తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టులో పిల్‌ | Maha Kumbh stampede: PIL Filed In Supreme Court Latest News | Sakshi
Sakshi News home page

తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టులో పిల్‌

Jan 30 2025 12:59 PM | Updated on Jan 30 2025 3:05 PM

Maha Kumbh stampede: PIL Filed In Supreme Court Latest News

న్యూఢిల్లీ: యూపీ ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనకు బాధ్యత యూపీ ప్రభుత్వానిదేనంటూ ఓ అడ్వొకేట్‌ సుప్రీం కోర్టులో పిల్‌ వేశారు. త్రివేణి సంగమం వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటాక తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తుల మృతి, 60 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. అయితే..

మహా కుంభమేళా దుర్ఘటనకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ అడ్వొకేట్‌ విశాల్‌ తివారీ సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించేలా యూపీ సర్కార్‌ను ఆదేశించాలని, అదే సమయంలో తమ నిర్లక్య వైఖరితో మరణాలకు కారకులైన అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారాయన. 

అంతేకాదు.. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపర మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న మహా కుంభమేళాలో అన్ని రాష్ట్రాల సమన్వయంతో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయించేలా అధికార యంత్రాగాన్ని ఆదేశించాలని కోరారాయన.

మరోవైపు తీవ్ర విషాదం నేపథ్యంతో.. మహా కుంభమేళా నిర్వహణలో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీవీఐపీ పాస్‌లను పూర్తిగా రద్దు చేసింది. బుధవారం అర్ధరాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తర్వాత కీలక నిర్ణయాలను వెల్లడించారు.   భక్తుల రద్దీని నియంత్రించేందుకు మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలు ప్రవేశించకుండా యోగి సర్కారు నిషేధం విధించింది. ఈ ప్రాంతాన్ని ‘నో వెహికల్‌ జోన్‌’గా ప్రకటించింది. అలాగే.. వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. 

ఇంకోవైపు.. వీవీఐపీ, స్పెషల్‌ పాస్‌లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.   ప్రయాగ్‌రాజ్‌ పొరుగునున్న జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే నిలిపివేయనుంది. వాహనాల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక..    ఫిబ్రవరి 4వ తేదీ వరకు ప్రయాగ్‌రాజ్‌ నగరంలోకి ఫోర్‌ వీలర్‌ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం విధించింది.    భక్తుల సౌకర్యార్థం కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో వన్‌వే రూట్‌ ట్రాఫిక్‌ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది.    చిరు వ్యాపారులు రోడ్లపై దుకాణాలు పెట్టుకుంటే వాటిని వెంటనే ఖాళీ స్థలాల్లోకి మార్చాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించింది. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించింది. మేళా ప్రాంతంలో పెట్రోలింగ్‌ను పెంచాలని పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.  

మౌనీ అమావాస్య సందర్భంగా అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలిరావడంతో సంగం ఘాట్‌వద్ద బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. బుధవారం తెల్లవారుజామున 1, 2 గంటల మధ్య అఖాడాల కోసం ఏర్పాటు చేసిన సంగం స్నాన ఘాట్‌కు వెళ్లేందుకు అఖాడా మార్గ్‌వద్ద ఉన్న బారికేడ్లపైకి భక్తులు ఎక్కడంతో ఈ ఘటన జరిగిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement