ఢిల్లీ: దేశం మొత్తం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ దాదాపుగా గుజరాత్ పీఠం బీజేపీదే అని ఖరారు చేసేశాయి. గుజరాత్‌లో వరసగా ఏడోసారి అధికారాన్ని చేపట్టాలని తహతహలాడుతున్న కమలదళంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు హుషారుని నింపాయి. ఈ తరుణంలో బీజేపీ మరో రికార్డుపై కన్నేసింది.
గుజరాత్‌లో బీజేపీ విజయం సాధిస్తే వరసగా ఏడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన పశ్చిమబెంగాల్‌లో సీపీఎం రికార్డుతో సమం అవుతుంది. అయితే.. తొలిసారిగా పోటీ చేస్తున్న ఆప్ మాత్రం కచ్ఛితంగా ప్రభావం చూపెడతామని ప్రకటించుకుంది. దీంతో కాస్త ఆసక్తి నెలకొంది. గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 8 గంటల నుంచి 37 కేంద్రాల్లో కౌంటింగ్ మొదలుకానుంది. పదకొండు గంటల కల్లా ఫలితాలపై ఒక అంచనా రానుంది.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో చెరోసారి బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారం పంచుకుంటూ వస్తున్నాయి. ఈ తరుణంలో వరుసగా రెండోసారి అధికారం కైవసం చేసుకుని ఆ సంప్రదాయానికి బ్రేక్ వేసి రికార్డు నెలకొల్పాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్.. తొలిసారి పోటీ చేయబోతున్న ఆప్ కూడా విజయంపై కన్నేశాయి. హిమాచల్ ప్రదేశ్‌లో 68 స్థానాలకు.. 68 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వీటితో పాటు యూపీలోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానం, అయిదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ములాయం మరణంతో మెయిన్‌పురి స్థానానికి ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానంలో ఎస్పీ నుంచి అఖిలేష్ భార్య డింపుల్ పోటీ చేస్తుండగా.. గత ఎన్నికల్లో ములాయం మెజార్టీకి గండికొట్టిన బీజేపీ ఈసారి భారీ విక్టరీపై కన్నేసింది.
Comments
Please login to add a commentAdd a comment