Mother Teresa
-
మదర్ థెరిసా జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు
-
మదర్ థెరీసా జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు శాంతిదూత మదర్ థెరీసా జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులూ, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి వారందరినీ అక్కున చేర్చుకున్న మానవతా మూర్తి మదర్ థెరిసా అని కొనియాడారు.ఎంతో మంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు అనాథ, పేద పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి వారి భవిషత్తుకు బంగారు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి ఆమె అని ప్రశంసించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలోని నిర్మల్ హృదయ్ భవన్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా వారికి సహాయ సహకారాలు అందించామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ భవనం కాంప్లెక్స్‌ను ఆరోజు తాను ప్రారంభించండం సంతోషంగా ఉందని తెలిపారు. నేడు భారతరత్న, నోబెల్ బహుమతి గ్రహీత మదర్ థెరిసాగారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులూ, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి వారందరినీ అక్కున చేర్చుకున్న మానవతా మూర్తి మదర్ థెరిసాగారు. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు అనాథ, పేద పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి వారి భవిషత్తుకు బంగారు… pic.twitter.com/KFVYHYaXOQ— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2024 -
మదర్ థెరిస్సా అందించిన సేవల నేపథ్యంలో సినిమా..
భారతదేశంలో పేదలు, రోగులు, అనారోగ్యంతో మరణానికి దగ్గరైన వారికి 1940 మధ్యకాలంలో మదర్ థెరిస్సా అందించిన సేవల నేపథ్యంలో రూపొందిన చిత్రం మదర్ థెరిస్సా అండ్ మీ. ఈ సినిమాలో భారత సంతతికి చెందిన బ్రిటీష్ మహిళ కవిత కథను కూడా ఆవిష్కరించారు. జాక్వెలిన్ ఫిట్షి కోర్నాజ్, బనితా సంధు, దీప్తి నావెల్ ప్రధాన పాత్రలు చేశారు. మదర్ థెరిస్సాగా జాక్వెలిన్ నటించగా, కవితగా బనితా సంధు కనిపిస్తారు. కర్రీ వెస్ట్రన్, మిలియన్స్ కెన్ వాక్ ఫేమ్ కమల్ ముసలే దర్శకత్వం వహించారు. క్రౌడ్ ఫండింగ్‌తో ఈ సినిమాను నిర్మించామని, వచ్చే లాభాలను స్వచ్ఛంద సేవా సంస్థలకు అందిస్తామని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాను తొలుత హిందీ, ఇంగ్లీష్ భాషల్లో, ఆ తర్వాత స్పానిష్‌లో డబ్ చేయాలనుకుంటున్నారు. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
స్వతంత్ర భారతి: 1997/2022 మల్టీప్లెక్స్ మయసభలు
1997 నాటికి దేశ జనాభా వంద కోట్లు. ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న వెండితెరలు కేవలం 12,500. పది లక్షల జనాభాకు సగటున 13 థియేటర్లు కూడా లేని ఆ కాలంలో మెల్లిగా మల్టీప్లెక్స్‌లు అవతరించడం మొదలైంది. ఒక్కోటి కనీసం 35 కోట్ల రూపాయల అంచనా వ్యయమయ్యే మల్టీపెక్ల్లు ఆ ఏడాది కొన్ని పదుల సంఖ్యలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రేక్షకుల కోసం ఎలివేటర్లను సిద్ధం చేశాయి. దీంతో సినిమాను వీక్షించే తీరే మారిపోయింది. భారీ బడ్జెట్ చిత్రాలను భారీ మల్టీపెక్స్ సినిమా హాళ్లలో మాత్రమే చూడాలనే తరం బయల్దేరింది. మల్టీప్లెక్స్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ ప్రేక్షకులను దృష్టి ఉంచుకుని నిర్మాతలు సినిమాలు తీయడం అనే కొత్త ధోరణి కూడా అప్పుడే మొదలైంది. 1990ల ద్వితీయార్థంలో మల్టీప్లెక్స్‌లకు మాల్స్ చేదోడుగా ఉంటే, కరోనా అనంతరం మాల్స్ ఇప్పుడు మల్టీప్లెక్స్‌లకు చేదోడు అవుతున్నాయి. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు మదర్ థెరెసా వారసురాలిగా సిస్టర్ నిర్మలను ఎంచుకున్న మిషనరీస్ ఆఫ్ ఛారిటీ. ప్రధాని హెచ్.డి. దేవెగౌడ నాయకత్వం బలహీనంగా ఉందన్న కారణంతో ‘యునైటెడ్ ఫ్రంట్’కు మద్దతు ఉపసంహరించుకున్న కాంగ్రెస్ పార్టీ. కొత్త ప్రధానిగా ఐ.కె.గుజ్రాల్. రాష్ట్రపతిగా కె.ఆర్. నారాయణన్. ప్రత్యర్థి టి.ఎన్.శేషన్ ఓటమి. మదర్ థెరెసా మరణం. (చదవండి: బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?! కథనమా?) -
చైతన్య భారతి: మదర్ థెరెసా / 1910–1997
దయామయి అధికార మందిరాలలో ఆమెకు అఖండ గౌరవ మర్యాదలు లభించాయి. కానీ, ఆమె ఉద్యమం మాత్రం ఖండఖండాలలోని మురికివాడలు, నిరుపేద వీధులు మాత్రమే. తన వ్యవస్థకు చెందిన ఐదు వేల మంది సిస్టర్స్, బ్రదర్స్ సాయంతో ఆమె ఇటుక ఇటుక వంతున పేర్చుకుంటూ వచ్చి, తన విశ్వవ్యవస్థను నిర్మించారు. ఒంటరితనం, ఆకలి, వేదనలను బాపే తన మహోద్యమానికి చేయూతనివ్వడానికి ముందుకు వచ్చిన కోట్లాది సాధారణ ప్రజానీకాన్ని కలుపుకొని ముందుకు తీసుకువెళ్లే సామర్థ్యాన్ని ఆమె ప్రదర్శించారు. 1997లో అంతిమ శ్వాస విడిచే నాటికి, 123 కు పైగా దేశాలలో పని చేస్తున్న బహుళ జాతి వ్యవస్థను ఆమె నిర్మించారు. నిరాశ్రయులు, చ్యుతులు, అనాథలు, ఆకలితో, మృత్యవుతో పోరాడుతున్న వారు ఆమె ప్రత్యేక పరిధిలోకి వచ్చారు. ఈ క్రమంలో ఆమె తన కాలపు ప్రధాన అంతరాత్మ ప్రబోధకులలో ఒకరిగా అవతరించారు. ప్రపంచంలో అత్యున్నతస్థాయి పురస్కారం అయిన నోబెల్ శాంతి బహుమతికి 1979 లో ఆమెను ఎంపిక చేశారనే సమాచారాన్ని అందుకున్నప్పుడు ఆమె మొట్టమొదటిగా చేసిన వ్యాఖ్య : ‘‘నేను అందుకు అర్హురాలను కాను’’ అని! కేవలం పేదల పేరు మీద తాను ఆ అవార్డును అందుకోగలనని ఆమె ఆ బహుమతి నిర్వాహకులకు రాసిన జాబులో తెలిపారు. ఏకాకులు, దీనులు, అనాథలు, వెలికి గురైన కుష్టు రోగ పీడితులు అందరూ ఆమె నుంచి, ఆమె సహచరులైన సిస్టర్స్ నుంచి ఆదరపూర్వకమైన కరుణను పొందారు. మానవునిలో క్రీస్తును చూస్తూ, ఎలాంటి ఆధిక్య భావనా లేకుండా మదర్ థెరెసా అభాగ్యుల మీద అపారమైన కరుణను కురిపించారు. కేవలం నచ్చిన భావాలనే వాదాలుగా ఉపయోగించే హిందువుగా నాకు మదర్ థెరెసా ప్రతి క్షణం క్రీస్తు స్పృహలోనే ఉంటారనే సంగతి అర్థం కావడానికి చాలామంది కన్నా ఎక్కువ సమయం పట్టింది. ‘‘విశ్వాసులం కావడమే మన విధి తప్ప, విజేతలు కావడం కాదు’’ అని ఆమె ఒకసారి తన తత్వాన్ని నాకు అరటి పండు ఒలిచి పెట్టినంత‡ సరళమైన మాటలతో వివరించారు. విశ్వాసానికి ఉదాహరణగా ఆమె జీవించారు. – నవీన్ చావ్లా, మదర్ థెరెసా జీవిత చరిత్ర రచయిత -
అనాథగా సికింద్రాబాద్ వీధుల్లో.. ఏడేళ్లకు సురక్షితంగా..!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకకు చెందిన వివాహిత (58) సైకోసిస్ అనే మానసిక వ్యాధి బారినపడి కుటుంబానికి దూరమైంది. అనాథగా సికింద్రాబాద్ వీధుల్లో సంచరిస్తున్న ఆమెను మదర్ థెరిస్సా చారిటీ సంస్థ అక్కున చేర్చుకుంది. ఆమె పరిస్థితి చూసి, చలించిన మానసిక వైద్యురాలు డాక్టర్ అనిత రాయిరాల ఏడాదిగా ప్రత్యేక శ్రద్ధతో చికిత్స చేశారు. ఎట్టకేలకు కోలుకున్న ఆమె తన వివరాలు చెప్పడంతో శనివారం సికింద్రాబాద్‌లోని చారిటీ కార్యాలయంలో వారికి అప్పగించారు. సరైన వైద్యం అందిస్తే ఎంతో మంది మానసిక రోగులు బాగయ్యే అవకాశం ఉందని డాక్టర్ అనిత వ్యాఖ్యానించారు. ►బెంగళూరుకు చెందిన వివాహితకు ఐదుగురు సంతానం. ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆమె ఓపక్క తన కుటుంబాన్ని చూసుకుంటూ.. మరోపక్క చుట్టుపక్కల పిల్లలకు ట్యూషన్లు చెప్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. ►ఆమెకు 49 ఏళ్ల వయస్సులో సైకోసిస్ అనే మానసిక వ్యాధి బారినపడింది. దీని ప్రభావంతో ఏం చేస్తోందో, ఏం మాట్లాడుతోందో కూడా తెలియని స్థితికి చేరుకుంది. అయినప్పటికీ కుటుంబీకులు ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నారు. ►రెండుమూడుసార్లు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈమెను అతికష్టమ్మీద పట్టుకున్నారు. అయితే 2015లో ఇంటిని వదిలిన ఈ వివాహిత రైలులో సికింద్రాబాద్‌కు చేరుకుంది. ఈమె ఆచూకీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన కుటుంబీకులు అక్కడి పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. చదవండి: (మదనపల్లెలో దారుణం.. పొట్టేలు తల అనుకుని యువకుని తల..) ►సికింద్రాబాద్‌కు చేరుకున్న వివాహిత ఫుట్‌పాత్‌పై దిక్కులేని దానిలా కొన్నాళ్లు గడిపింది. రోడ్డుపై ఏది దొరికితే అది తింటూ బతికింది. ఈమెను చూసిన ఓ వ్యక్తి మదర్ థెరిస్సా చారిటీ సంస్థకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన నిర్వాహకులు ఆమెను అక్కున చేర్చుకున్నారు. ►నీడ, తిండి, బట్ట ఇవ్వడంతో పాటు వైద్యం చేయించారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ అనిత రాయిరాల సామాజిక సేవలో భాగంగా ఈ సంస్థకు వెళ్లి అక్కడి వారికి వైద్యం చేస్తుంటారు. అలా దాదాపు ఏడాది క్రితం ఈమె కళ్లల్లో ఆ వివాహిత పడ్డారు. ►ఆమెను చూసిన తొలి రోజే సరైన వైద్యం చేస్తే మామూలు స్థితికి చేరుకుంటుందని భావించారు. ఏడాది పాటు ప్రత్యేక చికిత్స చేసిన డాక్టర్ అనిత ఆ వివాహిత మామూలు స్థితికి చేరుకునేలా చేశారు. ఆమె మాట్లాడుతున్నది కన్నడగా భావించిన డాక్టర్... ఆ భాష తెలిసిన తన స్నేహితులతో మాట్లాడించారు. ►అలా ఆమె నుంచి బెంగళూరులోని కుటుంబీకుల వివరాలు తెలుసుకున్నారు. చారిటీ నిర్వాహకుల సహకారంతో అక్కడి స్థానికి పోలీసులను సంప్రదించి ఆమె కుటుంబాన్ని గుర్తించారు. వారితో ఫోన్లో సంప్రదించి, వివాహిత ఫొటో పంపి ఖరారు చేసుకున్నారు. ►శనివారం నగరానికి చేరుకున్న ఆమె భర్త, కుమార్తె, అల్లుడు సికింద్రాబాద్‌లోని చారిటీ కార్యాలయంలో వివాహితను చూసి ఉద్విగ్నానికి లోనయ్యారు. చారిటీ నిర్వాహకులు ఆమెకు కుటుంబానికి అప్పగించారు. ఇక జీవితంలో చూడలేమని భావించిన తన భార్యను తిరిగి అప్పగించిన మదర్ థెరిస్సా చారిటీ సంస్థకు, ఆమెను మామూలు మనిషిని చేసిన డాక్టర్ అనితకు కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు. -
ఉపాధ్యాయుడి పాత్ర మరువలేనిది: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పి, భవిష్యత్‌లో మంచివైపు నడిపించే వ్యక్తి గురువు ఒక్కరేనన్నారు. అన్ని వృత్తులను తయారు చేసే వృత్తి.. ఉపాధ్యాయ వృత్తి మాత్రమేనని తెలిపారు. భావితరాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడి పాత్ర మరువలేనిదన్నారు. చదవండి: నా బిడ్డలిద్దర్నీ ఆశీర్వదించండి మానవత్వానికి మరో రూపం మదర్ థెరిస్సా నోబెల్ అవార్డు గ్రహీత మదర్ థెరిస్సా వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఎందరో నిరాశ్రయులు, శరణార్థులు, అంటువ్యాధిగ్రస్తులను చేరదీసి ఆశ్రయం కల్పించిన మదర్ థెరిస్సా జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. అంధులు, దివ్యాంగులు, వృద్ధులకు మెరుగైన వైద్య సేవలు అందించి, సేవామూర్తిగా నిలిచారని గుర్తు చేశారు. మానవత్వానికి మరో రూపం మదర్ థెరిస్సా అని కొనియాడారు. చదవండి: యువతను బలిపీఠం ఎక్కిస్తున్నారు: వైఎస్ షర్మిల -
బాలీవుడ్లో మరో బయోపిక్.. ఎవరిదంటే
హిట్టు, ఫ్లాఫ్‌తో పని లేకుండా ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలే కాక ఇతర రంగాల్లో గుర్తింపు పొందిన ప్రముఖుల గురించి కూడా బయోపిక్‌లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ప్రముఖ వ్యక్తి బయోపిక్ మనల్ని పలకరించనుంది. సేవే పరమావధిగా బతికి.. ప్రపంచానికంతటికి తల్లిగా గుర్తింపు తెచ్చుకున్న ‘మదర్ థెరీసా’ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుందట. మదర్ థెరిసా జీవితం గురించి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఇలా వచ్చిన పుస్తకాల్లో సీమా ఉపాధ్యాయ్ రచించిన ‘మదర్ థెరీసా.. ది సెయింట్’ అనే పుస్తకం బాగా పాపులర్ అయింది. ఈ పుస్తకం ఆధారంగా ఇప్పుడు మదర్ థెరీసా బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నారు. సీమా ఉపాధ్యాయే దర్శకత్వం వహించే ఈ చిత్రం 2020 లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘మదర్ థెరీసా శాంతికి, సేవకు చిహ్నంగా నిలుస్తారు. ఆమె జీవితం ఎందరికో ఆదర్శం. అందుకే ఆమె జీవితం గురించి ప్రేక్షకులకు తెలయజేయాలనుకుంటున్నాం. ఈ బయోపిక్కు మొదలు పెట్టాలని అనుకోగానే ముందు కోల్‌కతాలోని చారిటీకి వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకున్నాం. ఈ చిత్రంలోని పలు పాత్రలను జాతీయ అంతర్జాతీయ నటీనటులు పోషిస్తారు. 2020లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’ అని తెలిపారు. ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టిన మదర్ థెరిసా, ఇండియా వచ్చి.. కోల్‌కతా ప్రాంతంలో అనాధ శరణాలయాన్ని స్థాపించారు. ఆ శరణాలయం ద్వారా లక్షలాది మందిని చేరదీసి అమ్మగా మారారు. ఆమె సేవలకు ప్రతిఫలంగా నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
కోట్లు కుమ్మరించినా ఆ పని మానలేను
మదర్ థెరీసా యుగోస్లేవియాలో పుట్టింది. భారతదేశం వచ్చింది. తోటివారిలాగే పాఠాలు చెప్పేది. ఓ రోజు రాత్రి కలకత్తాలో వీథిలో వెడుతుండగా ఓ అనాథ స్త్రీ విపరీతమైన అనారోగ్యంతో వచ్చి ఆమె చేతుల్లో పడింది. ‘ప్రాణం పోతోంది, చాలా బాధగా ఉంది. నన్ను డాక్టర్‌కు చూపించు’ అంది. ఎవరని అడిగితే ఎవరూ లేరు, అనాథనంది. ఆ క్షణంలో ఆమెకు గివింగ్ ఈజ్ లివింగ్(ఇచ్చుకోవడమే జీవిత పరమార్థం) అనిపించింది. ఆమెను కనీసం 10 వైద్యశాలలకు తీసుకెళ్ళింది. ‘తగ్గించడానికి చాలా ఖర్చవుతుంది, చికిత్స కుదరదు’ అన్నారు అంతటా. ఈ తిప్పటలో ఆ అనాథ ప్రాణాలు విడిచేసింది.‘ఇలా చచ్చిపోవడానికి వీల్లేదు’ అని థెరీసాకు అనిపించింది. ‘పక్కవాడు చచ్చిపోయినా ఫరవాలేదు–అని బతకడానికి కాదు మనుష్యజన్మ’ అని...‘‘ఇక నా జీవితం పదిమంది సంతోషం కోసమే’ అని సంకల్పించి నేరుగా తన గదికి బయల్దేరింది. ఒక పాత బకెట్, రెండు తెల్లచీరలు, రు.5లు పట్టుకుని ఆమె బయటికి నడుస్తుంటే... ఎక్కడికని స్నేహితులడిగారు. ‘ఇకపైన కష్టాలున్న వాళ్లెవరున్నారో వాళ్ళందరికీ తల్లినవుతాను’’ అని చెప్పి బయల్దేరబోతుంటే... ‘వీటితో...అది సాధ్యమా’ అని అడిగారు. ‘‘నేను తల్లి పాత్ర పోషించబోయేది, గుండెలు నిండిన ప్రేమతో, ఆదుకోవాలన్న తాపత్రయంతో’’ అని చెప్పి గడప దాటింది. అదీ సంకల్పబలం అంటే. తరువాత కాలంలో ఆమె ఎంతగా కష్టపడ్డారంటే...దాని ఫలితాలు మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్, నిర్మల్ హృదయ్, శిశుభవన్... వంటి సంస్థలుగా దర్శనమిచ్చాయి. లక్షలమందిచేత మదర్ అని– అంటే అమ్మా అని పిలిపించుకున్నది. తర్వాతి కాలంలో ఆమెకు నోబెల్ బహుమతి వచ్చినప్పడు విలేకరులు ‘‘కీర్తి ప్రతిష్ఠలు వచ్చాయి. ప్రైజ్ మనీ(రు.18లక్షలు) కూడా వచ్చింది. సంతోషిస్తున్నారా..?’ అని అడిగితే... నేను సంతోషించిన సంఘటన ఇదికాదు, మరొకటి ఉందని చెప్పింది.‘‘ఒకనాడు ఒక యాచకుడొచ్చాడు. నన్ను చూడాలని ఉందంటే తీసుకొచ్చారు. తన కష్టాలు ఏకరువు పెడతాడనుకుంటే... జేబులోంచి ఒక కాసు తీసి ‘అమ్మా, ఇంతమందిని ఆదుకుంటున్నావు, నా వంతు ఈ డబ్బు ఉంచమ్మా’ అని ఓ పావలా కాసు ఇచ్చి వెళ్ళాడు. అది పావలాయే అయి ఉండవచ్చు. నా మీద పెంచుకున్న నమ్మకం అది.ప్రేమతో ఇచ్చిన ఆ నాణెంతో నోబెల్ బహుమతి సమానం కాదు’’ అని థెరీసా చెప్పారు. ఒకరికి ఇవ్వడంలోఎంతో ఆనందం ఉంటుంది. అది ఎంతన్నది కాదు ప్రధానం. ఇక ఆ తరువాత నుంచి అందరినీ ‘నాకేమయినా ఇస్తారా’ అని అడుగుతున్నా. చివరికి ఐదు, పది పైసలయినా సరే, చినిగిన బనీనయినా, కాల్చిపారేసే అగ్గి పుల్లయినా ఏదయినా ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకుంటా. ఇవ్వడంలో వారు అనుభవించే ఆనందం నాకు ముఖ్యం’’అని ఆమె చెప్పేవారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టిన నాడు, బాధలో ఉన్నవాడిని ఆదుకున్ననాడు, వాడు సంతోషించడానికి కారణమయిన జన్మే మనుష్య జన్మ. కుష్ఠురోగులకు చీము, నెత్తురు తుడిచి సేవ చేస్తుంటే చూసిన ఒక విలేకరి ‘‘ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ పని చేయను నేను. మీరెలా చేస్తున్నారు?’’ అని అడిగితే...‘‘కొన్ని కోట్లు ఇచ్చినా ఈ పనిని నేను మానలేను. ఎందుకంటే నాకు వారిలో భగవంతుడు కనబడుతున్నాడు’’ అని జవాబిచ్చింది ఒక అతి సామాన్య సేవకురాలు, లక్షలు, కోట్లాదిమంది చేత అమ్మా అని నోరారా పిలిపించుకున్న మదర్ థెరీసా. -
మదర్ థెరిసా మిషనరీలో దారుణం
రాంచీ : ‘సేవే పరమావధిగా భావించి అనాధలను అక్కున చేర్చుకొని, వారికో జీవితాన్ని ఇచ్చి ఎందరికో తల్లిగా మారారు ‘ మదర్ థెరిసా’. అనాథలను, అభాగ్యులను ఆదుకోవడానికి ఆ మాతృమూర్తి స్థాపించినదే ‘మదర్ థెరిసా మిషనరి చారిటి’. ప్రజలకు సేవ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ చారిటిలకు ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఏర్పాటు చేసే ఈ చారిటిలకు కూడా డబ్బు జబ్బు పట్టుకుంది. ప్రజలకు తమ పై ఉన్న నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే చారిటిలో చేరిన అనాథలను డబ్బు కోసం విక్రయిస్తున్నారు. ఎటువంటి దత్తత పత్రాలు లేకుండానే ఈ తంతు కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులుగా చారిటిలో అనాథ పిల్లలు ఒక్కొక్కరు మిస్ అవుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ చారిటి సభ్యులు పోలీస్ విచారణకు అంగీకరించకపోవడం వల్ల అధికారులు కూడా ఏమి చేయ్యలేక పోయారు. తాజాగా ఓ కుటుంబం ఇచ్చిన పిర్యాదు మేరకు అసలు నిజం వెలుగులోకి వచ్చింది. వివరాల.. ప్రకారం మదర్ థెరిసా చారిటి, నిర్మల్ హృదయ్ రాంచీ శాఖలో 13 మంది బాలికలు, 22 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఓ కుటుంబం బిడ్డను పెంచలేని స్థితిలో ఉండటం చేత తమ బిడ్డ బాగోగులను చూడమని నిర్మల్ హృదయ్ మిషనరి సంస్థలో అప్పగించి వెళ్లారు. కానీ తర్వాత మనసు మార్చుకుని బిడ్డను పెంచుకోవాలనుకున్నారు. దాంతో చారిటికి వెళ్లి తమ బిడ్డను తిరిగి ఇవ్వమని కోరారు. కానీ చారిటి సభ్యులైన సిస్టర్ కోన్సాలియా, సేవకురాలు అనిమా ఇంద్వార్ బిడ్డ తమ దగ్గర లేదని చెప్పారు. దాంతో సదరు కుటుంబం తమకు న్యాయం చేయమంటూ పోలీసులను ఆశ్రయించారు. అయితే నిర్మల్ హృదయ్ చారిటి సంస్థ మీద ఇలాంటి పిర్యాదు రావడం ఇదే ప్రథమం కాదు. గతంలోనూ నలుగురు చిన్నారులు తప్పిపోయారనే పిర్యాదులు వచ్చాయి. కానీ చారిటిల మీద నమ్మకంతో అధికారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాక చారిటి సభ్యలు ‘పోలీసులను లోపలికి వచ్చి దర్యాప్తు చేయనిచ్చే’వారు కాదన్నారు డీపీ సింగ్. అంతేకాక గతంలో ఒక కేసు విచారణ నిమిత్తం చారిటి లోపలికి వెళ్లి దర్యాప్తు నిర్వహించినప్పటికి, తప్పు జరిగినట్టు అనిపించే అనుమానస్పద అంశాలేవి తమ దృష్టికి రాలేదన్నారు. కానీ ఈ సారి మాత్రం బిడ్డను కోల్పోయిన కుటుంబం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టదలుచుకోలేదు. అందుకే వారు చైల్డ్ వెల్ఫేర్ కమిటిని కలిసారు. ఈ విషయం గురించి మాలిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటి అధ్యక్షుడు ‘ఆ కుటుంబం ఇచ్చిన పిర్యాదు మేరకు నిర్మల్ హృదయ్ చారిటి మీద అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా సిస్టర్ కొన్సాలియా, సేవకురాలు అనిమా ఇంద్వార్ను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చారిటి వారు బాధిత కుటుంబం బిడ్డను 1.2 లక్షల రూపాయలకు వేరేవారికి అమ్మినట్లు ఒప్పుకున్నార’న్నారు. పోలీసులు వీరి మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. క్రైస్తవ మిషనరిల్లో కూడా పిల్లలను అమ్మేస్తున్నారనే వార్తలు రావడంతో షాక్ తిన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర దాస్ వెంటనే మిగతా చారిటీలు, సేవా సంస్థల్లో కూడా తనిఖీలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయం గురించి కోల్‌కతాలో ఉన్న ‘ మదర్ హౌస్ చారిటి’ ముఖ్య కేంద్రం అధికార ప్రతినిధి సునిత కుమార్ మేము ‘ఈ విషయాన్ని ఇంకా నమ్మలేక పోతున్నాము. మా సంస్థలోని సభ్యులు ఇలాంటి పనులు ఎన్నటికి చేయరు. విచారణలో వారి మీద నేరం రుజువయితే అప్పుడు మేము తగిన చర్యలు తీసుకుంటామ’న్నారు. -
సమస్యలే స్ఫూర్తి..సేవే లక్ష్యం
పలమనేరు : చేయూత లేదని అనాథలు బాధపడకూడదు.. ఆదరణ లేదని వృద్ధులు శోకించకూడదు..విద్య, వైద్య సదుపాయాలు లేక నిరుపేదలు అవస్థలపాలు కాకూడదు. సమాజంలో ప్రతి మూల ఓ వివక్ష కాని ఓ సమస్య కాని విష వృక్షంలా మారి మనిషి జీవితాన్ని కుదిపేస్తోంది. అలాంటి వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న మహోన్నత ఆశయం కోసం ఓ యువతి తపిస్తోంది. వారి సమస్యలే ఆమెకు స్ఫూర్తి..వారికి సేవ చేయడమే ఆమె లక్ష్యం..విద్యార్థి దశలోనే తనకు చేతనైన సాయం చేస్తూ సమా జ సేవలో ముందున్న ఆమె దృక్పథం నేటి యువతరానికి ఆదర్శం. పలమనేరు మదర్‌థెరీసా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించి, ప్రస్తుతం ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న రోహిత మనగతం ఆమె మాటల్లోనే.. కుటుంబం, చదువు నా పేరు రోహిత.. మాది గంగవరం సమీపంలోని మబ్బువాళ్లపేట. నాన్న వెంకటేశ్వర్లు ఏసీటీఓగా పనిచేస్తున్నారు. అమ్మ హేమలత గృహిణి. అన్నయ్య రిత్విక్ రోబోటెక్ ఆటోమేషన్‌లో యూఎస్‌లో జాబ్ చేస్తున్నాడు. నా ప్రాథమిక విద్య యూనివర్సల్‌లో, ఇంటర్ శ్రీవాణిలో సాగింది. ఇంటర్ ఎంపీసీలో 97.3 శాతం మార్కులు సాధించా. విట్, ఎస్ఆర్ఎం, సస్త్ర యూనివర్సిటీల్లో ఫ్రీ సీటు వచ్చింది. కానీ బీటెక్(సివిల్) ఇక్కడి మథర్ థెరీసాలో చదివా. బీటెక్ 86.01 మార్కులు సాధించి జేఎన్టీయూలో టాపర్‌గా గోల్డ్‌మెడల్‌ను పొందా. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డులు పొందాను. ఏటా కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్ వస్తోంది. పోటీల్లో గెలిచి..పేదలకు పంచి కాలేజీలో ఉన్న దాదాపు 20 ఇతర యూనివర్సిటీలు, కాలేజీల్లో జరిగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇతర కాంపిటీషన్స్‌కు వెళ్లాను. దాదాపు అన్నింటిలోనూ మొదటి బహుమతి గెలుచుకున్నా. అందులో ఇచ్చే క్యాష్ ప్రైజ్‌ను పలమనేరులోని వృద్ధాశ్రమానికి, గ్రామంలోని నిరుపేదలకు ఇచ్చేదానిని. మా తల్లిదండ్రులు కూడా నాకు అండదండగా ఉండేవారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యం గంటలకొద్దీ చదవడం ముఖ్యం కాదు. సబ్జెక్ట్‌పై ప్రాక్టికల్‌గా పట్టు సాధించాలి. ఇందు కోసం నెట్, యూట్యూబ్ లాంటివి ఎంతో ఉపయోగం. అందుకే నేను బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ తీసుకున్నా. సింథెటిక్ పెయింటింగ్, సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ అంశాలపై పేపర్ ప్రజెంటేషన్ చేస్తూ జేఎన్టీయూ, సౌత్ ఇండియా ఇంజినీరింగ్ యూనివర్సిటీల్లో టాపర్‌గా నిలిచా. అందుకోసమే ఐఏఎస్ చదువుతున్నా.. 2015లో జిల్లాకు వరదలు వచ్చాయి. కాని కొద్ది రోజులకే మా నియోజకవర్గంలో ప్రజలు మళ్లీ నీటి కోసం అవస్థలు పడ్డారు. నీటిని నిల్వ చేసేందుకు చెక్ డ్యామ్‌లు, చెరువులు లేకపోవడమే ఇందుకు కారణమనిపించింది. దీంతో ఐదు పంచాయతీల్లో దాదాపు 300 ఎకరాలకు నీరు అందించేలా ఓ ప్రాజెక్టును తయారు చేశాను. ఇందు కోసం సంబంధిత అధికారులను సంప్రదించి నెలల పాటు శ్రమించి అన్ని వివరాలతో ప్రాజెక్టు సిద్ధం చేసి అధికారులకు 2017 జూన్‌లో అందజేశా. కానీ నేటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. మంచి చేయాలని ఆశ ఉంటే చాలదు అధికారం కూడా కావాలని అప్పుడే అనిపించింది. కలెక్టర్ అయితే నేను అనుకున్నది చేయగలనని అనిపించింది. అందుకోసమే ఐఏఎస్ చదువుతున్నా.. సంక్పలం నేను చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణంలో పెరిగా. నాకు ప్రజలు కష్టాలు బాగా తెలుసు. మా నాన్నకు వ్యవసాయమంటే ఇష్టం కావడం వల్ల నాకు కూడా పొలం పనులంటే ఆసక్తి. కూలి పనులకొచ్చేవారి జీవితాల్లో కష్టాలను చూశా. విద్య, వైద్య సదుపాయాలు లేక నిరుపేదలు అవస్థలపాలు కాకూడదని అనిపించింది. వృద్ధులు, అనాథల అవస్థలను చూశా. వారికి ఏదో ఒక రకంగా సాయం చేయాలనిపించేది. -
మదర్ థెరిసా చీరకు మేధో హక్కు
కోల్‌కతా: అందరికీ చిరపరిచితమైన నీలి అంచు తెల్ల చీర... జీవితాంతం మదర్ థెరిసా ధరించిన ఆ తరహా చీరకు మేధో హక్కును మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సొంతం చేసుకుంది. ఏడాది క్రితమే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ద ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ’ ఈ గుర్తింపును జారీ చేసిందని మేధో హక్కుల న్యాయవాది బిస్వజిత్ సర్కార్ ఆదివారం తెలిపారు. మదర్ థెరిసాను పునీతగా ప్రకటించిన 2016, సెప్టెంబర్ 4నే మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌కు ఈ ఘనత దక్కిందని, ఆ సంస్థకు ప్రచారమంటే ఇష్టలేకపోవడంతో విషయం బయటకు రాలేదన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆ డిజైన్‌ను వ్యాపార ధోరణి కోసం వాడుతున్నారని, అలా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ విషయం బయటపెడుతున్నామని సర్కార్ చెప్పారు. చీర ట్రేడ్‌మార్క్ ధ్రువీకరణ కోసం డిసెంబర్ 12, 2013న దరఖాస్తు చేసుకున్నారని, దాదాపు మూడేళ్ల పరిశీలన అనంతరం మే«ధో హక్కును కేటాయించారని తెలిపారు. -
పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యం
పెదకాకాని: పేదవాళ్లు లేని సమాజాన్ని తీర్చిదిద్దడమే తన జీవిత లక్ష్యమని సీఎం ఎన్. చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని స్వస్థిశాలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెదకాకాని స్వస్థిశాలకు రాష్ట్రంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఇక్కడ మంచి సందేశంతోపాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టడమే నిజమైన సేవన్నారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి మదర్ థెరిస్సా, సిస్టర్ నిర్మల చేసిన సేవలను గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ పండుగ చేసుకోవాలని క్రిస్మస్ కానుక అందజేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. క్రిస్టియన్ సంక్షేమం కోసం రూ.57 కోట్లు కేటాయించామన్నారు. బెత్లెహోం వెళ్లేవారికోసం ప్రస్తుతమిచ్చే రూ.20 వేలను రూ.40 వేలకు పెంచినట్టు ప్రకటించారు. అలాగే చర్చి నిర్మించుకునే వారికిస్తున్న రూ.లక్షను రూ.3 లక్షలకు పెంచినట్టు తెలిపారు. అందరూ శాంతి, దయ, ఆప్యాయత కలిగి ఉండాలని సూచించారు. ఆ యేసుప్రభువు ఆశీస్సులు ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నారు. ‘యెహోవా నేను బ్రతికియుండు దినములన్నియు కృపాక్షేమములే’’ అని బైబిల్ వాక్యాన్ని ఆయనీ సందర్భంగా భక్తులకు చదివి వినిపించారు. తిరుపతిలో 99వ ఆర్థిక సంఘం సదస్సు సాక్షి ప్రతినిధి, తిరుపతి: జాతీయ స్థాయిలో జరిగే 99వ భారత ఆర్థిక సంఘం (ఐఈఏ)వార్షిక సదస్సులకు తిరుపతి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు శ్రీవేంకటేశ్వర వర్సిటీలో ఉన్న శ్రీనివాస ఆడిటోరియంలో ఈ సదస్సులు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, అంతర్జాతీయ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ కౌశిక్‌బసు ఈ సదస్సులను ప్రారంభించనున్నారు. -
మదర్ థెరిస్సా ఆశయాలను కొనసాగిద్దాం
– కర్నూలు, అనంతపురం డయాసిస్ బిషప్ పూల ఆంతోని కర్నూలు సీక్యాంప్: మధర్‌థెరిస్సా ఆశయాలను కొనసాగిద్దామని కర్నూలు, అనంతపురం డయాసిస్ బిషప్ పూలఆంతోని పిలుపునిచ్చారు. సోమవారం మాధవనగర్‌లోని లూర్ధుమాత దేవాలయంలో మధర్‌థెరిస్సా పట్టాభిషేకోత్సవ కార్యక్రమం జరిగింది. బిషప్ పూల ఆంతోని మాట్లాడుతూ.. మదర్థెర్సిస్సా సేవలు మరువలేనివన్నారు. శాంతి, ప్రేమ, జాలి, కరుణ, దయలను ఆయుధాలుగా చేసుకుని ప్రపంచాన్ని మార్చడానికి థెరిస్సా కృషి చేశారన్నారు. మదర్‌కు పునీత పట్టం ప్రకటించిన వాటికన్ సిటీకి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం సీక్యాంప్ సెంటర్ నుంచి చెక్పోస్ట్వరకు ర్యాలీ నిర్వహించారు. -
ఆదర్శ మూర్తి మదర్ థెరిస్సా
ప్రతి ఒక్కరూ ‘సేయింట్ ఉడ్’ మార్గంలో నడవాలి శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి కాజీపేట రూరల్ : తన సేవలతో ప్రపంచానికి మానవీయ పరిమళాలు అందించిన గొప్ప ఆదర్శ మాతృమూర్తి సేయింట్ ఉడ్ మదర్ థెరిస్సా అని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ప్రతి ఒక్కరూ మదర్‌ను ఆదర్శంగా తీసుకొని ఆమే మార్గంలో పయనించాలని కోరారు. మదర్ థెరిస్సాకు సేయింట్ ఉడ్ ప్రకటించిన సందర్భంగా కాజీపేట ఫాతిమానగర్‌లోని హౌస్ ఆఫ్ జాయ్‌లో సోమవారం వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వేరే దేశంలో జన్మించినప్పటికీ భారతదేశం గర్వించేలా సేవలను అందించిన జగత్ జనని అని కొనియాడారు. ‘మై లైఫ్ మై మెస్సేజ్’ అని గాంధీజీ అన్నట్టుగా జీవితాంతం తన సేవలను మానవాళికోసం అంకితం చేసిన మదర్ థెరిస్సాను సేయింట్ ఉడ్గా ప్రకటించడం గర్వించతగిన విషయమని పేర్కొన్నారు. వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ వారు సైతం ఆ మాతృమూర్తి సేవలకు గుర్తింపుగా పురస్కారం ప్రకటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ ఫౌండర్ సిరాజుద్దీ¯ŒS మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేయింట్ ఉడ్ ప్రదానం కార్యక్రమాన్ని ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తే సమాజానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. స్పీకర్ మాటను పరిగణలోకి తీసుకొని మదర్‌కు సరిపడే బిరుదు కోసం చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అంతకు ముందు స్పీకర్ మదర్ థెరిస్సాకు గుర్తుగా మామిడి మొక్క నాటి దానికి మదర్ మ్యాంగో ట్రీ అని నామకరణం చేశారు. అనంతరం ఆయన హౌస్ ఆఫ్ జాయ్లోని మానసిక వికలాంగుల వివరాలను తెలుసుకొని వారి గదులను సందర్శించారు. కార్యక్రమంలో ఇ¯ŒSచార్జి బిషప్ ఫాదర్ జోసఫ్, వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అంపశయ్య నవీ¯ŒS, జనరల్ సెక్రెటరీ అనీష్ సిద్ధికి, వైస్‌ప్రెసిడెంట్ ఆచార్య నర్సింహమూర్తి, ఈసీ మెంబర్లు ఆచార్య విజయబాబు, శ్రీదేవి, ఫాదర్ బాలశౌరి రెడ్డి, టీఎస్ మెస ఫిలిఫ్ లాజరెస్, సెక్రటరీ కౌసర్ ఫారుక్, రాజ్‌మోహ¯ŒS తదితరులు పాల్గొన్నారు. -
తలవంచి ధరను జయించిన తల్లి ఆమె!
మార్చి 1, 1980న వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ మూడవ స్నాతకోత్సవానికి నోబెల్ ప్రపంచ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసాను ఆహ్వానించారు. అయితే ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని విద్యార్థులలో ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించి నిరసనలు చేపట్టింది. అంతటి మహోన్నత వ్యక్తి వరంగల్‌లాంటి పట్టణానికి రావడమే మహాభాగ్యమని, ఆమెను అడ్డుకొని అవమానించవద్దని యూనివర్శిటీ జిల్లా, పోలీసు అధికారులు, ప్రముఖులు వారికి నచ్చజెప్పేందుకు అనేక దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో యూనివర్శిటీలో ఆమె కారు ప్రయాణించే రోడ్డుకు కొంత దూరంలో ఒక గీత గీసి అది దాటకుండా నిరసన వ్యక్తం చేసుకొమ్మని పోలీసులు విద్యార్థుల నాదేశించారు. వారి నిరసన ప్రజల దృష్టిని పెద్దగా ఆకర్షించకున్నా యూనివర్శిటీ కేంపస్‌లో మాత్రం ఉద్రిక్తత నెలకొంది. అప్పుడు ఎం.ఎ. ఎకనమిక్స్ రెండో సంవత్సరంలో ఉన్న నాలాంటి అభిమానులకు ఒక వైపు ఆనందం, మరోవైపు మదర్ భంగపడ్తారేమోనన్న భయం! మార్చి1 న రాష్ట్ర గవర్నర్ పి.సి.అబ్రాహాముతో సహా మదర్ వచ్చారు. యాభైమందికి పైగా విద్యార్థులు ‘మదర్ థెరిస్సా గో బ్యాక్’ లాంటివి రాసిన ప్లకార్డులు, రకరకాల నినాదాలతో వారికి నిర్దేశిత స్థలంలో నిలబడ్డారు. అంతలోనే ఆమె కారు వారున్న స్థలాన్ని సమీపించింది. ఆమె వారిని చూడదులే అనుకున్న పోలీసుల అంచనాలు తారుమారయ్యాయి. మదర్ వారిని చూడనే చూశారు. అంతే! మరుక్షణం డ్రైవర్‌తో కారు ఆపించారు. ఏం జరుగుతున్నదో అర్థం చేసుకునేలోగానే మదర్ మెరుపు వేగంతో కారు దిగడం, విద్యార్థుల ముందుకు వెళ్లిపోయి రెండు చేతులూ జోడించి నిలబడటం జరిగిపోయాయి. పోలీసులు ఆమెకు భద్రతా వలయంగా ఏర్పడబోగా ఆమె వారిని సున్నితంగా వారించి దూరంగా నిలబెట్టారు. ఇది నిరసనకారులు కూడా ఊహించని పరిణామం. అక్కడున్న వీఐపీలందరి మొహాల్లో ఆందోళన... మదర్‌పై దాడి జరుగుతుందేమోనన్న భయం, కాని ఆమెలోని నిశ్చలత్వాన్ని అడుక్డుకునే సాహసం చేయలేదెవరూ. ఐదడుగుల పొడవు కూడా లేని మదర్‌లోని ప్రశాంతత, నిర్మలత్వం, నిర్భయత్వం, విధేయత, సాత్వికత ఆందోళనకారులనే కాదు, అక్కడున్న వారెవరికీ మాట పెగలకుండా చేశాయి. ‘నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి’ అంటూ చేతులు జోడించి అంటున్న ఆమె మాటల్లోని యధార్థత అంతా తలదించుకునేలా చేసింది. నినాదాలు ఆగిపోయాయి, ప్లకార్డులు నేలకూలాయి. నిశ్శబ్దం అలుముకుంది. ‘ఇది మీ ఉత్సవం. నేను మీ అతిథిని. మీరు లేకుండా అదెలా జరుగుతుంది? మనమంతా కలిసి వెళ్దాం పదండి’ అంటూ విద్యార్థుల్లో ఇద్దరిని తన రెండుచేతులతో పట్టుకొని పోలీసులు దారి చూపగా వారితోబాటు ఉత్సవ ప్రాంగణానికి గబగబా నడవడం ఆరంభించారు మదర్. అంతే! నిరసనకారులతో సహా అంతా మదర్‌ను వెంబడించారు. అధికారులు అన్ని రోజులుగా సాధించలేకపోయిన శాంతిని మదర్ ఒక్క నిమిషంలో తన సాత్వికత్వంతో సాధించారు. ఎంతో గందరగోళం మధ్య జరుగుతుందనుకున్న స్నాతకోత్సవం ఆనాడు ఎంతో ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగింది. కేవలం పదినిమాషాలే సాగిన తన ప్రసంగంలో మదర్ దేవుని ప్రేమను అత్యద్భుతంగా ప్రకటించారు. చేతలతో దేవుని ప్రేమను అంత అద్భుతంగా చాటే వ్యక్తికి ప్రవచనాలు, ప్రసంగాల అవసరం ఏముంటుంది? సాత్వికులు ధన్యులు. వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్న యేసుక్రీస్తు ప్రవచనంలోని శక్తి, వాస్తవికత ఆరోజు నాలాంటి వారెందరికో అర్థమైంది. ఆమెకు మొన్ననే సెంయిట్ హుడ్ ఇచ్చారు. సెయింట్ అంటే అక్కడెక్కడో, మరోలోకంలో ఉండి పూజలందుకుంటున్న భావన. కాని మదర్ అంటే మన పక్కనే ఉండి ప్రేమతో కన్నీళ్లు తుడుస్తున్న ఆదరణ!! అందుకే ఇప్పుడూ ఎప్పుడూ ఆమె అమ్మే!! - రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
‘నేను’ అనే వైరస్
‘‘చరిత్రలో నేను కాదు ఉండాల్సింది - ఈ దేశం. ఈ దేశపు వైభవం. 1.20 బిలియన్ల భారతీయ ప్రజల మధ్య మోదీ కూడా ఒక మామూలు మనిషే’’ అన్న ఒక ప్రధాని గురించి ఈ కాలమ్. ఇది రాజకీయాలకు సంబం ధించిన కాలమ్ కాదు. రాజ కీయ నాయకులకు సంబం ధించిన కాలమ్ అంతకంటే కాదు. అయితే ఇది నరేంద్ర మోదీ గురించి చెప్పబోయే కాలమ్. కనుకనే ఈ రెండు వాక్యాలూ ముందు చెప్పవ లసి వచ్చింది. మొన్న ఒక ఇంగ్లిష్ చానల్ ఇంటర్వ్యూలో మోదీని ఒక ప్రశ్న వేశారు: రాబోయే కాలంలో చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు? అని. ఇది మనం తరచూ వినే ప్రశ్న. రాజకీయ నాయకుల సమాధా నాలూ మనకి వినడం అలవాటయిపోయింది. కాని నరేంద్ర మోదీ సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. మించి - దిగ్భ్రాంతుణ్ణి చేసింది. సారాంశం ఇది. ‘‘చరిత్ర నన్ను ఎందుకు గుర్తుంచుకోవాలి? మోదీ ఈ దేశంలోని 1.20 బిలి యన్ల భారతీయులలో ఒకడు. నన్ను కాదు-చరిత్ర ఈ దేశాన్ని గుర్తుంచుకోవాలి. ఈ దేశానికి జరిగిన మేలుని గుర్తుంచుకో వాలి’’- స్థూలంగా ఇదీ సమా ధానం. మన ముఖ్యమంత్రి గారు- ‘‘మీరంతా గర్వపడే స్థాయిలో మీ నగరాన్ని వద్ధి చేస్తాను. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి రైతులకు లక్షా ఏభైవేల ఎకరాలకు నీళ్లు ఇప్పిస్తాను. చరిత్రలో నిలిచిపోయే విధంగా రాజధాని అమరావతిని నిర్మిస్తాను’’ అనడం మనం తరచూ వింటున్నాం. అది తప్పుకాదు. ఒక mindsetకి నిదర్శనం. అంతే. కానీ దక్షిణాఫ్రికాలో తనలాంటి బడుగు వర్గాలకు జరిగే వివక్షను ఎదిరించిన ఓ న్యాయవాది అలనాడు - చరిత్ర గురించి ఆలోచిస్తే - చరిత్ర ఆయన్ని ‘మహా త్ముడు’గా గుర్తుంచుకునేది కాదు. గొంతు విప్పే స్థాయిలో కేవలం ఒక తపస్సుగా ఒక జీవితకాలం తన సంగీత సాధనని కొనసాగించకపోతే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అనే భారతరత్నని దేశం గౌరవించి ఉండేదికాదు. ప్రపంచమంతా ఊపిరి బిగపట్టి చూస్తున్న క్షణంలో సింధు అనే 21 సంవత్సరాల పిల్ల ఒలింపిక్స్‌లో ‘నేను’ ఈ దేశానికి కీర్తిని తీసుకు రాబోతున్నాను- అని ఒక్క క్షణం అనుకున్నా పాతాళానికి కుంగిపోయేది. ఈ వారమే ఒక మహోన్నతమైన ‘శక్తి’ని - మదర్ థెరిసాని- దేవదూతగా రోమ్ వాటికన్లో సెయింట్ పీటర్స్ బిసిల్కాలో పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. బడు గువర్గాల పట్ల, పేదల పట్ల ఆమె చూపిన నిరవధికమైన ప్రేమాభిమానాలు ప్రపంచాన్ని- సామాజిక, ఆధ్యాత్మిక రంగాలను పులకితం చేశాయి. ‘నేను’ అనే మాట ఆమె టిప్పణిలో లేదు. ఆమె రాష్ట్రపతి భవన్లో పద్మశ్రీ పుర స్కారాన్ని పుచ్చుకోవడాన్ని నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్ వివరించారు. మదర్ పద్మశ్రీ పురస్కారాన్ని ఒక రోగిష్టి బిడ్డని పొదివి పట్టుకున్నట్టు, ఆఖరిక్షణాలలో ఉన్న దీనుడిని భుజానికి ఎత్తుకున్నట్టు అందుకున్నా రట. ఇస్తున్న రాష్ట్రపతి కన్నుల్లో, చూస్తున్న ప్రేక్షకుల కన్నుల్లో నీళ్లు నిండాయి. తర్వాత కారులో నెహ్రూని ఆమె అడిగారట - నీకెలా అనిపించింది? అని. ‘నువ్వెలా భావించావో కానీ - కంటినీళ్లు ఆపుకోవడం నాకు చాలా కష్టమయింది’ అన్నారట నెహ్రూ. ‘నేను’ అనే భావనని పూర్తిగా తన మనసులో నుంచి ఖాళీ చేసుకుని ఒక పరిపూర్ణమయిన ‘శూన్యం’గా మారిన అరుదయిన, అసామాన్యమయిన వ్యక్తిత్వం మదర్ థెరిసా అన్నాడొక పాత్రికేయుడు. ఇప్పుడు మళ్లీ నరేంద్ర మోదీ దగ్గరికి. There is no greater joy than to be lost in the history- అన్నారాయన. నేను ప్రధాన మంత్రి గురించి రాయడం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకుని గురించి రాయడం లేదు. మళ్లీ- ఇది రాజకీయ కాలమ్ కాదు. కాని తను చేసే కషిలో, సేవలో, సాధనలో, లక్ష్యంలో, దక్ప థంలో, ఆదర్శంలో, దష్టిలో ‘నేను’ - ‘చరిత్ర’ అనే రెండు దురాశలు- ఏమాత్రం దొంగ తోవన ప్రవేశించినా- వారు ఆ చరిత్రకు దగ్గరికి కూడా రాలేనంత దూరంగా నిలిచి పోతారు. ఈ దేశంలో కుష్టురోగిని తన ఒళ్లో పెట్టుకుని ‘చావులో ఇంత ఆనందం ఉందా!’ అనిపించేలాగ ప్రేమని పంచిన ఒక దేవదూత గురించి, ఒక జీవితకాలం తన సాధనతో లక్షలాది హదయాలని తాకిన ఒక భారతరత్న గురించి, ‘‘చరిత్రలో నేను కాదు ఉండాల్సింది - ఈ దేశం. ఈ దేశపు వైభవం. 1.20 బిలియన్ల భారతీయ ప్రజల మధ్య మోదీ కూడా ఒక మామూలు మనిషే’’ అన్న ఒక ప్రధాని గురించి ఈ కాలమ్. రాజకీయ నాయకులు, పార్టీల వారికి ఈ కాలమ్ వెక్కిరింతగానూ, భజన చేసే ప్రయత్నంగానూ కని పించవచ్చు. కానీ దక్షిణాఫ్రికాలో ఓ అర్ధరాత్రి పీటర్ మారిట్స్బర్గ్లో ఫ్లాట్‌ఫారం మీదకు తెల్ల అధికారి మెడ పట్టుకు గెంటిన క్షణంలో ఓ నల్ల లాయరు చరిత్ర గురించి ఆలోచించలేదు. తన జాతికి జరుగుతున్న ‘అవమానం’ గురించే ఆలోచించాడు. కనుకనే చరిత్ర అయ్యాడు. చరిత్ర మానవ ప్రయత్నానికి అతి కర్కశమయిన వడపోత. ‘నేను’ అన్న ఆలోచన వచ్చిన మరుక్షణంలో అది నిర్దాక్షిణ్యంగా సెలవు తీసుకుంటుంది. -
ఆమె ఒక ఆధ్యాత్మిక గీతం
సందర్భం ఉషా ఉతుప్ ఆనందానికి ఇప్పుడు అవధులు లేవు. పాడడం ఈ సుప్రసిద్ధ గాయనికి కొత్త కాదు కానీ, తాజాగా పాడిన పాట, ఆ అనుభవం మాత్రం మునుపెన్నడూ ఇవ్వనంత ఆనందం ఆమెకు ఇచ్చాయి. మొన్న ఆదివారం వాటికన్ సిటీలో జరిగిన ఉత్సవంలో మదర్ థెరిసాను ‘పునీతురాలు’గా ప్రకటించే కార్యక్రమంలో పాల్గొని, పాట పాడిన ఉషా ఉతుప్ ఆ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కోల్‌కతాకు చెందిన ఆమెకు పవిత్ర సేవామూర్తి మదర్ థెరెసాతో దాదాపు అయిదు దశాబ్దాల అనుబంధం. మాటల కోసం వెతుక్కుంటున్న వేళ ఉషా ఉతుప్ గొంతు పెగుల్చుకొని, ఆ మాతృమూర్తితో తన అనుబంధం గురించి చెప్పిన జ్ఞాపకాలు... ‘‘ఇప్పటికీ ఇదంతా నేను నమ్మలేకపోతున్నా. నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. నిజంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. మదర్ థెరెసాతో నాది 47 ఏళ్ళ అనుబంధం. నేను తరచూ మాట్లాడిన వ్యక్తి, కలసి నడిచిన వ్యక్తి, కలసి పనిచేసిన మనిషి, అనుబంధమున్న వ్యక్తికి ఇవాళ ప్రపంచం మొత్తం ముందు ‘మహిమాన్వితురాలు’ హోదా (సెయింట్‌హుడ్) ప్రకటించడం ఆనందంగా ఉంది. అదీ కాకుండా, ఈ ఉత్సవంలో ‘పూరెస్ట్ ఆఫ్ ది పూర్’ అనే పాట పాడడం గాయనిగా నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం. ఆ పాట కూడా నా రచనే! ఇలాంటి రోజు నాకు మళ్ళీ రాదేమో! తొలిసారి... హోమియో క్లినిక్‌లో..! మురికివాడల్లోని అభాగ్యులకు నిస్వార్థంగా సేవలందించిన ‘అమ్మ’ థెరెసాతో నేను గడిపిన క్షణాలు నాకు ఇప్పటికీ జ్ఞాపకమే! మొట్టమొదటిసారి నేను ఆమెను కలసినప్పటికి ఆమె ఒక సాధారణమైన నన్. అప్పట్లో నేను ఒక హోమియోపతి క్లినిక్‌కి వెళ్ళేదాన్ని. క్రైస్తవ సన్యాసిని అయిన థెరెసా కూడా అక్కడికి తరచూ వస్తుండేవారు. అక్కడే మా తొలి పరిచయం జరిగింది. అలా జరిగిన మా పరిచయం ఏళ్ళు గడిచేకొద్దీ గాఢమైన స్నేహంగా మారింది. నేను ఆమె ప్రేమను పొందాను. ఆమెతో కలసి నడుస్తూ, నవ్వుతూ, తిరుగుతూ క్షణాలెన్నో! ఆ షరతు పెట్టారు! దాంతో కష్టమైంది! అప్పట్లో ఆమె నాకు కొన్ని నిర్ణీతమైన పనులు చెప్పేవారు. బీదవారి కోసం ఆహారం, దుస్తులు సేకరించడం నా ప్రధాన బాధ్యత. అయితే, మదర్ ఒక షరతు పెట్టారు. అది ఏమిటంటే, ‘మనం చేస్తున్నది ఏమిటో, ఎవరి కోసం చేస్తున్నామో ఎవరికీ చెప్పకూడదు. ఆర్భాటపు ప్రచారం చేయకూడదు.’ అమ్మ చెప్పినట్లే చేశాను. ఇలా చేయడం వల్ల వాలంటీర్లు చేస్తున్న పనిలోని అసలు సిసలు లక్ష్యం ఏమిటో అర్థం చేసుకుంటారు. మాకు తెలిసినవాళ్ళ దగ్గరి నుంచి, కలిసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సామాన్లు సేకరించాం. ఇలా పాత దుస్తులు, మిగిలిపోయిన ఆహారం సేకరించడం నా గౌరవానికి భంగమని నేనెప్పుడూ అనుకోలేదు. ఆర్తుల కోసం ఇలాంటి పనులెన్నో చేసిన మదర్ ఎప్పుడూ వాటి గురించి గొప్పగా చెప్పుకొనేవారు కాదు. అది నాకు అబ్బురం అనిపించేది. ఒకసారి మాత్రం ‘అమ్మ’ చెప్పిన పని నాకు కష్టమైంది. పెళ్ళి విందుల్లో మిగిలిపోయిన ఆహారం సేకరించి, తెమ్మని చెప్పారు. అయితే, ఎప్పటిలానే - ఎందుకు, ఏమిటన్నది ఎవరికీ చెప్పకూడదు. కొద్దిగా కష్టమనిపించింది. కానీ, ‘బాహాటంగా ప్రకటించి చేసే సేవ ఎప్పటికీ సేవ కానే కాదు’ అని మదర్ అన్న మాటలు నా చెవుల్లో రింగుమన్నాయి. అంతే! ఆ పని చేసేశా! ఆ రెంటి ఖరీదూ ఎక్కువ! ఒక రోజున ఆమె కలకత్తాలోని నా స్టూడియోకు వస్తున్నారు. దోవలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. అంతే! ఆమె ఉన్నట్టుండి కారు ఆపేసి, కిందకు దిగారు. ఆ మనిషి తాగి ఉన్నాడా, మరొకటా అని కూడా చూసుకోలేదు. ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆ ఘటన కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ విశ్వజనని ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు... ‘నాకు డబ్బులు అక్కర్లేదు. ఆర్తుల సేవ కోసం కృతనిశ్చయంతో నిలిచి, సమయం వెచ్చించేవారు కావాలి’. డబ్బులు ఎవరి దగ్గర నుంచైనా సంపాదించవచ్చు. కానీ, సేవా నిబద్ధత, సమయం వెచ్చించే సహృదయం - అంత సులభంగా దొరకవనీ, వాటి ఖరీదు చాలా ఎక్కువనీ ఆమెకు తెలుసు. నా దగ్గర నుంచి ఆమె కోరుకున్నవి కూడా - ఆ నిబద్ధత, సమయమే! అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం అంటే, గతంలో పండిట్ రవిశంకర్, జాకీర్ హుస్సేన్, అమ్జద్ అలీ ఖాన్ లాంటి ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత కళాకారులు పాల్గొన్నారు. సాధారణంగా మన సంస్కృతీ వారసత్వం అంటే భరతనాట్యం, కథకళి లాంటివే గుర్తుకొస్తాయి. కానీ, మన సంస్కృతి అక్కడికే పరిమితం కాదనీ, విశ్వజనీనమైన ప్రేమకు ప్రతిరూపమనీ, ప్రియతమ మదర్‌కు నివాళి ఇచ్చే నా పాట, ఆర్కెస్ట్రా ద్వారా చెప్పేందుకు ప్రయత్నించాను. నిజానికి, భౌతికంగా మన ముందున్న రోజుల్లోనే మదర్ థెరెసా పరమ పావని, మహాత్మురాలు. మూర్తీభవించిన ఆ మానవతా మూర్తికి ఇప్పుడు ఇలా ‘మహిమాన్వితురాలు’ అనే అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వడం కేవలం ఒక లాంఛనం. పవిత్ర చరిత్ర కలిగిన ఆ అమ్మతో నా అనుబంధం నా జీవితాంతం మరపురానిది. ఒక్క మాటలో చెప్పాలంటే, గడచిన శతాబ్దంలో ఆమె లాంటి అత్యంత గొప్ప మనిషినీ, కొన్ని కోట్ల మందిని స్పృశించి, వారి జీవితాలపై ముద్ర వేసిన వ్యక్తినీ మరొకరిని నేను చూడలేదు. ఆమెను చూసినవారెవరైనా సరే నా మాటలతో ఏకీభవిస్తారు. కోల్‌కతాలో మా ఇంటి నుంచి బయట కాలు పెట్టినప్పుడు కొన్నిసార్లు ఆ మాతృమూర్తి నడిచిన దారిలోనే నేనూ నడుస్తున్నాను, ఆమె పీల్చిన గాలే పీలుస్తున్నాను అని గుర్తుకొస్తుంది. అంతే! ఈ జీవితానికి అంతకు మించిన సంతృప్తి ఇంకేం కావాలి!’’ చిరిగిన స్వెట్టర్ చెప్పిన సంగతి! నన్ను కదిలించిన మరో సంఘటన చెప్పి తీరాలి. చాలా ఏళ్ళ క్రితం ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో ‘మదర్’ను కలిశా. ఆమె వేసుకున్న స్వెట్టర్ చిరిగిపోయి, రకరకాల మాసికలు వేసి ఉండడం గమనించాను. నాకెంతో బాధ అనిపించింది. ఆగలేకపోయా. ‘మదర్! కొత్త స్వెట్టర్ వేసుకోవచ్చుగా?’ అని అడిగేశా. దానికి, ఆమె ఇచ్చిన జవాబు ఒకటే - ‘ఉషా! ప్రపంచంలోని బీదలలో కెల్లా కడు బీదవారితో కలసి నేను జీవిస్తున్నా. కొత్తవి వేసుకొని తిరుగుతూ, బీదవారి కోసం జీవితం గడుపుతున్నా అని చెప్పుకుంటే ఎలా?’ అన్నారు. అంతే! నా నోట మాట లేదు. అందరికీ చెప్పడమే కాదు... చెప్పిందే ఆచరణలోనూ చేసే మనిషి మదర్ థెరెసా అని నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. -
విశ్వజనని
మదర్ థెరిసాకు సెయింట్ హుడ్ హోదా ప్రకటించిన పోప్ ఫ్రాన్సిస్ ఆమె సేవాతత్పరతకు అందిన గౌరవం అన్న పోప్ వాటికన్ సిటీలో అంగరంగ వైభవంగా కార్యక్రమం - వేలాదిగా తరలివచ్చిన క్రైస్తవ మత పెద్దలు, అభిమానులు.. - హాజరైన 13 దేశాల అధినేతలు.. కోల్‌కతాలో పండుగ వాతావరణం - సంప్రదాయాలను తోసిరాజని స్క్రీన్లకు అతుక్కుపోయిన నన్స్ - గంటలు మోగిస్తూ, చప్పట్లు చరుస్తూ హర్షాతిరేకాలు ఎక్కడో మేసిడోనియాలో కళ్లు తెరిచింది.. ప్రేమే ధర్మం.. సేవే మార్గమంటూ కదిలింది.. పేదలు, దీనులను అక్కున చేర్చుకుంది.. విశ్వజననిగా మానవత్వాన్ని పరిమళింపజేసింది.. 87 ఏళ్ల వయసులో ఆ కళ్లు మూతపడ్డాయి.. 19 ఏళ్ల తర్వాత.. నేడు.. ఆ కళ్లు మళ్లీ ‘తెరుచుకున్నాయి’.. కళ్ల నిండా విశ్వప్రేమను వర్షిస్తూ.. మానవత్వంలోనే ‘దైవత్వం’ ఉందని చాటిచెబుతూ.. థెరిసా ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. నాకు వాళ్ల (పేదలు) భాష రాకపోవచ్చు. కానీ వారి ముఖాలపై చిరునవ్వు విరిసేలా చేయగలను అనేవారు. ఆ చిరునవ్వులను మన హృదయాల్లో నింపుకుందాం. మన జీవన ప్రయాణంలో లక్షలాది దీనులకు వాటిని పంచుదాం. - పోప్ వాటికన్ సిటీ/కోల్‌కతా: మానవ సేవకు తన జీవితాన్ని అంకితం చేసి, క్రీస్తు ప్రేమ సందేశాన్ని లోకానికి చాటిచెప్పిన మానవతామూర్తి మదర్ థెరిసాకు పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ హోదా ప్రకటించారు. ఆదివారం రోమ్‌లోని వాటికన్ సిటీలో ప్రపంచం నలుమూలల నుంచి తరలి వచ్చిన క్రైస్తవ మతపెద్దలు, వేలాది మంది యాత్రికులు, 13 దేశాలకు చెందిన అధినేతలు, థెరిసా ఆర్డర్‌కు చెందిన నన్స్ మధ్య ఈ మేరకు ప్రకటన చేశారు. ఇది మూర్తీభవించిన మాతృప్రేమకు, అనాథలను, పేదలను అక్కున చేర్చుకున్న సేవాతత్పరతకు అందిస్తున్న గౌరవమని పేర్కొన్నారు. ‘‘ఆమె పవిత్ర హృదయం మాకు అత్యంత సమీపంలో ఉంది. నిర్మలమైన ఆమె మనసును తలచుకున్నప్పుడల్లా మా గుండెలోతుల్లోంచి ‘మదర్’ అని వినిపిస్తోంది. కోల్‌కతాకు చెందిన థెరిసాను నేటి నుంచి సెయింట్స్ జాబితాలో చేరుస్తున్నాం..’’ అని భావోద్వేగంతో అన్నారు. పేదరికాన్ని సృష్టిస్తున్న ఈ ప్రపంచ దేశాల నాయకుల నేరాన్ని పేద గొంతుల తరఫున థెరిసా వినిపించిందన్నారు. ఈ కార్యక్రమంలో వినిపించాల్సిన సందేశాన్ని ముందుగానే రాతపూర్వకంగా రూపొంది స్తారు. అయితే అందులో ఈ విషయాలు పేర్కొనకపోయినా పోప్ ఫ్రాన్సిన్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మదర్ గొప్పతనాన్ని కొనియాడారు. మదర్ థెరిసా దైవానికి అత్యంత సమీపంలో ఉందనడానికి.. భారత్‌లోని కోల్‌కతా మురికివాడల్లో నిరుపేదలకు చేసిన సేవలే నిదర్శనమన్నారు. ‘‘ఆమె ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ‘నాకు వాళ్ల(పేదలు) భాష రాకపోవచ్చు. కానీ వారి ముఖాలపై చిరునవ్వు విరిసేలా చేయగలను’ అని థెరిసా అనేవారు. ఆ చిరునవ్వులను మన హృదయాల్లో నింపుకుందాం. మన జీవన ప్రయాణంలో లక్షలాది దీనులకు వాటిని పంచుదాం’’ అని అన్నారు. గర్భస్థ శిశువులు ఈ లోకంలో అత్యంత బలహీనమైన వారని, అబార్షన్లతో వారిని చంపేయడాన్ని థెరిసా తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. సెయింట్‌హుడ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత పోప్ ఫ్రాన్సిస్ టాప్‌లెస్ జీప్‌లో సెయింట్‌పీటర్స్ స్క్వేర్‌లో తిరుగుతూ వేలాది మంది అభిమానులకు అభివాదం చేశారు. కోల్‌కతాలో పండగ వాతావరణం వాటికన్ సిటీలో మదర్ థెరిసాకు సెయింట్ హుడ్ ప్రకటిస్తున్న సమయంలో ఆమె కార్యక్షేత్రమైన కోల్‌కతాలో పండగ వాతావరణం కనిపించింది. నగరంలో అనేకచోట్ల పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి వాటికన్ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేశారు. ఇక థెరిసా సేవా కార్యక్రమాలకు హెడ్‌క్వార్టర్‌గా ఉన్న మదర్హౌస్లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. సాధారణంగా భావోద్వేగాలకు అతీతంగా, ప్రశాంత వదనాలతో కనిపించే నన్స్ ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. టీవీలు, సెల్ఫోన్లకు దూరంగా ఉండే సిస్టర్స్ అంతా స్క్రీన్ల ముందు వాలిపోయి వాటికన్లో జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఆనందంతో పెద్దగా అరుస్తూ, చప్పట్లు చరుస్తూ, గంటలు మోగిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. మదర్‌హౌస్ ముందు థెరిసా నిలువెత్తు చిత్రపటాన్ని ఉంచారు. పూలు, విద్యుద్దీపాలు, థెరిసా చిత్రపటాలతో భవనాన్ని అలంకరించారు. సందర్శకులకు వీలుగా రోజంతా మదర్హౌస్ను తెరిచి ఉంచారు. ఉదయం 6 గంటలకే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనేక మంది విదేశీయులు కూడా మదర్హౌస్కు తరలివచ్చారు. థెరిసా సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. మానవ సేవే మాధవ సేవగా.. 1910 ఆగస్ట్ 26న మేసిడోనియాలోని స్కోప్జేలో జన్మించిన థెరిసా నన్‌గా మారి తన సేవా కార్యక్రమాలకు కోల్‌కతాను కేంద్రంగా చేసుకున్నారు. దీనులు, అన్నార్థులు, రోగపీడితులు, అనాథలను అక్కున చేర్చుకొని ఆదరించింది. 1931 నుంచి 1997 సెప్టెంబర్ 5న కన్ను మూసేవరకు కోల్‌కతాలోనే సేవాకార్యక్రమాలు నిర్వహించారు. 1979లో నోబెల్ శాంతి బహుమతి అందుకుంది. 1997లో ఆమెను పవిత్రమూర్తి (బీటిఫికేషన్)గా గుర్తించే ప్రక్రియ మొదలైంది. మదర్ థెరిసా మరణానంతరం జరిగిన రెండు అద్భుతాల(1998లో ఒకటి, 2008లో మరొకటి)ను ధ్రువీకరించుకున్న తర్వాత థెరిసాకు.. ఆమె 19వ వర్ధంతి సందర్భంగా రోమన్ కేథలిక్ చర్చి సెయింట్‌హుడ్ హోదాతో గౌరవించింది. ఆమె ఆదర్శాలను అలవర్చుకుందాం.. సెయింట్‌హుడ్ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ఎందరో క్రైస్తవ మత పెద్దలు, థెరిసా అభిమానులు తరలివచ్చారు. ఇటలీలో థెరిసా ఆర్డర్‌కు చెందిన 1,500 మంది ఇళ్లు లేని నిరుపేదలను పోప్ ఫ్రాన్సిస్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారికి వీఐపీ సీట్లు కేటాయించి ముందు వరుసలో కూర్చోబెట్టారు. బ్రెజిల్లో థెరిసా మహిమతో బ్రెయిన్‌ట్యూమర్ నుంచి బయటపడిన ఆండ్రినో, ఆయన భార్య ఫెర్నాండా కూడా హాజరయ్యారు. 2003లో నిర్వహించిన బీటిఫికేషన్ కార్యక్రమానికి ఏకంగా 3 లక్షల మంది తరలివచ్చారు. కానీ ఈసారి లక్ష మంది మాత్రమే హాజరయ్యార ని చెబుతున్నారు. కార్యక్రమానికి 3 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆగస్టు 26, 1910: మేసిడోనియాలో అల్బేనియన్ దంపతులకు జననం. ఆగ్నస్ గోన్షా బోజాక్షియుగా నామకరణం. 1928: ఐర్లండ్‌లో కేథలిక్ నన్ (సిస్టర్ మేరీ థెరిసాగా) మార్పు. 1929: కోల్‌కతాలో మిషనరీ, చారిటీ కార్యక్రమం ప్రారంభం. 1948: వరకు సెయింట్ మేరీ స్కూల్లో బోధన. 1950 అక్టోబర్: మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రారంభం. 1960ల్లో: కుష్టువ్యాధి, అతిసారం, క్షయవ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు. 1979: నోబెల్ శాంతి బహుమతి ప్రదానం. 1997 సెప్టెంబర్ 5: కోల్‌కతాలో చివరి శ్వాస. 2003: బెంగాలీ యువతికి వ్యాధి నయం చేసినందుకు పోప్ జాన్‌పాల్ -2 ద్వారా బీటిఫైడ్ (పవిత్రమూర్తిగా) గుర్తింపు. 2015: బ్రెజిల్ యువకుడికి బ్రెయిన్ ట్యూమర్‌ను తగ్గించటం ద్వారా సెయింట్‌హుడ్ ఇవ్వాలని నిర్ణయం. 2016 సెప్టెంబర్ 4: మదర్ థెరిసాకు సెయింట్ (మహిమాన్విత) హోదా ఇచ్చినట్లు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన. సెయింట్ థెరిసా మహిమలు భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి విజేత సెయింట్ థెరిసా పేదల పాలిట కల్పతరువు. ఆదివారం ‘మహిమాన్విత’ (సెయింట్‌హుడ్) గౌరవాన్ని అందుకున్న థెరిసా.. బతికున్నన్ని రోజులూ జీవితాన్ని అనాథలు, అభాగ్యులకే అంకితం చేసింది. ఎవరు బాధపడుతూ..తనను తలచుకున్నా.. మరుక్షణమే నేనున్నానంటూ ఆదుకునే ఆ చేతులు.. కోల్‌కతాలో ఒకరికి, బ్రెజిల్లో మరొకరికి ప్రాణదానం చేశాయి. చికిత్సలేని భయంకరమైన రోగాలనుంచి విముక్తి కలిగించాయి. బ్రెజిల్లో.. బ్రెజిల్‌కు చెందిన మార్సిలియో ఆండ్రినో అనే వ్యక్తి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. మెదడులో సమస్య కారణంగా జీవితాంతం సమస్యలు తప్పవని డాక్టర్లు తేల్చేశారు. ఈ సమయంలోనే థెరిసా చిత్రపటాన్ని ఆండ్రినో మంచం వద్ద ఉంచిన అతని భార్య.. తీవ్రమైన వ్యాధినుంచి కాపాడమని ప్రార్థన చేసింది. కొంతకాలం తర్వాత (2008లో) ఓ రోజు రాత్రి ఆండ్రినోకు తీవ్రమైన తలనొప్పి వచ్చి ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆరోజు రాత్రి ఏదో ప్రశాంతమైన వాతావరణంలో తన నొప్పిని ఎవరో తీసేసినట్లు అనిపించిందని.. తెల్లవారాక ఆండ్రినో చెప్పాడు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కూడా వ్యాధి నయమైపోయినట్లు గుర్తించారు. ఈ విషయం పోప్ ఫ్రాన్సిస్ దృష్టికి వచ్చింది. ఆ తర్వాత జరిపిన పరిశోధనల ఆధారంగానే మదర్‌కు థెరిసా సెయింట్‌హుడ్ బహూకరించారు. కోల్‌కతాలో.. మోనిక బెస్రా పశ్చిమబెంగాల్లోని మారుమూల ప్రాంతానికి చెందిన ఓ గిరిజన మహిళ. 1997లో తీవ్రమైన కడుపునొప్పితో ఆమె ఆసుపత్రిలో చేరింది. కడుపులో కణితి కారణంగానే నొప్పి అని తేల్చిన వైద్యులు.. చికిత్సనందించలేమని చేతులెత్తేశారు. కొన్ని నెలల తర్వాత మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆధ్వర్యంలో జరిగే ఆసుపత్రిలో చేరారు. ఈమెను పరిశీలించిన వైద్యులు.. ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమన్నారు. అయితే, 1998 సెప్టెంబర్ 5న కోల్‌కతాలో మదర్ థెరిసా తొలి వర్ధంతి సభ జరుగుతోంది. అందరూ ప్రార్థన చేస్తున్న సమయంలో.. థెరిసా చేతినుంచి ఓ జ్యోతి ఆకారం వచ్చి మోనిక కడుపులోకి వెళ్లినట్లు గుర్తించారు. ఆ రోజు సాయంత్రం కూడా ఇద్దరు నన్స్.. థెరిసా చిత్రపటాన్ని మోనిక కడుపుకు కట్టారు. దీంతో ఏడాది కాలంగా నొప్పితో రాత్రుళ్లు సరిగా నిద్రపోని మోనిక.. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది. తెల్లవారాక పరీక్షలు చేస్తే.. అసలు ఆమెకు కడుపులో కణితి కాదుకదా.. కణితి ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దీంతో వైద్యులంతా ఆశ్చర్యపోయారు. దేశానికే గర్వకారణం: మోదీ మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్ బహుకరించటం దేశానికే గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జీ-20 సదస్సులో భాగంగా చైనాలో ఉన్న మోదీ.. బహుకరణ కార్యక్రమం కాగానే.. ‘సెయింట్‌హుడ్ ఇవ్వటం మదర్ థెరిసాకు దక్కిన గొప్ప గౌరవం. భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు ఈ గౌరవం దక్కటం భారత్‌కే గర్వకారణం’ అని ట్వీట్ చేశారు. సేవలకు గుర్తింపు: సోనియా సమాజంలో అణగారిన వర్గాలకు, అభాగ్యులకు చేసిన సేవలకు ప్రతిఫలంగానే మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్ బహుకరించారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలిపారు. ప్రేమ, కరుణ, మానవత్వానికి థెరిసా జీవితమే పర్యాయపదమన్నారు. ప్రపంచంలోని పేదలకు, అభాగ్యులకు సేవచేయాలనుకునే వారికి మదర్ స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ప్రేమతో ప్రపంచాన్ని గెలిచిన థెరిసా అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రజాసేవలో తరించారు: సుష్మ వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన సెయింట్‌హుడ్ కార్యక్రమానికి భారత్ తరపున కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ పాల్గొన్నారు. ప్రజల సేవలో తరించిన మహోన్నత వ్యక్తిత్వానికి సుష్మా నివాళులర్పిం చారు. ‘భారతదేశంలోని నలు మూలలు, వివిధ విశ్వాసాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులతో ఇక్కడికి వచ్చాను. మదర్ థెరిసా జీవితాన్ని గౌరవించేందుకే మేమంతా ఇక్కడికి వచ్చాం’ అని సుష్మ వెల్లడించారు. వీరితోపాటు ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రుల నేతృత్వంలోనూ రెండు బృందాలు ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్లాయి. 1997లో మరణం తర్వాత రెండు సందర్భాల్లో థెరిసా తన దివ్యత్వాన్ని చూపించినందుకు ఈ గౌరవాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. సేవాభావానికి ప్రతీక సెయింట్ థెరిసా వైఎస్ జగన్ ఘన నివాళి సాక్షి, హైదరాబాద్: సెయింట్ హోదాను పొందిన దివంగత మదర్ థెరిసాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. సేవాభావం, దయాగుణానికి ప్రతీక అయిన థెరిసా ప్రేమ, దయ, కరుణకున్న తిరుగులేని శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో శ్లాఘించారు. మదర్ థెరిసాను సెయింట్ల జాబితాలో చేర్చడం (క్యాననైజేషన్) భారతదేశానికి ఎనలేని ప్రాధాన్యతను తెచ్చి పెట్టిందని కొనియాడారు. భారతదేశంలో ఆమె స్థాపించిన మిషనరీలు విశ్వవ్యాప్తంగా విస్తరించి పేదల పట్ల సేవా భావాన్ని పెంపొందించాయన్నారు. ఆమె పేదలకు, ఆపదలో ఉన్న వారికి నిరంతరం అలుపెరుగకుండా చేసిన సేవలకు ఎన్నో అవార్డులు లభించాయని, నోబెల్ బహుమతిని కూడా గెల్చుకున్న దయాశీలి థెరిసా అన్నారు. ‘సెయింట్‌హుడ్’ ప్రదానం చేసిన క్షణం ప్రతి భారతీయుడు గర్వించ దగిందన్నారాయన. సోమవారం సెయింట్ థెరిసా 19వ వర్ధంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ‘నేనివాళే ఉండవచ్చు. కానీ ఈ సేవలు కలకాలం నిలిచి పోతాయి’ అన్న కరుణామయి మాటల్లోని సందేశం విశ్వవ్యాప్తంగా విస్తరించేలా చేస్తూ ముందుకు సాగాలని జగన్ తెలిపారు. సేవాతత్పరతకు దక్కిన గౌరవం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సెయింట్ థెరిసాకు మహిమాన్విత హోదా ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆమె చూపిన మానవత్వానికి, సేవాతత్పరతకు దక్కిన అరుదైన గౌరవమే ఈ సెయింట్ హోదా అని ప్రశంసించారు. మనుషుల్లో దైవత్వం ఉంటుందని సెయింట్ మదర్ థెరిసా నిరూపించారని చంద్రబాబు తెలిపారు. పోప్‌కు మమత అరుదైన కానుక వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌కు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అరుదైన కానుకను అందించారు. బెంగాలీ లిపిలో.. బలుచురీ సిల్క్‌పై రాసిన బైబిల్‌ను బహుమానంగా అందించారు. ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్ సిస్టర్ ప్రేమ, ఆర్చ్ బిషప్.. ఈ పుస్తకాన్ని పోప్‌కు అందిస్తారు’ అని మమత ట్వీట్ చేశారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆహ్వానితురాలిగా మమత వాటికన్ వెళ్లిన సంగతి తెలిసిందే. 1,500 మంది పేదలకు పిజ్జా వాటికన్‌సిటీలో సెయింట్‌హుడ్ బహూకరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత.. మదర్ థెరిసా బాటలో పోప్ ఫ్రాన్సిస్ 15వందల పేదలకు పిజ్జాలు పంచిపెట్టారు. మదర్ థెరిసా సంస్థ సిస్టర్స్ ఆఫ్ చారిటీ సంస్థకు చెందిన చాలా మంది.. ఆదివారం నాటి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రత్యేకమైన బస్సుల్లో వచ్చారు. వారికి పోప్ పిజ్జాలు ఇచ్చారు. మొత్తం లక్షమందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మదర్‌థెరిస్సా సేవలు మరవలేనివి
ఆదిలాబాద్ కల్చరల్ : భారతరత్న మథర్‌థెరిస్సా దేశ ప్రజలకు చేసిన సేవలు మరవలేనివని, ప్రపంచ దేశాలకు ఆమె సేవలు ఆదర్శమని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీశ అన్నారు. జిల్లా కేంద్రంలోని హోలీ ఫ్యామిలీ క్యాథలిక్ చర్చిలో ఆదివారం మథర్‌థెరిస్సాకు పునీతురాలుగా బిరుదు ప్రదానాన్ని పురస్కరించుకుని సంబరాలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీశ, క్యాథలిక్ Sబిషఫ్ ప్రిన్స్ ఆంటోని, క్యాథలిక్ చర్చి ఫాదర్ బైజూజాన్ మదర్‌థెరిస్సా ప్రతిమ వద్ద పూలతో సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రపంచ దేశాలు మధర్‌థెరిస్సాను ఆదర్శంగా తీసుకుంటున్నాయని, సేవాభావం అమ్మతత్వం కలిగిన స్ఫూర్తిప్రదాయిని అని కొనియాడారు. పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. రోగుల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. -
మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్
-
సెయింట్ మదర్ ధెరిసా
-
సెయింట్ థెరిసాకు మరో గౌరవం
ముంబయి: సెయింట్ హోదా పొందిన మదర్ థెరిసాకు భారత తపాళా సంస్థ తన కృతజ్ఞతను ప్రకటించింది.. వాటికన్ సిటీలో నేడు (సెప్టెంబర్ 4) భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి విజేత మదర్ థెరిసాకు ఆదివారం వాటికన్ సిటీలో సెయింట్‌హుడ్ బహూకరించారు. రోమన్ కేథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ ఈ అరుదైన బిరుదును ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత తపాళా సంస్థ ఆమె జ్ఞాపకార్థం ఆదివారం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. కేంద్ర సహాయ మంత్రి మనోజ్ సిన్హా ఈ స్టాంపును డివైన్ చైల్డ్ హైస్కూల్లో విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మిషనరీ ఆఫ్ చారిటీస్ అధికార ప్రతినిధులుగా బిషప్ ఆగ్నెలో గ్రాసియస్, సిస్టర్ రూబెల్లా హాజరయ్యారు. -
మదర్ ధెరిసాకు సెయింట్‌హుడ్
-
మదర్ ధెరిసాకు సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి విజేత మదర్ థెరిసాకు ఆదివారం వాటికన్ సిటీలో సెయింట్‌హుడ్ బహూకరించారు. రోమన్ కేథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ ఈ గొప్ప బిరుదును ఇచ్చారు. ఈ మహత్కార్యక్రమానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్, ఢిల్లీ, బెంగాల్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీ తదితరులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా థెరిసా అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్యాణం తర్వాత ఎవరైనా మదర్, ఫాదర్లు తమను కొలిచిన వారికి అనారోగ్యాన్ని నయం చేయటం, సమస్యలనుంచి గట్టెక్కించటం చేస్తే వారికి ఈ అరుదైన గౌరవాన్ని అందిస్తారు. ఒక అద్భుతం చేసినట్లు గుర్తిస్తే పవిత్రమూర్తిగా (బీటిఫైడ్), 2 అద్భుతాలు జరిగితే దేవతామూర్తిగా (సెయింట్)గా గుర్తిస్తారు. సాక్ష్యాలు సేకరించి వాటిని ధృవీకరించుకున్నాకే పేరును ప్రకటిస్తారు. థెరిసా గురించి క్లుప్తంగా.. జననం: 1910 ఆగస్టు 26 జన్మస్థలం: మెసడోనియా రాజధాని స్కోప్జె తల్లిదండ్రులు: నికోలా బొజాక్షియు, డ్రేన్ అసలు పేరు: ఆగ్నెస్ గోన్షా బొజాక్షియు థెరిసాగా పేరు మార్పు: 1929లో భారత్‌కు వచ్చాక ఉద్యోగం: కలకత్తాలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో 1931-48 మధ్య ఉపాధ్యాయురాలు సొంత చారిటీ సంస్థ: ద మిషనరీస్ ఆఫ్ చారిటీ-1950 అక్టోబర్ 7న ప్రారంభం పురస్కారాలు: మెగసెసే(1962), నోబెల్ బహుమతి (1979), భారత రత్న (1980) మరణం: కలకత్తాలో 1997 సెప్టెంబర్ 5 -
నేడే థెరిసాకు సెయింట్‌హుడ్
-
నేడే థెరిసాకు సెయింట్‌హుడ్
- వాటికన్ సిటీకి భారత్ తరఫున సుష్మ బృందం - లక్షమంది హాజరయ్యే అవకాశం వాటికన్ సిటీ: భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి విజేత మదర్ థెరిసాకు ఆదివారం వాటికన్ సిటీలో ‘సెయింట్‌హుడ్’ బహూకరించనున్నారు. రోమన్ కేథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ ఈ గొప్ప బిరుదును ఇవ్వనున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా థెరిసా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మహత్కార్యక్రమానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్ నేతృత్వంలో 12 మంది భారతీయుల బృందం వెళ్లింది. థెరీసా మహిమలు బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న తన భర్త కోలుకోవటానికి థెరిసాయే కారణమని ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఓ బ్రెజిల్ మహిళ వెల్లడించింది. ‘నా భర్త ఆండ్రినోస్కు మెదడులో ఇన్ఫెక్షన్ సోకింది. మందులతో ఇది తగ్గే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. కానీ ఓరోజు మదర్ థెరిసా నాకు కలలో కనిపించింది. ఆరోజునుంచి ఆమె చల్లని చూపులతో నాభర్త ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగైంది. ఎవరిపైనైనా మదర్ థెరిసా చల్లని చూపులుంటాయి. థెరిసాకు సెయింట్‌హుడ్ బహుకరణ వింతేమీ కాదు’ అని చెప్పింది. అంతకుముందు 1998లోనూ కోల్‌కతాలో అండాశయ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు థెరిసా పటం నుంచి వచ్చిన ఓ దివ్యజోతి స్పృశించింది. ఆ తర్వాత ఆ మహిళ వ్యాధి నయమైంది. ఈ రెండు ఉదాహరణల ఆధారంగానే థెరీసాకు సెయింట్‌హుడ్ బహుకరించనున్నారు. థెరిసాకు సెయింట్‌హుడ్ బహుకరించటం భారతీయులకు గర్వకారణమని రాష్ట్రపతి ప్రణబ్ అన్నారు. సెయింట్‌హుడ్ ఎలా నిర్ధారిస్తారు? నిర్యాణం తర్వాతా ఎవరైనా మదర్, ఫాదర్లు తమను కొలిచిన వారికి అనారోగ్యాన్ని నయం చేయటం, సమస్యలనుంచి గట్టెక్కించటం చేస్తే వారికి ఈ అరుదైన గౌరవాన్ని అందిస్తారు. ఒక అద్భుతం చేసినట్లు గుర్తిస్తే పవిత్రమూర్తిగా (బీటిఫైడ్), 2 అద్భుతాలు జరిగితే దేవతామూర్తిగా (సెయింట్)గా గుర్తిస్తారు. సాక్ష్యాలు సేకరించి వాటిని ధృవీకరించుకున్నాకే పేరును ప్రకటిస్తారు. థెరిసా గురించి క్లుప్తంగా.. జననం: 1910 ఆగస్టు 26 జన్మస్థలం: మెసడోనియా రాజధాని స్కోప్జె తల్లిదండ్రులు: నికోలా బొజాక్షియు, డ్రేన్ అసలు పేరు: ఆగ్నెస్ గోన్షా బొజాక్షియు థెరిసాగా పేరు మార్పు: 1929లో భారత్‌కు వచ్చాక ఉద్యోగం: కలకత్తాలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో 1931-48 మధ్య ఉపాధ్యాయురాలు సొంత చారిటీ సంస్థ: ద మిషనరీస్ ఆఫ్ చారిటీ-1950 అక్టోబర్ 7న ప్రారంభం పురస్కారాలు: మెగసెసే(1962), నోబెల్ బహుమతి (1979), భారత రత్న (1980) మరణం: కలకత్తాలో 1997 సెప్టెంబర్ 5 -
‘మదర్’ ఇక సెయింట్
మొదటి ప్రపంచ యుద్ధానికి భూమిక సిద్ధమవుతున్న సమయంలో, అదే నేల మీద ఒక శాంతిదూత జన్మించడం గొప్ప చారిత్రక వైచిత్రి. ఆ మహా సంగ్రామానికి అల్బేనియా, కొసావో వంటి ప్రాంతాలు ఆవేశాన్ని రగిలిస్తున్న సమయంలోనే ప్రస్తుతం మేసిడోనియా అని పిలుస్తున్న ప్రాంతంలో సోపె అనేచోట ఆగస్ట్ 26, 1910న ఆ బాలిక భూమ్మీద పడింది. ఆగ్నెస్ అని పేరు పెట్టారు. అనంతరకాలాలలో ఆమె ప్రపంచశాంతికి కృషి చేసి, నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు. అదికూడా భారతదేశంలోని కోల్‌కతా కేంద్రంగా. ఆమె ప్రపంచ శాంతి కోసం తపిస్తూనే దీనులకు, హీనులకు, అధోజగత్ సహోదరులకు, అన్నా ర్తులకు, రోగపీడితులకు, అనాథలకు చల్లని సేవలు అందించారు. ఆమె మదర్ థెరిసా. మదర్ థెరిసా కన్నుమూసిన 19 సంవత్సరాలకు ఆమెను రోమన్ కేథలిక్ చర్చి సెయింట్‌హుడ్ హోదాతో గౌరవిస్తున్నది. జీసస్ ప్రవ చించిన ప్రేమ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పం ఆమెకు కౌమారంలోనే అంకురించింది. పన్నెండేళ్ల బాలికగా ఉన్నప్పుడే పరిశుద్ధ జీవనం గురించి ఆలోచించారు. 18వ ఏట సోపెలోని సొంత ఇంటిని వదిలిపెట్టి క్రైస్తవ సన్యాసినిగా మారిపోయారు. ఐరిష్ వర్గానికి చెందిన సిస్టర్స్ ఆఫ్ లొరెటొలో చేరారు. తరువాత డబ్లిన్‌లోని బ్లెస్డ్ వర్జిన్ మేరీ అనే సంస్థలో కొన్ని మాసాలు తర్ఫీదు పొందారు. మే 24, 1931న సన్యాసినిగా అధికారిక ప్రమాణం స్వీకరించిన థెరిసా అక్కడ నుంచి కోల్‌కతా చేరుకున్నారు. నాటి నుంచి సెప్టెంబర్ 5, 1997లో తుదిశ్వాస విడిచేవరకు ఆమె మానవసేవలోనే పునీతమయ్యారు. 1931లోనే థెరిసా కోల్‌కతాలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యా యినిగా సేవలు చేయడం ఆరంభించారు. కానీ 1948వ సంవత్సరం నాటికి ఆమె హృదయం పేదల సేవ కోసం పరితపించింది. అందుకు నాటి కోల్‌కతా (కలకత్తా)లో ఉన్న దుర్భర దారిద్య్రమే కారణం. దానికి తోడు భారత విభజన రక్తసిక్త అనుభవాలు కూడా బెంగాల్కుఎక్కువే. ఇవన్నీ కలసి మానవ జీవితాన్ని కొన్ని దశాబ్దాల పాటు అతలా కుతలం చేశాయి. ఈ నేపథ్యంలోనే థెరిసా సామాజిక సేవకురాలిగా రంగంలోకి దిగారు. క్రైస్తవ మిషనరీలు, మునిసిపాలిటీ కూడా ఆమె సేవా కార్యక్రమాలకు నిధులు అందించేవి. మతం ఒక మాధ్యమం మానవసేవకు జీవితాన్ని అంకితం చేసిన థెరిసా, అందుకు క్రైస్తవాన్ని మాధ్య మంగా ఎంచుకున్నారు. ఒక వైద్యుడు, ఒక నర్సు, ఇరుగు పొరుగు అందించే సేవలకు భిన్నంగా మానవీయ కోణాన్ని అద్దుకుని ఆమె క్రీస్తు ప్రేమ సందేశంతో విశ్వ మానవతకు సేవకిగా అవతరించారు. ఆమె సేవా దృక్పథం మతమనే వాహకం ద్వారా వ్యక్తమైంది. ఆమె సేవలు అందించడానికి ఎంచుకున్న వర్గం పేదలలో అతి పేదలు. మురికివాడల జనం. ఇది 20వ శతాబ్దంలో ఒక అపురూప సమ్మేళనమే. ఈ సేవలకు మెచ్చే వాటికన్ థెరిసాను అపురూప రీతిలో నాడు సత్కరించింది. ఆమె సొంతంగా ఒక సేవా విభాగాన్ని ఆరంభించడానికి ‘ఆర్డర్’ ఇచ్చింది. ఈ అసాధారణ గుర్తింపు అక్టోబర్ 7, 1950న ఆమెకు దక్కింది. తరువాత ఇదే మిషన రీస్ ఆఫ్ చారిటీగా (ఎంఓసీ) కార్యరూపం దాల్చింది. అనాథలను ఆదుకోవడమే ఎంఓసీ ప్రధాన ధ్యేయం. కేవలం 12 మంది సభ్యులతో మొదలైన ఎంఓసీ ఇప్పుడు 4,000 మంది సన్యాసినులతో ప్రబల సేవా సంస్థగా ఆవిర్భవించింది. వీరంతా అనాథాశ్రమాలను నిర్వహిస్తున్నారు. నా అనేవారు లేక దుర్భర జీవితం గడుపు తున్నవారు, కుటుంబాలు విడిచిపెట్టేసిన పిల్లల్ని, కుటుంబాలకు దూరమైన వారిని ఆదరించవలసిన ఆవశ్యకత ఎంతో థెరిసా గుర్తించారు. శరణార్థులకు గూడూ, కూడూ ఇచ్చి ఆదుకోవడం, వారికి వైద్య సేవలు అందించడం ఎంత ముఖ్యమో కూడా ఆమె గమనించారు. అలాగే సంఘ బహిష్కృతులుగా మారుతున్న ఎయిడ్స్ రోగులను ఆదుకోదలిచారామె. అంతేకాదు, అంధులు, అవిటివారు, వరద బాధి తులు, దుర్భిక్ష ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని, ఇళ్లు లేనివారిని ఆదు కోవడమే లక్ష్యంగా ఆ సంస్థ పనిచేస్తోంది. తరువాత ఎంఓసీని ఇతర దేశాలలో ఆరంభించడానికి కూడా అనుమతి లభించింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా, పోలండ్, ఆస్ట్రేలియాలలో కరువుకాటకాలకు గురైన వేలాదిమందికి ఈ సంస్థ ఆశ్రయం ఇచ్చింది. ఆ రీతిలో కోల్‌కతాలో ఒక క్రైస్తవ సన్యాసినిగా, సేవకురాలిగా జీవితం ఆరంభించిన థెరిసా తరువాత ప్రపంచానికి ఒక ఆదర్శ మహిళగా అవతరించారు. అదే నోబెల్ శాంతి (1979)బహుమానానికీ, భారతరత్న (1980) పురస్కారానికీ ఇప్పుడు కేథలిక్ క్రైస్తవంలో అత్యున్నత సెయింట్ హోదా నడిపించాయి. ఆకలితో అలమటించిపోయిన ఇథియోపియా బాలలను చూసి మనసు వికలం కాని వారు ఎవరూ ఉండరు. కానీ అక్కడికి వెళ్లి వాళ్ల నోటికి ఆహారం అందించే పనిచేశారు థెరిసా.. అలాగే చెర్నోబిల్ ఉదంతం జరిగినప్పుడు ఆ ఉత్పాతంలో గాయపడిన వారికి సేవలు అందించడానికి వెళ్లిన కరుణామయి థెరిసా. ఇంతకుముందు... థెరిసా తరువాత కాలంలో భారత పౌరసత్వం తీసుకున్నారు. ఆమెకు ముందు మన దేశం నుంచి సెయింట్ హోదా పొందిన వారు కూడా అదే తరహాకు చెందినవారు. కేరళ సైరో మలబార్ కేథలిక్ చర్చికి చెందిన సిస్టర్ అల్ఫోన్సోకు మొదట ఈ గౌరవం దక్కింది. 2008లో ఈమెకు ఈ అత్యున్నత పురస్కారాన్ని వాటికన్ ప్రకటించింది. కేరళ మిషనరీ ఫాదర్ చెవేరా అచెన్కు, సిస్టర్ ఇవూప్రసైయ్యమ్మలకు నవంబర్ 23, 2014న పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హోదా ఇచ్చారు. ఫాదర్ చెవేరా అచెన్ అసలు పేరు కురియకోస్ చెవేరా. ఈయన 1829 ప్రాంతానికి చెందిన క్రైస్తవ పురోహితుడు. సిస్టర్ ఇవూప్రసైయ్యమ్మ అసలు పేరు యుఫ్రేషియా. అయితే ఫాదర్ చెవేరాకు, సిస్టర్ అల్ఫోన్సోకు సెయింట్ హోదా కట్టబెట్టే కార్యక్రమాన్ని 1986లో ఒకేసారి ఆరంభిం చారు. ప్రతి చర్చికి అనుబంధంగా ఒక పాఠశాల ఉండాలన్న ఆలోచన ఫాదర్ చెవేరాదే. అదికూడా ఉచిత విద్యను అందించే పాఠశాల ఉండాలని ఆయన ఆదే శించారు. జనవరి 3, 1871న ఆయన కన్నుమూశారు. యుఫ్రేషియాకు సెయింట్ హోదా కల్పించే కార్యక్రమం 2006లో మొదలయింది. ఆమె ప్రార్థనకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తూ ఏకాంతంగా గడిపేవారు. ఆగస్ట్ 29, 1951లో ఆమె త్రిశూర్‌లో మరణించారు. అలాగే థెరిసాకు ఆ అత్యున్నత హోదా ఇచ్చే కార్యక్రమం ఆమె మరణించిన వెంటనే ఆరంభమైంది. మిగిలిన వారికంటే థెరిసాకు సెయింట్ హోదా ఇచ్చే పని అతి శీఘ్రంగా ఆరంభం కావడానికి కారణం ఆమె సేవా కార్యక్రమాలు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. అయినా ఒక క్రైస్తవ మత పెద్దకో, సేవకునికో ఆ పురస్కారం ఇచ్చే ప్రక్రియ వారు మరణించిన ఐదేళ్ల తరువాత ఆరంభం కావడం సంప్రదాయం. 1963 నుంచి పోప్లు సెయింట్ హోదాను ఎక్కువగా ఇవ్వడం ఆరంభించారు. ఆ సంవత్సరం నుంచి మొదలు పెట్టి ఇప్పటి వరకు 640 మందికి ఆ హోదా ఇచ్చారు. వారిలో చివరి వారు థెరిసా. అంతకు ముందు 375 సంవత్సరాల చరిత్రలో కేవలం 218 మందికే ఆ గౌరవం దక్కింది. హోదాకు నియమాలు సెయింట్ హోదా ప్రాచీనకాలం నుంచి వాటికన్ ప్రసాదిస్తున్న అపు రూప గౌరవం. ఇందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియ మాలతో విభేదించేవారు ఉన్నమాట నిజం. అయితే ఆ వ్యక్తులు సమాజాలకు, మానవత్వానికి చేసిన సేవలకు ఇస్తున్న పురస్కారం కాబట్టి ఎక్కువమంది ఆ హోదా దక్కిన వారిని గౌరవించడం కూడా జరుగుతోంది. థెరిసా జీవితంలో కూడా రెండు ‘అద్భుతాలు’ జరి గాయని వాటికన్ నగరం విశ్వసించింది. అందులో ఒకటి మోనికా బెస్రా అనే గిరిజన మహిళకు సంబంధించిన ఉదంతం. తాను ఒక చర్చిలోకి వెళ్లగానే థెరిసా పటం నుంచి ఒక కిరణం వచ్చి తనను తాకిందని, దానితో ఉదరంలోని క్యాన్సర్ నయమైందంటూ ఆమె చేసిన ప్రకటనను వాటికన్ పరిగణనలోనికి తీసుకుంది. రెండో అద్భుతం-బ్రెజిల్ దేశీయుడికి అనుభవమైందని అంటారు. మదర్ ఆశీస్సులతో అతడి మెదడులో ఏర్పడిన కణితులు తొలగిపోయాయని వాటికన్ విశ్వసించింది. నేడు ప్రదానం ఈ ఆదివారం (సెప్టెంబర్ 4) థెరిసాకు సెయింట్ హోదా ప్రకటించే ఉత్సవం రోమ్‌లోని వాటికన్ నగరంలో పోప్ ఫ్రాన్సిస్ అధ్యక్షతన అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనిని థె రిసా సేవా కార్యక్షేత్రం కోల్‌కతాలో కూడా ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా ప్రసారం చేస్తున్నారు. ఇక సాక్షాత్తు వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగే ఆ మహోత్సవాన్ని వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి క్రైస్తవ మత పెద్దలు, థెరిసా అభిమానులు దాదాపు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా. ఈ ఉత్సవానికి భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం కూడా హాజరవుతున్నది. ‘ఆమె జీవితం మొత్తం నిరుపేదల సేవకు అంకితం చేశారు. అలాంటి ఉన్నత వ్యక్తికి సెయింట్ హోదా దక్కుతున్నదంటే భారతదేశం సహజంగానే గర్విస్తుంది’ అని ప్రధాని ఒక సందేశంలో శ్లాఘించారు కూడా. నిజానికి ఇది థెరిసా అపురూప జ్ఞాపకానికీ, సేవా తత్పరత మీద ఆమె విడిచిన ముద్రకీ జరుగుతున్న సత్కారం. ప్రపంచవ్యాప్తంగా 136 దేశాల పేదసాదల హృదయంలో ఆమె ఒక చెరగని ముద్ర. రచయిత: గోపరాజు నారాయణరావు -
కృష్ణకు మదర్ థెరిస్సా పురస్కారం
కాచిగూడ: మథర్ థెరిస్సా జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం కాచిగూడ ప్రాంతానికి చెందిన తెలంగాణ దళిత హక్కుల పరిరక్షణ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జి.కృష్ణకు సమాజిక సేవలో మదర్ థెరిస్సా అవార్డును అందజేశారు. కార్యక్రమంలో సౌత్ ఏషియా భిషఫ్ సంఘం అధ్యక్షులు డాక్టర్ ఫెథరిన్ ఫ్రాన్సిస్, సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్‌నారాయణ ముదిరాజ్, జెఎన్టీయు ప్రొఫెసర్ రాములు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.అనిల్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు. -
రేపే మదర్‌కు సెయింట్‌హుడ్
-
రేపే మదర్‌కు సెయింట్‌హుడ్
న్యూఢిల్లీ: వాటికన్ సిటీలో ఆదివారం మదర్ థెరిసాకు ‘సెయింట్‌హుడ్’ బహుకరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో 12 మంది భారత ప్రతినిధుల బృందం శుక్రవారం రోమ్ బయలుదేరి వెళ్లింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమత కూడా రోమ్కు బయల్దేరి వెళ్లారు. మదర్ అద్భుతం చేసినందుకే..: 1998లో బెంగాలీ మహిళ మోనికా బెస్రాకు అండాశయ కేన్సర్ మదర్ వల్లే నయమైందని 2002లో గుర్తించారు. అలాగే బ్రెజిల్‌కి చెందిన మార్సిలియో హడ్డాడ్ ఆండ్రియో బ్రెయిన్ ట్యూమర్ నుంచి కోలుకున్నారు. మరణానంతరం కూడా మహిమ చూపడంతో మదర్‌కు సెయింట్‌హుడ్ ఇవ్వనున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
మదర్ థెరిస్సా కార్యక్రమానికి సుష్మా, మమత
రోమ్ లోని వాటికన్ సిటీలో అట్టహాసంగా జరగనున్న మదర్ థెరిస్సా 'సెయింట్ హోదా' బహుకరణ కార్యక్రమానికి భారత ప్రతినిధి బృందం తరలి వెళ్లింది. వీరితోపాటు దేశ రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు తరలి వెళుతున్నారు. ముఖ్యంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, కేంద్రమత్రి సుష్మా స్వరాజ్, ఈ రోజు (శుక్రవారం) బయలు దేరారు. ఈ విషయాన్ని ఇద్దరు నేతలు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ మదర్ థెరిస్సా కాననైజేషన్ కార్యక్రమానికి రోమ్ కు బయలుదేరినట్టు ట్విట్ చేశారు. భారత ప్రతినిధి బృందంతో రోమ్ కు బయలుదేరినట్టు ఆమె ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు. అనాథల పాలిట ఆశాదీపంగా వెలుగొందిన మదర్ థెరిస్సా కాననైజేషన్ (మత గురువుల జాబితాలో చేర్చుకార్యక్రమానికి) మిషనరీస్ అఫ్ ఛారిటీ ఆహ్వానం మేరకు తాను పవిత్ర వాటికన్ సిటీ కి బయలు దేరినట్టు మమత ట్విట్ చేశారు. మానవత్వానికి మాత, దీనుల పాలిట అమ్మ...ఆపన్నులకు అభయహస్తాన్నందించి జీవితాంతం వారి సేవకే అంకితమైన మదర్ థెరిస్సా ప్రేమ అపరిమితమని తన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. మదర్ బెంగాల్ లో నివసించడం తమకు గర్వకారణమని మమత పేర్కొన్నారు. వాటికన్ సిటీ పర్యటన సందర్భంగా సెప్టెంబర్ 5 న రోమ్ తొలి మహిళా మేయర్ వర్జీనియా రాగి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీదీ పాలుపంచుకుంటారు. అనతరం అక్కడినుంచి మ్యూనిచ్ కి బయలుదేరి వెళతారు. 12 మంది అధికారిక ప్రతినిధిబృందం, పారిశ్రామికవేత్తలతో కలిసిమమతా జర్మనీలో పర్యటించనున్నారు. పెట్టుబడిదారులతో సమావేశంకానున్నారు. అనంతరం సెప్టెంబర్ 10 న తిరిగి కోలకతా చేరుకుంటారు. కాగా మదర్ థెరిస్సాను ' సెయింట్'గా ధ్రువీకరిస్తున్నట్టు క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మార్చి 15 న ప్రకటించారు. సెప్టెంబర్ 4న మదర్‌కు సెయింట్ హోదాను ఇవ్వనున్నారు. ఈ హోదాతో మదర్ థెరిస్సా దైవదూతగా అవతరిస్తారు. At the invitation of Missionaries of Charity I am leaving for the holy Vatican City to participate in canonization ceremony of Mother Teresa — Mamata Banerjee (@MamataOfficial) September 2, 2016 Bengal is more proud as Mother lived and worked here and showered us with her abundant love and care — Mamata Banerjee (@MamataOfficial) September 2, 2016 Indian delegation leaving for Rome to attend the canonisation of Mother Teresa. pic.twitter.com/Z3eEz07PRQ — Sushma Swaraj (@SushmaSwaraj) September 2, 2016 -
దీనుల దేవత మదర్ థెరిస్సా
గుడిహత్నూర్ : మదర్ థెరిస్సా దీనుల పాలిట దేవతగా నిలిచారని ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, స్థానిక సీఎస్ఐ సంఘ కాపరి రెవ జీఎం దినకర్ అన్నారు. మదర్ థెరిస్సా జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక సీఎస్ఐ వెస్లీ చర్చిలో మదర్ చిత్ర పటానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జాతి వైషమ్యాలు లేకుండా దీనజనులకు అండగా నిలిచిన మాతృమూర్తి అని కొనియాడారు. మనుషుల్లోనే దేవుడిని చూశారని పేర్కొన్నారు. నిస్సహాయులకు నిరంతరం సహాయం అందించి విశ్వమాతగా నిలిచారని, ఆమె సేవలు చిరస్మరణీయమన్నారు. అనంతరం ప్రత్యేక దీవెనలు, ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు రత్నాకర్, రాజ్‌కుమార్, తారా రవి, సుద్దాల రాజు, ఇందిర సుకన్య, స్వప్న తదితరులు ఉన్నారు. -
గాంధీబాబుకు మదర్ థెరిసా పురస్కారం
గిరిజన ప్రాంతాల్లో చేసిన సేవలకు దక్కిన గౌరవం హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు వీఆర్‌పురం : పేద గిరిజనులకు విద్యా, వైద్య సేవలందిస్తున్న ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ వి.గాంధీబాబుకు మదర్ థెరిసా పురస్కారం లభించింది. మదర్ థెరిసా జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ హెల్త్‌కేర్ ఇంటర్నేషల్ సంస్థ విద్యా, వైద్య విభాగాల్లో ఉత్తమ సేవలందించిన ప్రముఖులను గుర్తించి ఏటా ఈ పురస్కారాలు ఇస్తున్నది. ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన, వలస ఆదివాసీయుల గ్రామాల్లో పోషకాహారంతో బాధ పడుతున్న మూడు వేల మంది బాల బాలికలను పౌష్టికాహార కేంద్రాల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందజేశారు. గర్భిణులకు, చిన్నారులకు తన సంస్థ సొంత మెడికల్ యూనిట్ల ద్వారా 89 వైద్య శిబిరాలు నిర్వహించి 5478 మందికి సేవలందించారు. అలాగే పలుగ్రామాల్లో చేతి పంపులు, బావులు ఏర్పాటు చేశారు. ఆయన సేవలను గుర్తించి గాంధీబాబును మదర్ థెరిసా పురస్కారానికి ఎంపికచేశారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకున్నారు. అవార్డు రావడం పట్ల మండల ప్రజలు, రాజకీయ నాయకులు, సంస్థ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. -
మదర్ థెరిస్సాకు మరో అవార్డు
లండన్: సేవాశీలి మదర్ థెరిస్సాకు ప్రఖ్యాత ఫౌండర్స్ అవార్డు లభించింది. అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచే విజయాలను సాధించిన ఆసియా వారికి ఈ అవార్డులను ఏటా అందజేస్తారు. మొత్తం 14 విభాగాల్లో అవార్డులు ప్రదానం చే స్తారు. మదర్ థెరిస్సా భారత్‌లో చారిటీని స్థాపించి 45 ఏళ్లపాటు పేద ప్రజలకు, రోగులకు, అనాథలకు సేవ చేశారు. 1997లో కలకత్తాలో మరణించారు. థెరిస్సాకు దూరపు బంధువైన ఆమె మేనకొడలు అగి బొజాజియు ఈ అవార్డును అందుకోవటానికి ఇటలీ నుంచి శుక్రవారం లండన్ చేరుకున్నారు. 2010 నుంచి పాల్ సాగు అనే వ్యాపారవేత్త ఈ అవార్డులను అందజేస్తున్నారు. మదర్ థెరిస్సాను దైవ సమానురాలుగా గుర్తించిన ఈ ఏడాదే తాము ఆమెను ఈ అవార్డుతో గౌరవించడం సంతోషంగా ఉంద ని ఆయన అన్నారు. -
దేవతమ్మ
దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడు. మదర్ థెరిసా దేవుడు చేసిన అమ్మ. ఇప్పుడు మానవాళి ఈ అమ్మను దేవతను చేసింది. మానవత్వాన్ని మించిన దైవత్వం ఉండదని చాటిన ఈ అమ్మ... ఈ దేవత... దేవతమ్మ. అన్నం లేకపోవడం కన్నా ఆప్యాయత కరువవడం అసలైన పేదరికమని మదర్ నమ్మారు. ప్రేమకు, పలకరింపులకు నోచుకోని నిర్భాగ్యులకు తన జీవితాన్ని అంకితం చేశారు. మనుషుల్లో మంచితనం ఉందనీ, పంచుకుంటే అది విశ్వవ్యాప్తం అవుతుందని ప్రబోధించిన థెరిసాను సెయింట్ అనడం కన్నా మదర్ అనడమే బాగుంటుంది. 1998. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా. పశ్చిమ బెంగాల్. మోనికా బెస్రా. గిరిజన మహిళ. అప్పటికి చాలా కాలంగా ఆమె పొత్తి కడుపులోని కణితితో బాధపడుతోంది. చుట్టుపక్కల వైద్యులకు చూపించారు. నయం కాలేదు. ఎవరో చెప్పారు.. మదర్ థెరిసా ఫొటో ఉన్న లాకెట్‌ను మెడలో వేసుకుంటే కణితి కరిగిపోతుంది అని. వాళ్లు చెప్పినట్లే చేసింది మోనికా బెస్రా. చిత్రం! కొన్నాళ్లకు కడుపులోని కణితి కరిగిపోయింది! ‘లాకెట్లోంచి ఒక వెలుగు కిరణం వచ్చి నా పొత్తి కడుపులో నొప్పిగా ఉన్నచోట లోనికి ప్రవేశించడాన్ని నా కళ్లారా చూశాను. ఆ తర్వాత నా కడుపునొప్పి తగ్గిపోయింది’ అని బెస్రా చెప్పింది. స్కాన్ చేసి చూస్తే లోపల నిజంగానే కణితి లేదు! ఈ ‘అద్భుతాన్ని’ 2002లో వాటికన్ చర్చి గుర్తించింది. 2008. బ్రెజిల్ ఆ దేశంలో ఒక వ్యక్తికి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకింది. అత్యవసరంగా సర్జరీ చెయ్యాలని, లేకుంటే అతడు బతకడం కష్టమని వైద్యులు నిర్థారించారు. వెంటనే అతడి భార్య చర్చికి వెళ్లి మదర్ థెరిసాను ప్రార్థించింది. తన భర్తకు సర్జరీ అవసరం లేకుండా చెయ్యమని మొరపెట్టుకుంది. డిసెంబర్ 9న సర్జరీ చెయ్యడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. న్యూరోసర్జన్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లాడు. వెళ్లీ వెళ్లగానే పేషెంట్ ఎంతో ఉత్సాహంగా ఉండడాన్ని గమనించాడు. పైగా తనకు ఎలాంటి నొప్పీ లేదని ఆ పేషెంట్ చెబుతున్నాడు. స్కాన్ చేసి చూస్తే అతడి బ్రెయిన్లో ఎక్కడా ఇన్ఫెక్షన్ అన్నదే కనిపించలేదు! ఈ ‘అద్భుతాన్ని’ 2015లో వాటికన్ గుర్తించింది. మదర్ థెరిసాను ‘సెయింట్’గా మార్చిన రెండు అద్భుతాలివి. వాటికన్ సిటీలోని రోమన్ కేథలిక్ చర్చి నిబంధనల ప్రకారం మహిమ గల ఏ క్రైస్తవ సాధువుకైనా, సాధ్వికైనా ‘సెయింట్‌హుడ్’ హోదాను ఇవ్వాలంటే ఆ సాధువుకు లేదా సాధ్వికి ఉన్న మహిమల కారణంగా కనీసం రెండు అద్భుతాలైనా జరిగి ఉండాలి. మదర్ థెరిసా జీవించి ఉన్నప్పుడు ఆమెను ‘ఎ లివింగ్ సెయింట్’ అనేవారు. చనిపోయిన తర్వాత పందొమ్మిదేళ్లకు ఇప్పుడు ఆమె అధికారికంగా ‘సెయింట్’ అవబోతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 4న, థెరిసా వర్ధంతికి ఒకరోజు ముందు ఆమెకు ‘మహిమాన్విత’ (సెయింట్‌హుడ్) అనే హోదాను ఇవ్వబోతున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా థెరిసా.. మదర్ థెరిసా అయితే కావచ్చు కానీ, ముఖ్యంగా మాత్రం.. సెయింట్ థెరిసా! వైద్య పరిజ్ఞానం పెరైండు అద్భుతాలను అంగీకరించకపోవడం అన్నది వేరేమాట. కానీ వాటికన్.. థెరిసా మహిమను అధికారికంగా గుర్తించింది. వాస్తవానికి మదర్ థెరిస్సా జీవించి ఉన్న కాలంలో వైద్యం విజ్ఞాన రంగం సైతం విస్తుబోయే మహిమలనెన్నింటినో ఆమె కనబరిచారు. అయితే అవన్నీ కూడా మానవాళిపై ఆమెకు చూపిన ప్రేమకు ఫలితంగా సంభవించిన అద్భుతాలు. చనిపోతూ.. చిరునవ్వు సాయంత్రం - థెరిసా, ఆమె సహాయకులు కలకత్తా వీధులలోకి వచ్చారు. వారికి నలుగురు అభాగ్యులు కనిపించారు. వాళ్లలో ఒకరి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఆ ఒకరు స్త్రీ. థెరిసా.. సిస్టర్స్‌తో చెప్పారు - మిగతా ముగ్గురిని మీరు జాగ్రత్తగా చూసుకోండి, నేను ఈ వ్యక్తి దగ్గర ఉంటానని! ప్రేమతో ఆ స్త్రీకి చేయగలిగినంత చేశారు థెరిసా. విశ్రాంతిగా ఆమెను మంచం మీద పడుకోబెట్టారు. ఆమె ముఖంలో అందమైన నవ్వు కనిపించింది. థెరిసా చేతిని తన చేతుల్లోకి తీసుకుని - ‘‘ధన్యవాదాలు’’ అంది. ఒకే ఒక మాట. ఆ వెంటనే ఆమె చనిపోయింది! ‘‘నేనేం చేయలేకపోయాను. అలా చూస్తూ ఉండిపోయాను. నేనే తన స్థానంలో ఉండి ఉంటే? నా అంతరాత్మ ప్రశ్నించింది. ఉంటే - నా బాధను చెప్పుకునేదాన్ని. ఆకలిగా ఉందని, చచ్చిపోతున్నానని అనేదాన్ని. ఏదో ఒకటి చేయమని, కాపాడమనీ మూలిగే దాన్ని. ఇవేవీ తను చెయ్యలేదు. ఏదీ అడగలేదు. చనిపోతూ కూడా ప్రతిఫలంగా చిరునవ్వును ప్రసాదించింది’’ అని ఆనాటి సంఘటనను తన నోబెల్ ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు మదర్ థెరిసా. తక్కిన ముగ్గురిలో ఒక మగ మనిషి కూడా చనిపోయాడు. ఆశ్రమానికి తీసుకుని వచ్చేటప్పటికే అతడు మరణావస్థలో ఉన్నాడు. తెగిన అవయవంలా ప్రాణం దేహానికి వేలాడుతూ ఉండగా అక్కడికి తెచ్చారు. లాభం లేదని అతడికీ తెలిసిపోయింది. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘అనామకంగా బతికాను. దైవదూతలా వెళుతున్నాను’ అన్నాడు.. మదర్ చేతుల్లో ప్రాణాలు వదులుతూ. చనిపోయేముందు అతడు ఎవరినీ నిందించలేదు. ఎవరినీ దూషించలేదు. ఎవరినీ ద్వేషించలేదు. ఎవరితోనూ పోల్చుకోలేదు! ‘‘పుళ్లను కడిగి, పునీతం చేయగలిగిన శక్తి ప్రేమకు ఉన్నపుడు... సాటి మనిషి కోసం ఒక చిరునవ్వును ప్రేమగా మన పెదవులపై విరబూయించలేమా?’’ అని అడిగారు మదర్.. అదే ప్రసంగంలో. ప్రేమకోసం అలమటింపు! ఓసారి మదర్ ఒక వృద్ధాశ్రమానికి వెళ్లారు. కొడుకులు, కూతుళ్లు ఆ వృద్ధులను అక్కడ భద్రంగా వదలించుకుని వెళ్లి చాలాకాలమైనట్లుంది. బహుశా వాళ్లకు తమ తల్లిదండ్రులను ఏ వృద్ధాశ్రమంలో చేర్పించామో కూడా గుర్తుండకపోవచ్చు! అక్కడి వృద్ధులకు సౌకర్యాలకు కొదవలేదు. చిన్న లోటైనా లేదు. మరెందుకనో ఒక్కరి ముఖంలోనూ సంతోషం లేదు. పొద్దస్తమానం తలుపుల వైపే చూస్తూ గడుపుతున్నారు. కూర్చున్నా, నడుస్తున్నా, తింటున్నా, ఆలోచిస్తున్నా... చూపులు మాత్రం తలుపుల వైపే! అక్కడున్న సిస్టర్ని అడిగారు మదర్. ఎందుకు వాళ్లు అలా ఉన్నారు? ఎందుకు తలుపుల వైపే చూస్తున్నారు? ఎందుకు వారు సంతోషంగా లేరు? వారి ముఖంలో చిన్న నవ్వైనా పుయ్యడం లేదెందుకని అడిగారు. ‘‘చనిపోతున్నవారిలో సైతం నవ్వును చూసిన భాగ్యశాలిని నేను. అన్నీ ఉన్నా, ఎందుకుని వీళ్లు ఉల్లాసంగా లేరు?’’ అని అడిగారు. ‘‘ఇవాళే కాదు, ప్రతిరోజూ అంతే. కూతురో, కొడుకో రాకపోతారా? కాసేపు మాట్లాడకపోతారా అని రోజంతా ఆశగా ఎదురు చూస్తుంటారు. రోజులు, నెలలు గడుస్తుంటాయి. కన్నబిడ్డలు తమను మర్చిపోవడం వీరిని బాధిస్తుంటుంది’’ అని చెప్పారు సిస్టర్. ప్రేమకు ప్రపంచం నిరుపేద అయిపోయిందా?- మదర్ ఆలోచనలో పడ్డారు. తియ్యని తేనె మనసులు ఒకసారి కలకత్తాలో పంచదారకు కొరత ఏర్పడింది. థెరిసా నిర్వహిస్తున్న హోమ్‌లోని పిల్లలకు పాలలో కలిపి ఇచ్చేందుకు కూడా పంచదార దొరకడం లేదని ఎట్లా తెలిసిందో నాలుగేళ్ల పసివాడు తల్లిదండ్రుల్ని వెంటబెట్టుకుని వచ్చాడు! వాళ్ల చేతిలో పంచదార పొట్లాం ఉంది. మదర్‌కు ఆశ్చర్యమేసింది. ‘‘ఏం చెప్పి మీ అబ్బాయి మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు’’అని అడిగారు. ‘‘మూడు రోజులుగా వీడు పాలలో పంచదార వేసుకోవడం లేదు’’ అని చెప్పింది తల్లి. ‘‘తనకోసం వేసే పంచదారను మిగిల్చి మీ హోమ్ లోని పిల్లలకు ఇమ్మన్నాడు’’ అని చెప్పాడు తండ్రి. పసివాడిని దగ్గరకు తీసుకున్నారు మదర్. ఆమె పేరు పలకడం కూడా వాడికి రాదు. కానీ తను చేయవలసింది ఏమిటో ఆ వయసుకి అర్థమయింది!! ఉన్నదాన్ని పంచుకోవాలన్న ఆలోచన తప్ప, ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నించే వయసు కూడా కాదది. పంచుకున్నదే.. పరమాన్నం అలాంటిదే ఇంకో సంఘటన. ఎనిమిది మంది పిల్లలున్న ఒక హైందవ కుటుంబం ఆకలితో నకనకలాడుతోందని ఒక వ్యక్తి వచ్చి మదర్‌కు చెప్పాడు. కొన్ని రోజులుగా వాళ్లు పస్తులుంటున్నారని ఆవేదన చెందాడు. వెంటనే బియ్యం మూటతో అక్కడకు వెళ్లారు థెరిసా. పిల్లల కళ్లు క్షుద్బాధను ప్రతిఫలిస్తున్నాయి. ఇంటావిడ ఎంతో కృతజ్ఞతతో బియ్యం తీసుకుని, రెండు సమభాగాలు చేసింది! ఒక భాగాన్ని సంచిలో వేసుకుని బయటికి వెళ్లి వచ్చింది. ‘‘అంత హడావిడిగా ఎక్కడికి వెళ్లావు’’ అని అడిగారు మదర్. ‘‘వాళ్లు కూడా ఆకలితో ఉన్నారు’’ అంది ఆమె! వెంటనే మదర్‌కు అర్థం కాలేదు. ఆమె చెప్తోంది పొరుగున్న ఉన్న ముస్లిం కుటుంబం గురించి. మదర్ తెచ్చిన బియ్యంలో సగం... వాళ్లకు ఇచ్చి వచ్చింది! ఆ సాయంత్రం మదర్ మళ్లీ బియ్యం తీసుకెళ్లలేదు. పంచుకోవడంలోని ఆనందాన్ని వాళ్లకు మిగలనివ్వడం మదర్‌కు న్యాయమనిపించింది. తల్లి నుంచి లభించిన ప్రేమతో పిల్లలూ గెంతులేస్తున్నారు. ప్రేమ ఆ విధంగా ఇంటి నుంచే మొదలౌతుంది. ఇంటి నుంచి ఇంటికి, మనిషి నుంచి మనిషికి విశ్వవ్యాప్తం అవుతుంది. గుర్తుంచుకునే మాట ఆత్మీయంగా పలకరించడం, చిరునవ్వును చిలకరించడం కూడా ప్రేమను పంచుకోవడమే. రెపరెపలాడుతున్న జీవితంలోనూ ఆశలు రేపుతుంది ప్రేమ - అని మదర్ నమ్మకం. ‘‘ఇదెలా సాధ్యం?’’ అని అడిగారు అమెరికన్ ప్రొఫెసర్లు. వాళ్లంతా అమెరికాలోని వేర్వేరు యూనివర్శిటీల నుంచి వచ్చినవారు. కలకత్తాలోని మిషనరీ హోమ్‌లు సందర్శించేందుకు వచ్చారు. తిరిగి వెళ్లే ముందు - ‘‘ గుర్తుంచుకునే ఒక మాట చెప్పండి మదర్...’’ అని అడిగారు. మదర్ ఇలా చెప్పారు - ‘‘ఒకరికొకరు ఎదురుపడినప్పుడు నవ్వుతూ పలకరించుకోండి. కనీసం నవ్వు ముఖంతో చూసుకోండి. ఇందులో సాధ్యం కాకపోవడానికి ఏమీ లేదు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడండి. బయట కూడా అదే అలవాటవుతుంది. అప్పుడు ప్రపంచమే ఒక కుటుంబమౌతుంది’’. నమ్మలేనట్లు చూశారు. దేవుడి ప్రేమను కూడా తరచు మనం అలాగే నమ్మలేనట్లు చూస్తాం అని అంటారు మదర్. మదర్ థెరిసా ⇒26 ఆగస్టు 1910 - 5 సెప్టెంబర్ 1997 ⇒అసలు పేరు : ఆగ్నస్ గోన్షా బొజాక్షూ ⇒తల్లిదండ్రులు : నికోల్, డ్రానా ⇒జన్మస్థలం : స్కోప్జే (మెసిడోనియా) ⇒పౌరసత్వం : ఇండియా ⇒మతం : క్యాథలిక్ ⇒స్థాపన : మిషనరీస్ ఆఫ్ చారిటీ (కలకత్తా) ⇒ప్రఖ్యాతి : మానవతావాది ⇒ప్రతిష్ఠ : నోబెల్ శాంతి బహుమతి, భారతరత్న, సెయింట్‌హుడ్ అందమైన త్యాగం! ఒక వ్యక్తి నుంచి మదర్‌కు పదిహేను డాలర్లు అందాయి. ఇరవై ఏళ్లుగా అతడు మంచంపైనే ఉన్నాడు. కుడి చెయ్యి తప్ప అతడి శరీరంలోనే మరే అవయవమూ కదలడం లేదు. అన్నేళ్లుగా అతడికి తోడున్నదొకటే... స్మోకింగ్! బాగా సిగరెట్లు కాల్చేవాడట. ఒక వారం పాటు స్మోకింగ్ మాని, అలా మిగిలిన డబ్బును మదర్‌కు పంపించాడు. ఎంత అందమైన త్యాగం! ‘‘అతడు పంపిన డబ్బుతో రొట్టె ముక్కలు కొన్ని ఆకలిగొన్నవారికి పంచినప్పుడు వారి కళ్లల్లో ఎంత ఆనందం కనిపించిందో, ఆ ఆనందం గురించి విన్నపుడు అతడి కళ్లల్లోనూ అంతే ఆనందం కనిపించింది. ప్రేమను పంచుకోవడంలో ఉన్న సంతృప్తి అది’’ అన్నారు మదర్. థెరిసా జీవితంలోని ముఖ్య ఘట్టాలు ⇒1910 ఆగస్టు 27 (పుట్టిన రెండోరోజు) దైవ సభ్యత్వం (బాప్టిజం) ⇒12 ఏళ్ల వయసులో దేవుని పిలుపు అనుభూతి ⇒1928 సెప్టెంబర్ 25 సిస్టర్ థెరిసాగా పేరు మార్పు ⇒1929 (18 ఏళ్ల వయసులో) కలకత్తా రాక, టీచర్‌గా సేవ ⇒1937 (27 ఏళ్ల వయసులో) మదర్ థెరిసాగా ఉన్నతి ⇒1946 సెప్టెంబర్ 10 దేవుని రెండో పిలుపు అనుభూతి ⇒1948 పేద పిల్లల కోసం స్కూలు ఏర్పాటు ⇒1950 అక్టోబర్ 7 మిషనరీస్ ఆఫ్ ఛారిటీ స్థాపన ⇒1951 భారత పౌరసత్వం ⇒1961 పద్మశ్రీ అవార్డు ⇒1971 పోప్ జాన్ గీగీఐఐఐ శాంతి బహుమతి ⇒1979 నోబెల్ శాంతి బహుమతి ⇒1980 భారతరత్న అవార్డు ⇒1983 తొలిసారి గుండెపోటు ⇒1997 మిషనరీ బాధ్యతల నుంచి విరమణ ⇒1997 సెప్టెంబర్ 5 గుండెపోటుతో మరణం. ⇒2003 ‘పరమ పావని’గా ఉన్నతి (బీటిఫికేషన్) ⇒2016 ‘మహిమాన్విత’గా ఉన్నతి (సెయింట్‌హుడ్) -
మదర్ థెరిసాకు ‘సెయింట్‌హుడ్’
- సెప్టెంబర్ 4న ఇస్తాం... - అధికారిక ప్రకటన చేసిన పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీ: మదర్ థెరిసాను ‘సెయింట్’గా ప్రకటించేందుకు వాటికన్ సిటీ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 4న అధికారికంగా సెయింట్‌హుడ్ ఇస్తామని కోల్‌కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీకి మంగళవారం పంపిన వర్తమానంలో పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. దీంతో 45 ఏళ్ల పాటు పేదల సేవలో తరించిన మదర్ మరణించిన 19 ఏళ్ల అనంతరం సెయింట్ హోదా పొందనున్నారు. థెరిసాను పరిశుద్ధురాలిగా ప్రకటించే ప్రక్రియకు పోప్ ఆమోదం తెలిపారన్న వర్తమానం అందగానే మిషనరీస్ ఆఫ్ చారిటీలో ఆనందం మిన్నంటింది. విషయం తెలియగానే ఎంతో ఉద్వేగం, ఆనందానికి గురయ్యామంటూ చారిటీ ప్రతినిధి సునీత కుమార్ తెలిపారు. మదర్ థెరిసాకు ఉన్న పేరుప్రఖ్యాతుల వల్ల సెయింట్ హోదా ప్రక్రియకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఏర్పడిందని ఆమె చెప్పారు. సెయింట్‌గా ప్రకటించే ప్రక్రియ సంప్రదాయం మాత్రమేనని, అయితే చాలా ముఖ్యమైనదని ఆర్చిబిషప్ డిసౌజా తెలిపారు. రోమ్‌లో జరిగే కార్యక్రమానికి సిస్టర్ ప్రేమతో పాటు డిసౌజా హాజరవనున్నారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 2న భారీ కృతజ్ఞతా సమావేశం, ప్రార్థనలు నిర్వహించాలని మిషనరీస్ ఆఫ్ చారిటీ భావిస్తోంది. జీవితమంతా పేదలు, రోగుల సేవలో 1910లో మాసిడోనియాలో అల్బేనియా దంపతులకు అంజెజె గోన్క్సే బొజాక్షిహుగా జన్మించిన మదర్ 18 ఏళ్ల వయసులో ఐర్లాండ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి భారత్‌కు వచ్చి మరణించేంతవరకూ ఇక్కడే జీవించారు. పేదలు, రోగుల సేవకే జీవితాన్ని అర్పించిన థెరిసాను క్యాథలిక్కులు పూజ్యనీయురాలిగా భావిస్తారు. సేవాతత్పరతకు గుర్తింపుగా 1979లో ఆమె నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. 1951లో భారత పౌరసత్వాన్ని అందుకున్న మదర్ 87 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 5, 1997న కోల్‌కతాలో మరణించారు. మరణానంతరం మదర్ చేసిన అద్భుతాన్ని 2002లో వాటికన్ గుర్తించడంతో సెయింట్ హోదా ప్రక్రియను 2003లో పోప్ జాన్ పాల్ 2 ప్రకటించారు. ఆ కార్యక్రమానికి దాదాపు 3 లక్షలమంది హాజరయ్యారు. 1998లో కడుపులో కణితితో తీవ్రంగా జబ్బుపడ్డ బెంగాలీ గిరిజన మహిళ మోనికా బెర్సా అనారోగ్యం నుంచి కోలుకుంది. 2008లో బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి మదర్ మహిమతో అనారోగ్యం నుంచి బయటపడ్డాడు. సెయింట్‌గా ప్రకటించేందుకు అవసరమైన రెండు అద్భుతాలు జరగడంతో గత ఏడాది వాటికన్ పరిశీలకులు సెయింట్‌హుడ్ ప్రక్రియలోని చివరి దశను మొదలుపెట్టారు. -
సెయింట్ థెరిసా!
కన్నపేగు తల్లడిల్లుతుంటే ఏ అమ్మ మనసైనా చివుక్కుమంటుంది. ఆ బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకుని లాలిస్తుంది...ఊరడిస్తుంది...బుజ్జగిస్తుంది. పేగు బంధం గొప్పతనమది. అలాంటి మాతృత్వపు పరిమాళాన్ని సమాజంలో లక్షలాదిమందికి పంచడం మాత్రమే కాదు...ఆ విషయంలో ఎందరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచి కనుమరుగైన మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్ ఇస్తున్నట్టు మంగళవారం ప్రకటన వెలువడింది. వాటికన్ మతాచార్యుడు పోప్ ఫ్రాన్సిస్ చేసిన ఈ ప్రకటన కోసమే దేశదేశాల్లోని కోట్లాదిమంది ఆమె అభిమానులు చిరకాలంగా నిరీక్షిస్తు న్నారు. 2003లో ఆనాటి పోప్ జాన్‌పాల్ 2 మదర్‌కు సెయింట్ హోదా ఇచ్చే ప్రక్రి యను ప్రారంభించామని ప్రకటించినప్పుడు ఈ నిరీక్షణ మొదలైంది. రోగగ్ర స్తులకు సేవలందించడానికి, పేద హృదయాలను ఊరడించడానికి, అనాథలకు నీడై నిలవడానికి సరిహద్దులు అడ్డురావని నిరూపించిన ప్రేమమయి ఆమె. ఈ ప్రస్థానంలో సెయింట్‌హుడ్ అనేది ఒక సంప్రదాయకమైన లాంఛనమే కావొచ్చు. ఒక మతంలో లభించే ఉత్కృష్టమైన గౌరవమే కావొచ్చు. కానీ ఆమె చేసిన సేవలకూ, ఆమె స్థాపించిన విలువలకూ, ఆమె నెలకొల్పిన ఆదర్శాలకూ ఏమి చ్చినా తక్కువే అవుతుంది. ప్రపంచం కూటములుగా మారడం, పరస్పర పోటీ పెరగడం, దేశాలమధ్య విద్వేషాలు రాజుకోవడం, అవి ముదిరి యుద్ధాలుగా రూపాంతరం చెందడంవంటి పరిణామాలవల్ల సమాజాలు సంక్షోభంలో కూరుకుపోతాయి. మానవ పరిణామ క్రమంలో రెండు ప్రపంచ యుద్ధాలు సృష్టించిన విధ్వంసం అసాధారణమైనది. ఆ యుద్ధాల పర్యవసానాలు అతి భయంకరమైనవి. ఎంతో వినాశనాన్ని తీసుకొచ్చిన మొదటి ప్రపంచ యుద్ధమే మదర్ థెరిసా లాంటి గొప్ప మానవతామూర్తిని అందించిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ యుద్ధం జనజీవితాల్లో కలిగించిన సంక్షోభాన్ని, అందువల్ల చుట్టూ ఉన్నవారు పడుతున్న ఇబ్బందులనూ, క్షతగాత్రుల రోదనలనూ, వేదనలనూ పసి వయసులో అప్పటికి అంజెజె గోన్క్సే బొజాక్షిహుగా ఉన్న మదర్‌ను తల్లడిల్లజేశాయి. సమాజంలోని అసహాయులకు ఏదో ఒకటి చేయా లని, వారికి అండగా నిలవాలని అప్పుడే ఆమె నిర్ణయించుకున్నారు. వయసు పెరిగేకొద్దీ ఆ భావన మరింతగా బలపడింది. సేవ చేయడానికి నన్‌గా మారడమే మార్గమని పన్నెండేళ్ల ప్రాయంలోనే భావించినా అందుకు వయసు సరిపోదని తెలిసి మరో నాలుగేళ్లు ఆగారామె. పద్దెనిమిదేళ్ల వయసులో ఇల్లు విడిచి ఐర్లండ్ లోని సిస్టర్స్ ఆఫ్ లోరెటోలో చేరిననాటినుంచి 1997లో కోల్‌కతాలో 87 ఏళ్ల వయ సులో మరణించేవరకూ ఆమె సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే ఉన్నారు. భార త్ను భయంకరమైన కరువుకాటకాలు పీడిస్తున్న సమయంలో... పేద జనం రోగాలబారినపడి తల్లడిల్లుతున్న సమయంలో...ఎటుచూసినా దారిద్య్రం తాండ విస్తున్న సమయంలో తన సేవలు ఇక్కడ అవసరమని ఆమె నిర్ణయించుకున్నారు. ఆ సంకల్పంనుంచి ఆమె వెనుదిరగలేదు. మొదట్లో ఉపాధ్యాయినిగా, అనంతరం ప్రిన్సిపాల్‌గా సేవలందించినా ఆ తర్వాత పూర్తిగా వీధి బాలల, నిరుపేదల, రోగగ్రస్తుల సేవలోనే ఆమె గడిపారు. అందుకవసరమని భావించి వైద్యరంగంలో సైతం శిక్షణపొందారు. వారు కుష్టురోగులైనా, మరే ఇతర అంటువ్యాధితో బాధ పడుతున్నా అక్కున చేర్చుకుని ఆదరించారు. గాయాలను శుభ్రపరచడం, కట్టు కట్టడం దగ్గరనుంచి ఎన్నో సేవలందించి అలాంటివారిలో మానసిక స్థైర్యాన్ని నింపారు. అప్పటి కలకత్తా నగర వీధుల్లో ఇలాంటి దృశ్యాలు నిత్యకృత్యం. ఆరో జుల్లో ఇలాంటి సేవలు అందరినీ ఆశ్చర్యపరిచేవి. ఆ తరహా ఆచరణకు ఎందరినో పురిగొల్పేవి. ఈ క్రమంలో ఆమె కొచ్చిన బిరుదులు, పురస్కారాలు ఎన్నెన్నో! 1962లో పద్మశ్రీ పురస్కారం మొదలుకొని జాతీయంగా, అంతర్జాతీయంగా ఆమె అందుకున్న అవార్డులు అన్నీ ఇన్నీ కాదు. 1979లో నోబెల్ శాంతి బహుమతికి థెరిసాను ఎంపిక చేసినప్పుడు తనకా స్థాయి లేదని తిరస్కరించిన వ్యక్తిత్వం ఆమెది. ఆ తర్వాత ఎందరో బతిమాలగా, ఒత్తిడి తీసుకురాగా ఆ పురస్కారాన్ని అందుకోవడానికి అంగీకరించారు. అవార్డుల ద్వారా లభించే నగదును తన సేవా కార్యక్రమాలకే ఆమె వెచ్చించారు. అలాంటి సొమ్ముతోనే మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్ నెలకొల్పి దాని ఆధ్వర్యంలో అనాథాశ్రమాలనూ, ఆస్పత్రులనూ, ధర్మశాలలనూ, ఆహారకేంద్రాలనూ ఏర్పాటుచేశారు. వేలాదిమందికి ఆరోగ్యం చేకూర్చడంతోపాటు వారికవసరమైన తిండి, బట్ట సమకూర్చారు. తనకు జీసస్‌పై నమ్మకం ఉన్నా దానికి అతీతంగా కుల మతాల ప్రసక్తి లేకుండా ప్రతి ఒక్కరినీ తాను నిర్మించిన నిర్మల్ హృదయ్‌లో చేర్చుకున్న విశాల స్వభావం ఆమెది. నిత్యం ఈసడింపులు ఎదుర్కొంటూ, ఎన్నో అవమానాలను చవిచూస్తూ బతుకీడ్చేవారికి ఆపన్నహస్తం అందించడం, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపడం సామాన్యమైన విషయం కాదు. ఈ గడ్డపై జన్మించకపోయినా, దూరతీరాలనుంచి ఇక్కడికొచ్చినా ఈ దేశ ప్రజల కష్టాల్లో పాలుపంచుకొని, వారి కన్నీళ్లను తుడవడానికి మదర్ ప్రయత్నించారు. ఆమె సామాజిక సేవలో స్వార్ధమున్నదని, మతాన్ని వ్యాప్తి చేయడానికి దాన్ని సాధనంగా ఉపయోగించుకున్నారని విమర్శించినవారున్నారు. ఇలాంటి సేవా తత్పరత యధాతథ స్థితి కొనసాగటానికి మాత్రమే తోడ్పడుతుందన్నవారున్నారు. కానీ ఎలాంటివారైనా, వారి సిద్ధాంతాలు ఏవైనా... సేవాభావంతోనే జన హృదయాలను గెలవడం సాధ్యమన్న అంశాన్ని గ్రహించగలిగారు. మదర్ థెరిసా ఈ దేశంలో అడుగిడేనాటికి దాదాపుగా ఉనికిలో లేని స్వచ్ఛంద సంస్థలు ఈరోజు లక్షల్లో ఉండటమే దీనికి తార్కాణం. ప్రభుత్వం దృష్టి సోకని మారుమూల ప్రాంతాల్లో సైతం పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు, అనాథాశ్రమాల వంటివి అంతో ఇంతో చురుగ్గా పనిచేస్తున్నాయంటే అది మదర్ థెరిసా పెట్టిన ఒరవడే. అంతటి మహనీయురాలికి సెయింట్‌హుడ్ లభించడం హర్షించదగింది. -
1998 సెప్టెంబర్ 5 నాకు మరుపురాని రాత్రి
కోలకత్తా: నోబుల్ శాంతి బహుమతి గ్రహీత, మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు మదర్ థెరెసాకు సెయింట్‌హుడ్ ప్రకటించడం పట్ల కోలకత్తా దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ మోనికా బెస్రా (50) సంతోషం వ్యక్తం చేశారు. మానవతామూర్తి, ప్రపంచ శాంతిదూత మదర్ థెరిస్సా తనకు దైవంతో సమానమని ఆమె అభివర్ణించారు. తన అద్భుతమైన శక్తితో క్యాన్సర్ మహమ్మారి నుంచి తనకు విముక్తి కల్పించారని కొనియాడారు. 1998 సెప్టెంబర్ 5వ తేదీ తనకు మరుపురాని రాత్రి అని మోనికా బెస్రా తెలిపారు. మదర్ ఫోటోనూ చూస్తున్న సందర్భంగా... తెల్లటి కాంతి కిరణాలతో పాటు, అపురూపమైన వెలుగును దర్శించానని మోనికా బెస్రా గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అద్భుతమైన శక్తి ఏదో తనను ఆవహించి స్పృహ కోల్పోయానన్నారు. మరుసటి ఉదయానికి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి కణాలు నాశనమైపోయాయని బెర్సా తెలిపారు. నిజంగా ఇదొక మర్చిపోలేని అద్భుతమన్నారు. ఈ ఘటనతో మదర్ థెరిస్సాకు సెయిండ్ హుడ్ దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రాణాంతకమైన మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న బ్రెజిల్ వ్యక్తికి పూర్తిగా ఆరోగ్యం వంతుడిని చేయడాన్ని మొదటి అద్భుతంగా, 17 ఏళ్లుగా ఒవేరియన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నమోనికా బెస్రాకు స్వస్థత చేకూరడం రెండవ అద్భుతంగా గుర్తించారు. మదర్ థెరిస్సా తన అద్భుత దివ్యశక్తితో వీరిద్దరిని దీవించినట్లు పోప్ పేర్కొన్న విషయం విదితమే. తద్వారా ఆమెకు అద్భుతమైన దైవశక్తి ఉన్నట్టుగా అంగీకరించినట్టు తెలిపారు. 2016 సంవత్సరంలో మదర్ థెరిస్సా దైవదూతగా అవతరించనున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరిగే కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ను అధికారికంగా ప్రకటించనున్నట్లు ఇటలీకి చెందిన క్యాథలిక్ పత్రిక అవినైర్ ప్రచురించింన సంగతి తెలిసిందే. -
మహనీయుల మాటల్లో క్రీస్తు
అత్యుత్తమ గురువు! మానవాళికి లభించిన అత్యుత్తమ గురువుల్లో యేసు క్రీస్తు ఒకరు. భగవంతునితో క్రీస్తుకు గల సామీప్యానికి ఆయన జీవితమే నిదర్శనం. భగవంతుని సంకల్పాన్నీ, శక్తినీ యేసు బహిర్గతం చేసినట్లు వేరెవరూ చేయలేదు. అందుకే నేను ఆయనను దేవుని కుమారునిగా భావిస్తాను. - మహాత్మాగాంధీ ప్రతి మనిషీ క్రీస్తే! నేను మనిషిని మనిషిగా విశ్వసిస్తాను. అందుకే నాకు ప్రతి మనిషీ సాక్షాత్తూ యేసుక్రీస్తే. - మదర్ థెరిసా ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాడు! అలెగ్జాండర్, సీజర్, నేను పెద్ద పెద్ద సామ్రాజ్యాలను స్థాపించాం. అయితే, మేమంతా దేనిపై ఆధారపడ్డాం? బలప్రయోగంపై. కానీ క్రీస్తు అలా కాదు, ప్రేమ పునాదుల పైనే తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. - నెపోలియన్ బోనాపార్టే దేవుడే మనిషిగా అవతరించాడు! యేసుక్రీస్తు దేవుడు. సాక్షాత్తు దేవుడే మనిషిగా అవతరించాడు. ఆయన తనను తాను చాలా రూపాల్లో చాలా కాలాల్లో వ్యక్తం చేసుకున్నాడు. ఆ రూపాలనే మనం ఆరాధిస్తాం. మానవ రూపంలో అవతరించినందుకే మనం యేసును ఆరాధిస్తాం. - స్వామి వివేకానంద అత్యంత ప్రభావం కలవాడు! నేను చరిత్రకారుడిని. విశ్వాసిని కాదు. నజరేతుకు చెందిన ఈ ప్రబోధకుడు చరిత్రకు తిరుగులేని కేంద్రంగా మారాడు. యేసు క్రీస్తు చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. - హెచ్.జి.వెల్స్, అమెరికన్ చరిత్రకారుడు దేవుడు అందరివాడు! ఒకే ప్రదేశానికి అనేక మార్గాలుంటాయి. అలాగే, మనకన్నా గొప్ప శక్తి, అతీతమైన శక్తి ఉంది. ఇలాంటి నమ్మకాలే మనల్ని కలుపుతున్నాయి. దేవుడు ప్రపంచంలోని అయిదింట నాలుగువంతుల ప్రజల్ని నరకానికే పరిమితం చేస్తాడని నేను నమ్మను. భారతదేశంలో క్రైస్తవ మత విశ్వాసంతో ఎన్నడూ సంబంధం పెట్టుకోనంత మాత్రాన హిందువుల బిడ్డను శాశ్వతంగా దహించివేస్తాడనీ అనుకోను. అలా అనుకోవడం నా ధార్మిక దృక్పథానికి విరుద్ధం. మా ఇంట్లో బైబిల్, ఖురాన్, భగవద్గీత మూడూ మా పుస్తకాల అరలో గ్రీకు, నార్వే, ఆఫ్రికన్ పురాణ గ్రంథాల పక్కనే ఉంటాయి.’’ - బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్షుడు -
మదర్ థెరిసా దైవదూత
ధ్రువీకరించిన వాటికన్ సిటీ వచ్చే ఏడాది సెయింట్‌హుడ్ కోల్‌కతా: భారత రత్న, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసాను దైవదూత(సెయింట్)గా వాటికన్ సిటీ ధ్రువీకరించినట్లు మిషనరీస్ ఆఫ్ చారిటీ అధికార ప్రతినిధి సునీతా కుమార్ తెలిపారు. వైద్య రంగంలో అద్భుతాలు సృ ష్టించిన మదర్‌కు ఈ హోదా దక్కినట్లు వెల్లడించారు. మదర్‌లోని అతీత శక్తిని పోప్ గుర్తించినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 4న రోమ్‌లో ఆమెకు అధికారికంగా ఈ హోదా ఇవ్వనున్నట్లు క్యాథలిక్ పత్రిక అవెనైర్ ప్రకటించింది. మదర్‌కు సెయింట్‌హుడ్ దక్కడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. మిషనరీస్ ఆఫ్ చారిటీకి అభినందనలు తెలిపారు. మాసిడోనియాలో 1910లో జన్మించిన మదర్ కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి 45 ఏళ్లపాటు పేదలు, రోగులకు విశిష్టమైన సేవలందించారు. 1951లో భారత పౌరసత్వం స్వీకరించారు. 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. 1997లో కోల్‌కతాలో తుదశ్వాస విడిచారు. -
మదర్‌కు నోబెల్ శాంతి బహుమతి
ఆ నేడు 1979 అక్టోబర్ 17 నార్వేలో గల నోబెల్ కమిటీ మదర్ థెరిస్సాకు శాంతి బహుమతిని ప్రకటించింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ బహుమతిని జాతి, కుల, మత, లింగ, వర్ణ, వర్గ వివక్షలు లేకుండా అవసరమైన వారికి ఆపన్న హస్తం అందిస్తూ, ప్రజలందరి మధ్యా, శాంతి, సుహృద్భావనలకు బాటలు వేస్తూ మదర్ థెరిస్సా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆమెను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. సమాజంలో అట్టడుగున అణగారిన బలహీన వర్గాల వారికి, నిర్భాగ్యులకు నిరుపమానమైన సేవలు అందిస్తూ, అందరినీ అమ్మలా ఆదరిస్తూ విశ్వశాంతికి తోడ్పడుతున్న ఈ విశ్వమాతను ఈ పురస్కారానికి ఎంపిక చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. -
ఇక పిల్లల్ని దత్తత ఇవ్వం!
కోల్‌కతా: కరుణామూర్తి మదర్ థెరిస్సా 65 ఏండ్ల కిందట స్థాపించిన ద మిషినరీస్ ఆఫ్ చారిటీ సంస్థ పిల్లల్ని దత్తత ఇవ్వడం మానుకోవాలని నిర్ణయించింది. పిల్లల దత్తత విషయమై కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాల నేపథ్యంలో రెండు నెలల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నా.. దానిని శనివారం ప్రకటించింది. తమ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అనాథ, అభాగ్య పిల్లల బాగోగులు చూసుకోవడానికి ముందుకొచ్చేవారికి మిషినరీస్ ఆఫ్ చారిటీ సంస్థ వారిని దత్తత ఇచ్చేది. మేనకాగాంధీ నేతృత్వంలోని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వశాఖ పిల్లల దత్తత విషయమై కొన్ని నిబంధనలతో తాజా మార్గదర్శకాలను జారీచేసింది. ఈ నేపథ్యంలో మదర్ థెరిస్సా నిర్దేశించిన ప్రమాణాలను అమలుచేస్తూ నూతన మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవడం కష్టం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మిషనరీ ఒక ప్రకటనలో తెలిపింది. తాము నిర్వహిస్తున్న అడాప్షన్ కేంద్రాలను స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. మిషనరీకి 19 అడాప్షన్ కేంద్రాలు ఉన్నాయి. సింగిల్ పేరెంట్, గే, లెస్బియన్ వంటివారికి పిల్లల్ని దత్తత ఇవ్వరాదని చారిటీ వ్యతిరేకించిందనే వార్తలు వచ్చాయి. అయితే 2011 మార్గదర్శకాల్లోనూ, 2015 మార్గదర్శకాల్లోనూ సింగిల్ పేరెంట్కు దత్తత ఇవ్వవచ్చునని సూచించింది. అయితే గే, లేస్బియన్ వంటివారి గురించి ప్రస్తావించలేదు. -
ఆ నేడు 7 అక్టోబర్, 1950
వెలుగు దీపం ‘ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసేముందు- తినడానికి ఏమీ లేని పేదల గురించి ఆలోచించు’. తనకు అసౌకర్యంగా, బాధగా అనిపించినప్పుడు తన గురించి కాకుండా కోట్లాది మంది దీనుల గురించి ఆలోచించారు మదర్ థెరిసా. ఆ ఆలోచనే కలకత్తాలో ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’గా రూపుదిద్దుకుంది. వేల కిలోమీటర్ల దూరమైనా...ఒక్క అడుగుతో మొదలైనట్లు 13 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తమైంది. ఆకలితో అలమటించేవాళ్లు, వ్యాధిగ్రస్తులు, పేదవాళ్లు, నిరాశ్రయులకు ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ వెలుగు దీపం అయింది. కలకు, ఆ కలను నిజం చేసుకునే వాస్తవానికి మధ్య దూరం ఉండొచ్చు. అది కొందరికి అగాధంలా కనబడవచ్చు. సంకల్పబలం ఉన్నవాళ్లకు అది సులభం కావచ్చు. ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ రాత్రికి రాత్రే పుట్టింది కాదు. ఆలోచన నుంచి ఆచరణ నుంచి, కష్టాల దారిలో నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నిర్మాణాత్మక సేవాదృక్పథం. -
సిస్టర్ నిర్మల కన్నుమూత
* మదర్ థెరిసా అనంతరం మిషనరీస్ ఆఫ్ చారిటీ సారథి * అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన నిర్మల * మదర్ హౌస్‌కు భౌతికకాయం... నేడు అంత్యక్రియలు * రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, సోనియా, రాహుల్‌ల సంతాపం కోల్‌కతా: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా మరణానంతరం మిషనరీస్ ఆఫ్ చారిటీ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిస్టర్ నిర్మలా జోషి మంగళవారం కోల్‌కతాలో కన్నుమూశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. సిస్టర్ నిర్మల కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. పరిస్థితి క్షీణించటంతో మంగళవారం ఉదయం కన్నుమూశారని మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రతినిధి కలకత్తా ఆర్చిబిషప్ ఫాదర్ థామస్ డిసౌజా పేర్కొన్నారు. ఆమె భౌతిక కాయాన్ని బుధవారం ఉదయం మదర్ హౌస్‌కు తీసుకువస్తామని.. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. సిస్టర్ అస్తమించిన వార్త తెలియగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెంట్ జాన్స్ చర్చికి వెళ్లి నివాళులర్పించారు. సిస్టర్ జీవితమంతా మానవాళి సేవకు అంకితంచేశారని మమత కొనియాడారు. మదర్ థెరిసా మరణించిన తర్వాత ఆరు నెలలకు 1997 మార్చి 13న సిస్టర్ నిర్మల మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్‌గా ఎంపకయ్యారు. ఆమె వారసురాలిగా సిస్టర్ మేరీ ప్రేమను 2009 ఏప్రిల్‌లో కోల్‌కతాలో జరిగిన జనరల్ చాప్టర్ సమావేశంలో ఎన్నుకున్నారు. సిస్టర్ నిర్మల మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. పేదలకోసం అంకితం చేసిన ఆమె జీవితం స్ఫూర్తి దాయకమని ప్రణబ్ పేర్కొన్నారు. ‘పేదలు, అణగారిన వారి సేవకు, పరిరక్షణకు సిస్టర్ నిర్మల తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అని మోదీ పేర్కొన్నారు. మానవాళికి సేవలో భాగంగా ఆమె కలుసుకున్న లక్షలాది ప్రజలకు ఆమె లేని లోటు తీర్చలేనిదని సోనియా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మదర్ థెరిసా కృషిని సిస్టర్ నిర్మల అంకితభావంతో, గౌరవప్రదంగా కొనసాగించారని రాహుల్ ట్విటర్లో పేర్కొన్నారు. స్ఫూర్తి ప్రదాత.. కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా అనేక చారిటీ సంస్థలను నిస్వార్థ సేవా దృక్పథంతో నిర్వహించిన నిర్మల స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోతారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శ్లాఘించారు. చరితార్థురాలు: చంద్రబాబు సిస్టర్ నిర్మల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. మదర్ థెరిసా సేవామార్గంలో తన జీవితాన్ని ధన్యం చేసుకున్న నిర్మల చరితార్థురాలని కొనియాడారు. పేదల పాలిట పెన్నిధి: వైఎస్ జగన్ సిస్టర్ నిర్మల మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. నిరుపేద లు, అణగారిన వర్గాలతో పాటు బాధల్లో ఉన్న వారి సేవలకే తన జీవితాన్ని అంకితం చేసిన సిస్టర్ నిర్మల మృతి చెందడం తీరని దుఃఖాన్ని కలుగ జేసిందని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. -
అపశ్రుతి అవసరమా?
నోబెల్ బహుమతిని పుచ్చుకున్నప్పుడు మదర్ థెరిస్సాని అడిగారట: ప్రపంచ శాంతి కోసం ఏం చెయ్యాలి? ఆమె సమాధానం: ‘‘మీ యింటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించండి!!’’ ప్రేమ మీ పక్కన ఉన్న వ్యక్తితో పంచుకోవడంతో ప్రారంభంకావాలి. నేను నూటికి నూరుపాళ్లూ హిందువును. సరిగ్గా 67 సంవ త్సరాల కిందట కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ స్కూలు (సీబీ ఎం హైస్కూలు, విశాఖప ట్నం)లో చదువుకున్నాను. మాకు బైబిలు చెప్పే టీచరు పేరు ఇప్పటికీ గుర్తుంది - దైవాదీనం మేష్టారు. రోజూ ప్రార్థనలు చేసేవాళ్లం. ‘ఏసు హల్లెలూయ, హోసన్న రాజు గెల్చిలేచివచ్చెన్’ పాడిన గుర్తు. ఒక యాత్రికుడుగా వాటికన్‌కి వెళ్లాను. వారణాశికి ఇద్దరిని చూడటానికే వెళ్లాను. కాశీవిశ్వేశ్వరుడు. బిస్మిల్లాఖాన్. ఆయన ఇంటికి వెదుక్కుని వెళ్లి నేనూ మావిడా పాదాభివందనం చేశాం. మా కుటుంబ పురోహితుడు గోరంట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు మాకు ఫొటోలు తీశారు. నాకు మతమౌఢ్యం లేదని నిరూపించుకోడానికే ఈ సాక్ష్యాలు. ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్‌గారు మదర్ థెరిస్సా లక్ష్యం మత మార్పిడిని ప్రోత్సహించడమేన న్నారు ఈ మధ్య. ఇది బొత్తిగా అనౌచిత్యం. అనావ శ్యకం. కొందరు మహానుభావుల సేవల్ని ‘మతం’ స్థాయికి దిగజార్చడం అన్యాయం. తనది కాని దేశంలో తను ఎరగని కుష్టురోగుల కురుపుల్ని శుభ్రం చేసి, కట్లు కట్టి, హెచ్ఐవీ రోగుల అవసానానికి ఉపశమనాన్ని కల్పించి, గుడ్డివాళ్లకి, నిరా శ్రయులకి, వృద్ధులకి, తాగుబోతులకి, పేదలకి, వర దల్లో, కరువుల్లో నిరాశ్రయులయిన వారికి, అభం శుభం తెలియని పుట్టురోగులకీ-ప్రేమనీ, ఆదరణనీ పంచిన ‘అమ్మ’-450 దేశాలకు ఈ సేవలను విస్తరించింది. రాజకీయ సిద్ధాంతాలు, కులాలకు అతీతంగా అమ్మని ప్రపంచం అక్కున చేర్చుకుంది. కలకత్తాలో కమ్యూనిస్టుల ఊరేగింపు జరుగుతున్నప్పుడు, అమ్మ అటునుంచి వెళ్తూంటే కమ్యూనిస్టు కార్యకర్తలు ఊరేగిం పులోంచి బయటకి వచ్చి ఆమె పాదాలకు నమస్కరించి మళ్లీ ఊరేగింపులో చేరడం సామాన్యమైన దృశ్యం. మానవత్వానికి సిద్ధాంతపరమైన ఎల్లలు లేవని నిరూ పణ అయిన అరుదయిన సందర్భమది. ఒకరోజు మదర్‌కు రోడ్డు మీద ఒక ముష్టివాడు తారసపడ్డాడు. ‘‘ప్రతీవారూ నీకేదో యిస్తారమ్మా. ఇవా ళ నేనూ యిస్తాను. నాకున్నదంతా యిస్తాను’’ అన్నా డు. ఏమిటది? ఆ రోజు అతని చేతిలో ఓ చిన్న నాణెం పడింది. ‘‘పేదలకు ఇవ్వండి మదర్’’ అంటూ ఆమె చేతిలో పెట్టాడు. మదర్ చలించిపోయింది. పక్కన ఉన్న సిస్టర్‌తో అంది. ‘‘ఈ రోజు ఈ ముష్టివాడు నాకు నోబెల్ బహుమతికన్న గొప్ప బహుమతిని యిచ్చాడు. ఎందు కంటే తనకున్నదంతా సమర్పించుకున్నాడు. ఈ రాత్రి అతనికి ఈ నాణెం తప్ప మరేదీ ఎవరూ యిచ్చి వుం డరు. ఆకలితో నిద్రపోయి ఉంటాడు. సాటి పేదవాడి ఆకలిని తీర్చడానికి తను ఆకలిని ఆహ్వానించడం ఈ లోకంలో గొప్ప త్యాగం’’. ఓసారి పన్నెండుమంది అంగవైకల్యం ఉన్న -స్పాస్టిక్ పసివారిని ఆమె దత్తత తీసుకున్నారు. తామే మిటో, తమ లోపమేమిటో తెలియని నిస్సహాయులు ఆ బిడ్డలు. వరసగా కూర్చున్న అందర్నీ బుగ్గలు నిమిరి అక్కున చేర్చుకున్న ఆ తల్లిని టీవీలో చూస్తూ నేను ఏడ్చేశాను. ఓ ప్రేమమూర్తి ఆదరణ వారికి దక్కిందని ఆ పసివారికి తెలియదు. ఈ ప్రపంచంలో తాము సేద దీర్చుకోగల స్థలం మరొకటి లేదని వారికి తెలీదు. ప్రేమ ఎదుటి వారికి ఎరుక పరిచి పంచే ఆనందం కాదు. ఎదుటి వ్యక్తి ప్రమేయం లేకుండా ఆవరించే ఆర్ద్రత. ఇంకా అపూర్వమైన అనూహ్యమైన సంఘటన. 1982లో ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా గెరిల్లాలు ఒకరి నొకరు మారణహోమం చేసుకుంటూంటే అమ్మ రెండు పక్షాల మధ్య ధైర్యంగా నిలిచి బాంబులతో కుప్పకూలిన ఓ ఆసుపత్రిలో యిరుక్కున్న 37 మంది పసివారిని కాపా డి బయటకు తెచ్చారు. మత మౌఢ్యంతో నిప్పులు కక్కి, ఒకరినొకరు చంపుకునే రెండు దేశాల శక్తులు ఓ మాన వత్వపు మధ్యవర్తిత్వానికి తలవంచిన అపూర్వమైన క్షణమది. నోబెల్ బహుమతిని పుచ్చుకున్నప్పుడు ఆవిడని అడిగారట: ప్రపంచ శాంతిని వర్ధిల్లజేయాలంటే ఏం చెయ్యాలి? ఆమె సమాధానం: ‘‘మీ యింటికి వెళ్లి మీ కుటుం బాన్ని ప్రేమించండి!!’’ ప్రేమ మీ సమక్షంలో మీ పక్కన ఉన్న వ్యక్తితో పంచుకోవడంతో ప్రారంభం కావాలి. ఓ గొప్ప సత్యాన్ని జీవితమంతా ఆచరించి నిరూపించిన తల్లి ఆమె. భారతరత్న. నోబెల్ బహుమతి గ్రహీత. ప్రపంచంలో ప్రతీ దేశం తమ అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చి తన కృతజ్ఞతను తెలుపుకుంది. కన్నీరు అంతర్జాతీయ భాష. మతం దాన్ని అన్వ యించే ప్రాంతీయమైన వైద్యం. ప్రపంచంలో సర్వాంత ర్యామియైన దుఃఖానికి అంతే విస్తృతమైన చికిత్సను చేసిన ఒకే ఒక దేవదూత మదర్. కాగా, మానవత్వానికి మతం లేదు. మానవ సేవకు మతం లేదు. మహనీ యతకు మతం లేదు. - గొల్లపూడి మారుతీరావు -
భగవత్ నిజమే చెప్పారు: శివసేన
మదర్ థెరీసాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు శివసేన పార్టీ బాసటగా నిలిచింది. ఆయన కొంత నిజమే చెప్పారని ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది. విదేశాలనుంచి మిషనరీలుగా వస్తున్న క్రైస్తవ సంస్థలు దేశంలో చాలామందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాయని శివసేన ఆ పత్రికలో వ్యాఖ్యానించింది. ముస్లింలు కత్తితో బెదిరించి మత మార్పిడి చేస్తే.. క్రైస్తవులు డబ్బు, సేవల పేరిట మతమార్పిడిలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ ఆరోపించింది. అయితే, మనమంతా మదర్ థెరిసా సేవలను గుర్తించామని, ఆమెలాగే చాలామంది కూడా సేవలందించారని, కానీ ఎలాంటి మత మార్పిడిలకు దిగలేదని పేర్కొంది. -
ఆర్ఎస్ఎస్ చీఫ్‌పై విమర్శల వెల్లువ
న్యూఢిల్లీ: మదర్ థెరిసా మతమార్పిడి కోసమే పేదలకు సేవ చేశారన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై మంగళవారం పలు క్రైస్తవ సంస్థలు, బీజేపీయేతర పార్టీలు నిప్పులు చెరిగాయి. విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ కూడా దద్దరిల్లింది. జీవితాన్ని పేదల సేవకే అంకితం చేసిన థెరిసాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని కోల్‌కతా మిషనరీస్ ఆఫ్ చారిటీ, జాతీయ మైనారిటీల కమిషన్, తిరువనంతపురం కేథలిక్ చర్చి అధికారులు మండిపడ్డారు. భాగవత్ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు లోక్‌సభలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని విపక్ష సభ్యులు లేవనె త్తగా స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చకు నిరాకరించారు. థెరిసా పేదల ఆశాజ్యోతి అని వాటికన్ పేర్కొంది. -
'థెరీసా పవిత్రమూర్తి.. ఆమెను వదిలేయండి'
భారతరత్న మదర్ థెరిసాపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. థెరీసా పవిత్ర మూర్తి అని దయచేసి ఆమె విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు. మదర్ థెరీసాను వివాదాల్లోకి లాగొద్దని, ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా వదిలేయాలని కోరారు. తాను కోల్‌కతాలోని నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో థెరీసాతో కలిసి కొంతకాలం పనిచేసినట్లు కేజ్రీవాల్ చెప్పారు. అలాగే, సీపీఎం కూడా భగవత్ వ్యాఖ్యల విషయం స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలతో ప్రపంచంలో భారత్‌కు ఉన్న గొప్ప ఇమేజ్ తగ్గుతుందని పేర్కొంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసి భగవత్ కొత్తగా ఏం నిరూపించుకోవాలనుకుంటున్నారో అర్థం కావాడం లేదంది. అలాగే ఢిల్లీ కేథలిక్ అర్కడైయాసిస్ ఫాధర్ సవారిముత్తు స్పందిస్తూ మదర్ థెరీసాపై ఇలాంటి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఆమె జీవితం మొత్తాన్ని సేవకే అంకితం చేసినట్లు తెలిపారు. కాగా, మదర్ థెరీసా సేవ చేయడం వెనుక మతమార్పిడి అంశం ఉందని భగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
'మదర్ థెరీసా మతమార్పిడే లక్ష్యంగా పనిచేశారు'
భరత్ పూర్: భారతరత్న మదర్ థెరీసాపై ఆర్సెసెస్ చీఫ్ మోహన్ భగవత్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె పేదలకు చేసిన సేవలకు వెనుక మతమార్పిడి అంశం ముడిపడి ఉందని తాజాగా వ్యాఖ్యానించారు. పేదలకు సేవ చేసి వారిని క్రైస్తవ మతంలోకి మార్చడమే ఆమె ప్రధాన ఉద్దేశమని భగవత్ వ్యాఖ్యానించారు. థెరీసా సేవలు ప్రశంసదగినవే అయినప్పటికీ ఆమె వాటిని మత మార్పిడికి ఒక సాధనంగా వినియోగించుకున్నారన్నారు. రాజస్థాన్ లోని బజేరా గ్రామంలో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఆపనాఘర్ సమావేశంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సేవ పేరుతో మతమార్పిడిన కొనసాగించడం ఆ సేవకు విలువ తగ్గించడమే అవుతుందన్నారు. -
అమృతమూర్తి
ఎనిమిది మంది పిల్లలున్న ఒక హైందవ కుటుంబం ఆకలితో నకనకలాడుతోందని ఒక వ్యక్తి వచ్చి మదర్ థెరిస్సాకు చెప్పాడు. కొన్ని రోజులుగా వాళ్లు పస్తులుంటున్నారని ఆవేదన చెందాడు. మదర్ వెంటనే బియ్యం మూటతో అక్కడకు వెళ్లారు. పిల్లల కళ్లు ఆకలిని ప్రతిఫలిస్తున్నాయి. ఇంటావిడ ఎంతో కృతజ్ఞతతో బియ్యం తీసుకుని, రెండు సమభాగాలు చేసింది! ఒక భాగాన్ని సంచిలో వేసుకుని బయటికి వెళ్లి వచ్చింది. ‘‘అంత హడావుడిగా ఎక్కడికి వెళ్లావు’’ అని అడిగారు మదర్. ‘‘వాళ్లు కూడా ఆకలితో ఉన్నారు’’ అని సమాధానం! వెంటనే మదర్‌కు అర్థం కాలేదు. ఆమె చెప్తోంది పొరుగున్న ఉన్న ముస్లిం కుటుంబం గురించి. మదర్ తెచ్చిన బియ్యంలో సగం... వాళ్లకు ఇచ్చి వచ్చింది! ఆ సాయంత్రం మదర్ మళ్లీ బియ్యం తీసుకెళ్లలేదు. పంచుకోవడంలోని ఆనందాన్ని వాళ్లకు మిగలనివ్వడం న్యాయమనిపించింది మదర్‌కు. తల్లి నుంచి ఆహారం రూపంలో లభించిన ప్రేమతో పిల్లలూ గెంతులేస్తున్నారు. ‘‘ప్రేమ అలా ఇంటి నుంచే మొదలౌతుంది. ఇంటి నుంచి ఇంటికి, మనిషి నుంచి మనిషికి విశ్వవ్యాప్తం అవుతుంది’’ అంటారు మదర్ థెరిస్సా. ఇండియా వచ్చి ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ (కోల్‌కతా) స్థాపించి మదర్ థెరిస్సాగా భారతీయ సంస్కృతిలో మమేకం అయిన అల్బేనియా సంతతి అమ్మాయి.. యాగ్నెస్ గాంగ్జే బోయాజూ (మదర్ అసలు పేరు). మదర్ సాధించిన నోబెల్ శాంతి బహుమతి, భారతరత్న అవార్డులు రెండూ కూడా ‘మానవతావాది’గా ఆమెకున్న ప్రఖ్యాతికి ఇంచుమించు మాత్రమే సరిసాటి అనాలి. మదర్ ఏనాడూ తనకొక ప్రత్యేకమైన గుర్తింపును కోరుకోలేదు. ప్రేమ కోసం తపిస్తున్న వారికి తన ఆప్యాయమైన అమృత హస్తాన్ని అందించడమూ మానలేదు. అన్నం లేకపోవడం కన్నా ఆప్యాయత కరవవడం అసలైన పేదరికమని మదర్ నమ్మారు. ప్రేమకు, పలకరింపులకు నోచుకోని నిర్భాగ్యులకు తన జీవితాన్ని అంకితం చేశారు. మనుషుల్లో మంచితనం ఉందనీ, పంచుకుంటే అది విశ్వవ్యాప్తం అవుతుందనీ ప్రబోధించారు. ఓసారి కొందరు అమెరికన్ ప్రొఫెసర్లు కోల్‌కతాలో మదర్ థెరిస్సా నడుపుతున్న మిషనరీ హోమ్‌లను సందర్శించడానికి వచ్చారు. అక్కడ.. మరణావస్థలో ప్రశాంతంగా కన్నుమూసినవారిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ‘‘ఎలా సాధ్యం?’ అని అడిగారు. వాళ్లంతా అమెరికాలోని వేర్వేరు యూనివర్శిటీల నుంచి వచ్చినవారు. తిరిగి వెళ్లే ముందు - ‘‘మదర్... గుర్తుంచుకునే ఒక మాట చెప్పండి’’ అని అడిగారు. ‘‘ఒకరికొకరు ఎదురుపడినప్పుడు నవ్వుతూ పలకరించుకోండి. కనీసం చిరునవ్వుతో చూసుకోండి. ఇందులో సాధ్యం కానిదేమీ లేదు. మొదట కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడండి. బయట కూడా అదే అలవాటవుతుంది. అప్పుడు ప్రపంచమే ఒక కుటుంబమౌతుంది’’ అని చెప్పారు మదర్. విస్మయంగా చూశారు వాళ్లు. ‘‘దేవుడి మహిమను కూడా తరచు మనం అలాగే నమ్మలేనట్లు చూస్తుంటాం. దేవుడి గొప్పతనం, ప్రేమ గొప్పతనం, పలకరింపు గొప్పతనం, ప్రశాంతత గొప్పతనం, చిరునవ్వు గొప్పతనం తెలుసుకోవాలంటే ఎవరికైనా సేవ చేసి చూడండి. గొప్ప గొప్ప పనులు చేయనవసరం లేదు. చిన్న పనులనే గొప్ప ప్రేమతో చెయ్యండి చాలు’’ అంటారు మదర్. విశ్వమాతగా అవతరించిన ఈ క్యాథలిక్కు మతస్థురాలు 1910 ఆగస్టు 26న మేసిడోనియాలో జన్మించారు. 87 ఏళ్ల వయసులో 1997 సెప్టెంబర్ 5న కోల్‌కతాలో కన్నుమూశారు. -
దేవుడి నిరీక్షణ!
దైవికం - మనిషి తనను ఎలా అర్థం చేసుకోవాలని దేవుడు అనుకుంటున్నాడో, మదర్ థెరిస్సా దేవుడి గురించి మాట్లాడిన ప్రతి మాటలోనూ, ఆమె చేసిన ప్రతి సేవలోనూ పరోక్షంగా మనకు వ్యక్తమౌతున్నట్లుగా ఉంటుంది. థెరిస్సా మరణించి నేటికి పదిహేడేళ్లు. ఇన్నేళ్లలోనూ ప్రపంచం ఆధ్యాత్మికంగా మునుపటి బలంతోనే ఉన్నదంటే థెరిస్సా తన సేవలతో, సాంత్వన వచనాలతో మనిషిని దేవుడికి చేరువగా తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలే కారణం అనుకోవచ్చు. ఇప్పటికీ, ఎప్పటికీ, దేశాల మధ్య యుద్ధాల్లో మదర్ ప్రవచనం ఒక శాంతి శతఘ్నిలా గర్జిస్తూనే ఉంటుంది. ద్వేషాల మధ్య సాగుతున్న మనిషి మనుగడలో మదర్ సేవలు జ్ఞాపకాల లేపనాలై మానవ హృదయాలను మృదువుగా స్పృశిస్తూనే ఉంటాయి. ఓసారి మదర్ని ఎవరో అడిగారు, ‘‘ఇంతగా శాంతిని ప్రబోధిస్తున్నారు కదా, యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల్లో మీరెందుకు ప్రత్యక్షంగా పాల్గొనరు?’’ అని. అందుకు మదర్ సమాధానం : ‘‘నేనెప్పటికీ అలా పాల్గొనను. శాంతి అనుకూల ప్రదర్శన జరపండి, వచ్చి చేరుతాను’’. ఆకలితో అలమటించే వారికంటే కూడా ప్రేమ కోసం పరితపించి పోతున్నవారు ఈ లోకంలో ఎక్కువ మంది ఉన్నారని మదర్ నమ్మారు. వీళ్లందరికోసం మనం గొప్ప పనులేమీ చేయనవసరం లేదు కానీ, మనకు చేతనైన పనినే గొప్ప ప్రేమతో చేస్తే చాలునని చెప్పారు. సాటి మనిషిపై చూపే ప్రేమ.. దేవుడిని సంతోషపెడుతుందని అన్నారు. ఆధ్యాత్మిక గ్రంథాలలోని సారమంతా మదర్ చిరునవ్వులో కనిపిస్తుంది! ఆమె కంటి వెలుగై ప్రసరిస్తుంది. ‘నా’ అని ఆమె చెప్పుకునే ప్రతి మాటా యావత్ మానవాళి తరఫున దేవుడికి నివేదిస్తున్నట్లు ఉంటుంది కానీ, దేవుని తరఫున ప్రవచిస్తున్నట్లు కనిపించదు. ‘‘స్వర్గం కచ్చితంగా ఇలా ఉంటుందని నాకు తెలీదు. కానీ ఒక సంగతి చెప్పగలను. మనం చనిపోయి, దేవుని దగ్గరకు వెళ్లినప్పుడు ‘నీ జీవితంలో నువ్వెన్ని మంచి పనులు చేశావని ఆయన అడగడు. నువ్వా పనులను ఎంత ప్రేమగా చేశావు?’ అని మాత్రమే అడుగుతాడు’’ అంటారు మదర్. పెట్టే ముద్ద ఎంత ప్రేమగా పెడుతున్నాం? కట్టే కట్టు ఎంత ప్రేమగా కడుతున్నాం? ఇచ్చే రూపాయి ఎంత ప్రేమగా ఇస్తున్నాం అన్నదే ముఖ్యమని మదర్ భావన. కష్టాలన్నవి దేవుడు సృష్టించినవి కావని చెబుతూ, ‘‘నేను తట్టుకోలేని బాధను దేవుడు నాకు ఇవ్వడని తెలుసు. అయినా నా మీద ఆయన మరీ అంత నమ్మకం (తట్టుకోగలదని) పెట్టుకోకూడదని నా ఆశ’’ అని నవ్వుతూ అంటారు మదర్. ఆమె ఉద్దేశం ఏమిటంటే, దేవుడు మరీ మనం తట్టుకోలేని పరీక్షలేవీ పెట్టడనీ, ఒక వేళ పెట్టినా, ఆ పరీక్ష కూడా మనం తట్టుకుని నిలబడేందుకే తోడ్పడుతుందని! ఇదే మాటను బైబిల్లో అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇలా చెప్తాడు. ‘‘సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును (10:13). అవసరంలో మీ దగ్గరకు వచ్చినవారెవరైనా, వెళ్లేటప్పుడు వచ్చినప్పటికంటే మరింత సంతోషంగా, మరింత మెరుగ్గా ఉండాలని మదర్ చెప్తారు. ఎలాగంటే, మనలో దేవుడి కరుణ (ఆ వచ్చిన మనిషి పట్ల) వ్యక్తం అవ్వాలట. మన ముఖంలో, మన కనులలో, మన చిరునవ్వులో కారుణ్యం ప్రతిఫలించాలట. ‘‘దేవుని కారుణ్యం, ప్రేమ.. జీవితాంతం నీ ద్వారా చుట్టుపక్కల వారికి విస్తరించాలి. అందుకు కొన్ని మాటలు అవసరం అయితే కావచ్చు. అయితే ఆ కొన్నిటిని మించి ఒక్కమాటైనా ఎక్కువ మాట్లాడకు’’ అంటారు మదర్. అంటే ప్రేమ, కారుణ్యం మాటల్లో కాక, చేతల్లో వ్యక్తం కావాలని! ఇంతలా మనిషిని మనిషి ప్రేమించడం సాధ్యమేనా? ‘‘సాధ్యం కాకపోవచ్చు. స్వార్థపరులు ఉంటారు. అయినప్పటికీ వారిని క్షమించు. నీలోని కారుణ్యాన్ని చూసి, లేని ఉద్దేశాలను నీకు అంటగడతారు. అయినప్పటికీ వారి పట్ల దయగా ఉండు. నువ్వు నిజాయితీగా ఉండడం చూసి నిన్ను మోసగించేవారు బయల్దేరుతారు. అయినప్పటికీ నువ్వు నిజాయితీగా ఉండు. నువ్వు సంతోషంగా ఉండడం చూసి అసూయ చెందేవారు ఉంటారు. అయినప్పటికీ సంతోషంగా ఉండు. ఇవాళ నువ్వు చేసిన మంచి పని, రేపు ఎవ్వరికీ గుర్తుండకపోవచ్చు. అయినప్పటికీ మంచే చెయ్యి. ప్రపంచానికి నువ్వెంత ఇవ్వగలవో అంతా ఇవ్వు. అది సరిపోకపోవచ్చు. అయినప్పటికీ ఇచ్చేందుకే ప్రయత్నించు. చివరికి నువ్వూ దేవుడే మిగులుతారు. నువ్వూ వాళ్లూ కాదు’’ అని చెప్తారు మదర్. మనిషికి, దేవుడికి అనుసంధానమైన ది మదర్ థెరిస్సా జీవితం. మదర్ చూపిన దారిలో వెళితే.. దారి చివర దేవుడు మనకోసం నిరీక్షిస్తూ కనిపించినా ఆశ్చర్యం లేదు. - మాధవ్ శింగరాజు -
దేవుడికి దగ్గరవడం ఎలా?!
దైవికం క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్టు గాడ్లీనెస్. పరిశుభ్రత అనేది దాదాపుగా దైవత్వమేనట! అంటే నిర్మాలిన్యం మనిషిని దేవుడికి చేరువ చేస్తుందని అర్థం. ఎవరన్నారు ఈ మాట? మదర్ థెరిస్సానా? అనే ఉంటారు. రోగులను ఆమె శుభ్రం చేశారు. రోగగ్రస్థ హృదయాలను శుభ్రం చేయడానికి ప్రయత్నించారు. పరిశుద్ధ గ్రంథాలలో కూడా ఈ మాట ఉండే ఉంటుంది. సరిగ్గా ఇవే మాటలతో కాకున్నా, ఇదే అర్థం వచ్చేలా. జాన్ వెస్లీ అనే మత బోధకుడు తొలిసారి 1778లో ఒకానొక తన ప్రసంగంలో ‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్’ అన్నట్లు అక్కడక్కడ రిఫరెన్సులు ఉన్నాయి. అలాగే ఈ మాట అతి ప్రాచీనమైన బాబిలోనియా, హీబ్రూ మత సంప్రదాయాలలోనిదని సూచించే ఉటంకింపులూ కనిపిస్తుంటాయి. నిజానికి ఈ మాట పుట్టవలసింది ఇప్పుడు! చెత్తను చుట్టూ కొండలా పేర్చుకుని మనిషి ‘హాయిగా’ జీవిస్తున్న ఈ ఆధునిక కాలానికి చెందవలసిన సామెత ఇది. చేతులకో, చెవులకో, కళ్లకో కాస్తయినా చెత్త అంటుకోనిదే మనిషిని మనిషిగా పోల్చుకోలేనంతగా రోజులు చెత్త దిబ్బలై కదిలిపోతున్నాయి. చుట్టూ సెల్ఫోన్లు.. మధ్యలో మనిషి! చుట్టూ టీవీ ఛానళ్లు.. మధ్యలో మనిషి. చుట్టూ యాప్‌లు, ఆన్లైన్ షాపులు, ఈఎమ్మయ్ సదుపాయాలు... వీటన్నిటి మధ్యా మనిషి! వస్తు వ్యామోహం ఇంటిని, ఒంటినీ చెత్తతో నింపేస్తోంది. ఇక దేవుడికి చోటెక్కడ? మనతో పాటు వచ్చి టీవీ ముందు కూర్చుంటానంటేనే భగవంతుడికైనా ఇంత ప్లేస్ దొరుకుతుందేమో! దేవుణ్ణి కూడా కలుపుకుపోయేంత ఉదారత్వాన్ని మనలో కలిగించే ప్రోగ్రామ్‌లే అన్నీ! అసుర సంధ్య వేళ దాటాక మొదలయ్యే దయ్యపు సీరియళ్లు, క్రైమ్ కహానీలైతే మన బుర్రకు కావలసినంత చెత్త. దేవుడు వచ్చిందీ, పోయిందీ కూడా తెలియనంత ఎంటర్టైన్మెంట్! మనిషి కారణంగా భూమి నిండా ఇంత చెత్త పేరుకుపోతుందని ఏ యుగంలోని దైవమూ ఊహించి ఉండకపోవచ్చు. మనిషిని నడిపిస్తున్నది ఇప్పుడు ప్రాణం కాదు, పరిసరాల్లోని చిందరవందర! బట్టలతో, అవి పాతబడిపోకుండానే వచ్చి చేరే కొత్త బట్టలతో, బజార్ నుంచి కట్టుకొచ్చిన పాలిథీన్ కవర్లతో, ఎలక్ట్రానిక్ భూతాలను ఇంటికి చేర్చిన కార్టన్ బాక్సులతో సహజీవనం చేస్తుంటే తప్ప ఊపిరి ఆడని స్థితిలోకి మనిషి వెళ్లిపోయాడు. షెల్ఫులో చిన్న కాగితం ముక్క లాగితే మొత్తం అక్కడున్న వస్తువులన్నీ పడిపోవాలి. వంటింట్లో చక్కెర డబ్బా మూత తెరుస్తుంటే, మోచేయి తగిలి మిక్సీ పైకప్పు ఎగిరిపడి వంటింట్లో అడుగుతీసి అడుగు వేసే దారే లేకుండా పోవాలి. అటకల మీద ఎన్నటికీ అవసరం పడని అమూల్యమైన మూటలుండాలి. స్టోర్ రూమ్ తలుపులను తోసుకుని విరిగిన కుర్చీలు, దూది రేగుతుండే పరుపులు వచ్చిపడుతుండాలి. అప్పుడే జీవితం నిండుగా ఉన్నట్లు! పందొమ్మిదో శతాబ్దపు అమెరికన్ తత్వవేత్త హెన్రీ డేవిడ్ థోరో ఇలా అంటారు. దేవునికి ధన్యవాదాలు. మనిషికి గనుక రెక్కలు ఉండి ఉంటే ఈ భూమిని చెత్తతో నింపిన విధంగా, ఆకాశంలోనూ తన అమూల్యమైన చెత్తను పోగేసుకునేవాడు-అని. మనిషి పైన, మనిషి కింద, మనిషి పక్కన ఉన్న చెత్త గురించి మాత్రమే థోరో మాట్లాడారు. మనిషి లోపల ఉండే చెత్త గురించి ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించినట్లు లేకున్నా, ఫిలాసఫర్ కాబట్టి తప్పకుండా ఆలోచించే ఉంటారు. మనిషి లోపలి చెత్త.. మనిషి చుట్టుపక్కల చెత్త కన్నా దుర్గంధభూయిష్టమైనది. అసలు బయటి చెత్తకు.. లోపలి చెత్తే కదా మూల పదార్థం. లోపల, బయట ఇంత చెత్త ఉంటే దేవుడిని స్వచ్ఛమైన మనసుతో ఆరాధించడం అయ్యే పనేనా? ‘‘ఎక్కడ చెత్త ఉంటే అక్కడ శుభ్రం చేసే ప్రయత్నాన్ని ఇవాళే మొదలు పెట్టి చూడండి. మీరు శుభ్రం చేసిన చోటుకు మీ ప్రయత్నం లేకుండానే దివ్యత్వం వచ్చి చేరుతుంది’’ అంటారు జాన్ వెస్లీ. ఇది బయటి చెత్తకు. మరి లోపలి చెత్త ఎలా పోవాలి? గాంధీజీని ఆదర్శంగా తీసుకోవచ్చు. ‘‘మురికి పాదాలతో నా మనసును తొక్కుకుంటూ వెళ్లే అవకాశాన్ని నేనెవరికీ ఇవ్వను’’ అన్నారాయన. చెత్త మాటలను వినకపోవడం కూడా దేవుడికి దగ్గరయ్యేందుకు ఒక మార్గమే. - మాధవ్ శింగరాజు -
రైతులను మోసం చేసిన ప్రభుత్వం
సీతానగరం : పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని తప్పుడు వాగ్ధానాలు చేసి రైతులను ప్రభుత్వం మోసం చేసిందని జగ్గంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. బుధవారం పురుషోత్తపట్నంలోని పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు విడుదల అనంతరం సీతానగరం మదర్ థెరిస్సా సెంటర్లోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ రైతులను ఎన్నికల ముందు రుణాలు చెల్లించవద్దని చెప్పిన టీడీపీ ఇప్పుడు రుణ మాపీ కంటితుడుపుగా ఇచ్చిందన్నారు. రూ. 80వేల కోట్లు రైతులు రుణాలు పొందారని, ప్రస్తుతం ప్రభుత్వం కేవలం రూ.30 కోట్లు మాత్రమే మాఫీ చే స్తున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని ఇప్పుడు షరతులు విధిస్తున్నారన్నారు. జగన్ ఇచ్చిన మాట తప్పని వ్యక్త అని ఆయన అన్నారు. ైరె తుల రుణమాఫీ సాధ్యం కాదన్నారని తెలిసి జగన్ హామీ ఇవ్వలేదన్నారు. మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రైతులు ఎమ్మెల్యేను శాలువ కప్పి సత్కరించారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వలవల రాజా, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ముళ్ల సుబ్బారావు, ఈత గణేష్ నాయుడు, చీకట్ల వీర్రాజు, ద్వారంపూడి రామకృష్ణ, కోలా మాణిక్యాలరావు, జొన్నల పెదఅబ్బులు పాల్గొన్నారు -
సేవకు మరణం లేదు!
దిక్కులేని వాళ్లు కనిపిస్తే... ఒక జాలి చూపు చూస్తారు... అనాథ శవం కనిపిస్తే... దగ్గరకు పోతే ఏమవుతుందో అని పారిపోతారు. ఎవరైనా ఒంట్లో శక్తి లేకుండా బిచ్చమెత్తుకుంటూ ఉంటే... ఒక రూపాయి దానం చేసి ఛాతీ నిండా గాలిపీల్చుకుంటారు. శ్రీనివాస్ మాత్రం... రాణంతో ఉంటే వైద్యం చేయిస్తాడు... ప్రాణం లేకపోతే మార్చురీకి తరలిస్తాడు. మనిషికి మరణం ఉంటుంది కానీ సేవతో అమరం కావాలంటాడు. హైదరాబాద్, సికింద్రాబాద్ రోడ్ల మీద వెళ్తుంటే ఒక వాల్‌పోస్టర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందులో మదర్ థెరిసా, శిలువ, ఓం, కృపాణాలు, మసీదు, స్వామి వివేకానంద చిత్రాలు, వాటి కింద ఒక వ్యక్తి ఫొటో ఉంటాయి. పక్కన వృద్ధులు, వికలాంగులు, గుర్తు తెలియని మృతదేహాలను మార్చురీకి తరలించాలన్నా, అంధులు, హెచ్ఐవి, కుష్టు రోగులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతూ దిక్కులేకుండా పడి ఉన్నా, వారిని హాస్పిటల్‌కు తరలించాలన్నా ఒక ఫోన్ కాల్ చేయండి అంటూ 9849420641ఫోన్ నంబరు ఉంటుంది. ప్రకటనలో చెప్పినట్లే... ఫోన్ కాల్ అందుకున్న వెంటనే నిమిషాల్లో అక్కడ ప్రత్యక్షమవుతారు శ్రీనివాస్. రోగులను హాస్పిటల్‌కు చేరవేస్తారాయన. వారందరి ఫొటోలు తీసి దగ్గరుంచుకుంటాడు. ‘‘వేలి ముద్రల సేకరణ పోలీసులకు ఉపయోగపడుతుంది. ఇక ఫొటోలు... కొంతమంది తమ వాళ్లు తప్పిపోయారని వెతుకుతుంటారు. వారికి నా దగ్గరున్న ఫొటోలు ఉపయోగపడతాయి’’ అంటాడు. శ్రీనివాస్ తండ్రి వరంగల్ జిల్లా జనగాం నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ముషీరాబాద్‌లో ఆరవ తరగతి చదువుకుంటున్న రోజుల్లో చేపల మార్కెట్ దగ్గర ఒక వ్యక్తి స్పృహతప్పి పడిపోయాడు. అతడి ముఖం మీద నీళ్లు చల్లి లేవదీసి తన బాక్సులో అన్నం పెట్టాడు శ్రీనివాస్. స్థానికుల సహాయంతో అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఒకరు బాధలో ఉంటే మనసు స్పందించిన తొలి సంఘటన అదేనంటారాయన. స్కూల్లో టీచర్లు, తోటిపిల్లలు ప్రశంసలతో ముంచెత్తడంతో తాను చేసింది మంచి పని అని తెలిసింది. డిగ్రీలో సోషల్ వర్క్ ఒక సబ్జెక్టుగా చదవడానికి ఇవన్నీ కారణమే అంటూ... ‘‘ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడాన్ని ఒక పద్ధతిగా చేయడానికి చదువు బాగా ఉపయోగపడింది. నగరంలోని 24 పోలీస్ స్టేషన్లలో నా వివరాలు, పోస్టర్లు ఉంటాయి. బేకరీలు, రోడ్డు పక్కన ఉండే కిళ్లీ బడ్డీలకు నా ప్రకటన పత్రికలు కనిపిస్తాయి. ఎప్పుడు ఎవరికి నా అవసరం ఏర్పడుతుందో ఊహించలేం. రోడ్డు మీద దిక్కులేకుండా పడి ఉన్న వాళ్లను చూసిన వాళ్లకు ఈ ప్రకటన గుర్తొస్తే చాలు. నాకు ఒక ఫోన్ చేస్తారు’’ అంటారు. ప్రాణాలు కోల్పోయిన వారిని మార్చురీకి తరలించడం, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని హాస్పిటల్లో చేర్చడం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కుంటున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చి అనాథ ఆశ్రమాలకు పంపించడం ఇతడి దైనందిన కార్యక్రమం. అనారోగ్యం నుంచి సాంత్వన పొందిన వారికి దారి ఖర్చులకు డబ్బిచ్చి మరీ సొంత ఊరికి పంపిస్తారు. ‘‘సెకండ్ హ్యాండ్ బైకులు, కార్లను కొనడం, అమ్మడం నా వ్యాపారం. రాబడి బాగానే ఉంటుంది. కాబట్టి ఇంతవరకూ ఇబ్బంది రాలేదు. నా భార్య అనూరాధ మొదట్లో నన్ను ప్రోత్సహించింది. కానీ, పిల్లలు పెద్దవుతున్నారు, స్కూల్లో చేరిస్తే ఖర్చులు పెరుగుతాయి, పైగా ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలియక ఇంట్లో వాళ్లకు ఆందోళన. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న గొడవలవుతున్నాయి’’ అన్నారు శ్రీనివాస్ నవ్వుతూ. నగరంలో యాచకులు, రోడ్డు మీద ప్రాణాలు వదిలే అభాగ్యులు ఉండకూడదన్నదే తన జీవితాశయం అంటారు శ్రీనివాస్. ఇలాంటి బృహత్తర యజ్ఞాన్ని ఒక్కరుగా చేస్తూ పోతే కొంతకాలానికి ఆగిపోతుంది. కాబట్టి తన ఆలోచనలకు ప్రభావితమవుతున్న యువకులను సమీకరించి, తన కార్యకలాపాల్లో భాగం చేస్తున్నారు. ‘‘మనకు చావు ఉంటుంది, కానీ మనం చేసే పనికి మరణం ఉండకూడదు. అందుకే నా ప్రయత్నాన్ని విస్తరించాలనే ఉద్దేశంలో ఉన్నాను. ప్రతి ఒక్కరూ సామాజికసేవకులు కావాలి’’ అంటారు శ్రీనివాస్. - వాకా మంజులారెడ్డి ఎక్కడ అవసరమైతే... నాకు శ్రీనివాస్ ఏడాదికి పైగా తెలుసు. రోడ్డు మీద నిస్సహాయంగా పడిపోయిన వాళ్లని లేపి అన్నం తినిపించి, స్నానం చేయించి బట్టలిస్తాడు. మాకంటే ముందు అతడికే సమాచారం వెళ్తుంది. కొన్నిసార్లు అతడే మాకు సమాచారం అందిస్తాడు. బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టాలంటే మరుసటి రోజుకు రక్తదానం చేయాలనే ఆసక్తి ఉన్నవారిని తీసుకొచ్చి మా ముందు నిలబెడతాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆపన్నులకు మా నుంచి అందే సర్వీస్ కంటే శ్రీనివాస్ నుంచి ఎక్కువ అందుతోంది. - అమరకాంత్ రెడ్డి, ఏసీపీ, హైదరాబాద్ -
రెండు చేతులు... వేయి బాధ్యతలు... అలుపెరుగని అమృతమూర్తి
నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం ఈ ప్రపంచం విశాలమైనదా? అమ్మ హృదయం విశాలమైనదా? అని అడిగితే వచ్చే సమాధానం ఒక్కటే! అమ్మ హృదయం అని! అవును మరి! ఈ ధరిత్రికి ఉన్న ఓర్పు ఈ ప్రపంచంలో ఒక్క అమ్మకు తప్ప మరెవరికి ఉంది? అందుకే తల్లి ... పుడమితో సమానం. ప్రపంచంలో నాగరక, ఆటవిక జాతులన్నింటిలోనూ తల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రపంచానికి భావితరాలను అందించే వ్యక్తి ఆమే కదా! నవ మాసాలూ మోసి బిడ్డను కనడం మహిళకు మరో జన్మ అంటారు. ఎందరో మహిళలు పసిగుడ్డుకు జన్మనిచ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. అయినా అమ్మ ఆ భారాన్ని మోస్తూనే వస్తోంది. భవిష్యత్తులోనూ దాన్ని ఓ భారం అనుకోకుండా మోస్తూనే ఉంటుంది. ఓ పసిగుడ్డుకు ప్రాణం పోయడానికి ఎంత శ్రమపడాల్సి ఉంటుందో తెలిసినా ఆ తల్లి ఈ ప్రపంచానికి ఒక తరాన్ని అందించడానికి తన ప్రాణాలను పణంగా పెడుతూనే ఉంది. అందువల్లనే అమ్మకు అత్యున్నత స్థానం లభించింది. అమ్మగా అనేక పనులు ఆడపిల్లగా పుట్టిన క్షణం నుండి ఓ కుటుంబంలో ఆమె ప్రయాణం ఆరంభమై, కూతురుగా, చెల్లిగా, అక్కగా, అమ్మగా, వదినగా, అత్తగా, ఆడపడుచుగా, అమ్మమ్మగా, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి తాను ఒక్కటిగా, అందరికీ అవసరమైన వ్యక్తిగా కుటుంబంలో, సమాజంలో నిలుస్తుంది. ఓ టీచర్‌గా.... బిడ్డ పుట్టిన తర్వాత చనుబాలు ఇవ్వడంతో తల్లి తన బిడ్డకు ఒక గురువుగా మారుతుంది. ఆ బిడ్డ ప్రతి కదలికలోనూ తల్లి మార్గదర్శకత్వం ఉంటుంది. ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా జీవించాలి, జీవితపు ఆఖరు క్షణాలను హుందాగా ఎలా ఆహ్వానిం చాలి... అన్నీ తల్లే నేర్పిస్తుంది. అక్షరాలు మొదలుకొని జీవితపు ఆఖరి మజిలీ వరకు తల్లి నేర్పిన పాఠాలే మనిషిని ముందుకు నడిపిస్తాయి. రామకృష్ణ పరమహంస తన భార్యలో కూడా తల్లిని దర్శించిన మహనీయుడు. ఆయన అంతటి గొప్ప వ్యక్తి కావడానికి స్ఫూర్తి ఆయన తల్లే. అలాగే వివేకానందుని జీవితం కూడా. తల్లి నేర్పిన జీవిత పాఠాలే ప్రపంచానికి ఆయన ఆదర్శమూర్తి కావడానికి కారణం. ఇక గాంధీ మహాత్ముని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది? ఆయన స్వయంగా తన ఆత్మకథలో అమ్మ గురించి ఎన్నో సందర్భాలలో చెప్పుకున్నాడు. ప్రపంచానికే ఆదర్శమూర్తులైన ఆ వ్యక్తుల తల్లులు ఇంకెంత గొప్ప ఆదర్శమూర్తులో ఆలోచించండి? ఒక గృహిణిగా... ప్రతి తల్లీ ఒక మంచి ఐఏఎస్ ఆఫీసరనే చెప్పాలి. కలెక్టర్ ఒక జిల్లాలోని అన్ని శాఖలను ఎలా సమన్వయం చేసి నడుపుతాడో ఒక తల్లి కూడా ఇంటిలో ఉండే అన్ని శాఖలను, వ్యవహారాలను సమన్వయం చేసి ముందుకు నడుపుతుంది. ఇంటికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూస్తుంది. పిల్లల మధ్యన గొడవలు రాకుండా, ఇంట్లోని వ్యక్తుల మధ్య శాంతి సామరస్యాలు నెలకొల్పడంలో చొరవ తీసుకుంటుంది. రోజువారీ కార్యక్రమాలు, ఆదాయం - వ్యయం, బంధుమిత్ర వర్గం, క్రమశిక్షణ, ఇంటి నిర్వహణ, జనన మరణాలు... ఒకటేమిటి! ఎన్ని విభాగాలో? అన్నింటినీ నేర్పుతో నిర్వహిస్తుంది. ఖర్చు చేయడంలో, పొదుపు చేయడంలో ఆమెకు సాటి మరొకరు లేరు. అనునిత్యం ఆమె ఇంటి గురించే ఆలోచిస్తుంది. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకున్న చాలామంది ‘నేను ఈ స్థాయికి రావడానికి నా భార్య కృషి ఎంతో ఉంది’ అని చెబుతుంటారు. అందులో సందేహమేమీ లేదు. వ్యాపార సామ్రాట్టులుగా ప్రపంచంలో పేరు తెచ్చుకున్న అంబానీల తల్లినే తీసుకోండి. కొడుకులు కోట్లాది రూపాయల వ్యాపారాలకు అధిపతులైనా, తగవులు వచ్చినప్పుడు తల్లి మాత్రమే తీర్పు చెబుతుంది. ఎలాంటి ఆడంబరాలకూ పోకుండా సహజత్వానికి దగ్గరగా ఉండే మహిళ ప్రపంచాన్ని ఏలే కొడుకులను తీర్చిదిద్దుతుంది. పెపైచ్చు, అందులో తన గొప్పదనం ఏమీ లేదని ఎంతో వినమ్రంగా చెబుతుంది. ఒక మనిషి - అనేక కోణాలు జడ్జిగా ఎన్నో తీర్పులు చెప్పే కొడుకు ఇంటికి వచ్చి ఒకానొక కేసులో తీర్పు ఎలా ఉండాలో తల్లిని సలహా అడుగుతాడు. దినమంతా కలెక్టరుగా ఎన్నో శాఖల పనులను చక్కబెట్టి ఇంటికి వచ్చి తల్లిని సలహాలు అడుగుతాడు. బజార్లో పోట్లాడి ఇంటికి వచ్చిన కొడుక్కి బుద్ధి నేర్పుతుంది తల్లి. ఇంటి బయటి గొడవలను తన మాటలతో సద్దుమణిగేట్లు చేస్తుంది. తన పిల్లలే కాదు తాను ఉంటున్న వీధిలోని పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలనే విశాలహృదయం గల ప్రత్యక్ష దేవత తల్లి. వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరిగి ఆమె పరిధి మరింత విస్తృతమవుతుంది. కొడుకులు, కూతుళ్లకు కుటుంబాలను ఏర్పరుస్తుంది. అమ్మమ్మగా, నానమ్మగా మనుమలను కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏ మాత్రం స్వార్థం లేకుండా తన శక్తియుక్తులనన్నింటినీ తన వారి కోసం ధారపోసి తనువు చాలిస్తుంది స్ఫూర్తి ప్రదాత వేల ఏళ్ళ నుండీ చరిత్రను గమనిస్తే ఒక విషయం కనిపిస్తుంది. ఎంతోమంది రాజులు తమ రాజ్య పరిపాలనలో తల్లినే ఆదర్శంగా తీసుకున్న నిదర్శనాలెన్నో కనబడతాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు, మరాఠా మహారాజు శివాజీ ఇందుకు నిదర్శనాలు. శివాజీ ప్రతి పనిలో తల్లిని సంప్రదించేవాడు. గాంధీజీ నేటియుగంలో మహాత్ముడు అయ్యాడంటే అది ఆయన తల్లి గొప్పదనం. ఎన్నో కంపెనీలకు అధిపతులుగా ఉన్న ఎందరో పారిశ్రామిక వేత్తల జీవితాలలో స్ఫూర్తి నింపింది వారి అమ్మ అనడంలో సందేహం లేదు. ఎందరో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి నాయకులు, అధికారులు తమ ఉన్నతిలో తమ తల్లి పాత్ర ఎంతో ఉందని అనేక సందర్భాలలో చెబుతూనే ఉన్నారు. తల్లిని కళ్ళెదుట కనిపించే దైవంగా కొలిచే కొడుకులు ఉన్నారు. కొన్ని చోట్ల తల్లికి గుడి కట్టిన కొడుకులూ ఉన్నారు. తల్లి గొప్పతనాన్ని కమనీయంగా మలిచిన సినిమాలు చాలానే వచ్చాయి.అందరూ అమ్మ గొప్పతనాన్ని గుర్తిస్తున్నారా అంటే సందేహమే. నవమాసాలూ మోసి, కని పెంచిన అమ్మను వార్ధక్యంలో పట్టించుకోకుండా, వదిలేసిన సంతానమూ లేకపోలేదు. ఇలాంటి నేపథ్యంలో ‘మదర్స్ డే’ మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటోంది. మాతృదినోత్సవం అమ్మ పాత్రను గుర్తించిన ప్రపంచం ఆమె కోసం ఒక రోజును కేటాయించి ఆ రోజున అందరూ ఆమె గొప్పతనాన్ని స్మరించుకొనేలా చేస్తోంది. ప్రపంచ చరిత్రను చూస్తే మాతృదినోత్సవాన్ని ఒక వేడుకగా జరుపుకోవడం 1914లో మొదలైంది. అమెరికాకు చెందిన అన్నా జార్విస్ అనే మహిళ మాతృదినోత్సవాన్ని నిర్వహించడానికి ఆద్యురాలు. ఆమె 1908లోనే ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఆమె తల్లి మే 9న చనిపోయింది. ఆ తేదీయే ఇప్పుడు అమెరికాలో అధికారిక మాతృదినోత్సవంగా స్థిరపడింది. ప్రపంచ చరిత్ర లోతుల్లోకి వెళితే భారతీయ సమాజంతో పాటు గ్రీకులు, రోమన్లు సైతం ‘అమ్మ దేవత’ గా రియా, సైబిలిలను కొలిచేవారు. క్రైస్తవులు పూర్వకాలంలో అమ్మ దినోత్సవాన్ని ‘ఆదివారం అమ్మ’ గా ఆదివారం నాడు వేడుక జరుపుకునేవారు. బ్రిటన్, కొన్ని ఐరోపా దేశాలలో మే నెలలో నాలుగో ఆదివారాన్ని మాతృదినోత్సవంగా జరుపుకొంటున్నారు. పుతలీబాయి గాంధీజీ పుతలీబాయికి నాలుగో కొడుకు. కరమ్‌చంద్ గాంధీతో పెళ్లి నాటికి ఆమె వయసు కేవలం 13 సంవత్సరాలే. వయసు చిన్నదే అయినా ఆమె తన పిల్లలనే కాక మిగతా పిల్లలనందరినీ తన పిల్లలుగానే భావించేది. ప్రేమానురాగాలను పంచేది. చిన్న కొడుకైన గాంధీజీ అంటే పుతలీబాయికి ఎనలేని ప్రేమ. చిన్నప్పటి నుండే తల్లి ప్రేమను గాంధీజీ అర్థం చేసుకున్నాడు. తల్లి దగ్గరే అనేక విషయాలు నేర్చుకున్నాడు. ‘అబద్ధం చెప్పకూడదు. సత్యమే పలకాలి’ అనేవి ఆయన ఆయుధాలు. పుతలీబాయి భారత, భాగవత కథలు చక్కగా చెప్పేది. తల్లిదండ్రులను జీవితాంతం కావడిలో పెట్టి మోసిన శ్రవణ కుమారుడి కథ గాంధీజీకి ఎంతో ఇష్టం. అందుకే గాంధీజీ కూడా తల్లిదండ్రుల పట్ల గౌరవభావంతో ఉండేవాడు. పుతలీబాయి ఆచార వ్యవహారాలు పాటించేది. దైవ ప్రార్థన చేసేది. బీదపిల్లలకు సాయం చేసేది. నిరాడంబరత, ఓర్పు, సహనం, క్షమ వంటివి గాంధీజీకి తల్లి నుండే అలవడ్డాయి. ఆమె వల్లే గాంధీజీ అంత గొప్పవాడయ్యాడు. మేరీ మాత మేరీమాత జీసస్కు తల్లి. జీసస్‌ను దేవుని బిడ్డగా భావిస్తారు. భగవంతుని ప్రేరణతోనే కొడుకుగా మేరీ గర్భం నుండి జీసస్ ఉద్భవించాడు. అప్పటికి ఆమె యవ్వనంలో ఉంది. ఆమె తల్లిదండ్రులు జోచిమ్, అన్నే మేరీలకు దేవుడన్నా, జూవిష్ మతమన్నా ఎంతో అభిమానం. అందరికీ ఆమె ఓ సాధారణ ఆడపిల్ల అనే తెలుసు. భగవంతుడు దేవదూత గాబ్రియేలును తన దూతగా నజరేత్ పట్టణానికి పంపించాడు. అతడు భగవంతుని ఆశయాన్ని ఆమెకు వినిపించాడు. అలా మేరీ, ఆమె భర్త జోసేఫ్లకు జీసస్ జన్మించాడు. ఆ భార్యాభర్తలిద్దరూ ఎన్నో ఏళ్ళు నజరేత్ పట్టణంలోనే ఉన్నారు. చిన్నప్పటి నుండే జీసస్కు భగవంతుని పట్ల ప్రేమను ఆమె పురికొల్పింది. తదనంతరం జీసస్ భగవంతుని బిడ్డగా అందరి మన్ననలు పొందాడు. భగవంతుని కోసం ప్రాణాలను అర్పించాడు. తన కొడుకు చనిపోయాడన్న బాధ ఆమెలో ఎప్పుడూ లేదు. భగవంతుని కోసం ప్రాణాలను ఇచ్చిన గొప్పవాడుగానే భావించింది. అందుకే ఆమె క్రైస్తవ మత ప్రజలందరికీ తల్లిగా మారిపోయింది. భువనేశ్వరీదేవి వివేకానందుడు ప్రపంచమంతటా గుర్తింపు తెచ్చుకొనేలా ఎదగడానికి కారణం అతని తల్లి భువనేశ్వరీదేవి. చిన్నప్పుడే భర్త చనిపోవడంతో ఇంటి బరువు బాధ్యతలను ఆమె తన మీద వేసుకుంది. చిన్నతనంలోనే వివేకానందుడికి పురాణ కథలు చెప్పింది. ఆమె చెప్పిన విషయాలు వివేకానందుని మనసులో నాటుకుపోయాయి. దేశ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయడానికి ఏం చేయాలో అతనికి అర్థమైంది. అతడు శ్రీరామకృష్ణ పరమహంసను కలవడంతో అది మరింత బలపడింది. తల్లి ఏనాడూ దేనికీ అతనికి అడ్డు చెప్పలేదు. వివేకానందుడు భవిష్యత్తులో ఎంతో గొప్ప వ్యక్తి అవుతాడన్న విషయాన్ని అతని చిన్నతనంలోనే ఆమె గమనించింది. అందుకే అన్ని సందర్భాలలో సరైన మార్గదర్శకత్వం చేసింది. ‘‘నేను నా తల్లికి ఎంతో రుణపడి ఉన్నా. విపత్కర పరిస్థితుల్లోనూ ఆమె ప్రశాంతంగా ఉండేది. సమస్యనెలా ఎదుర్కోవాలో ఆమెకు బాగా తెలుసు. ఈ లక్షణాలన్నీ నేను నా తల్లి నుండే పుణికిపుచ్చుకున్నా’’ అని వివేకానందుడు చెప్పారు. మదర్ థెరిసా 1910 ఆగస్టు 26న యుగొస్లేవియాలో జన్మించిన మదర్ థెరిసా ఇప్పుడు విశ్వమాతగా కొనియాడబడుతోంది. ఆమెకు ఎనిమిదేళ్ళ వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి ఆమెను తమ మత ఆచారాల ప్రకారం పెంచింది. పన్నెండేళ్ళ వయసులోనే ఆమె సన్యసించాలని నిర్ణయించుకుంది. కానీ తల్లి అప్పుడు ఒప్పుకోలేదు. చివరికి పద్ధెనిమిదేళ్ళ వయసులో 1928 ఆగస్టు 15న ఆమె లొరెటో మిషనరీలో సన్యాసినిగా చేరిపోయింది. 1929లో ఆమె భారతదేశానికి వచ్చింది. అనాథ పసిపిల్లలకు తల్లిగా ఎంతో సేవ చేసింది. కులం, మతం పక్కన పెట్టి ఆమె కలకత్తా నగరంలో రోగులకు, వితంతువులకు, అనాథలకు చేసిన సేవ జగమెరిగినదే. 1943లో కలరా వచ్చినప్పుడు ఎందరికో వైద్య సేవలు అందించింది. 1946లో ఆమె రైలులో ప్రయాణిస్తుండగా దేవుని వాక్యాలను విన్నది. ఇక అప్పటి నుండి ఆమె తన పూర్తి జీవితాన్ని దీనుల కోసం అంకితం చేసింది. కలకత్తాలో పాఠశాలలు, వైద్య సౌకర్యాలు, అనాథ గృహాలు ప్రారంభించింది. తన సేవను భగవంతుని సేవగా భావించింది. ఏ సందర్భంలోనూ ఇతరులను చూసి అసహ్యించుకోలేదు. విపత్కర పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండడం ఆమె స్వభావంగా మారింది. భారత పౌరసత్వం పొందింది. మొత్తం ప్రపంచ దేశాల నుండి ప్రశంసలు పొందింది. ఎన్నో దేశాలు ఆమెకు అత్యున్నత పురస్కారాలు ఇచ్చి గౌరవించాయి . -
జూబ్లిహిల్స్‌లో మరో 'మదర్'
-
పురస్కారం: మదర్ థెరిసా.. ప్రపంచ శాంతిదూత
నోబెల్ ఇండియా: అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కార గ్రహీతలలో భారతదేశానికే కీర్తి తెచ్చిన స్త్రీ మదర్ థెరిసా. ఈమెకు 1979వ సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. మానవాళికి దారిద్య్రం నుంచి, బాధల నుంచి విముక్తి కల్పించటానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ బహుమతి అందజేశారు. మదర్ థెరిసా బాల్యం: మదర్ థెరిసా ఆల్బేనియా దేశంలోని ‘స్కోయె’ పట్టణంలో 1910వ సంవత్సరం ఆగస్టు నెల 26వ తేదీన జన్మించారు. ఆగస్టు 27వ తేదీన ఆమెను రోమన్ క్యాథలిక్ చర్చిలో బాప్టైజ్ చేసి, యాగ్నిస్ గోన్‌జా బొయాహు అని పేరు పెట్టారు. ఆల్బేనియన్ భాషలో గొన్జా అంటే గులాబీ మొగ్గ అని అర్థం. ఆమె తండ్రి నైకోల్ డ్రానాషిల్ బొయాహు. ఆయనకు నలుగురు సంతానం. వారిలో యాగ్నిస్ కడపటిది. చిన్నతనం నుంచి యాగ్నిస్కు రోమన్ క్యాథలిక్ మిషనరీల సేవలకు సంబంధించిన కథలంటే చాలా ఇష్టం. యాగ్నిస్ తండ్రి రాజకీయాలలో ఉంటూ, 1919వ సంవత్సరంలో మరణించారు. యాగ్నిస్ 12 సంవత్సరాల వయసులోనే దైవచింతనతో రోమన్ క్యాథలిక్ చర్చి వైపు ఆకర్షితమయ్యారు. 18 సంవత్సరాల వయసులో ఆమె లొరీటో ఐరిష్ నన్ల వ్యవస్థలో చేరి, ఆంగ్లంలో ప్రావీణ్యత పొంది, 1931 మే నెల 24వ తేదీన ‘నన్’గా ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే ఆమె భారతదేశంలోని కలకత్తా నగరానికి చేరుకుని, 1931 నుంచి 1948 వరకు కలకత్తాలోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేశారు. భారత్‌లో సేవలు: రోమన్ క్యాథలిక్ మిషనరీల ఆచారం ప్రకారం, యాగ్నిస్ తొలి నామాన్ని థెరిసాగా మార్చుకుని, అందమైన హిమాలయాలలోని డార్జిలింగ్ నగరంలో రోమన్ క్యాథలిక్‌గా సేవలు ప్రారంభించారు. అనంతరం ఆమె కలకత్తా శివార్లలోని ‘ఎంటాలీ’ అనే చోట లొరీటో కాన్వెంట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ, అదే స్కూల్లో 1944వ సంవత్సరంలో ప్రధానోపాధ్యాయిని అయ్యారు. ఆ ఏడాది బెంగాల్ రాష్ట్రంలో కరువు వచ్చి, కలకత్తా నగరంలో ఆకలి వల్ల రోగాల వల్ల ఎందరో చనిపోయారు. దానికి తోడు, 1946లో హిందు, ముస్లిం మత వైషమ్యాలు, విధ్వంసకర సంఘటనలు కలకత్తా నగరాన్ని అల్లకల్లోలం చేసి, భయంకరంగా తయారుచేశాయి. మదర్ థెరిసా 1946 సెప్టెంబర్‌లో అంతఃకరణ ప్రబోధంతో సంఘసేవకు శ్రీకారం చుట్టారు. ఆమె కలకత్తా నగరంలోని పేదలు నివసించే పేటలలో తన సహాయ కార్యక్రమాలు ప్రారంభించి, మోతీజిల్ అనే మురికివాడలోని పిల్లలకు ఒక స్కూల్ ప్రారంభించి, అక్కడి పేదలకు సేవ చేయటం ప్రారంభించారు. రోగులకు సేవ చేయటం కోసం ఆమె బీహార్‌లోని పాట్నా నగరంలోని ఒక హాస్పిటల్లో కొద్ది నెలల మెడికల్ ట్రైనింగ్ పొందారు. బెంగాల్ కరువు రోజుల్లో ఆమె సేవను గుర్తించి, అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎంతగానో ప్రశంసించారు. మదర్ థెరిసా రోమన్ క్యాథలిక్ కేంద్రమైన ‘వాటికన్’ నుంచి ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ స్థాపనకు అనుమతి పొందారు. సాధారణంగా మిషనరీ నన్‌లు ధరించే దుస్తులకు బదులు నీలి అంచు తెల్ల చీరను తమ సంస్థకు గుర్తింపుగా నిర్ణయించారు. ఈ విధంగా థెరిసా రోమన్ క్యాథలిక్ వ్యవస్థకు అనుబంధంగా ఉంటూ, స్వతంత్ర ప్రతిపత్తి గల ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ అనే సేవాసంస్థను నిర్వహించారు. మదర్‌కు నోబెల్: మదర్ థెరిసా సేవలను గుర్తించి, 1979వ సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. దారిద్య్రంలో బాధపడేవారికి, రోగులకు, అనాథలకు, ఆదరణకు నోచుకోని వృద్ధులకు అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆమెకు నోబెల్ పురస్కారం ఇవ్వటం జరిగింది. ‘ఆమె ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ పురస్కారం అందుకుంటుంద’నే ప్రశ్నకు ‘‘నా రక్తం ఆల్బేనియాది. నా పౌరసత్వం భారత్‌ది. నా విశ్వాసం క్యాథలిక్ మతానిది. నా వ్యక్తిత్వం ప్రపంచానిది. నా హృదయం జీసస్కు చెందినది’’ అని ఉన్నతమైన సమాధానమిచ్చారు థెరిసా. ‘నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ప్రపంచశాంతిని నెలకొల్పేందుకు మీరిచ్చే సందేశం ఏమిట’ని ప్రశ్నించినప్పుడు ‘‘ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలను ప్రేమిస్తే చాలు, ప్రపంచశాంతి దానంతటదే నెలకొంటుంది’’ అన్నారు మదర్ థెరిసా. నోబెల్ పురస్కార స్వీకరణ ప్రసంగంలో ఆమె‘‘నేటి ప్రపంచంలో ‘దారిద్య్రం’ అనేది కేవలం వెనుకబడిన, ఆర్థికంగా పేద అయిన దేశాలకే పరిమితం కాదు. ఎన్నో విధాలుగాను పురోగమించిన దేశాలలో కూడా ఉందనటానికి చింతిస్తున్నాను. ఆకలితో ఉన్నవారికి ఆహారం సమకూర్చటం ద్వారా పేదరికం తొలగించవచ్చు కాని, సమాజంలో అణగదొక్కబడి, ఆదరణకు నోచుకోనివారికి, ఉగ్రవాదానికి భయపడి బతికేవారికి ఎదురవుతున్న ఆయా దారిద్య్రాలను తొలగించినప్పుడే నిజమైన శాంతి. అబార్షన్లతోపాటు విడాకుల నిర్మూలన కూడా జరిగినప్పుడే మానవులంతా శాంతితో జీవించగలరు’’ అన్నారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ కార్యక్రమాలు: వృద్ధాప్యంలో ఉన్న, మరణానికి చేరువలో ఉన్న అభాగ్యుల కోసం ఆశ్రమం నడపడం. ఈ ఆశ్రమంలో మరణించినవారికి వారి మత కట్టుబాట్లకు అనుగుణంగా ఉత్తర క్రియలు జరపటం(ఆశ్రమంలో మహమ్మదీయులు మరణిస్తే ఖొరాన్ పఠనం, హిందువులు మరణిస్తే వారికి గంగాజలంతో అంత్యక్రియలు, క్రైస్తవులకు చర్చి నిబంధనలకనుగుణంగా నిర్వహించటం) వంటి జనామోదకర విధానాల అమలు. కుష్ఠు రోగులకు ఆశ్రమం నిర్మించి, నగరంలో వివిధ ప్రాంతాలలో వారికి వైద్య సౌకర్యాలు కల్పించటం. 1955లో నిర్మలా శిశుభవనం స్థాపించటం. ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’లో బ్రదర్స్ విభాగం, సిస్టర్స్ విభాగం, ఫాదర్స్ విభాగం ఏర్పాటు చేసి నిష్ణాతులైన సేవకులను తయారుచేయటం. ఇదే క్రమంలో మత ప్రవక్తలను కూడా తయారుచేయడం. దేశదేశాల్లో ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సంస్థలను ప్రారంభించటం. మదర్ థెరిసా అకుంఠిత దీక్ష, కృషి, పరిశ్రమల ఫలితంగా 1996వ సంవత్సరం నాటికి 100కి పైగా దేశాలలో 517 మిషనరీస్ ఆఫ్ చారిటీ శాఖలు ప్రారంభమ య్యాయి. ఇవి ప్రపంచమంతటా మానవ సేవను కొనసాగిస్తూ ఉన్నాయి. మదర్ థెరిసా అవార్డులు... బహుమతులు: 1962 - పద్మశ్రీ బిరుదు; రామన్ మెగసెసే బహుమతి. 1971 - పోప్ జాన్ 23 శాంతి బహుమతి 1979 - నోబెల్ ‘శాంతి’ బహుమతి 1979 - బాల్జాన్ బహుమతి 1980 - {పపంచంలో అత్యధిక జనాదరణ కలిగిన పదిమందిలో ఒకరిగా గుర్తింపు 2010 - థెరిసా శతజయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఐదు రూపాయల నాణెం విడుదల 1983వ సంవత్సరంలో పోప్ జాన్‌పాల్-2ను దర్శించే నిమిత్తం రోమ్ వెళ్లిన మదర్ థెరిసాకు గుండె జబ్బు వచ్చింది. తరువాత 1991లో మెక్సికో నగరానికి వెళ్లినప్పుడు ఆమెకు న్యుమోనియా వచ్చింది. 1996లో ఆమెకు మలేరియా వచ్చి గుండెలో ఎడమ కవాటం పనిచేయటం మానేసింది. దాంతో థెరిసా ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సంస్థ అధ్యక్ష పదవిని పరిత్యజించారు. చివరకు 1997వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన కలకత్తా నగరంలో కన్నుమూశారు. నవీన్ చావ్లా అనే విశ్రాంత ఐసీఎస్ అధికారి, మదర్ జీవిత చరిత్రను పుస్తకంగా రాసి ప్రచురించారు. మదర్ థెరిసాకు ఎంతోమంది అభిమానులతో పాటు విమర్శకులు కూడా ఉన్నారు. ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ని తన సామ్రాజ్యంగా భావించేవారని, ఆమె అబార్షన్, విడాకులను ప్రోత్సహించకపోవటం యువత స్వేచ్ఛకు ఆటంకమనీ విమర్శల అభిప్రాయం. ఇలాంటి ఎన్ని విమర్శలున్నా మదర్ థెరిసా పేరును ప్రపంచంలో అత్యధిక జనాదరణ గల మొదటి పదిమందిలో ఒకరుగా వరుసగా 18 సార్లు ప్రకటించడం ఆమె విశిష్ట వ్యక్తిత్వాన్ని, సేవా నిరతిని చాటుతున్నాయి. డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యులు -
నోబుల్ మెమోరియల్ వాల్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: స్వీడన్ ఎంబసీ, ఢిల్లీమెట్రోరైలు కార్పోరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నోబుల్ మెమోరియల్ వాల్ పేరిట ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. రాజీవ్‌చౌక్ మెట్రోస్టేషన్లో ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శనను శనివారం డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్, స్వీడన్ రాయబార కార్యాలయం అధికారి శ్యాండ్‌బెర్గ్‌థ్యాంక్‌డ్ ప్రారంభించారు. శనివారం నుంచి ఈనెల 15 వరకు వారం రోజులపాటు కొనసాగనున్న ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యానికి తగిన ప్రాచుర్యం కల్పించడంతోపాటు రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలకు మరింత ప్రచారం కల్పించడమేనని నిర్వాహకులు తెలిపారు.నోబుల్ మొమోరియల్ వీక్ సందర్భంగా ఈ ప్రదర్శనను మరికొన్ని మెట్రోస్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు. డీఎంఆర్సీ అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో గర్వంగా ఉందని మంగూసింగ్ పేర్కొన్నారు. ఠాగూర్‌కి సంబంధించిన పలు అంశాలు యువత తెలుసుకునేందుకు ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపకరిస్తుందన్నారు. భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన మహానుభావుడికి సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటులో పాలుపంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని శ్యాండ్‌బర్గ్ పేర్కొన్నారు. సాహిత్యంలో నోబుల్‌ప్రైజ్ అందుకున్న మొట్టమొదటి నాన్‌యూరోపియన్ రవీంద్రనాథ్ ఠాగూర్ అని గుర్తు చేసుకున్నారు. వాల్ ఎగ్జిబిషన్లో భాగంగా ఏటా ఒక్కో నోబుల్ అవార్డు గ్రహీతపై ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని డీఎం ఆర్సీ అధికారులు తెలిపారు. గతంలో సీవీరామన్, డా. హర్గోవింద్ ఖురానా, మదర్‌థెరిస్సా, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, అమర్త్యసేన్ తదితరులు సమాజానికి చేసిన సేవలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.