Missionaries of Charity
-
‘నిర్మల్ హృదయ్’లో సీఎం జగన్ దంపతులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు మంగళవారం విజయవాడలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్మల్ హృదయ్ భవన్‌ను సందర్శించారు. నిర్మల్ హృదయ్‌లో నూతనంగా నిర్మించిన హోమ్ ఫర్ సిక్ అండ్ డైయింగ్ డెస్టిట్యూట్స్ భవనాన్ని సీఎం ప్రారంభించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. రాఘవయ్య పార్కు సమీపంలోని నిర్మల్ హృదయ్ భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతికి నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సాదరంగా స్వాగతం పలికారు. నిర్మల్ హృదయ్ భవన్లో చిన్నారులు సెబాస్టియన్, మేఘన ముఖ్యమంత్రి దంపతుల వెంట ఉన్నారు. చిన్నారులు ముందుండి సీఎం జగన్ దంపతుల చేయి పట్టుకుని నడిపించారు. అనంతరం ఆశ్రమంలోని మదర్ థెరిస్సా చిత్రపటానికి సీఎం జగన్ దంపతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భవన్‌లోని అనాథ పిల్లలు, వృద్ధులతో ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు రూహుల్లా, కల్పలతారెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: మహిళలకు జగనన్న ఇస్తున్న ఆసరా (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Russia-Ukraine War: ఇండియన్ నన్స్‌కు ఇక్కట్లు
ఐజ్వాల్: రష్యా దాడితో రణరంగంగా మారిన ఉక్రెయిన్‌లో భారత్‌కు చెందిన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సంస్థ మిజోరాం విభాగానికి చెందిన నన్స్ సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. యుద్ధం తీవ్రం కావడంతో రాజధానిలో సేవలనందిస్తున్న ఈ నన్స్ నిత్యావసరాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక శిబిరంలో తాము సేవలనందిస్తున్న నిరాశ్రయులతో కలిసి క్షేమంగా ఉన్నామని, అయితే కనీసావసరాల కోసం బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని వివరించారు. ఎన్ని బాధలైనా పడతామని, సేవా కార్యక్రమం విరమించి వెనక్కురామని సిస్టర్ రోసెలా నూతంగి, సిస్టర్ ఆన్ ఫ్రిదా స్పష్టం చేశారు. వీరితో పాటు వేరే దేశాలకు చెందిన మరో ముగ్గురు నన్స్ కలిసి 37 మంది నిరాశ్రయులను, ఒక కేరళ విద్యార్థిని సంరక్షిస్తున్నారు. వీరంతా క్షేమమేనని, కానీ ఆహారం కొరతతో బాధపడుతున్నారని రోసెలా బంధువు సిల్వీన్ చెప్పారు. కీవ్‌లో తాము బాగానే ఉన్నామని రోసెలా చెప్పారని సిల్వీన్ తెలిపారు. సంస్థలో రోసెలా 1981లో చేరారు. 1991లో ఒక మిషన్ కోసం సోవియట్‌కు వెళ్లారు. అక్కడ ఆమె 10 ఏళ్లు పనిచేశారు. 2013లో ఆమె ఉక్రెయిన్ చేరారని, రష్యన్ భాషలో ఆమెకు పట్టు ఉందని సిల్వీన్ తెలిపారు. గతంలో రెండుమార్లు మాత్రమే ఆమె ఇండియాకు వచ్చారన్నారు. మరో నన్ ఫ్రిడా 1995లో సంస్థలో చేరారు. అనంతరం అనేక దేశాల్లో సేవలనందించి 2019లో ఉక్రెయిన్ చేరారు. తమ సంస్థకు చెందిన ఐదుగురు నన్స్ ఉక్రెయిన్‌లో సేవలనందిస్తున్నారరని సంస్థ సుపీరియర్ జనరల్ సిస్టర్ మేరీ జోసెఫ్ చెప్పారు. వీరిని వెనక్కురమ్మని తాము కోరామని, కానీ సేవను విరమించి వచ్చేందుకు వీరు అంగీకరించలేదని తెలిపారు. స్థానికులకు సాయం అందిస్తూ వీరు కీవ్‌లో తలదాచుకుంటున్నారన్నారు. వీరి భద్రతపై రష్యా, ఉక్రెయిన్, భారత ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. -
మిషనరీస్ ఆఫ్ చారిటీకి లైసెన్స్ పునరుద్ధరణ
న్యూఢిల్లీ: మదర్ థెరిస్సా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ(ఎంఓసీ)’ ఎన్జీవోకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విదేశీ విరాళాల స్వీకరణకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్‌ను కేంద్ర హోం శాఖ శుక్రవారం పునరుద్ధరించింది. విదేశీ విరాళాల స్వీకరణ నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద సంస్థ లైసెన్స్‌ను పునరుద్ధరించిన నేపథ్యంలో ఇకపై విదేశీ విరాళాలను అందుకునే హక్కులు ఎంఓసీకి దక్కాయి. కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ఎంఓసీ సంస్థకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకుల ఖాతాలో నిల్వ ఉన్న నగదు మొత్తాలను వినియోగించుకునే అవకాశం చిక్కింది. నిరుపేదలకు శాశ్వత సేవే ఆశయంగా నోబెల్ గ్రహీత మదర్ థెరిస్సా 1950లో కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను నెలకొల్పారు. ‘నాటి నుంచి దశాబ్దాలుగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు ఇకమీదటా కొనసాగుతాయి. లైసెన్స్ పునరుద్ధరించారనే వార్త మా సంస్థకు నిజంగా పెద్ద ఊరట. లైసెన్స్ రాని ఈ రెండు వారాలూ దేశీయ విరాళాలతో మాకు పూర్తి సహాయసహకారాలు అందించిన దాతల దాతృత్వం అమూల్యం’ అని ఎంఓసీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎంఓసీకి వచ్చిన గత విదేశీ విరాళాలకు సంబంధించి కొంత ప్రతికూల సమాచారం ఉందనే కారణంతో 2021 డిసెంబర్ 25న క్రిస్మస్ రోజునే ఆ సంస్థ లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తును కేంద్ర హోం శాఖ తిరస్కరించడం తెల్సిందే. దీంతో దేశవ్యాప్తంగా విపక్షాలతోపాటు భిన్న వర్గాల నుంచి మోదీ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇన్నాళ్లూ ముస్లింలను వేధించిన బీజేపీ సర్కార్ తాజాగా క్రిస్టియన్ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుందని విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో లైసెన్స్‌ను పునరుద్ధరించడం గమనార్హం. భారత్‌లోని ఏదైనా ఎన్జీవో.. విదేశీ విరాళాలను పొందాలంటే లైసెన్స్ తప్పనిసరి. తప్పుగా కనబడింది.. 15 రోజుల్లో ఒప్పయిందా?: తృణమూల్ ఎంపీ డిరెక్ విరాళాల్లో అసంబద్ధ సమాచారం ఉందంటూ దరఖాస్తును తిరస్కరించిన 15 రోజుల్లోనే మళ్లీ లైసెన్స్‌ను కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటని మోదీ సర్కార్‌ను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డిరెక్ ఓబ్రియన్ సూటిగా ప్రశ్నించారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో క్రిస్టియన్ల ఓట్లను రాబట్టేందుకే కేంద్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందన్నారు. క్రైస్తవుల ప్రేమకు మోదీ తలొగ్గారన్నారు. ‘పవర్ ఆఫ్ లవ్ గ్రేటర్ దన్ ది పవర్ ఆఫ్ 56 ఇంచెస్’ అని ట్వీట్‌చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీనుద్ధేశిస్తూ 56 అంగుళాల ఛాతి అని గతంలో వ్యాఖ్యానించడం తెల్సిందే. -
కరుణాలయంపై కాఠిన్యమా!
నిస్సహాయులకు ఆపన్నహస్తం అందించేందుకు 71 ఏళ్ళ క్రితం ఏర్పాటైన సంస్థ అది. కష్టాల్లో ఉన్న దీనులకు కేయూతనివ్వడానికి అమృతమూర్తి మదర్ థెరెసా ఆరంభించిన కరుణాలయం అది. అలాంటి ఇంటర్నేషనల్ ట్రస్ట్ ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ (ఎంఓసీ) ఇప్పుడు వివాదాస్పద వార్తల్లో నిలవడం విషాదం. ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేందుకు వీలుగా విరాళాలను స్వీకరించడానికి ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’ (ఎఫ్సీఆర్ఏ) కింద ఆ సుప్రసిద్ధ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీఓ)కున్న లైసెన్స్‌ను పొడిగించడానికి కేంద్ర హోమ్‌శాఖ నిరాకరించింది. అదీ సరిగ్గా క్రిస్మస్ నాడు ఆ నిర్ణయం రావడం అనేక ప్రశ్నలకు తావిచ్చింది. కోల్‌కతా కేంద్రంగా నడిచే ఈ సేవాసంస్థకు సంబంధించి ‘కొంత ప్రతికూల సమాచారం’ గుర్తించినందు వల్లే లైసెన్స్‌ను పొడిగించబోమన్నామని ప్రభుత్వ అధికారులు సోమవారమిచ్చిన వివరణ. కానీ, తమకొచ్చిన సదరు ‘ప్రతికూల సమాచారం’ ఏమిటన్నది ప్రభుత్వం పెదవి విప్పకపోవడమే విచిత్రం. పారదర్శకత లేని ఈ సర్కారీ చర్యతో నేరుగా ఆ సంస్థల్లోని 22 వేల మంది రోగులకూ, ఉద్యోగులకూ ఆహారం, ఔషధాలు కరవయ్యాయి. అందుకే, తృణమూల్ కాంగ్రెస్ మొదలు కాంగ్రెస్ సహా రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. కొన్నేళ్ళుగా ఎఫ్సీఆర్ఏ చట్టాలను కఠినతరం చేస్తూ, ఎన్జీఓలపైన ప్రభుత్వానికి బోలెడంత పెత్తనం కట్టుబెడుతూ పాలకులు చేపడుతున్న చర్యలతో పలువురికి అనేక అనుమానాలూ వస్తున్నాయి. భారతదేశాన్ని స్వగృహంగా మార్చుకున్న జన్మతః అల్బేనియన్ క్రైస్తవ సన్న్యాసిని మదర్ థెరెసా 1950లో కలకత్తా వీధుల్లో స్థాపించిన సేవాసంస్థ – ఎంఓసీ. సేవాతత్త్వంతో నోబెల్ శాంతి బహుమతి పొందిన ప్రేమజ్యోతిగా వెలిగిన ఆ ‘భారతరత్న’ం పెట్టిన ఈ సంస్థ మానవతా దృష్టితో సుదీర్ఘకాలంగా ఎందరికో సేవలందిస్తూ, అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఎన్నో ఏళ్ళుగా ఆ సంస్థకు విదేశీ విరాళాలు అందుతూనే ఉన్నాయి. వాటికి సంబంధించి ఏటా నివేదికలు సమర్పిస్తూనే ఉంది. ఒకవేళ ఆ సంస్థ గనక నిబంధనల్ని ఉల్లంఘిస్తే, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. తప్పు లేదు. కానీ, ముందుగా చేసిన ఆ తప్పులేమిటో, వాటి స్వభావమేమిటో కూడా ప్రభుత్వమే ప్రకటించాలి కదా! ఇప్పుడు అలా జరగకపోవడం ప్రధానంగా విమర్శకు కారణమైంది. అనాథలు, అభాగ్యులు, అంధులు, అంగవికలురు, అసహాయులైన వృద్ధులు, వరదలు – కరవు కాటకాలు – మహమ్మారి రోగాల బారిన పడ్డ వారిని కంటికి రెప్పలా కాపాడుకొనే పనిలో దాదాపు 139 దేశాల్లో ఎంఓసీ విస్తరించింది. అలాంటి సేవాసంస్థకు అశేష అభిమానులతో పాటు, బలవంతపు మత మార్పిడికీ, బాలికల అక్రమ రవాణాకూ పాల్పడుతోందని నిరాధార ఆరోపణలు చేసే సంప్రదాయవాద సంస్థల ఏజెంట్లూ అనేకులున్నారు. గుజరాత్‌లోని వడోదరాలో బాలికా కేంద్రంపై ఈ నెలలో కొందరిచ్చిన ఫిర్యాదు ఫలితమే తాజా చర్య అని లోపాయకారీగా అధికారుల మాట. ఆడిట్లో అవకతవకలని మరో మాట. అయితే, వాటిల్లో నిజం లేదని ఎంఓసీ ఖండిస్తోంది. 2016–17, 2018–19 మధ్య ఏటా రూ. 58 వేల కోట్లకు పైగా విదేశీ విరాళాలొచ్చాయని హోమ్ శాఖ డేటా. నిజానికి, గత ఏడేళ్ళలో మోదీ సర్కారు విదేశీ విరాళాల మూలాలను గుప్పెట బిగించింది. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ, కొన్ని వందల ఎన్జీఓల ఎఫ్సీఆర్ఏ లైసెన్సులను రద్దు చేసింది. ఎఫ్సీఆర్ఏలో గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం మరిన్ని మార్పులు చేసింది. ఎన్జీఓలకొచ్చే విదేశీ విరాళాలపై కత్తెర వేసేలా ప్రభుత్వానికి అదనపు అధికారాలూ వచ్చిపడ్డాయి. ఆ అధికారాన్ని అనేక మానవ హక్కుల బృందాలపై హోమ్ శాఖ ప్రయోగించడం, ఆ ఆదేశాల్లో కొన్నింటిని కోర్టులు కొట్టేయడం జరిగిన కథ. ఈ చట్టం కింద దేశంలో 22 వేలకు పైగా ఎన్జీఓలు నమోదు కాగా, వాటిలో కనీసం 10 – 15 శాతానికి మోదీ పాలనలో లైసెన్సు పొడిగింపులు దక్కబోవని నిపుణుల మాట. ‘దేశ భద్రతకూ, ప్రజా ప్రయోజనాలకూ భంగకరమైన చర్యల’కు చెక్ పెట్టడం ఈ ఎఫ్సీఆర్ఏ ఉద్దేశం. మదర్ థెరెసా పెట్టిన సంస్థ అలాంటి పనేం చేసింది? ముందుగా షోకాజ్ నోటీసులివ్వాల్సి ఉన్నా, ఈ తాజా ఘటనలోనూ అలాంటివేవీ పాటించలేదు. అందుకే, అనేక ఎన్జీఓలకు ప్రభుత్వ చర్యలకు కారణాలేమిటో కూడా తెలియని పరిస్థితి. పైపెచ్చు, ప్రభుత్వంపై విమర్శనాత్మకంగా వ్యవహరిస్తున్న పౌర స్వేచ్ఛ, మానవ హక్కుల సంస్థలపై ఇలా వేటు ఎక్కువగా పడుతోందన్నది ఓ విశ్లేషణ. ఇటీవల ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, లాయర్స్ కలెక్టివ్, గ్రీన్‌పీస్ ఇండియా, ది ఫోర్డ్ ఫౌండేషన్ లాంటి ఎన్జీఓల విదేశీ విరాళాల లైసెన్సులు సస్పెండవడమో, రద్దు కావడమో అందుకు ఉదాహరణ. ఒకపక్క దేశంలోని పలు రాష్ట్రాల్లో చర్చిలపైన దాడులు, మరోపక్క కర్ణాటకలో కొత్తగా పెట్టిన మతమార్పిడి వ్యతిరేక బిల్లు మైనారిటీల్లో ఆందోళన రేపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇలా ప్రసిద్ధ ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’పై తీసుకున్న చర్య ఎలాంటి సంకేతమిస్తుంది? ఆహారం, విద్యే కాదు... ఆక్సిజన్ నుంచి ప్లాస్మా దాకా అనేకం ప్రభుత్వమే అందరికీ అందించలేని చోట ఇలాంటి సంస్థల సేవ నిరుపమానం. చట్టం సర్వోన్నతమైనదే. కానీ, దాన్ని సాకుగా తీసుకొని, నిరూపణ కాని సమాచారంతో మానవతావాద కృషికి గండికొట్టకూడదు. అలా చేస్తే అంతకన్నా నేరం, ఘోరం మరొకటి ఉండదు. ఇప్పుడిక ప్రజల్లోని అనుమానాల్ని పాలకులే పోగొట్టాలి. పౌర సమాజ సంస్థలను ఇరుకునపెట్టడానికి ప్రభుత్వం విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని వాటంగా వాడుకుంటోందనే భావనను తొలగించాలి. ఆ బాధ్యత ప్రభుత్వానిదీ, ప్రభువులదే! -
మదర్ థెరిసా సంస్థ బ్యాంకు ఖాతాల స్తంభన
కోల్‌కతా/న్యూఢిల్లీ: సెయింట్ మదర్ థెరిసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’కి చెందిన భారత్‌లో ఉన్న బ్యాంకు ఖాతాలన్నింటికీ కేంద్ర హోంశాఖ స్తంభింపజేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. ‘మదర్ థెరిసా నెలకొల్పిన సంస్థ... మిషనరీస్ ఆఫ్ చారిటీ (ఎంఓసీ)కు భారత్‌లో ఉన్న బ్యాంకు ఖాతాలను క్రిస్మస్ రోజున కేంద్ర హోంశాఖ స్తంభింపజేసిందని తెలిసి షాక్ గురయ్యా! 22 వేల మంది రోగులు, ఉద్యోగులకు మందులు, ఆహారం అందకుండా పోయింది. చట్టమే సర్వోన్నతమైనది... కాకపోతే మానవతాసాయం విషయంలో రాజీపడకూడదు’ అని మమత ట్వీట్ చేయడం ప్రకంపనలు సృష్టించింది. ఎంతోమంది నిరుపేదలు, అభాగ్యుల వైద్యం, సంక్షేమం కోసం పనిచేస్తున్న మిషనరీస్ ఆఫ్ చారిటీ ఖాతాలను స్తంభింపజేశారనే వార్త తీవ్ర కలకలం రేపింది. టీఎంసీతో పాటు సీపీఎం తదితర విపక్షాలు కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించాయి. దాంతో హోంమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. విదేశాల నుంచి విరాళాల సేకరణకు వీలుగా... ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ)–2011 కింద రిజిస్ట్రేషన్‌ను రెన్యూవల్ చేయాలని మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ పెట్టుకున్న దరఖాస్తును ఈనెల 25న తిరస్కరించామని తెలిపింది. ఈ చట్టం కింద రిజిస్ట్రేషన్‌కు అర్హమైన నిబంధనలను మిషనరీస్ ఆఫ్ చారిటీ సంతృప్తిపరచడం లేదని, పైగా ఈ సంస్థపై తమకు రాతపూర్వకంగా కొంత ప్రతికూల సమాచారం అందిందని పేర్కొంది. తాము బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయలేదని వివరణ ఇచ్చింది. అయితే ఈ ప్రతికూల సమాచారమేమిటి? ఏయే నిబంధనలను మిషనరీస్ ఆఫ్ చారిటీ ఉల్లంఘించదనే వివరాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బయటపెట్టలేదు. ‘ఎప్‌సీఆర్‌ఏ కింద మిషనరీస్ ఆఫ్ చారిటీ రిజిస్ట్రేషన్ గడువు ఈ ఏడాది అక్టోబరు 31తోనే ముగిసింది. దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న ఇతర సంస్థలతో పాటు మిషనరీస్ ఆఫ్ చారిటీకి కూడా గడువును డిసెంబరు 31 దాకా పొడిగించాం’ అవి హోంశాఖ వివరించింది. ఎంఓసీయే తమ విదేశీ నిధుల ఖాతాలను స్తంభింపజేయాలని కోరినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమకు తెలిపిందని పేర్కొంది. ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ నిరాకరణ నిర్ణయంపై పునఃపరిశీలన కోసం ఎంఓసీ నుంచి తమకు ఎలాంటి విజ్ఞప్తి అందలేదని హోంశాఖ తెలిపింది. మేమే లావాదేవీలు నిలిపివేశాం: ఎంఓసీ విదేశీ నిధుల జమయ్యే బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేయాలని దేశంలోని తమ ప్రాంతీయ కేంద్రాలను కోరినట్లు మిషనరీస్ ఆప్ చారిటీ సోమవారం రాత్రి ఒక ప్రకటనను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ రెన్యూవల్ అంశం పరిష్కారమయ్యే వరకు ఆ ఖాతాలను వాడొద్దని చెప్పామని తెలిపింది. ‘ఎఫ్సీఆర్ఏ కింద మిషనరీస్ ఆఫ్ చారిటీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం, సస్పెండ్ చేయడం గాని జరగలేదని మేము స్పష్టం చేయదలచుకున్నాం. మా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని హోంశాఖ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మా రిజిస్ట్రేషన్ రెన్యూవల్ దరఖాస్తుకు ఆమోదం లభించలేదని మాత్రమే మాకు సమాచారమిచ్చింది. మావైపు నుంచి ఎలాంటి ఉల్లంఘనలు జరగకూడదనే ఉద్దేశంతో సమస్య పరిష్కారమయ్యే వరకు విదేశీ నిధులు జమయ్యే ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేయాలని మా కేంద్రాలను కోరాం’ అని ఎంఓసీ సూపీరియర్ జనరల్ సిస్టర్ ఎం.ప్రేమ సంతకంతో విడుదలైన ప్రకటన తెలిపింది. అయితే హోంశాఖ చెప్పినట్లుగా ఖాతాలను స్తంభింపజేయాలని ఎంఓసీయే ఎస్బీఐని కోరిందనే అంశంపై... ఈ ప్రకటనలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మిషనరీస్ ఆఫ్ చారిటీని మదర్ థెరిసా కోల్‌కతా కేంద్రంగా 1950లో స్థాపించారు. రోమన్ క్యాథలిక్ మతాధిపతుల శాశ్వత కమిటీయే ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ. దీని తరఫున దేశ విదేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆసుపత్రులు, శరణాలయాలు నడుస్తున్నాయి. -
మదర్ థెరిసా మిషనరీలో దారుణం
రాంచీ : ‘సేవే పరమావధిగా భావించి అనాధలను అక్కున చేర్చుకొని, వారికో జీవితాన్ని ఇచ్చి ఎందరికో తల్లిగా మారారు ‘ మదర్ థెరిసా’. అనాథలను, అభాగ్యులను ఆదుకోవడానికి ఆ మాతృమూర్తి స్థాపించినదే ‘మదర్ థెరిసా మిషనరి చారిటి’. ప్రజలకు సేవ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ చారిటిలకు ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఏర్పాటు చేసే ఈ చారిటిలకు కూడా డబ్బు జబ్బు పట్టుకుంది. ప్రజలకు తమ పై ఉన్న నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే చారిటిలో చేరిన అనాథలను డబ్బు కోసం విక్రయిస్తున్నారు. ఎటువంటి దత్తత పత్రాలు లేకుండానే ఈ తంతు కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులుగా చారిటిలో అనాథ పిల్లలు ఒక్కొక్కరు మిస్ అవుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ చారిటి సభ్యులు పోలీస్ విచారణకు అంగీకరించకపోవడం వల్ల అధికారులు కూడా ఏమి చేయ్యలేక పోయారు. తాజాగా ఓ కుటుంబం ఇచ్చిన పిర్యాదు మేరకు అసలు నిజం వెలుగులోకి వచ్చింది. వివరాల.. ప్రకారం మదర్ థెరిసా చారిటి, నిర్మల్ హృదయ్ రాంచీ శాఖలో 13 మంది బాలికలు, 22 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఓ కుటుంబం బిడ్డను పెంచలేని స్థితిలో ఉండటం చేత తమ బిడ్డ బాగోగులను చూడమని నిర్మల్ హృదయ్ మిషనరి సంస్థలో అప్పగించి వెళ్లారు. కానీ తర్వాత మనసు మార్చుకుని బిడ్డను పెంచుకోవాలనుకున్నారు. దాంతో చారిటికి వెళ్లి తమ బిడ్డను తిరిగి ఇవ్వమని కోరారు. కానీ చారిటి సభ్యులైన సిస్టర్ కోన్సాలియా, సేవకురాలు అనిమా ఇంద్వార్ బిడ్డ తమ దగ్గర లేదని చెప్పారు. దాంతో సదరు కుటుంబం తమకు న్యాయం చేయమంటూ పోలీసులను ఆశ్రయించారు. అయితే నిర్మల్ హృదయ్ చారిటి సంస్థ మీద ఇలాంటి పిర్యాదు రావడం ఇదే ప్రథమం కాదు. గతంలోనూ నలుగురు చిన్నారులు తప్పిపోయారనే పిర్యాదులు వచ్చాయి. కానీ చారిటిల మీద నమ్మకంతో అధికారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాక చారిటి సభ్యలు ‘పోలీసులను లోపలికి వచ్చి దర్యాప్తు చేయనిచ్చే’వారు కాదన్నారు డీపీ సింగ్. అంతేకాక గతంలో ఒక కేసు విచారణ నిమిత్తం చారిటి లోపలికి వెళ్లి దర్యాప్తు నిర్వహించినప్పటికి, తప్పు జరిగినట్టు అనిపించే అనుమానస్పద అంశాలేవి తమ దృష్టికి రాలేదన్నారు. కానీ ఈ సారి మాత్రం బిడ్డను కోల్పోయిన కుటుంబం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టదలుచుకోలేదు. అందుకే వారు చైల్డ్ వెల్ఫేర్ కమిటిని కలిసారు. ఈ విషయం గురించి మాలిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటి అధ్యక్షుడు ‘ఆ కుటుంబం ఇచ్చిన పిర్యాదు మేరకు నిర్మల్ హృదయ్ చారిటి మీద అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా సిస్టర్ కొన్సాలియా, సేవకురాలు అనిమా ఇంద్వార్ను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చారిటి వారు బాధిత కుటుంబం బిడ్డను 1.2 లక్షల రూపాయలకు వేరేవారికి అమ్మినట్లు ఒప్పుకున్నార’న్నారు. పోలీసులు వీరి మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. క్రైస్తవ మిషనరిల్లో కూడా పిల్లలను అమ్మేస్తున్నారనే వార్తలు రావడంతో షాక్ తిన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర దాస్ వెంటనే మిగతా చారిటీలు, సేవా సంస్థల్లో కూడా తనిఖీలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయం గురించి కోల్‌కతాలో ఉన్న ‘ మదర్ హౌస్ చారిటి’ ముఖ్య కేంద్రం అధికార ప్రతినిధి సునిత కుమార్ మేము ‘ఈ విషయాన్ని ఇంకా నమ్మలేక పోతున్నాము. మా సంస్థలోని సభ్యులు ఇలాంటి పనులు ఎన్నటికి చేయరు. విచారణలో వారి మీద నేరం రుజువయితే అప్పుడు మేము తగిన చర్యలు తీసుకుంటామ’న్నారు. -
థెరిసా నివాసం పేల్చేందుకు ఐసిస్ కుట్ర
కోల్‌కతా: భారత రత్న సెయింట్ థెరిస్సా(మదర్ థెరిస్సా) నివాసంపై దాడి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రణాళికలు రచించారు. కోల్‌కతాలోని ఏజేసీ రోడ్డులో గల ఆమె నివసించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయాలని సంకల్పించారు. ఇక్కడే సెయింట్ థెరిస్సాను ఖననం చేసిన విషయం కూడా తెలిసిందే. ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదులు చేసిన ఈ కుట్రను బయటపెట్టారు. గత జూలైలో బుర్ద్వాన్ రైల్వే స్టేషన్లో ఎన్ఐఏ అధికారులు మహ్మద్ మసీరుద్దీన్ అలియాస్ ముసాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢాకాలోని ఆర్టిసన్ బేకరీపై ఉగ్రదాడి అనంతరం అప్రమత్తమైన ఎన్ఐఏ ముసాను అదుపులోకి తీసుకొని విచారించింది. అనంతరం ఆ విచారణకు సంబంధించిన చార్జిషీట్‌ను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో సమర్పించారు. ఇందులో థెరిసా నివాసం ఇంటిపై ఉగ్రదాడికి కుట్రలు చేసినట్లు ముసా ఒప్పుకున్నాడనే విషయం వెల్లడించారు. ముసాను ఒక్క ఎన్ఐఏ అధికారులు మాత్రమే కాకుండా ఎఫ్‌బీఐ అధికారులు, స్థానిక అధికారులు కూడా విచారించారు. ఈ విచారణలో తనతోపాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని వారు తర్వాత వచ్చి దాడిలో పాల్గొంటామని చెప్పినట్లు తెలిపాడు. పాశ్చాత్యులను, ఇతర దేశాలనుంచి పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలనుకున్నామన్నారు. పాశ్చాత్యులంటే తనకు అసహ్యం అని చెప్పారు. అతడి సమాచారం ఇవ్వగానే ఎలాంటి ఆందోళన పరిస్థితులు ఏర్పడకుండా మఫ్టీ డ్రెస్సులో కొంతమంది పోలీసులను థెరిసా నివాసం వద్ద ఉంచామని, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని విచారించి పంపిస్తున్నారని తెలిపాడు. -
ఇక పిల్లల్ని దత్తత ఇవ్వం!
కోల్‌కతా: కరుణామూర్తి మదర్ థెరిస్సా 65 ఏండ్ల కిందట స్థాపించిన ద మిషినరీస్ ఆఫ్ చారిటీ సంస్థ పిల్లల్ని దత్తత ఇవ్వడం మానుకోవాలని నిర్ణయించింది. పిల్లల దత్తత విషయమై కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాల నేపథ్యంలో రెండు నెలల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నా.. దానిని శనివారం ప్రకటించింది. తమ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అనాథ, అభాగ్య పిల్లల బాగోగులు చూసుకోవడానికి ముందుకొచ్చేవారికి మిషినరీస్ ఆఫ్ చారిటీ సంస్థ వారిని దత్తత ఇచ్చేది. మేనకాగాంధీ నేతృత్వంలోని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వశాఖ పిల్లల దత్తత విషయమై కొన్ని నిబంధనలతో తాజా మార్గదర్శకాలను జారీచేసింది. ఈ నేపథ్యంలో మదర్ థెరిస్సా నిర్దేశించిన ప్రమాణాలను అమలుచేస్తూ నూతన మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవడం కష్టం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మిషనరీ ఒక ప్రకటనలో తెలిపింది. తాము నిర్వహిస్తున్న అడాప్షన్ కేంద్రాలను స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. మిషనరీకి 19 అడాప్షన్ కేంద్రాలు ఉన్నాయి. సింగిల్ పేరెంట్, గే, లెస్బియన్ వంటివారికి పిల్లల్ని దత్తత ఇవ్వరాదని చారిటీ వ్యతిరేకించిందనే వార్తలు వచ్చాయి. అయితే 2011 మార్గదర్శకాల్లోనూ, 2015 మార్గదర్శకాల్లోనూ సింగిల్ పేరెంట్కు దత్తత ఇవ్వవచ్చునని సూచించింది. అయితే గే, లేస్బియన్ వంటివారి గురించి ప్రస్తావించలేదు. -
సిస్టర్ నిర్మల కన్నుమూత
-
సిస్టర్ నిర్మల కన్నుమూత
కోల్‌కతా: సిస్టర్ నిర్మలా జోషి (81) మంగళవారం కన్నుమూశారు. మదర్ థెరిస్సా తర్వాత సిస్టర్ నిర్మల మిషనరీ ఆఫ్ ఛారిటీస్ బాధ్యతలు చేపట్టారు. మదర్ థెరెస్సా నెలకొల్పిన మిషనరీ ఆఫ్ ఛారిటీస్ బాధ్యతలను సిస్టర్ నిర్మల 1997-2009 మధ్య బాధ్యతలు నిర్వహించారు. సిస్టర్ సేవలకు గుర్తింపుగా 2009లో ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. కాగా సిస్టర్ నిర్మల మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. సిస్టర్ నిర్మల మృతి ప్రపంచానికి తీరని లోటు అని ఆమె తన ట్విట్టర్లో పేర్కొన్నారు. సిస్టర్ నిర్మల 1934, జూలై 23న రాంచీలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నేపాల్‌కు చెందిన హిందూ జాతీయులు. పాట్నాలోని క్రిస్టియన్ మిషనరీలో సిస్టర్ నిర్మల తన విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో మదర్ థెరిస్సా సేవాభావం నచ్చి తన 17వ ఏటానే రోమన్ క్యాథలిక్లోకి మారిపోయారు. అనంతరం అనంతరం మదర్ థెరిస్సా స్థాపించిన మిషనరీ ఆఫ్ ఛారిటీస్‌లో చేరి తన సేవలను అందించారు. -
అమృతమూర్తి
ఎనిమిది మంది పిల్లలున్న ఒక హైందవ కుటుంబం ఆకలితో నకనకలాడుతోందని ఒక వ్యక్తి వచ్చి మదర్ థెరిస్సాకు చెప్పాడు. కొన్ని రోజులుగా వాళ్లు పస్తులుంటున్నారని ఆవేదన చెందాడు. మదర్ వెంటనే బియ్యం మూటతో అక్కడకు వెళ్లారు. పిల్లల కళ్లు ఆకలిని ప్రతిఫలిస్తున్నాయి. ఇంటావిడ ఎంతో కృతజ్ఞతతో బియ్యం తీసుకుని, రెండు సమభాగాలు చేసింది! ఒక భాగాన్ని సంచిలో వేసుకుని బయటికి వెళ్లి వచ్చింది. ‘‘అంత హడావుడిగా ఎక్కడికి వెళ్లావు’’ అని అడిగారు మదర్. ‘‘వాళ్లు కూడా ఆకలితో ఉన్నారు’’ అని సమాధానం! వెంటనే మదర్‌కు అర్థం కాలేదు. ఆమె చెప్తోంది పొరుగున్న ఉన్న ముస్లిం కుటుంబం గురించి. మదర్ తెచ్చిన బియ్యంలో సగం... వాళ్లకు ఇచ్చి వచ్చింది! ఆ సాయంత్రం మదర్ మళ్లీ బియ్యం తీసుకెళ్లలేదు. పంచుకోవడంలోని ఆనందాన్ని వాళ్లకు మిగలనివ్వడం న్యాయమనిపించింది మదర్‌కు. తల్లి నుంచి ఆహారం రూపంలో లభించిన ప్రేమతో పిల్లలూ గెంతులేస్తున్నారు. ‘‘ప్రేమ అలా ఇంటి నుంచే మొదలౌతుంది. ఇంటి నుంచి ఇంటికి, మనిషి నుంచి మనిషికి విశ్వవ్యాప్తం అవుతుంది’’ అంటారు మదర్ థెరిస్సా. ఇండియా వచ్చి ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ (కోల్‌కతా) స్థాపించి మదర్ థెరిస్సాగా భారతీయ సంస్కృతిలో మమేకం అయిన అల్బేనియా సంతతి అమ్మాయి.. యాగ్నెస్ గాంగ్జే బోయాజూ (మదర్ అసలు పేరు). మదర్ సాధించిన నోబెల్ శాంతి బహుమతి, భారతరత్న అవార్డులు రెండూ కూడా ‘మానవతావాది’గా ఆమెకున్న ప్రఖ్యాతికి ఇంచుమించు మాత్రమే సరిసాటి అనాలి. మదర్ ఏనాడూ తనకొక ప్రత్యేకమైన గుర్తింపును కోరుకోలేదు. ప్రేమ కోసం తపిస్తున్న వారికి తన ఆప్యాయమైన అమృత హస్తాన్ని అందించడమూ మానలేదు. అన్నం లేకపోవడం కన్నా ఆప్యాయత కరవవడం అసలైన పేదరికమని మదర్ నమ్మారు. ప్రేమకు, పలకరింపులకు నోచుకోని నిర్భాగ్యులకు తన జీవితాన్ని అంకితం చేశారు. మనుషుల్లో మంచితనం ఉందనీ, పంచుకుంటే అది విశ్వవ్యాప్తం అవుతుందనీ ప్రబోధించారు. ఓసారి కొందరు అమెరికన్ ప్రొఫెసర్లు కోల్‌కతాలో మదర్ థెరిస్సా నడుపుతున్న మిషనరీ హోమ్‌లను సందర్శించడానికి వచ్చారు. అక్కడ.. మరణావస్థలో ప్రశాంతంగా కన్నుమూసినవారిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ‘‘ఎలా సాధ్యం?’ అని అడిగారు. వాళ్లంతా అమెరికాలోని వేర్వేరు యూనివర్శిటీల నుంచి వచ్చినవారు. తిరిగి వెళ్లే ముందు - ‘‘మదర్... గుర్తుంచుకునే ఒక మాట చెప్పండి’’ అని అడిగారు. ‘‘ఒకరికొకరు ఎదురుపడినప్పుడు నవ్వుతూ పలకరించుకోండి. కనీసం చిరునవ్వుతో చూసుకోండి. ఇందులో సాధ్యం కానిదేమీ లేదు. మొదట కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడండి. బయట కూడా అదే అలవాటవుతుంది. అప్పుడు ప్రపంచమే ఒక కుటుంబమౌతుంది’’ అని చెప్పారు మదర్. విస్మయంగా చూశారు వాళ్లు. ‘‘దేవుడి మహిమను కూడా తరచు మనం అలాగే నమ్మలేనట్లు చూస్తుంటాం. దేవుడి గొప్పతనం, ప్రేమ గొప్పతనం, పలకరింపు గొప్పతనం, ప్రశాంతత గొప్పతనం, చిరునవ్వు గొప్పతనం తెలుసుకోవాలంటే ఎవరికైనా సేవ చేసి చూడండి. గొప్ప గొప్ప పనులు చేయనవసరం లేదు. చిన్న పనులనే గొప్ప ప్రేమతో చెయ్యండి చాలు’’ అంటారు మదర్. విశ్వమాతగా అవతరించిన ఈ క్యాథలిక్కు మతస్థురాలు 1910 ఆగస్టు 26న మేసిడోనియాలో జన్మించారు. 87 ఏళ్ల వయసులో 1997 సెప్టెంబర్ 5న కోల్‌కతాలో కన్నుమూశారు.