అడవి మీద విరిసిన అక్షరం
♦ నివాళి
ఆధునిక భారతీయ సాహిత్యాన్ని అడవి ఆత్మకు పునఃపరిచయం చేసిన రచయిత్రి మహాశ్వేతాదేవి. గతంలో కింది వర్గాల స్థానం ఎక్కడో అన్వేషించడమే ధ్యేయంగా సబాల్టరన్ స్డడీస్ పేరుతో చరిత్ర రచన కొత్త ఆలోచనా ధార వైపు అడుగులు వేయడానికి ఎంతో ముందే, మహాశ్వేత అదే ధారతో బెంగాలీ సాహిత్యాన్ని ముంచెత్తించారు. తరువాత భారతీయ భాషా సాహిత్యం కూడా ఆ ధారలో మునకలు వేసింది. ఆధునిక భారతీయ సాహిత్యానికి ఇది మహాశ్వేత ఇచ్చిన మహోన్నత దృష్టి. అంటే సాహిత్య పరమార్థం విశ్వశ్రేయస్సు అన్న తాత్వికతని ఆమె పునఃప్రతిష్టించారు. అందుకే ఆమె అక్షరాలా ఆధునిక భారత సాహిత్య నిర్మాతలలో ఒకరు.
కుటుంబ నేపథ్యం వల్ల కావచ్చు, రచనా ప్రవృత్తి మహాశ్వేతకు సహజంగా అబ్బింది. పదమూడు సంవత్సరాల వయసులో ఆమె రాసిన ‘రవీంద్రుని బాల్యం’ వ్యాసం రంగ్ మషాల్ అనే పత్రికలో వెలువడింది. ‘ఝాన్సిర్ రాణి’ నవలను 1956లో చారిత్రకాధారాలతో రచించారు. అప్పటి నుంచి చిరకాలం వ్యాసం, నవల, కథ, నాటకం, బాలసాహిత్యం వంటి ప్రక్రియలలో విశేషమైన సాహిత్య సృష్టి చేశారు. ‘అమృత్ పంచయ్’, ‘ఆధార్ మాణిక్’, ‘తాతార్ ఆంధార్’, ‘బయస్కోపేర్ బాక్స్’, ‘కవి సంధ్య’,‘ఘటీ గాంజీర్ జీవన్ ఓ మృత్యు’, ‘శ్రీశ్రీ గణేశ్‌మహిమ’, ‘చోటీ ముండా ఏవం తారాత్రీర్’, ‘అక్లాంత్ కౌరవ్’, ‘ఘరేపీరా’, ‘పలాతక్’, ‘సూరజ్ గాగరాయి’,‘హరిరాయ్ మహతో’, ‘తితుమీర్ శృంఖలిత్’, ‘అరణ్యే అధికార్’, ‘హజార్ చురాషీర్ మా’, ‘రుడాలి’ ‘అగ్నిగర్భ’ వంటి నవలలు ఆమె రచించారు. ఇక కథలు వందల సంఖ్యలో ఉంటాయి.
అందులో ‘సూర్యుడి గుండెల్లో గాయం’ కథ పేరు తెలుసుకున్నా తెలుగువారికి ఉత్తేజం కలుగుతుంది. అది అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా ఆమె రాసిన కథ. అయితే అది అలభ్యం. ‘శనిచరి’, ‘మకర సవర’, ‘జీవిత ఖైదీ’, ‘ఉప్పు’, ‘దొంగతనం’, ‘యుద్ధానంతర దృశ్యం’, ‘ద్రౌపది’, ‘దొంగతనం’, ‘విత్తనాలు’ వంటి గొప్ప కథలు కనిపిస్తాయి. ఈ రచనలలో కొన్నయినా ప్రస్తుతం తెలుగువారికి చేరువయ్యాయి. నిర్మలానంద, సహవాసి వంటివారు మహాశ్వేత కథలను, నవలలను అనువదించారు. హెచ్‌బీటీ, జనసాహితి వంటి సంస్థలు పుస్తకాలుగా వెలువరించాయి. ‘ఝాన్సీ రాణీ’. ‘అరేణ్య అధికార్’(ఎవరిదీ అడవి), హజార్ చురాషిర్ మా (ఒక తల్లి), ‘రుడాలి’ వంటి వాటిని కూడా పలువురు తెనిగించారు.
రచన, ఇతివృత్తం, రూపం - ఈ మూడు అంశాల మీద మహాశ్వేతకు నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆమె పదిశాతం రచనలు మినహా మిగిలినవన్నీ గిరిజనుల జీవిత సంక్షోభాన్ని ఆవిష్కరించేవే. ‘ఒక తల్లి’ 1970ల నాటి కలకత్తా సామాజిక జీవితాన్ని చిత్రించింది. నక్సల్బరీ ఉద్యమం అణచివేత తీరును, అందులోని అమానవీయతను, హక్కుల అణచివేతను ఒక మాతృమూర్తి దృష్టి కోణం నుంచి అద్భుతంగా నవలీకరించారు. ఆమె వామపక్షవాది. కానీ ఆ వాదాన్ని గుడ్డిగా అనుసరించాలన్న ఆవేశం ఆమె జీవితంలో కనిపించదు.
‘జూన్ 9, సంవత్సరం 1900, రాంచీ జైలు. ఉదయం యెనిమిది గంటలప్పుడు బీర్సా రక్తం కక్కి స్పృహ తప్పి పోయాడు. బీర్సా అడవిలో నివసించే ఆదివాసి. ముండా తెగలో ముఖ్యుడు’... ఇలా మొదలవుతుంది ‘ఎవరిదీ అడవి’ నవల. బెంగాలీ సాహిత్యంలో కనిపించే వస్తు గాంభీర్యం రమణీయంగా ఉంటుంది. బంకింబాబు నవల ‘ఆనందమఠం’, రవీంద్రనాథ్ టాగోర్ నాటకం ‘పోస్టాఫీసు’, బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ ‘పథేర్ పాంచాలి’, శరత్‌బాబు ‘దేవదాసు’, ‘చరిత్రహీనులు’ వంటివి ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయి. కానీ మహాశ్వేత రచనలలో వస్తు గాంభీర్యంతో పాటు, గొప్ప సరళత కనిపిస్తుంది. అతి సాధారణంగా మొదలవుతాయి వాక్యాలు. గతంలో దొంగతనాలు చేసి బతికిన కొన్ని తెగలని నేటికీ అదే ముద్రతో చూడడం కనిపిస్తుంది. అలాంటి ఇతివృత్తంతో నడిచే కథ ‘దొంగతనం’. ‘అది పట్నానికి చాలా దూరంలో ఉన్న పల్లె’... అంటూ మొదలుపెడతారామె. సరళమైన వాక్యాలలో కూడా వస్తు గాంభీర్యాన్ని ఆవిష్కరించవచ్చునని నిరూపించారు మహాశ్వేత.
‘ఎవరిదీ అడవి’ 1899-1900లో చోటా నాగ్‌పూర్, రాంచీ ప్రాంతంలో జరిగిన గిరిజనోద్యమం ఆధారంగా రాసిన నవల. దీనినే ఉల్‌గులాన్ అని పిలుస్తారు. బీర్సా ముండా దీని నాయకుడు. ఇది తెలుగువారు కూడా విశేషంగా చదివిన నవల. గిరిజనోద్యమాలకు నాయకత్వం వహించిన వారి చుట్టూ రకరకాల కట్టు కథలు అల్లి ఉంటాయి. పోలీసు రికార్డులలో వారిని చాలా అల్పులుగా నమోదు చేస్తూ ఉంటారు. తిరుగుబాటుకు ఉన్న హేతువుకు మసి పూస్తారు. అలాగే ఫక్తు చరిత్రకారులు కూడా ప్రధానంగా తేదీలనీ, ఘటనల క్రమాన్నీ పరిగణనలోనికి తీసుకుంటారు. అంటే ఆ పరిణామంలోని ఆత్మ జోలికి పోరు. అది సృజనాత్మక రచయిత చేస్తారు. మహాశ్వేత ‘ఎవరిదీ అడవి’లో అదే బాధ్యతను అత్యద్భుతంగా నిర్వర్తించారు. గిరిజనోద్యమమో, మరో ఘటనో జరిగిన ప్రదేశానికి ఒక్కసారి కూడా వెళ్లకుండా రచనలు చేసినవారిలా కాకుండా, అక్కడికి వెళ్లి, ఆ మట్టితో మాట్లాడి, ఆ గాలిలో తిరగాడి రచనలు చేయడం మహాశ్వేతకు తెలిసిన అద్భుతమైన విద్య. భారతీయ గిరిజనోద్యమాల ఆత్మఘోష మొత్తం ఈ ఒక్క నవల చదివితే మనకి వినిపిస్తుందన్నా అతిశయోక్తి కాదు.
మహాశ్వేత ఒక్కొక్క కథ గిరిజన జీవితంలోని ఒక విషాద పరిణామాన్ని వివరిస్తుంది. ‘శనిచరి’ కథలో వ్యభిచార కూపాలలోకి బలవంతంగా కూరుకుపోతున్న వంగ ప్రాంత అటవీ బాలికల విషాదం గురించి రాశారు. ఇటుక బట్టీలలో పని పేరుతో తీసుకువెళ్లి ఆ అమాయకురాళ్ల చేత వ్యభిచారం చేయిస్తూ ఉంటారు దళారులు. అది భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. శనిచరి మాత్రం తన కడుపున పుట్టిన బిడ్డతో సహా తిరిగి గ్రామంలోకి వస్తుంది. ‘తప్పు’ చెల్లిస్తుంది. అయినా గిరిజన సమాజం ఆదరించదు. రైలు పట్టాల మీద బొగ్గు ముక్కలను ఏరుకుంటూ బతుకీడుస్తుంది. ఆ బొగ్గు ముక్కలే నిప్పు రవ్వల్లాంటి ప్రశ్నలను సంధిస్తాయి.
‘రుడాలి’ ఇతివృత్తం అసాధారణమైనది. బెంగాల్‌లోని మారుమూల ప్రాంతంలో ఇదొక వృత్తి. రుడాలి అంటే, జమీందారులు చనిపోతే, కిరాయికి వెళ్లి గుండెలు బాదుకుంటూ ఏడ్చే మహిళ. ఈ వృత్తి పూర్తిగా నిమ్నవర్గాలదే. ఇందులో ప్రధాన పాత్ర కూడా రుడాలీయే. కోడలు అమాయకుడైన ఆమె కొడుకును మోసం చేసి వెళిపోతుంది. అతడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఏ జమీందారు చనిపోయినా కడవల కొద్దీ కన్నీళ్లు కార్చగలిగిన ఆ మహిళ కొడుకు శవం దగ్గర ఒక్క కన్నీటిబొట్టును కూడా రాల్చలేకపోతుంది. పోలీసులను చూస్తే చాలు, కాళ్లకీ చేతులకీ సంకెళ్లు ఉన్నట్టు నడిచే ఒక స్వేచ్ఛాజీవి వింత ప్రవర్తనను రూపు కట్టించారు.
‘జీవిత ఖైదీ’లో. ‘మకర సవర’ వర్తమాన చరిత్రలోని ఒక ఘోరంతో అల్లకల్లోలమైన గిరిజన జీవితం కనిపిస్తుంది. అందుకు ప్రతీక మకర అనే ఆ గిరిజనుడు. సవర తెగకు చెందిన ఈ గిరిజనుడి భార్య విడాకుల కోసం పంచాయితీ ఏర్పాటు చేయిస్తుంది. కారణం- పెళ్లయి చాలా కాలం అయినా ఆమె గర్భవతి కాకపోవడమే. నిస్పంతువుగా ఉండడం ఆ తెగలో నిషిద్ధం. అప్పుడు హఠాత్తుగా తెలుస్తుంది, అతడికి పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్స చేశారు. అదీ అతడికి తెలియకుండా. గిరిజన సంప్రదాయాన్ని 1975 నాటి అత్యవసర పరిస్థితిలో జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు ఎలా సంక్షుభితం చేశాయో వర్ణించే కథ ఇది.
విశాఖ మన్యంలో గొప్ప ఉద్యమం నడిపిన అల్లూరి జీవితం ఆధారంగా నవల రాస్తానని ఆమె 1997లో విశాఖపట్నం వచ్చినప్పుడు చెప్పారు. అల్లూరి శతజయంతికి వచ్చిన మహాశ్వేత, విజయనగరం జిల్లాలోని మూలవలస గిరిజన గ్రామాన్ని చూశారు. అక్కడే ఈ మేరకు ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం నెరవేరి ఉంటే తెలుగు ప్రాంత గిరిజనోద్యమానికి గొప్ప వెలుగు వచ్చి ఉండేది. ఆ పని ఈ తరం చేయగలిగితే అదే మహాశ్వేతకు నిజమైన నివాళి అవుతుంది.
డా॥గోపరాజు నారాయణరావు