
మహనీయుల మాటల్లో క్రీస్తు
అత్యుత్తమ గురువు!
మానవాళికి లభించిన అత్యుత్తమ గురువుల్లో యేసు క్రీస్తు ఒకరు. భగవంతునితో క్రీస్తుకు గల సామీప్యానికి ఆయన జీవితమే నిదర్శనం. భగవంతుని సంకల్పాన్నీ, శక్తినీ యేసు బహిర్గతం చేసినట్లు వేరెవరూ చేయలేదు. అందుకే నేను ఆయనను దేవుని కుమారునిగా భావిస్తాను.
- మహాత్మాగాంధీ
ప్రతి మనిషీ క్రీస్తే!
నేను మనిషిని మనిషిగా విశ్వసిస్తాను. అందుకే నాకు ప్రతి మనిషీ సాక్షాత్తూ యేసుక్రీస్తే.
- మదర్ థెరిసా
ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాడు!
అలెగ్జాండర్, సీజర్, నేను పెద్ద పెద్ద సామ్రాజ్యాలను స్థాపించాం. అయితే, మేమంతా దేనిపై ఆధారపడ్డాం? బలప్రయోగంపై. కానీ క్రీస్తు అలా కాదు, ప్రేమ పునాదుల పైనే తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
- నెపోలియన్ బోనాపార్టే
దేవుడే మనిషిగా అవతరించాడు!
యేసుక్రీస్తు దేవుడు. సాక్షాత్తు దేవుడే మనిషిగా అవతరించాడు. ఆయన తనను తాను చాలా రూపాల్లో చాలా కాలాల్లో వ్యక్తం చేసుకున్నాడు. ఆ రూపాలనే మనం ఆరాధిస్తాం. మానవ రూపంలో అవతరించినందుకే మనం యేసును ఆరాధిస్తాం.
- స్వామి వివేకానంద
అత్యంత ప్రభావం కలవాడు!
నేను చరిత్రకారుడిని. విశ్వాసిని కాదు. నజరేతుకు చెందిన ఈ ప్రబోధకుడు చరిత్రకు తిరుగులేని కేంద్రంగా మారాడు. యేసు క్రీస్తు చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి.
- హెచ్.జి.వెల్స్, అమెరికన్ చరిత్రకారుడు
దేవుడు అందరివాడు!
ఒకే ప్రదేశానికి అనేక మార్గాలుంటాయి. అలాగే, మనకన్నా గొప్ప శక్తి, అతీతమైన శక్తి ఉంది. ఇలాంటి నమ్మకాలే మనల్ని కలుపుతున్నాయి. దేవుడు ప్రపంచంలోని అయిదింట నాలుగువంతుల ప్రజల్ని నరకానికే పరిమితం చేస్తాడని నేను నమ్మను. భారతదేశంలో క్రైస్తవ మత విశ్వాసంతో ఎన్నడూ సంబంధం పెట్టుకోనంత మాత్రాన హిందువుల బిడ్డను శాశ్వతంగా దహించివేస్తాడనీ అనుకోను. అలా అనుకోవడం నా ధార్మిక దృక్పథానికి విరుద్ధం. మా ఇంట్లో బైబిల్, ఖురాన్, భగవద్గీత మూడూ మా పుస్తకాల అరలో గ్రీకు, నార్వే, ఆఫ్రికన్ పురాణ గ్రంథాల పక్కనే ఉంటాయి.’’
- బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్షుడు