వారిని ఆదరించవలసిన ఆవశ్యకత ఎంతో థెరిసా గుర్తించారు. శరణార్థులకు గూడూ, కూడూ ఇచ్చి ఆదుకోవడం, వారికి వైద్య సేవలు అందించడం ఎంత ముఖ్యమో కూడా ఆమె గమనించారు. అలాగే సంఘ బహిష్కృతులుగా మారుతున్న ఎయిడ్స్ రోగులను ఆదుకోదలిచారామె. అంతేకాదు, అంధులు, అవిటివారు, వరద బాధి తులు, దుర్భిక్ష ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని, ఇళ్లు లేనివారిని ఆదు కోవడమే లక్ష్యంగా ఆ సంస్థ పనిచేస్తోంది. తరువాత ఎంఓసీని ఇతర దేశాలలో ఆరంభించడానికి కూడా అనుమతి లభించింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా, పోలండ్, ఆస్ట్రేలియాలలో కరువుకాటకాలకు గురైన వేలాదిమందికి ఈ సంస్థ ఆశ్రయం ఇచ్చింది. ఆ రీతిలో కోల్‌కతాలో ఒక క్రైస్తవ సన్యాసినిగా, సేవకురాలిగా జీవితం ఆరంభించిన థెరిసా తరువాత ప్రపంచానికి ఒక ఆదర్శ మహిళగా అవతరించారు. అదే నోబెల్ శాంతి (1979)బహుమానానికీ, భారతరత్న (1980) పురస్కారానికీ ఇప్పుడు కేథలిక్ క్రైస్తవంలో అత్యున్నత సెయింట్ హోదా నడిపించాయి. ఆకలితో అలమటించిపోయిన ఇథియోపియా బాలలను చూసి మనసు వికలం కాని వారు ఎవరూ ఉండరు. కానీ అక్కడికి వెళ్లి వాళ్ల నోటికి ఆహారం అందించే పనిచేశారు థెరిసా.. అలాగే చెర్నోబిల్ ఉదంతం జరిగినప్పుడు ఆ ఉత్పాతంలో గాయపడిన వారికి సేవలు అందించడానికి వెళ్లిన కరుణామయి థెరిసా. ఇంతకుముందు... థెరిసా తరువాత కాలంలో భారత పౌరసత్వం తీసుకున్నారు. ఆమెకు ముందు మన దేశం నుంచి సెయింట్ హోదా పొందిన వారు కూడా అదే తరహాకు చెందినవారు. కేరళ సైరో మలబార్ కేథలిక్ చర్చికి చెందిన సిస్టర్ అల్ఫోన్సోకు మొదట ఈ గౌరవం దక్కింది. 2008లో ఈమెకు ఈ అత్యున్నత పురస్కారాన్ని వాటికన్ ప్రకటించింది. కేరళ మిషనరీ ఫాదర్ చెవేరా అచెన్కు, సిస్టర్ ఇవూప్రసైయ్యమ్మలకు నవంబర్ 23, 2014న పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హోదా ఇచ్చారు. ఫాదర్ చెవేరా అచెన్ అసలు పేరు కురియకోస్ చెవేరా. ఈయన 1829 ప్రాంతానికి చెందిన క్రైస్తవ పురోహితుడు. సిస్టర్ ఇవూప్రసైయ్యమ్మ అసలు పేరు యుఫ్రేషియా. అయితే ఫాదర్ చెవేరాకు, సిస్టర్ అల్ఫోన్సోకు సెయింట్ హోదా కట్టబెట్టే కార్యక్రమాన్ని 1986లో ఒకేసారి ఆరంభిం చారు. ప్రతి చర్చికి అనుబంధంగా ఒక పాఠశాల ఉండాలన్న ఆలోచన ఫాదర్ చెవేరాదే. అదికూడా ఉచిత విద్యను అందించే పాఠశాల ఉండాలని ఆయన ఆదే శించారు. జనవరి 3, 1871న ఆయన కన్నుమూశారు. యుఫ్రేషియాకు సెయింట్ హోదా కల్పించే కార్యక్రమం 2006లో మొదలయింది. ఆమె ప్రార్థనకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తూ ఏకాంతంగా గడిపేవారు. ఆగస్ట్ 29, 1951లో ఆమె త్రిశూర్‌లో మరణించారు. అలాగే థెరిసాకు ఆ అత్యున్నత హోదా ఇచ్చే కార్యక్రమం ఆమె మరణించిన వెంటనే ఆరంభమైంది. మిగిలిన వారికంటే థెరిసాకు సెయింట్ హోదా ఇచ్చే పని అతి శీఘ్రంగా ఆరంభం కావడానికి కారణం ఆమె సేవా కార్యక్రమాలు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. అయినా ఒక క్రైస్తవ మత పెద్దకో, సేవకునికో ఆ పురస్కారం ఇచ్చే ప్రక్రియ వారు మరణించిన ఐదేళ్ల తరువాత ఆరంభం కావడం సంప్రదాయం. 1963 నుంచి పోప్లు సెయింట్ హోదాను ఎక్కువగా ఇవ్వడం ఆరంభించారు. ఆ సంవత్సరం నుంచి మొదలు పెట్టి ఇప్పటి వరకు 640 మందికి ఆ హోదా ఇచ్చారు. వారిలో చివరి వారు థెరిసా. అంతకు ముందు 375 సంవత్సరాల చరిత్రలో కేవలం 218 మందికే ఆ గౌరవం దక్కింది. హోదాకు నియమాలు సెయింట్ హోదా ప్రాచీనకాలం నుంచి వాటికన్ ప్రసాదిస్తున్న అపు రూప గౌరవం. ఇందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియ మాలతో విభేదించేవారు ఉన్నమాట నిజం. అయితే ఆ వ్యక్తులు సమాజాలకు, మానవత్వానికి చేసిన సేవలకు ఇస్తున్న పురస్కారం కాబట్టి ఎక్కువమంది ఆ హోదా దక్కిన వారిని గౌరవించడం కూడా జరుగుతోంది. థెరిసా జీవితంలో కూడా రెండు ‘అద్భుతాలు’ జరి గాయని వాటికన్ నగరం విశ్వసించింది. అందులో ఒకటి మోనికా బెస్రా అనే గిరిజన మహిళకు సంబంధించిన ఉదంతం. తాను ఒక చర్చిలోకి వెళ్లగానే థెరిసా పటం నుంచి ఒక కిరణం వచ్చి తనను తాకిందని, దానితో ఉదరంలోని క్యాన్సర్ నయమైందంటూ ఆమె చేసిన ప్రకటనను వాటికన్ పరిగణనలోనికి తీసుకుంది. రెండో అద్భుతం-బ్రెజిల్ దేశీయుడికి అనుభవమైందని అంటారు. మదర్ ఆశీస్సులతో అతడి మెదడులో ఏర్పడిన కణితులు తొలగిపోయాయని వాటికన్ విశ్వసించింది. నేడు ప్రదానం ఈ ఆదివారం (సెప్టెంబర్ 4) థెరిసాకు సెయింట్ హోదా ప్రకటించే ఉత్సవం రోమ్‌లోని వాటికన్ నగరంలో పోప్ ఫ్రాన్సిస్ అధ్యక్షతన అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనిని థె రిసా సేవా కార్యక్షేత్రం కోల్‌కతాలో కూడా ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా ప్రసారం చేస్తున్నారు. ఇక సాక్షాత్తు వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగే ఆ మహోత్సవాన్ని వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి క్రైస్తవ మత పెద్దలు, థెరిసా అభిమానులు దాదాపు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా. ఈ ఉత్సవానికి భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం కూడా హాజరవుతున్నది. ‘ఆమె జీవితం మొత్తం నిరుపేదల సేవకు అంకితం చేశారు. అలాంటి ఉన్నత వ్యక్తికి సెయింట్ హోదా దక్కుతున్నదంటే భారతదేశం సహజంగానే గర్విస్తుంది’ అని ప్రధాని ఒక సందేశంలో శ్లాఘించారు కూడా. నిజానికి ఇది థెరిసా అపురూప జ్ఞాపకానికీ, సేవా తత్పరత మీద ఆమె విడిచిన ముద్రకీ జరుగుతున్న సత్కారం. ప్రపంచవ్యాప్తంగా 136 దేశాల పేదసాదల హృదయంలో ఆమె ఒక చెరగని ముద్ర. రచయిత: గోపరాజు నారాయణరావు -
అడవి మీద విరిసిన అక్షరం
♦ నివాళి ఆధునిక భారతీయ సాహిత్యాన్ని అడవి ఆత్మకు పునఃపరిచయం చేసిన రచయిత్రి మహాశ్వేతాదేవి. గతంలో కింది వర్గాల స్థానం ఎక్కడో అన్వేషించడమే ధ్యేయంగా సబాల్టరన్ స్డడీస్ పేరుతో చరిత్ర రచన కొత్త ఆలోచనా ధార వైపు అడుగులు వేయడానికి ఎంతో ముందే, మహాశ్వేత అదే ధారతో బెంగాలీ సాహిత్యాన్ని ముంచెత్తించారు. తరువాత భారతీయ భాషా సాహిత్యం కూడా ఆ ధారలో మునకలు వేసింది. ఆధునిక భారతీయ సాహిత్యానికి ఇది మహాశ్వేత ఇచ్చిన మహోన్నత దృష్టి. అంటే సాహిత్య పరమార్థం విశ్వశ్రేయస్సు అన్న తాత్వికతని ఆమె పునఃప్రతిష్టించారు. అందుకే ఆమె అక్షరాలా ఆధునిక భారత సాహిత్య నిర్మాతలలో ఒకరు. కుటుంబ నేపథ్యం వల్ల కావచ్చు, రచనా ప్రవృత్తి మహాశ్వేతకు సహజంగా అబ్బింది. పదమూడు సంవత్సరాల వయసులో ఆమె రాసిన ‘రవీంద్రుని బాల్యం’ వ్యాసం రంగ్ మషాల్ అనే పత్రికలో వెలువడింది. ‘ఝాన్సిర్ రాణి’ నవలను 1956లో చారిత్రకాధారాలతో రచించారు. అప్పటి నుంచి చిరకాలం వ్యాసం, నవల, కథ, నాటకం, బాలసాహిత్యం వంటి ప్రక్రియలలో విశేషమైన సాహిత్య సృష్టి చేశారు. ‘అమృత్ పంచయ్’, ‘ఆధార్ మాణిక్’, ‘తాతార్ ఆంధార్’, ‘బయస్కోపేర్ బాక్స్’, ‘కవి సంధ్య’,‘ఘటీ గాంజీర్ జీవన్ ఓ మృత్యు’, ‘శ్రీశ్రీ గణేశ్మహిమ’, ‘చోటీ ముండా ఏవం తారాత్రీర్’, ‘అక్లాంత్ కౌరవ్’, ‘ఘరేపీరా’, ‘పలాతక్’, ‘సూరజ్ గాగరాయి’,‘హరిరాయ్ మహతో’, ‘తితుమీర్ శృంఖలిత్’, ‘అరణ్యే అధికార్’, ‘హజార్ చురాషీర్ మా’, ‘రుడాలి’ ‘అగ్నిగర్భ’ వంటి నవలలు ఆమె రచించారు. ఇక కథలు వందల సంఖ్యలో ఉంటాయి. అందులో ‘సూర్యుడి గుండెల్లో గాయం’ కథ పేరు తెలుసుకున్నా తెలుగువారికి ఉత్తేజం కలుగుతుంది. అది అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా ఆమె రాసిన కథ. అయితే అది అలభ్యం. ‘శనిచరి’, ‘మకర సవర’, ‘జీవిత ఖైదీ’, ‘ఉప్పు’, ‘దొంగతనం’, ‘యుద్ధానంతర దృశ్యం’, ‘ద్రౌపది’, ‘దొంగతనం’, ‘విత్తనాలు’ వంటి గొప్ప కథలు కనిపిస్తాయి. ఈ రచనలలో కొన్నయినా ప్రస్తుతం తెలుగువారికి చేరువయ్యాయి. నిర్మలానంద, సహవాసి వంటివారు మహాశ్వేత కథలను, నవలలను అనువదించారు. హెచ్‌బీటీ, జనసాహితి వంటి సంస్థలు పుస్తకాలుగా వెలువరించాయి. ‘ఝాన్సీ రాణీ’. ‘అరేణ్య అధికార్’(ఎవరిదీ అడవి), హజార్ చురాషిర్ మా (ఒక తల్లి), ‘రుడాలి’ వంటి వాటిని కూడా పలువురు తెనిగించారు. రచన, ఇతివృత్తం, రూపం - ఈ మూడు అంశాల మీద మహాశ్వేతకు నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆమె పదిశాతం రచనలు మినహా మిగిలినవన్నీ గిరిజనుల జీవిత సంక్షోభాన్ని ఆవిష్కరించేవే. ‘ఒక తల్లి’ 1970ల నాటి కలకత్తా సామాజిక జీవితాన్ని చిత్రించింది. నక్సల్బరీ ఉద్యమం అణచివేత తీరును, అందులోని అమానవీయతను, హక్కుల అణచివేతను ఒక మాతృమూర్తి దృష్టి కోణం నుంచి అద్భుతంగా నవలీకరించారు. ఆమె వామపక్షవాది. కానీ ఆ వాదాన్ని గుడ్డిగా అనుసరించాలన్న ఆవేశం ఆమె జీవితంలో కనిపించదు. ‘జూన్ 9, సంవత్సరం 1900, రాంచీ జైలు. ఉదయం యెనిమిది గంటలప్పుడు బీర్సా రక్తం కక్కి స్పృహ తప్పి పోయాడు. బీర్సా అడవిలో నివసించే ఆదివాసి. ముండా తెగలో ముఖ్యుడు’... ఇలా మొదలవుతుంది ‘ఎవరిదీ అడవి’ నవల. బెంగాలీ సాహిత్యంలో కనిపించే వస్తు గాంభీర్యం రమణీయంగా ఉంటుంది. బంకింబాబు నవల ‘ఆనందమఠం’, రవీంద్రనాథ్ టాగోర్ నాటకం ‘పోస్టాఫీసు’, బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ ‘పథేర్ పాంచాలి’, శరత్‌బాబు ‘దేవదాసు’, ‘చరిత్రహీనులు’ వంటివి ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయి. కానీ మహాశ్వేత రచనలలో వస్తు గాంభీర్యంతో పాటు, గొప్ప సరళత కనిపిస్తుంది. అతి సాధారణంగా మొదలవుతాయి వాక్యాలు. గతంలో దొంగతనాలు చేసి బతికిన కొన్ని తెగలని నేటికీ అదే ముద్రతో చూడడం కనిపిస్తుంది. అలాంటి ఇతివృత్తంతో నడిచే కథ ‘దొంగతనం’. ‘అది పట్నానికి చాలా దూరంలో ఉన్న పల్లె’... అంటూ మొదలుపెడతారామె. సరళమైన వాక్యాలలో కూడా వస్తు గాంభీర్యాన్ని ఆవిష్కరించవచ్చునని నిరూపించారు మహాశ్వేత. ‘ఎవరిదీ అడవి’ 1899-1900లో చోటా నాగ్‌పూర్, రాంచీ ప్రాంతంలో జరిగిన గిరిజనోద్యమం ఆధారంగా రాసిన నవల. దీనినే ఉల్గులాన్ అని పిలుస్తారు. బీర్సా ముండా దీని నాయకుడు. ఇది తెలుగువారు కూడా విశేషంగా చదివిన నవల. గిరిజనోద్యమాలకు నాయకత్వం వహించిన వారి చుట్టూ రకరకాల కట్టు కథలు అల్లి ఉంటాయి. పోలీసు రికార్డులలో వారిని చాలా అల్పులుగా నమోదు చేస్తూ ఉంటారు. తిరుగుబాటుకు ఉన్న హేతువుకు మసి పూస్తారు. అలాగే ఫక్తు చరిత్రకారులు కూడా ప్రధానంగా తేదీలనీ, ఘటనల క్రమాన్నీ పరిగణనలోనికి తీసుకుంటారు. అంటే ఆ పరిణామంలోని ఆత్మ జోలికి పోరు. అది సృజనాత్మక రచయిత చేస్తారు. మహాశ్వేత ‘ఎవరిదీ అడవి’లో అదే బాధ్యతను అత్యద్భుతంగా నిర్వర్తించారు. గిరిజనోద్యమమో, మరో ఘటనో జరిగిన ప్రదేశానికి ఒక్కసారి కూడా వెళ్లకుండా రచనలు చేసినవారిలా కాకుండా, అక్కడికి వెళ్లి, ఆ మట్టితో మాట్లాడి, ఆ గాలిలో తిరగాడి రచనలు చేయడం మహాశ్వేతకు తెలిసిన అద్భుతమైన విద్య. భారతీయ గిరిజనోద్యమాల ఆత్మఘోష మొత్తం ఈ ఒక్క నవల చదివితే మనకి వినిపిస్తుందన్నా అతిశయోక్తి కాదు. మహాశ్వేత ఒక్కొక్క కథ గిరిజన జీవితంలోని ఒక విషాద పరిణామాన్ని వివరిస్తుంది. ‘శనిచరి’ కథలో వ్యభిచార కూపాలలోకి బలవంతంగా కూరుకుపోతున్న వంగ ప్రాంత అటవీ బాలికల విషాదం గురించి రాశారు. ఇటుక బట్టీలలో పని పేరుతో తీసుకువెళ్లి ఆ అమాయకురాళ్ల చేత వ్యభిచారం చేయిస్తూ ఉంటారు దళారులు. అది భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. శనిచరి మాత్రం తన కడుపున పుట్టిన బిడ్డతో సహా తిరిగి గ్రామంలోకి వస్తుంది. ‘తప్పు’ చెల్లిస్తుంది. అయినా గిరిజన సమాజం ఆదరించదు. రైలు పట్టాల మీద బొగ్గు ముక్కలను ఏరుకుంటూ బతుకీడుస్తుంది. ఆ బొగ్గు ముక్కలే నిప్పు రవ్వల్లాంటి ప్రశ్నలను సంధిస్తాయి. ‘రుడాలి’ ఇతివృత్తం అసాధారణమైనది. బెంగాల్‌లోని మారుమూల ప్రాంతంలో ఇదొక వృత్తి. రుడాలి అంటే, జమీందారులు చనిపోతే, కిరాయికి వెళ్లి గుండెలు బాదుకుంటూ ఏడ్చే మహిళ. ఈ వృత్తి పూర్తిగా నిమ్నవర్గాలదే. ఇందులో ప్రధాన పాత్ర కూడా రుడాలీయే. కోడలు అమాయకుడైన ఆమె కొడుకును మోసం చేసి వెళిపోతుంది. అతడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఏ జమీందారు చనిపోయినా కడవల కొద్దీ కన్నీళ్లు కార్చగలిగిన ఆ మహిళ కొడుకు శవం దగ్గర ఒక్క కన్నీటిబొట్టును కూడా రాల్చలేకపోతుంది. పోలీసులను చూస్తే చాలు, కాళ్లకీ చేతులకీ సంకెళ్లు ఉన్నట్టు నడిచే ఒక స్వేచ్ఛాజీవి వింత ప్రవర్తనను రూపు కట్టించారు. ‘జీవిత ఖైదీ’లో. ‘మకర సవర’ వర్తమాన చరిత్రలోని ఒక ఘోరంతో అల్లకల్లోలమైన గిరిజన జీవితం కనిపిస్తుంది. అందుకు ప్రతీక మకర అనే ఆ గిరిజనుడు. సవర తెగకు చెందిన ఈ గిరిజనుడి భార్య విడాకుల కోసం పంచాయితీ ఏర్పాటు చేయిస్తుంది. కారణం- పెళ్లయి చాలా కాలం అయినా ఆమె గర్భవతి కాకపోవడమే. నిస్పంతువుగా ఉండడం ఆ తెగలో నిషిద్ధం. అప్పుడు హఠాత్తుగా తెలుస్తుంది, అతడికి పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్స చేశారు. అదీ అతడికి తెలియకుండా. గిరిజన సంప్రదాయాన్ని 1975 నాటి అత్యవసర పరిస్థితిలో జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు ఎలా సంక్షుభితం చేశాయో వర్ణించే కథ ఇది. విశాఖ మన్యంలో గొప్ప ఉద్యమం నడిపిన అల్లూరి జీవితం ఆధారంగా నవల రాస్తానని ఆమె 1997లో విశాఖపట్నం వచ్చినప్పుడు చెప్పారు. అల్లూరి శతజయంతికి వచ్చిన మహాశ్వేత, విజయనగరం జిల్లాలోని మూలవలస గిరిజన గ్రామాన్ని చూశారు. అక్కడే ఈ మేరకు ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం నెరవేరి ఉంటే తెలుగు ప్రాంత గిరిజనోద్యమానికి గొప్ప వెలుగు వచ్చి ఉండేది. ఆ పని ఈ తరం చేయగలిగితే అదే మహాశ్వేతకు నిజమైన నివాళి అవుతుంది. డా॥గోపరాజు నారాయణరావు -
‘మార్పు’ను తూర్పారబట్టిన ప్రపంచం
ఈ సదస్సు ప్రాధాన్యాన్ని దేశాధినేతలు తొందరగానే గ్రహించారు. వాతావరణ మార్పులను నిరోధించడానికి తాము ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో ఇక్కడ క్లుప్తంగా ప్రసంగించిన వంద దేశాల అధినేతలు వెంటనే ప్రకటించారు. ‘నా చిట్టితల్లీ! నీ దేశపు అందమైన సూర్యోదయాలు, సుందరమైన సరస్సులు అదృశ్యం కావు. అవి మాయమై పోకుండా మేం పోరాడతాం.... ఎవరో వచ్చి వాటినీ, నిన్నూ మింగుతారని భయపడకు!....’ ఇలా సాగింది, సెప్టెంబర్ 23న ‘వాతావరణం మార్పులు’ అనే అంశం మీద న్యూయార్క్‌లో జరిగిన సదస్సులో కాతే జట్నిల్ కిజినెర్ అనే 26 సంవత్సరాల కవయిత్రి చదివిన కవిత. తన ఏడు నెలల కూతురును ఉద్దేశించినట్టు రాసిన ఈ కవిత ప్రపంచ దేశాల నేతలను కంటతడి పెట్టించింది. జట్నిల్ మార్షల్ దీవుల (ఉత్తర పసిఫిక్ సముద్రం) నుంచి ఈ సదస్సుకు హాజరయ్యారు. వాతావరణం లో మార్పుల పుణ్యమా అని ప్రపంచ పటంలో తన ఉనికిని కోల్పోవడానికి దాదాపు సిద్ధమైన ప్రాంతం ఈ చిన్నదేశమే. వాతావరణ మార్పుల కోసం తక్షణమే ఉద్యమించవలసిన దేశం కూడా అదే. సముద్ర మట్టానికి కేవలం ఆరు అడుగుల ఎత్తులోనే ఆ దీవులు ఉన్నాయి. వాతావరణ మార్పులతో ముంచెత్తే వరదలు, కరువులు రెండింటినీ కూడా ఆ దేశం అనుభవిస్తోం ది. అందుకే వాతావరణ మార్పుల పెను ముప్పు నుంచి భవిష్యత్ తరాలను రక్షించేందుకు ప్రపంచ నేతలంతా కార్యరంగంలోకి దూకాలని ఆమె కోరారు. ఈ దీర్ఘ కవితలో ప్రకృతి వర్ణనలు ఉన్నాయి. సౌందర్య దృష్టి ఉంది. కానీ వాటి ఉద్దేశం శ్రోతలను రంజింప చేయడం కాదు, కదిలింప చేయడం. ఇందులో కవయిత్రి విజయం సాధించారు. వాతావరణ మార్పుల సమస్య ఇప్పుడు మార్షల్ దీవులది మాత్రమే కాదు. అది ప్రపంచ సమస్య. ఇది పాతికేళ్లకో, యాభై ఏళ్లకో ప్రభావం చూపించే సమస్య కూడా కాదు. ప్రపంచం ముంగిటకు వచ్చింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసే స్థాయికి ఇది ఇప్పటికే చేరుకున్నది. ఇది మరింత తీవ్రం కాబోతోందని అంచనా. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ సమస్య నుంచి ప్రపంచాన్ని బయట పడవేయడానికి ఇప్పటికీ కొన్ని అవకాశాలు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ ఈ అంశం మీద న్యూయార్క్‌లో సదస్సును ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వాధినేతలనే కాకుండా, ఆర్థిక సంస్థల, వాణిజ్య సంస్థల, పౌర సంఘాల ప్రముఖులను కూడా ఆహ్వానించారు. వాతావరణ పరిరక్షణకు, ఉద్గారాలను నిరోధించడానికి వీలుగా ఎలాంటి పటిష్ట చర్యలు తీసుకోబోతున్నారో బాన్‌కీ మూన్ ప్రపంచ దేశాధినేతల నుంచి స్పష్టమైన హామీలను కోరడం ఈ సదస్సు విశేషం. 2015లో జరగబోయే సమావేశంలో చేసుకోబోయే ఒప్పందాల నేపథ్యంలో ప్రపంచ దేశాలలో రాజకీయ సంకల్పం నెలకొల్పడం కూడా ఐరాస ప్రధాన కార్యదర్శి ఉద్దేశం. నిజానికి ఈ అంశం మీద భవిష్యత్‌లో జరిగే కృషికి నాయకత్వం వహించే అవకాశాన్ని కూడా ఆయా దేశాలకు ఈ సదస్సు కల్పిస్తున్నది. ఒక్కరోజుకే పరిమితమైనప్పటికీ ఈ సదస్సు ప్రాధా న్యాన్ని దేశాధినేతలు తొందరగానే గ్రహించారు. వాతావరణ మార్పులను నిరోధించడానికి తాము ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో ఇక్కడ క్లుప్తంగా ప్రసంగించిన వంద దేశాల అధినేతలు వెంటనే ప్రకటించారు. ఆర్థిక సాయాన్ని ప్రకటించిన దేశాలు కూడా ఉన్నాయి. భూమి వేడిమిని రెండు సెల్షియస్ డిగ్రీలకు తగ్గించవలసిన అవసరం గురించి కూడా ప్రపంచ దేశాల నేతలు ఏకతాటి మీదకు వచ్చారని కూడా చెప్పవచ్చు. ఆర్థికాభివృద్ధికి భంగం కలగకుండానే, దారిద్య్రం మీద పోరాటం సాగిస్తూనే ఉద్గారాలను తగ్గించవచ్చునని కూడా చాలామంది అభిప్రాయపడ్డారు. ఉద్గారాలను తగ్గించేందుకు ఇంధనం, రవాణా, పరిశ్రమలు, వ్యవసాయం, నగరాలు, అడవుల, నిర్మాణాలు వంటి వాటి ద్వారా జరగవలసిన కృషి చేపట్టనున్నట్టు ప్రభుత్వాధినేతలతో పాటు, వాణిజ్య సంస్థల, ఇతర వ్యవస్థల అధిపతులు కూడా హామీ ఇచ్చారు. చాలామంది ప్రభుత్వాధినేతలు ఇంకో అడుగు ముందుకు వేసి 2015లో పారిస్‌లో జరిగే విశ్వ పర్యావరణ ఒప్పందంలో భాగస్వాములు కావడానికి ముందుకు వచ్చారు. 1990 స్థాయికి తమ దేశాలలో గ్రీన్హౌస్ ఉద్గారానికి తగ్గించడానికి పాటుపడతామని పలు యూరప్ దేశాలు హామీ ఇచ్చాయి. అంటే నలభై శాతం ఉద్గారాల తగ్గింపు మీద అవి దృష్టి సారిస్తాయి. తన పవన, సౌర విద్యుత్ సామర్థ్యాన్ని 2020 నాటికి రెట్టింపు చేయనున్నట్టు భారత ప్రతినిధి ప్రకటించారు. వాతావరణంలో మార్పులు వచ్చేశాయి. అవి వాటికవే వచ్చినవి మాత్రం కావు. కాబట్టి ప్రపంచ దేశాలలో రావలసిన మార్పు గురించి హెచ్చరించడానికి ఉద్దేశించిన ఈ సదస్సు శుభప్రదంగా, విజయవంతంగా ముగిసింది. ‘ఇంక ప్రపం చానికి కావలసినది చర్యలే, మాటలు కాదు’ అన్న బాన్‌కీ మూన్ మాటను అందరూ శిరసావహిస్తారని ఆశిద్దాం. గోపరాజు నారాయణరావు -
మద్రాసు తీరాన్ని వీడని పీడకల
మొదటి ప్రపంచ యుద్ధం ఆగస్ట్ 4, 1914న ఆరంభమైంది. నెలా పదిహేను రోజుల తరువాత సరిగ్గా సెప్టెంబర్ 22 రాత్రి 8 గంటల వేళ ఎండెన్ మద్రాస్ నౌకాశ్రయంలో ప్రవేశించి ఎలాంటి హెచ్చరికలు లేకుండా బాంబుల వర్షం కురిపించి, కాల్పులు జరిపింది. చరిత్ర గతిని మార్చిన ఏ ఘటన అయినా మొత్తం భూగోళాన్ని కదలించక మానదు. మొదటి ప్రపంచ యుద్ధం (గ్రేట్‌వార్) అలాంటిదే. ఆ మహా మారణహోమం ప్రధానంగా యూరప్ ఖండంలోనే జరిగినా, భారతావనితో పాటు, దక్షిణ భారతదేశం మీద కూడా దాని నీడ కని పిస్తుంది. నాటి బ్రిటిష్ ఇండియా నుంచి పది లక్షల మంది సైనికులు ఆ యుద్ధంలో పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆ యుద్ధం నూరేళ్ల సందర్భాన్ని నిర్వహించు కుంటోంది. కాబట్టి చెన్నై అని పిలుచుకుంటున్న మద్రాస్ నౌకాశ్రయంలో ఎస్ఎంఎస్ ఎండెన్ అనే జర్మనీ నౌక వీర విహారం చేసిన ఘటనను కూడా గుర్తు చేసుకుంటున్నారు. 1914 సంవత్సరం తొలి అర్ధభాగంలో ఎలాంటి గందర గోళం లేకుండా కార్యకలాపాలు నిర్వహించిన ఎండెన్ నౌక, సెప్టెంబర్ తరువాత జర్మనీ యుద్ధ కండూతిని ప్రతిబింబిం చేలా వ్యవహరించింది. ‘జూన్ సంక్షోభం’ తరువాత పూనకం వచ్చినట్టు వ్యవహరించింది. బ్రిటిష్ నౌకా దళాధిపతిగా విన్స్టన్ చర్చిల్ పని చేసిన కాలమది. బోస్నియా రాజధాని సరాయేవోలో జూన్ 28న ఆస్ట్రియా- హంగేరీ యువరాజు ఫ్రాంజ్ ఫెర్డినాండ్, ఆయన భార్య సోఫీ చోటెక్ను సెర్బు జాతీయవాది గవ్రిలో ప్రిన్సిప్ హత్య చేయ డం, తరువాత జరిగిన పరిణామాలను జూన్ సంక్షోభంగా పేర్కొంటారు. ఇదే మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. నిజానికి ఫెర్డినాండ్ హైదరాబాద్ నగరానికి కూడా వచ్చాడు. నిజాం నవాబు మొదటి ప్రపంచ యుద్ధం కోసం హైదరాబాద్ సంస్థానం వంతు వాటా ఇచ్చాడు కూడా. మొదటి ప్రపంచ యుద్ధం ఆగస్ట్ 4, 1914న ఆరంభమైం ది. నెలా పదిహేను రోజుల తరువాత సరిగ్గా సెప్టెంబర్ 22 రాత్రి 8 గంటల వేళ ఎండెన్ మద్రాస్ నౌకాశ్రయంలో ప్రవేశించి ఎలాంటి హెచ్చరికలు లేకుండా బాంబుల వర్షం కురిపించింది. కాల్పులు జరిపింది. ఈ ప్రతిధ్వనినీ, ఆ బీభత్సాన్నీ నేటికీ మద్రాస్ మరచిపోలేదు. ఎండెన్ అనే పదం తమిళంతో పాటు, సింహళం, తెలుగు భాషలలో ఒకటైపోయింది. ఈ పదం 1930, 1940 దశకాలలో వచ్చిన తెలుగునాట సాహి త్యంలో విరివిగా కనిపిస్తుంది. తెగువ, మొండితనం, మూర్ఖ త్వం ఉన్న వారిని ఎండెన్ అని పిలవడం నేడు కూడా ఉంది. ఇప్పటికీ తమిళనాడులో అన్నం తినకుండా మారాం చేసే పిల్లలను భయపెట్టడానికి తల్లులు, ఎండెన్ మళ్లీ వస్తుందని భయపె డుతూ ఉంటారు. ‘అవాన్ థాన్ ఎండెన్’ (వాడు ఎండెన్) అని కూడా ప్రయోగిస్తూ ఉంటారు. సింగాటో కేంద్రంగా పనిచేసే జర్మన్ నౌకాదళంలో ఎండెన్ ఒక నౌక. చైనాలోని సింగాటో అప్పుడు జర్మనీ స్వాధీనంలో ఉండేది. ఇదే కేంద్రంగా ఆసియాలో- ముఖ్యంగా చైనా, జపాన్, మలేసియా పరిసరాలలో జర్మనీ వాణిజ్యం నిర్వహిం చేది. ఈ నౌక కెప్టెన్ కార్ల్ వాన్ ముల్లర్. నిజానికి గ్రేట్‌వార్ ఆరంభం కాగానే సింగాటో నౌకాదళాన్ని రావలసిందిగా జర్మనీ ఆదేశించింది. కానీ ఆసియా ప్రాంత సముద్ర జలాలలో ఉండి మిత్ర రాజ్యాల (బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జపాన్) నౌకల భర తం పట్టడానికి ముల్లర్ ప్రత్యేక అనుమతి పొందాడు. 1914 సెప్టెంబర్‌లో ఎండెన్ ఆరు బ్రిటిష్ నౌకలను ముంచింది. అవన్నీ సరుకు రవాణా నౌకలే. అందుకే ముల్లర్ మానవతా దృష్టిని ప్రశంసిస్తూ ప్రపంచ పత్రికలు వార్తలు రాశాయి. ఆ దాడులలో 16 మంది చనిపోగా, రవాణా అవుతున్న 70,825 టన్నుల సరుకు ధ్వంసమైంది. రెండు ఆంగ్లో-పర్షియన్ చమురు నౌకలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఎండెన్ మద్రాసు నౌకాశ్రయంలో ప్రవేశించింది. వాటిని ధ్వంసం చేయడంతో ఆకాశం మొత్తం పొగతో నిండిపోయి, నగరవాసులు భయ కంపితులయ్యారు. మద్రాస్ చేరగానే ఎండెన్ మొదట తీరానికి దగ్గరలోనే ఉన్న బర్మా ఆయిల్ కంపెనీకి చెందిన నౌకను పేల్చివేసింది. బ్రిటిష్ సామ్రాజ్యంలో భారత్ వెలకట్టలేని వలస అని, ఆ వలసలోనే బ్రిటిష్ (ఆ దేశం బలమంతా నౌకాదళమే) జాతి పరువు తీయాలన్నదే జర్మనీ ఉద్దేశం. తరువాత తూర్పు దిక్కుగా కదిలిన ఎండెన్ మలయా లోని పన్గాంగ్ దగ్గర ఉన్న రష్యా నౌక జమ్చుగ్ను కూడా అక్టోబర్ 8న ముంచింది. వాటితో పాటు మరో మూడు నౌకలను కూడా నాశనం చేసింది. మూడు మాసాల పాటు ఇదే రీతిలో పసిఫిక్, హిందూ మహాసముద్ర జలాలలో ఇది అల జడి సృష్టించింది. జావా, సుమత్ర, రంగూన్‌లలో ఎండెన్ బీభ త్సం సృష్టించింది. ఇలా ఇష్టారాజ్యంగా ధ్వంసం చేయగలగ డానికి కారణం- జర్మన్ సిబ్బంది ఎండెన్ను బ్రిటిష్ నౌక హెచ్ ఎంఎస్ యార్మౌత్ అని భ్రమింపచేసేవారు. ఆఖరికి ఆస్ట్రేలి యాకు సమీపంలోని కొకోస్ దీవుల దగ్గరకు వచ్చింది. అప్పుడే ఆస్ట్రేలియాకు చెందిన హెచ్ఎంఏఎస్ సిడ్నీనౌక ఎదురుదాడి చేయడంతో ఎండెన్ పతనమైంది. ఆ ద్వీపంలో 1950 వరకు దాని శిథిలాలు ఉన్నాయి. గోపరాజు నారాయణరావు -
చారిత్రక సంధ్యను ఆవిష్కరించిన కథకుడు వి.చంద్రశేఖరరావు
చరిత్రకి నీడ వంటిది సాహిత్యం. కాని హేతువునీ, కార్యకారణ సంబంధాన్నీ పట్టించుకున్నంతగా ఆ కాలపు ఆత్మఘోషను చరిత్ర వినిపించుకోదు. ఒక పరిణామం మీద వ్యక్తుల స్పందన గురించి చరిత్రకు అక్కరలేదు. వ్యక్తి మీద చరిత్ర పరిణామం ఎలా ప్రతిఫలించిందో ఎక్కడా నమోదు కాదు. చరిత్రకు నీడ వంటి సాహిత్యంలోనే ఆ ప్రతిఫలనాలూ గుండెలయలూ కనిపిస్తాయి వినిపిస్తాయి. వెల్లువలా వచ్చిన దళితోద్ధరణ ఒక కెరటంలా పతనం కావడానికి వెనుక ఉన్న కారణాలు చరిత్రనే విస్తుపోయేటట్టు చేసే రీతిలో ఉంటాయి. అయితే ఇలాంటి పరిణామాల మీద నోరు విప్పడానికి మరీ ముఖ్యంగా వాటిని అక్షరబద్ధం చేయడానికి ముందుకు వచ్చేవారు అరుదు. అగ్రకులాల అహంకారానికి బలైనవాడూ కోటేశే ఓ పెద్ద దళిత జనోద్ధారకుడు పెట్టిన హింసతో చనిపోయిన వాడూ మరో కోటేశే కావడం చరిత్రను విస్తుపోయేటట్టు చేసే విషయం కాదని ఎలా చెప్పడం! స్థానీయతను స్వచ్ఛందంగా వదిలించుకోవాలనుకుని శతథా యత్నిస్తున్న మన సమాజపు చారిత్రక సంధ్యను ఆవిష్కరించడం చరిత్రకారుడితో కాదు, సాహిత్యకారుడి సృజనతోనే సాధ్యమవుతుంది. డాక్టర్ వి.చంద్రశేఖరరావు చాలా కథలు అలాంటి సృజనతో వెలువడినవే. సోవియెట్ రష్యా పతనం సమసమాజం కోసం స్వప్నించేవారి పాలిట అశనిపాతమే అయింది. చెదిరిపోయిన కల గందరగోళాన్ని సృష్టించింది. ఆ గందరగోళంలో నిజరూపాలు బయటపడ్డాయి. ఈ అంశంతో సాగిన కథ ‘లెనిన్ ప్లేస్’. ఈ మహా పరిణామం మీద ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల పేజీల సమాచారం వెలువడింది. కానీ సృజనాత్మక రచనలు తక్కువే. తెలుగులో ఇంకా తక్కువ. ఆ లోటును చంద్రశేఖరరావు తీర్చారనిపిస్తుంది. నిజానికి చాలామంది కమ్యూనిస్టులు ఆ సిద్ధాంతాన్ని నమ్మామని అనుకున్న రచయితలు ఆ ఉదంతానికి కొంచెం ముందే సాయిబాబా భక్తులుగా మారిపోవడం ఒక వాస్తవం. ఈ కథలో సోవియెట్ రష్యా పతనం తరువాత స్టీఫెన్ లెనిన్ ఫోటోకు బొట్టు పెట్టి దండ వేసి ధ్యానం చేసిన దృశ్యం తెలుగు ప్రాంత వామపక్ష మేధావుల దివాలాకోరుతనం మీద గొప్ప విసురనిపిస్తుంది. ఇది ఇక్కడితో ఆగలేదు. ఒకప్పుడు వామపక్ష ఉగ్రవాదాన్ని ఆరాధించి తరువాత బాబాలతో తమ పుస్తకాలను ఆవిష్కరింపచేసుకున్న మేధావులు కూడా ఇక్కడ ఉన్నారు. మన ఫ్యూడల్ భావాలనీ, ఛాందసాలనీ కమ్యూనిస్టు సిద్ధాంతం కాస్తా కూడా కదల్చలేకపోయిన సంగతిని రచయిత తాత్వికంగా చిత్రించారు. ఇలాంటి ఇతివృత్తాన్ని కథగా తీసుకోవడం నిజానికి సవాలు. ‘చిట్టచివరి రేడియో నాటకం’ స్థానీయతను గురించిన ఒక ఆర్తిని ఆవిష్కరిస్తుంది. ఎంత ఆధునికతను సంతరించుకున్నప్పటికీ మనదైన భాష, కళ మాత్రమే మన మనసుల వరకు రాగలవన్న గూగీ వా థియాంగ్ (ఏ డెవిల్ ఆన్ ది క్రాస్) నమ్మకం ఈ కథకుడిలోనూ మనం చూస్తాం. స్వేచ్ఛను వదులుకోవడం ఇష్టంలేని సంగీతజ్ఞుడు టిప్పు సుల్తాన్ ఆజ్ఞను ధిక్కరించి నాలుకను కోసుకున్న సన్నివేశం కూడా ఈ కథకుడిని కదిలించింది. అది గొప్ప ఆర్తికి నిదర్శనం. తమ తమ కళాతృష్ణకు తామే ఎలా సమాధి కట్టవలసి వచ్చిందో చెబుతుంది ఈ ‘నాటకం’. చివరిగా దంతపు భరణిలో వీణ వాయించే వేళ్లను చూపించడం గగుర్పొడిచేటట్టు ఉన్నా దేశీయమైన కళాసంపదకు జరుగుతున్న సత్కారం అలాంటిదే మరి. ‘నిద్రపోయే సమయాలు’ కథలో కూడా స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన సృజనకు క్రమంగా చెదలు పట్టిన తీరును ఆవిష్కరించారు రచయిత. ‘సిద్ధార్థా వగపెందుకు?’, ‘ద్రోహవృక్షం’ కథలు మనిషితనాన్ని కోల్పోతున్న వ్యక్తులకు సంబంధించినవి. దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్న రెండు కులాలకు చెందినప్పటికీ ఇద్దరు వ్యక్తులు నిర్జన ప్రాంతంలో కలుసుకున్నప్పుడు ప్రదర్శించిన ప్రవర్తనకీ మళ్లీ వారివారి సమూహాలలోకి వెళ్లినపుడు వారిలో వచ్చిన మార్పు గురించీ చెప్పడానికి రచయిత ఈ కథ రాశారనిపిస్తుంది. ఈ ఇద్దరినీ మంచి మిత్రులుగా చూపించడానికి ఒక కొండ కొసను వేదికను చేయడం గొప్ప ప్రతీకాత్మకంగా ఉంది. ‘సిద్ధార్థా వగపెందుకు?’ ప్రత్యేకమైన కథ. నిజానికి ఇందులో మేడమ్ మాలతి ప్రధాన పాత్ర. అయినా ఆమె తెర మీద కనిపించేది తక్కువే. కానీ ఆమె కొడుకు భావనల ద్వారా మాలతి పాత్రను మన కళ్లకు కట్టారు. కొన్ని సందర్భాలలో మనుషులలో స్పందనలు చాలా సహజం. వాటి మీద మేధావి, రచయిత, ఉద్యమం.. మరొకటి మరొకటి అంటూ ముసుగులు వేసినా అవి ఏదో ఒక క్షణంలో తొలగిపోక తప్పదు. ఆ వాస్తవాన్ని సున్నితంగా అనిపించే రీతిలోనే అయినా ఆఖర్న కుండబద్దలు కొట్టిన పద్ధతిలో రచయిత చిత్రించారు. ‘మోహనా! మోహనా’ కదలించే కథ అనే కన్నా గొప్పగా ఆలోచింప చేసే కథ అనాలి. కొద్దిగా డబ్బు, చుట్టూ నలుగురు మనుషులు, కాస్త కీర్తి లభించగానే ఎవరైనా ఒక రకంగానే ప్రవర్తిస్తారు. ఆధిపత్య ధోరణి కబళిస్తుంది. ఇందుకు దళిత నాయకత్వం కూడా అతీతం కాదు. ఇదే ఈ కథలో నేర్పుగా ఆవిష్కరించారు రచయిత. ఇది ‘వైట్ కాలర్ దళితుల’ కథ. జీవని, కొన్ని చినుకులు కురవాలి, సుందరం కలది ఏ రంగు, హైకూ, నలుపు వంటి మొత్తం 31 కథల సంకలనమిది. కవులు ప్రత్యేకమైన శైలినీ, భాషనూ సృష్టించుకున్నట్టు ఈ కథకుడు తనదైన పంథాను రూపొందించుకున్నారని అనిపిస్తుంది. కానీ ‘నిద్రపోయే సమయాలు’ కథలో నిజాయితీతో కూడిన సుందరం సృజనను పరిస్థితులు కబళించినట్టు కొన్ని కథలలో మాత్రం శైలి ఇతివృత్తాన్ని అధిగమించడం కూడా ఉంది. - గోపరాజు నారాయణరావు -
మన దేశం
జాతీయ చిహ్నాలతో, వాటి వెనుక తాత్వికతతో పౌరులకు మానసిక బంధం ఉంటుంది. జాతి గతాన్ని వర్తమానంతో భావైక్యం చేయించేవే జాతీయ చిహ్నాలు. నిరుడు కురిసిన జ్ఞానధారలలో తడిసేటట్టు చేసేవి కూడా అవే. భిన్న సంస్కృతుల, భాషల నిలయాలుగా ఉండే పెద్ద దేశాలలో ప్రజలందరి మధ్య దూరాలను తగ్గించేవీ, దేశ భౌగోళిక స్వరూపంతో జాతి జనులను మమేకం చేసేవీ జాతీయ చిహ్నాలు. చరిత్ర నుంచి మాత్రమే కాదు, శతాబ్దాల జ్ఞానఖనుల నుంచే కాదు, ఉద్యమాలూ, త్యాగాలూ మిగిల్చిన గొప్ప జ్ఞాపకాల నుంచి కూడా జాతీయ చిహ్నాలు ఆవిర్భవిస్తాయి. కొన్ని ప్రకృతి ప్రసాదించిన జాతీయ చిహ్నాలు కూడా ఉన్నాయి. అలాంటి మన జాతీయ చిహ్నాలే ఈవారం ‘వివరం’. భిన్నమైన ఉద్యమంతో, అనితర సాధ్యమైన పంథాతో స్వాతంత్య్రం తెచ్చుకున్న భారతదేశం అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన జాతీయ చిహ్నాలను ఎంచుకుంది. నీలిరంగు ధర్మచక్రంతో ఉండే మూడు రంగుల జెండా మన జాతీయ పతాకం. నాలుగు సింహాల అశోకచక్రం మన జాతీయ చిహ్నం. రాజసానికి ప్రతీకగా ఉండే బెంగాల్ టైగర్ మన జాతీయ మృగం. అద్భుత సౌందర్యంతో అలరారే మయూరం మన జాతీయ పక్షి. మర్రి మన జాతీయ వృక్షం. మామిడి జాతీయ ఫలం. పంకంలో ఉద్భవించినా నిర్మాల్యంగా ఉండే కమలం మన జాతీయ పుష్పం. ప్రజలందరూ ముక్త కంఠంతో పాడుకోవడానికి అందమైన, ఇంపైన జాతీయ గీతాలూ ఉన్నాయి. ఒక ప్రతిజ్ఞ కూడా ఉంది. మనకంటూ ఒక జాతీయ పంచాంగమూ ఉంది. ఇవన్నీ ప్రాచీన నాగరికతలలో ఒకటిగా వర్ధిల్లిన భారత భూమి గతాన్ని స్ఫురణకు తెచ్చేవే. మన మట్టి వాసన వేసేవే. మనవైన విలువల గురించి ఎలుగెత్తి చాటేవే. మువ్వన్నెల పతాకం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలో, తెలుపు రంగులో మధ్యగా 24 ఆకుల నీలిరంగు ధర్మచక్రంతో (అశోక చక్రం) భారత జాతీయ పతాకాన్ని రూపొందించుకున్నాం. దీనిని తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించారు. మచిలీపట్నానికి చెందిన వెంకయ్య 1916లో మొత్తం 30 రకాల ఆకృతులలో జాతీయపతాకాలను రూపొందించారు. అంతకు ముందు సిస్టర్ నివేదిత (స్వామి వివేకానంద అనుయాయి) కూడా ఒక పతాకాన్ని తయారు చేశారు. 1916లోనే అనిబిసెంట్, బాలగంగాధర్ తిలక్ హోమ్‌రూల్ ఉద్యమం తరఫున మరో పతాకాన్ని తయారు చేశారు. అయితే 1921లో గాంధీజీ నాగపూర్ కాంగ్రెస్ సమావేశాలలో వెంకయ్య రూపొందించిన పతాకాన్ని ప్రతిపాదించారు. దానినే సంస్థ ఆమోదించింది. స్వాతంత్య్రోద్యమంలో చాలాభాగం ఈ జెండా స్ఫూర్తితోనే సాగినా, అధికారంగా జూలై 22, 1947న జాతీయ పతాకంగా ప్రకటించారు. నాలుగు సింహాలు గయలో బోధివృక్షం కింద జ్ఞానోదయం అయిన తరువాత బుద్ధుడు తొలి ప్రవచనం చేసిన పుణ్యస్థలం సార్నాథ్. ఇది అత్యంత పురాతనమైన నగరాలలో ఒకటిగా చెప్పుకునే మహా పుణ్యక్షేత్రం వారణాసి శివార్లలోనే ఉంది. అందుకే అక్కడ మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీస్తుపూర్వం 250లో ఒక స్థూపం నిర్మించాడు. దాని కోసం చెక్కించిన నాలుగు సింహాల శిల్పాన్ని స్వతంత్ర భారతదేశం జాతీయ చిహ్నంగా ఎంపిక చేసుకుంది. బోర్లించినట్టు ఉండే కమలం మీద నిర్మించిన ఈ నాలుగు సింహాల శిల్పంలో ఆ భాగాన్ని వదిలేసి, మిగిలిన భాగాన్ని జాతీయ చిహ్నంగా స్వీకరించారు. కింద ‘సత్యమేవ జయతే’(సత్యమే జయిస్తుంది) అని దేవనాగర లిపిలో రాయించారు. మాధవ్ సాహ్ని దీనిని జాతీయ చిహ్నంగా ఎంపిక చేశారు. ఆ నాలుగు సింహాలు ఆసియాటిక్ లేదా ఇండియన్ లైన్స్. అవి కూర్చున్నట్టు చెక్కిన ఈ శిల్పాన్ని ఎదురుగా చూసినపుడు ఒకటి (వెనుక ఉన్నది) కనిపించదు. ఈ నాలుగు సింహం తలలు నాలుగు గుణాలకు ప్రతీకలు. అవి- శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసం. గుండ్రటి ఒక వేదిక మీద వీటిని చెక్కారు. ఆ గుండ్రటి వేదిక చుట్టూనే ఉంటాయి అశోక చక్రాలు. వీటినే ధర్మ చక్రాలని కూడా అంటారు. ఒక చక్రం ఒక జంతువు దాని మీద కనిపిస్తూ ఉంటాయి. బలిష్టమైన ఎద్దు, పరుగులు తీస్తున్న గుర్రం, ఏనుగు, సింహం బొమ్మలు ఆ చక్రాల మధ్య చెక్కారు. నాలుగు దిక్కుల ను ఇవి చూస్తున్నట్టు ఉంటాయి. ‘సత్యమేవ జయతే’ సూక్తి ముండకోపనిషత్లోనిది. జనవరి 26, 1950న దీనిని జాతీయ చిహ్నంగా భారతదేశం అలంకరించుకుంది. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి అన్నమాట. ఈ చిహ్నాన్ని పవిత్రంగా చూడాలని వేరే చెప్పక్కరలేదు. భారత రాష్ర్టపతి రాజముద్రిక ఇదే బొమ్మతో ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార రాజముద్ర కూడా ఈ బొమ్మతోనే ఉంటుంది. మన కరెన్సీ మీద, పాస్‌పోర్టు మీద కూడా అదే ముద్ర కనిపిస్తుంది. జాతీయ నది గంగానదిని నవంబర్ 5, 2008న జాతీయ నదిగా ప్రకటించారు. హిమాలయాల వద్ద గంగోత్రిలో భాగీరథి పేరుతో పుట్టి, గంగగా కాశీ మొదలైన ప్రదేశాలలో ప్రవహించి, పద్మ పేరుతో బంగ్లాదేశ్‌కు వెళుతుందీ మహానది. మొత్తం 2,510 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. భారతదేశంలో నలభై శాతం ప్రజలకు ఈ నదే జీవనాధారం. అలకనంద, యమున, సోన్, గోమతి, కోసి, గాఘ్రా నదులు ఇందులో కలుస్తాయి. ఈ నదికి భారతీయ జీవనంతో అనుబంధం అనిర్వచనీయమైనది. మర్రి చెట్టు మర్రి చెట్టు మన జాతీయ వృక్షం. ఈ చెట్టుకి భారతీయ సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో ఎనలేని ప్రాధాన్యం కనిపిస్తుంది. ఆ చెట్టుకు పెట్టుకున్న పవిత్రమైన పేరు వటవృక్షం. వృక్షాలలో మర్రి వలెనే, దేవతలలో నేనే నరేంద్రుడను అని గీతాకారుడు చెబుతాడు. ఇది చాలు వైదిక వాఙ్మయం లో వటవృక్షానికి ఉన్న స్థానం ఎలాంటిదో చెప్పడానికి! నిజమే, ఈ భూమి మీద ఉన్న వృక్ష సంపదలో మర్రిది ప్రత్యేక స్థానం. అదో అద్భుతం. దాని విత్తనం ఎంతో చిన్నది. అదే ఇంతటి మహావృక్షాన్ని నిక్షిప్తం చేసుకున్నదన్న విషయం ఒక అద్భుతమనిపిస్తుంది. ఊడలు మళ్లీ భూమిలోకి వెళ్లి పాతుకుంటాయి. మహబూబ్‌నగర్ జిల్లా పిల్లలమర్రి 800 సంవత్సరాలనాటిది. 330 మీటర్ల మేర విస్తరించి ఉన్న కలకత్తా మర్రి, 450 సంవత్సరాల నాటి అడయార్ మర్రి చెట్టు, 400 సంవత్సరాల నాటి రమోహళ్లి (బెంగళూరు దగ్గర) అలడ మర్రి ఎంతో ఖ్యాతి గాంచాయి. అనంతపురం జిల్లా తిమ్మమ్మమర్రి 1989లో గిన్నిస్ బుక్ రికార్డుల్లో చేరింది. ఇవి ఎంత మేర విస్తరించి ఉంటాయో చెప్పడానికి ఒక్క చక్కని చారిత్రక సందర్భం చాలు. అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చినపుడు ఏడు వేల సైన్యంతో ఒకే మర్రి చెట్టుకింద విడిది ఏర్పాటు చేసుకున్నాడు! కమలం కమలం అందాన్ని చూసి మురిసిపోని వారు ఉండరు. మన పూర్వ కవులు కూడా అంతే. స్వచ్ఛతకి తిరుగులేని ప్రతీక ఆ పుష్పం. దీనిని భారతదేశం జాతీయ పుష్పంగా ఎంచుకుంది. జలాశయాలలో లోలోతు మట్టిలో నుంచి, బురద, నాచుల మధ్య నుంచి నీటి ఉపరితలం మీదకు వచ్చి వికసిస్తుందీ పువ్వు. కానీ కాస్త కూడా బురద అంటదు. జీవితం కూడా అంత నిర్మలంగా ఉండాలని మనిషి ఆకాంక్షిస్తూ వేల సంవత్సరాలుగా ఆ పుష్పాన్ని ఆరాధిస్తున్నాడు. మనసునూ, శరీరాన్నీ భౌతిక ప్రపంచంలోని బురద అంటకుండా కాపాడుకోవాలని కలలు కంటూనే ఉన్నాడు. కమలం దైవత్వానికీ, జ్ఞానానికీ, సంపదకూ, పవిత్రతకూ ప్రతీక. భగవానుడి పాదాలను చరణకమలాలు అని కీర్తించడం పరిపాటి. మామిడిపండు మామిడిపండు మన జాతీయ ఫలం. ఈ ఫలానికి కూడా భారతీయ సంస్కృతితో ఎనలేని అనుబంధం ఉంది. మన దేశంలోనే వందకు పైగా రకాల మామిడిపళ్లు దొరుకుతాయి. భారతదేశ చరిత్రలో మహోన్నత స్త్రీగా గుర్తింపు ఉన్న ఆమ్రపాలి దొరికింది మామిడితోపులోనే. ప్రస్తుత బీహార్‌లో ఉన్న దర్బాంగాలో మొగల్ చక్రవర్తి అక్బర్ లక్ష మొక్కలతో ఒక మామిడితోటను పెంచేవాడు. ఏ,సీ,డీ విటమిన్లు పుష్కలంగా ఉండే మామిడి పండు, కాయ, ఆకు కూడా భారతీయులకు ఎంతో ముఖ్యమైనవి. విశాఖ తీరంలో పుట్టిన జాతీయ ప్రతిజ్ఞ ‘భారతదేశము నా మాతృభూమి.. భారతీయులంతా నా సహోదరులు..’ అంటూ సాగే ఈ ప్రతిజ్ఞను తొలిసారి 1963లో విశాఖపట్నంలోని ఒక పాఠశాలలో పిల్లల చేత చదివించారు. దీనిని రచించిన వారు పైడిమర్రి వెంకటసుబ్బారావు. నల్లగొండ జిల్లా అన్నేపర్తికి చెందిన వెంకటసుబ్బారావు బహుభాషావేత్త. విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు 1962లో ఈ ప్రతిజ్ఞ తయారుచేశారు. దీనిని వెంకటసుబ్బారావుగారు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన అప్పటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజుకు అందించారు. 1964లో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహామండలి సమావేశం జరిగినపుడు జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. అన్ని భాషలలోకి అనువాదం చేయించి, జనవరి 26, 1965 నుంచి దీనిని దేశమంతా చదువుతున్నారు. కరెన్సీ భారత కరెన్సీ మీద దేవనాగర లిపిలో ముద్రించిన ‘రా’ అన్న అక్షరమే జాతీయ చిహ్నం. దీనిని జూలై 15, 2010న భారత ప్రభుత్వం తీసుకుంది. జాతీయ పంచాంగం చైత్ర మాసంతో మొదలయ్యే శక యుగం పంచాంగాన్ని (కేలండర్) మన ప్రభుత్వం మార్చి 22, 1957న జాతీయ పంచాంగంగా గుర్తించింది. అంతకు ముందు గ్రెగారియన్ కేలండర్ అమలులో ఉండేది. ఇందులో 365/366 రోజులు ఉంటాయి. ఇప్పుడు గ్రెగారియన్ కేలండర్‌తో పాటు దేశీయ కేలండర్‌ను కూడా భారత్ గెజెట్, ఆకాశవాణి, ప్రభుత్వ కార్యక్రమాల వివరణకు ఉపయోగిస్తున్నారు. జాతీయ మృగం బెంగాల్ టైగర్ మన జాతీయ మృగం. రాజసం, శక్తి, సామర్థ్యం పుష్కలంగా ఉండే ఈ జంతువు భారతీయ పురాణాలలో, వాఙ్మయంలో విశేషమైన స్థానం కలిగి ఉంది. 1973 నుంచి దేశంలో పులుల సంరక్షణ పథకం ప్రారంభమైంది. ఆ సంవత్సరం ఏప్రిల్‌లోనే పులికి జాతీయ మృగం హోదా వచ్చింది. ప్రస్తుతం దేశంలో 23 టైగర్ రిజర్వులు పని చేస్తున్నాయి. నీటి జంతువు గంగానదిలో కనిపించే మంచినీటి డాల్ఫిన్‌ను జాతీయ నీటి జంతువుగా పేర్కొంటారు. జాతీయ పక్షి 1963లో నెమలి భారతీయుల జాతీయ పక్షి అయింది. నెమలి అందానికే కాదు, గొప్ప మార్మికతకు కూడా పేర్గాంచినదే. 200 ఈకలతో ఉండే మగ నెమలి పింఛం రమణీయతకు ఆలవాలం. 1972లో నెమలిని వేటాడడం నిషేధించారు. వందేమాతరమ్ బంకించంద్ర చటర్జీ రాసిన నవల ‘ఆనందమఠం’లో (1882) ఒక రమ్యమైన సన్నివేశం ఉంది. మహేంద్రుడు, భవానందుడు అనే రెండు ప్రధాన పాత్రలు అర్థరాత్రి, వెన్నెల్లో అడవి గుండా వెళుతూ ఉంటారు. అంతకు ముందే దొంగలకు సంబంధించి ఆ ఇద్దరి మధ్య చిన్న వివాదం చెలరేగితే, మహేంద్రుడు అలుగుతాడు. ఆ సందర్భంలో భవానందుడు ఒక పాట అందుకుంటాడు. అదే- ‘వందేమాతరమ్.. సుజలాం సుఫలాం... మలయజ శీతలాం....’ ఆ సంస్కృత గీతానికి పరవశించిన మహేంద్రుడు వెంటనే మాట్లాడడం మొదలుపెడతాడు. ఇది బంకింబాబు సృష్టించిన మహేంద్రుడు అనే పాత్రనే కాదు, భారతదేశాన్నీ కదిలించింది. 1896లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో దీనిని మొదటిసారి పాడారు. అప్పటి నుంచి ఆ పాట పాడడం సంప్రదాయంగా మారింది. దీనిని మొదట రవీంద్రనాథ్ టాగూర్ గానం చేశాడు. అదొక ప్రత్యేకత. ఇంకొక విశేషం - అరవింద ఘోష్ దీనిని ఆంగ్లంలోకి అనువదించారు. ఇది పెద్ద గేయం. మొదటి రెండు చరణాలను 1950లో భారత ప్రభుత్వం జాతీయ గేయం (సాంగ్)గా స్వీకరించింది. జనగణమన సాహిత్య నోబెల్ అందుకున్న ఏకైక భారతీయుడు రవీంద్రనాథ్ టాగూర్ రాసిన గీతం జనగణమన. దీనిని మొదట కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో డిసెంబర్ 27, 1911న ఆలపించారు. తరువాత రవీంద్రుడి సంపాదకత్వంలో వెలువడిన ‘తత్వబోధ ప్రకాశిక’లో ప్రచురించారు. అది ఆరోజులలో కొద్దిమంది బ్రహ్మ సమాజ అవలంబీకులకు తప్ప ఎవరికీ తెలియదు కూడా. కానీ ఫిబ్రవరి, 1919లో టాగూర్ తెలుగు ప్రాంతంలోని మదనపల్లెకు (చిత్తూరు జిల్లా) రావడంతో ఆ గీతానికి బాణీ కట్టే సందర్భం వచ్చింది. ఆయనను అప్పుడు థియోసఫికల్ విద్యాసంస్థల తరఫున జేమ్స్ హెచ్ కజిన్స్ ఆహ్వానించారు. అప్పుడే రవీంద్రుడు విద్యార్థుల సమావేశంలో ఆ గీతాన్ని ఆలపించారు. తరువాత జేమ్స్, ఆయన భార్య మార్గరెట్ (పాశ్చాత్య సంగీతజ్ఞురాలు) ఈ గీతాన్ని రవీంద్రుడి చేతే ఆంగ్లంలోకి అనువదింప చేసి బాణీ కట్టారు. తరువాత అది బడిపిల్లలకు ఉదయగీతంగా మారిపోయింది. 52 సెకన్లు పాడుకునే ఈ గీతాన్నే జనవరి 24, 1950లో జాతీయ గీతంగా మన ప్రభుత్వం ప్రకటించింది. జిలేబీ అనధికారికంగా దేశంలో చాలా చోట్ల జిలేబీని జాతీయ మిఠాయిగా పరిగణిస్తారు. ప్రపంచంలోనే మొదటి తరం వంటకాల పుస్తకాలలో ఒకటిగా పేరొందిన మహ్మద్ బిన్ హసన్ అల్ బాగ్దాదీ పుస్తకంలో జిలేబీ ప్రస్తావన కనిపిస్తుంది. ఇది 13 శతాబ్దంలో వచ్చిన వంటకాల పుస్తకం. ఇది ముస్లింల పాలనలోనే భారతదేశంలోకి ప్రవేశించిన మాట నిజం. జైన మత బోధకుడు జినసుర క్రీ.శ.1450 రాసిన ‘ప్రియకర్ణపాకత’ పుస్తకంలో కూడా జిలేబీ ప్రస్తావన ఉంది. ఏ విధంగా చూసినా భారతదేశంలో ఈ మిఠాయి 500 సంవత్సరాలకు పూర్వమే తయారైనట్టు దాఖలాలు కనిపిస్తాయి. హాకీ మొత్తం 15 జాతీయ చిహ్నాలు మన జాబితాలో కనిపిస్తాయి. అందులో హాకీని జాతీయ క్రీడగా పరిగణించడం ఒకటి. హాకీలో ఇంతవరకు ఒలింపిక్స్ పోటీలలో 8 బంగారు,1 వెండి, 2 రజత పతకాలను భారత దేశం తెచ్చుకుంది. 1928 నుంచి 1956 వరకు వరుసగా ఆరు పర్యాయాలు ఒలింపిక్స్‌లో మనదేశమే చాంపియన్‌గా నిలిచింది. ఇంతకీ హాకీ జాతీయ క్రీడేనా? కాదు. తన పాఠ్య పుస్తకాలలో మన జాతీయ క్రీడ హాకీ అని చెప్పడం కనిపించిందనీ, ఇది వాస్తవమో కాదో వివరించవలసిందంటూ 2012లో ఐశ్వర్య పరాశర్ అనే పదేళ్ల బాలిక సమాచార హక్కు చట్టం కింద చేసిన విన్నపం మేరకు ఆగస్టు 2, 2012న ఆనాటి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ శివప్రతాప్‌సింగ్ తోమార్ హాకీ కి జాతీయ క్రీడ హోదా లేదని తెలియ చేశారు. అంటే మన దేశానికి జాతీయ క్రీడ లేదు. జాతీయ చిహ్నాలను తయారు చేసుకున్నాం సరే, వాటిని గౌరవించే దృక్పథం మనలో ఉన్నదా? అది ప్రశ్నార్థకమే. నెమలి, పులి మీద జరుగుతున్న దాడులు, గంగ కాలుష్యం మన నిజాయితీని నిలదీస్తున్న సంగతి వాస్తవం. జాతీయ చిహ్నాలను అగౌరవ పరచడం రాజ్యాంగ విరుద్ధం. కానీ చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. - డా॥గోపరాజు నారాయణరావు -
మొదటి ప్రపంచ యుద్ధం ఘోరానికి నూరేళ్లు
కాలం గుండెల లో ఎప్పటికీ మానని గాయాన్ని మిగిల్చిన ఘటన అది. అత్యాధునిక ఆయుధాలూ, యూనిఫారాలూ ధరించిన రాతియుగపు మనుషులు చేసిన ‘మొదటి ఆధునిక యుద్ధ’మది. కాలం మీద అది తవ్విన రక్తకాసారాలు ఇప్పటికీ కమురు కంపును వెదజల్లుతూనే ఉన్నాయి. అది చరిత్రను రోదింప చేసిన పెను విషాదం. భవిష్యత్ తరాలు నిర్వేదంతో నవ్వుకునేటట్టు చేసిన పెద్ద ప్రహసనం కూడా అదే. ‘సకల యుద్ధాలకూ స్వస్తి చెప్పడానికి’ మొదలైనా, ఆ విఫల యత్నానికి పది లక్షల మందిని బలి చేసిన ఘోర యుద్ధమది. ప్రపంచ మానవాళి మీద చేదు జ్ఞాపకాల గుచ్ఛాన్ని విసిరి వెళ్లిపోయింది. ఆ మహా సమరంలో విజయం నెత్తుటి ధారలదీ, కన్నీటి చారికలదే. ఆధునిక చరిత్ర పొడవునా ఆ పీడకలల ఊరేగింపు ఆ యుద్ధం ఫలితమే. అదే నూరేళ్ల నాటి మొదటి ప్రపంచ యుద్ధం. గ్రేట్‌వార్. కందకాలు మొదటి ప్రపంచ యుద్ధం అనగానే మొదట గుర్తుకు వచ్చేవి కందకాలు లేదా ట్రెంచ్‌లు. ఎనిమిది లేదా తొమ్మిది అడుగుల లోతున, ఐదడుగుల వెడల్పున మైళ్ల కొద్ది వాటిని తవ్వి అందులో నుంచే యుద్ధం చేశారు. అయితే ఇవి భూలోక నరకాలను మరిపించేవి. వర్షం, మంచుతో ఇవి మోకాలిలోతు బురదతో ఉండేవి. ఎలుకలు లక్షలలో ఉండేవి. ఎక్కడ చూసినా శవాలు, వాటి నుంచి వస్తున్న కుళ్లిన వాసన. కందకాల పక్కనే తవ్వే మరుగుదొడ్ల నుంచి వచ్చే దుర్గంధం మరొకటి. శవాల కళ్లు, కాలేయాలు తిని ఎలుకలు అసాధారణ పరిమాణంలోకి ఎదిగిపోయేవి. యుద్ధాన్ని రొమాంటిక్‌గా ఊహించుకుని వచ్చిన కుర్రాళ్లకీ, స్వచ్ఛంద సైనికులకీ వీటితో జీవితం మీద విరక్తి పుట్టిందంటే అతిశయోక్తి కాదు. కందకంలోకి ప్రవేశించాక నా కాళ్లు ఎప్పుడూ పొడిగా లేవు అని రాసుకున్నాడొక సైనికుడు. ఈ భూమ్మీదకి ‘ట్రెంచ్‌ఫుట్’ ఒక కొత్త రోగాన్ని అవి తెచ్చాయి. కందకాల నుంచి ఆనాటి సైనికులు రాసిన ఉత్తరాలలో వాటిలోని స్థితిగతుల గురించి కలచివేసే, కంటి నీరు తెప్పించే అనేక వర్ణనలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం (జూలై 28, 1914-నవంబర్ 11, 1918) ఓ అగ్ని పర్వతంలా బద్ధలైన ఆకస్మిక ఘటన కాదు. దాదాపు నలభయ్ సంవత్సరాల వ్యవధిలో యూరప్‌లో సంభవించిన అనేక వికృత రాజకీయ, సైనిక పరిణామాలకు పరాకాష్ట. 1871 నుంచి జరిగిన యుద్ధాలూ, కుటిలత్వాన్ని రంగరించుకున్న దౌత్యాలూ, రహస్య ఒప్పందాల కారణంగా 1909 ప్రాంతానికే ఆ ఖండం రణ దాహంతో తహ తహలాడిపోతున్న రెండు శత్రు శిబిరాలుగా చీలిపోయింది. ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, జపాన్ ఒక శిబిరంలో చేరాయి. జర్మనీ, ఆస్ట్రియా-హంగెరీ ద్వంద్వ రాజరికం, టర్కీ, ఇటలీ (యుద్ధం వేళకి ఇంగ్లండ్ వైపు జరిగింది) వైరి శిబిరంగాను అవతరించాయి. ఇందులో ‘సూర్యుడు అస్తమించని’ దేశం ఇంగ్లండ్. ‘సూర్యుడి మీద స్థానం’ అని నినాదం అందుకున్న దేశం జర్మనీ. ‘ప్రపంచాధిపత్యం లేదా పతనం’ అంటూ జర్మనీ ఇంకో ఉప నినాదాన్ని కూడా స్వీకరించింది. ఇవన్నీ కలిసి ఆ ఖండాన్ని మందుగుండు గోదాములా మార్చేశాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అపారమైన వ్యయంతో నిర్మించుకున్న మారణాయుధాల గుట్టలతో ఆ గోదామును నింపేశాయి. ఓ చిన్న రివాల్వర్ పేల్చి దానికి నిప్పు ముట్టించినవాడే గవ్రిలో ప్రిన్సిప్. సరాయేవో జంట హత్యలు ‘మా ప్రథమ శత్రువు ఆస్ట్రియా పాలకుడు’ - నరోద్నా ఓద్బ్రానా. ‘ఆస్ట్రియా పాలక హాబ్స్బర్గ్ వంశీకులు ఎవరు కనిపించినా చంపుతాం’- బ్లాక్‌హ్యాండ్. బోస్నియా, హెర్జిగోవినా పాలనా కేంద్రం సరాయేవో నగరం గోడలన్నీ ఇలాంటి రాతలతో, పోస్టర్లతో నిండిపోయి, ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్న సమయంలో ఆస్ట్రియా-హంగెరీ ద్వంద్వ రాజరికానికి వారసుడు, హాబ్స్బర్గ్ వంశీకుడు ఫ్రాంజ్ ఫెర్డినాండ్.. భార్య సోఫీ చోటెక్తో కలసి అక్కడికే వచ్చాడు. సరాయేవో శివార్లలోనే ఉన్న ఫిలిపోవిక్ సైనిక శిబిరంలో ఉన్న 70,000 ఆస్ట్రియా సేన సంసిద్ధతను, తర్ఫీదును పరీక్షించే పేరుతో ఆ ప్రాంత గవర్నర్ జనరల్ ఆస్కార్ పొటియోరిక్ కావాలని యువరాజును రప్పించాడు. ఈ పని ముగిశాక సరాయేవో సిటీ హాలు(విజేనికా)లో ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి ఫెర్డినాండ్ హాజరు కావలసి ఉంది. ఏ111 118 నెంబరు నలుపు రంగు 3 గ్రాఫ్ అండ్ స్టిఫ్ట్ స్పోర్ట్స్ కారులో మిల్జాకా నది ఒడ్డునే యాపిల్‌కే మార్గంలో గవర్నర్ పొటియోరిక్, ఫెర్డినాండ్ దంపతులు హాలుకు వెళుతుండగా ఒక యువకుడు డైనమైట్ విసిరాడు. అది తృటిలో తప్పి వెనుక కారు ముందు పడి పేలింది. అయినా ఫెర్డినాండ్ సన్మానానికి హాజరైనాడు. తిరిగి వస్తుంటే మిల్జాకా నది మీదే ఉన్న లాటిన్ బ్రిడ్జికి ఎదురుగా, షిల్లర్ మార్కెట్ అనే తినుబండారాల దుకాణం ముందు రాజ దంపతులను ప్రిన్సిప్ (బెల్జియంలో తయారైన 9ఎ- 17 ఎం ఎం (.380 ఎసిపి) ఫాబ్రిక్ నేషనల్ మోడల్, 1910 సెమీ ఆటోమేటిక్ పిస్తోలుతో) కాల్చి చంపాడు. ప్రిన్సిప్ బ్లాక్‌హ్యాండ్ రహస్యోద్యమ సంస్థ సభ్యుడే. ‘సోఫీ! నువ్వు పిల్లల కోసం బతకాలి’ అంటూనే ఫెర్డినాండ్ చనిపోయాడు. కొన్ని నిముషాలకు సోఫీ కూడా మరణించింది. అప్పటికి ఆమె గర్భవతి. ఆ ఇద్దరిదీ గొప్ప ప్రేమ కథ. వారి పెళ్లికి రాచరికం అంగీకరించలేదు. రాజ్యం అక్కరలేదని హెచ్చరించాక కొన్ని షరతుల మీద (మోర్గనాటిక్ మ్యారేజ్) పెళ్లి చేశారు. ఎవరీ గవ్రిలో ప్రిన్సిప్? సెర్బు జాతీయవాది ఇతడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పేలిన మహా మారణాయుధాల కంటె ఇతడు పేల్చిన చిన్న రివాల్వర్ శబ్దమే చరిత్రను కంపించేలా చేసింది. యువరాజు ఫెర్డినాండ్‌ను హతమార్చాలని బ్లాక్‌హ్యాండ్, నరోద్నా ఓద్బ్రానా వంటి సెర్బు ఉగ్రవాద సంస్థలు కొన్ని నెలల నుంచి వేసిన పథకం వలెనే, హాబ్స్బర్గ్ వంశంతో, ఆస్ట్రియా ఆధిపత్యంతో సెర్బులకున్న వైరం కూడా లోతైనది. గవ్రిలో బోస్నియాలోని గ్రహావా లోయలోని ఒబ్లజాజ్ గ్రామంలో పుట్టాడు. తండ్రి జావో ప్రిన్సిప్, ఇతర కుటుంబ సభ్యులంతా ఉద్యమకారులే. జూన్ 28, 1398న జరిగిన కొసావో యుద్ధంలో సెర్బు వీరుడు లాజరస్ చనిపోయినప్పటి నుంచి వీరి పోరాటం సాగుతోంది. విదోవ్దన్ పేరుతో ఆ రోజును అప్పటి నుంచి ప్రతి ఏటా తలుచుకుని పండుగ చేసుకుంటారు. అప్పటి నుంచి సెర్బుల చాలా భూభాగాలతో పాటు మాంటెనీగ్రో, గ్రీస్, బల్గేరియా వంటి బాల్కన్ ప్రాంతాలన్నీ టర్కీ వశమైనాయి. తరువాత టర్కీ బలహీన పడడంతో 1878లో జరిగిన బెర్లిన్ కాంగ్రెస్‌లో కొన్ని ప్రాంతాలను ఇతర రాజ్యాల అధీనంలో ఉంచారు. అలా బోస్నియా, హెర్జిగోవినా ప్రాంతాలు ఆస్ట్రియా చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్ అధీనంలోకి వచ్చాయి. వీటిని కలిపి, పొరుగునే ఉన్న సెర్బియా, దానికి సమీపంలోని కొసావోనూ కలుపుకుని ‘విశాల సెర్బియా’ను ఏర్పాటు చేయాలన్నదే సెర్బుల ఉద్యమం ఉద్దేశం. అదే ఈ అశాంతికి కారణం. అంటే ఆరు దశాబ్దాల నుంచి సెర్బులు చేస్తున్న పోరాటానికి ఇది పరాకాష్ట. సెర్బులు అంటే ఐరోపా దక్షిణాది స్లావ్ జాతీయులే. ఆ కారణంతో జారిస్ట్ రష్యా సెర్బుల ఉద్యమానికి చిరకాలంగా దన్నుగా నిలబడింది. యువరాజు విజేనికా హాలుకు వెళుతుండగా డైనమైట్ విసిరిన మరొక యువకుడు కూడా బ్లాక్‌హ్యాండ్ సభ్యుడే. పేరు- నెడెల్కో కాబ్రినోవిక్. యువరాజు ప్రయాణించిన యాపిల్‌కే దారిలో బాసిక్, ప్రిన్సిప్ సహా ఎనిమిది మందిని ఆయుధాలతో రహస్య సంస్థలు నిలబెట్టాయి. నిజానికి ఈ పథక రచన అంతా సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లోనే కల్నల్ డ్రాగూటిన్ సమక్షంలోనే జరిగింది. ఆయుధాలు కూడా అక్కడ నుంచే రహస్యంగా వచ్చాయి. సరిగ్గా విదోవ్దన్ పండుగ నాడే జూన్ 28, 1914- ఫెర్డినాండ్ సెర్బుల భూభాగంలో పర్యటనకు వచ్చాడు. కాబట్టి అతడు తిరిగి వెళ్లవలసింది- ఆస్ట్రియా రాజధాని వియన్నాకు కాదు, పైలోకాలకే అని సెర్బు జాతీయవాదులు నిశ్చయించుకున్నారు. యుద్ధారంభం తన కుమారుడు అనుమానాస్పద స్థితిలో చనిపోతే, తమ్ముడు కొడుకు ఫెర్డినాండ్‌ను ఆస్ట్రియా చక్రవర్తి జోసెఫ్ యువరాజుగా ప్రకటించాడు. అతడు కూడా ఇలా దుర్మరణం చెందడం ఆ వృద్ధ చక్రవర్తిని తీవ్రంగా బాధించింది. ‘భగవదేచ్ఛ ఇలా ఉంది!’ యువరాజు మరణవార్తను మోసుకువచ్చిన టెలిగ్రామ్ చూశాక జోసెఫ్ అన్న మాట ఇదే. ఎనభయ్ ఏళ్ల జోసెఫ్ గొప్ప నిర్వేదంలో పడిపోయాడు. కానీ ఆస్ట్రియాకు సన్నిహితుడు, ఫెర్డినాండ్ మిత్రుడు, జర్మనీ చక్రవర్తి విల్హెల్మ్ రంగంలోకి దిగి సెర్బియాకు గుణపాఠం చెప్పే పనికి ఆస్ట్రియాను సిద్ధం చేశాడు. జూలై 5, 1914న విల్హెల్మ్ ఆస్ట్రియాకు ‘బ్లాంక్ చెక్’ ఇచ్చాడు. సెర్బియా టర్కీకి పక్కలో బల్లెం మాదిరిగా ఉంది. దీనితో ఈ విధంగా సెర్బియాను లొంగదీయాలని విల్హెల్మ్ పాచిక పన్నాడు. టర్కీ అండతో విల్హెల్మ్ బాగ్దాద్-బెర్లిన్ రైలు మార్గాన్ని నిర్మించాడు. చమురు రవాణాయే దీని ఉద్దేశం. అక్కడి చమురు నిల్వల మీద ఆనాడే విల్హెల్మ్ కన్నేశాడు. ఆ క్రమంలో అతడు ‘ఇస్లాం పరిరక్షకుడు’ అంటూ తనను తాను చిత్రించుకున్నాడు. జర్మనీ అండతో ఆస్ట్రియా జూలై 23, 1914న సెర్బియాకు అల్టిమేటం జారీ చేసింది. కుట్రదారులను ఆస్ట్రియాకు అప్పగించాలన్న షరతు సహా 10 షరతులను విధించింది. వాటిని ఏ దేశమూ ఆమోదించలేదని ఆస్ట్రియాకు తెలుసు. సెర్బియాను యుద్ధంలోకి దించే వ్యూహంలో భాగంగానే ఆ అల్టిమేటం పంపారు. అయినా రెండు తప్ప మిగిలిన షరతులను సెర్బియా ఆమోదించింది. అయినా ‘ధిక్కారం’ పేరుతో ఆస్ట్రియా జూలై 28న సెర్బియా మీద యుద్ధం ప్రకటించింది. ఆస్ట్రియా ఉనికి బాల్కన్ ప్రాంతాలు లేదా సెర్బుల భూభాగాల మీద విస్తరించడం ఇష్టం లేని రష్యా ఆ మరునాడే సేనల తరలింపును ఆరంభించింది. ఈ దూకుడు ఆపాలని హెచ్చరిస్తూ జర్మనీ ఆగస్టు 1, 1914న రష్యా మీద యుద్ధం ప్రకటించింది. అయితే మొదట జర్మనీ తన సేనను నడిపించినది మాత్రం ఫ్రాన్స్ దిశగా. ష్లీఫెన్ పథకం ప్రకారం రష్యా, ఫ్రాన్స్‌లను ఏకకాలంలో దాసోహమనిపించుకోవాలని జర్మనీ వ్యూహం. దారిలో ఉన్న లక్సెంబర్గ్ విధ్వంసం, తరువాత పక్కనే ఉన్న బెల్జియం విధ్వంసం వరసగా జరిగిపోయాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు దాదాపు నలభయ్ కిలోమీటర్ల దూరంలోని మోన్స్ వరకు జర్మనీ సేనలు వచ్చేశాయి. అదో అత్యంత శక్తిమంతమైన సేన. తటస్థ దేశమైన బెల్జియం మీద దాడికి నిరసనగా ఆగస్టు 4న ఇంగ్లండ్ జర్మనీ మీద యుద్ధం ప్రకటించి, సేనలను ఇంగ్లిష్ చానెల్ మీదుగా ఫ్రాన్స్ వైపు కదిలించింది. మోన్స్ (ఫ్రాన్స్ సరిహద్దు) దగ్గర ఇంగ్లండ్, ఫ్రాన్స్ సేనలు జర్మనీతో తలపడి ఆపాయి. యుద్ధంలో ప్రతిష్టంభన ఏర్పడింది. భూ ఉపరితలం మీద నిలబడి ఎక్కువ సమయం యుద్ధం చేయడం సాధ్యం కాలేదు. అయితే వెనక్కు తగ్గే యోచన ఎవరికీ లేదు. దీనితో అవసరమైనవే కందకాలు (ట్రెంచ్‌లు). ఫ్రాన్స్ సరిహద్దు నుంచి బెల్జియం సరిహద్దుల వరకు దాదాపు ఏడు వందల కిలోమీటర్ల మేర ఈ కందకాలు తవ్వి అందులో ఉండి సైన్యాలు నాలుగేళ్లు యుద్ధం చేశాయి. లూసిటేనియా పేల్చివేత: అమెరికా ప్రవేశం ఇటలీ మొదట జర్మనీ శిబిరంలోనే ఉన్నా, సంవత్సరం తరువాత యుద్ధ ఫలితాలను బట్టి ఇంగ్లండ్ శిబిరం వైపు మారింది. ఇక ‘యూరప్ దగ్ధమైతే మనకేమిటి?’ అన్నదే మొదట అమెరికా అనుసరించిన విధానం. కానీ లూసిటేనియా నౌక పేల్చివేత (మే 7, 1915) అంతిమంగా అమెరికాను యుద్ధంలోకి దిగేటట్టు చేసింది. ఇదొక ఘోరమైన సంఘటన. ఇంగ్లండ్‌కు చెందిన ఈ నౌక టైటానిక్ వంటిదే. న్యూయార్క్ నుంచి మే 1, 1915న అట్లాంటిక్ సాగర జలాలలో లివర్‌పూల్‌కు బయలుదేరిన ఈ నౌకలో 1,248 షెల్స్ (యుద్ధంలో ఉపయోగించే శక్తిమంతమైన బాంబులు) ఉన్నాయని ఆరోపణ. ఐరిష్ తీరానికి 8 మైళ్ల దూరంలోనే జర్మనీకి చెందిన యూ-బోట్ యూ-20 టార్పెడోను ప్రయోగించి పేల్చివేసింది. నౌకలో ఉన్న 1,924 మందిలో 1,119 మంది చనిపోయారు. అందులో అమెరికన్లు 128 మంది. ఈ నౌకలో ప్రయాణించవద్దని అప్పుడు అమెరికా పత్రికలు అన్నింటిలోను జర్మనీ ప్రకటనలు ఇవ్వడం విశేషం. ఈ నౌకా మార్గ రక్షణ వ్యవహారాలు చూస్తున్నవాడు అప్పటి ఇంగ్లండ్ నౌకా విభాగం అధిపతి విన్స్టన్ చర్చిల్. కానీ అమెరికాను యుద్ధంలో దించేందుకు కావాలనే టార్పెడోను నౌక వైపు మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. 1917లో ఎన్నికలు ముగిసిన తరువాత అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ఏప్రిల్ 6న జర్మనీ మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధ రంగాలు మొదటి ప్రపంచ యుద్ధం పశ్చిమ యుద్ధరంగం (ఫాన్స్- బెల్జియం మధ్య) తూర్పు యుద్ధం రంగం (రుమేనియా-రష్యా మధ్య) ఇటాలియన్ ఫ్రంట్, గల్లిపోలీ (టర్కీ) కేంద్రాలుగా జరిగింది. కానీ ఈ యుద్ధంలో అనేక చిన్న చిన్న యుద్ధాలు కనిపిస్తాయి. మోన్స్ యుద్ధం మొదలు మార్నే, టానెన్‌బర్గ్, అర్రాస్, ఐపర్, వెర్డన్, జట్లాండ్, సొమ్మె, పాశ్చాండల్ వంటి అనేక యుద్ధాలు కనిపిస్తాయి. ప్రతి యుద్ధం ఘోరమైనదే. నాలుగేళ్ల పాటు సగటున గంటకు 230 మందిని బలి తీసుకున్న ఘోర యుద్ధమిది. అర్రాస్ యుద్ధంలో విజయం సాధించి పెట్టి కెనడా (నాడు బ్రిటిష్ వలస) స్వతంత్ర దేశమైంది. నాలుగేళ్లు సాగిన ఈ యుద్ధం చరిత్ర మీద ఏ విప్లవమూ వేయలేనంత ముద్రను వేసింది. వ్యవస్థలను తలకిందులు చేసింది. యుద్ధానికి అంకురార్పణ చేసిన జర్మనీ, దాని ప్రోద్బలంతో యుద్ధాన్ని ఆరంభించిన ఆస్ట్రియా-హంగెరీ, పరోక్ష కారణమైన టర్కీ, సెర్బులకు అండగా, జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగిన రష్యా - ఆ నాలుగు మహా సామ్రాజ్యాలు కూలిపోయాయి. రష్యాకు లెనిన్ నాయకత్వం వచ్చింది అప్పుడే. చిత్రం ఏమిటంటే- ఈ ఘోర యుద్ధంలో అంతిమ విజేతలు సెర్బులే. అయితే ఇది చరిత్రలో అంత ప్రాధాన్యం లేని విషయంగా మిగిలిపోయింది. కొన్ని శతాబ్దాల విశాల సెర్బియా స్వప్నం సాకారమౌతూ సెర్బియాను కలుపుకుని కింగ్డమ్ ఆఫ్ సెర్బ్స్, క్రొయేట్స్ అండ్ స్లొవేన్స్ ఆవిర్భవించింది. అప్పటికి కొద్ది నెలల క్రితమే ఏప్రిల్ 28, 1918న టెరిజిన్ సైనిక కారాగారం (ప్రాగ్ శివార్లలో ఉంది)లో గవ్రిలో ప్రిన్సిప్ చనిపోయాడు. కానీ కింగ్డమ్ ఆఫ్ సెర్బ్స్ ఆవిర్భవించిన ఆ క్షణంలో కారాగారం పరిసరాలలోని ఓ శ్మశాన వాటికలో జైలు అధికారి పుణ్యమా అని రహస్యంగా ఖననమైపోయి, గుప్తంగా ఉన్న గవ్రిలో సమాధిలో ప్రేతాత్మ ముఖం మీద ఓ చిరునవ్వు విరిసి ఉండాలి! కానీ 1915 నుంచి దాదాపు 1938 చివరి వరకు నిర్మించిన కొన్ని లక్షల యుద్ధ మృతుల సమాధుల కింద ఉన్న ఆత్మలు మాత్రం ఇప్పటికీ కుమిలిపోతూనే ఉండి ఉండవచ్చు. - డా॥గోపరాజు నారాయణరావు (గ్రేట్ వార్ ఘటనల ఆధారంగా ఈ వ్యాసకర్త రాసిన నవల ‘క్రిస్మస్చెట్టు’ ప్రస్తుతం కినిగె డాట్ కామ్ వెబ్సైట్లో లభ్యమవుతోంది.) బ్రిటిష్ ఇండియా సేనలు పది లక్షలు మొదటి ప్రపంచ యుద్ధంతో బ్రిటిష్ ఇండియా ప్రమేయం తక్కువదేమీ కాదు. పది లక్షల సైన్యం, మూడు లక్షల ఇతర సిబ్బంది యుద్ధ రంగాలకు వెళ్లారు. అందులో 62,000 మంది చనిపోయారు. యుద్ధం తరువాత చనిపోయిన వారిని కలిపితే మొత్తం 74,187 మంది. 67,000 మంది గాయపడ్డారు. (ఆ దారుణ యుద్ధంలో చనిపోయిన మొత్తం సైనికుల సంఖ్య పది లక్షలు.) ఫ్రాన్స్, ఈజిప్ట్, గల్లిపోలీ, మెసపుటేమియా యుద్ధ రంగాలలో వీరు ఎక్కువగా పోరాడారు. ఐపర్ యుద్ధంలో పాల్గొన్న భారత సిపాయీ ఖుద్అదాద్ ఖాన్ ఆ యుద్ధంలో విక్టోరియా క్రాస్‌ను అందుకున్నాడు. ఇంతకీ 1902లో బ్రిటిష్ ఇండియా సైనిక దళాల సర్వ సేనానిగా ఉన్న లార్డ్ కిష్నర్ యుద్ధ సమయంలో ఇంగ్లండ్ ప్రభుత్వంలో యుద్ధ మంత్రిగా పని చేశాడు. ఇతడి పిలుపు మేరకే కొన్ని లక్షల మంది బాలలు యుద్ధంలో చేరారు. మూడు ఖండాలలో, దాదాపు 33 దేశాల సైన్యాలు గ్రేట్‌వార్‌లో తలపడ్డాయి. భారత్-మహాయుద్ధం ఇంగ్లండ్ వలసగా భారతదేశం ఈ యుద్ధంలో పాల్గొన్నది. ముఖ్యంగా పంజాబ్ శక్తి మేరకు సాయం చేసింది. అప్పటిదాకా అరవై వేలు ఉన్న సిక్కు సైన్యం, మొదటి ప్రపంచ యుద్ధంలో చేరండి అంటూ ఇంగ్లండ్ ఇచ్చిన పిలుపునకు తీవ్రంగా స్పందించింది. ఆ సంఖ్య మూడు లక్షలకు చేరింది. అలాగే పది లక్షల రూపాయల వార్ బాండ్లు పంజాబ్‌లోనే అమ్ముడుపోయాయి. ఫ్రాన్స్‌లో సిక్కు సైనికులు పడిన వేదన కొన్ని ఉత్తరాలలో నిక్షిప్తమై ఉంది. అంహిసాయుత పథంలో భారత స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతున్న మహాత్మా గాంధీ ఈ యుద్ధానికి బేషరతు మద్దతు ప్రకటించి విమర్శల పాలైనారు. నిజానికి ఆయన ఎప్పుడు ఇంగ్లండ్ యుద్ధంలో దిగినా స్వచ్ఛందంగా సేవలు అందించాడు. 1906 నాటి జులూ యుద్ధం, బోయర్ యుద్ధంలోనూ ఆయన ఆంగ్లేయులకు తన వత్తాసు పలికాడు. దీనిని అనిబిసెంట్ వంటి వారు కఠిన పదజాలంతో విమర్శించారు కూడా. 1918 ఏప్రిల్‌లో వైస్రాయ్ జరిపిన యుద్ధ గోష్టిలో తీసుకున్న నిర్ణయం మేరకు గుజరాత్ అంతా తిరిగి గాంధీ యువకులను పోగు చేయడానికి ప్రయత్నించి విఫలమైనాడు. ఊరికి పది మంది అంటూ ఆయన ఇచ్చిన నినాదం అపహాస్యానికి గురైంది. మొత్తం పది మంది కూడా రాలేదు. అయితే భారతీయ సైనికులను ఆ యుద్ధంలో ఉపయోగించుకునే హక్కు ఇంగ్లండ్‌కు లేదనీ, ఒకవేళ ఉపయోగించుదలుచుకుంటే దేశానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చే విషయం మీద ఒక హామీ ఇవ్వాలనీ మహమ్మదాలి జిన్నా కోరాడు. నిజాం నవాబు సహా, దేశంలోని ఎందరో సంస్థానాధీశులు యుద్ధానికి నిధులూ, సైనికులను సమకూర్చి పెట్టి ప్రభు భక్తిని చాటుకున్నారు. -
వివరం: జ్వాలాగ్ని
జూలై 4 అల్లూరి జయంతి గిరిజనోద్యమాలకు చరిత్రపుటలలో దక్కే చోటు పది, పదిహేను పంక్తులే. కానీ, అందులో ప్రతి అక్షరం ఒక అడవిపాట. ప్రతి వాక్యం సెలయేటి ప్రవాహం. వన సౌందర్యాన్నీ, ఆ అందం మాటున దాగిన బీభత్సాన్నీ ఏకకాలంలో ఆవిష్కరించగలిగే వాక్యాలవి. ఆ కొన్ని వాక్యాలే ఏ తరం వారినైనా కొండగాలిలా కదిలించగలుగుతున్నాయి. తెలుగువారిని ఇప్పటికీ కదిలిస్తున్న విశాఖ మన్యం ఉద్యమం అలాంటి గిరిజనోద్యమమే. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన అల్లూరి శ్రీరామరాజు అసమాన చరిత్ర పురుషుడే. అల్లూరి ఎలా ఉండేవారు? రామరాజు ఎలాంటి దుస్తులు ధరించేవాడు? ఆయన తపస్సు చేసుకోవడానికి మన్యం వచ్చినా ఏనాడూ కాషాయం ధరించినవాడు కాదు. గెడ్డాలూ, మీసాలతో ఎప్పుడూ తెల్లటి లుంగీ, పైన ఉత్తరీయం ధరించి ఉండేవాడు. మెడలో యజ్ఞోపవీతం ఉండేది. కాళ్లకి చెప్పులు ఉండేవి కావని ఆయనను చూసిన వారు చెప్పారు. ఉద్యమం ప్రారంభమైన తరువాత ఆయన తక్కువగానే కనిపించినా ఏనాడూ కాషాయ వస్త్రాలతో కనిపించలేదు. ఖద్దరు ఖాకీ నిక్కరు, తెల్లటి ఖద్దరు చొక్కా ధరించి ఉండేవాడు. సహచరులు కూడా అంతే. లేదా ఎర్ర నిక్కరు ధరించేవాడు. అన్నవరం వచ్చినపుడు ఆయనతో మాట్లాడిన చెరుకూరి నరసింహమూర్తి కూడా ఆయనను ఖాకీ నిక్కరు, తెల్లటి ఖద్దరు చొక్కాలోనే చూసినట్టు చెప్పారు. అలాగే రామరాజు భోజనం చేసేవారు కాదు. పాలు, పళ్లే తీసుకునేవారు. ఇది చిటికెల భాస్కరనాయుడిగారి కుటుంబీకులు, వారి పెద్ద కుమార్తె సత్యనారాయణమ్మ చెప్పిన సంగతి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మైదానాలలో జరిగిన పోరాటంలో భారత జాతీ య కాంగ్రెస్‌తో పాటు, వందల సంస్థలు త్యాగాలు చేశాయి. ఆ త్యాగాలకు దీటుగా స్వేచ్ఛ కోసం కొండకోనలు కూడా ప్రతిధ్వనించాయి. నిజానికి రైతాంగ పోరాటాలూ, గిరిజనోద్యమాలూ భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించడానికి (1885) నూట ఇరవయ్యేళ్లకు ముందే ప్రజ్వరిల్లాయి. చౌర్స్ (బెంగాల్ వనసీమలలో, 1768), ఖాసీలు (అస్సాం,1835), కోలీలు (గుజరాత్, మరాఠా కొండలలో, 1824-48); ఆ తర్వాత ఖోందులు (ఒరిస్సా), సంథాలులు (బీహార్), ముండాలు (1899-1900), భిల్లులు (రాజస్థాన్, 1913), కుకీలు(మణిపూర్, 1919), చెంచుల (నల్లమల అడవులు, 1921) ప్రతిఘటనలు ఇందుకు కొన్ని ఉదాహరణలు. ఆ తరువాత జరిగినదే అల్లూరి ఉద్యమం (1922-24). వీరుడి పుట్టుక సీతారామరాజుగా మనందరం పిలుచుకుంటున్న ఆ చరిత్రపురుషుడి పేరు నిజానికి శ్రీరామరాజు. విశాఖ జిల్లా పాండ్రంగిలో అమ్మమ్మగారి ఇంట పుట్టిన రామరాజు (జూలై 4, 1897) మైదాన ప్రాంతాల నుంచి కొండ కోనలకు వెళ్లి చరిత్ర మరచిపోలేని ఒక గిరిజనోద్యమాన్ని నిర్మించడం గొప్ప వైచిత్రి. తొలి సంతానం కాబట్టి తల్లి సూర్యనారాయణమ్మ, తండ్రి వెంకటరామరాజు ‘చిట్టిబాబు’ అని పిలుచుకునేవారు. తరువాత సొంత ఊరు మోగల్లు (ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా, అప్పుడు కృష్ణా జిల్లా) నుంచి అదే జిల్లాలో తణుకు, అక్కడ నుంచి రాజమహేంద్రవరం ఆ కుటుంబం తరలిపోయింది. కారణం- వెంకటరామరాజు ఫోటోగ్రాఫర్. శ్రీరామరాజుకు తొమ్మిదేళ్ల వయసు వచ్చి, కొంచెం బయటి ప్రపంచం తెలుస్తున్న కాలంలో అతడు చూసినది ‘వందేమాతరం’ ఉద్యమ ఆవేశాన్నే. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా మొదలయిన ఆ ఉద్యమం గురించి ప్రచారం చేయడానికి 1907 లో బిపిన్‌చంద్రపాల్ రాజమండ్రి వచ్చారు. బిపిన్‌పాల్‌తో పాటు అదే వేదిక మీద నుంచి ముట్నూరి కృష్ణారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వంటివారు ఇచ్చిన ఉపన్యాసాలు రాజమండ్రి, కాకినాడ, చుట్టుపక్కల ప్రాంతాలను జాతీయావేశంతో నింపివేశాయి. భారతీయులలో తొలిసారి సమష్టి రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చిన ఘనత కూడా వందేమాతరం ఉద్యమానిదే. ఈ చారిత్రక దృశ్య మాలికను కొడుకు కళ్లకు కట్టిన ఆ ఫోటోగ్రాఫర్ 1908లో హఠాత్తుగా కన్నుమూశాడు. అక్కడ నుంచి శ్రీరామరాజుకు కష్టాలు మొదలయ్యాయి. రామచంద్రపురం, రాజమండ్రి, కాకినాడ, నరసాపురం టైలర్ హైస్కూలు, విశాఖపట్నం వంటి చోట ఆయన చదువు సాగింది. తర్వాత ఈ చదువులూ, ఉద్యోగాల గొడవ నుంచి దూరం వెళ్లిపోయాడు శ్రీరామరాజు. ఉత్తర భారతం, బెంగాల్, హిమాలయాలు చూశాడు. అక్కడ నుంచి నేరుగా విశాఖ మన్యంలో ఉన్న కృష్ణదేవిపేటకు వచ్చాడు. ఆ యాత్రలో ఆయన భారతదేశంలో చూసిన వాతావరణం, వందేమాతరం ఉద్యమం సమయంలో రాజమండ్రిలో కనిపించిన ఆవేశానికంటె ఎంతో తీక్షణమైనది. మొదటి ప్రపంచ యుద్ధం వేసిన బాట ఇప్పటికి సరిగ్గా వందేళ్ల క్రితం ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధం పుణ్యమా అని ప్రపంచ దేశాలతో పాటు, బ్రిటిష్ వలస భారత్ కూడా ఆర్థికంగా కుంగిపోయింది. కరవుకాటకాల జాడలు మొదలయినాయి. ఆకలి చావుల నుంచి జనాన్ని తప్పించడానికి అన్నిచోట్ల పనికి ఆహారం పథకం రీతిలో పనులు చేపట్టారు. విశాఖ మన్యానికి సింహద్వారం వంటి నర్సీపట్నం నుంచి లంబసింగి (చింతపల్లి కొండ మార్గంలో) వరకు తలపెట్టిన రోడ్డు నిర్మాణం ఆ ఉద్దేశంతో ఆరంభించినదే. ఈ పనినే గూడెం డిప్యూటీ తహశీల్దార్ బాస్టియన్ బినామీ పేరుతో తీసుకుని, నామమాత్రపు కూలితో మన్యవాసులతో పనిచేయిస్తూ, వేధించడం మొదలుపెట్టాడు. అటవీ చట్టాలను అడ్డం పెట్టుకుని కొన్ని దశాబ్దాలుగా నిత్యం సాగుతున్న హింసకు ఇది అదనం. తగులబడిపోతున్న అడవులను ప్రాణాలకు తెగించి, ఎలాంటి ప్రతిఫలం లేకుండా చల్లార్చడం, పోలీసులు, అటవీ సిబ్బంది దోపిడీని మౌనంగా చూడడం గిరిజనుడికి అలవాటైపోయిన హింస. చట్టాల పేర అడవుల నుంచి దూరంగా ఉంచడం వల్ల ఆకలి బాధ మరొకటి. ఈ బాధల నుంచి విముక్తం కావాలని మన్యవాసులు కోరుకుంటున్నకాలమది. పైగా కొద్దినెలల క్రితమే ఒక తాటాకు మంటలా భగ్గుమని చల్లారిపోయిన గరిమల్ల మంగడి తిరుగుబాటు రేపిన కల్లోలం ఇంకా చల్లారలేదు. నిజానికి మన్యానికి తిరుగుబాట్లు కొత్తకాదు. 1879-80లో జరిగిన తిరుగుబాటు మొదటి ‘రంప తిరుగుబాటు’గా ప్రసిద్ధి గాంచింది. తరువాత పది వరకు అలాంటి తిరుగుబాట్లు జరిగాయని చెబుతారు. చివరిది, రెండవ రంప ఉద్యమంగా పేరు పొందినది రామరాజు నాయకత్వంలో నడిచినదే. అంటే మన్యవాసులకు పోరాటమంటే ఏమిటో బోధించనక్కరలేదు. వ్యూహాల గురించి పాఠాలు అవసరం లేదు. కావలసినది నాయకత్వం. నాయకుడి ఆగమనం ఉత్తర భారత యాత్రను ముగించుకుని జూలై 24, 1917న శ్రీరామరాజు నేరుగా విశాఖ మన్యానికి నడిబొడ్డున ఉన్న కృష్ణదేవిపేటకు వచ్చాడు. అక్కడ ఆయనను చేరదీసిన చిటికెల భాస్కరనాయుడి కుటుంబానికి చెప్పిన వివరాల ప్రకారం, తపస్సుకు అనువైన స్థలం కోసం అన్వేషిస్తూ ఆ ప్రదేశానికి వచ్చాడాయన. తెల్లటి లుంగీ, పై కండువాతో, చేతిలో చిన్న సంచి, అందులో రెండు గ్రంథాలతో మాత్రమే రామరాజు ఆ ఊరు వచ్చాడు. అతడొక యతి అన్న భావంతో చిటికెల వారి కుటుంబం ఆదరించింది. భాస్కరనాయుడి తల్లి సోమాలమ్మ రామరాజు ఇంటికి ఉత్తరం రాయించి, మళ్లీ కుటుంబాన్ని కలిపింది. వీరి కోసం ఊరి చివర తాండవ నది ఒడ్డున శ్రీవిజయరామ నగరం అనే చిన్న వాడను స్థాపించారు గ్రామస్థులు. అక్కడే గాం గంటం దొర, మల్లుదొర, ఇతర గిరిజన నేతలు ఆయనను కలిసేవారు. వీరంతా మునసబులు, ముఠాదారులు. అంటే మన్యం గ్రామాల, గ్రామాల సమూహాల అధికారులు. మొత్తంగా అటవీ చట్టాల బాధితులు. ఉద్యమానికి శ్రీకారం ఆగస్టు 22, 1922న శ్రీరామరాజు చింతపల్లి పోలీసు స్టేషన్ మీద దాడి చేసి, ఆయుధాలు తీసుకుని వెళ్లాడు. నిజానికి ఆయన 1917లోనే మన్యానికి వచ్చాడు. మధ్యలో ఆ ఐదేళ్లు ఆయనేం చేశాడు? మొదట ప్రజలకు దగ్గరయ్యాడు. తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు. మంచీచెడ్డా చెప్పాడు. పంచాయతీలు పెట్టి కోర్టులను బహిష్కరించేటట్టు చేశాడు. వేసవి వస్తే రాత్రీపగలూ లేకుండా జీలుగు కల్లు తాగి ఆ తోటలకే పరిమితమయ్యే గిరిజనాన్ని సంస్కరించాడు. దీనితో ప్రభుత్వం ‘నాన్ కో ఆపరేటర్’ ముద్ర వేసి అరెస్టు చేసి, నర్సీపట్నం జైలులో రెండో నెంబర్ సెల్లో నిర్బంధించింది. అడ్డతీగల దగ్గర పైడిపుట్టలోనే ఉండాలని ఆదేశించింది. ఇవన్నీ అధిగమించి గిరిజనాన్ని కూడగట్టి ఉద్యమించగలిగాడు. ఉద్యమ గమనం చింతపల్లి పోలీసు స్టేషన్ మీద దాడి చేసిన మరునాడే కృష్ణదేవిపేట మీద శ్రీరామరాజు దళం దాడి చేసింది. ఆ వెంటనే రాజవొమ్మంగి పోలీసు స్టేషన్ మీద దాడి చేసింది. 1922 నుంచి 24 వరకు జరిగిన ఈ ఉద్యమం భారతీయ గిరిజనోద్యమాలలో సుదీర్ఘమైనది. కానీ 1923కు ఉద్యమం కొంచెం బలహీనపడి, రకరకాల వదంతులు వ్యాపించాయి. రాజు దళం రంగూన్ పారిపోతోందన్నది అందులో ఒకటి. వెంటనే కొండదళం సభ్యుల తలలకు వెలలు ప్రకటించింది ప్రభుత్వం. అయితే హఠాత్తుగా రామరాజు ఏప్రిల్ 12, 1923న అన్నవరం కొండ మీద కనిపించి పోలీసులను నివ్వెరపరిచాడు. అప్పుడే చెరుకూరి నరసింహమూర్తి అనే ఆయనకు తన ఉద్దేశాలు వెల్లడించాడు. మరోవైపు దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఆందోళన, పోలీసులూ, సైనికుల కవాతులు మన్యాన్ని అతలాకుతలం చేశాయి. పంటలు లేవు. అంతా నిర్బంధం. ఈ పరిస్థితులలో కొందరు నాయకులను స్థానికులే పట్టి ఇచ్చేశారు. అయినా భారతీయులను ఎవరినీ చంపరాదంటూ ఉద్యమ కారులకు తను విధించిన షరతును సడలించడానికి రామరాజు అంగీకరించలేదు. 1924 మే మాసంలో రేవుల కంఠారం అనేచోట జరిగిన ఉద్యమకారుల సమావేశంలో ఈ విషయమే చర్చనీయాంశమైంది. ఆ షరతును పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఉద్యమకారులు కోరినా రామరాజు అంగీకరించలేదు. ఉద్యమకారులు జరిపిన ఆఖరి సమావేశం అదే. 1. కృష్ణదేవిపేటలో తాండవ నది ఒడ్డున అల్లూరి అర్చించిన నీలకంఠేశ్వరుడు. 2. కృష్ణదేవిపేటలో అల్లూరిని దహనం చేసిన చోట నిర్మించిన స్మారక మందిరం. 3. అల్లూరి పట్టుపడిన మంపలో నిర్మించిన స్మారక స్థూపం. భీమవరం (పగో జిల్లా) సమీపంలోని కుముదవల్లి ఆయన స్వగ్రామం. అగ్గిరాజు పేరుతో ఆయన ఉద్యమంలో పని చేశాడు. ఆయనను చాలాకాలం ప్రభుత్వ గూఢచారి అనుకున్నారు. నిర్బంధం ఎక్కువైన తరువాత అతడు హఠాత్తుగా మాయమైపోవడమే దీనికి కారణం. తరువాత ఈ విషయం గురించి ఎన్జీ రంగా ఉమ్మడి మద్రాసు శాసనసభలో ప్రశ్న వేశారు. అప్పుడే అసలు విషయం తెలిసింది. ఆయనను పోలీసులు పట్టుకుని అండమాన్ జైలుకు తరలించారు. ఆయన అక్కడే విష జ్వరంతో చనిపోయాడు. అది అప్పటి దాకా గుప్తంగానే ఉండిపోయింది. అల్లూరి శ్రీరామరాజు కొద్దికాలం పాటు చదువు సాగించిన టైలర్ హైస్కూలు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ట గోదావరి ఒడ్డునే ఈ పాఠశాల ఉంది. ఇప్పటికీ విద్యను అందిస్తున్నది. దామనపల్లి ఘటన దామనపల్లి ఘటనకు (సెప్టెంబర్ 24, 1922) విశాఖ మన్య పోరాటంలోనే కాదు, భారత స్వాతంత్య్రోద్య చరిత్రలోనే స్థానం ఉండాలి. దామనపల్లి ఒక ఘాట్ మార్గం. ఒక పక్క లోతుగెడ్డ వాగు. మరో పక్క కొండ. మధ్యలో సన్నటి దారి. ఇక్కడికి రామరాజు దళం వస్తున్నదని పోలీసులకు సమాచారం అందింది. అది నిజమే కూడా. దీనితో స్కాట్ కవర్ట్, నెవైలి హైటర్ అనే ఇద్దరు సైనికాధికారుల నాయకత్వంలో పోలీసు బలగాలు అక్కడకు చేరాయి. కానీ రామరాజుకు మన్యమంతటా వేగులు ఉండేవారు. దామనపల్లి గ్రామ మునసబు తమ్ముడు కుందేరి బొర్రంనాయుడు పోలీసులు మోహరించి ఉన్న సంగతిని రామరాజు దళానికి చేరవేశాడు. రామరాజు వ్యూహం ప్రకారం తన దళంతో ఎండుపడాలు చేరువనే ఉన్న సరమండ ఘాటీ దిగువన మాటు వేశాడు. గంటం కొందరు సభ్యులతో దామనపల్లి ఘాటీ సమీపంలోనే కుంకుడుచెట్ల తోపులో కాపు వేశాడు. మల్లుదొర ఇంకొందరు కలసి దిబ్బలపాడు అనేచోట నక్కి ఉన్నారు. బ్రిటిష్ పటాలం నాలుగు అంచెలుగా కదులుతోంది. అప్పటికే భారతీయులే రక్షణ కవచంగా ఇంగ్లిష్ అధికారులు వ్యూహాలు పన్నుతున్నారు. మొదటి వరసలో యాభయ్ మందితో ఒక అడ్వాన్సు పార్టీ ఉంది. తరువాత నల్ల సోల్జర్ల దళం. ఆ వెనుక భద్రంగా కవర్ట్, హైటర్ నడుస్తున్నారు. వీరి వెనుక మరో పోలీసు దళం. మొత్తం మూడు వందల మంది. పది మైళ్ల కాలిబాట అది. ఒక బిందువు దగ్గరకు వచ్చే సరికి హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. ఎటూ పాలుపోలేదు పోలీసులకి. అటు పర్వతం, ఇటు వాగు. వెనుక నుంచీ, ముందు నుంచీ కాల్పులు. మొదటి రెండు రౌండ్లలో ఒకటి వచ్చి కవర్ట్ కణతలో దూసుకుపోయింది. రామరాజు అనుచరులు రామరాజు వెంట నడిచిన వారంతా గిరిజనులే. గాం గంటం దొర(బట్టిపనుకుల), అతడి తమ్ముడు మల్లు, కంకిపాటి ఎండు పడాలు(పదల), గోకిరి ఎర్రేసు(గసర్లపాలెం), బొంకుల మోదిగాడు(చింతలపూడి), మొట్టడం బుడ్డయ్యదొర (కొయ్యూరు), సంకోజు ముక్కడు (సింగన పల్లి) వంటివారు సేనానులుగా వ్యవహరించారు. మొత్తం 276 మందిని విశాఖలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రిబ్యునల్‌లో విచారించారు. ఇందులో ఎర్రేసు గొప్పవిలుకాడు. అగ్గిరాజు అనే పేరిచర్ల సూర్యనారాయణరాజు కూడా రామరాజు వెంట నడిచినా ఆయన గిరిజనుడు కాదు. మరో తూటా హైటర్ భుజంలోకి దూసుకుపోయింది. ఇద్దరూ వాగులో పడిపోయారు. శవాలై తేలారు. వీరిని కాపాడాలని విశ్వ ప్రయత్నం చేసిన మరో ఇద్దరు భారతీయులు చనిపోయారు. నిజానికి ఆ ఘాట్ రోడ్డులో ఆ క్షణంలో రాజు దళం కాల్చడం మొదలు పెడితే ఏ ఒక్కరూ మిగిలేవారు కాదు. కానీ రాజు ఆ పని చేయలేదు. కవర్ట్, హైటర్ ఇద్దరూ మొదటి ప్రపంచ యుద్ధంలో ఐరెన్ క్రాస్ సంపాదించిన సైనికులు. ఈ ఇద్దరినీ కాల్చి చంపిన వాడు గోకిరి ఎర్రేసేనని చెబుతారు. కవర్ట్, హైటర్ సమాధులు నర్సీపట్నంలో ఇప్పటికీ ఉన్నాయి. వాటి మీద వివరాలు కూడా ఉన్నాయి. ఆగస్టు 26, 1922న ఏజెన్సీ కమిషనర్ స్టీవర్ట్ మద్రాసు ప్రెసిడెన్సీ ప్రధాన కార్యదర్శి గ్రాహమ్‌కు దామనపల్లి ఉదంతం మీద ప్రత్యేక నివేదికనే పంపాడు. కొందరు అసంతృప్తితో వె ళ్లిపోయారు. మే6, 1924 రాత్రికి రామరాజు ఒక్కడే కొత్త రేవళ్ల గ్రామం మీదుగా మంప అనే కుగ్రామం చేరుకున్నాడు. అక్కడే జొన్న చేలో మంచె మీద పడుకున్నాడు. వేకువనే స్నానం కోసం అక్కడే ఉన్న చిన్న కుంటలో స్నానం చేస్తుండగా పట్టుబడ్డాడు. ఆ నీటి కుంటకు కొంత దూరంలోనే దట్టమైన చింతలతోపు ఉంది. అక్కడే ఈస్ట్‌కోస్ట్ దళానికి చెందిన జమేదార్ కంచుమేనన్, ఇంటిలిజెన్స్ పెట్రోలింగ్ సబిన్స్పెక్టర్ ఆళ్వారునాయుడు వచ్చి బంధించారు. ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. రూధర్ఫర్డ్ ఆదేశం మేరకు, కృష్ణదేవిపేటకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఒక నులక మంచం తెప్పించి దానికి రామరాజును బంధించి కొయ్యూరు మీదుగా కృష్ణదేవిపేటకు తీసుకుపోతుండగా మధ్యలో అస్సాం రైఫిల్స్ అధిపతి గూడాల్ ఆపి విచారణ పేరుతో తీసుకుపోయి కాల్చి చంపాడు. తరువాత శవాన్ని కృష్ణదేవిపేటకు తీసుకువెళ్లి తాండవ ఒడ్డున దహనం చేశారు. రామరాజు మరణించిన తరువాత కూడా కొద్దికాలం ఉద్యమం సాగింది. ఒక్కొక్కరుగా దొరికిపోయారు. జూన్ 7, 1924న పెద్దవలస సమీపంలో ఎద్దుమామిడి-శింగధారల దగ్గర ఆరేడుగురు సహచరులతో కనిపించిన గాం గంటం దొరను కాల్చి చంపారు. దీనితో ఉద్యమానికి తెర పడినట్టయింది. - డా॥గోపరాజు నారాయణరావు -
‘జోకరు’గా మారిన యువరాజు
తొమ్మిదోసారి ఎంపీగా ఎన్నికైన కమలనాథ్ వ్యాఖ్య మరీ చిత్రం. ఈ ఓటమికి రాహుల్‌ను, సోనియాను బాధ్యులను చేస్తే రౌరవాది నరకాలూ పట్టి పోతారన్నట్టు మాట్లాడారాయన. ఎందుకంటే, ఆ ఇద్దరూ కూడా యూపీఏ-2లో సభ్యులు కారట. రాజును మించిన రాజభక్తి పరాయణులకు ఘనత వహిం చిన భారత జాతీయ కాంగ్రెస్‌లో లోటు లేదు. మొన్న జరి గిన సాధారణ ఎన్నికలలో ఎంతో పొదుపుగా 44 లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలిచినా అధిష్టానం మీద పల్లెత్తు మాట పడనివ్వకుండా కాపాడుతున్న విధేయుల దండును చూస్తే ఇదే అనిపిస్తుంది. ఈ ఓటమికి కడుపు మండి కొంద రు అధిష్టానం మీద విమర్శలు సంధించారు. తిరుగుబాటుదారులంతా ముక్తకంఠంతో చెబుతున్న మాట - రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీకి భారంగా మారిపోయారు. ఇక, విధేయులు చెబుతున్న మాటలలో, రాహుల్ పార్టీకి భారమే కావచ్చు, అయినా మోయక తప్పదన్న ధ్వనే ఉంది. కేరళలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలనే సాధించింది. అక్కడ 20 లోక్‌సభ స్థానాలకు, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమి 12 స్థానాలు కైవసం చేసుకుంది. కానీ రాహుల్, సోనియాలు కుదేలైపోయే రీతిలో ఆ రాష్ట్ర కాం గ్రెస్ పార్టీ శాఖ నుంచే తీవ్ర వ్యాఖ్య వచ్చింది. టీహెచ్ ము స్తాఫా అనే సీనియర్ నాయకుడు రాహుల్‌ను ‘జోకర్’ అని అభివర్ణించి సంచలనం సృష్టించారు. కరుణాకరన్ మంత్రివర్గ సభ్యుడైన ముస్తాఫా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అపజయానికి కారణం రాహుల్ గాంధీయేనని కుండబద్దలు కొట్టారు. ‘ఆయన (రాహుల్) పార్టీకి రాజీనామా చేసి తీరాలి. ఆయన ఇంక ఎంతమాత్రం కొనసాగడానికి వీల్లేదు. ఆయనకు ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేయకుంటే, తొలగించాల్సిందే. ఆయన ఒక జోకర్లా (ఎన్నికల ప్రచారంలో) ప్రవర్తించారు. ఇలాంటి ప్రవర్తన ఎన్నికలలో విజయానికి ఉపకరించదు’ అని ముస్తాఫా వివరించారు. ఇక ఒక్క స్థానం కూ డా గెలుచుకోని రాష్ట్రానికి చెందిన నేతలకు ఇంకెంత కడుపు మంట ఉండాలి? ఈ ప్రశ్నకు సమాధానం రాజస్థాన్ నుంచి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యుడు భన్వర్‌లాల్ శర్మ ఇంకో అడుగు ముందుకు వేసి, ‘ఆయన చుట్టూ ఉన్నవాళ్లంతా జోకర్లే. ఆ జోకర్ల బృందానికి రాహుల్ ఎండీ’ అని ఇంకాస్త తీవ్రమైన విసురు విసిరారు. ఆ ఇద్దరినీ ఆలస్యం లేకుండా బయటకు పంపారు. కానీ ఈ వ్యాఖ్యలకు పార్టీలో మేధావి ముద్రాంకితుడు మణిశంకర్ అయ్యర్ ఇచ్చిన వివరణ నిజంగా రాహుల్కీ, సోనియాకీ మద్దతుగా ఇచ్చినదా? లేక, పార్టీ ఓడితే అందుకు బాధ్యత వహించడం, పదవులకు రాజీనామా చేయడం వంటి సత్సం ప్రదాయాలు ఈ పార్టీకి ఎప్పుడున్నాయి గనక? అని ఎత్తి పొ డవడానికా అన్నట్టే ఉంది. ‘ఇందిర, రాజీవ్, పీవీ హయాం లలో కూడా పార్టీ ఓడిపోయింది. అప్పుడు నాయకత్వ మా ర్పు ్రపశ్నే రాలేదు’ అన్నారాయన. తొమ్మిదోసారి ఎంపీగా ఎన్నికైన కమలనాథ్ వ్యాఖ్య మరీ చిత్రం. ఈ ఓటమికి రా హుల్‌ను, సోనియాను బాధ్యులను చేస్తే రౌరవాది నరకాలూ పట్టి పోతారన్నట్టు మాట్లాడారాయన. ఎందుకంటే, ఆ ఇద్ద రూ కూడా యూపీఏ-2లో సభ్యులు కారట. అంటే ఓటమికి బాధ్యతంతా మన్మోహన్సింగ్ నెత్తిన పెట్టా రు కమలనాథ్. ముస్తాఫా, భన్వర్లాల్ల వ్యాఖ్య కాస్త కటువుగానే ఉం ది. కానీ ఇదే విషయాన్ని చాలా సున్నితంగా, సుతిమెత్తగా చెప్పిన నాయకులూ ఆ పార్టీలోనే ఉన్నారు. మన రాష్ట్రానికి చెందిన కిశోర్‌చంద్రదేవ్, మహారాష్ట్రకు చెందిన మిలింద్ దేవ్రా, ప్రియాదత్ రాహుల్ నాయకత్వ లోపం గురించి హుందాగా వ్యాఖ్యానించారు. నిజానికి ఇది చాలామంది కాంగ్రెస్ నేతల మనసులలో దాగి ఉన్న అభిప్రాయమే. కాంగ్రెస్ ఓటమి నుంచి అధిష్టానం గుణపాఠం నేర్చుకోవాలని కిశోర్‌చంద్ర అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రాహుల్ చేసిన ప్రయోగాలు, సంస్కరణలు ఎదురు తిరిగాయన్న విషయాన్ని కూడా ఆయన అంగీకరించక తప్పలేదు. యువనేత అంటూ కాంగ్రెస్ రాహుల్‌ను ఆకాశానికెత్తిం ది. కానీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేకపోయింది. ఆయన యువనేత పాత్రను కూడా నిర్వహించలేకపోయారు. భారతదేశ యువత రాహుల్‌ను తిరస్కరించిందని ప్యాట్రిక్ ఫ్రెంచ్ (ప్రఖ్యాత చరిత్రకారుడు. లిబర్టీ ఆర్ డెత్: ఇండియాస్ జర్నీ టు ఇండిపెండెన్స్ అండ్ డివిజన్; ది వరల్డ్ ఈజ్ వాట్ ఇటీజ్ అండ్ ఇండియా: ఏ పోర్ట్రెయిట్ పుస్తకాల రచయిత) వ్యాఖ్యానించడం విశేషం. 18-22 వయస్కులైన వారంతా మోడీవైపే మొగ్గారు. మా కుటుంబం అధికారంలో ఉండి ఉంటే, అయోధ్యలో మసీదు కూలేదికాదని రాహుల్ వ్యాఖ్యానించినపుడే ఆయన పార్టీకి ఎంత భారంగా మారిపోయారో గుర్తించి ఉండవలసింది. రాహుల్ కాంగ్రెస్ పార్టీ గౌరవం కంటె, ఆ పార్టీ నుంచి ఎన్నికైన ప్రధానుల మర్యాద కంటె తన కుటుంబాన్నే మిన్నగా చూస్తున్నారు. ఇలాంటి వ్యక్తి పార్టీకి భారం కాక, నడిపించగల నేత ఎలా అవుతారు? డాక్టర్ గోపరాజు నారాయణరావు -
మరో మొహెంజొదారో ప్రయోగాలకు నాంది
50 ఏళ్ళ నాటకం: తెలుగు నాటకాన్ని ప్రయోగ ధోరణి వైపు వడిగా అడుగులేయించిన నాటకం ‘మరో మొహెంజొదారో’. ఇది ప్రయోగాత్మకంతో పాటు ‘ప్రయోజనాత్మక’ నాటకం కూడా అని ఆ రోజులలో ఒక పత్రిక రాసిందట. నిజమే. జోడుగుళ్లు ఒకేసారి పేల్చినట్టు రచయిత ఎన్ఆర్ నంది ఈ నాటకంలో ఒకేసారి రెంటినీ సాధించారు. 1964లో మొదటి ప్రదర్శన నోచుకున్న సందర్భంగా... ‘మరో మొహెంజొదారో’ను ఆచార్య ఆత్రేయకు అంకితమిచ్చారు నంది. మన సాంఘిక నాటకానికి కొత్త దృష్టిని ఇచ్చినవాడు ఆయనే. ఆత్రేయ రాసిన ‘ఎవరు దొంగ’ అన్న నాటికలో ఒక పాత్ర ప్రేక్షకుల మధ్య నుంచి రంగస్థలం మీదకు వెళుతుంది- ప్రశ్నిస్తూ. రెండవ ప్రపంచ యుద్ధానంతర దారుణ దృశ్యాలతో ఆయన రాసిన ‘విశ్వశాంతి’ నాటకంలో అంతర్నాటకంతో పాటు, నీడలతో కథను నడపడం వంటి కొత్త పోకడలు కొన్ని కనిపిస్తాయి. ఇలాంటి ఆధునిక దృష్టికే నంది ‘మరో మొహెంజొదారో’లో పట్టం కట్టారు. ఈ నాటకం మీద కొందరు చేసిన వ్యాఖ్యలు నందిని ఎంత బాధించాయో ముందుమాట చదివితే తెలుస్తుంది. కానీ నాటకం చదివిన తరువాత ఆ వ్యాఖ్యలు చేసినవారు అర్థం కాక చేసి ఉండాలి, లేదా కొత్తదనాన్ని స్వాగతించడానికి సిద్ధంగా లేనివారెవరో చేసి ఉంటారని అనిపిస్తుంది. ఇది యాభయ్ సంవత్సరాల క్రితం రాసిన నాటకం. కానీ ఇప్పుడు చదువుకున్నా ఆ అనుభూతి తాజాగానే ఉంటుంది. నంది తీసుకున్న ఇతివృత్తం సార్వకాలికమైనది. మనుషులలోనే కనిపించే దోపిడీ తత్వం, అలాంటి అవ్యవస్థను నిర్మూలించడానికి మళ్లీ మనిషి పడే తపన ఇందులో చిత్రించారాయన. చారిత్రక దృష్టి, తాత్విక చింతనలతో గాఢంగా ముడిపడి ఉన్న అంశమిది. వీటి వల్ల సాధారణంగా నాటక ప్రక్రియకు ఏ మాత్రం సరిపడని ఉపన్యాస ధోరణి చొరబడుతుంది. నాటకానికి ప్రయోక్త పాత్రను కూడా నిర్వహించిన ‘శాస్త్రజ్ఞుడు/ప్రొఫెసర్’ పాత్రలో కనిపించేది ఈ ధోరణే. ఇంత సుదీర్ఘమైన చరిత్రను చూస్తుంటే చరిత్ర నుంచి మనిషి ఏమీ నేర్చుకోలేదని అనిపిస్తుంది అంటాడొక చరిత్ర తత్వవేత్త. ఇందులో శాస్త్రజ్ఞుడు కూడా ప్రకృతితో సమరం చేసిన మనిషి నాగరిక సమాజాన్ని రూపొందిస్తున్నానని అనుకుంటూనే అనేక తప్పులు చేశాడు అంటాడు. వాటిని సరి చేయడానికి మళ్లీ ఎన్నో సమరాలు, విప్లవాలు అవసరమయ్యాయని గుర్తు చేస్తాడు. రకరకాల సిద్ధాంతాలు పుట్టుకొచ్చి నది ఆ క్రమంలోనే అంటాడు. ఈ సంఘర్షణలోనే నాగరికతలు పుట్టాయి, గిట్టాయి అన్నదే ఆ ప్రొఫెసర్ సిద్ధాంతం. ఇలాంటి ఉపన్యాస ధోరణిని తన ఇతివృత్తాన్ని ఆవిష్కరిం చడానికి చక్కగా ఉపయోగించుకోవడంలోనే నంది నే ర్పరితనం కనిపిస్తుంది. ఇక్కడ శ్రీశ్రీ ‘దేశ చరిత్రలు’ కవితలో పంక్తులను రచయిత విరివిగా ఉపయోగించు కున్నారు. ఇవన్నీ కలసి మంచి ప్రయోగాత్మక నాటకాన్ని తెలుగు వాళ్లకి అందించాయి. తన ప్రయోగశాలలోని కొన్ని పరిశోధక గ్రంథాలను శాస్త్రజ్ఞుడు మనకు పరిచయం చేయడం దగ్గర నాటకం ఆరంభమవుతుంది. నిజానికి ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క జీవితం. ఒక్కొక్క వర్గానికి ప్రాతినిధ్యం వహించే జీవితమది. పాత్రల పేర్లు కూడా ఆయా వర్గాలనే ప్రతిబింబిస్తుంటాయి. అవి- భిక్షాలు (పేద), పరంధామయ్య (మధ్య తరగతి), భూషణ్(తిరుగుబాటు ధోరణి), కోటీశ్వరయ్య (ధనికుడు), లాయర్, డాక్టర్ (చదువుకున్న వర్గం), తులసి (బలి పశువు). పేదవాడు మరింత పేదవాడు అవుతుంటే, ధనికుడు మరింత ధనవంతుడవుతున్నాడని ప్రొఫెసర్ ప్రకటించి భిక్షాలును పలకరిస్తాడు. భిక్షాలు ఇప్పుడు కూలి. కానీ అతడి తండ్రి రైతు. ఈ పరిణామం ఏం మారింది? ఇలా ఒక్కొక్క పాత్రను మొదట పరిచయం చేసి నెమ్మదిగా ప్రొఫెసర్ వేదికను అసలు పాత్రలకు విడిచి పెడతాడు. కానీ ఇన్ని సిద్ధాంతాలు ఎందుకు పుట్టుకు రావలసి వచ్చిందో భూషణ్ పాత్ర ద్వారా చాలా చక్కగా ఆవిష్కరించారు నంది. మార్పును కోరే విప్లవకారులు ఎన్నయినా చెప్పవచ్చు. కానీ వాళ్ల అభ్యుదయం మాటున ఎక్కడో ఒకింత పిడివాదం దాగి ఉందన్న విషయాన్ని కూడా రచయిత విడిచి పెట్టలేదు. మధ్య తరగతిలో ఉండే అవకాశవాద ధోరణిని పరంధామయ్యలో చూస్తుంటే జాలి కలుగుతుంది. చివరికి భూషణ్ లేవదీసిన విప్లవానికి వెన్నుపోటు పొడిచేది కూడా ఇతడే. కానీ కోటీశ్వరయ్య చ నిపోయేది కూడా ఇతడి చేతులోనే. నిజానికి ఇది 1963 ప్రాంతంలో వచ్చిన రచన. తొలి ప్రదర్శన అనంతపురంలో 1964లో జరిగింది. మరో మొహెంజొదారో అంటే మరో మట్టి దిబ్బ. గొప్ప నాగరికత అవశేషం. ఆ సమాజం వరదలతోనో, మరో ఉత్పాతంతోనో ధ్వంసమైంది. ఇప్పటి సమాజం కూడా అనేక తప్పిదాలతో మరో మొహెంజొదారోను పునరావృతం చేయడానికి తొందరపడుతోందంటూ రచయిత చేసిన హెచ్చరికే ఈ నాటకం. ప్రయోగ దృష్టి నంది తరువాత వచ్చిన నాటకకర్తలలో కూడా కనిపిస్తుంది. ఆశ ఖరీదు అణా (గోరా శాస్త్రి), రాజీవం (కేవీఆర్, వేణు), మళ్లీ మధుమాసం (గణేశ్‌పాత్రో), త్రిజాకీ యమదర్శనం (అబ్బూరి గోపాలకృష్ణ), కుక్క (యండమూరి), ఓ బూతు నాటకం (ఇసుకపల్లి మోహనరావు), కొక్కొరోకో, గార్దభాండం (తనికెళ్ల భరణి), పెద్ద బాలశిక్ష (ఆకెళ్ల), పడమటిగాలి (పాటిబండ్ల ఆనందరావు) వంటి వాటిలో ప్రశంసనీయమైన ప్రయోగధోరణులు కనిపిస్తాయి. - గోపరాజు నారాయణరావు -
ఆ గారడీ నిండా గుండె తడి
మేజిక్ రియలిజమ్ శైలిని సయితం తన ఇంటిలోనే కనుగొన్నాడాయన. బాల్యంలో అమ్మమ్మ చెప్పిన జానపద, కాల్పనిక కథల ద్వారా దానిని సాధించాడు. కొలంబియా రాజకీయ వాస్తవికతలను జానపద పాత్రలతో, మార్మికమైన తీరులో మార్క్వెజ్ అక్షరబద్ధం చేశాడు. లాటిన్ అమెరికా కరీబియన్ సాగర తీరా ల సొగసులనీ, ఆ జాతి ప్రజల పగలనీ, ఉద్వేగాలనీ రంగరించి ఆ ప్రాంతం గాథని అక్షరబద్ధం చేసినవాడు గాబ్రియెల్ గార్షి యా మార్క్వెజ్ (మార్చి 6, 1927-ఏప్రిల్ 17, 2014). మేజిక్ రియలిజమ్తో ప్రపంచ సాహితీ లోకాన్ని మైమరపించిన మార్క్వెజ్ స్పానిష్ భాషకు అసాధారణ గౌరవం తెచ్చి పెట్టాడు. పుక్కిట పురాణగాథలూ, అసాధా రణ ఊహాచిత్రాలూ, వీటితో చేసే గారడీనే మేజిక్ రియలిజమ్ అంటాడాయన. కానీ ఈ అసాధారణ శైలిని లాటిన్ అమెరికా చరి త్ర పుటల నుంచి జారే విషాదాన్ని చెప్పడా నికి ఆ మహా రచయిత ఉపయోగించుకు న్నాడు. అందుకే, లాటిన్ అమెరికా వర్షించే ఉత్తేజంలో మార్క్వెజ్ నిరంతరం తడిసిపో తూనే ఉంటాడు అని క్యూబా విప్లవ నేత ఫైడల్ కాస్ట్రో వ్యాఖ్యానించాడు.కొలంబియాలోని అరాకటాక అనే గ్రామంలో (ఆయన రచనలలోని అద్భుత కల్పిత గ్రామం మకుండో ఇదే) పెరిగిన మార్క్వెజ్ను ప్రభావితం చేసిన స్థానిక అంశాలు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తాయి. కొలంబియా అంతర్యుద్ధం, అక్కడి ఉద్వేగా లు, విశ్వాసాలు, ఘర్షణలు, లిబరల్ పార్టీ ప్రభావం, తరువాత పెరిగిపోయిన మాఫి యాలు, వారి హింసతో కరీబియన్ తీరాన్ని తడిపేసిన కన్నీళ్లు - అన్నీ ప్రభావితం చేసి నవే. అరాకటాకలో అమ్మమ్మ, తాతయ్యల పెంపకం, తరువాత పత్రికా రచయితగా గడించిన అనుభవాలూ మార్క్వెజ్ సాహి త్యానికి పునాదులయ్యాయి. ‘నేను ఏనాటికీ పత్రికా రచయితనే. ఇన్ని రచనలు చేయగలి గానంటే అదే కారణం. ఆ రచనలలోని ఇతి వృత్తాలు. జర్నలిజం ఇచ్చిన వాస్తవ సమా చారమే’ అంటాడాయన. 30 మిలియన్ ప్రతులు అమ్ముడుపోయి, మార్క్వెజ్ కీర్తిని విశ్వ వీధులలో ఎగురవేసిన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ (నూరేళ్ల ఏకాం తం, 1967)నవల కథానాయ కుడి పాత్రను తన ఇంటిలోనే వెతికి పట్టుకున్నాడు. ఆ పాత్రకు ప్రేరణ తన తాతగారే. కొలంబి యా అంతర్గత పోరులో ఆయనది కీలక పాత్ర. ఈ నవలలోని ఏడు తరాల బ్యుండి యా కుటుంబ గాథ ఆవిష్కరణకు ఎన్నుకు న్న మేజిక్ రియలిజమ్ శైలిని సయితం తన ఇంటిలోనే కనుగొన్నాడా యన. బాల్యంలో అమ్మమ్మ చెప్పిన జానపద, కాల్పనిక కథల ద్వారా దానిని సాధించాడు. కొలంబియా రాజకీయ వాస్తవికతలను జానపద పాత్ర లతో, మార్మికమైన తీరులో ఆయన అక్షర బద్ధం చేశాడు. అందుకే ఈ నవలలో లాటిన్ అమెరికా జాతీయులు తమ ఆత్మను దర్శించుకోగలిగారన్న ఖ్యాతి వచ్చింది.మిత్రులూ, అభిమానులూ ‘గాబో’అని ఆప్యాయంగా పిలుచుకునే మార్క్వెజ్ ప్రకృ తి సౌందర్యాలనూ, రాజకీయ సామాజిక స్పృహనూ కలిపి మార్మికంగా పెనవేస్తాడు. అదంతా ఆయన లాటిన్ అమెరికా ఐక్యత కోసం, శాంతి కోసం పడిన తపనకు ప్రతి బింబమే. ఆ ప్రాంతంలో అమెరికా జోక్యా న్ని సదా వ్యతిరేకించాడు. ఇదే క్యూబా వి ప్లవ పిత కాస్ట్రోతో మైత్రిని ప్రసాదించింది. తన రాత ప్రతులను ఆ విప్లవ ద్రష్టకు చూపించి అభిప్రాయం తెలుసుకు నేంతగా బంధం బలపడింది. మరో వైపు అమెరికా ఆయన రాక మీద పదేళ్లు నిషేధం విధించింది. తరువాత క్లింటన్ మార్క్వెజ్ మిత్రుడయ్యాడు. తన పద్దెనిమిదో ఏట రచనా వ్యాసం గం ఆరంభించిన మార్క్వెజ్ విశేషమైన సాహిత్య సంపదను ఇచ్చి వెళ్లాడు. ‘ఇన్ ఈవిల్ అవర్’ (1962), ‘ది ఆటమ్ ఆఫ్ ది పేట్రి యార్చ్’ (1975), ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’(1985), ‘ది జనరల్ ఇన్ హిజ్ లెబైరింత్’(1989), మార్క్వెజ్ నవలలు. నవలికలు కూడా ఆయనకు ఎంతో ఖ్యాతిని తెచ్చాయి. ‘ఐస్ ఆఫ్ ఏ బ్లూ డాగ్’(1947), ‘బిగ్ మామాస్ ఫ్యునరల్’(1962) వంటి పలు కథా సంకలనాలను ఆయన వెలువ రించారు. ‘భగవంతుడు నాకు ఒక్క సెకను అదనంగా జీవితాన్ని ప్రసాదించినా, నా శక్తిని మరింత గొప్పగా ఉపయోగించడా నికే వినియోగిస్తాను’ అని జబ్బు పడిన తరువాత మిత్రులకు రాసిన వీడ్కోలు లేఖ లో మార్క్వెజ్ రాశాడు. కానీ ఆ క్షణం వరకు సృజనాగ్నిలో ఆయన ఎంతగా కాగి పోయా డో రోజూ ఒక పసుపు గులాబీ గమనిం చింది. వేకువనే కొద్దిసేపు పుస్తకం చదువు కుని, తరువాత వార్తాపత్రికలు చదివి, ఆపై నాలుగు గంటలు ఏకబిగిన రచనలు చేసే వాడు మార్క్వెజ్. ఆ సమయానికి నిత్యం ఒక పసుపు గులాబీని తెచ్చి ఆయన రాత బల్ల మీద ఉంచేది ఆయన భార్య మెర్సిడెస్. అక్షరార్చనతో మార్క్వెజ్ గుండె ఎంత అలసిపోయిందో ఆ గులాబీకి తెలుసు. డాక్టర్ గోపరాజు నారాయణరావు -
కమలానికి కలహాల చీడ
సాబిర్ విషయమే కాదు, ఈ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పలు పరిణామాలు బీజేపీలో సమన్వయ లోపం ఎంత అథమ స్థాయిలో ఉన్నదో చాటి చెప్పేవే. ‘పార్టీలో చేరతానంటే దావూద్ ఇబ్రహీంను కూడా చేర్చుకుంటారా?’ వంటి తీవ్రమైన ప్రశ్నను ఎదుర్కొన్న బీజేపీ కంగు తినకుండా ఉండడం అసాధ్యం. నాయకత్వం దిమ్మెరపోయే స్థాయిలో ఇలా ప్రశ్నించినవాడు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ. పార్టీలో నక్వీ ముస్లిం వర్గానికి చెందిన ప్రముఖుడు. ఇది నక్వీ ఆగ్రహం అని అనుకోనక్కరలేదు. రేపటి ఎన్నికలలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తుందని సర్వేలు ప్రకటించిన బీజేపీ పరువు ప్రతిష్టలకు సంబంధించినది. సర్వేలు అనుకూలంగా ఉన్నాయి. పార్టీ ప్రకటించిన ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి అనుకూలంగానే పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఒక ముస్లిం మత సంస్థ మోడీకి ఓటు వేయవచ్చునని చెప్పడం ఇందుకు ఉదాహరణ. కానీ ఆ ఉత్సాహం పార్టీలో అత్యుత్సాహంగా పరిణమిస్తున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. జనతాదళ్ (యు) నుంచి వారం క్రితం బహిష్కృతుడైన సాబిర్ అలీని పార్టీలో చేర్చుకోవడం బీజేపీ చేసిన ఘోర తప్పిదమని విమర్శలు వె ల్లువెత్తాయి. దీని మీదే నక్వీ తన ట్విటర్లో మండిపడ్డారు. ఎవరీ సాబిర్? ఇతడు రాజ్యసభ మాజీ సభ్యుడు. ఇండియన్ ముజాహిదీన్ సభ్యుడు, పలు పేలుళ్ల కేసులతో సంబంధం ఉన్న యాసిన్ భత్కల్‌తో తనకు స్నేహం ఉందని సగర్వంగా చెప్పినవాడు. భత్కల్ను ఇతని ఇంటిలోనే అరెస్టు చేశారు. నక్వీ వెల్లడించిన వాస్తవాలు ఇవే. ఇలాంటి వ్యక్తిని పార్టీలోకి ‘ఆహ్వానించడం’ మీద నక్వీ వెళ్లగక్కిన ఆగ్రహాన్ని అర్థం చేసుకోకతప్పదు. సాబిర్ గతమంతా ఉగ్రవాద సంస్థలను కీర్తించడం, బీజేపీని తూర్పార పట్టడమేనని ఆయన గుర్తు చేశారు. అందుకే బీజేపీ నాలుక్కరుచుకుని ఈనెల 28న చేర్చుకుని, మరునాడే సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ అంశంలో నక్వీ పార్టీకి మేలే చేశారు. కానీ పార్టీ అంతర్గత అంశాల మీద అంతర్గత వేదికల మీదే మాట్లాడాలని జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అప్పుడే నోళ్లు నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. వారం లో ఇలాంటి ఉదంతం ఆ పార్టీలో రెండోసారి కావడమే ఇందుకు కారణం. అంటే మరిన్ని జరిగే ప్రమాదం ఉందా? సాబిర్ చేరిక ఘటనకు ఆరురోజుల ముందు కర్ణాటకలో ఇలాంటి గడ్డుస్థితినే బీజేపీ ఎదుర్కొనవలసి వచ్చింది. శ్రీరామసేన కర్ణాటక శాఖ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ను చేర్చుకుని, ఐదు గంటల వ్యవధిలోనే సభ్యత్వం ఉపసంహరించుకున్నారు. ముతాలిక్ వివాదాస్పదుడే. 2009లో మంగళూరులో ఒక పబ్ మీద అనుచరులతో కలసి దాడి చేసి, కొందరు యువతుల మీద భౌతిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణ ఉంది. దీని మీద దేశమంతా గగ్గోలు రేగింది. ఈ ఉదంతంలోని అతిని కాదనలేం. అయినా ముతాలిక్‌కు సభ్యత్వం ఇచ్చి నాలుక్కరుచుకున్నారు. ఇక సాబిర్ను పార్టీలోకి ‘ఆహ్వానించడం’ మీద తెర వెనుక జరిగిన తతంగం గురించి వినవస్తున్న వార్తలు వికృతంగా ఉన్నాయి. సాబిర్ రాకకు మోడీ ఆమోదం ఉందన్నది అందులో ఒకటి. ఎందుకంటే సాబిర్ చేరికను గుజరాత్ బీజేపీలో ముస్లిం ప్రముఖుడు జఫార్ సారేష్వాలా సమర్థించాడు. ఇతడు మోడీ అనుచరుడిగా ప్రసిద్ధుడు. సాబిర్ విషయమే కాదు, ఈ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పలు పరిణామాలు బీజేపీలో సమన్వయ లోపం ఎంత అథమ స్థాయిలో ఉన్నదో చాటి చెప్పేవే. కర్ణాటక శాఖ నుంచి విడివడి, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కారణమైన యడ్యూరప్ప, శ్రీరాములను తిరిగి తీసుకోవడాన్ని ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ వ్యతిరేకించారు. వృద్ధనేత అద్వానీ, ఎం ఎం జోషీ, జస్వంత్‌సింగ్, నవజోత్ సిద్ధూల నియోజక వర్గాల నిర్ణయం మీద చెలరేగిన వివాదం అంతిమంగా మోడీని బాధ్యుడిని చేసేలా ఉంది. ఇందులో అద్వానీ, జోషీల నియోజక వర్గాల నిర్ణయానికి సంబంధించి మోడీకి ప్రత్యక్ష ప్రమేయం ఉంది కూడా. దీని మీద లాలూ తీవ్రమైన వ్యాఖ్య చేశారు. మోడీకి భయపడి బీజేపీ సీనియర్లంతా పరుగులు తీస్తున్నారని, దీనితో అక్కడ తొక్కిసలాట కూడా జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో అధికారంలోకి వచ్చామన్న భావన కంటె, సానుకూల ఓటుతోనే గద్దెనెక్కామన్న మాట బీజేపీకీ, దేశానికీ కూడా అవసరం. బీజేపీ గెలుపు వ్యూహంలో ఇది కూడా ఉండాలి. అయితే సాబిర్ను పెద్దల సభకు కూడా పంపి, నిన్నటి దాకా మోసిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్, అతడు నమో జపం ఆరంభించడంతో బయటకు పంపారు. ఇప్పుడు నితీశ్ ఈ దేశాన్ని మోడీత్వ నుంచి కాపాడతానని అనడం ఇంకొక వైచిత్రి. -డాక్టర్ గోపరాజు నారాయణరావు -
నేపాల్‌కు సాగిన ‘డ్రాగన్’ నాలుక
టిబెట్ మారుమూల ప్రాంతాలలో కూడా ప్రవేశించడానికి ఈ మార్గం చైనాకు వీలు కల్పిస్తుంది. ఇది ఇంతటితో ఆగుతుందంటే ఎవరికీ నమ్మకం కలగడం లేదు. చైనా ధోరణి, గతానుభవాలు ఇందుకు కారణం. మన పొరుగు బడుగు దేశం టిబెట్ రాజకీయ భవితవ్యం, రూపురేఖలు మారిపోయే రోజు దగ్గరలోనే ఉంది. క్వింఘాయ్-టిబెట్ రైల్వేమార్గాన్ని నేపాల్ సరిహద్దులలోని షిగాట్సే పట్ట ణం వరకు విస్తరించే ప్రణాళిక త్వరలోనే పూర్తి కాబోతోందని ఈ మధ్య చైనా ప్రకటించింది. గంటకు 120 కిలోమీటర్ల వేగం తో సాగే రైళ్ల కోసం చేపట్టిన విస్తరణ ప్రణాళిక ఇది. అక్టోబర్‌లో పూర్తి కాబోయే ఈ మార్గం వల్ల లాషా నుంచి టిబెట్ అవతలి (నేపాల్ వైపు)అంచులకు చేరుకోవడానికి ఐదు గంటలు పట్టే ప్రయాణం రెండు గంటలకు తగ్గుతుంది. ఈ ప్రకటన, ఈ ప్రణాళిక వెనుక ఉద్దేశాన్ని కొంచెం గమనించినా టిబెట్ రూపురేఖలు అనూహ్యంగా ఉండబోతున్నాయని గట్టిగా చెప్పవచ్చు. ఈ రైలు మార్గం ఉద్దేశం అభివృద్ధేనని చైనా చెబుతున్నది. కానీ టిబెట్ మారుమూల ప్రాంతాలలో కూడా ప్రవేశించడానికి ఈ మార్గం చైనాకు వీలు కల్పిస్తుంది. ఈ మార్గం ఇంతటితో ఆగుతుందంటే ఎవరికీ నమ్మకం కలగడం లేదు. చైనా ధోరణి, గతానుభవాలు ఇందుకు కారణం. ఈ రైలు మార్గాన్ని మరి కొంత విస్తరించి, నేపాల్ రాజధాని కఠ్మాండు వరకు విస్తరించడానికి ఆర్థిక సాయం చేయదలచినట్టు చైనా సంకేతాలు ఇచ్చిం ది. నేపాల్ కూడా ఆసక్తి చూపుతోంది. కానీ భారత్‌కు ఉండే అభ్యంతరాల వల్ల ఆచితూచి వ్యవహరిస్తున్నది. షిగాట్సే పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని రైలు మార్గం పొడిగించడంలోనే చైనా వ్యూహాత్మక దృష్టి బయటపడుతోంది. ఇది టిబెట్, నేపాల్ సరిహద్దులలో ఉంది. తషీల్హ్యునోప్ బౌద్ధ మ ఠం ఇక్కడిదే. నిజానికి ఇది మంచి యాత్రాస్థలం. పంచన్ లామాల ప్రధాన పీఠం. పదకొండో పంచన్‌లామా గియాన్సినా నొర్బు చైనా మద్దతుదారు. గెలుగ్పా అనే బౌద్ధ తెగకు (టిబెట్‌లో రెండో పెద్ద తెగ) ఈయనే ఆధ్యాత్మిక గురువు. అంటే దలైలామా తరువాత పెద్ద ఆధ్యాత్మిక గురువు ఇతడే. వీటికితోడు నేపాల్ చైనా వైపు మొగ్గుతున్న సూచనలు ఇటీవల కాలంలో నిగ్గు తేలుతున్నాయి. టిబెట్ సరిహద్దులలోని టాటాపోనీ అనే పట్టణంలో రవాణా కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి ఆ రెండు దేశాల మధ్య అవగాహన కుదిరింది. ఇది చైనా నిర్మిస్తున్న రైలు మార్గానికి ఉపకరించేదే. మొన్న జనవరిలో చైనా ప్రధాని వెన్ జియాబావో నేపాల్‌లో పర్యటించినపుడు రైలు మార్గం నేపాల్ వరకు విస్తరించడం గురించి చర్చ జరిగింది. 1959 నుంచి భారత్‌లోనే ప్రవాస ప్రభుత్వం నడుపుతున్న దలైలామా చైనా ఆధిపత్యం గురించి ఇటీవల చేసిన ప్రకటన కూడా ముఖ్యమైనదే. స్వయం ప్రతిపత్తితో చైనాలో అంతర్భాగంగా ఉండడానికి టిబెట్‌కు అభ్యంతరం లేదని ఆయన ప్రకటించారు. కానీ కమ్యూనిస్టుల మీద ఆయన నిప్పులు చెరిగారు. అయితే చైనా ప్రభుత్వానికీ, పార్టీకీ మధ్య విభజన రేఖ ఎంత పలచనో దలైలామాకు తెలియనిది కాదు. నిజానికి టిబెట్‌కు సంపూర్ణ స్వాతంత్య్రం కోసం జరుగుతున్న ఉద్యమానికి ఆయ న ఎప్పుడూ మద్దతుదారు కాదు. దలైలామా నాయకత్వంలోని తెగతో పాటు, టిబెట్ బౌద్ధులలో రెండో పెద్ద తెగ గెలుగ్పాలు కూడా చైనాకు దగ్గరైన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైలు మార్గ విస్తరణ పథకాన్ని చైనా రహస్యంగా సాగించడం లేదు. టిబెట్ మీదుగా భారత సరిహద్దులలోని రెండు పట్టణాల వరకు ఈ రైలు మార్గం విస్తరించే యోచన ఉన్నదని 2012లో చైనా ప్రక టించింది. అలాగే నేపాల్‌కు కూడా ఈ రైలు మార్గం విస్తరింప చేసే అవకాశం ఉందని ఎలాంటి శషభిషలు లేకుండానే చైనా అధికారులు అప్పుడే ప్రకటించారు. అంతకుముందే, 2011 డిసెంబర్లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ ఈ విషయం మీద మన ప్రధానిని పార్లమెంటులో నిలదీశారు. ఇండియా మీద దాడికి చైనా సన్నాహాలు చేస్తున్నదని ములాయం సూటిగానే హెచ్చరించారు. కొన్ని సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ చైనా దాడికి దిగుతుందని భావించడం లేదని ప్రధాని సమాధానం ఇచ్చారు. చైనా కదలికల మీద భారత్ నిఘా ఉందని రక్షణ మంత్రి ఆంటోనీ కూడా చెప్పారు. చిత్రం ఏమిటంటే 1962 నాటి చైనా దాడికి ముందు ప్రథమ ప్రధాని నెహ్రూ కూడా ఇలాంటి సమాధానమే ఇచ్చారు. రైలు మార్గాలు సరుకులు, ప్రయాణికుల రవాణాకే కాదు, సైనికులను వేగంగా తరలించడానికి ఉపయోగపడతాయని ప్రపంచమంతటికీ తెలుసు. కనీసం దీనినైనా మన నేతలు గుర్తించాలి. టిబెట్ భవితవ్యం మారిపోతే దాని ప్రభావం మొదట పడేది భారత్ మీదనే. - డాక్టర్ గోపరాజు నారాయణరావు -
సంగ్రామం: యుద్ధం శాయరా ప్రేమికా!
1914 ఆగస్టు చివరిలో, సెప్టెంబర్ మొదటి వారంలో ఇంగ్లండ్ అంతటా తెల్ల ఈకల ప్రభంజనం తుపానులా వీచింది. అంటే, ఇది 1914 ఆగస్టు నాటి మోన్స్ యుద్ధంలో ఇంగ్లండ్ పలాయనం చిత్తగించిన తరువాత పరిణామమన్నమాట. పదవీ విరమణ చేసిన సైనికోద్యోగి అడ్మిరల్ చార్లెస్ పెన్రోజ్ ఫిట్జ్‌గెరాల్డ్ ముప్పయ్ మంది మహిళలను కూడగట్టి, ఫోక్‌స్టోన్ అనే చోట ఈ ఈకల పంపకాన్ని మళ్లీ మొదలుపెట్టించాడు. ఆ ముప్పయ్ మంది మహిళలంతా ఒంటి మీద సైనిక దుస్తులు లేని వారు ఎవరు కనిపించినా పట్టుకెళ్లి ఇచ్చేశారు. సామూహిక పూనకం వచ్చినట్టు మహిళలు తెల్ల ఈకలతో వీర విహారం చేశారు. ఇరవయ్యో శతాబ్దం ఆరంభం నుంచే యూరప్ ఖండం మొత్తానికి మిలటరీ యూనిఫారమ్ తొడిగే పని మొదలయింది. గ్రేట్‌వార్ (మొదటి ప్రపంచయుద్ధం) మొదలయ్యే సమయానికి ఆ పని పూర్తయింది. ఇందులో జర్మనీది అందె వేసిన చేయి. ప్రతి పౌరుడు మూడేళ్లు సైన్యంలో పనిచేయడం అనివార్యం చేస్తూ అక్కడ చట్టాలే వచ్చాయి. ఆ తరువాతి స్థానం ఇంగ్లండ్‌దే. ఇదంతా దేశాధినేతలూ, సైనికాధికారుల చొరవతో లేదా బలవంతంతోనే జరిగినది కాదు. సామాన్య ప్రజలూ, చాలామంది తండ్రులూ, ఎంతో మంది బాలికలూ కూడా ఈ ‘దేశ రక్షణ’పనిలో భాగం పంచుకున్నవారే. బెల్జియం, ఫ్రాన్స్ సరిహద్దులలోని మోన్స్ దగ్గర బ్రిటిష్ సైన్యం పలాయనం చిత్తగించిన తరువాత సైనికీకరణ ఆంగ్ల జాతిలో అంటువ్యాధిలా విస్తరించింది. ‘‘నువ్వు యూనిఫారమ్‌లో కనిపించాలి....!’’ పౌర దుస్తుల్లో ఉన్న ఓ యువకుడు లేదా అప్పుడే మీసాలు మొలుస్తున్న బాలుడు వీధిలో నడిచి వెళుతూ ఉంటాడు. అత డి దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి హొయలు పోతూ ఎవరో యువతి ఆ దారిలో నిలబడి ఉంటుంది. అతడు చూస్తాడు. అందుకు స్పందనగా ఆమె ఓ వాలు చూపు విసిరి, చిరునవ్వును కూడా సంధిస్తుంది. ఆ కుర్రాడు వడివడిగా దగ్గరకి వెళతాడు. ఆమె ఒక తెల్లటి ఈక తీసి చేతికి అందిస్తూనో, చొక్కాకు తగిలిస్తూనో చెబుతుంది, పై మాట. 1914 ఆఖరు నుంచి 1915 వరకు ఇంగ్లండ్‌లో, ప్రధానంగా లండన్‌లో ఎక్కడ చూసినా ఈ దృశ్యాలే. ఇరవై వేల మంది యువతులు దీనినో ఉద్యమంగా మలిచారు. వీరినే ‘వైట్ ఫెదర్ బ్రిగేడ్’ అని పిలిచేవారు. వైట్ ఫెదర్ ఆర్డర్ అనీ, ఖాకీ ఫీవర్ అని కూడా దీనికి పేర్లొచ్చాయి. ఆడపిల్లలంతా యువకులకి ఒక గడువు విధించి, అప్పటిలోగా ఖాకీ దుస్తులు ధరించకుంటే ఇక ముఖం చూపించనక్కరలేదని కటువైన నిబంధనలు విధించేవారు. మిత్రుడు, బంధువు, సోదరుడు ఎవరినీ వదిలిపెట్టలేదు. గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్న అబ్బాయిలు చాలా మంది సైన్యంలో చేరవలసి వచ్చింది. లండన్ నగరంలోని ఈస్ట్ ఎండ్ ప్రాంత ఆడపిల్లలయితే కోడిపిల్లల కింది భాగం ఈకలు తెచ్చి పురుషుల కోటుకు తగిలించేవారు. ఇది ఇంకాస్త అవమానించడమే. ‘యూనియన్ జాక్ కామిక్’ పేరుతో వచ్చిన ఒక పుస్తకంలో తెల్లఈకలు ఇచ్చే పనిలో ఆడపిల్లలు ఎంత దూకుడుగా ఉండేవారో కనిపిస్తుంది. జేబు నిండా ఈకలను నింపుకుని బయలుదేరుతున్న ఒక బాలికను ఆమె తల్లి నిరోధిస్తుంది. తనను ఆపవద్దని తీవ్రంగా ప్రతిఘటించి మరీ ఆ బాలిక వెళ్లిపోతుంది. అవతలి మనిషిలో పిరికితనాన్ని గుర్తు చేయడానికి తెల్ల ఈకలను ఇచ్చేవారు. తెల్ల ఈక కిటుకు ఇంగ్లండ్‌కు కొత్తకాదు. పందొమ్మిదో శతాబ్దంలో అక్కడక్కడా దీని ప్రస్తావన కనిపిస్తుంది. పద్దెనిమిదో శతాబ్దంలో ఇంగ్లండ్‌లో కోడి పందేలు జరిగేవి. తోక భాగంలో ఉండే ఈకల సముదాయంలో తెల్లవి ఉంటే ఆ కోడి పిరికిదనీ, పోరాడే శక్తి లేనిదనీ ప్రకటించేవారు. దీనినే మనుషులకు కూడా అన్వయించడం మొదలయింది. ఇదే అంశాన్ని రెండు కోణాల నుంచి ఆవిష్కరించిన నాటకం ‘ద మ్యాన్ హూ స్టేడ్ ఎట్ హోమ్’. లెక్మియర్ ఒరాల్, జె.ఇ. హెరాల్డ్ టెరీ అనే ఇద్దరు ఈ నాటకం రాశారు. ఇందులో కథానాయకుడు క్రిష్టోఫర్ బ్రెంట్. ఇతడు ఎవరు ఏమి చెప్పినా వినిపించుకోడు. ఏమన్నా దులిపేసుకుని పోతాడు. ఓ బాలిక హొయలన్నీ ప్రదర్శించి తెల్ల ఈక ఇస్తుంది. అప్పుడు బ్రెంట్ ఏంచేశాడు? అందరిలా అవమానంతో కుంగి పోలేదు. ఎవరికీ కనిపించకుండా మాయమైపోలేదు. ఆ ఈకతోనే తన పైప్‌ని శుభ్రంగా తుడిచి, ఆ పిల్ల చేతికి ఇచ్చి, వెళ్లిరమ్మన్నాడు. నిజానికి ఇతడు అప్పటికే సైన్యంలో ఉన్నాడు. చాలామంది కంటె సాహసి. ఇలా తెల్ల ఈక ఉదంతాలకి ఈ రెండు కోణాలూ కనిపిస్తాయి. ఈకల పుణ్యమా అని యుద్ధానికి వెళ్లిన వాళ్లూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో ఈకలు తీసుకువచ్చి ఇవ్వబోయిన బాలికలూ, యువతులూ భంగపడిన ఉదంతాలూ, వారికి దిగ్భ్రమ కలిగించే వాస్తవాలు తెలియడమూ కనిపిస్తాయి. ఒకసారి బస్సులో కూర్చుని సాధారణ పౌరుడి దుస్తుల్లో ఒక యువకుడు ప్రయాణిస్తున్న సంగతి అమ్మాయిలు పసిగట్టారు. వెంటనే అతడి దగ్గరకి వెళ్లి తెల్ల ఈక అందించారు. అతడు లేచి నిలబడ్డాడు. ఒక కాలు లేదు. అంతకు ముందు జరిగిన ఒక యుద్ధంలో అతడు కాలును కోల్పోయాడు. స్వచ్ఛందంగా సైనిక ఎంపిక కేంద్రాలకు వెళ్లినా అవకాశం దొరకని వాళ్లకి కూడా ఈకల అనుభవం ఎదురయ్యేది. కొందరు తెల్ల ఈకల బెడద పడలేక, సైనిక ప్రవృత్తి ఒంటికి పడకపోయినా వెళ్లేవారు. యుద్ధంలో చనిపోయారు. ఈ అంశం మీద 1960లో బీబీసీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎన్నో సంఘటనలు వెలుగుచూశాయి. తెల్ల ఈకల బెడదతోనే కొందరు ప్రభుత్వోద్యోగులు కూడా ఉద్యోగాలు వదిలి యుద్ధానికి వెళ్లే వారు. దీనితో సంక్షోభం ఏర్పడింది. అందుకే ప్రభుత్వోద్యోగులు, ముఖ్యంగా రక్షణ కర్మాగారాలలో ఉన్నవారు కూడా దేశ రక్షణకు పాటు పడుతున్నవారే కాబట్టి వారు వెళ్ల వలసిన అవసరం లేదని హోం శాఖ కార్యదర్శి రెజినాల్డ్ మెకన్నా ప్రకటించారు. వారిచేత ‘కింగ్ అండ్ కంట్రీ’ అని రాయించిన పతకాలు ధరింపచేసేవారు. ఇంత పూనకం రావడానికీ, ముఖ్యంగా యువతులూ స్త్రీలూ ఇలా ప్రవర్తించడానికీ కారణం లేకపోలేదు. ఫ్రాన్స్ మీదకు దండెత్తి వస్తూ జర్మనీ సైన్యం బెల్జియంను నాశనం చేసింది. ‘రేప్ ఆఫ్ బెల్జియం’ అని దీనికి పేరు. ఆఖరికి చర్చీలూ, గ్రంథాలయాలనూ సయితం విడిచిపెట్టలేదు. ఎందరో స్త్రీలను జర్మనీ సేనలు చంపాయి. మరెందరో వాళ్ల అత్యాచారాలకు బలయ్యారు. ఆ యుద్ధ నేరాలు సృష్టించిన భయంతోనే ఇంగ్లండ్ స్త్రీలు ఇదంతా చేశారని ఒక వాదన! 1902లో మరోసారి ఈ తెల్ల ఈకల సంప్రదాయం దేశాన్ని చుట్టుముట్టింది. ఏఈడబ్ల్యు మేసన్ రాసిన ‘నాలుగు ఈకలు’ అందుకు కారణం. బోయర్ యుద్ధాలు (1880-1881, 1899-1902) జరుగుతుండగా ఈ నవల వచ్చింది. హ్యారీ ఫేవర్షామ్ అనే సైనికుడు సూడాన్‌తో యుద్ధానికి వెళుతున్న తన దళంతో వెళ్లకుండా పారిపోయి వస్తాడు. హ్యారీ సహచరులు ముగ్గురూ తెల్ల ఈకలూ పంపుతారు. అతడితో నిశ్చితార్థం జరిగిన యువతికీ ఇది తెలుస్తుంది. ఆమె తన టోపీకి ఉన్న ఒక ఈకను తీసి హ్యారీకి పంపిస్తుంది. తనను మరచిపొమ్మనీ, నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నాననీ కూడా తెలియచేస్తుంది. దీంతో హ్యారీ ధైర్యం తెచ్చుకుని రహస్యంగా సూడాన్ వెళ్లి యుద్ధం చేశాడు. యుద్ధఖైదీలుగా పట్టుబడిన తన సహచరులను విడిపిస్తాడు. స్వదేశం చేరుకుని మిత్రులు పంపిన మూడు తెల్ల ఈకలను వారికే అందచేస్తాడు. మళ్లీ ప్రేయసికి దగ్గరవుతాడు. తెల్ల ఈకల సంప్రదాయాన్ని చాలామంది నిరసించిన దాఖలాలు ఉన్నాయి. అందుకే కొన్ని కఠోర వాస్తవాలు బయటపడ్డాయి. తెల్ల ఈకలు చూపించి యువకులని సైనిక నియామక కేంద్రాల వైపు పరుగులు తీయించడం వెనుక ఆయా నియామక కేంద్రాల సార్జెంట్ల కుట్ర కూడా ఉండేది. యువతుల చేత అవమానానికి గురై వస్తున్న యువకులని మధ్యలోనే సార్జెంట్లు పట్టుకుని ఆ అవమానం నుంచి బయటపడే మార్గం చూపిస్తామని సైన్యంలో చేర్చేవారు. ‘మీ భర్త, కుమారుడు యుద్ధం చేరవలసిన అవసరం లేదా? వాళ్లని యుద్ధానికి వెళ్లమని చెప్పండి!’ అనీ, ‘అమ్మాయిలూ! మీ బాయ్‌ఫ్రెండ్స్ ఖాకీ దుస్తులు ధరించారా? లేకుంటే వాళ్ల చేత ఆ దుస్తులు వేయించవలసిన అవసరాన్ని మీరు గుర్తించాలి’ ఇలాంటి నినాదాలతో, లండన్ మేయర్ పేరిట వాల్‌పోస్టర్లు వెలిశాయి. ఇలాంటి నినాదాలు తయారు చేసిన వాళ్లలో ప్రముఖ రచయిత ఆర్థర్ కానన్ డాయ్ల్ ముఖ్యుడు. - డా.గోపరాజు నారాయణరావు -
సంగ్రామం: యుద్ధం ప్రేమతో మొదలైంది!
మొదటి ప్రపంచ యుద్ధానికి ఈ ఏడాదితో నూరేళ్లు. కానీ వెయ్యేళ్లకు సరిపడా భావోద్వేగాలను ఈ యుద్ధం ఎగజిమ్మింది. అందులో చిందిన ప్రతి రక్త బిందువూ ఒక వ్యథకు, హృద్యమైన ఓ కథకు కేంద్రబిందువు. ఈవారం నుంచి ‘ఫన్డే’ మీకా వ్యథల్ని, కథల్ని వారానికొకటిగా అందించబోతోంది. ఆ వరుసలో మొదటిదే... ఫ్రాంజ్ ఫెర్డినాండ్-సోఫీల ప్రేమగాథ. ఆ ప్రేమకావ్యంలో తుది వాక్యమే రక్తకాసారాలని సృష్టించిన ఓ మహా యుద్ధ చరిత్రకు తొలి వాక్యమయిందంటే నమ్మ శక్యంకాదు. కానీ నిజం. రోమియో- జూలియెట్, లైలా-మజ్నూ, అనార్-సలీం వంటి ప్రేమకథల సరసన చేరుతుందంటారు ఫ్రాంజ్ ఫెర్డినాండ్- సోఫీ చోటెక్ ప్రేమగాథ. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఆ ప్రేమ జంట హత్యే(జూన్ 28, 1914). ఇరవయ్యో శతాబ్దం ఆరంభం నాటి ప్రపంచంలో మూడో పెద్ద రాజ్యం ఆస్ట్రియా-హంగెరీ వారసుడు, హాబ్స్బర్గ్ వంశీయుడు ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ఈ ప్రేమకథలో నాయకుడు. ఆస్ట్రియా-హంగెరీ చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్ తమ్ముడి కొడుకు ఫెర్డినాండ్. ఆయన ప్రేయసి సోఫీ పేదరాలు కాదుగానీ, కులీన కుటుంబం నుంచి వచ్చిన చెక్ జాతీయురాలు. చిన్న వయసులోనే ఫెర్డినాండ్ ఆస్ట్రియా-హంగెరీ సైన్యాల తనిఖీ అధికారి అయ్యాడు. గొప్ప వరంలా భావించిన సోఫీ వంటి చెలి, ప్రపంచానికి ఘోర శాపంలా పరిణమించిన చావూ- రెండూ ఆ పదవి కారణంగానే ఫెర్డినాండ్‌ను వరించాయి. సోఫీ ఆ కాలపు యూరప్ అందగత్తెలలో ఒకరు. కన్యలు ఉన్న యూరప్ పాలక వంశాలన్నీ ఫెర్డినాండ్ కరుణ కోసం చూసేవి. అతడేమో వేటనీ, గులాబీలనీ సమంగా ప్రేమిస్తాడు. లేత వేసవి ఎండలాంటి ఫెర్డినాండ్, చిరుజల్లులాంటి సోఫీల మధ్య విరిసిన ప్రేమ అనే ఇంద్రధనుస్సు ప్రపంచం ముందు ఆవిష్కృతం కావడానికి రెండేళ్లు పట్టింది. ఆ తరువాత ఇద్దరూ పెళ్లి కోసం ఎనిమిదేళ్లు ఆగారు. ప్రాగ్‌లోనే ఓ విందు నృత్యంలో 1888 ప్రాంతంలోనే యువరాజు సోఫీని చూసి, ప్రేమలో పడ్డాడు. సోఫీ బొహిమియా ప్రాంత సైన్యాధ్యక్షుడు ఫ్రెడ్రిక్ మారియా భార్య ఇసబెల్లా ప్రధాన చెలికత్తె మాత్రమే. అక్కడ ‘లేడీ ఇన్ వెయిటింగ్’ అంటారు. కౌంట్ బొహుస్లా చోటెక్ వాన్ చోటెకోవ్ ఓజ్నిన్ కూతురు సోఫీ. తల్లి కిన్స్కీ వాన్ చినిట్జ్. ఆస్ట్రియా-హంగెరీ రాజ్యానికి కౌంట్ బొహుస్లా ఒకప్పుడు అశ్వ విభాగం అధిపతి. తరువాత దౌత్యవేత్త. హాబ్స్బర్గ్ పాలక వంశీయుల వివాహం యూరప్‌కే చెందిన మరో పాలక వంశీయులతో జరగాలి. అందుకే చక్రవర్తి మారు మాట లేకుండా ఈ ప్రేమను వ్యతిరేకించాడు. ప్రాగ్లో కొన్నిసార్లు కలుసుకున్నా ఎక్కువ కాలం ఆ ప్రేమికులిద్దరూ ఎక్కడెక్కడో ఉండవలసి వచ్చింది. రాజరికం మీద అలకతో ఫెర్డినాండ్ వియన్నాకు దూరంగా వెళ్లిపోయాడు. మొదట బొహిమియా అడవులలో కొన్ని రోజులు వేట వ్యసనంలో మునిగి తేలాడు. ఆ విరహంలో అక్షరాలా వందల జంతువులను చంపాడు. అదీ విసుగనిపించింది. ఆపై ప్రపంచ పర్యటనకు వెళ్లిపోయాడు. అప్పటికే అతని వయస్సు ఇరవై ఎనిమిదేళ్లు. ఉత్తర అమెరికాకు వెళుతూ భారతదేశం చూశాడు. హిమాలయాల అందానికి పరవశించి, గానం చేశాడు. కలకత్తా చూశాడు. బెంగాల్ టైగర్ని వేటాడాడు. నిజాం ఆతిథ్యం తీసుకున్నాడు. ఢిల్లీ చూశాడు. నేపాల్, సిలన్ కూడా వెళ్లాడు. కానీ యాత్ర మధ్యలోనే ఆరోగ్యం దెబ్బతింది. పది మాసాల తరువాత వియన్నా వెళ్లిపోయాడు. తన ప్రేమ పట్ల రాజరికపు వైఖరిలో ఏ మార్పూ లేదు. అప్పుడే తన వ్యక్తిగత వైద్యుడు ఇచ్చిన మందు వికటించి, క్షయ సోకింది. మారుటితల్లి మేరియా థెరిసా మినహా అంతా తనని శత్రువులా చూడడం భరించలేకపోతున్నాడు. వైద్యం కోసం లోషీన్కు వెళ్లిపోవడం మంచిదనిపించింది.లోషీన్- నీలి సంద్రంలో ఆకుపచ్చ స్వర్గం. టీబీ శానెటోరియంకు ప్రసిద్ధి. అడ్రియాటిక్ సముద్రంలో ఉత్తర దిశగా ఉన్న క్రెస్-లోషీన్ ద్వీపసమూహంలోనిది. ప్రతి ద్వీపం పైన్ చెట్ల నీడలో సేద తీరుతున్నట్టే ఉంటుంది. పలచటి కెరటాల సముద్రంలో విన్యాసాలు చేస్తూ ఉంటాయి అక్కడి బాటిల్‌నోస్ డాల్ఫిన్లు. మందులు వాడుతూ, వ్యాయామం కోసం తీరాలలో నడుస్తూ ఉండేవాడు ఫెర్డినాండ్. అప్పుడు సోఫీ రాసిన లేఖలు అతడికి గొప్ప సాంత్వన. బంధం బలపడింది. ఆరోగ్యం కుదుటపడి, వియన్నా వచ్చాక సోఫీని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోననీ, రాజ్యం అక్కరలేదనీ తెగేసి చెప్పేశాడు ఫెర్డినాండ్. దీనితో జర్మనీ చాన్సలర్ విల్హెల్మ్, రష్యా చక్రవర్తి నికోలస్, పోప్ లియో కల్పించుకుని చక్రవర్తి జోసెఫ్‌కు నచ్చ చెప్పారు. ఫెర్డినాండ్ సవతితల్లి మేరియా థెరిసా రాయబారం నడిపింది. చివరికి జూన్ 28, 1900 సంవత్సరంలో వారసత్వ నిరాకరణ ప్రమాణం (మోర్గనాటిక్ ఓత్)చేయించారు. దీని ప్రకారం ఫెర్డినాండ్‌తో పెళ్లి జరిగినా సోఫీకి రాణి హోదా ఇవ్వరు. ఏ ఉత్సవంలోను ఫెర్డినాండ్ వెంట ఉండరాదు. భవిష్యత్తులో పిల్లలకు సింహాసనం మీద హక్కు రాదు. జూలై 1న సవతి తల్లి థెరిసా సొంత భవనం రీచ్స్టాడ్లో పెళ్లయింది. రాచరికం ఆరళ్లతో సోఫీ రహస్యంగా ఎంత కన్నీరు కార్చిందో ఆమె జేబురుమాళ్లకే తెలుసు. ముగ్గురు పిల్లలు పుట్టినా అవే అవమానాలు. కానీ భర్త సమక్షంలో ముఖం మీద చిరునవ్వు చెరగనీయలేదు. ఫెర్డినాండ్ ప్రేమ వ్యవహారానికే కాదు, రాజకీయ చింతనకి కూడా ఆస్ట్రియా రాచరికం బద్ధ వ్యతిరేకం. అతడు రష్యాతో మైత్రిని కోరేవాడు. అంటే రష్యా అండ ఉన్న సెర్బులతో - దక్షిణాది స్లావ్లు- రాజీ పడాలనుకుంటున్నాడు. ఆస్ట్రియా-హంగెరీని ఆనుకుని ఉన్న బోస్నియా,హెర్జిగోవినా ప్రాంతాలని చక్రవర్తి ఆక్రమించడానికి కూడా ఫెర్డినాండ్ వ్యతిరేకమని చెబుతారు. బోస్నియా రాజధాని సరాయేవోలో సైనిక తనిఖీకి వెళ్లవలసి వచ్చినపుడు అతడు తీవ్రంగానే కలత పడ్డాడు. చావును ముందే ఊహించాడు కూడా. 14వ శతాబ్దం నుంచి టర్కీ పాలనలో ఉన్న బోస్నియా -హెర్జిగోవినాలనే 1908లో జోసెఫ్ ఆక్రమించాడు. అప్పటికే అక్కడ సెర్బియా అండతో స్లావ్లు, క్రొయేట్లు ఉద్యమిస్తున్నారు. ఏ గోడమీద చూసినా ‘బ్లాక్ హ్యాండ్’ పేరుతో, ‘యూనియన్ ఆర్ డెత్’ పేరుతో ఆస్ట్రియా రాజవంశీకులని చంపుతామంటూ నినాదాలు దర్శనమిచ్చేవి. ఒక గవర్నర్ మీద హత్యాయత్నం జరిగింది. జూన్ 25, 1914న ఫెర్డినాండ్, సోఫీ బోస్నియా వచ్చారు. అంతకు ముందే అక్కడి వీధులలో ఆస్ట్రియా పతాకాన్ని ఎవరో తగులబెట్టారు కూడా. అలాంటి చోటికి ఫెర్డినాండ్ సోఫీతో వెళ్లాడు. ప్రధాన కారణం- చక్రవర్తి ఆదేశం. బోస్నియా గవర్నర్ ఆస్కార్ పొటియోరిక్ విన్నపం. ఇంకొకటి, వియన్నాలో సోఫీకి దక్కని రాణి మర్యాద అక్కడ దొరకుతుంది. కానీ నాలుగో బిడ్డకు తల్లి కాబోతున్న సోఫీకి సరాయేవో (బోస్నియా ప్రాంత రాజధాని)లో రాణి మర్యాద మాటేమో కానీ మృత్యువు ఎదురైంది. విశాల సెర్బియా ఆశయానికి పూర్తి అండగా ఉన్న సెర్బియా దేశం ప్రోద్బలంతో సెర్బు జాతి యువ కుడు గవ్రిలో ప్రిన్సిప్ ఆ ఇద్దరినీ మిల్జాకా నది ఒడ్డున, లాటిన్ బ్రిడ్జి దగ్గర కాల్చి చంపాడు. ముందు ఫెర్డినాండ్, ఆపై సోఫీ అరగంట తేడాలో చనిపోయారు. మరణానంతరం కూడా సోఫీ పట్ల రాచరికం కరుణ చూపలేదు. ఆమె శవపేటిక మీద గ్లోవ్స్ పెట్టి, ఒకప్పుడు ఆమె ప్రధాన చెలికత్తె అన్న విషయాన్ని రాచరికం గుర్తుకు తెచ్చింది. ముగ్గురు పిల్లలకు కడసారి చూపూ దక్కలేదు. ఆ చిన్నారులు పంపిన పుష్పగుచ్ఛాలు మాత్రం భౌతికకాయాల మీద ఉంచారు. వియన్నాలోని కేపూచిన్ చర్చి దగ్గరి స్మశానం హాప్స్‌బర్గ్ వంశీయులకు ప్రత్యేకం. కానీ ఆర్ట్స్టెటెన్లో తన భౌతికకాయాన్ని ఖననం చేయాలని ఫెర్డినాండ్ ముందే చెప్పేశాడు. పాలక కుటుంబానికి ప్రత్యేకించిన స్మశానంలో సోఫియా మృతదేహాన్ని అనుమతించరు. ఆమె మృతదేహాన్ని ఆర్ట్స్టెటెన్ స్మశాన వాటికకే తరలిస్తారు. మరణం తరువాత కూడా కలిసి ఉండాలన్న వెర్రి ప్రేమతో తన మృతదేహాన్ని కూడా ఆర్ట్స్టెటెన్లోనే ఖననం చేయాలని ఫెర్డినాండ్ కోరుకున్నాడు. కానీ వారి భౌతికకాయాలను వేర్వేరుగానే ఖననం చేశారు. జర్మనీ మద్దతుతో ఆస్ట్రియా సెర్బియా మీద యుద్ధం ప్రకటించింది. వరసగా ఇంగ్లండ్, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా, 33 దేశాలు యుద్ధంలో దిగాయి. చిన్న రివాల్వర్- బ్రౌనింగ్ సెమీ ఆటోమాటిక్ పిస్టల్. ఎం 1910 మోడల్, సీరియల్ నెంబరు 19074తో సెర్బు జాతీయవాది గవ్రిలో ప్రిన్సిప్ కాల్చినవి రెండు బులెట్లే. కానీ అవే, ఐదు వారాల తరువాత కొన్ని లక్షల విస్ఫోటనాలై భూగోళమంతా ప్రతిధ్వనించాయి. - డా॥గోపరాజు నారాయణరావు -
మండేగుండెల జెండా మండేలా
నివాళి: ‘నా విధికి నేనే నిర్దేశకుడిని... నా ఆత్మకు నేనే నావి కుడిని’... నలిగిన చిత్తుకాగితం మీద రాసుకుని దాచుకున్న ఆ కవిత ఒక మహోన్నత ఉద్యమకారుడిని చరి త్రపుటలలో నిలబెట్టింది. ప్రపంచం మొత్తం ఇష్టపడే అరుదైన రాజనీతిజ్ఞుడిని శిల్పించింది. విలియం ఎర్నెస్ట్ హెన్లీ రాసిన ఆ లాటిన్ కవిత ఇచ్చిన ఆత్మస్థయిర్యంతో ఆయన 27 ఏళ్ల సుదీర్ఘ కఠిన కారాగార క్లేశాన్ని అధిగమించగలిగాడు. ఆ కవిత పేరు ‘ఇన్విక్టస్’. అంటే జయించ సాధ్యం కానిది. నిజమే- నెల్సన్ రొలిహాహ్లా మండేలా (జూలై 18, 1918-డిసెంబర్ 5, 2013) అనితరసాధ్యమైన వాడు. ఇరవయ్యో శతాబ్దం మధ్య వరకు కనిపించిన ప్రపంచస్థాయి నేతల కోవలోని వాడు మండేలా. ‘మా దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది. మా ప్రజలు తండ్రివంటివాడిని కోల్పోయారు’ అంటూ మం డేలా మృతి ప్రకటనలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఘన నివాళి ఘటించడం తిరుగులేని వాస్తవం. ఇంకొకటి- ఆయన ప్రపంచ మిత్రుడు కూడా. మన ప్రభుత్వం ఆయనకు భారతరత్న (1990) ఇచ్చింది. ఒక సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడే బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవికి జ్ఞానపీఠ్ ఆయన చేతుల మీదుగా ఇప్పించారు. అణచివేతకు గురైన వర్గాల గళాలకు పదును తెచ్చినవాడు. ప్రపం చ హక్కుల ఉద్యమాలకి ఆయన జీవితం నాటికీ నేటికీ కరదీపికే. ఒక్కమాటలో చెప్పాలంటే మండేలా అంటే- మండే గుండెల జెండా. విద్యార్థి నేత కొందరి పుట్టుపూర్వోత్తరాలు చెప్పుకోవడం లాంఛనం కోసం కాబోదు. మొదటి ప్రపంచ యుద్ధంలో మానవాళి కకావికలవుతున్న కాలమది. అప్పుడే జాతివివక్షకు చిరునామాగా ఉన్న దక్షిణాఫ్రికాలో, ట్రాన్స్కెయి అనేచోట రొలిహాహ్లా దలీభుంగా మండేలా పుట్టాడు. అసలు పేరు అదే. దీనర్థం ‘చెట్టుకొమ్మను వంచ డం’. వాడుకలో అయితే, ‘సమస్యలు సృష్టించేవాడు’. నెల్సన్ అనే ఆ ఇంగ్లిష్ పేరును అక్షరాలు దిద్దించిన మిస్ డింగేన్ పెట్టిందట. ఆ పేరే ఎందుకో తనకు తెలియదని మండేలా తన ఆత్మకథ ‘లాంగ్ వాక్ టు ఫ్రీడం’లో చెప్పుకున్నారు. జోసా భాష మాట్లాడే థెంబు సమూహంలోని మాడిబా తెగకు చెందుతాడాయన. తండ్రి గాడ్లా హెన్రీ ఫాకానీస్వా. తల్లి నొసెకెని ఫ్యానీ. తండ్రి తన తెగకు పెద్ద. కానీ న్యాయవాద వృత్తి చేపట్టడానికి మండేలా ఆ వారసత్వాన్ని వదులుకున్నాడు. తన తెగ నుంచి బడికి వెళ్లిన తొలి బాలుడు కూడా ఆయనే. సౌతాఫ్రికన్ నేటివ్ కాలేజ్ (ప్రస్తుతం ఫోర్ట్ హేర్ విశ్వవిద్యాలయం)లో పట్టభద్రుడైన తరువాత విట్వాటర్సాండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు. ఇక్కడ నుంచే ఆయన రాజకీయ జీవితం మొదలయింది. మండేలా విద్యార్థి నాయకుడు. 1944లోనే మండేలా నల్లజాతీయుల విముక్తి కోసం పోరాడుతున్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) సభ్యుడయ్యారు. వెంటనే ఆ సంస్థ యువజన శాఖ నాయకత్వం చేపట్టాడు. శాంతిపథంలో న్యాయవాద వృత్తి చేపట్టడానికి అర్హతనిచ్చే పరీక్ష కూడా ఉత్తీర్ణుడైన తరువాత మండేలా హక్కుల ఉద్యమంతో మమేకమయ్యాడు. తన బాల్యమిత్రుడు, ఏఎన్సీ సభ్యుడు అలీవర్ టాంబోతో కలిసి 1952లో జోహెన్నెస్‌బర్గ్‌లో న్యాయ సలహా కేంద్రాన్ని ప్రారంభించారు. నల్లజాతీయులు న్యాయవాద వృత్తిని చేపట్టడం అదే. 1948 తరువాత జాతి వివక్ష ప్రభుత్వం రూపొందించిన చట్టాలతో (పాస్ లాస్) నష్టపోయిన వారి వ్యాజ్యాలను ఈ ఇద్దరు న్యాయవాదులు ప్రధానంగా వాదిస్తూ ఉండేవారు. నల్లజాతి వ్యతిరేక చట్టాల గురించి తన జాతీయులలో అవగాహన కల్పించడానికి ఆయన అప్పుడే దేశమంతా తిరిగాడు. అం తకు గాంధీజీ నిర్వహించినట్టే నల్లజాతి వ్యతిరేక చట్టాలకు నిరసగా శాంతి యుత ఉద్యమం మొదలుపెట్టాడు. దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష లేని సామాజిక ప్రజాస్వామ్యం నెలకొల్పాలని పిలుపునిస్తూ 1955లో రచించిన ‘ఫ్రీడం చార్టర్’లో భాగస్వామి అయ్యాడు. దీనితో మరుసటి సంవత్సరమే ఆయన పర్యటనల మీద, ప్రసంగాల మీద జాత్యహంకార శ్వేతజాతి ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. ఆరుమాసాల తరువాత మండేలాతో కలిసి, వంద మంది మీద రాజద్రోహ నేరం మోపారు. 1956 నుంచి 1961 వరకు ఈ కేసు విచారణ సాగింది. చివరికి మండేలాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మారిన మార్గం మండేలాను శాంతి పథం నుంచి పక్కకు నెట్టినది జాతి వివక్ష ప్రభుత్వమే. శ్వేత జాతీయుల నేషనల్ పార్టీ ప్రభుత్వం 1920 నుంచి చేసిన చట్టాల వల్ల నల్లజాతీయుల స్థితి అధ్వానంగా మారిపోయింది. దీనికి పరాకాష్ట వంటి చర్య షార్పివిల్లే ఊచకోత. మార్చి 21, 1960న షార్పివిల్లే పట్టణంలో దాదాపు ఐదువేల మంది నల్లజాతీయులు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించి పోలీసు స్టేష న్కు వెళ్లారు. వారి మీద కాల్పులు జరిగి, 69 మంది చనిపోయారు. ఇప్పుడు మార్చి 21వ తేదీని దక్షిణాఫ్రికాలో హక్కుల దినంగా పాటిస్తున్నారు. ఇదే మండేలాను హింసాపథం వైపు నడిపించింది. అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, ఏఎన్సీ అనుబంధ సైనిక విభాగాన్ని ఆరంభించారాయన. 1962లో అల్జీరియా సంవత్సరం పాటు ఉండి, గెరిల్లా యుద్ధతంత్రంలో శిక్షణ కూడా తీసుకున్నారు. అల్జీరియా నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆగస్ట్ 5, 1962న జాతి వివక్ష ప్రభుత్వం అరెస్టు చేసింది. విచారణ తరువాత జూన్ 12, 1964లో కేప్‌టౌన్‌కు దగ్గరలోని రూబెన్స్ ఐలాండ్ జైలుకు పంపింది. కంకర్రాళ్లు కొడుతూ ఆ జైలులో మండేలా (ఖైదీ నెం.46664)కంకర్రాళ్లు కొట్టాడు. కానీ వాటితో పాటు కరుడుగట్టిన అధికారులు, పాలకుల మనసులను కూడా బద్దలుకొట్టాడు. మండేలా స్వస్థలం ట్రాన్స్కెయికి పరిమితం కావడానికి అంగీకరిస్తే విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి ఎన్నోసార్లు సంకేతాలు వచ్చినా ఆయన అంగీకరించలేదు. 1973 నుంచి 1988 వరకు ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయి. 1985లో హింసను వీడితే విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దేనికీ మండేలా లొంగలేదు. 18 సంవత్సరాలు ఆ జైలులోనే గడిచాయి. 1988లో క్షయ వ్యాధి సోకడంతో మండేలాను విక్టర్ వెర్సటర్ జైలుకు బదలీ చేశారు. ఈ కాలంలోనే బోతా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో దక్షిణాఫ్రికా పరిస్థితులు దిగజారాయి. మండేలా విడుదలకు అంతర్జాతీయంగా ఒత్తిడి మొదలయింది. బోతా వారసుడు డీక్లార్క్తో సమావేశం జరిపిన తరువాత మండేలా ఫిబ్రవరి 11, 1990లో విడుదలయ్యాడు. తొలి నల్ల అధ్యక్షుడు మండేలా 1994-1999 మధ్య దక్షిణాఫ్రికా తొలి అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. శతాబ్దాలుగా శ్వేతజాతి నల్లజాతీయులను హింసించినప్పటికీ ఆ వివక్ష మరొకజాతి అనుభవించకూడదన్న ఔదార్యమే ఆయనలో కనిపిస్తుంది. రెండు రంగుల మధ్య ఆయన సమన్వయం సాధించడానికి ఆయన కృషి ఆరంభించారు. రగ్బీ శ్వేతజాతి క్రీడ కాబట్టి నల్లజాతీయులు దూరంగా ఉంచారు. కానీ ఆ క్రీడను తిరిగి ఆడమని తన జాతిని మండేలా ప్రోత్సహించాడు. క్రీడలతో ఐక్యత సాధించడం ఆయన ఉద్దేశం. బానిసత్వంతో మగ్గిన దేశాన్ని పునర్ నిర్మించడానికి ప్రయత్నించాడు. మండేలా అధ్యక్షుడైన తరువాతే దేశంలో తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మా దేశంలో జైలుకు వెళ్లివచ్చిన తరువాత అధ్యక్షులవుతారని ఒక సందర్భంలో పదునైన చురక విసిరిన మండేలా పదవి నుంచి దిగిపోయిన తరువాత సేవారంగాన్ని ఎంచుకోవడం గమనార్హం. పదవీ కాలంలో ఆయన తీవ్రమైన విమర్శలకు గురికాలేదు. చనిపోయిన తన కుమారుడి పేరు మీద ఎయిడ్స్ బాధితులకీ, వ్యాధి నివారణకి ఆయన కృషి చేశాడు. 500 ఆస్పత్రులు, 30 లక్షల మందికి ఫోను సౌకర్యం ఇచ్చాడు. అన్నిటికంటె ముఖ్యంగా 15 లక్షల మంది పిల్లలను బడికి పంపించాడు. ఏడున్నర లక్షల ఇళ్లకు విద్యుత్ ఇచ్చాడు. మండేలా మరణించాడు. అలసిన అలజడి సేద తీరుతోంది. జాతి వివక్ష మీద పోరాటానికి కామా పెట్టినట్టయింది. కానీ మండేలా ఇచ్చే స్ఫూర్తి ఈ ప్రపంచానికి ఎప్పటికీ అవసరమే. అజేయం... నన్ను కప్పుతున్న రాత్రికి ఆవల బిలంలా నల్లగా ధ్రువం నుంచి ధ్రువం వరకు దేవుళ్లెవరైనా ఉంటే వాళ్లకు కృతజ్ఞతలు నాకు అజేయ ఆత్మను ప్రసాదించినందుకు పరిస్థితుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నా నేను బెదరలేదు... బిగ్గరగా రోదించనూ లేదు విధి విసిరిన ఆఘాతాలకు నా తల నెత్తురోడినా, తలవంచలేదు ఆగ్రహ బాష్పాల ఈ ప్రదేశానికి ఆవల అస్పష్టంగా భయవిహ్వల ఛాయలు అయినా ఏళ్లనాటి భీతి నన్ను నిర్భీకుడిగానే కనుగొంటోంది, కనుగొంటుంది కూడా ఈ ద్వారం ఎంత ఇరుకుగా ఉందనేది విషయమే కాదు ఎంతగా శిక్షల తాకిడికి గురవుతున్నాననేదీ కాదు నేనే నా తలరాతకు యజమానిని నేనే నా ఆత్మకు సారథిని విక్టోరియన్ కవి విలియం ఎర్నెస్ట్ హేన్లీ (1849-1903) రాసిన ఈ కవితను మండేలా జైల్లో ఉన్నప్పుడు తరచుగా చదువుకుంటూ స్ఫూర్తి పొందేవారు. (తెలుగు అనువాదం: పన్యాల జగన్నాథదాసు) మండేలా మాటలు.. మహాత్మాగాంధీ తనకు ఆదర్శమని పలు సందర్భాల్లో చెప్పిన మండేలా, తన పోరాటంలో గాంధీ మార్గాన్నే అనుసరించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా మొక్కవోని దీక్షతో పోరాటం సాగించారు. ఆఫ్రికా ప్రజల పోరాటానికి తన జీవితాన్నే అంకితం చేశారు. రంగు, మతం, నేపథ్యాల కారణంగా మనుషులెవరూ ద్వేషిస్తూ పుట్టరని, వారు ద్వేషించడాన్ని నేర్చుకుంటారని, ద్వేషించడం నేర్చుకోగలిగిన మనుషులకు ప్రేమించడమూ నేర్పవచ్చని విశ్వసించారు. భారతదేశం గాంధీ పుట్టిన దేశం. దక్షిణాఫ్రికా ఆయనను దత్తత తీసుకున్న దేశం. ఆయన భారత్, దక్షిణాఫ్రికా రెండు దేశాల పౌరుడు. ఆయన మేధో, నైతిక సంపత్తికి రెండు దేశాలూ తోడ్పడ్డాయి. ఈ రెండు వలస దేశాల్లోనూ విముక్తి ఉద్యమాలకు ఆయన రూపమిచ్చారు.’’ - 2000, జనవరి 3న టైమ్ మేగజీన్‌లో రాసిన ‘ద సేక్రెడ్ వారియర్’ వ్యాసంలో. జాతి వివక్షను దాని అన్ని రూపాల్లో చాలా తీవ్రంగా ద్వేషిస్తున్నా. దీనిపై నా తుదికంటా పోరాడుతా.’’ - ఓ సమ్మె కేసుపై 1962లో జరిగిన కోర్టు విచారణలో.. నా జీవితకాలంలో నన్ను నేను ఆఫ్రికా ప్రజల పోరాటానికి అంకితం చేశాను. తెల్లవారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాను. నల్లవారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాను. అందరూ శాంతియుతంగా, సమాన అవకాశాలతో కలిసి జీవించే ప్రజాస్వామ్య, స్వేచ్ఛా సమాజం కావాలనేది నా ఆకాంక్ష. ఆ ఆకాంక్ష కోసం నేను జీవించాలనుకుంటున్నా. కానీ.. ఆ ఆకాంక్ష కోసం అవసరమైతే నేను చనిపోవటానికి సిద్ధం.’’ - 1964లో ప్రిటోరియా సుప్రీంకోర్టులో ప్రకటన ఒక సోదరుడితో మరో సోదరుడు పోరాడే ఈ యుద్ధంలో పాలుపంచుకునే వారందరికీ నా సందేశమిది: మీ తుపాకులు, మీ కత్తులు, మీ కొడవళ్లు తీసుకెళ్లి సముద్రంలో పారేయండి. మృత్యు కర్మాగారాలను మూసేయండి. ఈ యుద్ధాన్ని ఇక ముగించండి.’’ - 1990 ఫిబ్రవరి 25న డర్బన్‌లో ఒక బహిరంగ సభలో ప్రసంగం ఏ ఒక్కరూ మరొక వ్యక్తిని అతడి శరీర రంగు, అతడి నేపథ్యం, అతడి మతం కారణంగా ద్వేషిస్తూ పుట్టరు. మనుషులు ద్వేషించటం నేర్చుకుంటారు. వారు ద్వేషించటం నేర్చుకోగలిగినపుడు.. వారికి ప్రేమించటం కూడా నేర్పించవచ్చు. ఎందుకంటే ద్వేషం కన్నా ప్రేమ అనేది మానవ హృదయానికి మరింత సహజంగా వస్తుంది.’’ ‘‘ధైర్యం అంటే భయం లేకపోవటం కాదని.. భయాన్ని అధిగమించటమని నేను తెలుసుకున్నా. ధైర్యవంతులంటే భయం లేని వారు కాదు.. భయాన్ని జయించినవారు.’’ - లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, 1995 డా॥గోపరాజు నారాయణరావు -
పన్నెండంకెల ప్రహేళిక
చరిత్రకారుల మాటేమోగానీ, ఇన్ని శతాబ్దాలు గడిచినా భారతీయులు తుగ్లక్‌ని మరచిపోకుండా చేయడంలో ప్రభుత్వాధిపతులు యథాశక్తిన ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆధార్ కార్డుల వ్యవహారమే ఇందుకు తాజా ఉదాహరణ. 2009లో యూపీయే-2 ఆర్భాటంగా ఆరంభించిన ఆధార్ కార్డుల పథకం ఒక ప్రహసనంగా మారిపోయింది. సాక్షా త్తు భారత అత్యున్నత న్యాయస్థానమే ఆధార్ విషయం లో కేంద్ర ప్రభుత్వ పనితీరును తప్పుపట్టింది. స్పష్టతే లేని ఈ పథకాన్ని ప్రపంచంలో వినూత్నం అంటూ యూపీయే దంబాలు పలికింది. యూపీయే ఘనంగా ప్రారంభించిన ఈ పథకం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగకరంగా పరిణమించిందంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మన్నించింది. ఆధార్ కార్డుకు ఆకృతి ఇచ్చిన యూపీయే సిద్ధాంత శిల్పుల మాటకీ, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని ఆచరణలో పెడుతున్న తీరుకీ, అసలు ‘ఆధార్’ సూత్రధారి యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వివరణకీ పొం తన కనిపించదు. ఈ సంస్థ చైర్మన్ నందన్ నిలేకని ఏప్రిల్ 23, 2013న అమెరికాలో ఆధార్ సాధించిన ప్రగతి గురిం చి కాస్త ఎక్కువగానే చెప్పారు. 120 కోట్ల భారత జనాభాలో ఇంతవరకు 380 మిలియన్లకు ‘కార్డు’ చేరిపోయిందని చెప్పుకున్నారు. వచ్చే ఏడాదికి 600 మిలియన్లకు చేరుతుందని ఘంటాపథంగా చెప్పారు కూడా. ఆ లెక్కల నిజమైతే సెప్టెంబర్ 24, అక్టోబర్ 8 తేదీలలో సుప్రీంకోర్టు అంత కరాకండీగా తీర్పు ఇవ్వవలసిన అవసరం వచ్చేది కాదు. ఈ వ్యాజ్యం దాఖలు చేసిన కేఎస్ పుట్టుస్వామి (ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఏపీ వెనుకబడిన తరగతుల కమిషన్ల చైర్మన్ పదవులు చేపట్టారు) కూడా న్యాయ నిపుణుడే. ఆధార్ వ్యవహారం ఎంత అథమస్థాయిలో ఉందో కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి పుట్టుస్వామి అత్యున్నత న్యాయస్థానానికి నివేదించారు. జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ వంటి పదిహేడు మంది భారతీయ ప్రముఖులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను కూడా సుప్రీంకోర్టు పరిగణనలోనికి తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌తోనే అర్హత కల్పించడం ప్రభుత్వ ఉద్దేశం. జననీ సురక్ష యోజన, విద్యార్థి వేతనాలు, పింఛన్లు, ప్రజా పంపిణీవ్యవస్థ, ఎల్పీజీ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి పథకంలో భాగస్వామ్యం- వీటన్నిటినీ ఆధార్‌తో అనుసంధానం చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందుకోసం యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పన్నెండు అంకెల ముద్ర (యునీక్ ఐడెంటిఫికేషన్ నెం బర్)ను ప్రసాదిస్తుంది. దీనినే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఏ సంక్షేమ పథకానికైనా ఈ ఆధార్‌ను ప్రాతిపదికగా లేదా అనివార్యంగా చేయవద్దని కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆదేశించింది. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌కీ, చావుపుట్టుకలకీ మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్‌ను అనివార్యం చేశాయి. లెసైన్సులకు ఆధార్ కావాలని పంజాబ్ అంటే, ఆ రాష్ట్ర హైకోర్టు కలగచేసుకోవలసి వచ్చింది. కానీ బెంగాల్ శాసనసభ మాత్రం ఆధార్‌కు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించే పనిలో ఉంది. నిజానికి చాలామందికి ఈ కార్డులు రాలేదు. పెళ్లి రిజిస్టర్ కాకపోతే ఆ కాపురానికి చట్టబద్ధత ఉండదు. అలాంటప్పుడు చ ట్ట పరిధి లేని ఈ కాపురాన్ని ఏమనాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆధార్ లేదు కాబట్టి వారి కాపురం చట్టబద్ధం కాలేదా? ఒక పక్క ప్రధాని కార్యాలయంలో విధానాల రూపకల్పనలో కీలకంగా ఉండే మాంటెక్ సింగ్ అహ్లూవాలియా కూడా ఆధార్ అధికార పత్రం కాలేదనే అన్నారు. ఆధార్‌ను అక్రమ వలసదారులకు ఇవ్వవద్దని సుప్రీం ఆదేశించింది. ఒకరు ప్రతిపాదిస్తే వేరొకరికి ఈ కార్డు ఇవ్వవచ్చునన్న నిబంధన వల్ల ఎందరో బంగ్లా చొరబాటుదారులకు కార్డులు వచ్చిన సంగతిని సుప్రీం గుర్తు చేసింది. అంతేకాదు, ఆధార్‌కు కీలకమైన ఐరిస్ తదితర పరీక్షలు చేసే సిబ్బందికి సరైన అర్హతలే లేవంటూ వ్యాజ్యంలో పేర్కొన్న అంశాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ప్రమాణాల లేని మౌలిక వ్యవస్థతో ఈ ‘కార్డు’ జాతీయ భద్రతకు కూడా భంగకరంగా పరిణమించిన సం గతిని కూడా అత్యున్నత న్యాయస్థానం గుర్తు చేసేవరకు ప్రభుత్వానికి తెలియలేదు. ఇది ఈ దశాబ్దపు వింత. పథకాలు ఎన్నికలలో లెక్క చెప్పడానికి కాదు, అవి ప్రజల ఇక్కట్లు తీర్చేవి కావాలి. డా॥గోపరాజు నారాయణరావు -
దాయాదుల ‘బుల్లి’ సమరం
భారత వ్యతిరేక ప్రచారానికి మీడియాను వాడుకోవాలన్న తపన పాక్ నేతలలో మొదలైంది. భారత్‌ను ప్రతినాయక పాత్రలో చూపుతూ ఇటీవల నిర్మించిన ‘వార్’ ఇందుకు తాజా ఉదాహరణ. టీవీ చానెళ్ల మీద ఈ హఠాత్ దాడి కూడా అదే చెబుతోంది. భారత్‌తో ఉన్న వైరాన్ని దాచి పెట్టుకోవడం పాకిస్థాన్‌కి తెలియదు. నాలుగు రోజుల క్రితం అక్కడి పది టీవీ చానెళ్లకి కోటి రూపాయలు జరిమానా విధించడం అలాంటిదే. ఇవి చేసిన తప్పు-పరిధులు అతిక్రమించి భారతీయలు రూపొందించిన వినోద కార్యక్రమాలను ‘అతిగా’ ప్రసా రం చేయడమే. నిబంధనలు అతిక్రమించినందుకు ఒక్కొ క్క చానెల్‌కు పది లక్షల రూపాయలు జరిమానా విధించి నట్టు పాక్ సమాచార మంత్రిత్వ శాఖ ఒక పత్రంలో పేర్కొ న్నది. ప్రైవేటు చానెళ్లు ప్రసారం చేసే కార్యక్రమాలలో పది శాతం విదేశ కార్యక్రమాలు ఉండవచ్చు. ఈ పది శాతంలో అరవై శాతం భారతదేశంలో రూపొందించిన కార్యక్రమాలు, మిగిలిన నలభై శాతం ఇతర దేశాలలో తయారైన కార్యక్రమాలు ప్రసారం చేయాలి. జియో టీవీ (ఎంటర్టైన్మెంట్), ఎక్స్‌ప్రెస్ ఎంటర్టైన్మెంట్, హమ్ టీవీ, ఆక్సిజన్ టీవీ, ప్లే టీవీ, కోహినూర్ ఎంటర్టైన్మెంట్ టీవీ వన్, ఎన్టీవీ ఎంటెర్టైన్మెంట్, జీఎక్స్ఎమ్ ఎంట ర్టైన్మెంట్, జల్వా ఎంటర్టైన్మెంట్- పరిధిని అతిక్రమించాయని ఆరోపణ. కొద్దికాలం క్రితమే నేషనల్ అసెంబ్లీలో ఈ అంశం చర్చకు వచ్చింది. భారతదేశంలో తయారైన వినోద కార్యక్రమాలు తమ ఇష్టానుసారం ప్రసారం చేసుకునే అవకాశం ప్రైవేటు చానెళ్లకు ఉందా? అన్న ప్రశ్న వచ్చింది. ఇం దులో సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాలు కూడా వస్తాయి. కానీ ఈ నిర్ణయం అక్కడి ప్రజలకు రుచించేది మాత్రం కాదు. పది నెలల క్రితం కూడా పాక్ వైఖరి ఈ రీతిలో లేదు. భారతీయ కార్యక్రమాలు ఆపివేయడంతోనే పాక్ టీవీ ప్రేక్షకులు వెంటనే చానెళ్లు ఆపేశారు. దీనితో రేటింగ్ చతికిలపడింది. భారతీయ కార్యక్రమాలు ఆపేయడంతోనే, వ్యాపారం పడిపోయిందని ఆపరేటర్లు గగ్గోలు మొదలుపెట్టారు. మనం మళ్లీ జియా ఉల్ హక్ కాలానికి వెళ్లామా అని సాధారణ ప్రజలు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. నిజానికి కొద్దికాలం క్రితమే ‘గేలప్ పాకిస్థాన్’ అనే సంస్థ భారతీయ చానెళ్లు అక్కడ ప్రసారం కావడం గురించి సర్వే చేసింది. ఇందులో నలభై మూడు శాతం మంది ప్రజలు సానుకూలత వ్యక్తం చేశారు. నలభై రెండు శాతం ప్రతికూలంగా ఉన్నారు. కార్గిల్ ఘర్షణ నుంచి భారత్ కూడా కొన్ని పాకిస్థానీ చానెళ్లను నిషేధించింది. ఆ నిషేధం తొలగించడం గురించి కొంత కాలం క్రితం పాక్ విదేశ వ్యవహారాల కార్యదర్శి జలీల్ అబ్బాస్ మాట్లాడారు. భారత్‌కు చెందిన అన్ని చానెళ్లు పాకిస్థాన్‌లో చూడవచ్చు, ఒక్క పాక్ చానెల్ కూడా భారత్‌లో ప్రసారం కావడం లేదని జలీల్ చెప్పారు. కానీ భారత్ అంతర్గత వ్యవహారాల గురించి, ముఖ్యంగా కాశ్మీర్ అంశం గురించి పీటీవీ అనుసరించిన ధోరణి అప్పుడు ఈ అంశాన్ని పరిశీలించడానికి అభ్యంతరకరంగా మారింది. 2009లో పాక్ పార్లమెంటు స్థాయీ సంఘం తమ చానెళ్లు భారత్‌లో ప్రసారం చేయడానికి కృషి జరగాలని విజ్ఞప్తి చేసింది కూడా. కానీ ఇదే స్థాయీ సంఘం ఏడాదికే వైఖరి మార్చేసింది. భారత్ చానెళ్లతో జరుగుతున్న ‘సాంస్కృతిక దాడి’ని అనుమతించవ ద్దని ఆదేశించింది. భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న 24 పాక్ చానెళ్లను గడచిన డిసెంబర్లోనే నిషేధించారు. ఇవన్నీ సరిహద్దులలో యథేచ్చగా ప్రసారం అవుతూ ఉండేవి. ఉత్తరప్రదేశ్, హైదరాబాద్, అసోం, శ్రీనగర్, ముంబై వంటి ప్రదేశాలలో ఉద్రిక్తతలు తలెత్తడానికి పాక్ చానెళ్ల కథనాలు కారణమవుతున్నాయని ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. క్యూటీవీ, మదానీ టీవీ, ఏఆర్వైటీవీ, ప్రభుత్వ టీవీ చానెల్ పీటీవీ(కార్గిల్ ఘర్షణలో భారత వ్యతిరేక ప్రచారం చేసినందువల్ల నిషేధించారు), పీటీవీ హోమ్, పీటీవీ వరల్డ్, జియో టీవీ, డాన్, ఎక్స్‌ప్రెస్, వక్త్, నూర్టీవీ, హాది టీవీ, ఆజ్, ఫిల్మా క్స్, ఎస్టీవీ భారత వ్యతిరేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయని నిఘా వ్యవస్థలు తేల్చాయి. ఇవన్నీ కాశ్మీర్, పం జాబ్, ఈశాన్య రాష్ట్రాలలో ప్రసారమవుతాయి. ఎన్టీవీ బంగ్లాదేశ్, నేపాల్ టీవీ, పీస్ టీవీ(దుబాయ్), సౌదీ టీవీ, టీవీ మాల్దీవ్స్ కూడా అభ్యం తరకర అంశాలకు ప్రసిద్ధి చెందాయి. ఇందులో పాకిస్థానీ చానెళ్లు ఏవీ భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకోలేదు కూడా. ఈ విషయం మొన్న ఫిబ్రవరిలో పాక్ సమాచార శాఖ మంత్రి కమార్ జమాన్ కెయిరాయే వెల్లడించారు. భారత వ్యతిరేక ప్రచారానికి మీడియాను వాడుకోవాలన్న తపన పాక్ నేతలలో మొదలైంది. భారత్‌ను ప్రతినాయక పాత్రలో చూపుతూ ఇటీవల నిర్మించిన ‘వార్’ ఇం దుకు తాజా ఉదాహరణ. టీవీ చానెళ్ల మీద ఈ హఠాత్ దాడి కూడా అదే చెబుతోంది. పాక్‌లో ఒక భారీ పేలుడుకి భారత ఏజెంట్లు కుట్రపన్నడం, అది భగ్నం కావడం ‘వార్’లో కథాంశం. దీనికి పాక్ రక్షణశాఖ పెట్టుబడి పెట్టిందన్న వాదన ఉంది. దీనిని పాక్ సాధారణ ప్రజలైనా నమ్ముతారా? నమ్మడం లేదని సర్వేలు చెబుతున్నాయి. డాక్టర్ గోపరాజు నారాయణరావు -
వలస భారతంలో కొత్తపర్వం
గ్రామాల నుంచి చిన్న పట్టణాలకీ, చిన్న పట్టణాల నుంచి పెద్ద పట్టణాలకీ, ఇక్కడ నుంచి నగరాలకీ మహా నగరాలకీ వలసలు జరుగుతున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేశ్ ఇటీవల చెప్పారు. 2001 సంవత్సరం లెక్కల ప్రకారం దేశంలో 309 మిలియన్ల మంది వలసలు పోయారు. అభివృద్ధి గమనంలో వ్యవస్థ రూపం మార్చుకుంటుంది. కొన్ని స్థిరమైన అభిప్రాయాల నుంచి ప్రజలు బయటపడడానికి కూడా అది మార్గం చూపిస్తుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్లడం అలాంటిదే. ప్రస్తుతం వలసలు పోవడానికి కారణం కరవు కాటకాలో, పంటలు ధ్వంసం కావడమో, వృత్తుల విధ్వంసం వల్లనో జరుగుతున్నాయని అనుకోవడం పాక్షిక సత్యమే. ఈ మధ్య వెలువడిన కొన్ని నివేదికలు, సర్వేల ప్రకారం, ప్రస్తుతం వలసలంటే జీవన భృతికి సంబంధించిన వ్యూహం. కేవలం ‘పొట్ట చేతపట్టుకుని’ వెళ్లడం కాదు. అది ఆర్థికాభివృద్ధినీ, సామాజికాంశాలను ప్రభావితం చేస్తున్న పార్శ్వం. భారతదేశంతో పాటు చాలా ప్రపంచ దేశాలు ఈ దశలోనే ఉన్నాయి. యునెస్కో, యునిసెఫ్ 2011లోనే ఇంటర్నల్ మైగ్రేషన్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ పేరుతో ఆ అంశం మీద అధ్యయనం ప్రారంభించాయి. యుఎన్ ఉమెన్, యుఎన్ హాబిటేట్ వంటి సంస్థలు కూడా పాలు పంచుకుంటున్నాయి. ఈ అక్టోబర్ మధ్యలో యునెస్కో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం (2008లో జరిపిన ఒక సర్వే మేరకు) దేశ జనాభాలో 30 శాతం వలసలు పోయినవారే. వీరిలో ఎక్కువ మంది 15-29 సంవత్సరాల మధ్య వయస్కులే. అంటే 326 మిలియన్లు వలసదారులే. ఇంకా విశేషం, వలసలు పోతున్న వారిలో 70 శాతం మహిళలు. మెట్రోపాలిటన్ నగరాలలో నివశిస్తున్న ప్రతి పది మందిలో ముగ్గురు వలస వచ్చినవారే. కొన్ని నివేదికలు వలసలు పోతున్న వారిని రెండు రకాలుగా విభజిస్తున్నాయి- పొట్టకూటి కోసం వెళ్లినవారు, మెరుగైన జీవితాన్ని వెతుక్కుం టూ వెళ్లినవారు. ఇంకొన్ని అధ్యయనాలు పని/ఉద్యోగం, వ్యాపారం, చదువులు, పెళ్లి, అక్కడే స్థిరపడిన వారి సంతా నం, కుటుంబాలతో వెళ్లిపోవడం వంటి కారణాలు కూడా వలసలకు మూలమని చెబుతున్నాయి. పంటచేలు బీడు పడిపోయిన మారుమూల గ్రామాల నుంచి నేరుగా నగరాలకో, పట్టణాలకో వలసలు పోవడం లేదు. గ్రామాల నుంచి చిన్న పట్టణాలకీ, చిన్న పట్టణాల నుంచి పెద్ద పట్టణాలకీ, ఇక్కడ నుంచి నగరాలకీ మహా నగరాలకీ వలసలు జరుగుతున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్మ్రేశ్ ఇటీవల చెప్పారు. 2001 సంవత్సరం లెక్కల ప్రకారం 309 మిలియన్ల మంది వలసలు పోయారు. 1991 సంవత్సరం లెక్కల ప్రకారం చూస్తే వలసలు 37 శాతం పెరిగాయని అర్థమవుతుంది. 1991లో 226 మిలి యన్ల మంది దేశంలో ఒక చోట నుంచి వేరొకచోటికి వలసపోయినట్టు తెలుస్తుంది. ఇందులో మళ్లీ 87 శాతం తమ సొంత రాష్ట్రాలలోనే ఒక చోట నుంచి ఇంకొక చోటికి వలసపోతున్నారు. 13 శాతం మాత్రం ఇరుగుపొరుగు రాష్ట్రాల వైపు చూస్తున్నారు. దేశం సమగ్రాభివృద్ది వైపు త్వరితగతిన పురోగమిస్తోన్న సంగతి కూడా కొన్ని నివేదికలు చెబుతున్నాయి. 1990 తరువాత వచ్చిన పరిణామాలతో ఆర్థికవ్యవస్థలో అభివృద్ధి కనిపిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య కొంత తగ్గింది. తలసరి వినియోగం కూడా పెరి గింది. ఇప్పటికీ భారత్ వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న దేశమే అయినా, ఆ రంగం మీద ఆధారపడుతున్న వారి సంఖ్య పడిపోయింది. అయితే వ్యవసాయరంగంలో చోటు చేసుకున్న ఈ పరిణామం ఇతర రంగాలలో ఉద్యోగావకాశాలు పెరిగిన సంగతిని రుజువు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతదేశానికి ఇదొక సంధి దశ. ఈ దశలో వలసలు అనూహ్యం కా దు. నిజానికి వలసలు ఏ దేశానికైనా, ఏ కాలంలోనైనా కొత్త కాకపోయినా ప్రస్తుత పరిణామాలు ప్రత్యేకమైనవి. ఈ దశలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పాత్ర ఎలాంటిది? వలసల మీద ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన కోణం ఏది అంటే వెంటనే సమాధానం దొరకదు. వ్యవసాయానికి తగిన ప్రోత్సాహం లేదు. కాబట్టే వలసలు పెరుగుతున్నాయి. అలా అని వ్యవసాయానికి ఇచ్చే ఆ కొద్దిపాటి కేటాయింపులు మానడం సాధ్యం కాదు. గ్రామీణాభివృద్ధి కోసం రూపొందించిన పథకాలు ఆశాజనకంగానే ఉన్నాయని ఎవరూ అనలేరు. ఏమైనా అంతర్రాష్ట్ర వలసలు పెరిగాయి, అది మంచికోసమేనని నిపుణులు చెబుతున్నారు. దీనిని ప్రోత్సహించకపోయినా, ఆపాలని ప్రయత్నించడం మంచిది కాదన్న వాదన కూడా ఉంది. కానీ నగరాలలో వలసల కారణంగా వస్తున్న సమస్యల మాటేమిటన్నది ఇప్పుడు అందిరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. ఏ విధంగా చూసినా సమీప భవిష్యత్తులో వలసల మీద గట్టి విధానాన్ని రూపొందించుకోవడం అనివార్యమే అవుతుంది. డాక్టర్ గోపరాజు నారాయణరావు -
సర్వేల నిషేధం మీద శ్రీరంగనీతులు
‘ఇప్పుడు ఎన్నికలు జరిగితే....’ అన్న షర తు మీద ఫలితాల సర్వేలు వెలువడతాయి. వీటి మీద రాజకీయ పార్టీలకీ, వాటి నేతలకీ ఉన్న అభిప్రాయాలు ఎప్పుడూ ఒకే విధంగా కనిపించవు. ఒపీనియన్ పోల్స్ పేరుతో పిలిచే వీటి మీద రాజకీయుల ఒపీనియన్స్ ‘ఛేంజ్’అవుతూనే ఉన్నాయి. ఇరవయ్యేళ్లుగా అసెంబ్లీలు, లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా క్రమం తప్పకుండా సర్వేలు సాక్షాత్కరి స్తూనే ఉన్నాయి. ఈ సర్వేలను నిషేధించాలని తాజాగా కాంగ్రెస్ నినాదం అందుకుంది. ఈ నెల మొదటివారంలో ఈ ప్రయత్నాలు మొదల య్యాయి. ఈ సూచన అటార్నీ జనరల్ గులాం ఇ వాహనవతి చేసినదేనని వార్తలు వచ్చాయి. యూపీయే ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ ఈ ప్రకటన చేయగానే, కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఆ అంశాన్ని ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఆలస్యం లేకుండా నివేదిం చింది. ఆగమేఘాల మీద ఈసీ అన్ని పార్టీల అభిప్రాయాలను కోరింది. సీపీఐ మినహా అన్ని జాతీయ రాజకీయ పక్షాలు మనోగ తాన్ని వెల్లడించాయి. తొమ్మిది ప్రాంతీయ పార్టీలు కూడా చెప్పాయి. వింతేమిటంటే, ఎక్కువ పార్టీలు నిషేధానికి అనుకూలమే. కాంగ్రెస్‌తో పాటు డీఎంకే, ఎస్పీ, బీఎస్పీలు నిషేధించమంటున్నాయి. బీజేపీ మిత్రపక్షం అకాలీదళ్ కూడా ఇదే మంచిదని చెబుతోంది. కానీ బీజేపీ మాత్రం సర్వేల నిషేధం అంటే భావప్రకటనా స్వేచ్ఛ మీద వేటువేయడమే నని ఇప్పుడు ఎలుగెత్తి చాటుతోంది. రాజ్య సభలో బీజేపీ నాయకుడు అరుణ్‌జైట్లీ ‘పరాజి తులు నిషేధం కోరతారు’ అని సూత్రీకరించారు. ఇదంతా అక్కసుతో చేస్తున్నదేనని అను కోవడానికి ఏమాత్రం సందేహించనక్కరలేని సమయంలో కాంగ్రెస్ ఈ ప్రతిపాదన తెచ్చిం ది. ఆ పార్టీకి ఏ దిశ నుంచీ ఆశాకిరణం కని పించడంలేదు. ఉత్తరప్రదేశ్‌లో రెండు దశా బ్దాల నుంచీ, బీహార్‌లో 1990 నుంచి ఆ పార్టీ అధికారంలో లేదు. గుజరాత్లో మూడు దశా బ్దాల నుంచి ఆ పార్టీ ఆధిక్యం సాధించలేకపో తోంది. తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెం గాల్, పంజాబ్‌లలో మళ్లీ బతికి బట్టకట్టే అవ కాశం దరిదాపుల్లో లేదు. ఇప్పుడు మధ్య ప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలలో ఓడిపోతే వరసగా మూడోసారి బీజేపీకి అధి కారం అప్పగించినట్టే. ఎంపీతో పాటే జరుగు తున్న ఇంకో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక లలో రాజస్థాన్, ఛత్తీస్గడ్ బీజేపీ కాతాలోకి పోయేవేనని సర్వేలు చెప్పాయి. ఢిల్లీ బీజేపీకి దక్కడం అనుమానం. అలాఅని ఢిల్లీని కాం గ్రెస్ కాతాలో సర్వేలు వేయలేదు. ఇంకా 2014 లోక్‌సభ ఎన్నికలలో యూపీయే వెనుక బడి, ఎన్డీఏ ముందంజలో ఉండవచ్చునని సర్వేలు ఘోషించాయి. ప్రధాని అభ్యర్థిత్వం లో రాహుల్ కంటె మోడీ ముందంజలో ఉన్న ట్టు చెప్పి సర్వేలు పుండు మీద కారం రాశాయి. ఈ ఉక్రోషంతోనే కాంగ్రెస్ సర్వేల మీద ధ్వజమెత్తుతున్నదని బీజేపీ విశ్లేషిచింది. పరా జితులే నిషేధాన్ని కోరతారన్న జైట్లీ మాట స్వీయానుభవంతో చెప్పిందేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ మాటతో అర్థమవుతుంది. ఏప్రిల్ 4, 2004న అప్పటి న్యాయశాఖ మంత్రి జైట్లీ, బీజేపీ సర్వేల నిషే ధాన్ని కోరిన సంగతిని మరిచిపోతే ఎలా అని సిబాల్ చురక వేశారు. ఎన్నికల సంఘం మాజీ కమిషనర్లు టీఎస్ కృష్ణమూర్తి, ఎన్. గోపాలస్వామి కూడా ఆ సంగతి వెల్లడిం చారు. అంటే కాంగ్రెస్, బీజేపీ రెండూ ఈ అం శంలో పిల్లిమొగ్గలు వేస్తున్నాయి. మన దేశంలో 1957 ఎన్నికలకు ముందు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీని యన్ సంస్థ మొదటిసారి సర్వే నిర్వహిం చింది. ఎరిక్ డాకోస్టా దీని అధిపతి. నిజానికి 1824 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జాన్ క్విన్సీ ఆడమ్స్ మీద ఆండ్రూ జాక్సన్‌కు ఆధిక్యం సాధిస్తాడని హారీస్‌బర్గ్ పెన్సిల్వేనియా అనే సర్వే సంస్థ వెల్లడించింది. తొలిరోజులలో సర్వేలంటే అభ్యంతరాలు లేని కాంగ్రెస్‌పార్టీకి ఇప్పుడు ఏవగింపు ఎందుకని బీజేపీ నాయ కుడు రాజీవ్ ప్రతాప్ రూడీ ప్రశ్నిస్తున్నారు. దీని మీద కాంగ్రెస్ ప్రముఖుడు దిగ్విజయ్ సింగ్ తనదైన శైలిలో వాదిస్తున్నారు. ఎంపీలో మూడు కోట్ల మంది ఓటర్లు ఉంటే, 2800 మందిని మాత్రమే సంప్రతించి, అదే మొత్తం ఓటర్ల మనోగతమని చెబితే ఎలా అంటున్నా రాయన. గతంలో తాను ఒక సర్వే సంస్థతో సంప్రతించానని, సొమ్ము ఇస్తే కాంగ్రెస్ అను కూల సర్వేలు రూపొందిస్తామని చెప్పారని, వీటి విశ్వసనీయత ప్రశ్నార్థకమేనని కూడా దిగ్గీరాజా చెప్పారు. ఈ వ్యాఖ్యను ‘సి.ఓటర్’ సంపాదకుడు యశ్వంత్ దేశ్‌ముఖ్ ఎద్దేవా చేస్తున్నారు. భారత ప్రభుత్వ ప్రణాళికలూ, విధానాలూ ఎన్ఎస్ఎస్ఓ అనే సొంత సంస్థ చేసిన సర్వేల ఆధారంగా రూపొందించేవి కాదా? అని ప్రశ్నించారాయన. ప్రస్తుతం సర్వే ల మీద పాక్షిక నిషేధం ఉన్నట్టే. ప్రకటన వెలు వడినాక సర్వేలు నిషిద్ధం. ఏమైనా నిషేధం మీద కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఈ స్థాయి నిషేధాలకు ఈసీకి విస్తృతాదికారాలు లేవం టూ ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి! -డా॥గోపరాజు నారాయణరావు -
ఉల్లిపాయ... మహా మాయ...
ఢిల్లీలో 1998లో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలలో మట్టి కరిచిందంటే కారణం ఉల్లి సంక్షోభమే. షీలాదీక్షిత్ వణుకంతా ఇందుకే. ఆహారభద్రత చట్టం తెచ్చిన ఫలితం ఉల్లి మాయతో భ్రష్టు పట్టిపోతుందని కాంగ్రె స్ భయం. ‘టైర్లు కొంటే ఉల్లిపాయలు ఉచితం!’ ఇది కొద్దిరోజుల క్రితం జార్ఖండ్‌లో ఒక దుకాణం ముందు కనిపించిన రాత. ఇలాంటి ఎరల వివరాలు ఇంకొద్ది రోజులలో బంగారం దుకా ణాల ముందు వెలిసినా ఆశ్చర్యపోవక్కర లేదు. ఉల్లినీ, టొమేటోనీ బ్యాంకు లాకర్లలో పెట్టి ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు వినూత్న నిర సన తెలియచేశారు. ముందు ముందు టీవీ లూ మోటారుబైక్లూ లేదా నగలూ - వీటిని కాదు దొంగలు ఎత్తుకువెళ్లేది, ఉల్లిపాయలనే, అని కాన్పూరు ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్య అక్కడ చాలా ప్రాచుర్యం పొందింది. ఉల్లి సంక్షోభం, ధరలు ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఇది దేశానికి కొత్తకాదు. పొరలు ఒలిచిన కొద్దీ ఉల్లిఘాటు పెరిగినట్టు, సంక్షోభం తరువాత సంక్షోభం తీవ్రమౌతోంది. కానీ తాజా ఉల్లి సంక్షోభానికి ప్రత్యేకత ఉంది. ఇది సామా న్యుల చేతకంటె రాజకీయ పార్టీలనీ, ముఖ్యం గా కొందరు ముఖ్యమంత్రుల చేత ధారాపా తంగా కంటనీరు పెట్టిస్తున్నది. రెండురోజుల క్రితం రాజధాని ఢిల్లీలో ఉల్లి ధర కిలో వంద రూపాయలకు ఎగబాకిం ది. ముంబై, పాట్నా, చండీఘడ్‌లలో కూడా అంతే పలుకుతోంది. ఈ ఘాటుతో మొదట వణికిపోయిన రాజకీయ నేత ఢిల్లీ ముఖ్య మంత్రి షీలాదీక్షిత్. ప్రతికూల సర్వేలతో కుం గిపోయి ఉన్న కాంగ్రెస్ అడ్డూ అదుపూ లేకుం డా పెరుగుతున్న ఉల్లి ధరతో అక్షరాలా వణికి పోతోంది. అత్యవసరంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్‌తో సమావేశమైన షీలా దీక్షిత్ చర్యలు తీసుకోవాల్సిందని వేడుకున్నా రు. కోడ్ అమలులో ఉన్నందున, చౌక ధరలో ప్రజలకు ఉల్లి అందించడానికి అనుమతి ఇవ్వ వలసిందిగా ఎన్నికల సంఘాన్ని కోరాలని కూడా షీలా భావిస్తున్నారని వార్తలు వచ్చా యి. అంటే ఆహారంలో ప్రధాన దినుసుగా ఉండే ఉల్లి లేక దేశంలో అత్యధిక కుటుం బాలు బాధ పడుతున్నందుకు నేతలు కదల డంలేదు. డిసెంబర్ 4న జరిగే ఎన్నికలలో పార్టీకి ఉల్లి పా(మా)యతో జరగబోయే చేటు గురించి కలవరపడుతున్నారు. ఢిల్లీలో 1998 లో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలలో మట్టి కరిచిందంటే కార ణం ఉల్లి సంక్షోభమే. షీలాదీక్షిత్ వణుకంతా ఇందుకే. ఆహారభద్రత చట్టం తెచ్చిన ఫలితం ఉల్లి మాయతో భ్రష్టు పట్టిపోతుందని కాంగ్రె స్ భయం. దేశంలో మూడింట రెండొంతుల మందికి బియ్యం, గోధుమ ఇవ్వడానికి ఉద్దే శించిన ఈ చట్టం ఉల్లి ఘాటును మాత్రం తట్టుకోలేదు. ప్రపంచ చరిత్రలోనే విస్తృత మైన ఆహార రాయితీ పథకంగా పేరు తెచ్చు కున్న భారత ఆహార భద్రత చట్టం, ఉల్లి సంక్షోభాల చరిత్ర ముందు తెల్లమొహం వేయవలసివచ్చింది. ఈనెలలో ఒక్క మూడో వారంలో ఉల్లి టోకు ధరలు 36 శాతం పెరిగాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ లెక్క ప్రకారం జూన్, 2012 నుంచి ఇప్పటిదాకా ఉల్లి ధర 114 శాతం పెరిగింది. ఈ ఏప్రిల్/మే మాసాలలో టోకు మార్కెట్లో కిలో రూ.8కి అమ్మకాలు జరిగితే, బయట కిలో రూ.20 వంతున అమ్మారు. ఇంతలో ఎంత మార్పు! కాబట్టి ఇది కృత్రిమ సంక్షోభమంటూ వినిపిస్తున్న వాదన తోసిపుచ్చలేనిది. మన రాష్ట్రంలో కూ డా వంద దిశగా ఉల్లి ధర పరుగులు తీస్తోంది. నిరుడు అకాల వర్షాలతో దిగుబడి 20 శాతం తగ్గిన మాట నిజమే అయినా, ధరలు మాత్రం అనూహ్యంగా పెరిగాయి. దేశంలో ఎనిమి దిన్నర లక్షల హెక్టార్లలో పదిహేను నుంచి పదిహేడు మిలియన్ టన్నుల ఉల్లి పండిస్తు న్నారు. ఇందులో 80 శాతం మహారాష్ట్ర, కర్ణాటకలదే. శరద్ పవార్ సొంత రాష్ట్రంలోనే నాసిక్ పరిధిలో దిగుబడి తగ్గింది. అయినా కొన్నేళ్ల నుంచి ఉల్లి ఎగుమతుల మీద ఉన్న నిషేధాన్ని కేంద్ర వ్యవసాయమంత్రి ఎత్తేశారు. ఇలాంటి నిషేధాలు విధిస్తే నమ్మకమైన ఉత్పత్తిదారుగా భారత్ మీద ప్రపంచ దేశాలకు నమ్మకం పోతుందని ఆయన వాదన. మన ఉల్లి ప్రధా నంగా బంగ్లాదేశ్‌కు వె ళుతుంది. ఇందులో ఎక్కువ అనధికారిక ఎగుమతులేనని చెబు తారు. అరబ్ దేశాలకీ, శ్రీలంక, హాంకాంగ్, మలేసియా వంటి చోటికి మన ఉల్లి ఎగుమతి అవుతోంది. ఉల్లి ఎగుమతులు ఆపేస్తే దాని ప్రభావం ఇతర ఉత్పత్తుల మీద కూడా పడు తుందని పవార్ చేస్తున్న వాదన ఎలా ఉన్నా దేశంలో సామాన్యుడి మాటేమిటి? ఉల్లితో పాటు ఇతర కూరగాయల ధరలలో వస్తున్న ఈ మార్పులకు కారణం రహస్యం కాదు. దేశంలో జరుగుతున్న కూరలు, పళ్ల ఉత్పత్తిలో నలభై శాతం మార్కెట్‌కు రాకుండానే ధ్వం సం అవుతున్నాయని రిజర్వు బ్యాంకు ఒక సర్వేలో పేర్కొంది. ఇప్పుడు భారత్ ఉల్లి దిగుమతి చేసుకోవాలని, లేదంటే రేపటి ఎన్నికలలో కాంగ్రెస్ మరింత కుంగిపోవడం ఖాయమని ఢిల్లీ ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నా రు. ఇరుగు పొరుగు లేదా ఉల్లి ఎగుమతి చేసే చైనా, ఈజిప్ట్ దేశాలలో కూడా పరిస్థితి ఆశా జనకంగా లేదు. అయితే వర్షాలు పడితే సమస్య తీరిపోతుంది. ఇది తాత్కాలికం- ఇదీ పవార్ జవాబు. అంటే ఉల్లి సంక్షోభం ఇంకా కొనసాగుతుంది. ఉల్లిపాయలు అందక సామాన్య జనం రుచీపచీ లేని భోజనం చేస్తూ గడుపుతు న్నారు. కానీ ఎన్నికలలో వీరంతా ప్రభుత్వాల చేత చేదుగుళికలు మింగిస్తారు. ఆ భయం రాజకీయ నాయకులలో ఎక్కువగానే కనిపి స్తోంది. ఉల్లి ఇప్పుడు వంటింట్లో చిన్న దిను సు కాదు. ప్రభుత్వాలను మార్చే కింగ్‌మేకర్ స్థానాన్ని ఆక్రమించింది. తస్మాత్ జాగ్రత్త. - డా॥గోపరాజు నారాయణరావు -
కలవరపెడుతున్న కచ్చాతీవు
చైనా అల్లుకుంటూ వస్తున్న ‘ముత్యాలదండ’ (పెర్ల్ గార్లెండ్) వ్యూహం మేరకు ఇప్పటికే కెదర్ (పాక్), హింగ్ హి (మయన్మార్), మాల్దీవులు, అంబన్‌థొట్టా (లంక)లలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు కచ్చాతీవులో డ్రాగన్ కదలికలు సుస్పష్టం. భారతీయ క్రైస్తవులు చెప్పిన సమాచారం ప్రకారం కచ్చాతీవులో చైనా సేనల గుడారాలు ఉన్నాయి. ‘భారతదేశమంటే కేంద్ర సర్కారు సొంత జాగీరని కాంగ్రెస్ అనుకుంటున్నదా?’ ఈ సెప్టెంబర్ 2న రాజ్యసభలో అన్నా డీఎంకే సభ్యుడు వి.మైత్రేయన్ వేసిన ప్రశ్న ఇది. 1962 ముందు అక్సాయ్‌చిన్, నీఫా సరిహద్దుల గురించి పార్లమెంటు చర్చించినప్పుడు సరిగ్గా ఇలాంటి ప్రశ్నకే నెహ్రూ సమాధానం చెప్పవలసివచ్చింది. గడ్డిపోచ కూడా మొల వని ప్రదేశం గురించి ఎందుకు బెంగ? అం టూ మహావీర్ త్యాగీని ప్రథమ ప్రధాని దబాయించారు. తరువాత చైనాతో యుద్ధం జరి గింది. ఈ కాలంలో వచ్చిన మార్పు ప్రమాదకరమైనది. గడ్డిపోచలు మొలవకపోవచ్చు. కానీ తుపాకి గిడ్డంగులు అలాంటి చోట వెలి సే ముప్పు ఉంది. అన్నా డీఎంకే సభ్యుడు వేసిన ప్రశ్న- నిర్మానుష్యంగా ఉండే దీవిలో పొంచి ఉన్న విపత్తు గురించినది. ఇప్పుడు ఆ విపత్తు గురించి తమిళ ఎంపీలూ, పార్టీలే కాదు, దేశం మొత్తం ప్రశ్నించుకోవాలి. భారత్, శ్రీలంక మధ్య సరిహద్దు జలాలలో ఉన్న కచ్చాతీవు 285 ఎకరాల చిన్న దీవి. ఈ రెండు దేశాల మధ్య సముద్రాన్ని మూడు సెక్టార్లుగా విభజిస్తారు. ఇందులో రామేశ్వరం (భారత్); తలైమన్నార్ (శ్రీలంక)- ఆడమ్స్ బ్రిడ్జ్ వరకు ఉండే సెక్టార్‌ను పాక్ జలసంధి అంటారు. కచ్చాతీవు ఇందులోదే. ఈ సెక్టార్ రామేశ్వరానికి ఈశాన్యంగా 11 నాటికల్ మైళ్ల దూరంలోను, తలైమన్నార్‌కు ఆగ్నేయంగా 18 నాటికల్ మైళ్ల దూరంలోను ఉంది. ఈ దీవిలో వందేళ్ల నాటి సెయింట్ ఆంథోనీ కేథలిక్ చర్చి తప్ప జనసంచారం ఉండదు. 1974 లో ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, సిరి మావో బండారు నాయకే మధ్య, రెండేళ్ల తరువాత రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య జరిగిన చర్చల మేరకు (కరుణానిధి హయాంలో) కచ్చాతీవును శ్రీలంకకు ధారాదత్తం చేసినట్టు కేంద్రం చెబుతోంది. కానీ 1974 నాటి ఒప్పందం ‘సగం అచ్చయిన రూపాయి నోటు’ వంటిదని వ్యాఖ్యానిస్తారు. ఎందుకం టే, ఆ అప్పగింతను పార్లమెంటు ఆమోదిం చాలి. అది జరగలేదు. తాజాగా కచ్చాతీవును భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకోవాలని తమిళనాడు రాజకీయ పార్టీలు కోరుతున్నా యి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జూన్, 2011లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ రెండు ఒప్పందాలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కూడా ఆమె కోరారు. ఈ అంశం మీద కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కచ్చాతీవును తిరిగి స్వాధీనం చేసుకునే ప్రశ్నే లేదని పేర్కొన్నది. దీనితో తమిళ పార్టీలకూ కేంద్రానికీ మధ్య ఘర్షణ అనివార్యమైంది. కచ్చాతీవు భారత యూనియన్‌లోనిదేనని కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. రామనాథపుర రాజవంశం ఏలిన ఎనిమిది దీవుల లో ఇదొకటి. అక్కడ చేపల వేటకీ, ముత్యాల వెలికితీతకీ ఆ వంశీయులే అబ్దుల్ మరికర్‌కు ఏడు వందల రూపాయలకు లీజుకు ఇచ్చారనీ ఇందుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని ఆ వంశీకుడు రాజకుమారన్ సేతుపతి ఇటీవలే చెప్పారు. ఈ పత్రాలను కూడా సుప్రీంకోర్టుకు ఇవ్వవలసిందని కరుణానిధి కూడా జయకు సలహా ఇచ్చారు. కచ్చాతీవు శ్రీలంకదేనని 2010 ఆగస్టులో నాటి విదేశాంగ మం త్రి ఎస్ఎం కృష్ణ ప్రకటించారు. ఒకసారి ధారాదత్తం చేస్తే ఇక మనది కాదనీ, అక్కడకు వెళ్లే తమిళ జాలర్లకు రక్షణ కల్పించలేమనీ కూడా వెల్లడించారు. అదే సమయంలో భారత్ ఏ భూభాగాన్నీ ఎవరికీ అప్పగించలేదనీ, ఏ భూభాగం మీదా సార్వభౌమాధికారాన్ని వదులుకోలేదనీ తాజాగా కేంద్రం పేర్కొనడం విశేషం. శ్రీలంక కూడా ఘర్షణ వైఖరికే మొగ్గుతోంది. 1974 ఒప్పందం చెల్లదని భారత సుప్రీంకోర్టు తీర్పు చెప్పలేదని 2010 లోనే ఆ దేశం తమిళనాడు ప్రభుత్వానికి నోటీ సు ఇచ్చింది. ఇక, ఎల్టీటీఈ సమస్య దరి మిలా శ్రీలంక ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పుతో కచ్చాతీవులో తమిళజాలర్లు ప్రవే శం ప్రాణాంతకంగా మారిపోయింది. 1974 ఒప్పందం ప్రకారం ఇక్కడ భారతీయ జాలర్లు వేటాడవచ్చు. వలలు ఎండబెట్టుకోవచ్చు. ఈ అంశం మీదనే తమిళ పార్టీలతో పాటు బీజేపీ, సీపీఐ కూడా గళమెత్తాయి. కచ్చాతీవులో విజృంభిస్తున్న భారత వ్యతిరేక పవనాల గురించి కేంద్రం ఎందుకు కినుక వహిస్తున్నదో అర్థం కాదు. ఈ గొడవ మొదలైన తరువాత సెప్టెంబర్ 10న కేంద్ర వాణిజ్య పరిశ్రమలశాఖ సహాయ మంత్రి ఈఎం సుదర్శన్ నాచియప్పన్ మరీ చిత్రమైన ప్రకటన చేశారు. ఢిల్లీలోని ప్రగతీ మైదాన్‌లో ఏర్పాటు చేసిన విధంగానే కచ్చాతీవులో వాణి జ్య ప్రదర్శన నిర్వహించడం సాధ్యంకాగలదే మో శ్రీలంక ప్రభుత్వంతో చర్చిస్తున్నామని చెన్నైలో ప్రకటించారు. కేంద్రానికి కచ్చాతీవు లో వాస్తవ పరిస్థితులు తెలియవని తమిళ మేధావులు, ఆందోళనకారులు విమర్శిస్తున్న ది ఇందుకే. శ్రీలంక అజమాయిషీ ఆరంభమ య్యాక కచ్చాతీవును పవిత్రదీవి (చర్చి వల్ల) గా ప్రకటించింది. కానీ ఆ పుణ్యభూమిని భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చింది. చైనా అల్లుకుంటూ వస్తున్న ‘ముత్యాలదండ’ (పెర్ల్ గార్లెండ్) వ్యూహం మేరకు ఇప్పటికే కెదర్ (పాక్), హింగ్ హి (మయ న్మార్), మాల్దీవులు, అంబన్‌థొట్టా (లంక)ల లో స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు కచ్చాతీవులో డ్రాగన్ కదలికలు సుస్పష్టం. ఏటా ఆంథోనీ చర్చిలో జరిగే 3 రోజుల ఉత్సవాలకు మన రెండు దేశాల మత గురువులు, క్రైస్తవు లు హాజరవుతారు. భారతీయ క్రైస్తవులు చెప్పిన సమాచారం ప్రకారం కచ్చాతీవులో చైనా సేనల గుడారాలు ఉన్నాయి. భారత్ జాలర్లను వెంటాడి చంపుతున్న గస్తీ నౌకలలో చైనా సైనికులు కనిపిస్తున్నారు. కచ్చాతీవులో వేటాడే హక్కు తమిళ జాల ర్లకు ఉండాలని జయ కోరడం సబబే. కానీ అంతకుమించి కేంద్రం నిర్వహించాల్సిన గురుతర బాధ్యత కూడా ఉందని ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. సుప్రీం నిర్ణయం తరువాత ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. - డా॥గోపరాజు నారాయణరావు -
వంజారా కొత్త ఎన్కౌంటర్
ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ విధానం మేరకు జరిగినవేననీ, ఇందులో తమ దోషం ఉంటే, మోడీ ప్రభుత్వం కూడా దోషేననీ వంజారా లేఖలో నిష్కర్షగా చెప్పారు. గుజరాత్లో జరిగిన చాలా ఎన్కౌంటర్లు దేశంలో కలకలం సృష్టించాయి. ఆ ఎన్‌కౌం టర్లను నిర్వహించినట్టు ఆరోపణలు ఎదు ర్కొంటూ జైలు జీవితం గడుపుతున్న నిపు ణుడే ఇప్పుడు రాజీనామా పత్రమనే ఆయు ధంతో చేసిన కొత్త తరహా ఎన్కౌంటర్ యావ ద్దేశం దృష్టినీ ఆకర్షించింది. గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడీనీ, ఆయన ప్రభు త్వాన్నీ లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త తరహా ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ నిర్వహిం చిన ఆ నిపుణుడు ఒకప్పుడు మోడీని ‘దైవం’ గా కొలిచినవాడూ, ప్రాణమిత్రుడూ కావడ మే విశేషం. ఆయన పేరే డీజీ వంజారా ఐపీఎస్. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత 2002 నుంచి జరిగిన వివాదాస్పద ఎన్కౌంట ర్ల కారణంగా అరెసై ్ట, 2007 ఏప్రిల్ నుంచి కారాగారంలో ఉంటున్న గుజరాత్ పోలీసు ఉన్నతాధికారి దహ్యాజీ గొబర్జీ వంజారా (59) సెప్టెంబర్ 3న పది పేజీల రాజీనామా లేఖను అధికారులకు పంపారు. ఆ లేఖ బహి ర్గతం కావడంతో మోడీ రాజీనామా కోరుతూ సెప్టెంబర్ 6న రాష్ట్ర బంద్ పాటించాలని కాం గ్రెస్ పిలుపు కూడా ఇచ్చింది. ఈ వివాదం మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ప్రభావితం చేస్తుందని ఆయన వ్యతిరేకులను అంచనా లకు వచ్చేటట్టు చేయగలిగింది. సొహ్రాబుద్దీన్ షేక్ (ఇతడి భార్య కాసర్ బీని కూడా పోలీ సులు మాయం చేశారు), తులసీరామ్ ప్రజా పతి, సాదిక్ జమాల్, ఇష్రాత్ జహా వంటి వారి చావుకు కారణమైన పదహారు ఎన్‌కౌం టర్లు నకిలీవనీ, వాటిలో వంజారా ప్రమేయం ఉందనీ దర్యాప్తు సంస్థలు తేల్చడంతో ఆయ నను అరెస్టు చేశారు. వంజారాతో పాటు 32 మంది గుజరాత్ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇవే ఆరోపణలతో జైళ్లలో ఉన్నారు. ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ విధానం మేరకు జరి గినవేననీ, ఇందులో తమ దోషం ఉంటే, మోడీ ప్రభుత్వం కూడా దోషేననీ వంజారా లేఖలో నిష్కర్షగా చెప్పారు. కానీ ఇంతకాలం ఈ మౌనం ఎందుకు? అందుకు కూడా లేఖలో వివరణ ఇచ్చారు. ‘దైవంగా భావించే మోడీ మీద గౌరవంతో’ మౌనం దాల్చానని వంజా రా చెప్పుకున్నారు. కానీ అమిత్ షా (మోడీ కుడిభుజం, రాష్ట్ర హోంశాఖ మాజీ సహాయ మంత్రి) వంటి దుష్టశక్తి ప్రభావంతో మోడీకి కళ్లూ, చెవులూ పని చేయడం మానేశాయని వంజారా ఆరోపణ. గడచిన 12 సంవత్సరా లుగా ఇలాంటి దుష్టశక్తులే మోడీని పెడతోవ పట్టించి తిమ్మిని బ్రహ్మిని చే స్తున్నాయని వం జారా పేర్కొన్నారు. మోడీ, వంజారా ప్రాణ స్నేహితులని వంజారా కొడుకు పృథ్వీసింహ చెబుతారు. ఉత్తర గుజరాత్‌లోని ఇలోల్కు చెందిన ఒక గిరిజన రైతు కొడుకు వంజారా. ఒక సోద రుడు కలూజీ వంజారా ఐయ్యేఎస్ అధికారి. మరో సోదరుడు వనరాజ్సింహ రాష్ట్ర ప్రభు త్వ ఉన్నతోద్యోగి. తండ్రి గిరిజన రైతే అయి నా పిల్లలు చదువుకోవాలని ఆశించాడు. కానీ అది అంత సులభంగా సాగలేదు. సకాలంలో డబ్బు చెల్లించలేదని ఒకసారి వంజారాను విద్యార్థి వసతి గృహం నుంచి నెట్టివేశారు. తరువాత ఆ ప్రాంతానికి చెందిన వ్యాపారి, కుటుంబ మిత్రుని సాయంతో చదువు పూర్తి చేసి 1978-79లో పోలీసు శాఖలో చేరారు. 1987లో ఐపీఎస్‌గా పదోన్నతి పొందారు. వంజారాకు రోడ్డు పక్కనుండే చిన్న వ్యాపారి నుంచి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వరకు పరిచయాలు ఉన్నాయి. 2002లో అహ్మదా బాద్ క్రైమ్ బ్రాంచ్‌కు డీసీపీగా, ఆపై గుజ రాత్ యాంటీ టైస్టు స్క్వాడ్‌కు డీఐజీ గాను పదవులు చేపట్టారు. 2002 తరువాతే వంజారా ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా ఖ్యాతి పొందారు. ఈ పన్నెండు సంవత్సరాలలో జరి గిన ఎన్కౌంటర్లలో ఎక్కువ అమిత్ షా హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నపుడే జరిగాయి. తరువాత షా కూడా పదవిని కోల్పోయారు. పోలీసులతో పబ్బం గడుపుకుని తరువాత గాలికి వదిలేసే లక్షణం షాకు ఉందని, 2002-07 మధ్య పోలీసులు, ఇతర దర్యాప్తు బృందాలు అన్నీ ప్రభుత్వ విధానం మేరకే నడుచుకున్నాయనీ వంజారా చెబుతున్నారు. గుజరాత్ జాతీయ స్థాయిలో ఒక నమూనా రాష్ట్రంగా పేరు తెచ్చుకోవడానికి రాష్ట్ర పోలీసు శాఖ అనుసరించిన కఠిన విధానమే కారణ మని కూడా వంజారా రాశారు. ‘దైవం’గా భావించిన మోడీని హఠా త్తుగా రోడ్డున పడేయాలన్న యోచన వంజా రాలో తలెత్తడానికి కారణం తన ఆధ్యాత్మిక గురువేనని ఒక వాదన ఉంది. ఆయన ఎవరో కాదు - ఆశారాం బాపు. ఆశారాంను అరెస్టు చేయడం (ఒక బాలిక పట్ల అసభ్య ప్రవర్తన ఆరోపణతో) వంజారాను బాధించినట్టు చెబు తున్నారు. ఆశారాం మీద భూఆక్రమణ ఆరో పణలు వచ్చినపుడు వంజారా మౌనం దాల్చారు కూడా. ఎన్కౌంటర్ నిపుణుడు ఆరేళ్లు నిరీక్షించి మోడీ మీదనే తన విద్యను అక్షరాలతో ప్రయోగించారు. ఆ గురి మోడీని తాకినట్టేనా? లేక తనదైన శైలిలో మోడీ తప్పించుకుంటారా? అది తొందరలోనే తేలు తుంది. - డా॥గోపరాజు నారాయణరావు -
పరుగుల ఇమ్రాన్ తప్పటడుగులు
ఉగ్రవాదులను మెప్పించడానికి ఇమ్రాన్ చాలా శ్రమపడుతున్నారు. పాఠ్యపుస్తకాల్లో మార్పులైనా, ద్రోన్ దాడులను ఖండించడమైనా ఇందుకే. క్రికెట్ మైదానంలో పరుగులతో ఉరకలెత్తించిన ఇమ్రాన్‌ఖాన్ నియాజీ రాజకీయ క్రీడలో బుడిబుడి అడుగులూ, కొన్ని కొన్ని తప్పటడుగులు వేస్తున్నారు. జీవితంలో క్రీడాకారునిగా ఇన్నింగ్స్ పూర్తయ్యాక, ఇమ్రాన్ ప్రజాసేవకునిగా, రాజకీయ నాయకునిగా అవతరిం చారు. ఏప్రిల్, 1996లో ఆయన స్థాపించిన పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) ఒకటిన్నర దశాబ్దం తరువాత 2013 మే 11న జరి గిన పాకిస్థాన్ ఎన్నికలలో మూడో అతి పెద్ద పార్టీగా నిలిచింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా, తాలిబన్, ఇతర ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలతో నిత్యం వార్తలలో ఉండే కైబర్ పఖ్తున్‌ఖ్వావాలో ప్రాం తీయ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేసిం ది. ఈ ప్రాంత విద్యాలయాలలో బోధిస్తున్న పాఠ్య పుస్తకాలలో ఉన్న దోషాలను ‘పరిహరిస్తా’మని ఆ ప్రభుత్వం పదిరోజుల క్రితమే ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఈ సెప్టెంబర్ 2న పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ చేసి న ప్రకటన కలకలం సృష్టించిందనే చెప్పాలి. ఏటా సెప్టెంబర్ 1న పఖ్తున్‌ఖ్వావాలో పాఠశాలలను తిరిగి తెరుస్తారు. రెండో తేదీన ఇమ్రాన్ ఈ ప్రకటన చేశారు. గతంలో పాఠ్యపుస్తకాల నుంచి తొలగించిన కొన్ని పాఠ్యాం శాలను మళ్లీ చేర్చాలన్నదే తన అభిమతమని ఇమ్రాన్ ప్రకటించారు. అందులో జీహాద్ వివరాలు కూడా ఉన్నాయి. కానీ ఇమ్రాన్ నిర్ణయాన్ని చాలా మంది ఉపాధ్యాయులు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు. పఖ్తున్ ఖ్వావా ప్రాం తీయ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా విపరిణామాలకు దారితీస్తుందనీ, అక్కడి విద్యార్థుల ఆలోచనా విధానం మీద దుష్ర్పభావం చూపుతుందనీ వారు విమర్శిస్తున్నా రు. ఇందులో పెషావర్ విశ్వవిద్యాలయం ఆచార్యుడు డాక్టర్ ఫజల్ రహీమ్ మార్వాత్ ఒకరు. నిజానికి 2008లో అవామీ నేషనల్ పార్టీ ఇక్కడ ప్రాంతీయ ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు కొన్ని పాఠాలను తొలగించింది. దాని స్థానంలో ఆ ప్రాంతపు మత, సాంస్కృతిక విశిష్టతలు, కవులు, తత్వవేత్తల వివరాలు చేర్చింది. అప్పటి వరకు ఉన్న హింసను బోధించే, ఆయుధాలను గురించి వర్ణించే పాఠాలను పూర్తిగా తొలగించింది. అవన్నీ 1980 ప్రాంతంలో అఫ్ఘాన్ ఉగ్రవాదం, దాని ఆశయాల నేపథ్యంతో రూపొందించిన పాఠా లు. 2008లో వాటిని మార్చినపుడు పాఠ్యాం శాల రూపకర్తల సంఘానికి డాక్టర్ మార్వాత్ అధ్యక్షునిగా పనిచేశారు. ఇప్పటికే వేర్పాటు ధోరణులతో ఉన్న ఆ ప్రాంతంలోని పాఠశాలల్లో ఇమ్రాన్ పార్టీ చేయాలనుకుంటున్న మార్పులు అవాంఛనీయ ఫలితాలు చూపుతాయని డాక్టర్ మార్వాత్ అభిప్రాయపడ్డారు. ఇమ్రాన్ పార్టీ ఇలాంటి మార్పుల వైపు మొగ్గక తప్పని ఒక విధానంతోనే అవతరిం చింది. ఉగ్రవాదులతో చర్చల ప్రక్రియకు పీటీఐ కట్టుబడి ఉందని ముందు నుంచీ ఇమ్రాన్ చెప్పుకుంటున్నారు. కానీ పఖ్తున్లో ప్రాంతీయ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఆ మొగ్గు ఉగ్రవాదుల బుజ్జగింపు దిశగా సాగవలసివచ్చింది. దీనికి ప్రధాన కారణం పర్వేజ్ ఖట్టక్ నాయకత్వంలోని పఖ్తున్ ప్రాం తీయ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు. జమాత్ ఎ ఇస్లామి, కవామీ వతన్ పార్టీల మద్దతుతో సాగుతున్న ముఖ్యమంత్రి ఖట్టక్ సంకీర్ణ ప్రభుత్వం అక్కడి పరిస్థితులను చక్కబెట్టడం సంగతి అలా ఉంచితే, ముందు కుసాగే పరిస్థితిలోనే లేదు. ఈ ప్రాంతంలో మొత్తం నిఘా వ్యవస్థ ధ్వంసమైన సంగతి తెలిసిన ఖట్టక్ ప్రభుత్వం కంగుతినాల్సి వచ్చింది. అక్కడి వాస్తవ పరిస్థితుల గురించి నిజానికి ఇమ్రాన్ ప్రధానితో జరిపిన పలు సమావేశాలలో వివరించారు. అయినా ఎలాం టి చర్యలు లేవు. అంతర్జాతీయ ఉగ్రవాదం మీద జరిపే పోరాటంలో కీలకంగా ఉన్నట్టు చెప్పుకుం టున్న పాకిస్థాన్, పఖ్తున్ ప్రాంతంలో ఉగ్రవాదంతో పోరుకు ఇప్పటికీ సరైన విధానాన్ని ఎంచుకునే సాహసం చేయలేదు. పఖ్తున్ ప్రాంత అభివృద్ధి విషయంలో అఖిలపక్ష సమావేశాలు వంటి నాన్చుడు ధోరణికే నవా జ్ ప్రభుత్వం పరిమితమైన సంగతి వాస్తవం. దీనితో నవాజ్ నాయకత్వంలోని పాకిస్థాన్ ముస్లింలీగ్(ఎన్) ప్రభుత్వాన్ని నమ్ముకోవడం కంటె ఉగ్రవాదానికి అనుకూలమైన ధోరణే మంచిదని ఇమ్రాన్ భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. అందులో భాగంగానే కావచ్చు, ఆగస్టు మొదటివారంలో పాకిస్థాన్‌లో పర్యటించిన అమెరికా హోంమంత్రి జాన్ కెర్రీతో కూడా సమావేశమై పఖ్తున్ ప్రాంతంలో అమెరికా నిర్వహిస్తున్న ద్రోన్ విమానదాడులను ఆపివేయాలని ఇమ్రాన్ కోరారు. ఎక్కువగా సాధారణ పౌరులనే బలిగొంటున్న ఈ విమాన దా డులవల్ల ఉగ్రవాదానికే బలం చేకూరుతుం దని కెర్రీతో ఇమ్రాన్ వాదించారని పత్రికలు వెల్లడించాయి. పాఠ్య పుస్తకాలలో మార్పుల యోచన కూడా ఉగ్రవాదులను మెప్పించడానికేనని రాజకీయ విశ్లేషకులు గట్టిగానే చెబుతున్నారు. దీనికి తోడు ‘యూదు ఏజెంట్’ అంటూ ఇమ్రాన్ మీద ప్రత్యర్థులు మళ్లీ ప్రచారం ప్రారంభించారు. ఇవి కాకుండా, మొన్నటి మే ఎన్నికలలో జరిగిన అవకతవకల విషయంలో సుప్రీంకోర్టు ‘సిగ్గుచేటుగా వ్యవహరించింది’ అని వ్యాఖ్యానించి, ప్రధాన న్యా యమూర్తి ఇఫ్తెకార్ చౌధురి ఆగ్రహానికి కూడా ఇమ్రాన్ గురైయ్యారు. తరువాత ఇన్సాఫ్ పార్టీ నేత వివరణ ఇచ్చినప్పటికీ ఇఫ్తెకార్ తృప్తి చెందలేదు. ఉగ్రవాదం, పేదరికం వంటి తీవ్ర సమస్యలతో తల్లడిల్లుతున్న పొరుగుదేశం పాకిస్థాన్‌లో భవిష్యత్తులో అధికారం చేపట్టే అవకాశం ఉన్న పార్టీ ప్రస్థానం ఇలా సాగడం భారత్‌ను ఆందోళనకు గురిచేసేదే. భారత్-పాక్ సంబంధాలకు అవరోధంగా ఉన్న శక్తులకు ఎంత చిన్న అండ దొరికినా పరి ణామాలు తీవ్రంగానే ఉంటాయి. ఇమ్రాన్ పార్టీ తీరు అందుకు అనుగుణంగానే ఉంది. - డా॥గోపరాజు నారాయణరావు -
అమెరికాను వెంటాడుతున్న ‘కల’
ఆయన కల నెరవేరడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. నల్లజాతి జీవనంలో గుణాత్మకంగా ఎన్నో మార్పులు వచ్చా యి. అయితే వచ్చిన ఈ పరివర్తన శ్వేతజాతీయులవల్ల మాత్రం కాదు. నల్లజాతి పోరాట పటిమే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆ పోరాట స్ఫూర్తిని నల్ల జాతీయులకు ఇచ్చినవాడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ‘ఏదో ఒక రోజున నా నలుగురు పిల్లలు వారి వర్ణాన్ని బట్టి కాకుండా, వ్యక్తిత్వాలను బట్టి గుర్తించే దేశంలో నివసిస్తారని నాకో కల ఉంది...’ రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) చరిత్రాత్మక మహోపన్యాసం ‘నాకో కల ఉంది’లో (ఆగస్టు 28, 1963) వాక్యమిది. లూథర్‌కింగ్ (జనవరి 15, 1929-ఏప్రిల్ 4, 1968) స్వప్నం అమెరికాను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అమెరికా నల్లజాతి చరిత్రను మలుపుతిప్పిన ఈ మహోపన్యాసం 50వ వార్షికోత్సవం సంద ర్భంగా జరిగిన ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈ నెల 28న వాషింగ్టన్‌లోని అబ్రహాం లింకన్ స్మారక కట్టడం వద్ద చేరిన వారంతా తలవక తప్పని ఒక ఘటన సరిగ్గా అదే సమయంలో జరిగింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్ తదిత రులు ఈ సభలో మాట్లాడారు. లూథర్ ఉపన్యసించిన లింకన్ స్మారక కట్టడం సోపానాల మీద నుంచే ఒబామా కొన్ని వాస్తవాలు అంగీ కరించారు. ఆ తాజా ఘటన అమెరికాను తొలి నల్లజాతీయుడు పాలిస్తున్న వర్తమాన కాలంలో చోటుచేసుకోవడం గమనార్హం. అట్లాంటాలో ఫ్రైడ్ చికెన్‌కు ఎంతో పేరు పొందిన పాస్కల్స్ మోటర్ హోటల్లో మార్టి న్ తన ఉద్యమ సహచరులతో సమావేశాలు జరిపేవాడు. అది ఆనాటి సంగతి. ఈ నాటి సంగతి నాటి వివక్షకు సజీవ సాక్ష్యంగా నిలి చింది. మైకేల్ బ్రౌన్ కుటుంబ సభ్యులు, మి త్రులు పాతికమంది దక్షిణ కరోలినాలోని ఉత్తర చార్లెస్టన్లో ఉన్న ‘వైల్డ్ వింగ్స్ కేఫ్’కు విందు చేద్దామని వెళ్లారు. నిర్వాహకులు అనుమతించలేదు. ఈ హోటల్ కూడా చికెన్‌కు ప్రసిద్ధి. నల్లవారు ఎక్కువగా ఉండే ఈ ప్రాం తంలోని ఈ రెస్టారెంట్లో శ్వేతజాతి మహిళ ఒకరు, తాను లోపల ఉండగా నల్లజాతీయు లు ప్రవేశించడానికి వీల్లేదని చెప్పడంతో ఇది జరిగింది. అమెరికాలో జాతి వివక్షకు రెక్కలు ఇంకా తెగిపోలేదని ‘వైల్డ్ వింగ్స్ కేఫ్’ తాజా గా రుజువు చేసింది. జాతులపరంగా అమెరికాలో ద్వితీయ స్థానం నల్లజాతి అమెరికన్లదే. పశ్చిమ, మధ్య ఆఫ్రికాల నుంచి బానిసలుగా వీరిని తెచ్చుకున్నారన్నది సత్యం. 16వ శతాబ్దం నుంచి వీరు అమెరికా చరిత్రలో అంతర్భాగమైనప్పటికీ అదంతా అవమాన భారంతో నిండినదే. 20వ శతాబ్దం మధ్య వరకు అమానుషమైన దుస్థితిలో బతికారు. ఓటుహక్కు, చదువు, సమన్యాయం మొదటి నుంచి వారికి దక్కలేదు. అబ్రహాం లింకన్ హయాంలో జరిగిన ఉత్తర దక్షిణ అమెరికాల మధ్య పోరాటం, నల్లజాతీయులు అణచివేత మీద చేసిన తిరుగుబాటు. అప్పుడే బానిసత్వం పోయింది. కానీ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అహింసాయుతంగా జరిగిన పౌరహక్కుల ఉద్యమం (1955-1968)తో నల్లజాతీయుల జీవితంలో మార్పులు వచ్చాయి. ఈ ఉద్యమానికి కేంద్ర బిందువే మార్టిన్ లూథర్ కింగ్. అమెరికా రాజ్యాంగం నల్లజాతికి కల్పించిన సమన్యాయం, ఆర్థిక సమానత్వం వంటి హక్కుల సాధనకు ఆయన ఉద్యమించాడు. ఆయన ప్రసంగంలో నల్లజాతీయులు నేటికీ ఉషస్సులను దర్శిస్తారు. జాతివివక్ష లేకుండా అమెరికా బాలబాలికలంతా చెట్టపట్టాలేసుకుని, కలిసిమెలిసి జీవించాలని లూథర్‌కింగ్ ఆశయం. ఈ భావా న్నే కవితాత్మకంగా, ఉద్విగ్నంగా తన ప్రసంగంలో నిక్షిప్తం చేశాడు. 1940 వరకు నల్లవారికి తెల్లజాతీయుల విద్యాలయాలలో ప్రవేశం లేదు. 60 శాతం స్త్రీలు శ్వేతజాతీయుల ఇళ్లలో పనిమనుషులే. 1965 దాకా ఓటు హక్కు దక్కలేదు. 2000 నాటికి నల్లజాతీయులు విద్యలో పురోగమించారు. ఆర్థికస్థితి మాత్రం మెరుగుపడింది. 2010కి 45 శాతం నల్లజాతీయులు సొంత ఇళ్లు కలిగి ఉన్నారు. మొత్తం అమెరికన్లలో 67 శాతం సొంత ఇళ్లు ఉన్నవారు కనిపిస్తారు. ఇప్పుడు 85 శాతం మెట్రోపాలిటన్లలో నల్లవారికీ తెల్లవారికీ వేర్వేరు నివాస ప్రాంతాలు కనిపించవు. మార్టిన్ చూసిన అమెరికాలో తెల్ల, నల్లజాతీయుల మధ్య ప్రేమలూ పెళ్లిళ్లూ చట్టవిరుద్ధం. కానీ ఇప్పుడు 15 శాతం పెళ్లిళ్లు వీరి మధ్య జరుగుతున్నాయి. కానీ నిరుద్యోగం తెల్లవారిలో కంటె, నల్లజాతీయులలోనే ఎక్కువ. భత్యాలలో వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. దాని ఫలితమే ఇటీవలి మాంద్యం నల్లజాతిని బాగా కుంగదీసింది. అమెరికాలో నల్ల, తెల్ల జాతీయుల మధ్య ఆర్థిక సమానత్వం సాధిం చడం తన ముందున్న అతి పెద్ద లక్ష్యమని ఒబామా చాలా నిజాయితీగా అంగీకరించారు. ఒబామా అధ్యక్షుడు కావడం మార్టిన్ కల నెరవేరుతోందని చెప్పడానికి తార్కాణమని నల్లజాతీయుడు మిల్టన్ రాస్ (72) అభిప్రాయపడుతున్నాడు. ఇది అర్థసత్యమని అమెరికా శ్వేతజాతి వైఖరి తెలిసిన ఎవరైనా చెబుతారు. మార్టిన్ కల నెరవేరడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. నల్లజాతి జీవనం లో గుణాత్మకంగా ఎన్నో మార్పులు వచ్చా యి. అయితే వచ్చిన ఈ పరివర్తన శ్వేతజాతీయులవల్ల మాత్రం కాదు. నల్లజాతి పోరా ట పటిమే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిం ది. ఆ పోరాట స్ఫూర్తిని నల్ల జాతీయులకు ఇచ్చినవాడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. - డా॥గోపరాజు నారాయణరావు -
అరబ్ ‘వసంతం’ వాడుతోందా!
ఇటీవల ‘క్రిస్టియన్ సైన్స్ మోనిటర్’ పత్రిక అరబ్బు వసంతం విఫలమైందా అని ప్రశ్నిస్తూ వ్యాసం ప్రచురించింది. ‘అరబ్ వసంతకాలం’ నిష్ర్కమించి శిశిరం ప్రవేశించినట్టు కనిపిస్తున్నది. రెండు మూడు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతున్న పాలకులకూ, పార్టీలకూ వ్యతిరేకంగా ఇసుక ఎడారులు, చమురు క్షేత్రాలలో పెల్లుబికిన తిరుగుబాట్లకే పత్రికా ప్రపంచం ‘వసంతం’ అని పేరు పెట్టింది. డిసెంబర్ 18, 2010న మొదలైన ఈ ‘వసంతకాలం’ ట్యునీసియా, ఈజిప్ట్, లిబియా, యెమెన్, బహ్రెయిన్, సిరియా, అల్జీరియా, ఇరాక్, జోర్డాన్, కువైట్, మొరాకో, సూడాన్, ఒమన్, పశ్చిమ సహారాలను చుట్టుముట్టింది. ఈ సంచలనం వయ సు రెండేళ్లే. అయినా ఆ దేశాలలో కొన్ని ‘వసంతాగమనం’ పరిపూర్ణం కాలేదనీ, రెండో దశ వసంతకాలం అవసరమని భావిస్తున్నా యి. 1981లో అధికారం చేపట్టిన హోస్నీ ముబారక్‌ను ఈజిప్ట్ ప్రజలూ, సైన్యం తొల గించి, బ్రదర్హుడ్ అనుబంధ ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ మొర్సీని ఎన్నుకున్నారు. మళ్లీ ఆ ప్రజలూ, సైన్యం, ప్రతిపక్షాలే మొర్సీని తొలగించాయి. 33 ఏళ్ల క్రితం యెమెన్ అధికారం చేపట్టిన అలీ అబ్దుల్లా సలేని ఫిబ్రవరి 2012లో ప్రజలు గద్దెదించా రు. లిబియా నియంత గడ్డాఫీ 44 ఏళ్ల తరువాత అక్టోబర్ 2011లో అత్యంత విషాదకరంగా మరణించాడు. ఈజిప్ట్‌లో మొర్సీ పతనం ట్యునీసియా చేత ‘విప్లవ’ పరిపూర్ణత గురించి యోచించచేందుకు దోహదం చేసింది. ‘అరబ్ వసం తం’ మొదట అంకురించింది ట్యూనీసియాలోనే. ప్రజాసమస్యలు, దిగజారిన ఆర్థిక పరి స్థితి, అవినీతి, బంధుప్రీతి, నిరుద్యోగాలతో కొన్ని అరబ్ దేశాలు దుర్భరస్థితిని అనుభవి స్తున్నాయి. 1975-2005 మధ్య అరబ్ జనా భా 314 మిలియన్లకు చేరి, రెట్టింపయింది. కారణం దశాబ్దాలపాటు పాలకులు తిష్టవేసుకుని ఉండటమే. ‘అరబ్ వసంత’ వేళకే (2010 డిసెంబర్) ట్యునీసియా ఉద్యమబాటలో ఉంది. 1987లో జైనే ఎల్ అబిదైన్ బెన్ అలీ ట్యునీసియా అధికారం చేపట్టాడు. డిసెం బర్ 17, 2010న ట్యునీసియాలో సిది బౌజిద్ అనేచోట మహ్మద్ బౌజిజి అనే తోపుడు బండి వ్యాపారి నుంచి పళ్లను స్వాధీనం చేసుకుని పోలీసులు జప్తు చేశారు. మామూళ్లు ఇవ్వనందునే ఇదంతా జరిగిందని వార్తలు వచ్చాయి. ఇది భరించలేక ఆ చిరువ్యాపారి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అప్పటికే వీథులలోకి వచ్చిన ప్రజలు ఈ ఘటనతో ఉద్యమాన్ని తీవ్రం చేశారు. ఉద్యమం రాజధాని ట్యునిస్కు పాకిం ది. 2011 జవవరి14న అధ్యక్షుడు బెన్ అలీ సౌదీ అరేబియాకు పారిపోయాడు. తాత్కా లిక ప్రభుత్వం ఏర్పడింది. ట్యునీసియా జాతీయ పుష్పం మల్లెపువ్వు. కాబట్టి ఈ ఉద్యమానికి జాస్మిన్ రివల్యూషన్ (మల్లెల విప్ల వం) అని పేరు పెట్టారు. ఈ అల్లర్లలో 78 మంది చనిపోయారు. అక్టోబర్ 23, 2011న ట్యునీసియా తొలి సారి స్వేచ్ఛగా ఎన్నికలు జరుపుకుంది. ఇస్లామిస్ట్ మితవాద రాజకీయ పక్షం అల్ నహ్దా అధికారంలోకి వచ్చింది. అలీ ఎల్ అరీద్ అధికారంలోకి వ చ్చాడు. మరో రెండు చిన్న సెక్యులర్ పార్టీలు -కాంగ్రెస్ ఫర్ ది రిపబ్లిక్ పార్టీ, బ్లాక్ ఫర్ లేబర్ అండ్ లిబర్టీస్-తో కలిపి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదే రాజ్యాంగ రచన బాధ్యతను కూడా చేపట్టింది. కొత్త ప్రభుత్వం బెన్ అలీ కాలం నాటి ఖైదీలను విడుదల చేసి, వంద రాజకీయ పార్టీలకు గుర్తింపునిచ్చింది. మీడియా మీద ఆంక్షలు తొలగించింది. రాజ్యాంగ చర్చలతో పాటు ఇవన్నీ జరుగు తూండగానే ప్రజాస్వామిక వ్యవస్థకు వ్యతిరేకులైన సలాఫిస్టులు (సలాఫిస్ట్ అన్సార్ అల్ షరియా ఉద్యమం. ఇది ఉగ్రవాద ఉద్యమం) వీథి పోరాటాలు మొదలుపెట్టారు. ఇవి బాగా విస్తరించి అల్ నహ్దా ప్రభుత్వ నేత అరీద్ వైదొలగాలన్న డిమాండ్‌కు ఊపు నిచ్చాయి. బెన్ అలీ దేశం విడిచి పారిపోయే నాటికి 13 శాతంగా ఉన్న నిరుద్యోగిత తరువాత 18 శాతానికి పెరిగిపోయింది. 2012 నాటికి ఎనభైవేల మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు.ద్రవ్యోల్బణం ఆరు శాతం పెరిగింది. 2012 సంవత్సరంతో పోలిస్తే విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు 1.3 శాతానికి పడిపోయాయి. దీనార్ విలువ పడిపోయింది. ఇస్లామిస్ట్ మూవ్మెంట్ నుంచి వచ్చిన అరీద్ను దింపి, తటస్థనేతను దేశాధినేతను చేయాలని ఉద్యమకారులు కోరుతున్నారు. అంటే ఇస్లామిస్టులకు, సెక్యులరిస్టులకు వైరుధ్యాలు తీవ్రమైనాయి. వాస్తవానికి కొత్త ప్రభుత్వం ఈ అంశంతో పాటు చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నది. వివిధ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలతో వచ్చిన విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఈ అలజడుల మధ్యనే ఈ ఏడాది ఫిబ్రవరి 6న రాహోయి పార్టీ నాయకుడు చోక్రి బిలేడ్ను కాల్చి చంపారు. జూలై 25న వామపక్ష ప్రముఖుడు మహ్మద్ బ్రహ్మిని హత్య చేశారు. ఈ రెండు హత్యలు కూడా సలాఫిస్టుల పనేనని అనుమానాలు ఉన్నాయి. ట్యునీసియా తిరుగుబాటు స్వచ్ఛమైన పాలన కోసం ఉద్దేశించినది. మత ఛాందస వర్గాలను అధికారానికి దూరంగా ఉంచే కృషి కూడా ఇందులో ఉంది. కానీ ప్రజలు సత్వర ఫలితాలను కోరుతున్నారు. ఇటీవల ‘క్రిస్టియన్ సైన్స్ మోనిటర్’ పత్రిక అరబ్బు వసం తం విఫలమైందా అని ప్రశ్నిస్తూ వ్యాసం ప్రచురించింది. నిజానికి చాలా మంది మేధావులు ఈ అభిప్రాయంతోనే ఉండవచ్చు. కానీ ఇది ప్రజాస్వామ్యానికి ఎదురుదెబ్బే గానీ, గొడ్డలిపెట్టు కాదు. - డా॥గోపరాజు నారాయణరావు -
ఆమె పలుకే ‘బంగారం’!
నివాళి: ‘‘సాహిత్యం అంటే సమాజానికి హితవు చేసే రచన అని అర్థం. పద్యం, గద్యం ఆఖరికి సినిమా పాటల్లో కూడా ఒక ప్రయోజనం ఉండాలి. అదీ సాహిత్యం అంటే’’ - మాలతీ చందూర్ కొత్త కెరటం హొయలునీ, ఉధృతినీ స్వాగతిస్తూనే పాత కెరటాల పదునునీ, లోతునీ కూడా పలకరించడం ప్రవాహగమనం తెలి సిన వారే చేయగలరు. జలరాశి అనంతత్వం బోధపడేది కూడా అప్పుడే. అనంతమైన ఈ సాహితీ ప్రవాహాన్నీ, సృజనరాశినీ అలాంటి దృష్టితో చూసిన అరుదైన తెలుగు రచయిత్రి మాలతీ చందూర్ (1930-2013).‘ఆంధ్రప్రభ’ సచిత్రవారపత్రికలో ఐదు దశాబ్దాల పాటు నిరంతరాయంగా ఒకే శీర్షికను (ప్రమదావనం) నిర్వహించిన ఘనత ఆమె ఒక్కరి సొంతం. ప్రపంచ మహారచయితలందరి నవలలను మూడు దశాబ్దాల పాటు తెలుగు వారికి పరిచయం చేసిన మాలతీచందూర్‌కు తెలుగు పాఠకలోకం సదా రుణపడి ఉంటుం ది. దాదా పు 150 నవలా పరిచయాలు ఆమె కలం నుంచి జాలువారాయి. మాలతీచందూర్ కథకురాలు, నవలా రచయిత్రి, వ్యాసకర్త. అరుదైన కాలమిస్ట్. ‘రవ్వలడ్డూలు’పేరుతో మాలతీ చందూర్ తన తొలి కథను ‘ఆంధ్రవాణి’లో ప్రచు రించారు. ‘లజ్ కార్నర్’, ‘నీరజ’ కథలు ‘భారతి’లో అచ్చయ్యాయి. ‘‘సాహిత్యం అంటే సమాజానికి హితవు చేసే రచన అని అర్థం. పద్యం, గద్యం ఆఖరికి సినిమా పాటల్లో కూడా ఒక ప్రయోజనం ఉండాలి. అదీ సాహిత్యం అంటే’’ అని, ‘నన్ను అడగండి’ అనే మాలతీ చందూర్ నిర్వహించిన శీర్షిక కోసం పాఠకుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారామె. ఆమె ప్రతి రచన ఈ ఆశయాన్నే ప్రతిఫలిస్తుం ది. జాతీయోద్యమం, మధ్యతరగతి జీవితం, మహిళల దుస్థితి ఆమె నవలలకు ఇతివృత్తాలు. అలనాటి రచయిత్రులందరిలోనూ కని పించే మహిళా పక్షపాతం ఆమె రచనలలో కూడా గమనిస్తాం. శీర్షికల ద్వారా ఇచ్చిన సమాధానాలలో ఆమె తరచు ముగ్గురు మహి ళా నేతల జీవితాలను ప్రస్తావించేవారు. వారే ప్రపంచ రాజకీయాలలో విశిష్టంగా కనిపిం చిన సిరిమావో బండారునాయకే (శ్రీలంక), ఇందిరాగాంధీ (భారత్), గోల్డామీర్ (ఇజ్రాయెల్). చాలా సులభశైలిలో సవివరంగా ఆమె సమాధానాలు ఉండేవి. ‘రాముడత్తయ్య’ ప్రధాన పాత్రగా ఆమె రాసిన ‘హృదయనేత్రి’ నవల జాతీయోద్యమ నేపథ్యంలో సాగుతుంది. రాముడత్తయ్య రాట్నం వడుకుతుంది. పిల్లలు అడిగితే జాతీయోద్యమాన్ని కథలుగా చెబుతుంది. గాంధీజీ తెల్లవాళ్లను తరిమేసి దేశానికి స్వాతంత్య్రం తెస్తారని ఘంటాపథంగా చెప్పేదామె. రాముడత్తయ్యను ఖద్దరు చీరలో చూపారామె. ఈ నవలకే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘శతాబ్ది సూరీడు’ నవలలో మారుతున్న కాలంలో మహిళలు సాధించిన పురోగతిని ఆవిష్కరించారు. బండెడు చాకిరిని మౌనంగా చేసే నాటి వితంతువుల దుస్థితితో మెదలుపెట్టి నాలుగుతరాల తరువాత అక్షరానికి నోచుకున్న మహిళ ప్రయాణం ఇందులో కని పిస్తుంది. సంసారంలో, సమాజంలో ఎవరిది తప్పయినా స్త్రీయే ఎందుకు సర్దుకుపోవాలి? స్త్రీపురుషుల ఘర్షణలో ఎప్పుడూ ఓటమి భావన స్త్రీకే ఎందుకు? వంటి ప్రశ్నలతో సాగే నవల ‘ఆలోచించు!’. ఇంకా ‘చంపకం’, ‘వైశాఖి’, ‘శిశిర వసంతం’, ‘ఎన్ని మెట్లెక్కినా...’, ‘భూమిపుత్రి’, ‘మనసులోని మనసు’ వంటి నవలలు రాశారు. పలువురి చరిత్రపురుషుల, మహిళల జీవిత చిత్రాలను కూడా మాలతి రాశారు. ‘వినదగు విషయాలు’ వంటి సాహిత్యేతర పుస్తకాలు కూడా వెలువరించారు. నవలా పరిచయానికి సాహితీ ప్రక్రియ గౌరవాన్ని తెచ్చిన రచయిత్రి మాలతీచందూర్. ఈ ప్రక్రియతో ఆధునిక ప్రపంచ నవలను తెలుగువారికి పరిచయం చేయడానికి ఆమె చేసిన కృషి అసాధారణమైనది. 1845 నాటి ‘ది కౌంట్ ఆఫ్ మాంటీ క్రిష్టో’ (అలెగ్జాండర్ డ్యూమాస్), 1859 నాటి ‘ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్’ (చార్లెస్ డికెన్స్) మొదలు, నిన్న మొన్న వచ్చిన ‘లజ్జ’ (తస్లీమా నస్రీన్) వరకు ఈ నవలా పరిచయాలు సాగాయి. ప్రపంచ భాషలతో పాటు కొన్ని భారతీయ భాషా నవలలను కూడా పరిచయం చేశారు. ‘పాత కెరటాలు’ శీర్షికతో వచ్చిన ఈ పరిచయాలే పాతకెరటాలు 1, 2; నవలా మంజరి 1, 2, 3, 4, 5 సంకలనాలుగా వెలువడ్డాయి.ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే (ఆస్కార్ వైల్డ్), పెయింటెడ్ వెయిల్, ఆఫ్ హ్యూమన్ బాం డేజ్ (మామ్), రాజశేఖర చరిత్రము (వీరేశలింగం), ఎ ఫేర్వెల్ టు ఆర్మ్స్ (హెమింగ్వే), సైలాస్ మారినర్ (జార్జి ఎలియెట్), ది ఫౌం టెన్ హెడ్ (అయ్న్ ర్యాండ్), చమ్మీన్ (తగళి శివశంకర్ పిళ్లై), డాక్టర్ ఝివాగో (బోరిస్ పాస్టర్నాక్), స్ప్రింగ్స్నో (యుకెయో మిషి మా), గుడ్ ఎర్త్, ది ఎగ్జయిల్ (పెర్ల్ ఎస్ బక్), ఎయిర్పోర్ట్ (ఆర్థర్ హెయిలీ), కొన్ని సమయాలలో కొందరు వ్యక్తులు (జయకాంతన్), అసురవిత్తు (ఎంటీ వాసుదేవన్ నాయర్), గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ (అరుంధతీ రాయ్); ఇంకా థామస్ హార్డీ, జేబీ ప్రీస్ట్లీ, మార్గరెట్ మిశ్చెల్, ఆనె ఫ్రాంక్, మేరియో పూజో, ఎలెక్స్ హెలీ, జెఫ్రీ ఆర్చర్ వంటి రచయిత నవలలు కూడా పరిచయం చేశారు. మాలతీ చందూర్ భర్త, ‘జగతి’ మాసపత్రిక సంపాదకుడు ఎన్ ఆర్ చందూర్ కొద్దికాలం క్రితమే కన్నుమూశారు.నూజీవీడు మామిడిపళ్లని నెహ్రూ బెర్నార్డ్‌షాకు కానుకగా ఇచ్చారట. మాలతీ చందూర్ అక్కడ పుట్టిన మావిచిగురే! - డా॥గోపరాజు నారాయణరావు -
సిరియాకు ఐరాస ‘అగ్నిపరీక్ష’!
తనతో కలిసిరాని ప్రతి దేశం మీద సమితిని అడ్డం పెట్టుకుని అగ్రరాజ్యాలు ‘తనిఖీ’ అస్త్రాలు ప్రయోగించే సంప్రదాయాన్ని నెలకొల్పుతున్న సూచనలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. మరోసారి అగ్ర రాజ్యాలు ‘రసాయనిక ఆయుధాల వినియోగం’ క్రీడకు శ్రీకారం చుట్టాయి. ఇప్పుడు ఈ ఆరోపణ ఎదుర్కొం టున్న దేశం సిరియా. పశ్చిమాసియాలోని ఈ సంక్షుభిత రాజ్యం ప్రస్తుతం అంతర్యుద్ధంతో సతమతవుతోంది. సైన్యం మద్దతుతో పోరాడుతున్న కుర్దిష్ సాయుధ బృందాలకీ; అల్ కాయిదా అండదండలు ఉన్న తిరుగుబాటుదారులకీ మధ్య సిరియా నైరుతి భాగంలో సంకుల సమరమే జరుగుతోంది. అంతర్యుద్ధం అణచివేత పేరుతో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసాద్ మూడుచోట్ల రసాయనిక ఆయుధాలు ప్రయోగించాడని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఆరోపిస్తున్నాయి. దీనితో నిజానిజా లు తేల్చడానికి ఐక్యరాజ్యసమితి నియమిం చిన ఇరవై మంది సభ్యుల తనిఖీ బృందం ఈ నెల 18న సిరియా రాజధాని డమాస్కస్ చేరుకుంది. సమితి పంపిన తనిఖీ బృందానికి సిరియా పూర్తిగా సహకరిస్తుందని విదేశ వ్యవహారాల మంత్రి ఫైయాసల్ మెక్దాద్ ముందే చెప్పారు. అలెప్పో అనే పట్టణం ఇప్పుడు ఈ వివాదానికి కేంద్ర బిందువు. సిరియా అంతర్యుద్ధం కరవు కాటకాల నుంచి పుట్టిందనిపిస్తుంది. అలెప్పోకు సమీపంగా ఉన్న దారా అనే గ్రామంలో మొదలైన ప్రభుత్వ వ్యతిరేకత రెండున్నరేళ్లలో అంతర్యుద్ధం రూపం తీసుకుంది. ఆ దుర్భిక్షం సమయంలో ఆ గ్రామంలోని పాఠశాల విద్యార్థు లు గోడల మీద ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు రాశారు. దీనితో ప్రభుత్వం చాలా కఠినంగా స్పందించింది. ఆ విద్యార్థులను అరెస్టు చేసి దారుణమైన హింసకు గురిచేసింది. ఇది 21వ శతాబ్దంలోనే రక్తపంకిల ఘటనగా పేరు మోసింది. నిజానికి పిల్లలు రాసిన నినాదాలు సత్యదూరాలు కావు. 2001 నుంచి ఆ ప్రాంతమంతా కరవు తాండవిస్తున్నది. 2009లో ఐక్య రాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు కలిసి చేసిన అధ్యయనం ప్రకారం ఎనిమిది లక్షల మంది రైతులు పొలాలకు దూరమయ్యారు. తనిఖీ బృందం పరిధి పెద్దది కాదు. కేవ లం మూడుచోట్ల తనిఖీతో దాని బాధ్యత పూర్తయిపోతుంది. ఇందులో ఈ సంవత్సరం మార్చి 19న ఖాన్ అల్ అస్సాల్ దగ్గర జరిగిన దాడి ఒకటి. అయితే ఆ దాడి ‘ఇస్లామిస్ట్’ తిరుగబాటుదారులదే తప్ప తమది కాదని అధ్యక్షుడు అసాద్ ఆరోపిస్తున్నారు. మిగిలిన తని ఖీలు ఎక్కడ జరుగుతాయో మాత్రం రహస్యంగా ఉంచారు. సిరియా ప్రభుత్వం అలెప్పో దగ్గర రెండు పర్యాయాలు నాడీ మండల వ్యవస్థను దెబ్బతీసే సారిన్ అనే రసాయనాన్ని ఉపయోగించిందని మొన్న జూన్‌లో అమెరికా ఆరోపించింది. అలెప్పో దగ్గరలోనే ఉన్న షేక్ మక్సూద్ దగ్గర ఏప్రిల్ 13న, కుసార్ అబూ సమారా అనే చోట మే నెల 14న రసాయనిక ఆయుధాల ప్రయోగం జరిగిందని అగ్రరాజ్యం ఆరోపణ. మే నెల 23న అద్రా పట్ణణం దగ్గర కూడా ఇలాంటి దాడి జరిగిందని అమెరికా రాయబారి సమితికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అలెప్పో, హామ్స్, డెమాస్కస్లలో ఈదాడులు జరిగాయని మార్చి 25న ఫ్రాన్స్, బ్రిటన్లుసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కి మూన్‌కు ఫిర్యాదు చేశాయి. వాటి ఫలితమే సిరియాకు రసాయనిక ఆయుధాల తనిఖీ బృందం రాక. ఆ ఆయుధాలు ప్రయోగించిన ప్రదేశాల నుంచి తీసుకున్న మట్టి నమూనాలు, ప్రజల నుంచి తీసుకున్న ఇంటర్వ్యూల పరిశీలన ఇప్పటికే పూర్తయినాయి. ప్రస్తుతం అంతర్యుద్ధానికి కేంద్ర బిందువుగా ఉన్న నైరుతి ప్రాంతం చమురు వనరులు విస్తృతంగా ఉన్నదే. 2011 నుంచి జరుగుతున్న ఈ పోరులో ఇంతవరకు లక్షకు పైగా జనం మరణించారు. ఈ ఘర్షణ ఇప్పటితో ఆగేది కాదన్న భయాందోళనలు కూడా ప్రజ లలో బలపడినట్టు కనిపిస్తున్నాయి. కొద్దికాలంగా దేశం విడిచి ఇరాక్‌కు ఉత్తరంగా ఉన్న ఐక్యరాజ్యసమితి శిబిరాలకు వెళ్లిన వారి సం ఖ్య పందొమ్మిది లక్షలు. ఈ కొద్దిరోజులలోనే 30 వేల మంది సిరియన్లు, ముఖ్యంగా కుర్దిష్‌లు వె ళ్లిపోయారు. దేశంలో పోరాడుతున్న తిరుగుబాటుదారులకు కొన్ని విదేశశక్తులు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని, ఇది ఇకపై సాగదని సిరియా ప్రధాని నూరి అల్ మాలిక్ హెచ్చరించడం గమనించవచ్చు. చిత్రంగా, సిరియా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగానే తిరుగుబాటు శక్తులను ఆదుకోవాలన్న ఆలోచన అమెరికాకు వచ్చిం దని జూన్‌లో ఒబామా ప్రకటించడం ఈ ఉదంతం మొత్తానికి కొసమెరుపు. అఫ్ఘానిస్థా న్లో పాకిస్థాన్‌లో అల్ కాయిదాతో పోరాడుతున్న అమెరికా, సిరియాలో అల్‌కాయిదా మద్దతుదారులకు సాయం చేయడానికి నిర్ణయించిందన్నమాట. ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉండగానే అకె సెల్‌స్ట్రామ్ (స్వీడన్ రసాయనిక ఆయుధాల నిపుణుడు)నాయకత్వంలోని సమితి తనిఖీ బృందం తన పని సాగించవలసి ఉంది. ఇదికూడా చిత్రంగానే అనిపిస్తుంది. గతంలో ఇరాక్ వ్యవహారంలో తనిఖీ బందానికి ఎదురైన ప్రతిఘటన, ఎదురుదాడి సిరియా నుంచి ఎదురుకాలేదు.కానీ తనతో కలిసిరాని ప్రతి దేశం మీద సమితిని అడ్డం పెట్టుకుని అగ్రరాజ్యాలు ఇలాంటి ‘తనిఖీ’ అస్త్రాలు ప్రయోగించే సంప్రదాయాన్ని నెలకొల్పుతున్న సూచనలు స్పష్టం గానే కనిపిస్తున్నాయి. డా॥గోపరాజు నారాయణరావు -
రోజులు దగ్గరపడ్డ దావూద్!
ఉగ్రవాదులతో, మాఫియాలతో, మత ఛాం దసవాదులతో సార్వభౌమాధికార దేశం వ్యవహరించవలసిన తీరుకు భిన్నమైన వ్యవహార సరళినే పాకిస్థాన్ ప్రదర్శిస్తూ ఉంటుం ది. ‘గ్లోబల్ టైస్ట్’ షేక్ దావూద్ ఇబ్రహీం కస్కర్ గురించి పాకిస్థాన్ తాజాగా వెల్లడిం చిన అంశాలు అలాంటి ప్రమాద వైఖరి కొనసాగింపునే స్ఫురింపచేస్తున్నాయి. కాశ్మీర్లో అధీనరేఖ దగ్గర పాక్ సైనికులు మళ్లీ పెద్ద ఎత్తున తెగబడటంతో ఐదుగురు భారత సైని కులు మరణించారు. ఈ పరిణామాన్ని మనదేశం తీవ్రంగానే పరిగణించింది. ఈ ఘటన సృష్టించిన ప్రకంపనాల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి పాకిస్థాన్ సరికొత్త రాజకీయ క్రీడకు పావులు కదిపింది. దావూద్ ప్రస్తావన ఒక్కసారిగా తెర మీదకు రావడం వెనుక భూమిక ఇదే. ఉగ్రవాదులూ, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన గజనేరగాళ్ల విషయంలో మళ్లీ ప్రధాని అయిన నవాజ్ షరీఫ్ అప్రమత్తంగా ఉండదలిచారని అనిపిస్తున్నది. ఇలాంటి వారి వల్ల దేశంలో చెలరేగుతున్న సమస్యలను, దిగజారిన ప్రతిష్టలను నవాజ్ దృష్టిలో ఉంచుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ కూడా నవాజ్ కౌటిల్యం వీడలేదు. ఎప్పటి నుంచో భారత్ అప్పగించమని కోరుతున్న దావూద్ గురించి ఉప్పందించి, చేతులకు మట్టి అంటకుండా అతడిని వదిలించుకోవాలను కోవడం, అలా తమ సైన్యం తాజాగా ప్రదర్శించిన దుందుడుకుతనంపై నుంచి అందరి దృష్టిని మళ్లించవచ్చుననేది నవాజ్ ఊహ. ఇది సాధ్యమా? ‘గ్లోబల్ టైస్ట్’ అంటూ అమెరికా దావూద్ కోసం ఒక పదబంధమే సృష్టించి, ప్రచారం చేసింది. అల్ కాయిదాతో సాన్నిహిత్యం నెరపుతున్న ఈ ‘అండర్ వరల్డ్ డాన్’ను వది లిం చుకోవడం పాకిస్థాన్‌కు సాధ్యమేనా? పాకిస్థాన్ నేతలందరికీ తలలో నాల్కగా ఉన్న ఈ నేరగాడిని దేశం నుంచి పంపగలరా? సరిహద్దులలో పాక్ దుశ్చర్యలపై మన పార్లమెంట్ దద్దరిల్లిపోతున్న తరుణంలో, ఈ ఆగస్టు 9న షహ్రయార్ఖాన్ హఠాత్తుగా దావూద్ గొడవను రంగం మీదకు తెచ్చాడు. భారత్‌తో సంబంధాల పునరుద్ధరణ కోసం ఆయనను తన ప్రత్యేక దూతగా నవాజ్ నియమించుకున్నారు. ‘క్రికెట్, పాకిస్థాన్ రాజకీయాలు’ అంశంపై షహ్రయార్ రాసిన పుస్తకం బ్రిటన్‌లో ఇటీవల విడుదలైంది. ఆ సందర్భం గా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘దావూద్ పాకిస్థాన్‌లో ఉండేవాడే గానీ, అతడిని దేశం నుంచి తరిమిమేశారని అనుకుంటున్నాను. ఒకవేళ పాకిస్థాన్‌లో ఉన్నట్టు సమాచారం ఉంటే, వేటాడి అరెస్టు చేయవలసిందే. అలాంటి వ్యక్తి మా దేశాన్ని కేంద్రంగా చేసుకుని అకృత్యాలు పాల్పడటాన్ని అనుమతించబోం’ అని షహ్రయార్ అన్నారు. పాక్ నుంచి దావూద్ మధ్య ప్రాచ్యానికి, బహుశా యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లి ఉండొచ్చని కూడా షహ్రయార్ నిగూఢంగా సంకేతించారు. ఎస్. హుసేన్ జైదీ రాసిన ‘డోంగ్రీ టు దుబాయ్’ పుస్తకం దావూద్ ప్రయాణంలో కనిపించే రక్తపుటడుగులను కళ్లకు కడుతుంది. కానిస్టేబుల్ కొడుకైన దావూద్ ముంబై మహా నగర నేరకేంద్రం డోంగ్రీలో 1974లో సృష్టిం చిన సంచలనం గురించి అందులో ఉంది. అప్పటికి అక్కడ డాన్‌గా ఉన్న పఠాన్ బాషు దాదా మీద ఇతడు సోడాసీసాలతో దాడి చేశా డు. ఆపై హాజీ మస్తాన్, వరదరాజన్ మొదలియార్, కరీంలాలా వంటి డాన్లను పక్కకు నెట్టేసి పైకొచ్చాడు. 1950లలో కేవలం కత్తిపోట్లకు పరిమితమైన ముంబై మాఫియా కార్యకలాపాలను అంతర్జాతీయ నేరాల స్థాయికి తీసుకువెళ్లినవాడు దావూద్. 1976లో అతడు ప్రారంభించిన ‘డి కంపెనీ’ పెద్ద నేరాలే చేసేది. గులాం హస్నని రాసిన వ్యాసం (‘దేశవాళీ డాన్ దావూద్‌తో ఒక రోజు’) చాలా ఆసక్తికరమైన పరిణామాలను వెల్లడించింది. 1982 నాటి ముంబై కార్మికుల సమ్మె నగరం స్వరూపాన్నే కాదు, మాఫియా ముఠాల విస్తృతిని కూడా ఊహకు అందనంతగా మార్చేసింది. డి కంపెనీ ఆయుధాల రవాణా, హవాలా, దొంగనోట్లు, మత్తు పదార్థాల రవాణా, బెదిరించి డబ్బు వసూలు చేయడం, కాంట్రాక్ట్ హత్యల వరకు విస్తరించింది. ‘బిగ్ డి’ సిని మాలకు పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు. బాలీవుడ్ ప్రముఖులతో ఇప్పటికీ దావూద్ సంబంధాలు కలిగి ఉన్నాడు. భరత్షా వంటి వారు ఈ కారణంగా అరెస్టయ్యారు. నటి మందాకినితో దావూద్ సంబంధం ఇంకా గాఢమైనది. అయోధ్య పరిణామాల అనంతరం ఛోటా రాజన్ హిందువుల కుటుంబాల యువకులతో కొత్త కుంపటి పెట్టుకున్నాడు. అయోధ్య ఘటనలకు ప్రతీకారంగానే 1993 ముంబై వరస పేలుళ్లు జరిగాయి. దీంట్లో కీలక పాత్రధారి టైగర్ మెమన్, దావూద్ ముఖ్య అనుచరుడు. ఆ పేలుళ్ల సమయంలో నగరంలోని లేని దావూద్ మళ్లీ భారత్‌లో కనిపించలేదు. 250 మంది మృతికి కారణమైన ఆ పేలుళ్ల వెనుక దావూద్ ఉన్నాడని మన సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. డి కంపెనీకి పాక్ కేంద్రమైంది. అల్ కాయిదా, లష్కరే తాయిబా వంటి మత ఛాం దస సంస్థలతో దావూద్ బంధం అక్కడ నుం చే. బిన్ లాడెన్‌తో దావూద్‌కు సాన్నిహిత్యం ఉందని అమెరికా బయటపెట్టింది. అఫ్ఘాని స్థాన్ నుంచి అల్‌కాయిదా సభ్యులు పారిపోవడానికి తన మాఫియా మార్గాలను దావూద్ చూపించాడు. కరాచీలో దావూద్ ఉన్నాడని మొదటి నుంచి సీబీఐ ఆరోపిస్తూనే ఉంది. దావూద్ భార్య, నలుగురు కుమార్తెలు, కుమా రుడికి పాక్ పాస్‌పోర్టులు ఉన్నాయి. అయితే దావూద్ దేశంలో ఉన్నట్టు పాకిస్థాన్ ఏనాడూ అంగీకరించలేదు. చిత్రంగా కరాచీ అడ్డాగా ఇతడు దక్షిణాసియా మొత్తం విస్తరించాడు. మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలం క, నేపాల్, దుబాయ్లతోపాటు జర్మనీ, ఫ్రా న్స్, ఇంగ్లండ్‌లలో కూడా ఇతడి కార్యకలాపా లు విస్తరించాయి. ఇతడి లావాదేవీల విలువ 3 వేల కోట్ల రూపాయలకు పైనే. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోనూ డి కంపెనీ పాత్ర ఉంది. దావూద్ వంటివాణ్ణి కలకాలం భరించ డం సాధ్యం కాదన్న భావన పాక్‌కు వచ్చిం దా? అదేమో గానీ, దావూద్ ప్రాభవం కోల్పోతున్నాడని చెప్పే సంఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి. దావూద్ అనుచరులు ఛోటా షకీల్, అబూసలేం, టైగర్ మెమన్లు మన పోలీసుల అధీనంలోనే ఉన్నారు. ముంబై పేలుళ్ల దరిమిలా 20 మంది పేర్లతో భారత్ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకడైన అబ్దుల్ కరీం తుండాను ఆగస్టు 15న నేపాల్ సరిహద్దులలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముఖ్య సభ్యుడు మీర్జా అరీఫ్ బేగ్‌కు అంతకు ముందురోజే లక్నో కోర్టు దొం గ పాస్‌పోర్టు కేసులో ఐదేళ్లు శిక్ష విధించింది. షహ్రయార్ ప్రకటన మేరకే చూసినా, కొద్దికాలం క్రితం దావూద్ పాక్‌లో ఉన్నమాట నిజం. అప్పుడు భారత్ ఎన్నిసార్లు కోరినా అతడిని ఎందుకు అప్పగించలేదు? ఇప్పుడు అతడు దేశం వీడి వెళ్లి ఉంటే ఎవరు సహకరించారు? వీటికి సమాధానం కావాలని మన ప్రతిపక్షాలు అంటున్నాయి. దావూద్ యూఏ ఈ వెళ్లిన మాట నిజమే కానీ, అతడు రంజాన్ కోసం వెళ్లాడని, కొద్దిరోజులకే తిరిగి పాక్ వెళ్లిపోతాడని కొందరు గూఢచారులు చెబుతున్నా రు. ఏమైనా కొంగున బిగించుకున్న నిప్పును పాక్ వదిలించుకుంటుందా; లేక శరీరమే కాల్చుకుంటుందా? చూడాలి. -డాక్టర్ గోపరాజు నారాయణరావు -
చైనా తల్లుల గర్భశోకం పుట్టెడు!
ఒక బిడ్డ నిబంధన శిలాశాసనం కాబట్టి భ్రూణహత్యలు అంచనాకు అందనంత సంఖ్యలో సాగుతున్నాయి. వీటిని ప్రభుత్వ వైద్యాధికారులే సాగిస్తారు. ఏమైనా చైనా ఒకే బిడ్డ అనే తన కఠోర విధానాన్ని మార్చుకోక తప్పని పరిస్థితే కనిపిస్తున్నది. ఆ విధానం మీద ప్రభుత్వం పట్టు కోల్పోయే పరిస్థితే అక్కడ బలపడుతున్నది. ప్రపంచంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిన చైనా జనాభా అదుపులో నాటు వైద్యాన్ని అశ్రయించినట్టు భావిస్తున్నదా? 70వ దశకంలో మొదలైన ఒక బిడ్డ విధానం అవాంఛనీయ పరిణామాల దిశగా చైనా సామాజిక వ్యవస్థను నడిపించిన మాట నిజం. ఈ వాస్తవాన్ని గడచిన నాలుగయిదేళ్లుగా కమ్యూనిస్టు ప్రభుత్వం గుర్తించక తప్పడం లేదు. అత్యంత కఠినంగా అమలు చేస్తున్న ఈ విధానం వల్ల భవిష్యత్తులో చైనా శ్రామిక కొరత సమస్యను ఎదుర్కోబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. దీనితో ఎదురయ్యే ప్రభావాన్ని 2015 సంవత్సరానికే చైనా చవిచూడవలసి వస్తుంది. వీటన్నిటి ఫలితమే రెండో బిడ్డకు అవకాశం కల్పించాలన్న చైనా ప్రభుత్వ యోచన. ఆహారధాన్యాల కొరత రాకుండా ఉండడానికి చైనా జనాభాను అదుపు చేసింది. ఆ దేశం సాధించిన పురోగతికీ, జనాభా అదుపునకూ మధ్య సంబంధం ఎంత గాఢమైనదో తెలియదు కానీ, బలవంతపు కుటుంబ నియంత్రణ కారణంగా మూడు దశాబ్దాలుగా చైనా మాతృమూర్తులు మాత్రం ఘోరమైన క్షోభను మౌనంగా అనుభవించిన మాట వాస్తవం. ఈ జూన్ మధ్యలో జరిగిన ఘటన చైనా అధికారులకు వాస్తవాన్ని తెలుసుకునేటట్టు చేసింది. డాగ్జింగ్ నగరంలో తన నాలుగో బిడ్డ వివరాలు నమోదు చేసుకోవడానికి నిరాకరించిన ‘ఒకే బిడ్డ’ పథకం అమలు అధికారులు ఇద్దరిని ఒక పౌరుడు హత్య చేశాడు. ఇది గగ్గోలు పుట్టించింది. బిడ్డకు సంబంధించిన వివరాలు అధికారికంగా నమోదు కాకుంటే ఆ సమస్యలు ఎంత తీవ్రమైనవో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. పౌరసత్వంతో పాటు, అన్ని ప్రభుత్వ పథకాలకు ఆ బిడ్డ దూరంగా ఉండవలసివస్తుంది. కానీ ఒకే బిడ్డ పథకం వల్ల ఇంతవరకు నలభై కోట్ల జననాలను అదుపు చేయడానికి వీలు కలిగిందని అధికారులు వాదిస్తున్నారు. దేశ జనాభా 130 కోట్ల దగ్గర ఆగిందంటే కారణం అదేనని కూడా వారు చెబుతున్నారు. కానీ జనాభా సంక్షోభం చైనాలో ప్రస్తుత వాస్తవమని జాతీయ ఆరోగ్య, కుటుంబ నియంత్రణ కమిషనర్ మావో క్యునన్ ఆగస్టు 3న వెల్లడిం చాడు. పట్టణ, నగర ప్రాంత దంపతులు ఒక బిడ్డ తరువాత కుటుంబ నియంత్రణ పాటించాలన్న పద్ధతిని 1978లో చైనా ప్రవేశపెట్టింది. ఇది గ్రామీణ ప్రాంతాలకు యథాతథంగా వర్తించదు. మొదటి కాన్పులో ఆడబిడ్డ పుట్టిన వారు, తరువాత ఇంకొక బిడ్డను కనడానికి అర్హులవుతారు. ఒక బిడ్డ విధానం వల్ల స్త్రీ పురుష నిష్పత్తిలో గణనీయమైన వ్యత్యా సం వచ్చిందన్న విమర్శ కూడా ఉంది. గత సంవత్సరం నిర్వహించిన ఒక సర్వే ప్రకారం చైనా జనాభాలో 13.7 శాతం (185 మిలి యన్లు) అరవైలకు దగ్గరగా ఉన్నారు, లేదా ఆ వయసుకు చేరుకున్నారు. ఈ సంఖ్య కేవలం 2015కే 22 కోట్ల 10 లక్షలకు చేరుతుందని అంచనా. ఇందులో సంతానానికి దూరంగా ఉండే జనాభా 5 కోట్ల 10 లక్షలుగా తేల్చారు. నిజానికి ఒక బిడ్డ నిబంధనను సడలించే పని చైనాలో కొన్నిచోట్ల 2007లోనే మొదలయింది.స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కొన్ని ప్రాంతాలలో ఇది అమలవుతోంది. ఇందుకు ఒక ఉదాహరణ షాంఘై నగరం. దీని ప్రకారం రెండో బిడ్డను కనాలనుకుంటున్న భార్యాభర్తలు ఇద్దరు ఒకే బిడ్డ నిబంధనను పాటించిన కుటుంబం నుంచి వచ్చినవారై ఉండాలి. ఇదే దేశమంతా అమలుచేయాలని యోచిస్తున్నారు. ఇది ఈ సంవత్సరాంతంలో లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో అమలులోకి రావచ్చు. జనాభా విధానాన్ని కమ్యూనిస్టు పార్టీయే రూపొందిస్తుంది. జనాభాను నిలకడగా ఉంచాలన్న మౌలిక విధానాన్ని మార్చుకోకుండానే, సమీప భవిష్యత్తులో ఎదుర్కొనబోయే శ్రామికుల కొరతను నివారించేందుకు రెండో బిడ్డకు అవకాశం కల్పిస్తున్నారు. ఏమైనా చైనా ఒకే బిడ్డ అన్న తన కఠోర విధానాన్ని మార్చుకోక తప్పని పరిస్థితే కనిపిస్తున్నది. ఆ విధానం మీద ప్రభుత్వం పట్టు కోల్పోయే పరిస్థితే అక్కడ బలపడుతున్నది. రెండో బిడ్డ గురించి ఇటీవల జరిపిన సర్వేలో 1400 మందిని ప్రశ్నించగా అందులో 53 శాతం తాము ఇందుకు సుముఖంగా ఉన్నామని ప్రకటించారు. ‘మెట్రోపోలిస్’ అనే పత్రిక ప్రచురించిన ఈ సర్వే ప్రకారం తమకు రెండో బిడ్డ కావాలని ఉన్నా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక్క బిడ్డే చాలనుకుంటున్నామని 28 శాతం చెప్పారు. 12 శాతం మాత్రం తాము సంతానం కోసం ఆలోచించడం లేదని చెప్పారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా నిపుణుల అంచనా ప్రకారం ఒకవేళ చైనా ప్రభుత్వం రెండో బిడ్డను కనడానికి అభ్యంతరం లేదని ప్రకటిస్తే చైనాలో ఏటా 95 లక్షల జననాలుకు పూర్వరంగం ఏర్పడుతుంది. ఒకే బిడ్డ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే 2020 నాటికి స్త్రీల కంటె 24 మిలియన్ పురుషులు అదనంగా ఉంటారు. వీరిలో పది శాతం పురుషుల జీవితం తోడు లేకుండానే గడిచిపోతుంది. చైనాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమే కావచ్చు, కానీ ఒక కుటుంబంలో మరో బిడ్డ రావడం ప్రాకృతికమైన అంశం. ఆ బిడ్డను వదులుకోవలసి రావడం అనుబంధాలకు సంబంధించిన అతిసున్నితమైన అంశం. ఆంక్షలకు విరుద్ధంగా కొందరు తల్లులు రెండో బిడ్డను, ఇంకొందరు తల్లులు మూడో బిడ్డను గర్భం దాల్చితే వారిపట్ల ప్రభుత్వాధికారులు వ్యవహరిస్తున్న తీరు అమానుషంగా ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నిబంధన శిలాశాసనం కాబట్టి భ్రూణహత్యలు అంచనాకు అందనంత సంఖ్యలో సాగుతున్నాయి. వీటిని ప్రభుత్వ వైద్యాధికారులే సాగిస్తారు. చైనా కుటుంబ నియంత్రణ విభాగం మాజీ అధికారి ఝాంగ్ వీక్వింగ్ దారుణమైన విష యం బయటపెట్టారు. చైనా వైద్య ఆరోగ్య శాఖలో 1,50,000 ఉద్యోగులు ఉండగా, ఇం దులో మూడో వంతు వృత్తిపరమైన అర్హతలు లేనివారే. వీరే కుటుంబ నియంత్రణను అమ లు చేస్తారు. ఇక గర్భనిరోధకాలు వాడటం వల్ల మహిళలు ఎదుర్కొంటున్న దుష్ఫలితాలు ఘోరంగా ఉంటున్నాయని గౌంగ్ఝువాలో ఉన్న సన్యెట్సెన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ జియెమింగ్ చెప్పారు. ఏడో నెలలో గర్భస్రావాలు చేయ డం వల్ల తల్లులు ఆరోగ్యపరంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నారు. తమ బాధను ఆ మృత శిశువుల పక్కన రాతపూర్వకంగా ఉంచుతున్నారు. ఇలాంటి ఒక ఘటనే కొద్దికాలం క్రితం కలకలం రేపింది. కొన్ని సందర్భాలలో బిడ్డను కంటె, ఆ శిశువులకు ఇంజెక్షన్ ఇచ్చి చంపుతున్న సంగతి కూడా బయటపడింది. నిబంధనలకు వ్యతిరేకంగా గర్భం తో ఉన్న మహిళలను ఎనిమిదో నెలలో కూడా అధికారులు ఆస్పత్రులకు తీసుకెళ్లి గర్భస్రావం చేయించిన సంఘటనలు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా మరో బిడ్డను కనకుండా ప్రభుత్వం స్త్రీల గర్భాలలో ఏర్పాటు చేసే గర్భనిరోధక సాధనం (ఐయూడీ) వల్ల కూడా విపరీతమైన దుష్ఫలితాలు ఎదురవుతున్నాయి. ఈ సాధనం ఏర్పాటు చేసి రెండు దశాబ్దాలు గడిచినా మళ్లీ తనిఖీ చేసి తొల గించే వ్యవస్థ అక్కడ లేదు. దీనితో చాలామంది స్త్రీలు గర్భాశయాన్ని తొలగించుకోవలసి వస్తున్నది. కుటుంబ నియంత్రణ లేదా, ప్రసవాలలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం గురించి ‘ది బీజింగ్ న్యూస్’ వెల్లడించింది. ఈ సంవత్సరం మార్చి 19న ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భస్థ సంబంధమైన శస్త్రచికిత్స జరిగినపుడు హ్యూబీ అనే మహిళ మరణిస్తే అధికారులు నష్టపరిహారం పేరుతో ఆమె భర్త షెంగ్ హోగ్జియా నోరు నొక్కేశారు. అతడికి పది లక్షల యెన్లు ఇచ్చారు. అభివృద్ధిని ఎవరూ కాదనలేరు. కానీ అది మానవీయ కోణంతో జరగకపోతే ఫలి తాలు తీవ్రంగానే ఉంటాయి. అది గమనించాలి. - డాక్టర్ గోపరాజు నారాయణరావు -
యుద్ధము... అశాంతి!
ఇద్దరూ ఏక్షణంలోనైనా మళ్లీ అడవులకు పారిపోయే ప్రమాదం ఉందని అందరికీ అనుమానమే. గ్రామీణులు ఇచ్చిన తిండే కాదు, నీరు కూడా లాన్ ముట్టడం లేదు. 40 ఏళ్లు ఈ ఇద్దరు ఆ అడవిలో జీవించగలగడం వింతల్లో కెల్లా వింత అని కెమ్ గ్రామస్థులు అనుకుంటున్నారు. నిజమే... యుద్ధం తరువాత ఏదీ నాగరికంగా మిగలదు. థాన్, లాన్ నిష్ర్కమణ అందుకు నిదర్శనం. ఈ వాస్తవాన్ని అమెరికా మేధావులు ఇప్పటికైనా గుర్తిస్తున్నారు. ప్రపంచంలో ఏ యుద్ధ చరిత్ర చూసినా విజయ భావన క్షణికమే. అది మిగిల్చే విషాదం మాత్రం అనంతం. మొదటి ప్రపంచ యుద్ధం (1914-18), రెండో ప్రపంచ యుద్ధం (1939-45), వియత్నాం యుద్ధం (1959-75), ఇరాన్-ఇరాక్ యుద్ధం (1980-88)- మరే ఇతర యుద్ధ జ్ఞాపకమైనా, విషాదమైనా కాలాన్ని వెంటాడుతూనే ఉంటుంది. యుద్ధం దుష్ఫలితాలను వియత్నాం భూభాగాలు ఇప్పటికీ అనుభవిస్తున్నాయి. గెరిల్లా తం త్రంతో అడవుల నుంచి యుద్ధం చేసిన వియత్నాం సైనికులకు నిలువనీడ లేకుండా చేయడానికి చల్లిన ఏజెంట్ ఆరెంజ్ అనే ప్రాణాం తక రసాయనం ప్రభావాన్నీ, ఇప్పటికీ భూమిలో మిగిలిన మందుపాతరలని తొల గించడానికీ 2012లో మళ్లీ అమెరికాయే చర్య లు ప్రారంభించింది. అప్పటి ఒక మందుపాతర ప్రతిధ్వనిని అనుకోకుండా రెండు రోజు ల క్రితమే వియత్నాం పౌరులు థాన్, లాన్ అనే తండ్రీ కొడుకుల ఉనికితో విన్నారు. మం దుపాతర, బాంబులు తన ఇంటి దగ్గర పేలి; భార్యా, ఇద్దరు పిల్లలు చనిపోవడంతో మిగి లిన ఏడాది వయసు మగబిడ్డను తీసుకుని అడవులలోకి నిష్ర్కమించిన థాన్ ఆచూకీ ఇప్పుడు దొరికింది. ఇదొక వెండితెర కథను మరిపిస్తుంది. కానీ యుద్ధ బీభత్సాన్ని చూడలేక అడవుల లోకి పారిపోతూ ఆ వ్యక్తి అనుభవించిన మానసిక హింసనూ, బాహ్య ప్రపంచం గురించిన జ్ఞానం లేకుండా, తన మాతృభాష కూడా నేర్పకుండా కొడుకుతో నలభై ఏళ్లు కొండకోనలలో ఉండిపోయేటట్టు చేసిన అతని భయాందోళనలూ ఏ కెమెరా కన్నుకూ అందేవి కావు. ప్రచ్ఛన్నయుద్ధం తారస్థాయిలో ఉన్నకాలంలో వియత్నాం యుద్ధం జరిగింది. ఫ్రాన్స్, జపాన్ల ఆధిపత్యాన్ని కూలదోయడానికి వియత్నాం సుదీర్ఘ పోరాటమే జరిపింది. డాక్టర్ హోచిమిన్ 1954లో ఫ్రెంచ్ ఆధిపత్యా న్ని పడగొట్టాడు. అప్పుడు జరిగిన ఒప్పం దంలో ఉత్తర వియత్నాం ప్రాంతాన్ని కమ్యూనిస్టుల చేతికీ, దక్షిణ వియత్నాం అమెరికా మద్దతు ఉన్న వర్గానికీ వెళ్లాయి. దక్షిణ వియత్నాంను కూడా కలిపి విశాల వియత్నాం ఏర్పాటు చేయడానికి వెంటనే మరో పోరాటం మొదలైంది. ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి అమెరికా చేసిన ప్రయత్నమే వియత్నాం యుద్ధం. అమెరికా సుదీర్ఘకాలం చేసిన ఒకే ఒక్క యుద్ధం. నలభై లక్షల మంది ఉత్తర, దక్షిణ వియత్నాం సాధారణ పౌరులుచనిపోయారు. 11 లక్షల మంది కమ్యూనిస్టులు చని పోయారు. దాదాపు 60 వేల అమెరికా సైన్యం మట్టి కరిచింది. ఎలాంటి ఫలితం సాధించకుండానే అమెరికా యుద్ధం విరమించుకుం ది. మొదట్లో సైన్యానికి మద్దతు ఇచ్చిన అమెరికా పౌరులు అనంతర కాలంలో తమ వైమనస్యాన్ని ప్రకటించారు. యుద్ధ సమయంలో వియత్నాం, లా వోస్, కంబోడియాల మీద అమెరికా దాదాపు 70 లక్షల బాంబులు కురిపించింది. వాటిలో వియత్నాంలోని క్వాంగ్ ప్రాంతంలోని టేత్రా కమ్యూన్లోని కెమ్ అనే శివారు గ్రామం మీద 1971లో పడిన ఒక బాంబే హో వాన్ థాన్ జీవితాన్ని అడవుల పాల్జేసింది. అతడి ఇంటికి సమీపంగా మందుపాతర పేలడం వల్ల, విమానాల నుంచి పడుతున్న బాంబుల వల్ల అప్పుడే ప్రసవించిన థాన్ భార్య, మరో ఇద్దరు పిల్లలు చనిపోయారు. చేతికి అందిన ఏడాది వయసు కొడుకు హో వాన్ లాన్‌ను తీసుకుని థాన్ నలభై మైళ్ల దూరంలోని అడవులకు పారిపోయాడు. అతడు ఉత్తర వియత్నాం తరఫున అమెరికాతో పోరాడుతున్నవాడే. అయితే అంత బీభత్సంలోను థాన్ భార్య ప్రసవించిన కొడుకు హో వాన్ త్రి బతికే ఉన్నాడు. అతడిని సమీప బంధువొకరు పెంచి పెద్ద చేశారు. ఇరవై ఏళ్ల క్రితం ఇతడే అడవులలో ఉన్న తన తండ్రి, అన్నల ఉనికిని కనుగొనగలిగాడు. వాన్ త్రి, ఇతర బంధువులు ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది. థాన్ అడవి విడిచి గ్రామంలోకి రావడానికి అంగీకరించలేదు. తరువాత మళ్లీ కొన్ని సంబారాలు, బట్టలు తీసుకుని వెళితే ఆ ఇద్దరి ఆచూకీ దొరకలేదు. దీనితో ఆ ఇద్దరు చనిపోయి ఉంటారని కెమ్ గ్రామవాసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ అనుకోకుండా అడవి శివార్లలోని గ్రామీణులు వంట చెరకు కోసం పాతిక మైళ్లు లోపలికి వెళ్లినపుడు ఈ తండ్రీ కొడుకుల ఆచూకీ తెలిసింది. అధికారులకు విషయం తెలిసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రహస్యంగా వెళ్లి పట్టుకున్నారు. థాన్ నడిచే స్థితిలో లేడు. అతడి వయసు 82 సంవత్సరాలు. లాన్ వయసు 41 సంవత్సరాలు. థాన్‌ను కమ్యూన్ కేంద్ర వైద్యాలయంలో చేర్చి చికిత్స చేస్తున్నారు. లాన్‌ను బంధువుల అధీనంలో ఉంచారు. ఆధునిక కాల యుద్ధం ఆ తండ్రీ కొడుకులను ఆటవిక జీవితాన్ని ఎంచుకునేటట్టు చేసింది. ఆ ఇద్దరు కూరలు పండించేవారు. వేటాడేవారు. చెరకు, పొగాకు కూడా సొంత అవసరాల కోసం పండించారు. చెట్టు బెరడు తో తయారు చేసిన గుడ్డలాంటి వస్త్రంతో, అడ్డదిడ్డంగా కత్తిరించిన జుట్టుతో 41 ఏళ్ల లాన్ దొరికాడు. అడవిలో ఆకాశాన్ని చుంబిస్తున్నట్టు ఉండే ఓ చెట్టు మీద ఇరవై అడుగుల ఎత్తున వెదురుబొంగులతో ఆవాసాన్ని (ట్రీహౌస్) ఏర్పాటు చేసుకున్నారు. నిప్పు తయా రు చేయడం నేర్చుకున్నారు. థాన్ వియత్నాంలోని అనేక తెగలలో ఒక మైనారిటీ తెగకు చెందినవాడు. అతడి మాతృభాష కొర్. కమ్యూన్ అంతా మాట్లాడే కిన్ భాషను పూర్తిగా మరచిపోయాడు. కొర్ భాషలో కొద్దిగా మాట్లాడుతున్నాడు. లాన్‌కు కొన్ని పదాలు మాత్రమే తెలుసు. ఇద్దరూ ఏక్షణంలోనైనా మళ్లీ అడవులకు పారిపోయే ప్రమాదం ఉందని అందరికీ అనుమానమే. గ్రామీణులు ఇచ్చిన తిండే కాదు, నీరు కూడా లాన్ ముట్టడం లేదు. 40 ఏళ్లు ఈ ఇద్దరు ఆ అడవిలో జీవించగలగడం వింతల్లో కెల్లా వింత అని కెమ్ గ్రామస్థులు అనుకుంటున్నారు. నిజమే... యుద్ధం తరువాత ఏదీ నాగరికంగా మిగలదు. థాన్, లాన్ నిష్ర్కమణ అందుకు నిదర్శనం. ఈ వాస్తవాన్ని అమెరికా మేధావులు ఇప్పటికైనా గుర్తిస్తున్నారు. డా॥గోపరాజు నారాయణరావు -
సోనార్ బంగ్లాకు దారేదీ!
విశ్లేషణ: ఆగస్టు 1న బంగ్లా హైకోర్టు జమాత్ గుర్తింపును రద్దు చేసింది. ఫలితంగా ఎన్నికలలో పోటీకి అర్హత కోల్పోయింది. మరో 6 మాసాలలో బంగ్లా ఎన్నికలు జరగబోతున్నాయి. అగ్ర నాయకులకు వరసగా పడుతున్న కఠిన శిక్షలతో ఉడికిపోతున్న జమాత్ సంస్థకు హైకోర్టు తీర్పుతో పుండు మీద కారం చల్లినట్లయింది. హైకోర్టు తీర్పు మీద స్టే విధించాలని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కూడా కొట్టివేస్తూ, హైకోర్టు తీర్పును సమర్థించింది. దీనితో హింసాకాండ మరింత పెరిగింది. భారత్‌ను గాయపరుస్తూ, తనూ గాయపడి పుట్టిన దేశం పాకిస్థాన్. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించినప్పుడు కూడా చరిత్ర పునరావృతమైంది. ఆ చిన్నదేశం పెద్ద గాయంతోనే పుట్టింది. మాతృభాషాభిమానం (బెంగాలీ), ఆత్మగౌరవ నినాదం రగులుకుని అంతర్యు ద్ధంగా పరిణమించి దాని నుంచి బంగ్లాదేశ్ 1971, డిసెం బర్ 16న అవతరించింది. 1971 నాటి ఆ పరిణామాలు ఇప్పటికీ బంగ్లాను వెంటాడుతూనే ఉన్నాయి. ఆనాటి గాయాలు ఇంకా మానలేదు. నాటి అంతర్యుద్ధంలో జరి గిన ఘోరాల మీద ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం నియమించిన అంతర్జాతీయ యుద్ధ నేరాల విచారణ ట్రిబ్యునల్ ఒక్కొక్క తీర్పూ వెల్లడిస్తూ ఉంటే, ఆ చిన్న దేశం హింసతో, రక్తపాతంతో తల్లడిల్లిపోతోంది. అంతర్యుద్ధం లో పాకిస్థాన్ సైన్యాల అండతో, స్వతంత్ర బంగ్లాదేశ్ వాదులను, హిందువులను, స్వతంత్ర బంగ్లా వాదనను సమర్థించిన రచయితలను, మేధావులను, పత్రికా రచయితలను ఊచకోత కోసిన జమాతే ఇస్లామీని, ఇంకొన్ని ఇతర సంస్థలనూ హసీనా ప్రభుత్వం విచారణ ట్రిబ్యునల్ ఎదుట నిలబెట్టింది. దీనితో తీవ్ర పర్యవసానాలు చోటు చేసుకున్నాయి. పుట్టుక నాటి గాయాల లోతు ఎంతటిదో మళ్లీ అనుభవానికి వచ్చింది. స్వతంత్ర దేశ చరిత్రలో ఏనాడూ లేనంత అలజడి, రక్తపాతాలతో బంగ్లా తల్లడిల్లిపోతున్నది. అంతర్యుద్ధం తొమ్మిది మాసాల కాలంలో జరి గిన అకృత్యాలు మానవతకు మచ్చ తెచ్చేవే. దీనికి కేంద్రబిందువు జమాత్. ఇది బంగ్లాలో అతి పెద్ద మత రాజకీయాల వేదిక. 1971లో జమాత్ పాక్ సేనలతో, బంగ్లాలో పాక్ సేనలకు తొత్తులుగా ఉన్న రజాకార్లు, అల్ బదర్, అల్ షామ్స్ వంటి మత సంస్థలతో కలిసి ఈ అకృత్యాలకు పాల్పడిందని ఆరోపణ. పాక్‌సేనలు ఢాకాలో లొంగిపోయిన తరువాత బంగ్లాదేశ్ స్వతంత్ర గడ్డగా నిలబడింది. కొత్తలో బంగ్లా విముక్తి పోరాట యోధుడు, అవామీ లీగ్ నాయకుడు, ‘బంగ్లాబంధు’ షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో కలకత్తాలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం కొద్దికాలం(1971 ఏప్రిల్) ఆ చారిత్రక నగరం నుంచే నడిచింది. కానీ మూడేళ్లకి, 1975, ఆగస్టు 15న ముజిబుర్ రె హమాన్నూ, కుటుంబ సభ్యులనూ తిరుగుబాటు బృందం ఢాకాలోనే కాల్చి చంపింది. ముజిబుర్ ఐదుగురు కుమార్తెలలో ఇద్దరు విదేశాలలో ఉండటంతో బతికి బయటపడ్డారు. ప్రస్తుత అధ్యక్షురాలు, యుద్ధ నేరాల ట్రిబ్యునల్‌ను ఏర్పా టు చేసిన షేక్ హసీనా బంగ్లా బంధు పెద్ద కుమార్తె. బం గ్లాదేశ్ అవామీ లీగ్ ప్రస్తుత నేత హసీనాయే. అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) బంగ్లా ప్రధాన పక్షాలు. బీఎన్‌పీకీ, జమాత్‌కూ పొత్తు ఉంది. ప్రస్తుత ఘర్ణణలో ఈ మూడు పార్టీలు అనుసరిస్తున్న వైఖరికి పునాది వాటి ఆవిర్భావంలోనే ఉంది. జమాత్‌ను 1941, ఆగస్టు 26న అబుల్ అలా మౌదుది లాహోర్‌లో స్థాపించాడు. పాకిస్థాన్ విభజన నినాదం ఊపందుకున్న నేపథ్యంలో ఇది జరిగింది. ఇస్లామిజమ్, ఇస్లామిక్ డెమోక్రసీలు లక్ష్యమని ఇది చెబుతుంది. షరి యత్ అమలు, సామాజిక - రాజకీయ ఇస్లాం కూడా ఆశయంగా చెప్పుకుంటుంది. కానీ సాంఘికంగా యథాపూర్వ వ్యవస్థ నిర్మితం కావాలన్నదే దాని అసలు లక్ష్యం. ఈజిప్ట్‌లోని ‘బ్రదర్హుడ్’తో సన్నిహిత సంబంధాలు నెరపుతోంది. మరో మూడు చోట్ల జమాత్ ఉనికి కనిపిస్తుంది. బంగ్లా జమాత్, జమాతే ఇస్లామీ హింద్ (భారత్), జమా త్ ఇస్లామీ అఫ్ఘానిస్థాన్. ఈ మూడింటి మధ్య సంబంధాలున్నాయి. 1971 నాటి బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటాన్ని పాకిస్థాన్ జమాత్ వ్యతిరే కించింది. బీఎన్పీని 1978లో జియావుర్ రెహమాన్ స్థాపించాడు. ప్రస్తుత నేత ఖలేదా జియా, రెహమాన్ సతీమణి. జాతీయవాదం మినహా మిగిలిన సిద్ధాంతాలలో జమాత్‌కూ, బీఎన్‌పీకీ దగ్గర పోలికలున్నాయి. ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి షేక్ హసీనా రాజకీయ కక్షకు పాల్పడుతున్నారనీ, విపక్షాలను బలహీనం చేయచూస్తున్నారని బీఎన్పీ నేత ఖలేదా జియా ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్ 1949, జూన్ 23న మౌల్వీ అబ్దుల్ హమీద్ ఖాన్ బాషానీ స్థాపించాడు. లౌకికవాదం, జాతీయవాదం, ప్రజాస్వామ్యం దీని ఆశయాలు. అందుకే ముక్తివాహిని స్థాపకుడు ఎంఏజీ ఉస్మానీతో కలిసి అంతర్యుద్ధం చేసింది. షేక్ ముజిబుర్ రెహమాన్ ఈ పార్టీ నాయకుడే. ట్రిబ్యునల్ ఏర్పాటు గురించి 2008 ఎన్నికల ప్రచారంలో హసీనా వాగ్దానం చేశారు. ఆమె ప్రభుత్వం ఏర్ప డిన తరువాత 2010లో ఈ ట్రిబ్యునల్ పని ప్రారంభమైం ది. ఐక్యరాజ్యసమితి చట్టం మేరకు సమితికి చెందిన హ్యూ మన్ రైట్స్ వాచ్ మద్దతుతోనే ఈ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. 2008లోనే ఏర్పాటు చేసిన యుద్ధ నేరాల నిజనిర్ధారణ సంఘం తన నివేదికను కూడా అప్పుడే సిద్ధం చేసింది. ఈ నివేదిక మొత్తం 1,600 మందిని అనుమానితులుగా నమో దు చేసింది. 2012 సంవత్సరానికి తొమ్మిది మంది మీద అభియోగాలు నమోదైనాయి. ఒక్కొక్కరిమీద ఐదు నుంచి ఏడు వరకు అభియోగాలు నమోదయ్యాయి. వాటిలో ఐదు వరకు రుజువైనట్టు ప్రకటిస్తూ ట్రిబ్యునల్ ఆ తీర్పు లు వెల్లడిస్తున్నది. ఇందులో ఏడుగురు జమాత్ పార్టీ వారు కాగా, బీఎన్పీ వారు ఇద్దరు. 2008కి ముందు జమాత్‌తో కలిసి బీఎన్పీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఒక్క పార్టీయే ఇప్పుడు జమాత్ రక్షణకు పూనుకుంది. జమాత్ విద్యార్థి విభాగం ఇస్లామీ ఛాత్ర శిబిర్ 2012, డిసెంబర్ 4న ఆందోళనలను ఆరంభించింది. తమ నాయకులను విడిచిపెట్టి, ట్రిబ్యునల్‌ను శాశ్వతంగా మూసివేయాలని శిబిర్ కోరుతోంది. 2013, జనవరి 1న ట్రిబ్యునల్ తన తొలి తీర్పును ప్రకటిస్తూ, అబుల్ కలాం ఆజాద్ (బచూచు)కు ఉరిశిక్ష విధించింది. కానీ ఇతడు ఎప్పుడో దేశం విడిచిపెట్టి పారి పోయాడు. ఆజాద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని బంగ్లా పోలీ సులు వాదిస్తున్నారు. మొదటి తీర్పు వెలువడిన నాటి నుంచే ప్రధానంగా శిబిర్ రక్తపాతం మొదలుపెట్టి ఎడతెరిపిలేకుండా సాగిస్తోంది. ఫిబ్రవరి, 2013లో జమాత్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాదిర్ మొల్లాకు ట్రిబ్యునల్ జీవిత ఖైదు విధించింది. 1971లో ఖాదిర్ 344 మందిని కాల్చి చంపాడన్నది అభియోగం. ఈ ఫిబ్రవరి 28న మరో ప్రముఖుడు దెల్వర్ హుసేన్ సయ్యిద్కూ, మే 9న మహమ్మద్ ఖమ్రుద్దీన్ అనే మరో నాయకుడికి కూడా మరణ శిక్ష పడింది. జూలై 15న గులాం ఆజం అనే జమాత్ నాయకుడికి 90 సంవత్సరాల కారాగారశిక్ష విధించారు. రెండు రోజుల తరువాత అలీ హసన్ అనే మరో నాయకుడికి కూడా మరణదండన విధించారు. మరో ఏడుగురి శిక్ష ఖరారు కావలసి ఉంది. ఆ తీర్పులన్నీ కొన్ని మాసాలలోనే వెలువడతాయి. హసీనా ప్రభుత్వం, కొందరు ఇతర మేధావుల ప్రకారం, పాకిస్థాన్ 1971 అంతర్యుద్ధంలో 30 లక్షల మంది బంగ్లా దేశీయులను చంపింది. 2 లక్షల మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. 10 లక్షల మంది బంగ్లా పౌరులు భారత సరిహద్దులలో తలదాచుకున్నారు. బంగ్లా శరణార్థుల అంశం అప్పుడు మనదేశం ఎదుర్కొన్న పెద్ద సమస్యలలో ఒకటి. ఒక్కొక్క తీర్పూ వెలువడుతూ ఉంటే బంగ్లా ప్రజలు, ముఖ్యంగా హిందువులు, మేధావులు గడగడలాడిపోతున్నారు. 1971 నాటి రక్తపాతాన్ని గుర్తుకు తెచ్చేందుకు జమాత్ కార్యకర్తలు, అనుబంధ సంస్థల కార్యకర్తలు రెచ్చి పోతున్నారు. ఫిబ్రవరి 5 నుంచి, మార్చి 7 వరకు జరిగిన హింసాకాండలో వందమంది చనిపోయారు. మూడో తీర్పు వెలువడిన తరువాత మరో 67 మంది వరకు చని పోయారు. 10 వేల మంది జమాత్ మద్దతుదారులు ఆయుధాలతో ప్రభుత్వ కార్యాలయాల మీద, పోలీసు స్టేషన్ల మీద దాడులకు దిగడంతో చాలా ప్రాంతాలలో రక్షక దళాలను మోహరించవలసి వచ్చింది. ఈ నేపథ్యం లోనే జమాత్‌ను నిషేధించాలని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీనితో మళ్లీ హింస చెలరేగింది. ప్రపంచ దేశాలలో ఈ ట్రిబ్యునల్ మీద ఏకాభిప్రాయం లేదు. టర్కీ అధ్యక్షుడు అబ్దుల్లా అభియోగాలను ఎదుర్కొంటున్నవారికి క్షమాభిక్ష పెట్టాలని లేఖ రాయగా, యూరోపియన్ పార్లమెంట్ ఈ విచారణ పట్ల హర్షం వ్యక్తం చేసింది. కానీ బంగ్లాదేశ్ పౌరులు జమాత్ మీద పెంచుకున్న ఆగ్రహాన్ని బట్టి చూస్తే హసీనాలో కక్ష సాధిం పు యోచన కంటె రాజకీయంగా, చారిత్రకంగా, దేశ రక్షణ కోసం నిర్వర్తించవలసిన గురుతర బాధ్యతను నెరవేర్చే పనిలో ఉన్నారని అనిపిస్తుంది. బంగ్లా న్యాయస్థానాల వైఖరి కూడా జమాత్‌కు వ్యతిరేకమే. జమాత్ మీద నిషే ధం ‘సంతోషం కలిగించే వార్త’ అని వివాదాస్పద బంగ్లా రచయిత్రి తస్లిమా నస్రీన్ వ్యాఖ్యానించింది. లౌకికవాదం పునాదిగా ముందడుగు వేయాలన్న బంగ్లా ఆకాంక్షకు జమాత్ అతి పెద్ద అవరోధమన్న వాదన సర్వత్రా బలం పుంజుకుంది. మతోన్మాదాన్ని ఆశ్రయించి మనుగడ సాగిస్తున్న సంస్థలను నిషేధించాలని కోరుతూ ఈ జనవరిలో ఢాకాలోని షాబాగ్ కూడలిలో పెద్ద ప్రజా ప్రదర్శన జరిగింది. తరీఖత్ సమాఖ్య 2009, జనవరి 25న జమాత్ గుర్తింపును రద్దుచేయాలని ఢాకా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తరీఖత్ సూఫీ సిద్ధాం తాన్ని నమ్మే చిన్న మత సంస్థ. అంతగా పేరు లేని ఈ సంస్థ మరో 24 మందితో కలిసి కోర్టుకెక్కింది. దీనితో ఈ ఆగస్టు 1న బంగ్లా హైకోర్టు జమాత్ గుర్తింపును రద్దు చేసింది. ఫలితంగా ఎన్నికలలో పోటీకి అర్హత కోల్పోయిం ది. మరో 6 మాసాలలో బంగ్లా ఎన్నికలు జరగబోతున్నాయి. అగ్ర నాయకులకు వరసగా పడుతున్న కఠిన శిక్షలతో ఉడికిపోతున్న జమాత్ సంస్థకు హైకోర్టు తీర్పుతో పుండు మీద కారం చల్లినట్లయింది. హైకోర్టు తీర్పు మీద స్టే విధించాలని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కూడా కొట్టివేస్తూ, హైకోర్టు తీర్పును సమర్థించింది. దీనితో హింసాకాండ మరింత పెరిగింది. ప్రస్తుత పరిణామాలు బంగ్లాదేశ్‌కు అగ్నిపరీక్ష. వీటి నుంచి బంగ్లా బయటపడటం అంటే మతోన్మాదం పిడికిలి నుంచి బయటపడటమే. అది బంగ్లాకు పెద్ద వరమైతే, భారత్‌కు పెద్ద ఊరట. - డాక్టర్ గోపరాజు నారాయణరావు