‘మదర్’ ఇక సెయింట్ | Mother Teresa to be made a saint | Sakshi
Sakshi News home page

‘మదర్’ ఇక సెయింట్

Published Sun, Sep 4 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

‘మదర్’ ఇక సెయింట్

‘మదర్’ ఇక సెయింట్

మొదటి ప్రపంచ యుద్ధానికి భూమిక సిద్ధమవుతున్న సమయంలో, అదే నేల మీద ఒక శాంతిదూత జన్మించడం గొప్ప చారిత్రక వైచిత్రి. ఆ మహా సంగ్రామానికి అల్బేనియా, కొసావో వంటి ప్రాంతాలు ఆవేశాన్ని రగిలిస్తున్న సమయంలోనే ప్రస్తుతం మేసిడోనియా అని పిలుస్తున్న ప్రాంతంలో సోపె అనేచోట ఆగస్ట్ 26, 1910న ఆ బాలిక భూమ్మీద పడింది. ఆగ్నెస్ అని పేరు పెట్టారు. అనంతరకాలాలలో ఆమె ప్రపంచశాంతికి కృషి చేసి, నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు. అదికూడా భారతదేశంలోని కోల్‌కతా కేంద్రంగా. ఆమె ప్రపంచ శాంతి కోసం తపిస్తూనే దీనులకు, హీనులకు, అధోజగత్ సహోదరులకు, అన్నా ర్తులకు, రోగపీడితులకు, అనాథలకు చల్లని సేవలు అందించారు. ఆమె మదర్ థెరిసా.

మదర్ థెరిసా కన్నుమూసిన 19 సంవత్సరాలకు ఆమెను రోమన్ కేథలిక్ చర్చి సెయింట్‌హుడ్ హోదాతో  గౌరవిస్తున్నది.  జీసస్ ప్రవ చించిన ప్రేమ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పం ఆమెకు కౌమారంలోనే అంకురించింది. పన్నెండేళ్ల బాలికగా ఉన్నప్పుడే పరిశుద్ధ జీవనం గురించి ఆలోచించారు. 18వ ఏట సోపెలోని సొంత ఇంటిని వదిలిపెట్టి క్రైస్తవ సన్యాసినిగా మారిపోయారు. ఐరిష్ వర్గానికి చెందిన సిస్టర్స్ ఆఫ్ లొరెటొలో చేరారు. తరువాత డబ్లిన్‌లోని బ్లెస్డ్ వర్జిన్ మేరీ అనే సంస్థలో కొన్ని మాసాలు తర్ఫీదు పొందారు.

మే 24, 1931న సన్యాసినిగా అధికారిక ప్రమాణం స్వీకరించిన థెరిసా అక్కడ నుంచి కోల్‌కతా చేరుకున్నారు. నాటి నుంచి సెప్టెంబర్ 5, 1997లో తుదిశ్వాస విడిచేవరకు ఆమె మానవసేవలోనే పునీతమయ్యారు. 1931లోనే థెరిసా కోల్‌కతాలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యా యినిగా సేవలు చేయడం ఆరంభించారు. కానీ 1948వ సంవత్సరం నాటికి ఆమె హృదయం పేదల సేవ కోసం పరితపించింది. అందుకు నాటి కోల్‌కతా (కలకత్తా)లో ఉన్న దుర్భర దారిద్య్రమే కారణం. దానికి తోడు భారత విభజన రక్తసిక్త అనుభవాలు కూడా బెంగాల్‌కుఎక్కువే. ఇవన్నీ కలసి మానవ జీవితాన్ని కొన్ని దశాబ్దాల పాటు అతలా కుతలం చేశాయి. ఈ నేపథ్యంలోనే థెరిసా సామాజిక సేవకురాలిగా రంగంలోకి దిగారు. క్రైస్తవ మిషనరీలు, మునిసిపాలిటీ కూడా ఆమె సేవా కార్యక్రమాలకు నిధులు అందించేవి.

మతం ఒక మాధ్యమం
మానవసేవకు జీవితాన్ని అంకితం చేసిన థెరిసా, అందుకు క్రైస్తవాన్ని మాధ్య మంగా ఎంచుకున్నారు. ఒక వైద్యుడు, ఒక నర్సు, ఇరుగు పొరుగు అందించే సేవలకు భిన్నంగా మానవీయ కోణాన్ని అద్దుకుని ఆమె క్రీస్తు ప్రేమ సందేశంతో విశ్వ మానవతకు సేవకిగా అవతరించారు. ఆమె సేవా దృక్పథం మతమనే వాహకం ద్వారా వ్యక్తమైంది. ఆమె సేవలు అందించడానికి ఎంచుకున్న వర్గం పేదలలో అతి పేదలు. మురికివాడల జనం. ఇది 20వ శతాబ్దంలో ఒక అపురూప సమ్మేళనమే.

ఈ సేవలకు మెచ్చే వాటికన్ థెరిసాను అపురూప రీతిలో నాడు సత్కరించింది. ఆమె సొంతంగా ఒక సేవా విభాగాన్ని ఆరంభించడానికి ‘ఆర్డర్’ ఇచ్చింది. ఈ అసాధారణ గుర్తింపు అక్టోబర్ 7, 1950న ఆమెకు దక్కింది. తరువాత ఇదే మిషన రీస్ ఆఫ్ చారిటీగా (ఎంఓసీ) కార్యరూపం దాల్చింది. అనాథలను ఆదుకోవడమే ఎంఓసీ ప్రధాన ధ్యేయం. కేవలం 12 మంది సభ్యులతో మొదలైన ఎంఓసీ ఇప్పుడు 4,000 మంది సన్యాసినులతో ప్రబల సేవా సంస్థగా ఆవిర్భవించింది. వీరంతా అనాథాశ్రమాలను నిర్వహిస్తున్నారు. నా అనేవారు లేక దుర్భర జీవితం గడుపు తున్నవారు, కుటుంబాలు విడిచిపెట్టేసిన పిల్లల్ని, కుటుంబాలకు దూరమైన వారిని ఆదరించవలసిన ఆవశ్యకత ఎంతో థెరిసా గుర్తించారు. శరణార్థులకు గూడూ, కూడూ ఇచ్చి ఆదుకోవడం, వారికి వైద్య సేవలు అందించడం ఎంత ముఖ్యమో కూడా ఆమె గమనించారు. అలాగే సంఘ బహిష్కృతులుగా మారుతున్న ఎయిడ్స్ రోగులను ఆదుకోదలిచారామె.

అంతేకాదు, అంధులు, అవిటివారు, వరద బాధి తులు, దుర్భిక్ష ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని, ఇళ్లు లేనివారిని ఆదు కోవడమే లక్ష్యంగా ఆ సంస్థ పనిచేస్తోంది. తరువాత ఎంఓసీని ఇతర దేశాలలో ఆరంభించడానికి కూడా అనుమతి లభించింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా, పోలండ్, ఆస్ట్రేలియాలలో కరువుకాటకాలకు గురైన వేలాదిమందికి ఈ సంస్థ ఆశ్రయం ఇచ్చింది. ఆ రీతిలో కోల్‌కతాలో ఒక క్రైస్తవ సన్యాసినిగా, సేవకురాలిగా జీవితం ఆరంభించిన థెరిసా తరువాత ప్రపంచానికి ఒక ఆదర్శ మహిళగా అవతరించారు. అదే నోబెల్ శాంతి (1979)బహుమానానికీ, భారతరత్న (1980) పురస్కారానికీ ఇప్పుడు కేథలిక్ క్రైస్తవంలో అత్యున్నత సెయింట్ హోదా నడిపించాయి. ఆకలితో అలమటించిపోయిన ఇథియోపియా బాలలను చూసి మనసు వికలం కాని వారు ఎవరూ ఉండరు. కానీ అక్కడికి వెళ్లి వాళ్ల
 నోటికి ఆహారం అందించే పనిచేశారు థెరిసా.. అలాగే చెర్నోబిల్ ఉదంతం జరిగినప్పుడు ఆ ఉత్పాతంలో గాయపడిన వారికి సేవలు అందించడానికి వెళ్లిన కరుణామయి థెరిసా.

ఇంతకుముందు...
థెరిసా తరువాత కాలంలో భారత పౌరసత్వం తీసుకున్నారు. ఆమెకు ముందు మన దేశం నుంచి సెయింట్ హోదా పొందిన వారు కూడా అదే తరహాకు చెందినవారు. కేరళ సైరో మలబార్ కేథలిక్ చర్చికి చెందిన సిస్టర్ అల్ఫోన్సోకు మొదట ఈ గౌరవం దక్కింది. 2008లో ఈమెకు ఈ అత్యున్నత పురస్కారాన్ని వాటికన్ ప్రకటించింది. కేరళ మిషనరీ ఫాదర్ చెవేరా అచెన్‌కు, సిస్టర్ ఇవూప్రసైయ్యమ్మలకు నవంబర్ 23, 2014న పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హోదా ఇచ్చారు. ఫాదర్ చెవేరా అచెన్ అసలు పేరు కురియకోస్ చెవేరా. ఈయన 1829 ప్రాంతానికి చెందిన క్రైస్తవ పురోహితుడు. సిస్టర్ ఇవూప్రసైయ్యమ్మ అసలు పేరు యుఫ్రేషియా. అయితే ఫాదర్ చెవేరాకు, సిస్టర్ అల్ఫోన్సోకు సెయింట్ హోదా కట్టబెట్టే కార్యక్రమాన్ని 1986లో ఒకేసారి ఆరంభిం చారు. ప్రతి చర్చికి అనుబంధంగా ఒక పాఠశాల ఉండాలన్న ఆలోచన ఫాదర్ చెవేరాదే.

అదికూడా ఉచిత విద్యను అందించే పాఠశాల ఉండాలని ఆయన ఆదే శించారు. జనవరి 3, 1871న ఆయన కన్నుమూశారు. యుఫ్రేషియాకు సెయింట్ హోదా కల్పించే కార్యక్రమం 2006లో మొదలయింది. ఆమె ప్రార్థనకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తూ ఏకాంతంగా గడిపేవారు. ఆగస్ట్ 29, 1951లో ఆమె త్రిశూర్‌లో మరణించారు. అలాగే థెరిసాకు ఆ అత్యున్నత హోదా ఇచ్చే కార్యక్రమం ఆమె మరణించిన వెంటనే ఆరంభమైంది. మిగిలిన వారికంటే థెరిసాకు సెయింట్ హోదా ఇచ్చే పని అతి శీఘ్రంగా ఆరంభం కావడానికి కారణం ఆమె సేవా కార్యక్రమాలు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. అయినా ఒక క్రైస్తవ మత పెద్దకో, సేవకునికో ఆ పురస్కారం ఇచ్చే ప్రక్రియ వారు మరణించిన ఐదేళ్ల తరువాత ఆరంభం కావడం సంప్రదాయం. 1963 నుంచి పోప్‌లు సెయింట్ హోదాను ఎక్కువగా ఇవ్వడం ఆరంభించారు. ఆ సంవత్సరం నుంచి మొదలు పెట్టి ఇప్పటి వరకు 640 మందికి ఆ హోదా ఇచ్చారు. వారిలో చివరి వారు థెరిసా. అంతకు ముందు 375 సంవత్సరాల చరిత్రలో కేవలం 218 మందికే ఆ గౌరవం దక్కింది.

హోదాకు నియమాలు
సెయింట్ హోదా ప్రాచీనకాలం నుంచి వాటికన్ ప్రసాదిస్తున్న అపు రూప గౌరవం. ఇందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియ మాలతో విభేదించేవారు ఉన్నమాట నిజం. అయితే ఆ వ్యక్తులు సమాజాలకు, మానవత్వానికి చేసిన సేవలకు ఇస్తున్న పురస్కారం కాబట్టి ఎక్కువమంది ఆ హోదా దక్కిన వారిని గౌరవించడం కూడా జరుగుతోంది. థెరిసా జీవితంలో కూడా రెండు ‘అద్భుతాలు’ జరి గాయని వాటికన్ నగరం విశ్వసించింది. అందులో ఒకటి మోనికా బెస్రా అనే గిరిజన మహిళకు సంబంధించిన ఉదంతం. తాను ఒక చర్చిలోకి వెళ్లగానే థెరిసా పటం నుంచి ఒక కిరణం వచ్చి తనను తాకిందని, దానితో ఉదరంలోని క్యాన్సర్ నయమైందంటూ ఆమె చేసిన ప్రకటనను వాటికన్ పరిగణనలోనికి తీసుకుంది. రెండో అద్భుతం-బ్రెజిల్ దేశీయుడికి అనుభవమైందని అంటారు. మదర్ ఆశీస్సులతో అతడి మెదడులో ఏర్పడిన కణితులు తొలగిపోయాయని వాటికన్ విశ్వసించింది.
 
నేడు ప్రదానం

ఈ ఆదివారం (సెప్టెంబర్ 4) థెరిసాకు సెయింట్ హోదా ప్రకటించే ఉత్సవం రోమ్‌లోని వాటికన్ నగరంలో పోప్ ఫ్రాన్సిస్ అధ్యక్షతన అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనిని థె రిసా సేవా కార్యక్షేత్రం కోల్‌కతాలో కూడా ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా ప్రసారం చేస్తున్నారు. ఇక సాక్షాత్తు వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగే ఆ మహోత్సవాన్ని వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి క్రైస్తవ మత పెద్దలు, థెరిసా అభిమానులు దాదాపు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా. ఈ ఉత్సవానికి భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం కూడా హాజరవుతున్నది. ‘ఆమె జీవితం మొత్తం నిరుపేదల సేవకు అంకితం చేశారు. అలాంటి ఉన్నత వ్యక్తికి సెయింట్ హోదా దక్కుతున్నదంటే భారతదేశం సహజంగానే గర్విస్తుంది’ అని ప్రధాని ఒక సందేశంలో శ్లాఘించారు కూడా.  నిజానికి ఇది థెరిసా అపురూప జ్ఞాపకానికీ, సేవా తత్పరత మీద ఆమె విడిచిన ముద్రకీ జరుగుతున్న సత్కారం. ప్రపంచవ్యాప్తంగా 136 దేశాల పేదసాదల హృదయంలో ఆమె ఒక చెరగని ముద్ర.


రచయిత: గోపరాజు నారాయణరావు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement