రోజులు దగ్గరపడ్డ దావూద్!
ఉగ్రవాదులతో, మాఫియాలతో, మత ఛాం దసవాదులతో సార్వభౌమాధికార దేశం వ్యవహరించవలసిన తీరుకు భిన్నమైన వ్యవహార సరళినే పాకిస్థాన్ ప్రదర్శిస్తూ ఉంటుం ది. ‘గ్లోబల్ టైస్ట్’ షేక్ దావూద్ ఇబ్రహీం కస్కర్ గురించి పాకిస్థాన్ తాజాగా వెల్లడిం చిన అంశాలు అలాంటి ప్రమాద వైఖరి కొనసాగింపునే స్ఫురింపచేస్తున్నాయి. కాశ్మీర్‌లో అధీనరేఖ దగ్గర పాక్ సైనికులు మళ్లీ పెద్ద ఎత్తున తెగబడటంతో ఐదుగురు భారత సైని కులు మరణించారు. ఈ పరిణామాన్ని మనదేశం తీవ్రంగానే పరిగణించింది. ఈ ఘటన సృష్టించిన ప్రకంపనాల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి పాకిస్థాన్ సరికొత్త రాజకీయ క్రీడకు పావులు కదిపింది. దావూద్ ప్రస్తావన ఒక్కసారిగా తెర మీదకు రావడం వెనుక భూమిక ఇదే. ఉగ్రవాదులూ, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన గజనేరగాళ్ల విషయంలో మళ్లీ ప్రధాని అయిన నవాజ్ షరీఫ్ అప్రమత్తంగా ఉండదలిచారని అనిపిస్తున్నది. ఇలాంటి వారి వల్ల దేశంలో చెలరేగుతున్న సమస్యలను, దిగజారిన ప్రతిష్టలను నవాజ్ దృష్టిలో ఉంచుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ కూడా నవాజ్ కౌటిల్యం వీడలేదు. ఎప్పటి నుంచో భారత్ అప్పగించమని కోరుతున్న దావూద్ గురించి ఉప్పందించి, చేతులకు మట్టి అంటకుండా అతడిని వదిలించుకోవాలను కోవడం, అలా తమ సైన్యం తాజాగా ప్రదర్శించిన దుందుడుకుతనంపై నుంచి అందరి దృష్టిని మళ్లించవచ్చుననేది నవాజ్ ఊహ. ఇది సాధ్యమా? ‘గ్లోబల్ టైస్ట్’ అంటూ అమెరికా దావూద్ కోసం ఒక పదబంధమే సృష్టించి, ప్రచారం చేసింది. అల్ కాయిదాతో సాన్నిహిత్యం నెరపుతున్న ఈ ‘అండర్ వరల్డ్ డాన్’ను వది లిం చుకోవడం పాకిస్థాన్‌కు సాధ్యమేనా? పాకిస్థాన్ నేతలందరికీ తలలో నాల్కగా ఉన్న ఈ నేరగాడిని దేశం నుంచి పంపగలరా?
సరిహద్దులలో పాక్ దుశ్చర్యలపై మన పార్లమెంట్ దద్దరిల్లిపోతున్న తరుణంలో, ఈ ఆగస్టు 9న షహ్రయార్‌ఖాన్ హఠాత్తుగా దావూద్ గొడవను రంగం మీదకు తెచ్చాడు. భారత్‌తో సంబంధాల పునరుద్ధరణ కోసం ఆయనను తన ప్రత్యేక దూతగా నవాజ్ నియమించుకున్నారు. ‘క్రికెట్, పాకిస్థాన్ రాజకీయాలు’ అంశంపై షహ్రయార్ రాసిన పుస్తకం బ్రిటన్‌లో ఇటీవల విడుదలైంది. ఆ సందర్భం గా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘దావూద్ పాకిస్థాన్‌లో ఉండేవాడే గానీ, అతడిని దేశం నుంచి తరిమిమేశారని అనుకుంటున్నాను. ఒకవేళ పాకిస్థాన్‌లో ఉన్నట్టు సమాచారం ఉంటే, వేటాడి అరెస్టు చేయవలసిందే. అలాంటి వ్యక్తి మా దేశాన్ని కేంద్రంగా చేసుకుని అకృత్యాలు పాల్పడటాన్ని అనుమతించబోం’ అని షహ్రయార్ అన్నారు. పాక్ నుంచి దావూద్ మధ్య ప్రాచ్యానికి, బహుశా యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లి ఉండొచ్చని కూడా షహ్రయార్ నిగూఢంగా సంకేతించారు.
ఎస్. హుసేన్ జైదీ రాసిన ‘డోంగ్రీ టు దుబాయ్’ పుస్తకం దావూద్ ప్రయాణంలో కనిపించే రక్తపుటడుగులను కళ్లకు కడుతుంది. కానిస్టేబుల్ కొడుకైన దావూద్ ముంబై మహా నగర నేరకేంద్రం డోంగ్రీలో 1974లో సృష్టిం చిన సంచలనం గురించి అందులో ఉంది. అప్పటికి అక్కడ డాన్‌గా ఉన్న పఠాన్ బాషు దాదా మీద ఇతడు సోడాసీసాలతో దాడి చేశా డు. ఆపై హాజీ మస్తాన్, వరదరాజన్ మొదలియార్, కరీంలాలా వంటి డాన్‌లను పక్కకు నెట్టేసి పైకొచ్చాడు. 1950లలో కేవలం కత్తిపోట్లకు పరిమితమైన ముంబై మాఫియా కార్యకలాపాలను అంతర్జాతీయ నేరాల స్థాయికి తీసుకువెళ్లినవాడు దావూద్.
1976లో అతడు ప్రారంభించిన ‘డి కంపెనీ’ పెద్ద నేరాలే చేసేది. గులాం హస్నని రాసిన వ్యాసం (‘దేశవాళీ డాన్ దావూద్‌తో ఒక రోజు’) చాలా ఆసక్తికరమైన పరిణామాలను వెల్లడించింది. 1982 నాటి ముంబై కార్మికుల సమ్మె నగరం స్వరూపాన్నే కాదు, మాఫియా ముఠాల విస్తృతిని కూడా ఊహకు అందనంతగా మార్చేసింది. డి కంపెనీ ఆయుధాల రవాణా, హవాలా, దొంగనోట్లు, మత్తు పదార్థాల రవాణా, బెదిరించి డబ్బు వసూలు చేయడం, కాంట్రాక్ట్ హత్యల వరకు విస్తరించింది. ‘బిగ్ డి’ సిని మాలకు పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు. బాలీవుడ్ ప్రముఖులతో ఇప్పటికీ దావూద్ సంబంధాలు కలిగి ఉన్నాడు. భరత్‌షా వంటి వారు ఈ కారణంగా అరెస్టయ్యారు. నటి మందాకినితో దావూద్ సంబంధం ఇంకా గాఢమైనది. అయోధ్య పరిణామాల అనంతరం ఛోటా రాజన్ హిందువుల కుటుంబాల యువకులతో కొత్త కుంపటి పెట్టుకున్నాడు. అయోధ్య ఘటనలకు ప్రతీకారంగానే 1993 ముంబై వరస పేలుళ్లు జరిగాయి. దీంట్లో కీలక పాత్రధారి టైగర్ మెమన్, దావూద్ ముఖ్య అనుచరుడు. ఆ పేలుళ్ల సమయంలో నగరంలోని లేని దావూద్ మళ్లీ భారత్‌లో కనిపించలేదు. 250 మంది మృతికి కారణమైన ఆ పేలుళ్ల వెనుక దావూద్ ఉన్నాడని మన సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది.
డి కంపెనీకి పాక్ కేంద్రమైంది. అల్ కాయిదా, లష్కరే తాయిబా వంటి మత ఛాం దస సంస్థలతో దావూద్ బంధం అక్కడ నుం చే. బిన్ లాడెన్‌తో దావూద్‌కు సాన్నిహిత్యం ఉందని అమెరికా బయటపెట్టింది. అఫ్ఘాని స్థాన్ నుంచి అల్‌కాయిదా సభ్యులు పారిపోవడానికి తన మాఫియా మార్గాలను దావూద్ చూపించాడు. కరాచీలో దావూద్ ఉన్నాడని మొదటి నుంచి సీబీఐ ఆరోపిస్తూనే ఉంది. దావూద్ భార్య, నలుగురు కుమార్తెలు, కుమా రుడికి పాక్ పాస్‌పోర్టులు ఉన్నాయి. అయితే దావూద్ దేశంలో ఉన్నట్టు పాకిస్థాన్ ఏనాడూ అంగీకరించలేదు. చిత్రంగా కరాచీ అడ్డాగా ఇతడు దక్షిణాసియా మొత్తం విస్తరించాడు. మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలం క, నేపాల్, దుబాయ్‌లతోపాటు జర్మనీ, ఫ్రా న్స్, ఇంగ్లండ్‌లలో కూడా ఇతడి కార్యకలాపా లు విస్తరించాయి. ఇతడి లావాదేవీల విలువ 3 వేల కోట్ల రూపాయలకు పైనే. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోనూ డి కంపెనీ పాత్ర ఉంది.
దావూద్ వంటివాణ్ణి కలకాలం భరించ డం సాధ్యం కాదన్న భావన పాక్‌కు వచ్చిం దా? అదేమో గానీ, దావూద్ ప్రాభవం కోల్పోతున్నాడని చెప్పే సంఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి. దావూద్ అనుచరులు ఛోటా షకీల్, అబూసలేం, టైగర్ మెమన్‌లు మన పోలీసుల అధీనంలోనే ఉన్నారు. ముంబై పేలుళ్ల దరిమిలా 20 మంది పేర్లతో భారత్ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకడైన అబ్దుల్ కరీం తుండాను ఆగస్టు 15న నేపాల్ సరిహద్దులలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముఖ్య సభ్యుడు మీర్జా అరీఫ్ బేగ్‌కు అంతకు ముందురోజే లక్నో కోర్టు దొం గ పాస్‌పోర్టు కేసులో ఐదేళ్లు శిక్ష విధించింది.
షహ్రయార్ ప్రకటన మేరకే చూసినా, కొద్దికాలం క్రితం దావూద్ పాక్‌లో ఉన్నమాట నిజం. అప్పుడు భారత్ ఎన్నిసార్లు కోరినా అతడిని ఎందుకు అప్పగించలేదు? ఇప్పుడు అతడు దేశం వీడి వెళ్లి ఉంటే ఎవరు సహకరించారు? వీటికి సమాధానం కావాలని మన ప్రతిపక్షాలు అంటున్నాయి. దావూద్ యూఏ ఈ వెళ్లిన మాట నిజమే కానీ, అతడు రంజాన్ కోసం వెళ్లాడని, కొద్దిరోజులకే తిరిగి పాక్ వెళ్లిపోతాడని కొందరు గూఢచారులు చెబుతున్నా రు. ఏమైనా కొంగున బిగించుకున్న నిప్పును పాక్ వదిలించుకుంటుందా; లేక శరీరమే కాల్చుకుంటుందా? చూడాలి.
-డాక్టర్ గోపరాజు నారాయణరావు