దాయాదుల ‘బుల్లి’ సమరం | Television Channels war between India, Pakistan | Sakshi
Sakshi News home page

దాయాదుల ‘బుల్లి’ సమరం

Published Sat, Nov 23 2013 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

దాయాదుల ‘బుల్లి’ సమరం

దాయాదుల ‘బుల్లి’ సమరం

భారత వ్యతిరేక ప్రచారానికి మీడియాను వాడుకోవాలన్న తపన పాక్ నేతలలో మొదలైంది. భారత్‌ను ప్రతినాయక పాత్రలో చూపుతూ ఇటీవల నిర్మించిన ‘వార్’ ఇందుకు తాజా ఉదాహరణ. టీవీ చానెళ్ల మీద  ఈ హఠాత్ దాడి కూడా అదే చెబుతోంది. 
 
 భారత్‌తో ఉన్న వైరాన్ని దాచి పెట్టుకోవడం పాకిస్థాన్‌కి తెలియదు. నాలుగు రోజుల క్రితం అక్కడి పది టీవీ చానెళ్లకి కోటి రూపాయలు జరిమానా విధించడం అలాంటిదే. ఇవి చేసిన తప్పు-పరిధులు అతిక్రమించి భారతీయలు రూపొందించిన వినోద కార్యక్రమాలను ‘అతిగా’ ప్రసా రం చేయడమే. నిబంధనలు అతిక్రమించినందుకు ఒక్కొ క్క చానెల్‌కు పది లక్షల రూపాయలు జరిమానా విధించి నట్టు పాక్ సమాచార మంత్రిత్వ శాఖ ఒక పత్రంలో పేర్కొ న్నది. ప్రైవేటు చానెళ్లు ప్రసారం చేసే కార్యక్రమాలలో పది శాతం విదేశ కార్యక్రమాలు ఉండవచ్చు. ఈ పది శాతంలో అరవై శాతం భారతదేశంలో రూపొందించిన కార్యక్రమాలు, మిగిలిన నలభై శాతం ఇతర దేశాలలో తయారైన కార్యక్రమాలు ప్రసారం చేయాలి. జియో టీవీ (ఎంటర్‌టైన్‌మెంట్), ఎక్స్‌ప్రెస్ ఎంటర్‌టైన్‌మెంట్, హమ్ టీవీ, ఆక్సిజన్ టీవీ, ప్లే టీవీ, కోహినూర్ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ వన్, ఎన్‌టీవీ ఎంటెర్‌టైన్‌మెంట్, జీఎక్స్‌ఎమ్ ఎంట ర్‌టైన్‌మెంట్, జల్వా ఎంటర్‌టైన్‌మెంట్- పరిధిని అతిక్రమించాయని ఆరోపణ.
 
 కొద్దికాలం క్రితమే నేషనల్ అసెంబ్లీలో ఈ అంశం చర్చకు వచ్చింది. భారతదేశంలో తయారైన వినోద కార్యక్రమాలు తమ ఇష్టానుసారం ప్రసారం చేసుకునే అవకాశం ప్రైవేటు చానెళ్లకు ఉందా? అన్న ప్రశ్న వచ్చింది. ఇం దులో సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాలు కూడా వస్తాయి. కానీ ఈ నిర్ణయం అక్కడి ప్రజలకు రుచించేది మాత్రం కాదు. పది నెలల క్రితం కూడా పాక్ వైఖరి ఈ రీతిలో లేదు. భారతీయ కార్యక్రమాలు ఆపివేయడంతోనే పాక్ టీవీ ప్రేక్షకులు వెంటనే చానెళ్లు ఆపేశారు. దీనితో రేటింగ్ చతికిలపడింది. భారతీయ కార్యక్రమాలు ఆపేయడంతోనే, వ్యాపారం పడిపోయిందని ఆపరేటర్లు గగ్గోలు మొదలుపెట్టారు. మనం మళ్లీ జియా ఉల్ హక్ కాలానికి వెళ్లామా అని సాధారణ ప్రజలు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. నిజానికి కొద్దికాలం క్రితమే ‘గేలప్ పాకిస్థాన్’ అనే సంస్థ భారతీయ చానెళ్లు అక్కడ ప్రసారం కావడం గురించి సర్వే చేసింది. ఇందులో నలభై మూడు శాతం మంది ప్రజలు సానుకూలత వ్యక్తం చేశారు. నలభై రెండు శాతం ప్రతికూలంగా ఉన్నారు. 
 
 కార్గిల్ ఘర్షణ నుంచి భారత్ కూడా కొన్ని పాకిస్థానీ చానెళ్లను నిషేధించింది. ఆ నిషేధం తొలగించడం గురించి కొంత కాలం క్రితం పాక్ విదేశ వ్యవహారాల కార్యదర్శి జలీల్ అబ్బాస్ మాట్లాడారు. భారత్‌కు చెందిన అన్ని చానెళ్లు పాకిస్థాన్‌లో చూడవచ్చు, ఒక్క పాక్ చానెల్ కూడా భారత్‌లో ప్రసారం కావడం లేదని జలీల్ చెప్పారు. కానీ భారత్ అంతర్గత వ్యవహారాల గురించి, ముఖ్యంగా కాశ్మీర్ అంశం గురించి పీటీవీ అనుసరించిన ధోరణి అప్పుడు ఈ అంశాన్ని పరిశీలించడానికి అభ్యంతరకరంగా మారింది. 2009లో పాక్ పార్లమెంటు స్థాయీ సంఘం తమ చానెళ్లు భారత్‌లో ప్రసారం చేయడానికి కృషి జరగాలని విజ్ఞప్తి చేసింది కూడా. కానీ ఇదే స్థాయీ సంఘం ఏడాదికే వైఖరి మార్చేసింది. భారత్ చానెళ్లతో జరుగుతున్న ‘సాంస్కృతిక దాడి’ని అనుమతించవ ద్దని ఆదేశించింది. 
 
 భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న 24 పాక్ చానెళ్లను గడచిన డిసెంబర్‌లోనే నిషేధించారు. ఇవన్నీ సరిహద్దులలో యథేచ్చగా ప్రసారం అవుతూ ఉండేవి. ఉత్తరప్రదేశ్, హైదరాబాద్, అసోం, శ్రీనగర్, ముంబై వంటి ప్రదేశాలలో ఉద్రిక్తతలు తలెత్తడానికి పాక్ చానెళ్ల కథనాలు కారణమవుతున్నాయని ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. క్యూటీవీ, మదానీ టీవీ, ఏఆర్‌వైటీవీ, ప్రభుత్వ టీవీ చానెల్ పీటీవీ(కార్గిల్ ఘర్షణలో భారత వ్యతిరేక ప్రచారం చేసినందువల్ల నిషేధించారు), పీటీవీ హోమ్, పీటీవీ వరల్డ్, జియో టీవీ, డాన్, ఎక్స్‌ప్రెస్, వక్త్, నూర్‌టీవీ, హాది టీవీ, ఆజ్, ఫిల్మా క్స్, ఎస్‌టీవీ భారత వ్యతిరేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయని నిఘా వ్యవస్థలు తేల్చాయి. ఇవన్నీ కాశ్మీర్, పం జాబ్, ఈశాన్య రాష్ట్రాలలో ప్రసారమవుతాయి. ఎన్‌టీవీ బంగ్లాదేశ్, నేపాల్ టీవీ, పీస్ టీవీ(దుబాయ్), సౌదీ టీవీ, టీవీ మాల్దీవ్స్ కూడా అభ్యం తరకర అంశాలకు ప్రసిద్ధి చెందాయి. ఇందులో పాకిస్థానీ చానెళ్లు ఏవీ భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకోలేదు కూడా. ఈ విషయం మొన్న ఫిబ్రవరిలో పాక్ సమాచార శాఖ మంత్రి కమార్ జమాన్ కెయిరాయే వెల్లడించారు. 
 
 భారత వ్యతిరేక ప్రచారానికి మీడియాను వాడుకోవాలన్న తపన పాక్ నేతలలో మొదలైంది. భారత్‌ను ప్రతినాయక పాత్రలో చూపుతూ ఇటీవల నిర్మించిన ‘వార్’ ఇం దుకు తాజా ఉదాహరణ. టీవీ చానెళ్ల మీద ఈ హఠాత్ దాడి కూడా అదే చెబుతోంది. పాక్‌లో ఒక భారీ పేలుడుకి భారత ఏజెంట్లు కుట్రపన్నడం, అది భగ్నం కావడం ‘వార్’లో కథాంశం. దీనికి పాక్ రక్షణశాఖ పెట్టుబడి పెట్టిందన్న వాదన ఉంది. దీనిని పాక్ సాధారణ ప్రజలైనా నమ్ముతారా? నమ్మడం లేదని సర్వేలు చెబుతున్నాయి. 
 డాక్టర్ గోపరాజు నారాయణరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement