Gujarat Assembly Election Results 2022: Public View By Goparaju Narayana Rao - Sakshi
Sakshi News home page

Gujarat Election Results 2022: ప్రజల కోణం నుంచి చూస్తే...

Published Mon, Dec 12 2022 2:49 PM | Last Updated on Mon, Dec 12 2022 4:49 PM

Gujarat Election Results 2022: Goparaju Narayana Rao View - Sakshi

డిసెంబర్‌ 8న వెలువడిన గుజరాత్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు వివిధ కోణాల నుంచి చారిత్రకంగా విశేష ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఆ రాష్ట్ర చరిత్రలో ఒకే రాజకీయ పార్టీకి 156 శాసనసభ స్థానాలు లభించడం మొదలు, వరసగా ఏడవసారి అధి కారంలోకి రావడం వరకు ఐదారు కీలక అంశాలు ఉన్నాయి. ఈ ఫలితాలతో పాటే వెలువడిన హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర సంప్రదాయాన్ని పునరావృతం చేశాయి. అక్కడ ఒక పార్టీకి రెండుసార్లు వరసగా అధికారం ఇచ్చే పద్ధతి లేదు. 25 స్థానాలకు పరిమితమైన బీజేపీ, 40 స్థానాలు సాధించిన కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తున్నది. ఓడిన పార్టీల నేతల నోటి నుంచి వచ్చే మొదటిమాట గెలుపోటములు రాజకీయాలలో సహజం. యాపిల్‌ సాగు శాసించే హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలలో బీజేపీకీ, కాంగ్రెస్‌కీ ఓట్లలో తేడా ఒక శాతం కంటే తక్కువ. దీనితో బీజేపీ ఓడినా గెలిచినట్టే. గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఘనతలు బీజేపీ అండతో పోరాడిన ప్రధాని నరేంద్ర మోదీవే. ఈ ఫలితాలు చూసిన తరువాత తప్పక వేసుకోవలసిన ప్రశ్న ఈ ఎన్నికల నుంచి వాస్తవాలు గ్రహించవలసిన వారు నిజంగా ఎవరు? బీజేపీ వ్యతిరేకత తప్ప మరొక ఎజెండా జోలికిపోని రాజకీయ పార్టీలా? ప్రజా తీర్పు ప్రజాతీర్పే, బీజేపీ పట్ల మా గుడ్డి వ్యతిరేకత మాదే అన్న ధోరణిలో ఉండిపోతున్న మేధావులూ, ఉదారవాదులా? 

మేం ప్రజాతీర్పును గౌరవిస్తున్నామంటూ రాజకీయ పార్టీలు చూపిస్తున్న కనీస మర్యాదను మేధావులుగా, ఉదారవాదులుగా చలామణీ అవుతున్నవారు చూపిస్తున్నారా అంటే సమాధానం దొరకదు. వీరందరి అభిమతం ప్రజాస్వామ్య పరిరక్షణే కావచ్చు. దానిని శంకించనక్కర లేదు. కానీ ప్రజాతీర్పును గౌరవించడం దగ్గర బీజేపీ యేతర శిబిరం ప్రదర్శిస్తున్న ఆత్మహత్యాసదృశమైన వైఖరి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేదు. వీరు ఒక రాజకీయ పార్టీ మీద, ఒక దేశ సార్వభౌమాధికారం మీద విమర్శల విషయంలో ఉండవలసిన లక్ష్మణరేఖను విస్మరిస్తున్నారు. ముస్లింల మీద జరిగిన కొన్ని దాడులను చూపిస్తూ హిందూ మెజారిటేరియన్‌ వాదాన్ని అంతర్జాతీయంగా రుద్దాలన్న ప్రయత్నం పట్ల సాధారణ భారతీ యులు ఆగ్రహంతో ఉన్నారని 2019 లోక్‌సభ ఎన్నికలు, తాజా గుజరాత్‌ ఎన్నికలలో రికార్డు స్థాయి ఫలితాలు చెప్పాయి. ఈ మేధావులు కష్టపడి నిర్మిస్తున్న హిందూ మెజారిటేరియన్‌ సిద్ధాంతం ముస్లింలకు రక్షణ కల్పించేది కాదు. నిజానికి మైనారిటీలకు అనాలి. కానీ వీరు మైనారిటీ అంటే కేవలం ముస్లింలు అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఇదే హిందూ ఫోబియాకు జన్మనిచ్చింది. అది బీజేపీకి ఉపయోగపడుతోంది.

సాధారణ హిందువు, సాధారణ ముస్లిం కోరుకునేది శాంతినే! పీఎఫ్‌ఐ లాంటి పచ్చి హిందూ, భారత వ్యతిరేక సంస్థల ప్రభావంలో పడినవారు తప్ప సాధారణ ముస్లింలు మత కల్లోలాలను కోరుకోరు. బీజేపీ పాలనలో నిస్సందేహంగా మత కల్లోలాలు లేవు. ఢిల్లీ మత కల్లోలాలు, దసరా సందర్భంగా జరిగిన తాజా అలజడులు పీఎఫ్‌ఐ వంటి సంస్థల కారణంగానే జరిగాయి. అది ఇంటెలిజెన్స్‌ సమాచారం కూడా. ఆ వర్గం నుంచి ఒక్క అభ్యర్థిని కూడా నిలపకున్నా, గుజరాత్‌ తాజా ఫలితాల ప్రకారం ముస్లింలు అత్యధికంగా ఉన్న 19 నియోజక వర్గాలలో 17 బీజేపీకి దక్కాయి. బీజేపీ పట్ల తమకు గుడ్డి వ్యతికత అయితే లేదని వారే ప్రకటించినట్టయింది. 

గుజరాత్‌ శాసనసభలో ముస్లింల సంఖ్య తగ్గడం ఇవాళ్టి పరిణామం మాత్రం కాదు. 1980 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో 12 మంది ముస్లింలు చట్టసభకు వెళ్లారు. అప్పుడే కాంగ్రెస్‌ ΄పార్టీ ‘ఖామ్‌’ పేరుతో ఒక ఓటుబ్యాంక్‌ సమీకరణను తెర మీదకు తెచ్చింది. అదే క్షత్రియ, హరిజన్, ముస్లిం, ఆదివాసీ, ముస్లిం సమీకరణ. గడచిన ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థులు మహమ్మద్‌ జావెద్‌ ఫిర్జాదా, ఘియాజుద్దీన్‌ షేక్, ఇమ్రాన్‌ ఖెడావాలా గెలిచారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఆరుగురు ముస్లింలను అభ్యర్థులుగా నిలిపింది. వీరిలో ఖెడావాలా మాత్రమే బీజేపీ, ఎఐఎంఐఎం సవాళ్లను ఎదుర్కొని సభలో ప్రవేశించ బోతున్నారు. గుజరాత్‌తో సంబంధం లేకున్నా, ఈ ఎన్నికలతో పాటే జరిగిన రాంపూర్‌ (ఉత్తరప్రదేశ్‌) నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం గురించి చెప్పడం అసందర్భం కాబోదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ఈ నియోజకవర్గంలో ఏడు దశాబ్దాలుగా ముస్లిం అభ్యర్థులే గెలుస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆజంఖాన్‌ మీద క్రిమినల్‌ కేసులు, అరెస్టు తదితర కారణాలతో పదవి రద్దయింది. దీనితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ తరఫున అసీమ్‌ రజా బరిలో ఉండగా, బీజేపీ అభ్యర్థిగా ఆకాశ్‌ సక్సేనా నిలిచారు. సక్సేనా 33,000 భారీ ఆధిక్యంతో సమాజ్‌వాదీ అభ్యర్థిని ఓడించారు.

గుజరాత్‌ మోర్బీ వంతెన కూలిన ఘటన, దానితో 135 దుర్మరణం పాలైన సంగతిని ఒక వర్గం మీడియా మృతుల మీద సానుభూతిగా కంటే, బీజేపీకి వ్యతిరేకాస్త్రంగానే భావించినట్టు కనిపిస్తుంది. ఆ ఘటన బీజేపీ గెలుపు మీద ప్రభావం చూపుతుందని ప్రచారం చేసింది. ఆ జిల్లాలో (మోర్బీ) మూడు అసెంబ్లీ నియోజక వర్గాలు మోర్బీ, టంకారా, వాంకనెర్‌ ఉన్నాయి. వీటిని 2017 ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిచింది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాలను గెలుచుకుంది. 

బీజేపీ విజయాన్ని... కాంగ్రెస్‌ ఓట్లు చీల్చడం, హిందూత్వ వంటి అసహజ విశ్లేషణలతో తక్కువ చేయడానికి ప్రయత్నించడం కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కానేకాదు. మరి హిమాచల్‌లో జరిగిన దానిని ఏమనాలి? బీజేపీ ఓటును ‘ఆప్‌’ చీల్చినందునే కాంగ్రెస్‌ గెలిచిందంటే ఒప్పుకుంటారా? బీజేపీని ప్రస్తుతం ప్రజలు ఆదరిస్తున్నారు. దీనిని అంగీకరించడమంటే... బీజేపీని బలోపేతం చేయడం కాదు, ప్రజా తీర్పును గౌరవించడం! ఆ పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడమనేది రాజ్యాంగ హక్కు. ఈ రెండింటినీ గుర్తించాలి. 

ఆర్టికల్‌ 370 రద్దు, ఉమ్మడి రస్మృతి, పౌరసత్వ సవరణ చట్టం వీటన్నిటికీ రాజ్యాంగ ఆమోదం ఉంది. కానీ వీటన్నిటి లోనూ మైనారిటీ వ్యతిరేకతనే మేధావులు వెతకడానికి ప్రయత్నించారు. దేశ ప్రయోజనాల కోసం ఏ అడుగు వేసినా, ఏది చేసినా బీజేపీని బోనులో నిలబెట్టే ప్రయత్నం మానడం లేదు. మెజారిటీ ప్రజల మౌనాన్ని వీరు అలుసుగా తీసుకుంటున్న మాట కూడా వాస్తవం. ఆ మౌనం వెనుక ఏమున్నదో ఇప్పటికే ఎన్నో పర్యాయాలు రుజువైంది. బీజేపీని ఓడించడానికి అవాస్తవాలను జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ప్రచారం చేయడం సాధారణ ప్రజలకీ, యువతరానికీ కూడా మింగుడు పడడం లేదు. పీఎఫ్‌ఐ, కొందరు మౌల్వీలు చేస్తున్న హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక వ్యాఖ్యలను ఖండించడం దగ్గర మేధావులు, ఉదారవాదులు ప్రదర్శిస్తున్న ఊదాసీన వైఖరి, సెలెక్టివ్‌ పంథా కూడా మైనారిటీలకూ, మెజారిటీలకూ మధ్య అగాధాన్ని తగ్గించడానికి బదులు పెంచుతోందన్న స్పృహ వారికి లేదు.

ఇప్పుడు అయోధ్య అంశం లేదు. జ్ఞానవాపి, మధుర ఎన్నికల అంశాలుగా లేవు. అయినా బీజేపీ రికార్డు విజయం సాధించింది. కారణం సంక్షేమ పంథా. షాహీన్‌ బాగ్‌కీ, బీజేపీ వ్యతిరేక రైతు ఉద్యమానికీ ఇచ్చిన గౌరవం ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టినప్పుడు మేధావులు ఎందుకు ఇవ్వలేకపోయారన్న ప్రశ్న సగటు భారతీయుడిని ఎప్పటికీ తొలుస్తూనే ఉంటుంది. పరిణామాలను పక్షపాతం ఆధారంగా విశ్లేషించడం కాదు, ప్రజాతీర్పులు, ప్రజల అభిప్రాయాల కోణం నుంచి చూడాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ! రాజకీయ పార్టీ మీద ఆగ్రహం వ్యవస్థల మీద, ఆ వ్యవస్థలకు సంబంధించిన విలువల మీద ఆగ్రహంగా మారకూడదు. (క్లిక్ చేయండి: విమర్శను ఆహ్వానించే స్ఫూర్తి లేదా?)


- డాక్టర్‌ గోపరాజు నారాయణరావు 
సీనియర్‌ జర్నలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement