రాంచీ : ‘సేవే పరమావధిగా భావించి అనాధలను అక్కున చేర్చుకొని, వారికో జీవితాన్ని ఇచ్చి ఎందరికో తల్లిగా మారారు ‘ మదర్ థెరిసా’. అనాథలను, అభాగ్యులను ఆదుకోవడానికి ఆ మాతృమూర్తి స్థాపించినదే ‘మదర్ థెరిసా మిషనరి చారిటి’. ప్రజలకు సేవ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ చారిటిలకు ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఏర్పాటు చేసే ఈ చారిటిలకు కూడా డబ్బు జబ్బు పట్టుకుంది. ప్రజలకు తమ పై ఉన్న నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే చారిటిలో చేరిన అనాథలను డబ్బు కోసం విక్రయిస్తున్నారు.
ఎటువంటి దత్తత పత్రాలు లేకుండానే ఈ తంతు కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులుగా చారిటిలో అనాథ పిల్లలు ఒక్కొక్కరు మిస్ అవుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ చారిటి సభ్యులు పోలీస్ విచారణకు అంగీకరించకపోవడం వల్ల అధికారులు కూడా ఏమి చేయ్యలేక పోయారు. తాజాగా ఓ కుటుంబం ఇచ్చిన పిర్యాదు మేరకు అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
వివరాల.. ప్రకారం మదర్ థెరిసా చారిటి, నిర్మల్ హృదయ్ రాంచీ శాఖలో 13 మంది బాలికలు, 22 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఓ కుటుంబం బిడ్డను పెంచలేని స్థితిలో ఉండటం చేత తమ బిడ్డ బాగోగులను చూడమని నిర్మల్ హృదయ్ మిషనరి సంస్థలో అప్పగించి వెళ్లారు. కానీ తర్వాత మనసు మార్చుకుని బిడ్డను పెంచుకోవాలనుకున్నారు.
దాంతో చారిటికి వెళ్లి తమ బిడ్డను తిరిగి ఇవ్వమని కోరారు. కానీ చారిటి సభ్యులైన సిస్టర్ కోన్సాలియా, సేవకురాలు అనిమా ఇంద్వార్ బిడ్డ తమ దగ్గర లేదని చెప్పారు. దాంతో సదరు కుటుంబం తమకు న్యాయం చేయమంటూ పోలీసులను ఆశ్రయించారు. అయితే నిర్మల్ హృదయ్ చారిటి సంస్థ మీద ఇలాంటి పిర్యాదు రావడం ఇదే ప్రథమం కాదు.
గతంలోనూ నలుగురు చిన్నారులు తప్పిపోయారనే పిర్యాదులు వచ్చాయి. కానీ చారిటిల మీద నమ్మకంతో అధికారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాక చారిటి సభ్యలు ‘పోలీసులను లోపలికి వచ్చి దర్యాప్తు చేయనిచ్చే’వారు కాదన్నారు డీపీ సింగ్. అంతేకాక గతంలో ఒక కేసు విచారణ నిమిత్తం చారిటి లోపలికి వెళ్లి దర్యాప్తు నిర్వహించినప్పటికి, తప్పు జరిగినట్టు అనిపించే అనుమానస్పద అంశాలేవి తమ దృష్టికి రాలేదన్నారు.
కానీ ఈ సారి మాత్రం బిడ్డను కోల్పోయిన కుటుంబం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టదలుచుకోలేదు. అందుకే వారు చైల్డ్ వెల్ఫేర్ కమిటిని కలిసారు. ఈ విషయం గురించి మాలిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటి అధ్యక్షుడు ‘ఆ కుటుంబం ఇచ్చిన పిర్యాదు మేరకు నిర్మల్ హృదయ్ చారిటి మీద అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా సిస్టర్ కొన్సాలియా, సేవకురాలు అనిమా ఇంద్వార్‌ను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చారిటి వారు బాధిత కుటుంబం బిడ్డను 1.2 లక్షల రూపాయలకు వేరేవారికి అమ్మినట్లు ఒప్పుకున్నార’న్నారు.
పోలీసులు వీరి మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. క్రైస్తవ మిషనరిల్లో కూడా పిల్లలను అమ్మేస్తున్నారనే వార్తలు రావడంతో షాక్ తిన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర దాస్ వెంటనే మిగతా చారిటీలు, సేవా సంస్థల్లో కూడా తనిఖీలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఈ విషయం గురించి కోల్‌కతాలో ఉన్న ‘ మదర్ హౌస్ చారిటి’ ముఖ్య కేంద్రం అధికార ప్రతినిధి సునిత కుమార్ మేము ‘ఈ విషయాన్ని ఇంకా నమ్మలేక పోతున్నాము. మా సంస్థలోని సభ్యులు ఇలాంటి పనులు ఎన్నటికి చేయరు. విచారణలో వారి మీద నేరం రుజువయితే అప్పుడు మేము తగిన చర్యలు తీసుకుంటామ’న్నారు.
Comments
Please login to add a commentAdd a comment