అమృతమూర్తి
ఎనిమిది మంది పిల్లలున్న ఒక హైందవ కుటుంబం ఆకలితో నకనకలాడుతోందని ఒక వ్యక్తి వచ్చి మదర్ థెరిస్సాకు చెప్పాడు. కొన్ని రోజులుగా వాళ్లు పస్తులుంటున్నారని ఆవేదన చెందాడు. మదర్ వెంటనే బియ్యం మూటతో అక్కడకు వెళ్లారు. పిల్లల కళ్లు ఆకలిని ప్రతిఫలిస్తున్నాయి. ఇంటావిడ ఎంతో కృతజ్ఞతతో బియ్యం తీసుకుని, రెండు సమభాగాలు చేసింది! ఒక భాగాన్ని సంచిలో వేసుకుని బయటికి వెళ్లి వచ్చింది.
‘‘అంత హడావుడిగా ఎక్కడికి వెళ్లావు’’ అని అడిగారు మదర్.
‘‘వాళ్లు కూడా ఆకలితో ఉన్నారు’’ అని సమాధానం! వెంటనే మదర్‌కు అర్థం కాలేదు.
ఆమె చెప్తోంది పొరుగున్న ఉన్న ముస్లిం కుటుంబం గురించి. మదర్ తెచ్చిన బియ్యంలో సగం... వాళ్లకు ఇచ్చి వచ్చింది! ఆ సాయంత్రం మదర్ మళ్లీ బియ్యం తీసుకెళ్లలేదు. పంచుకోవడంలోని ఆనందాన్ని వాళ్లకు మిగలనివ్వడం న్యాయమనిపించింది మదర్‌కు. తల్లి నుంచి ఆహారం రూపంలో లభించిన ప్రేమతో పిల్లలూ గెంతులేస్తున్నారు. ‘‘ప్రేమ అలా ఇంటి నుంచే మొదలౌతుంది. ఇంటి నుంచి ఇంటికి, మనిషి నుంచి మనిషికి విశ్వవ్యాప్తం అవుతుంది’’ అంటారు మదర్ థెరిస్సా.
ఇండియా వచ్చి ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ (కోల్‌కతా) స్థాపించి మదర్ థెరిస్సాగా భారతీయ సంస్కృతిలో మమేకం అయిన అల్బేనియా సంతతి అమ్మాయి.. యాగ్నెస్ గాంగ్జే బోయాజూ (మదర్ అసలు పేరు). మదర్ సాధించిన నోబెల్ శాంతి బహుమతి, భారతరత్న అవార్డులు రెండూ కూడా ‘మానవతావాది’గా ఆమెకున్న ప్రఖ్యాతికి ఇంచుమించు మాత్రమే సరిసాటి అనాలి. మదర్ ఏనాడూ తనకొక ప్రత్యేకమైన గుర్తింపును కోరుకోలేదు. ప్రేమ కోసం తపిస్తున్న వారికి తన ఆప్యాయమైన అమృత హస్తాన్ని అందించడమూ మానలేదు. అన్నం లేకపోవడం కన్నా ఆప్యాయత కరవవడం అసలైన పేదరికమని మదర్ నమ్మారు. ప్రేమకు, పలకరింపులకు నోచుకోని నిర్భాగ్యులకు తన జీవితాన్ని అంకితం చేశారు. మనుషుల్లో మంచితనం ఉందనీ, పంచుకుంటే అది విశ్వవ్యాప్తం అవుతుందనీ ప్రబోధించారు.
ఓసారి కొందరు అమెరికన్ ప్రొఫెసర్లు కోల్‌కతాలో మదర్ థెరిస్సా నడుపుతున్న మిషనరీ హోమ్‌లను సందర్శించడానికి వచ్చారు. అక్కడ.. మరణావస్థలో ప్రశాంతంగా కన్నుమూసినవారిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ‘‘ఎలా సాధ్యం?’ అని అడిగారు. వాళ్లంతా అమెరికాలోని వేర్వేరు యూనివర్శిటీల నుంచి వచ్చినవారు. తిరిగి వెళ్లే ముందు - ‘‘మదర్... గుర్తుంచుకునే ఒక మాట చెప్పండి’’ అని అడిగారు.
‘‘ఒకరికొకరు ఎదురుపడినప్పుడు నవ్వుతూ పలకరించుకోండి. కనీసం చిరునవ్వుతో చూసుకోండి. ఇందులో సాధ్యం కానిదేమీ లేదు. మొదట కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడండి. బయట కూడా అదే అలవాటవుతుంది. అప్పుడు ప్రపంచమే ఒక కుటుంబమౌతుంది’’ అని చెప్పారు మదర్. విస్మయంగా చూశారు వాళ్లు.
‘‘దేవుడి మహిమను కూడా తరచు మనం అలాగే నమ్మలేనట్లు చూస్తుంటాం. దేవుడి గొప్పతనం, ప్రేమ గొప్పతనం, పలకరింపు గొప్పతనం, ప్రశాంతత గొప్పతనం, చిరునవ్వు గొప్పతనం తెలుసుకోవాలంటే ఎవరికైనా సేవ చేసి చూడండి. గొప్ప గొప్ప పనులు చేయనవసరం లేదు. చిన్న పనులనే గొప్ప ప్రేమతో చెయ్యండి చాలు’’ అంటారు మదర్. విశ్వమాతగా అవతరించిన ఈ క్యాథలిక్కు మతస్థురాలు 1910 ఆగస్టు 26న మేసిడోనియాలో జన్మించారు. 87 ఏళ్ల వయసులో 1997 సెప్టెంబర్ 5న కోల్‌కతాలో కన్నుమూశారు.