Bharat Ratna
-
రతన్ టాటాకు భారత రత్న!.. మహారాష్ట్ర కేబినెట్ ప్రతిపాదన
ముంబైలో మరణించిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయాలని కేంద్రాన్ని కోరుతూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రివర్గం గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. వ్యాపార, సేవా రంగాల్లో అతని సేవలు అనితరమైనవవి అని పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పద్మవిభూషణ్ రతన్ టాటాకు నివాళులు అర్పించారు. రతన్ టాటా మృతిపై సంతాప ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించింది.కాగా పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా.. 86 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనకు ప్రపంచ దేశాల ప్రముఖుల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్నాయి. రతన్ టాటా మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.రతన్ టాటా మృతికి గౌరవ సూచికంగా మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. నేడు జరగాల్సిన అన్ని వినోదాత్మక కార్యక్రమాలను రద్దు చేశారు. ముంబైలోని ఎన్సిపిఎలో రతన్ టాటా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. పార్టీలకు అతీతంగా నాయకులు ఆయనకు నివాళులు అర్పించడానికి తరలివస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వర్లీలో జరగబోయే ఆయన అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవ్వనున్నారు. -
రాహుల్ ద్రవిడ్‌కు భారతరత్న ఇవ్వాలి: సునీల్ గవాస్కర్
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2024తో భారత హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. టీ20 వరల్డ్‌కప్ విజయంతో తమ కోచ్‌కు భారత ఆటగాళ్లు ఘనంగా విడ్కోలు పలికారు. భారత్ వరల్డ్‌కప్ గెలవడంలో ద్రవిడ్‌ది కూడా కీలక పాత్ర. తన అనుభవంతో జట్టును అద్బుతంగా నడిపించాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ద్రవిడ్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని గవాస్కర్ కోరాడు."రాహుల్ ద్రవిడ్‌ను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరిస్తే బాగుంటుంది. అందుకు ద్రవిడ్ నిజంగా అర్హుడు. వెస్టిండీస్ వంటి కఠిన పరిస్ధితుల్లో ద్రవిడ్ ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా అన్నో అద్బుత విజయాలను అందుకున్నాడు. విండీస్‌లో మాత్రమే కాదు. ఇంగ్లండ్ వంటి విదేశీ పరిస్థితుల్లో కూడా కెప్టెన్‌గా ద్రవిడ్ భారత్‌కు చారిత్రత్మక విజయాలను అందించాడు. ఇంగ్లండ్‌లో టెస్ట్ మ్యాచ్ సిరీస్‌ను గెలుచుకున్న ముగ్గురు భారత కెప్టెన్లలో ద్రవిడ్ ఒకడిగా ఉన్నాడు. అంతేకాకుండా జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్‌గా పనిచేసి ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత అతడిది. భారత పురుషల సీనియర్ జట్టు కోచ్‌గా కూడా అతడు అద్భుతాలు సృష్టించాడు. ద్రవిడ్ నేతృత్వంలోనే 17 ఏళ్ల తర్వాత భారత్ పొట్టి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది.ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా ద్రవిడ్ సాధించిన విజయాలు ప్రతీ భారతీయుడుకు ఆనందనిచ్చాయి. ద్రవిడ్ వరల్డ్‌కప్ విజయంతో యావత్తు దేశం గర్వించేలా చేశాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి కచ్చితంగా దేశ అత్యున్నత పురస్కారంతో గౌరవించాలి. ఈ విషయంపై ప్రతీ ఒక్కరూ నాతో గొంతు కలపాలి. ప్రభుత్వం కచ్చితంగా అతడు సేవలను గుర్తించాలి. భారతరత్న రాహుల్ శరద్ ద్రవిడ్ అని వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది కాదా? అని గవాస్కర్ తన కాలమ్ మిడ్ డేలో రాసుకొచ్చాడు. -
అద్వానీకి భారతరత్న ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ దిగ్గజం, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (96) భారత రత్న పురస్కారం అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని అద్వానీ నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అద్వానీకి భారతరత్న ప్రదాన కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా ప్రత్యేకమైన సందర్భమని మోదీ అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారతరత్న ప్రదాన సమయంలో కూర్చోని ఉండటం ద్వారా రాష్ట్రపతిని మోదీ ఘోరంగా అవమానించారని కాంగ్రెస్ మండిపడింది -
Bharat Ratna : భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి (ఫొటోలు)
-
పంట విక్రయంలో సాంకేతిక దన్ను
పీవీ నరసింహారావు హయాంలో 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్‌ఎఫ్‌ఏసీ) ఏర్పాటుచేయడం అర్థవంతమైన విధానపరమైన జోక్యం. ఆ సంస్థే ఇప్పుడు వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను ఏర్పాటు చేసే బాధ్యత చూస్తోంది. దీని కారణంగా, 2016లో నరేంద్ర మోదీ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్‌ను ప్రారంభించారు. దీనివల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1.07 కోట్ల మంది రైతులకు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్ లో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం ఏర్పడ్డాయి. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేయడానికిగానూ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి నిధులు సమకూర్చింది. మాజీ ప్రధానులు చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, శాస్త్రవేత్త–అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ లకు ఇటీవల భారతరత్న ప్రదానం చేయడం భారతీయ రైతు వ్యవస్థాపక స్ఫూర్తికి నివాళి అనే చెప్పాలి. ఈ ముగ్గురూ వ్యవసాయంతో పాటు రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. స్వామినాథన్ అందించిన తోడ్పాటు సుపరిచితమే కాదు, అది అందరూ గుర్తించిన విష యమే. అయితే హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన రాజకీయ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సోవియట్, చైనీస్ తరహా ‘సామూహిక వ్యవసాయం’లో ఉన్న ప్రమాదాలను నెహ్రూకి వివరించినది చరణ్ సింగ్. రైతులు రాటు దేలిపోయిన స్వతంత్ర సాగుదారులనీ, ప్రణాళికా సంఘం మెచ్చు కున్న ‘ల్యాండ్ పూలింగ్, సహకార వ్యవసాయం’ అనే కేంద్రీకృత ప్రణాళికను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ చరణ్ సింగ్ స్పష్టం చేశారు. దార్శనికుడి విధాన జోక్యం పీవీ నరసింహరావు హయాంలో భారతదేశం, ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరి వ్యవసాయ ఒప్పందంపై సంతకం చేసింది. అప్పటి వరకు, భారతదేశ విధాన వ్యవస్థ దిగుమతులను పరిమితం చేసింది. పీవీ ఆధ్వర్యంలో, భారతదేశం వ్యవసాయ ఎగుమతులను ఒక ముఖ్యమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టేదిగా చూసింది. ఏపీఈడీఏ (అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ)కి బడ్జెటరీ, సంస్థాగత మద్దతుతో, ఆయన భారతీయ వ్యవసాయాన్ని ప్రపంచవ్యాప్త పోటీదారుగా మార్చడంలో తోడ్పడ్డారు. అయినప్పటికీ దేశీయ వాణిజ్యం మాత్రం రైతుల కోసం కాకుండా, సేకరణ ఏజెన్సీలకూ, వ్యవసాయ పంటల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లలోని నమోదైన వ్యాపారులకూ అనుకూలంగా నిర్బంధ వాణిజ్య పద్ధతుల ద్వారా నిర్వహించబడుతూనే ఉంది. 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్‌ఎఫ్‌ఏసీ) స్థాపన, పీవీ చేసిన అత్యంత అర్థవంతమైన విధాన పరమైన జోక్యం కావచ్చు. ఈ సంస్థకే వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. 2016 ఏప్రిల్ 14న ప్రధాని నరేంద్ర మోదీ ఎస్‌ఎఫ్‌ఏసీ మద్దతుతో ‘ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్‌ను ప్రారంభించారు. ఇది ఫిజికల్ బ్యాక్ ఎండ్‌తో కూడిన సింగిల్ విండో పోర్టల్. కార్యాచరణ సమాచారం, భౌతిక మౌలిక సదుపాయాలు, వాణిజ్య ఎంపికలు, చెల్లింపులపై ఎలక్ట్రానిక్ సెటిల్మెంట్లను ఇది అందిస్తుంది. నేడు, ఎస్‌ఎఫ్‌ఏసీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1,389 నియంత్రిత హోల్‌సేల్ మార్కె ట్లలో, 1.07 కోట్ల మంది రైతులు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్లలో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం కలిగి ఉన్నారు. భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరో 1.7 లక్షల ఇంటిగ్రేటెడ్ లైసెన్ ్సలను జారీ చేశారు. ఈ వేదికకు తమ మద్దతును ప్రతిబింబించేలా దాదాపు 3,500 రైతు ఉత్పత్తిదారులసంఘాలు (ఎఫ్పీఓలు) ఇందులో చురుకుగా పాల్గొనడం గమనార్హం. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. తగిన బాధ్యత ఈ విజయవంతమైన నేపథ్యాన్ని పంచుకోవడం అత్యవసరం. రైతుకు విపత్కరమైన అమ్మకాల నుండి రక్షణ కల్పించే ఉద్దేశంతో 1950వ దశకంలో ‘ఏపీఎంసీ’లను ప్రవేశపెట్టారు. ‘ధర ఆవిష్క రణ’ను నిర్ధారించడానికీ, కనీస మద్దతు ధర వ్యవస్థలో రాష్ట్ర ఏజెన్సీల ద్వారా సేకరణకు వేదికను అందించడానికీ ఇవి రూపొందాయి. అయితే, ఈ ప్రక్రియలో, వారు మధ్యవర్తుల ప్రత్యేక తరగతిని కూడా సృష్టించారు. నిర్దిష్ట మండీలో దాని అధికారికమైన కమాండ్ ఏరి యాతో లైసెన్ ్స కలిగి ఉన్న వ్యాపారిని స్థిరపరిచారు. అయితే, భారతదేశం ఐటీ సూపర్‌పవర్‌గా అవతరించడం, రైతు నుండి మార్కెట్ ఉత్పత్తి విధానంలోకి వ్యవసాయం మారడంతో, వాణిజ్య పరిమితి నిబంధనలను మార్చవలసిన అవసరం ఏర్పడింది. సాంకేతికతలు, ఆర్థిక సాధనాల ద్వారా సన్నకారు, చిన్న రైతులకు వాణిజ్య నిబంధనలను మెరుగుపరచడానికి ఎస్‌ఎఫ్‌ఏసీ వంటిసంస్థలు స్థాపితమయ్యాయి. వ్యవసాయ–వ్యాపార వ్యవస్థాపకులకు వెంచర్ క్యాపిటల్ నిధులను అందించడం నుండి మౌలిక సదుపాయాల కల్పన వరకు ఎస్‌ఎఫ్‌ఏసీ కొత్త పుంతలు తొక్కింది. అందుకే ఈ–నామ్ స్థాపన బాధ్యతను ఎస్ఎఫ్ఏసీకే అప్పగించడంలో ఆశ్చర్యం లేదు మరి. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేయడానికిగానూ కంప్యూటర్ హార్డ్‌వేర్, ఇంటర్నెట్ సౌకర్యం, పరీక్షా పరికరాలు వంటి సామగ్రి లేదా మౌలిక సదుపాయాల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి రూ. 30 లక్షలు మంజూరు చేసింది. క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాలు, బయో–కంపోస్టింగ్ యూనిట్ వంటి అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ మొత్తాన్ని 2017లో రూ.75 లక్షలకు పెంచారు. మొదటి మూడేళ్లలో దాదాపు 200 మండీలను దీని పరిధిలోకి తీసుకురాగా, 2020 మే నాటికి మరో 415 మండీలు జమయ్యాయి. 2022 జూలై నాటికి మరో 260మండీలు, 2023 మార్చి నాటికి మరో 101 మండీలు పెరిగాయి. గత సంవత్సరం ముగిసేనాటికి మరో 28 వీటికి కలిశాయి. ప్రతి త్రైమాసి కంలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరింత పురోగమించేలా... విధాన రూపకల్పన అనేది సులభం. కానీ భౌతిక, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనే కష్టం. ఇంకా కష్టతరమైనది క్షేత్రస్థాయిలో చేసే పని. ఈ–నామ్‌తో అనుసంధానమైన ప్రతి మండీకి ఒక ఏడాది పాటు ప్రారంభ శిక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఏసీ ఒక ఐటీ నిపుణుడిని (మండి విశ్లేషకుడు) గుర్తించి, మద్దతునిస్తుంది. వారు రాష్ట్ర సమన్వయ కర్త(ల)కు నివేదిస్తారు. ఈ సమన్వయకర్తలు ఒక్కొక్కరు 50 మండీల రోజువారీ సమన్వయాన్ని నిర్వహిస్తారు. ఈ–నామ్ విధానంలోని రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మండి అధికారులందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వడం కూడా వీరి బాధ్యత. తర్వాత ఏమిటి? సాధించిన పురోగతితో ఆగకుండా, ఈ–నామ్ కొత్త, ఉన్నత ప్రమాణాలను ఏర్పరుస్తోంది. దీని సవరించిన ఆదేశంలో రైతులకు పోటీ ధరలను సాధ్యం చేయడం కోసం కృషి చేస్తుంది. ఏపీఎమ్‌సీ నియంత్రిత మార్కెట్ కమిటీ మండీలకు వెలుపల కూడా వేదికలను ఏర్పాటుచేయడం ద్వారా దీన్ని సాధిస్తుంది. ఈ–నామ్ ద్వారా గిడ్డంగి ఆధారిత విక్రయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.అంతిమంగా, ధరను కనుగొనడం, విక్రయించే స్వేచ్ఛ అనేవి రైతుకు ఎక్కువ మేలు చేస్తాయి. - వ్యాసకర్త లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) - సంజీవ్ చోప్రా -
లౌకిక వాదానికి హిందుత్వ వారధి
‘భారతరత్న’ లభించడంతో వార్తలలోకి వచ్చిన బీజేపీ రాజకీయ దిగ్గజం లాల్ కృష్ణ అద్వానీ విలక్షణమైన నాయకుడు. ఆయన మాటల్లో దాపరికాలు ఉండవు. తన తప్పును అంగీకరించడానికి భేషజ పడటం ఉండదు. అవసరం అయితే క్షమాపణ అడిగేందుకు కూడా సుముఖంగా ఉంటారు! స్వచ్ఛమైన, సరళమైన జాతీయవాదం కోసం నిలబడిన నాయకుడాయన. హైందవ దుస్తుల్ని తొలగించుకున్న దిగంబర జాతీయవాదం అర్థం లేనిదని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆయనంతటి ఆత్మనిశ్చయం గల శక్తిమంతులు ఓ గుప్పెడు మంది మాత్రమే కనిపిస్తారు. పరస్పర వైరుధ్యం కలిగిన హిందుత్వానికి, లౌకికవాదానికి మధ్య వారధి నిర్మించే ప్రయత్నంలో అద్వానీ... లోకమాన్య తిలక్, గాంధీజీల దృక్పథాన్ని అనుసరించారు. నాకు చాలాకాలంగా, అతి సన్నిహితంగా పరిచయం ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు – ఆయన ద్వారా ఆయన కుటుంబం కూడా – లాల్ కృష్ణ అద్వానీ అని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఒక కాలం ఉండేది... నేను ఆయన విశ్వాసాన్ని స్పష్టంగా గెలుపొందిన కాలం; కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో నా సలహాను సైతం ఆయన తీసుకున్న కాలం. ఆ క్రమంలో ఆయన నన్ను భారత రాజకీయాలలోని గుంభనమైన అంతర్గత కార్యకలాపాలపైన కూడా నా దృష్టి చొరబాటును అనుమతించారు. ఇప్పుడు ఆయనకు ‘భారతరత్న’ లభించడంతో ఆయనతో నా మొదటి ఇంటర్వ్యూ నా మదికి, మననానికి వచ్చింది. ఆయన్ని నిజమైన ప్రత్యేక రాజకీయ నాయకుడిగా మార్చిన ఆయనలోని లక్ష ణాలను సంగ్రహించిన ఇంటర్వ్యూ అది. తన మాటల్లో దాపరికాలు లేకుండా, నిజాయితీగా ఉండే నాయకుడు మాత్రమే కాదాయన... తన తప్పుల్ని అంగీకరించడానికి సైతం సుముఖంగా ఉండేవారు. అవసరం అయితే ‘మన్నింపు’ను కోరేవారు. ఆయన లాంటి రాజకీయ నాయకులు అతికొద్ది మంది మాత్రమే నాకు తెలుసు. 1990లో అద్వానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ జరిగింది. అప్పుడు నేను – ఆ ముందరే ఇండియాకు తిరిగి వచ్చిన – ఒక అనామక జర్నలిస్టుని. ‘హిందూస్థాన్ టైమ్స్ ఐవిట్నెస్’ ప్రారంభ ఎపిసోడ్ కోసం ఆ ఇంటర్వ్యూను చేశాన్నేను. డిసెంబరు నాటి ఒక అహ్లాదకరమైన అపరాహ్నవేళ అద్వానీ పండారా పార్క్ నివాసంలో ఆయనతో కలిసి కూర్చున్నాను. మరీ దీర్ఘంగా ఏం కాదు, బహుశా కేవలం పది నిముషాలు మా మధ్య సంభాషణ జరిగినట్లుంది.అందులోని చిన్న భాగం ఇది: కరణ్ థాపర్: మీరు అధికారంలో ఉండి ఉంటే కనుక ఇండియాను హిందూ దేశంగా మార్చేవారా? ఒక అధికారిక హిందూ దేశంగా? ఎల్.కె. అద్వానీ: ఇంగ్లండ్ క్రైస్తవ దేశం అయినట్లే, ఇండియా హిందూ దేశం అని నేను నమ్ముతాను. ఇందులో ఎక్కువ తక్కువలేం లేవు. ‘‘మీరు మాటలతో ఆడుకుంటారనే భావన చాలామందిలో ఉంది. కాబట్టి హిందుత్వం అంటే అర్థం ఏంటో చెప్పండి? హిందుత్వం కోసం మీరు నిలబడతారా, లేక తడబడతారా? హిందు త్వానికి మీరు అనుకూలమేనా?’’ ‘‘నేను స్వచ్ఛమైన, సరళమైన జాతీయవాదం కోసం నిలబడతాను. కానీ తన హైందవ దుస్తుల్ని తొలగించుకున్న దిగంబర జాతీయవాదం అర్థం లేనిదని నమ్ముతాను. ఇంతకు మించి చెప్పేదేం లేదు.’’ ‘‘ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. కచ్చితంగా ఇదీ అని చెప్పండి. మీరు కోరుకుంటున్నది లౌకిక భారతదేశాన్నా లేక హిందూ భారతదేశాన్నా?’’ ‘‘నిశ్చయంగా, నిజాయితీగా నేను లౌకిక భారతదేశం కోసమే నిలబడతాను.’’ ‘‘అక్కడే సమస్య వస్తోంది మిస్టర్ అద్వానీ. చాలామంది ప్రజలు మీరు అనుకూలంగా ఉన్న హిందుత్వకు, మళ్లీ మీరే అనుకూలంగా ఉన్న లౌకికవాదానికి మధ్య తీవ్రమైన వైరుధ్యాన్ని చూస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు మీరు వంతెన వేయలేరని అనుకుంటున్న వాటికి మీరు వంతెన వేయటానికి ప్రయత్నిస్తున్నారు.’’ ‘‘నేను విశ్వసిస్తున్నది లౌకికవాదం పట్ల నెహ్రూకి, లేదా సర్దార్ పటేల్‌కు ఉన్న దృక్పథాన్ని కాదు. లోకమాన్య తిలక్‌కు, గాంధీకి ఉన్న టువంటి దానిని. అయితే ఈ దృక్పథాన్ని గత నాలుగు దశాబ్దాలలో ఎన్నికల ప్రయోజనాలు వక్రీకరిస్తూ వచ్చాయి.’’ ‘‘భారతదేశంలోని పది కోట్లమంది ముస్లింల పట్ల మీ వైఖరి ఏమిటి? వారు ఈ దేశంలోని విడదీయరాని భాగం అని మీరు విశ్వసిస్తారా?’’ ‘‘కచ్చితంగా. కచ్చితంగా. నిస్సంకోచంగా.’’ ‘‘అప్పుడైతే, దేశంలోని దాదాపు 3,000 మసీదులను కూల్చివేసి వాటి స్థానంలో దేవాలయాలు నిర్మించాలనే వీహెచ్‌పీ డిమాండ్‌కు వ్యక్తిగతంగా మీరు వ్యతిరేకం అని నేను నమ్మొచ్చా?’’ ‘‘నేను వ్యతిరేకమే.’’ ‘‘పూర్తిగా?’’ ‘‘పూర్తిగా.’’ కావలిస్తే ఈ సంభాషణను మళ్లీ చదవండి. ప్రశ్నల దృఢత్వాన్ని, జవాబులలోని నిజాయితీని గమనించండి. అద్వానీ తర్వాతి నాయకు లలో ఎవరితోనైనా ఇలాంటి సంభాషణ ఈరోజు సాధ్యం అవుతుందని నేను అనుకోను. వాళ్లు దీనిని ఏమాత్రం సహించలేరు. లేచి వెళ్లి పోతారు. అయితే అసలు విషయం, ఇంటర్వ్యూ తర్వాత ఏం జరిగిందన్నది. తర్వాత నేను ఆద్వానీని కలిసినప్పుడు ‘‘ఇంటర్వ్యూ గురించి మీరేమనుకుంటున్నారు?’’ అని అడిగాను. అందుకు ఆయన కఠిన మైన పలుకులతో... అదొక హాస్యాస్పదం అని కొందరు తనతో అన్నట్లు చెప్పి, ఒక్కసారిగా వెనుదిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు! ఆయన ప్రవర్తన నన్ను నిరుత్తరుడిని చేసింది. ఆయనకు ఇంటర్వ్యూ వీడియోను పంపి, స్వయంగా తననే చూడమని కబురు పెట్టాను. ఆయన్ని ఎవరో తప్పుదారి పట్టించారని నా నమ్మకం. వారాలు, నిజానికి నెలలు గడిచినా ఆయన్నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. నేను కూడా వస్తుందని ఎదురు చూడటం మానే శాను. హఠాత్తుగా... చీకటి పడుతున్న ఒక వేసవి సాయంత్రం నా ఫోన్ మోగింది. అటువైపు ఎల్.కె. అద్వానీ. ‘‘కరణ్, నేనిప్పుడే ఇంటర్వ్యూ చూశాను. అందులో కొంచెం కూడా నాకు తప్పు కనిపించలేదు. కానీ నాకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దానిని సాకుగా చూపడం నా వయసుకు తగినది కాదు. మనం చివరిసారి కలుసుకున్నప్పుడు నీతో అనుచితంగా ప్రవర్తించాను. క్షమాపణలు చెప్పడానికే నీకిప్పుడు ఫోన్ చేశాను’’ అన్నా రాయన. తప్పును అంగీకరించడానికి ఏ సంకోచమూ లేని సంసిద్ధతే బహుశా అద్వానీలోని గొప్ప గుణంగా తక్షణం ఆయన పట్ల నాకు అక ర్షణ కలిగేలా చేసింది. ఆయన తర్వాత మళ్లీ అతి కొద్దిమంది రాజకీయ నాయకులు ఓ గుప్పెడు మంది భేషజాలు లేకుండా తమ తప్పును ఒప్పుకుని క్షమాపణ అడగగల శక్తిమంతులు ఉన్నారు. అద్వానీ గురించి ఇంకా మీరేం అనుకున్నా – ఆయనపై ఇతరులకు భిన్నాభిప్రా యాలు ఉంటాయని నేను అంగీకరిస్తాను – ఒక మంచి మనిషి మాత్రమే అలా ఉండగలరు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఒకేసారి ఐదుగురికి భారతరత్న.. మోదీ వ్యూహం అదేనా?
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న బిరుదు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అయింది. అదే సమయంలో నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా ఈ అవార్డులను ప్రకటిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఏర్పడుతోంది. యూపీలో మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, బీహారులో మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానికి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్.ఎస్.స్వామినాదన్కు ఈ అవార్డులు ఇచ్చారు. వీరిలో ఎవరిపైన అభ్యంతరాలు లేవు. కాకపోతే ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్న తరుణంలో ఈ ప్రముఖులను ఎంపిక చేసుకున్న తీరు మాత్రం చర్చనీయాంశమే. బీహారులో జేడీయూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలోకి మారిన నేపథ్యంలో అక్కడ ఉన్న బీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి దివంగత నేత కర్పూరికి భారత రత్న ఇచ్చారు. మాజీ ఉప ప్రధాని అద్వానికి ఇవ్వడంలో బీజేపీ ఇంటరెస్టు ఉంటుంది. అద్వానికి సరైన ప్రాధాన్యత లభించడం లేదన్న భావన ప్రబలిన తరుణంలో ఆ వాదనను పూర్వపక్షం చేయడానికి ఇచ్చి ఉండవచ్చు. దివంగత నేత చరణ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వడం ద్వారా యూపీలో జాట్ వర్గాన్ని ఆకట్టుకునే ప్లాన్ ఉండవచ్చు. దానికి తగినట్లే చరణ్ సింగ్ మనుమడు జయంత్ సమాజవాది పార్టీ కూటమి నుంచి ఎన్డీఏ.లోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. స్వామినాధన్ తమిళనాడుకు చెందినవారు. ఇటీవలికాలంలో ఆ రాష్ట్రంపై మోదీ ఫోకస్ పెట్టారు. ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇక ఇంకో దివంగత నేత పీవీ నరసింహారావు కాంగ్రెస్ ప్రధాన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసుకు వచ్చిన ఆర్దిక సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేశాయి. బహుభాషా కోవిదుడు అయిన పీవీ నరసింహారావు పట్ల అందరిలోను గౌరవ భావం ఉన్నప్పటికి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఎ ఇవ్వని భారత రత్న అవార్డును బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ. ఇవ్వడం కూడా ఆసక్తికర అంశమే. తెలంగాణలో పీవీ పట్ల ఉన్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా ఈ నిర్ణయం చేసి ఉండవచ్చు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ లో ఎక్కువ సీట్లు గెలవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ దీనిని కూడా ఒక అస్త్రంగా వాడుకోవచ్చు. ఇక్కడ మరో కోణం ఏమిటంటే 1992లో బాబ్రిమసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి అద్వానిపై అప్పట్లో కేసు నమోదు అయింది. ఆ మసీదు కూలుతున్నప్పుడు పీవీ నరసింహారావు గట్టి చర్య తీసుకోకుండా మౌనంగా ఉన్నారన్న విమర్శ ఉంది. వీరిద్దరికి ఒకేసారి భారతరత్న ఇవ్వడం గమనించదగ్గ అంశమే. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను ఆ రోజుల్లో బీజేపీ, వామపక్షాలు వ్యతిరేకించేవి. నిరసనలు చేపట్టేవి. ఆ తర్వాత కాలంలో బీజేపీ కూడా వాటినే అనుసరించింది. కాని చిత్రంగా కాంగ్రెస్ లో పవర్ పుల్ ఉమన్ గా ఉన్న సోనియాగాంధీతో పీవీకి అప్పట్లో విబేధాలు వచ్చాయి. సోనియాగాందీ చేసిన కొన్ని డిమాండ్లను పీవీ అంగీకరించలేదని,దాంతో ఆయనపై కోపం పెంచుకున్నారని అంటారు. అందువల్లే పీవీ ఢిల్లీలో మరణిస్తే,కుటుంబ సభ్యులు కోరినా, దేశ రాజధానిలో అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదని అంటారు. ప్రత్యేక ఘాట్‌ను ఏర్పాటు చేయలేదన్న భావన ఉంది.అంతేకాక ఏఐసీసీ కార్యాలయానికి ఆయన బౌతిక కాయాన్ని తీసుకు వెళ్లినప్పుడు లోపలికి తీసుకురాకుండా, గేటు బయటే ఉంచడం కూడా వివాదాస్పదం అయింది. ఆర్దిక సంస్కరణలకు ఆద్యుడు అయిన పీవీ 1996లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెప్పించలేకపోయారు. తెలుగుదేశం, జెఎమ్ఎమ్ వంటి పార్టీలను చీల్చి అధికారంలో ఐదేళ్లపాటు కొనసాగినా, పార్టీ సాదారణ ఎన్నికలలో ఓటమి పాలైంది. జెఎమ్ఎమ్కు లంచాలు ఇచ్చారన్న అబియోగానికి గురయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాల రీత్యా ఆయన చేపట్టిన కార్యక్రమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన పీవీ దేశ ప్రదానిగా సఫలం అయ్యారని చెప్పాలి. తెలుగువారిలో భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తిగా పీవీ కీర్తిప్రతిష్టలు పొందారు. తెలుగువారందరికి ఇది గర్వకారణమే. ఒకప్పుడు ప్రధానిగా మాత్రమే కాకుండా , ఏఐసీసీ అధ్యక్షుడుగా అధికారం చెలాయించిన పీవీ ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ లో దాదాపు ఒంటరి అయ్యారు. 1991 లో రాజకీయాల నుంచి దాదాపు విరమించుకుని హైదరాబాద్ వచ్చేసిన ఆయన అనూహ్యంగా దేశ ప్రధాని అయ్యారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత మళ్లీ అదే రకమైన పరిస్థితిని ఆయన ఎదుర్కున్నారు. కాగా పీవీ మరణానంతరం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం హుస్సేన్ సాగర్ ఒడ్డున స్థలం కేటాయించి అంత్యక్రియలు జరిపించి ఆయన స్మృతివనంగా అభివృద్ది చేశారు. కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన వైఖరి నేపద్యంలో పీవీ కుటుంబం కూడా కాంగ్రెస్ కు దూరం అయింది. 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నారు. పీవీ బందువులకు ప్రాదాన్యం ఇవ్వడం, ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం , పీవీ కుమార్తె అయిన వాణి కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వంటివి చేశారు. పీవీ శత జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించారు. ఇప్పుడు పీవీకి భారత రత్న ఇవ్వడం ద్వారా తెలంగాణలో బీజేపీకి ఎంత మేర రాజకీయ లబ్ది చేకూరుతుందన్నది చూడాలి. బీఆర్ఎస్ కూడా ఈ విషయంలో పోటీ పడుతుంది. కాంగ్రెస్‌కు మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైనదే. పీవీకి భారత ఇవ్వలేకపోయారన్న విమర్శను ఎదుర్కుంటోంది. పార్లమెంటు ఎన్నికలలో ఈ అంశం ఎంత ప్రభావం చూపుతుందన్నది అప్పుడే చెప్పలేం. కాగా మరో నేత , తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉంది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు భారత రత్న ఇవ్వడానికి దాదాపు నిర్ణయం అయిపోగా , అందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే అడ్డుకున్నారన్న అభిప్రాయం ఉంది. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఆ అవార్డును స్వీకరించే అవకాశం ఉండడంతో ,అది ఇష్టలేని కుటుంబ సభ్యులు బిరుదును అప్పట్లు ఇవ్వవద్దన్నారని చెబుతారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ కన్వీనర్‌గా కూడా ఉండేవారు. అయినా ఎన్టీఆర్‌కు భారత రత్న రాలేదు. కాని ప్రతి మహానాడులోను ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తుంటారు. దాంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల చిత్తశుద్దిపై సందేహాలు ఏర్పడ్డాయి. 2014-2019 టర్మ్‌లో కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ.లో ఉన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో ఇద్దరు టిడిపి మంత్రులు కూడా ఉన్నారు. అయినా ఎన్టీఆర్‌కు మాత్రం భారతరత్న రాలేదు. 2018లో మోదీతో తగదా పడి బయటకు వచ్చారు. దాంతో కాస్తో,కూస్తో ఉన్న అవకాశం కూడా పోయినట్లయింది. అదేకనుక ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న వచ్చి ఉంటే ఇద్దరు తెలుగువారు ఈ ఘనత సాధించినట్లయ్యేది. ప్రధాని మోదీ వ్యూహాత్మకంగానే పద్మ అవార్డులు ప్రకటిస్తుంటారు. ఉదాహరణకు యూపీ మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ అజాద్ వంటివారికి పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చారు. ఎన్నికల టైమ్‌లో ఐదుగురికి భారత రత్న అవార్డులు ఇవ్వడంతో రాజకీయంగా ప్రాముఖ్యత ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
RLD chief Jayant Choudhary: ఎన్డీఏలోకి ఆరెల్డీ
లఖ్నో: చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించడం ద్వారా నరేంద్ర మోదీ సర్కారు తన మనసు గెలుచుకుందని ఆయన మనవడు, ఇండియా కూటమి భాగస్వామి రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆరెల్డీ) అధ్యక్షుడు జయంత్సింగ్ అన్నారు. ‘దిల్ జీత్ లియా (మనసు గెలుచుకుంది)’ అంటూ శుక్రవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు మీడియాకు వెల్లడించారు. ‘‘మా తాతయ్యకు భారతరత్న ప్రకటించారు. ఎన్డీఏలో చేరాలన్న బీజేపీ ఆహా్వనాన్ని నేనెలా తిరస్కరించగలను?’’ అన్నారు. ‘‘ప్రధాని మోదీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. మన దేశ స్వభావాన్ని, మౌలిక భావోద్వేగాలను తాను బాగా అర్థం చేసుకున్నానని నిరూపించుకున్నారు. కనుక సీట్లు, ఓట్ల చర్చ ఇప్పుడిక అప్రస్తుతం’’ అని జయంత్ స్పష్టం చేశారు. సర్దుబాటులో భాగంగా యూపీలో భాగ్‌పత్, బిజ్నోర్ లోక్‌సభ స్థానాలు ఆరెల్డీకి దక్కుతాయి. అలాగే ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా బీజేపీ వాగ్దానం చేసినట్టు చెబుతున్నారు. ఉత్తర యూపీలో ఆరెల్డీకి చెప్పుకోదగ్గ పట్టుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓడిన 16 స్థానాల్లో ఏడు అక్కడే ఉన్నాయి. జయంత్ నిర్ణయంతో యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి షాక్ తగిలింది. -
హరిత విప్లవ సారథి
మాన్‌కొంబు సదాశివన్ స్వామినాథన్.. సరిపడా పంటల ఉత్పత్తి లేక ఆకలితో అలమటిస్తున్న మన దేశానికి అన్నం పెట్టిన అరుదైన శాస్త్రవేత్త. హరిత విప్లవ పితామహుడికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. దేశం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి పంటల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి, ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందంటే అదంతా ఎంఎస్ స్వామినాథన్ చలవే అని చెప్పడం అతిశయోక్తి కాదు. హరిత విప్లవం, నూతన వంగడాలు, ఆధునిక వ్యవసాయ విధానాలతో దేశాన్ని అన్నపూర్ణగా మార్చారు. తన జీవితాన్ని హరిత విప్లవానికే అంకితం చేశారు. ప్రజలందరికీ పౌష్టికాహారం అందించాలని, ఆహార భద్రత కల్పించాలని అహర్నిశలూ తపించారు. ప్రపంచ ఆహార వ్యవస్థల స్థిరీకరణకు తన వంతు తోడ్పాటునందించారు. తన పరిశోధనల ద్వారా కోట్లాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. ► ఎంఎస్ స్వామినాథన్ 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పార్వతీ థంగమ్మై, డాక్టర్ ఎం.కె.సాంబశివన్. ► 15 ఏళ్ల నిండకుండానే తండ్రి మరణించడంతో తమ కుటుంబం ఆధ్వర్యంలోని ఆసుపత్రిని నిర్వహించడానికి వైద్య విద్య అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. మెడిసిన్‌లో చేరారు. ► విద్యార్థిగా ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్లో కరువు పరిస్థితులను చూసి చలించిపోయారు. ఆకలితో ఎవరూ చనిపోయే పరిస్థితి రాకూడదని భావించారు. ► వైద్య విద్యను మధ్యలోనే వదిలేసి కోయంబత్తూరులోని వ్యవసాయ కళాశాలలో చేరారు. ► పీజీ పూర్తయ్యాక సివిల్ సర్విసు పరీక్ష రాశారు. ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కానీ, అటువైపు మొగ్గు చూపకుండా హాలెండ్‌లో వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించారు. బంగాళదుంప జన్యు పరిణామంపై పరిశోధనలు సాగించారు. తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ చేశారు. ► 1954లో ఒడిశాలోని కేంద్ర వరి పరిశోధన సంస్థలో చేరారు. అనంతరం భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో అడుగుపెట్టారు. ► ప్రపంచస్థాయి వ్యవసాయ సంస్థల్లో రెండు దశాబ్దాలపాటు పనిచేశారు. పరిశోధనతోపాటు పరిపాలనాపరమైన విధులు నిర్వర్తించారు. ► దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆహార కొరత తీవ్రంగా ఉండేది. విదేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటే తప్ప ఆకలి తీరని పరిస్థితి. అప్పట్లో పంటల దిగుబడి చాలా పరిమితంగా ఉండేది. ఈ పరిస్థితిని మార్చేయాలని స్వామినాథన్ నిర్ణయించుకున్నారు. హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. ► అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశపెట్టారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలను రైతులకు పరిచయం చేశారు. ప్రభుత్వ సహకారంతో సాగునీటి సౌకర్యం పెంచారు. ఎరువులు, పురుగు మందుల వాడకం పెంచారు. సాగు విస్తీర్ణం భారీగా పెంచేందుకు కృషి చేశారు. ఇవన్నీ సత్ఫలితాలు ఇచ్చాయి. ► ప్రధానంగా వరి, గోధుమ వంగడాల అభివృద్ధికి స్వామినాథన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. హరిత విప్లవంతో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ► హరిత విప్లవం కారణంగా ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగి భూసారం క్షీణిస్తోందని విమర్శలు వచ్చాయి. వీటితో స్వామినాథన్ ఏకీభవించారు. స్థానికంగా ఉండే వంగడాలను కాపాడుకోవాలని, నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని, భూసారం కోల్పోయేలా రసాయనాలు వాడొద్దని సూచించారు. ► వ్యవసాయ రంగంలో పలు ప్రతిష్టాత్మక సంస్థలకు డైరెక్టర్‌గా, డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ► స్వామినాథన్‌ను ఎన్నో పురస్కారాలు వరించాయి. 1971లో రామన్ మెగసెసే, 1986లో వరల్డ్ సైన్స్, 1991లో ఎని్వరాన్మెంటల్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ► 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ పురస్కారాలు స్వీకరించారు. ► 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా స్వామినాథన్‌ను ప్రఖ్యాత టైమ్ మేగజైన్ గుర్తించింది. ► 1988లో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ 1987లో తొలి ప్రపంచ ఆహార పురస్కారం అందుకుంది. ► 2007 నుంచి 2013 దాకా రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల 84 గౌరవ డాక్టరేట్లను ఆయన ప్రదానం చేశాయి. ► 2023 సెప్టెంబర్ 28న 98 ఏళ్ల వయసులో చెన్నైలోని స్వగృహంలో స్వామినాథన్ కన్నుమూశారు. -
రైతు బాంధవుడు
రైతాంగ సంక్షేమ చర్యలకు ఆద్యుడు ఎన్నెన్నో రైతు అనుకూల చట్టాలు తీసుకొచ్చిన చరణ్ సింగ్ రైతు బాంధవుడిగా గుర్తింపు పొందారు. కన్సాలిడేషన్ ఆఫ్ హెల్డింగ్స్ యాక్ట్ ఆఫ్ 1953, ఉత్తరప్రదేశ్ జమీందారీ, భూసంస్కరణ చట్టం–1952ని తీసుకొచ్చారు. దీనివల్ల ఉత్తరప్రదేశ్‌లో జమీందారీ వ్యవస్థ రద్దయ్యింది. చరణ్‌సింగ్ ప్రతిపాదించిన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ బిల్లు 1964లో ఆమోదం పొందింది. దీంతో రైతులకు మార్కెట్ లింకేజీ మెరుగైంది. ఆయన చేపట్టిన భూసంస్కరణలో చిన్న రైతులు ఎంతగానో లబ్ధి పొందారు. భూమి లేనివారికి భూములపై హక్కులు లభించాయి. రైతులకు సామాజిక, ఆర్థిక ప్రగతికి ఈ సంస్కరణలు దోహదపడ్డాయి. 1966, 1967లో ఉత్తరప్రదేశ్‌లో కరువు తాండవించింది. దాంతో రైతుల నుంచి అధిక ధరలకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి, లబ్ధి చేకూర్చారు. చరణ్ సింగ్ ప్రారంభించిన చర్యల వల్లనే పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్సీ) విధానం ప్రారంభమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ చౌదరీ చరణ్‌సింగ్. రైతన్నల హక్కుల కోసం పోరాడి వారి ఆత్మబంధువుగా పేరు పొందిన దివంగత ప్రధానమంత్రి. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అవలంబించిన సోషలిస్టు ఆర్థిక విధానాలను ఆయన వ్యతిరేకించారు. అయితే తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలుత కాంగ్రెస్‌లోనే పనిచేశారు. 1960వ దశకంలో ఆ పార్టీ నుంచి బయటికొచ్చారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికై ఉత్తర భారతదేశంలో తొలి కాంగ్రెసేతర సీఎంగా రికార్డుకెక్కారు. రెండుసార్లు యూపీ సీఎంగా, ఒకసారి ప్రధానిగా సేవలందిచారు. కేంద్రంలో మొరార్జీ దేశాయ్ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన రెండో కాంగ్రెసేతర నాయకుడు చరణ్‌సింగ్ కావడం విశేషం. ► చరణ్‌సింగ్ 1902 డిసెంబర్ 23న ఉత్తరప్రదేశ్‌లో మీరట్ జిల్లా నూర్పూర్ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు నేత్రా కౌర్, చౌదరీ మీర్సింగ్. ► స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య అభ్యసించారు. తర్వాత మీరట్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. ►1923లో ఆగ్రా కాలేజీలో సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చదివారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎంఏ(హిస్టరీ) పూర్తిచేశారు. 1927లో ఎల్ఎల్బీ పట్టా సాధించారు. ఘజియాబాద్‌లో అడ్వొకేట్‌గా పేరు నమోదు చేసుకున్నారు. ►ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు దయానంద సరస్వతి బోధనలతో చరణ్‌సింగ్ ప్రభావితులయ్యారు. మహాత్మా గాంధీ, వల్లభ్‌బాయ్ పటేల్ వంటి నాయకుల నుంచి స్ఫూర్తిని పొందారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో అడుగుపెట్టారు. పలుమార్లు అరెస్టై జీవితం అనుభవించారు. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆర్నెల్లు జైల్లో ఉన్నారు. 1940లో మరో కేసులో ఏడాది జైలుశిక్ష పడింది. 1942లో మళ్లీ అరెస్టయ్యారు. ►స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూనే మరోవైపు ఉత్తరాదిన యునైటెడ్ ప్రావిన్సెస్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ►1937లో తొలిసారిగా యునైటెడ్ ప్రావిన్సెస్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మీరట్ జిల్లాలోని చాప్రౌలీ నుంచి గెలిచారు. 1946, 1952, 1962, 1967లోనూ విజయం సాధించారు. ►1946లో యునైటెడ్ ప్రావిన్సెస్ ముఖ్యమంత్రి పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ ప్రభుత్వంలో పార్లమెంటరీ కార్యదర్శిగా చరణ్ సింగ్ పని చేశారు. ►1951లో మొదటిసారి కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. న్యాయ శాఖ, సమాచార శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలందించారు. ►1967 ఏప్రిల్ 1న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రెండు రోజుల తర్వాత సంయుక్త విధాయక్ దళ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ►1970 ఫిబ్రవరిలో రెండోసారి యూపీ సీఎంగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం అక్టోబర్ 2న యూపీలో రాష్ట్రపతి పాలన విధించడంలో చరణ్ సింగ్ రాజీనామా చేశారు. ►ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలోనూ చరణ్‌సింగ్ పాల్గొన్నారు. 1975 జూన్ 26న అరెస్టయ్యారు. ►తన సొంత పార్టీ భారతీయ లోక్‌దళ్‌ను జనతా పార్టీలో విలీనం చేశారు. జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన చరణ్ సింగ్ 1977లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ►జనతా ప్రభుత్వంలో కేంద్ర హోం మంత్రిగా చేశారు. 1979 జనవరిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు. తర్వాత ఉప ప్రధానిగా పదోన్నతి పొందారు. ►జనతా పార్టీ చీలిక చరణ్ సింగ్‌కు కలిసివచ్చింది. కాంగ్రెస్ మద్దతుతో 1979 జూలై 28న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆగస్టు 20 దాకా కేవలం 23 రోజులే పదవిలో కొనసాగారు. ఆగస్టు 21 నుంచి 1980 జనవరి 14 దాకా ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించారు. ►గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి చరణ్‌సింగ్ ఎంతగానో చొరవ చూపారు. ‘నాబార్డ్’వంటి సంస్థల ఏర్పాటులో ఆయనదే కీలక పాత్ర. ►భారత ఆర్థిక శాస్త్రం, దేశ వ్యవసాయ రంగం, భూసంస్కరణలు, పేదరిక నిర్మూలనపై పలు పుస్తకాలు రాశారు. ►1987 మే 29న 84 ఏళ్ల వయసులో చరణ్‌సింగ్ తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతి డిసెంబర్ 23ను ఏటా ‘కిసాన్ దివస్’గా పాటిస్తున్నారు. -
‘ఆర్థిక’ భారతానికి ఊపిరి పీవీ
విదేశాలకు చెల్లింపులు చేయలేక దివాలా అంచుల్లో ఉన్న దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో గట్టెక్కించిన మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావును భారతరత్న వరించింది. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగానే కాదు.. దేశానికి గాందీ, నెహ్రూ కుటుంబేతర వ్యక్తుల్లో పూర్తికాలం పనిచేసిన తొలి ప్రధానిగా, మైనార్టీ ప్రభుత్వాన్ని విజయవంతంగా ఐదేళ్లూ కొనసాగించిన రాజకీయ చాణక్యుడిగా పీవీ పేరు పొందారు. దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి కూడా పీవీనే కావడం గమనార్హం. ఆయన రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా తాను పనిచేసిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. – సాక్షి, హైదరాబాద్ గడ్డు పరిస్థితిలో బాధ్యతలు చేపట్టి.. పీవీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే నాటికి దేశం గడ్డు పరిస్థితుల్లో ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు బిలియన్ డాలర్ల కంటే తగ్గిపోయాయి. విదేశాలకు చెల్లించాల్సిన అప్పులు, దిగుమతుల కోసం చేయాల్సిన చెల్లింపులు పేరుకుపోయాయి. ద్రవ్యోల్బణం గరిష్టంగా రెండంకెలకు చేరింది. ఏతావాతా దేశం ఆర్థికంగా దివాలా అంచున ఉన్న సమయంలో.. దేశాన్ని ముందుకు నడిపించేందుకు పీవీ సిద్ధమయ్యారు. వెంటనే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేపని మొదలుపెట్టారు. అప్పట్లో రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఉన్న ఆర్థికవేత్త మన్మోహన్సింగ్ను పిలిపించి నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మన్మోహన్తోపాటు ఇతర ఆర్థికవేత్తలతో చర్చించి సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఎగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్యం సమకూరేందుకు వీలుగా రూపాయి విలువను తగ్గించారు. తాను ప్రధాని బాధ్యతలు స్వీకరించిన నెలలోనే రిజర్వుబ్యాంకు వద్ద ఉన్న బంగారం నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో తాకట్టు పెట్టి 400 మిలియన్ డాలర్ల రుణం తెచ్చారు. కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. లైసెన్సుల విధానాన్ని సరళీకృతం చేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యాన్ని తగ్గిస్తూ.. ప్రైవేటు సంస్థల స్థాపనకు అవకాశం కల్పించారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. 1991 జూలై 24న ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్లో అనేక సంస్కరణలను ప్రకటించారు. కార్పొరేట్ పన్ను పెంపు, టీడీఎస్ విధానం అమల్లోకి తేవడం, వంట గ్యాస్, కిరోసిన్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంపు, చక్కెరపై సబ్సిడీ తొలగింపు, దిగుమతుల పన్ను తొలగింపు వంటి విధానాలను అమల్లోకి తెచ్చారు. ఈ చర్యలతో పీవీ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)కు దేశాన్ని అమ్మేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. అయినా మొక్కవోని ధైర్యంతో పారీ్టలో, ప్రభుత్వంలో అసమ్మతివాదులను ఒప్పిస్తూ సంస్కరణలను కొనసాగించారు. ఎగుమతుల కోసం ప్రత్యేక వాణిజ్య విధానాన్ని తేవడంతోపాటు చిన్న సంస్థలకు ప్రోత్సాహకాలు అందించారు. ఈ చర్యలన్నింటి ఫలితంగా రెండున్నరేళ్లలో ద్రవ్యోల్బణం 17 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గింది. బిలియన్ డాలర్లలోపే ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు 15 బిలియన్ డాలర్లకు చేరాయి. ద్రవ్యలోటు 8.4 నుంచి 5.7 శాతానికి తగ్గింది. ఎగుమతులు రెండింతలయ్యాయి. వృద్ధిరేటు 4 శాతానికి పెరిగింది. అక్కడి నుంచి ఇక భారత్ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి తలెత్తలేదు. ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానానికి చేరింది. దీనంతటికీ నాడు పీవీ వేసిన ఆర్థిక సంస్కరణలే పునాది. బేగంపేట.. బ్రాహ్మణవాడి అడ్డాగా.. పీవీ నరసింహారావు హైదరాబాద్‌లో ఉన్నంతకాలం బేగంపేటలోని బ్రాహ్మణవాడి కేంద్రంగానే కార్యకలాపాలను నిర్వహించారు. తొలుత స్వామి రామానంద తీర్థ ఇక్కడ నివాసం ఏర్పర్చుకోగా.. ఆయన అనుచరుడిగా పీవీ ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారు. 1973లో రామానంద తీర్థ పరమపదించగా.. పీవీ అక్కడ స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రస్తుతం పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవి ఈ కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె ఈ కమిటీ భవనంలో పీవీ స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పీవీ రాసిన, సేకరించిన వేలాది పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి. 60 ఏళ్ల వయసులో కంప్యూటర్‌తో కుస్తీ పట్టి.. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడంలో పీవీ ఎప్పుడూ ముందుండే వారు. ఆయన అసాధారణ ప్రతిభతో త్వరగానే పట్టు సాధించేవారు. అలా ఏకంగా దేశ, విదేశ భాషలు సహా 13 భాషలను నేర్చుకున్నారు. రాజీవ్‌గాంధీ హయాంలో మన దేశంలోకి కంప్యూటర్లను ప్రవేశపెట్టినప్పుడు.. పీవీ ఓ కంప్యూటర్ తెప్పించుకుని పట్టుపట్టాడు. 60 ఏళ్ల వయసులో కూడా రోజూ గంటల పాటు కూర్చుని టైపింగ్ మాత్రమేకాదు.. కంప్యూటర్ లాంగ్వేజ్‌నూ నేర్చుకున్నారు. ఉస్మానియాలో విద్యాభ్యాసం.. కలం పేరుతో వ్యాసాలు.. అపర మేధావి, బహుభాషా కోవిదుడుగా పేరుపొందిన పీవీ నరసింహారావు.. 1921 జూన్ 28న నాటి హైదరాబాద్ సంస్థానంలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన నియోగి బ్రాహ్మణ దంపతులు సీతారామారావు, రుక్మాబాయిలకు జన్మించారు. మూడేళ్ల వయసులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణి దంపతులు ఆయన్ను దత్తత తీసుకున్నారు. భీమదేవరపల్లి మండలం కట్కూరులోని బంధువు గబ్బెట రాధాకిషన్‌రావు ఇంట్లో ఉంటూ పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివారు. 1938 సమయంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరారు. నిజాం నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో ఆయనను ఉస్మానియా వర్సిటీ నుంచి బహిష్కరించగా.. ఓ మిత్రుడి సాయంతో నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో చేరి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. కొంతకాలం జర్నలిస్టుగానూ పనిచేశారు. తన సోదరుడు పాములపర్తి సదాశివరావుతో కలసి ‘జయ–విజయ’ అనే కలం పేరుతో కాకతీయ వారపత్రికకు వ్యాసాలు రాశారు. ఎమ్మెల్యే నుంచి ప్రధాని వరకు.. కాలేజీలో రోజుల నుంచే పీవీ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పారీ్టలో సభ్యుడిగా చేరారు. 1957–77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మంథని నుంచి ప్రాతినిధ్యం వహించారు. అందులో 1962–71 మధ్య వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ► సీఎంగా పలు భూసంస్కరణలను ప్రవేశపెట్టారు. భూగరిష్ట పరిమితి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయించారు. గురుకుల విద్యా వ్యవస్థకు పునాది వేశారు. ► 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిన సమయంలో ఇందిరాగాంధీ వెన్నంటి నిలిచారు. 1978లో ఇందిరాగాంధీ స్థాపించిన కాంగ్రెస్ (ఐ)లో చేరారు. ► 1977లో తొలిసారిగా హన్మకొండ ఎంపీగా గెలిచిన ఆయన.. 1984, 1989, 1991, 1996లలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని రాంటెక్, కర్నూల్ జిల్లా నంద్యాల, ఒడిశాలోని బరంపురం లోక్‌సభ స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. కేంద్రంలో హోం, రక్షణ, విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేశారు. ► 1991లో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని పీవీ భావించారు. ఆ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేయలేదు కూడా. కానీ రాజీవ్‌గాంధీ హత్యతో పీవీ క్రియాశీలకంగా వ్యవహరించాల్సి వచ్చింది. ► రక్షణ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పారీ్టలోని ఇతర పోటీదారులను వెనక్కినెట్టి మైనారీ్టలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించే అవకాశం దక్కించుకున్నారు. 1991 జూన్ 21న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి ఎంపీ కాకపోవడంతో.. నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఏకంగా ఐదు లక్షల ఓట్ల భారీ మెజార్టీ సాధించి గిన్నిస్ రికార్డుల్లో ఎక్కారు. ► 1995 మే 16 వరకు మైనార్టీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి రాజకీయ దురంధరుడిగా నిలిచారు. ► ఆర్థిక రంగమైనా, రాజకీయ రంగమైనా, అభివృద్ధి పథమైనా, సంక్షేమ బాటలోనైనా.. తాను నిర్వహించిన పదవులకు వన్నె తెచ్చిన పీవీ 83 ఏళ్ల వయసులో.. 2004 డిసెంబర్ 23న ఢిల్లీలో కన్నుమూశారు. తర్వాత 19 ఏళ్ల అనంతరం ఆయనకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. పీవీ ఇంట్లోనే పనిజేసిన.. ప్యాంట్లు వేసుకుని సిగ్గుపడ్డం నా చిన్నప్పుడు పీవీ ఇంట్ల, వారి పొలాల్లో పనిచేసిన. ఊర్లో అందరం ఆయన ఇంటిని గడి అని పిలిచేటోళ్లం. పీవీ ఇంటివాళ్లు అందరితో కలివిడిగా ఉండేవారు. మాది చిన్న పల్లెటూరు. ధోవతులు తప్ప ప్యాంట్లు తెలియవు. ఎవరన్నా ప్యాంట్ వేసుకుంటే వింతగా జూసేది. ఏ ఊరి దొరనో అని గొప్పగా అనుకునే వాళ్లం. ఒకనాడు ఇంటికి వచ్చిన పీవీ దొరను.. మీరెందుకు ప్యాంట్లు వేసుకోరని అడిగిన. ఆయన చిన్నగా నవి్వండు. తర్వాత మా ఊళ్లనే బావులకాడ పనిచేసే పది మందికి ప్యాంట్లు కుట్టిచిండు. వాళ్లు బజార్ల తిరగాలంటే ఒకటే సిగ్గుపడుడు. గుర్తొస్తే నవ్వొస్తది. పీవీకి భారతరత్న వచ్చిందంటే.. మా ఊరికి కాదు దేశానికి గౌరవం ఇచ్చినట్టే.. – కాల్వ రాజయ్య, వంగర గ్రామస్తుడు వంగరలో సంబురాలు సాక్షి ప్రతినిధి, వరంగల్/మంథని: పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంతో.. ఆయన స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో.. కుటుంబసభ్యులు, గ్రామస్తులు సంబురాలు జరుపుకొన్నారు. పీవీ ఇంటి ఆవరణలో టపాసులు కాల్చారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. స్వీట్లు పంచుకున్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పీవీ సేవలను ఆలస్యంగానైనా గుర్తించి భారతరత్న ఇచ్చినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. అందరు ప్రధానమంత్రులను గౌరవించినట్టుగానే.. పీవీకి కూడా ఢిల్లీలో ఘాట్ నిర్మించాలని కోరారు. మరోవైపు పీవీ రాజకీయ అరంగేట్రం చేసి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంథని నియోజకవర్గంలోనూ స్థానికులు సంబురాలు చేసుకున్నారు. తెలుగు ప్రజలందరికీ గౌరవం పీవీకి భారతరత్నపై ఏపీ సీఎం జగన్ హర్షం సాక్షి, అమరావతి : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించటంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ‘పీవీ నరసింహారావు రాజనీతిజు్ఞడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు కలిగిన పండితుడు. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ గౌరవం’అని సీఎం పేర్కొన్నారు. అలాగే, రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చరణ్‌సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా భారతరత్న ప్రకటించడం యావత్ జాతి గరి్వంచదగ్గ విషయమని శుక్రవారం రాత్రి ‘ఎక్స్’లో సీఎం ట్వీట్ చేశారు. -
పీవీకి భారతరత్న
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు తేజం, దివంగత ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావుకు ఎట్టకేలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆయనకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. మరో దివంగత ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌లను కూడా ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ‘ఎక్స్’వేదికగా ఈ మేరకు వెల్లడించారు. ఆ ముగ్గురు దిగ్గజాలూ దేశానికి చేసిన సేవలు ఎనలేనివంటూ గుర్తు చేసుకున్నారు. ‘‘పీవీ ఆర్థిక సంస్కరణలు దేశానికి కొత్త దిశను, ఆర్థిక రంగానికి నూతన జవసత్వాలను ప్రసాదించాయి. ఇక చరణ్‌సింగ్ రైతు సంక్షేమానికి ఆజన్మాంతం పాటుపడ్డారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆహార రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధించడంలో కీలకపాత్ర పోషించారు’’అంటూ ప్రధాని కొనియాడారు. తర్వాత కాసేపటికే ఈ ముగ్గురికీ భారతరత్న ఇస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ప్రధాని పదవి చేపట్టి ఆర్థిక సంస్కరణలతో ప్రగతి బాట పట్టించిన రాజనీతిజ్ఞుడు పీవీ. అంతర్గత భద్రత మొదలుకుని విదేశాంగ విధానం దాకా, ఆర్థిక రంగం నుంచి రైతు సంక్షేమం దాకా అన్ని అంశాల్లోనూ చెరగని ముద్ర వేసిన ఆయన 2004లో మరణించారు. ఇక చరణ్‌సింగ్ పశి్చమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాట్ నేత. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రెండుసార్లు యూపీ సీఎంగా, అనంతరం కేంద్ర హోం మంత్రిగా రాణించారు. ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. 1979లో స్వల్పకాలం ప్రధానిగానూ చేశారు. 1987లో తుదిశ్వాస విడిచారు. ఆయనదీ, పీవీదీ పూర్తిగా బీజేపీయేతర నేపథ్యమే కావడం గమనార్హం. వారికి భారతరత్న పురస్కారం రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రభావం చూపగల నిర్ణయమంటున్నారు. ముఖ్యంగా రాజకీయ జీవితాన్నంతా కాంగ్రెస్‌కే ధారపోసిన పీవీకి ఆ పార్టీ సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదని ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం గణనీయంగా ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇక యూపీలో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిన 16 స్థానాల్లో ఆరు చరణ్‌సింగ్ మనవడైన జయంత్ సింగ్ సారథ్యంలోని ఆర్ఎల్డీ ప్రాబల్యమున్నవే. ఆయనను ఎన్డీఏలో చేర్చుకునేందుకు బీజేపీ కొంతకాలంగా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించగానే జయంత్ ఎన్డీయేలో చేరుతున్నట్టు వెల్లడించడం విశేషం! ఇక మన్‌కోంబు సాంబశివన్ స్వామినాథన్ ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త. తన విశేష పరిశోధనలతో భారత్‌ను స్వయంసమృద్ధంగా తీర్చిదిద్ది కరువు మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టిన దార్శనికుడు. ఆయన 2023లో మృతి చెందారు. బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌తో పాటు బీజేపీ సీనియర్ నేత ఎల్కే ఆడ్వాణీలకు కూడా ఇటీవలే భారతరత్న ప్రకటించడం తెలిసిందే. దాంతో ఈ ఏడాది ఈ పురస్కార గ్రహాతల సంఖ్య ఐదుకు చేరింది. ఒకే ఏడాదిలో ఇంతమందికి భారతరత్న ఇవ్వడం ఇదే తొలిసారి. 1999లో అత్యధికంగా నలుగురికి ఈ గౌరవం దక్కింది. 1954 నుంచి ఇప్పటిదాకా మొత్తమ్మీద ఇప్పటిదాకా 53 మందికి భారతరత్న పురస్కారం అందజేశారు. ఈసారి ఈ అవార్డు ప్రకటించిన వారిలో అడ్వాణీ (96) మాత్రమే జీవించి ఉన్నారు. సంస్కరణల రూపశిల్పి పీవీ... మాజీ ప్రధాని పీవీని భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోíÙస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ‘‘ఆయన విశిష్ట పండితుడు. గొప్ప రాజనీతిజు్ఞడు. పలు హోదాలలో దేశానికి అసమాన సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అనేక ఏళ్ల పాటు లోక్‌సభ, శాసనసభ సభ్యునిగా ఆయన చేసిన కృషి మరులేనిది. దేశ ఆరి్ధకాభివృధ్ధిలో దూరదృష్టితో కూడిన ఆయన నాయకత్వం అతి కీలకపాత్ర పోషించింది. దేశ శ్రేయస్సుకు, అభివృద్ధికి బలమైన పునాది వేసింది. భారత మార్కెట్లను ప్రపంచానికి తెరుస్తూ ప్రధానిగా పీవీ తెచ్చిన సంస్కరణలు చాలా కీలకమైనవి. తద్వారా ఆర్థిక రంగంలో నూతన శకానికి తెర తీశారు పీవీ. విదేశాంగ విధానాన్ని సమూలంగా మార్చేయడమే గాక భాష, విద్య తదితర రంగాలెన్నింటిపైనో చెరగని ముద్ర వేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశ సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన బహుముఖ ప్రజ్ఞశాలి పీవీ’’అంటూ ప్రస్తుతించారు. మార్గదర్శకుడు స్వామినాథన్... వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి స్వామినాథన్ చేసిన సేవలు మరవలేనివని మోదీ అన్నారు. ‘‘క్లిష్ట సమయంలో దేశం వ్యవసాయ స్వావలంబన సాధించడంలో ఆయనది కీలక పాత్ర. దేశ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయోగాలు చేశారు. స్వామినాథన్ దార్శనికత సాగు తీరుతెన్నులనే సమూలంగా మార్చడమే గాక దేశ ఆహార భద్రతకు, శ్రేయస్సుకు బాటలు పరిచింది. నాకాయన ఎంతగానో తెలుసు. ఆయన అంతర్ దృష్టిని నేనెప్పుడూ గౌరవిస్తాను. స్వామినాథన్ బాటలో యువతను, విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తున్నాం’’అని వివరించారు. రైతు సంక్షేమానికి అంకితం... దివంగత ప్రధాని చరణ్‌సింగ్‌ను భారతరత్నతో సత్కరించడం తమ ప్రభుత్వ అదృష్టమని మోదీ అన్నారు. ‘‘దేశానికి ఆయన చేసిన సాటిలేని కృషికి ఈ గౌరవం అంకితం. ఆయన జీవితమంతా రైతుల హక్కులు, సంక్షేమానికే అంకితం చేశారు. దేశ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలిచారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయన నిబద్ధత యావత్ జాతికి స్ఫూర్తిదాయకం’’అంటూ కొనియాడారు. స్వాగతించిన పార్టీలు పీవీ, చరణ్‌సింగ్, ఎంఎస్‌లకు భారతరత్న ప్రకటించడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా నేతలంతా స్వాగతించారు. వారు ముగ్గురూ ఎప్పటికీ భారతరత్నాలేనని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ తరఫున ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జాతి నిర్మాణానికి పీవీ చేసిన కృషి ఎనలేనిదని ప్రస్తుతించారు. ఆర్థికం, విదేశాంగం, వ్యవసాయం, అణు శక్తి మొదలుకుని లుక్ ఈస్ట్ పాలసీ దాకా ఆయన కృషిని ఒక్కొక్కటిగా ఖర్గే ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. మరోవైపు, పీవీకి భారతరత్న రావడంపై ఏమంటారని కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాందీని పార్లమెంటు బయట మీడియా ప్రత్యేకంగా ప్రశ్నించడం విశేషం. ‘‘నేను స్వాగతిస్తున్నా. కచ్చితంగా’’అంటూ ముక్తసరి స్పందనతో సరిపెట్టారామె. స్వామినాథన్‌కు భారతరత్న ప్రకటించిన మోదీ, ఆయన ఫార్ములా ఆధారంగా రూపొందిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై మాత్రం మూగనోము పట్టారంటూ కాంగ్రెస్ విమర్శించింది. ఇలాంటి నిర్ణయాల్లో బీజేపీ పార్టీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని మరోసారి రుజువైందని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. వారికి ఎప్పుడో ఈ గౌరవం దక్కి ఉండాల్సిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభిప్రాయపడ్డారు. పీవీకి భారతరత్న ఇవ్వడాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తుతించారు. -
పీవీకి భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం
-
PV: ఓర్పు.. నేర్పు.. మౌన ముని పీవీ చెప్పే పాఠం
అనేక భాషల్లో పీవీ పాండిత్యం, ఆయన రచనలు, అంతర్జాతీయ విధానాలు, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకున్న సాహసోపేతమయిన నిర్ణయాలు, ఇతర పార్టీల నాయకులను గౌరవించిన తీరు, ఆర్థిక సంస్కరణలు, వార్ధక్యంలో కూడా కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం…ఇలా పీవీ గురించి అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. సినిమా తారల్లాంటి వారిని కంటితో చూడాలి. ఘంటసాల లాంటివారిని చెవితో వినాలి. పీవీ, వాజపేయి లాంటివారిని బుద్ధితో చూడాలి. జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. వారి సందర్భాల్లోకి వెళ్లి అవగాహన చేసుకోవాలి. మెదడుతో చూడాలి. మనసుతో తాకాలి. అప్పుడే పీవీ నుండి ఎంతో తెలుసుకోగలం. నేర్చుకోగలం. ఓర్పు పీవీది ఎంత సుదీర్ఘ ప్రయాణం? ఎన్ని మజిలీలు? ఎన్ని సత్కారాలు? ఎన్ని ఛీత్కారాలు? ఎన్ని పొగడ్తలు? ఎన్ని తిట్లు? ఒక దశలో సర్వసంగ పరిత్యాగిలా సన్యాసం స్వీకరించడానికి పెట్టే బేడా సర్దుకున్న వైరాగ్యం. అయినా బయటపడలేదు. కీర్తికి పొంగిపోలేదు. అవమానాలకు కుంగిపోలేదు. ఓపికగా, మౌనంగా, సాక్షిగా చూస్తూ ఉన్నాడు. ఆయన రోజు రానే వచ్చింది. అప్పుడు కూడా యోగిలా ఆ మౌనంతోనే అన్ని అవమానాలకు సమాధానం ఇచ్చాడు. తన ప్రత్యర్థుల ఊహకందనంత ఎత్తుకు ఎదిగాడు. కంచు మోగునట్లు కనకంబు మోగునా? నేర్పు ఎక్కడి తెలంగాణా పల్లె? ఎక్కడి ఢిల్లీ గద్దె? రాజకీయ పరమపద సోపాన పటంలో, అందునా అడుగడునా మింగి పడేసే పెద్ద పెద్ద పాములమధ్య పాములపర్తి పి వి ప్రధాని అయ్యాడంటే ఎంత నేర్పు ఉండాలి? ఎన్ని విద్యలు నేర్చుకుని ఉండాలి? ఎన్ని భాషలు నేర్చుకుని ఉండాలి? ఎన్నెన్ని కొత్త విషయాలు తెలుసుకుని ఉండాలి? ఎంత ఉత్సాహం ఉరకలు వేసి ఉండాలి? ముసలితనంలో, ఢిల్లీ తెలి మంచు ఉదయాల్లో స్వెటర్ వేసుకుని కంప్యూటర్ కీ బోర్డు ముందు ప్రోగ్రామింగ్ రాయగలిగాడంటే ఎంత జిజ్ఞాస లోపల దీపమై వెలుగుతూ ఉండాలి? పది భాషలు అవలీలగా మాట్లాడాలంటే మెదడు ఎంత చురుకుగా ఉండి ఉండాలి? రాజకీయంగా ఊపిరి సలపని పనుల్లో ఉంటూ లోపల భాషా సాహిత్యాలకు సంబంధించిన ఒక మూర్తిని తనకు తాను పెంచి పోషించుకోవాలంటే ఎంత సాహితీ పిపాస ఉండి ఉండాలి? విశ్వనాథ పెద్ద నవల వేయి పడగలను సహస్రఫణ్ పేరిట హిందీలోకి అనువదించాలంటే తెలుగు ఠీవిని దేశానికి రుచి చూపించాలని ఎంత తపన ఉండి ఉండాలి? మార్పు సంప్రదాయ చట్రాల్లో ఇరుక్కుపోకుండా నిత్యం కాలానుగుణంగా మారడంలో పీవీ వేగాన్ని చాలామంది ఆయన సమకాలీనులు అందుకోలేకపోయారు. మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తన కొలువులో పెట్టుకోవడం అప్పట్లో ఒక సాహసం. కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన చేసిన మార్పులే ఇప్పటికీ దారి దీపాలు. రెవిన్యూ సంస్కరణలు, పేదవారికి హాస్టల్ చదువులు, వినూత్న నవోదయ చదువులు… రాస్తూ పొతే రాయలేనన్ని మార్పులు. చేర్పు ఎవరిని చేర్చుకోవాలో? ఏది చేర్చుకోవాలో? ఎప్పుడు చేర్చుకోవాలో? తెలిసి ఉండాలి. మన్మోహన్ ను ఎందుకు చేర్చుకున్నాడో లోకానికి తెలుసు. అంతర్జాతీయ యవనిక మీద భారత వాణిని వినిపించడానికి ప్రతిపక్ష నాయకుడు వాజపేయిని కోరి ఎందుకు చేర్చుకున్నాడో లోకానికి తెలుసు. లోకానికి తెలియనివి, తెలియాల్సిన అవసరం లేనివి ఎన్నో చేర్చుకున్నాడు. కూర్పు ఎన్నిటిని ఓపికగా కూర్చుకుంటే పీవీని ఇప్పుడిలా మనం స్మరించుకుంటాం? సహనాన్ని కూర్చుకున్నాడు. తెలివితేటలను కూర్చుకున్నాడు. తెగువను కూర్చుకున్నాడు. కార్యదక్షులను కూర్చుకున్నాడు. చివరికి కాలాన్ని కూడా తనకు అనుకూలంగా కూర్చుకున్నాడు. తీర్పు ఏ నిర్ణయం తీసుకోకాకపోవడం కూడా ఒక నిర్ణయమే- అంటూ పి వి ని విమర్శించేవారు తరచు అనే మాట. టీ వీ తెరల ప్రత్యక్ష ప్రసారాల్లోకి వచ్చి చిటికెల పందిళ్లు వేస్తూ…జనం మీద సర్జికల్ స్ట్రైక్ నిర్ణయాల హిరోషిమా నాగసాకి సమాన విస్ఫోటనాలు విసిరి వినోదం చూసే నాయకులతో పోలిస్తే పి వి ఏ నిర్ణయం ఎందుకు తీసుకోలేదో? ఏ సయోధ్య కుదరని విషయాలను ఎందుకు కాలానికి వదిలేశాడో? అర్థమవుతుంది. ఇప్పుడు మన సర్టిఫికెట్లు ఆయనకు అవసరం లేదు. ఏ తప్పు లేని వాడు దేవుడే. మనిషిగా పుట్టినవాడికి గుణదోషాలు సహజం. నేర్చుకోగలిగితే పి వి నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగి, ఒదిగిన పి వి మన ఠీవి అనుకుని విగ్రహాలు పెడితే కూడళ్లలో మౌన సాక్షిగా ఉండిపోతాడు. మనం తెలుసుకుని నడవదగ్గ అడుగుజాడ పీవీ అనుకుంటే నిజంగా మన మనసుల్లో పి వీ ఠీవి అవుతాడు. :::పమిడికాల్వ మధుసూదన్ 9989090018 ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న -
పీవీకి భారత రత్న.. కవిత ఫస్ట్ రియాక్షన్
-
PV చనిపోయినప్పటి నుంచి ఇప్పటి దాకా పట్టించుకోని కాంగ్రెస్
-
పీవీకి భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం
-
Bharat Ratna#Swaminathan బతికుండగా వస్తే చాలా సంతోషించేవారు
#BharatRanta M S Swaminathan భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్‌కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను కేంద్రం ప్రకటించింది.మరణానంతరం స్వామినాథన్‌కు భారతరత్న అవార్డు దక్కనుంది. దీనిపై స్వామినాథన్ కుమార్తె, మాజీ చీఫ్ సైంటిస్ట్ , డబ్ల్యూహెచ్‌వో మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ స్పందించారు. ఆయన జీవితకాలంలో ఈ అవార్డు దక్కి ఉంటే కచ్చితంగా సంతోషంగా ఉండేవారని అభిప్రాయ పడ్డారు. కానీ వ్యవసాయ రంగానికి, రైతులకు ఆయన చేసిన సేవలకు గాను ఈ గుర్తింపు దక్కడంపై సంతోషంగాను, గర్వంగానూ ఉందన్నారు. కానీ ఆయన ఎప్పుడూ అవార్డుల కోసం పని చేయలేదనీ గుర్తింపుకోసం ఎదురు చూడలేదని పేర్కొన్నారు. కాలా చాలా అవార్డులు ఆయనకు దక్కాయని పేర్కొన్నారు. తను చేసిన పనికి వచ్చిన ఫలితాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. ఆయన జీవితమంతా రైతుల ప్రయోజనాల కోసం పాటు పడ్డారంటూ తండ్రి సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు. దేశంలో ఏ మూలకెళ్లినా ఆయన కలిసిన రైతులను గుర్తు పెట్టుకునేవారు. సమాజంలో రైతులు, పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేశారన్నారామె. ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్‌బర్డ్స్ కాగా దేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు, అభివృద్ధికి ఆయన విశేషమైన కృషి చేసి భారత హరిత విప్లవ పితామహుడుగా పేరు తెచ్చుకున్నారు స్వామినాథన్ ఎక్కువ దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను వృద్ధి చేసి ఎంతో మంది రైతుల జీవితాల్లో వెలుగులునింపారు. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులందుకున్నారు. అలాగే హెచ్‌కె ఫిరోడియా అవార్డ్, ది లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్, ఇందిరాగాంధీ ప్రైజ్ వంటి అవార్డులతోపాటు అంతర్జాతీయ రామన్ మెగసెసె అవార్డు , ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డులను కూడా అందుకున్నారు. స్వామినాథన్ 98 ఏళ్ల వయసులో 2023 సెప్టెంబర్ 23న చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. #WATCH | On M S Swaminathan being conferred the Bharat Ratna, Former Chief Scientist and former Deputy Director General at the WHO and daughter of MS Swaminathan, Dr Soumya Swaminathan says, "I am sure that he would have also been happy if the news had come during his lifetime.… pic.twitter.com/gz3r6udKPb — ANI (@ANI) February 9, 2024 -
భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..!
మునుపెన్నడూ లేని రీతిలో.. దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి ప్రకటించింది భారత ప్రభుత్వం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ.. మాజీ ప్రధానులైన పీవీ నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు ప్రకటించారు. అంతకు ముందు మరో ఇద్దరి పేర్లను ప్రధాని మోదీ స్వయంగానే ప్రకటించిన సంగతీ తెలిసిందే. సాధారణంగా భారతరత్న అవార్డులను ఒకరు, ఇద్దరు, గరిష్టంగా ముగ్గురికి ఇస్తూ వస్తోంది కేంద్రం. ఆ సంప్రదాయానికి 1999లో బ్రేక్ పడి.. ఏకంగా నలుగురికి ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. ఆ తర్వాత మళ్లీ ఒకరు, ఇద్దరు, ముగ్గురికి ఇస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా ఐదుగురికి ప్రకటించింది. ఈ ఏడాది.. బీజేపీ దిగ్గజం ఎల్కే అద్వానీకి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి థాకూర్‌కు భారతరత్నలకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ముగ్గురికి ప్రకటించడంతో మొత్తం ఐదుగురికి ఇచ్చినట్లయ్యింది. ఐదుగురివి వేర్వేరు ప్రాంతాలు. ఇందులో స్వామినాథన్ మినహాయించి మిగిలిన నలుగురికి వేర్వేరు రాజకీయ నేపథ్యం ఉంది. దీంతో.. ఆయా ప్రాంతాల రాజకీయ నేతలు పార్టీలకతీతంగా తమ ప్రాంత దిగ్గజాలకు భారతరత్న దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీపీ నరసింహరావు పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా భారత దేశానికి ప్రధానిగా పని చేశారు. అంతకు ముందు.. కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో పనిచేశారు. దేశ హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన పలు మంత్రిపదవులు చేపట్టారు. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న చరణ్ సింగ్.. ఉత్తర ప్రదేశ్ మీరట్‌లో పుట్టిన పెరిగిన చరణ్ సింగ్.. 1979 జులై 28వ తేదీ నుంచి 1980 జనవరి 14వ తేదీ దాకా దేశానికి ప్రధానిగా పని చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ ఆయన రెండుసార్లు పని చేశారు. యూపీలో చెప్పుకోదగ్గ స్థాయిలో బలం,బలగం ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ.. చరణ్ సింగ్ వారసులు స్థాపించిన పార్టీ), విపక్ష శిబిరానికి షాక్ ఇచ్చి ఎన్డీయేలో చేరుతుందన్న ప్రచారం ఉన్న సమయంలోనే.. చరణ్ సింగ్‌కు అవార్డు ప్రకటించడం గమనార్హం. ఇదీ చదవండి: గ్రామీణ ప్రజాబంధు చరణ్ సింగ్ ఎం.ఎస్ స్వామినాథ్.. భారత దేశ హరితవిప్లవ పితామహుడిగా మాన్‌కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జన్మించారు. కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. కిందటి ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ఆయన కన్నమూశారు. ఇదీ చదవండి: ఆకలిపై పోరాటం జరిపిన శాస్త్రవేత్త కర్పూరి ఠాకూర్ బిహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్ ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న తో గౌరవించింది. బిహార్‌కు రెండు పర్యాయాలు (డిసెంబరు 1970 నుంచి జూన్ 1971 వరకు, డిసెంబరు 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు) సీఎంగా సేవలందించి.. తన పాలనా దక్షతతో జన నాయక్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు. 1924 జనవరి 24న బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో జన్మించిన కర్పూరి ఠాకూర్.. అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం పనిచేశారు.జనం కోసం నిబద్ధతతో పనిచేసిన ఆయన్ను ‘జననాయక్ కర్పూరి ఠాకూర్’ అని అక్కడి ప్రజలు పిలుస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్, రాం విలాస్ పాశవాన్ వంటి నేతలకు ఠాకూర్ రాజకీయ గురువు. తాను విశ్వసించిన సిద్ధాంతాలకు కట్టుబడి సుదీర్ఘకాలం పాటు బిహార్, దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ద్వారా గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపుపొందిన ఆయన 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. ఇదీ చదవండి: అరుదైన జననాయకుడు ఎల్కే అద్వానీ రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారతరత్న గౌరవం దక్కింది. సంఘ్ భావజాలాన్ని అణువణువునా పుణికిపుచ్చుకుని.. అంచెలంచెలుగా రాజకీయ దిగ్గజంగా ఎదిగిన మేధావి. అద్వానీ.. 1927 నవంబరు 8న భారత్‌లోని కరాచీ (ప్రస్తుతం పాక్‌లో ఉంది)లో జన్మించారు. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన ఆరెస్సెస్‌లో చేరారు.దేశ విభజన తర్వాత ముంబయిలో స్థిరపడ్డ అద్వానీ.. రాజస్థాన్‌లో సంఘ్ ప్రచారక్‌గా పనిచేశారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు.1980లో అద్వానీ సహా కొంతమంది జన సంఘ్ నేతలు జనతా పార్టీని వీడారు. ఆ తర్వాత వాజ్పేయీతో కలిసి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే)కు రూపకల్పన చేసిన రాజనీతిజ్ఞుడు. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి అద్వానీ గెలిచారు. లోక్‌సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఉప ప్రధాని పదవిని సైతం ఆయన చేపట్టారు. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదీ చదవండి: గమ్యం చేరని రథ యాత్రికుడు -
మాజీ ప్రధాని పీవీకి భారత రత్న.. సీఎం జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞుడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు కలిగిన పండితుడు. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించటం తెలుగు ప్రజలందరికీ గౌరవం. రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా భారతరత్న ప్రదానం చేయడం యావత్ జాతి గర్వించదగ్గ విషయం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహరావుకు భారతరత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్నను శుక్రవారం ప్రకటించింది. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత తర్న ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్ వేదికగా వెల్లడించారు. వరంగల్ జిల్లా నర్సింపేట (మ) లక్నేపల్లిలో 1921 జూన్ 28న జన్మించిన పీవీ నరసింహారావు 1991లో భారత ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడయ్యాయడు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడంలో పీవీ కీలక పాత్ర పోషించారు. బహు భాషా కోవిదుడిగానూ పీవీ నరసింహారావుకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ ను కష్టకాలంలో ఆదుకున్న పీవీని ఆ తర్వాత కాంగ్రెస్ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న -
తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న
ఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహరావుకు భారతరత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్నను శుక్రవారం ప్రకటించింది. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత తర్న ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్ వేదికగా వెల్లడించారు. Delighted to share that our former Prime Minister, Shri PV Narasimha Rao Garu, will be honoured with the Bharat Ratna. As a distinguished scholar and statesman, Narasimha Rao Garu served India extensively in various capacities. He is equally remembered for the work he did as… pic.twitter.com/lihdk2BzDU — Narendra Modi (@narendramodi) February 9, 2024 వరంగల్ జిల్లా నర్సింపేట (మ) లక్నేపల్లిలో 1921 జూన్ 28న జన్మించిన పీవీ నరసింహారావు 1991లో భారత ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడయ్యాయడు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడంలో పీవీ కీలక పాత్ర పోషించారు. బహు భాషా కోవిదుడిగానూ పీవీ నరసింహారావుకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ ను కష్టకాలంలో ఆదుకున్న పీవీని ఆ తర్వాత కాంగ్రెస్ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. It is a matter of immense joy that the Government of India is conferring the Bharat Ratna on Dr. MS Swaminathan Ji, in recognition of his monumental contributions to our nation in agriculture and farmers’ welfare. He played a pivotal role in helping India achieve self-reliance in… pic.twitter.com/OyxFxPeQjZ — Narendra Modi (@narendramodi) February 9, 2024 हमारी सरकार का यह सौभाग्य है कि देश के पूर्व प्रधानमंत्री चौधरी चरण सिंह जी को भारत रत्न से सम्मानित किया जा रहा है। यह सम्मान देश के लिए उनके अतुलनीय योगदान को समर्पित है। उन्होंने किसानों के अधिकार और उनके कल्याण के लिए अपना पूरा जीवन समर्पित कर दिया था। उत्तर प्रदेश के… pic.twitter.com/gB5LhaRkIv — Narendra Modi (@narendramodi) February 9, 2024 పీవీ ప్రస్థానం.. పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పీవీ నరసింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. 1996 వరకు ప్రధానమంత్రి పనిచేశారు. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ఈ ఏడాది ఐదుగురికి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీలకు ఇటీవల భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్, స్వామినాథన్‌లకు ఈ అత్యున్నత పురస్కరాన్ని ప్రకటించింది. ఎం.ఎస్ స్వామినాథ్ ప్రస్థానం.. మాన్‌కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జన్మిమంచారు. ఆయన తండ్రి డాక్టర్ ఎం.కె.సాంబశివన్ వైద్యుడు. తల్లి పార్వతీ తంగమ్మల్ గృహిణి. 11వ ఏట తండ్రిని కోల్పోయారు. తన మామయ్య సంరక్షణలో పెరిగిన స్వామినాథన్ కుంభకోణంలో మెట్రిక్యులేషన్, త్రివేండ్రంలో జంతుశాస్త్రంలో డిగ్రీ చేశారు. తర్వాత కోయంబత్తూరు అగ్రికల్చరల్ కాలేజీ నుంచి అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ సాధించారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీజీ పూర్తి చేశారు. స్వామినాథన్ 2004 నుంచి 2006 దాకా ‘నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్’ అధినేతగా వ్యవహరించారు. పంటలకు కనీస మద్దతు ధరపై ప్రభుత్వానికి విలువైన ప్రతిపాదనలు చేశారు. పంటల ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతాన్ని కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని సూచించారు. ఎన్నో పదవులు కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. ► 1981 నుంచి 1985 దాకా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ స్వతంత్ర చైర్మన్ ► 1984 నుంచి 1990 దాకా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అధ్యక్షుడు ► 1982 నుంచి 1988 దాకా ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ► 1989 నుంచి 1996 దాకా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(ఇండియా) అధ్యక్షుడు ► ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ వరించిన అవార్డులు ► 1967లో పద్మశ్రీ ► 1971లో రామన్ మెగసెసే ► 1972లో పద్మభూషణ్ ► 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ► 1989లో పద్మవిభూషణ్ ► ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 84 గౌరవ డాక్టరేట్లు మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్ ప్రస్థానం... జమిండారీ విధానం రద్దు అయిన తరువాత అప్పటికి వాస్తవంగా భూమిని సాగుచేస్తూ ఉన్న కోట్లాది మంది కౌలుదారులకు, గ్రామీణ పేదలకు భూమిపైన హక్కు కల్గించిన రైతు బాంధవుడు చరణ్‌సింగ్. భారతీయ రైతాంగ సమస్యసల పరిష్కారంలో అద్వితీయ పాత్ర పోషించిన రైతుజన బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్. జిల్లా స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన క్రమంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి రైతు సంక్షేమానికి తుది వరకూ చిత్తశుద్ధితో ప్రయత్నించిన వారిలో అగ్రగణ్యులు చరణ్ సింగ్. సహకార వ్యవసాయం భారతీయ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేస్తుందన్న అభిప్రాయంతో, జవహర్లాల్ నెహ్రూ విధానాలనే చరణ్‌దిక్కరించిన ధీరుడు 1902లో డిసెంబర్ 23న పశ్చిమ యూపీలో మీరట్ జిల్లాలో భడోల్ అనే చిన్న గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన చరణ్‌సింగ్.. 1923లో సైన్స్‌లో డిగ్రీని పొంది.. 1925లో ఆగ్రా యూనివర్శిటీ నుండి ఎంఏ, ఎంఎల్ పట్టాలను పొందారు. వృత్తిపరంగానే కాక గ్రామీణ ప్రజల సమస్యలను ప్రత్యేకంగా వ్యవసాయదారుల కష్టసుఖాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని గ్రామీణ ప్రజానీకంతో మమేకం అయ్యేవారు. 1937-1974 వరకూ శాసనసభ్యుడిగా వరుసుగా ఎన్నిక అవుతూ వచ్చారు. యూపీ రాష్ట్రానికి రెండుసార్లు సీఎంగా, కేంద్రంలో జనతా ప్రభుత్వంలో ఆర్థికమంత్రి, ఉప ప్రధాని పదవులను నిర్వహించారు. 1979లో ప్రధాని అయిన చరణ్ సింగ్ 170 రోజులకే ఆ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 1987, మే 29వ తేదీన ఆయన అసువులు బాశారు. -
బాబ్రీమసీదు కూల్చివేత నేరస్తునికి భారతరత్నా?
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేతలో నేరస్తునిగా ఉన్న అడ్వాణీకి భారతరత్న ఇవ్వడంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మండిపడ్డారు. హైదరాబాద్ మగ్ధూంభవన్‌లో మూడు రోజులపాటు జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సమావేశంలో చర్చించిన విషయాలు, తీర్మానాలు తదితర అంశాలను ఆదివారం సీపీఐ జాతీయ కార్యదర్శులు రామకృష్ట పండా, కె.నారాయణ, సయ్యద్ అజీజ్, లోక్‌సభాపక్ష నేత బినాయ్ విశ్వం, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి రాజా మీడియా సమావేశంలో వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలుపొందితే దేశానికి విపత్తేనని, ఈ విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజా అన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు సాధ్యమైనంత త్వరగా సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసుకుని, బీజేపీని ఓడించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఆ ప్రభుత్వ పాలసీలను విమర్శించడం ప్రతిపక్ష హక్కు అని, కానీ మోదీ, బీజేపీ ప్రతిపక్షమే ఉండకూడదని భావిస్తోందని ఆరోపించారు. రానున్న లోక్ ఎన్నికలకు తాము సన్నద్ధమవుతున్నామని, ఇండియా కూటమి కామన్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తుందని, అదే సమయంలో తమ పార్టీ తరపున మేనిఫెస్టోను రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇండియా కూటమి నేతలు గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు ఉన్నప్పటికీ రాహుల్ ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే కేరళలో పోటీచేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీని ఓడించేందుకు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పనిచేస్తున్న నేపథ్యంలో కేరళలో రాహుల్ పోటీ చేయడం ఆరోగ్య వాతావరణం కాదన్నారు. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ జాతీయ సమితి ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్ కౌర్, డాక్టర్ బి.కె.కంగో, నాగేంద్రనాథ్ ఓజా, జాతీయ కార్యవర్గ సభ్యులు అనీరాజా, రాజ్యసభ సభ్యులు పి.సంతోష్ కుమార్‌లను ఈ కమిటీ సభ్యులుగా నియమించారు. -
‘అద్వానీ, మోదీని చూస్తే.. ఆ రెండు సంఘటనలు గుర్తుకొస్తాయి’
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో సత్కరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా వెల్లడించారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. అయితే ఎల్కే అద్వానీకి భారత రత్న ప్రకటించడంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ స్పందించారు. బీజేపీ అగ్రనేత ఎల్.కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన సందర్భంగా.. అద్వానీ, ప్రధాని మోదీకి సంబంధించి తనకు రెండు సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. అందులో మొదటి సంఘటన.. 2002లో ప్రస్తుత ప్రధాని మోదీ గుజరాత్‌కు సీఎం ఉన్న సమయంలో.. మోదీని అద్వానీ కాపాడారని తెలిపారు. ఆనాటి ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజపేయి.. గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని ఆ పదని నుంచి తొలగించి రాజధర్మను గుర్తుచేయాలనుకున్నారని తెలిపారు.కానీ, ఆ సమంయలో మోదీని సీఎం పదవి నుంచి తొలగించబడకుండా అద్వానీ రక్షించారని అన్నారు. రెండో సంఘటన.. 5 ఏప్రిల్, 2014 నాటి సమయంలో నరేంద్ర మోదీ.. గుజరాత్‌లోని గాంధీ లోక్‌సభ నియోజకవర్గంలో నామినేషన్ వేశారు. అప్పడు అద్వానీ.. నరేంద్రమోదీపై అసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీ తన శిష్యుడు కాదని.. మంచి ఈవెంట్ మేనేజర్ అని అన్నారని తెలిపారు. ఈ మాటలు తాను అంటున్నని కాదని.. స్వయంగా అద్వానీ అన్న మాటలేనని తెలిపారు. వారిద్దరినీ (అద్వానీ, మోదీ) చూసినప్పుడు ఈ సందర్భాలు గుర్తుకువస్తాయని జైరాం రమేష్ అన్నారు. ఇక.. 2002లో మోదీని రక్షించిన అద్వానీ.. 2014లో మాత్రం మోదీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారని అన్నారు. आज दोपहर मोहनपुर, देवघर में हुई प्रेस कॉन्फ्रेंस में LK अडवाणी को भारत रत्न दिए जाने को लेकर एक पत्रकार साथी के सवाल पर मेरा जवाब। In my press meet this afternoon at Mohanpur in Deoghar district of Jharkhand I was asked about the Bharat Ratna to Mr. L.K. Advani. This was my… pic.twitter.com/IjnGIgDZoL — Jairam Ramesh (@Jairam_Ramesh) February 3, 2024 -
అద్వానీకి భారత రత్న.. దేశ అత్యున్నత పురస్కారం అందుకుంది వీరే
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో సత్కరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా వెల్లడించారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. అద్వానీకి భారతరత్న ప్రదానం చేయడం తనకెంతో భావోద్వేగ క్షణమని పేర్కొన్నారు. ఆయనతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. కాగా ఇప్పటివరకూ 50 మంది ప్రముఖులు ‘భారతరత్న’ను అందుకున్నారు. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారతరత్న పొందిన వారిలో క్రికెట్ గాడ్‌గా పేరొందిన సచిన్ టెండూల్కర్ పేరు కూడా ఉంది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు... ఇలా పలువురు ‘భారతరత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ జాబితాలో ఇటీవల ప్రముఖ గాంధేయ సోషలిస్ట్ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ పేరు కూడా చేరింది. చదవండి: బీజేపీ ‘రథ యాత్రికుడు’ అద్వానీ! ఇప్పటివరకు ‘భారతరత్న’ అందుకున్నవారు 1. చక్రవర్తి రాజగోపాలాచారి (రాజకీయవేత్త, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు)- 1954 2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (తత్వవేత్త, రాజకీయవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)- 1954 3. చంద్రశేఖర్ వెంకట రామన్ (భౌతిక శాస్త్రవేత్త)- 1954 4. భగవాన్ దాస్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు, తత్వవేత్త, విద్యావేత్త)- 1955 5. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (సివిల్ ఇంజనీర్, రాజకీయవేత్త, మైసూర్ దివాన్)- 1955 6. జవహర్లాల్ నెహ్రూ (స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత, భారత మాజీ ప్రధాని)- 1955 7. గోవింద్ వల్లభ్ పంత్ (స్వాతంత్ర్య సమరయోధుడు)- 1957 8. ధోండో కేశవ్ కర్వే (సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుడు)- 1958 9. బిధాన్ చంద్ర రాయ్ (వైద్యుడు, రాజకీయ నేత , పరోపకారి, విద్యావేత్త, సామాజిక కార్యకర్త) - 1961 10. పురుషోత్తం దాస్ టాండన్ (స్వాతంత్ర్య సమర యోధుడు)- 1961 11. రాజేంద్ర ప్రసాద్ (స్వాతంత్ర్య సమర యోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త, పండితుడు, భారత మాజీ రాష్ట్రపతి)- 1962 12. జాకీర్ హుస్సేన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1963 13. పాండురంగ్ వామన్ కేన్ (ఇండాలజిస్ట్, సంస్కృత పండితుడు)-1963 14. లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు, భారత మాజీ ప్రధాని) – 1966 15. ఇందిరా గాంధీ (రాజకీయనేత, భారత మాజీ ప్రధానమంత్రి)-1971 16. వరాహగిరి వెంకట గిరి (స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ రాష్ట్రపతి)-1975 17. కుమారస్వామి కామరాజ్ (మరణానంతరం) (రాజకీయవేత్త, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి) - 1976 18. మదర్ మేరీ థెరిసా బోజాక్షియు (మదర్ థెరిసా) (మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు) - 1980 19. వినోబా భావే (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)-1983 20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)-1987 21. మరుదూర్ గోపాలన్ రామచంద్రన్ (మరణానంతరం) (రాజకీయనేతగా మారిన నటుడు)-1988 22. భీమ్ రావ్ రామ్‌జీ అంబేద్కర్ (మరణానంతరం) (సంఘ సంస్కర్త)-1990 23. నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (వర్ణవివక్ష వ్యతిరేక పోరాట నేత)- 1990 24. రాజీవ్ గాంధీ (మరణానంతరం) (రాజకీయనేత, భారత మాజీ ప్రధాని)-1991 25. సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1991 26. మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్ (స్వాతంత్ర్య పోరాట వీరుడు, భారత ప్రధాని)- 1991 27. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు)-1992 28. జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా (పారిశ్రామికవేత్త)- 1992 29. సత్యజిత్ రే (చిత్ర నిర్మాత)- 1992 30. గుల్జారీ లాల్ నందా (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1997 31. అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు)- 1997 32. ఎ.పి.జె. అబ్దుల్ కలాం ( శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)-1997 33. మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (కర్ణాటక శాస్త్రీయ గాయని)-1998 34. చిదంబరం సుబ్రమణ్యం (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1998 35. జయప్రకాష్ నారాయణ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)- 1999 36. అమర్త్య సేన్ (ఆర్థికవేత్త)- 1999 37. ప్రకాష్ గోపీనాథ్ బోర్డోలోయ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు) – 1999 38. రవిశంకర్ (సితార్ వాద్యకారుడు) - 1999 39. లతా దీనానాథ్ మంగేష్కర్ (గాయని)- 2001 40. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (హిందుస్తానీ క్లాసికల్ షెహనాయ్ ప్లేయర్)- 2001 41. భీంసేన్ గురురాజ్ జోషి (హిందుస్తానీ క్లాసికల్ సింగర్)- 2009 42. సిఎన్ఆర్ రావు (కెమిస్ట్, ప్రొఫెసర్)- 2014 43. సచిన్ రమేష్ టెండూల్కర్ (క్రికెటర్)- 2014 44. అటల్ బిహారీ వాజ్‌పేయి (రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)- 2015 45. మదన్ మోహన్ మాలవీయ (మరణానంతరం) (పండితులు, విద్యా సంస్కర్త)- 2015 46. నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం) (సామాజిక కార్యకర్త)- 2019 47. భూపేంద్ర కుమార్ హజారికా (మరణానంతరం) (ప్లేబాక్ సింగర్, గేయ రచయిత, సంగీతకారుడు, కవి, చలనచిత్ర నిర్మాత) - 2019 48. ప్రణబ్ ముఖర్జీ (రాజకీయనేత, భారత మాజీ రాష్ట్రపతి)- 2019 49. కర్పూరి ఠాకూర్ (మరణానంతరం) (రాజకీయనేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి) – 2024 50. ఎల్కే అద్వానీ(రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)-2024 -
బీజేపీ ‘రథ యాత్రికుడు’ అద్వానీ!
భారత అత్యన్నత పౌర పురస్కారమైన భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ(96)కి అందజేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపధ్యంలో అద్వానీ జీవితంలో చోటుచేసుకున్న ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం. లాల్ కృష్ణ అద్వానీ అసలు పేరు లాల్ కిషన్‌చంద్ అద్వానీ. అతని ప్రారంభ విద్య కరాచీలో సాగింది. తరువాత లాహోర్‌లో చదువుకున్నారు. అనంతరం ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. బీజేపీని ఇప్పడున్న ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన ఘనత లాల్ కృష్ణ అద్వానీకే దక్కుతుంది. ఇద్దరు ఎంపీల స్థాయి కలిగిన బీజేపీని 150 మంది ఎంపీలు ఉన్న పార్టీగా రూపొందించిన ఘనత అద్వానీకే దక్కుతుంది. అద్వానీ చదువుకునే సమయంలో ఆర్ఎస్ఎస్లో చేరారు. 1947లో కరాచీలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమితులయ్యారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1951లో జన్ సంఘ్‌ను స్థాపించినప్పుడు, ప్రారంభ సభ్యులలో అద్వానీ కూడా ఒకరు. 1957 వరకు అద్వానీ సంఘ్ కార్యదర్శిగా కొనసాగారు. జన్ సంఘ్‌లో ముఖ్యమైన పదవుల్లో పనిచేసిన తర్వాత 1972లో అద్వానీ సంఘ్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తరువాత ఆ పార్టీ జన్ సంఘ్ నుండి బీజేపీగా మారినప్పుడు.. అంటే 1980లో పార్టీ స్థాపించినప్పటి నుండి 1986 వరకు లాల్ కృష్ణ అద్వానీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అనంతరం 1986 నుంచి 1991 వరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. 90వ దశకంలో లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి ద్వయం భారత రాజకీయాలలో కీలక వ్యక్తులుగా మారారు. రామాలయ ఉద్యమాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. ఒకదాని తర్వాత ఒకటిగా అద్వానీ చేపట్టిన యాత్రల ఫలితం అతి తక్కువ వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అలాగే పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి జంట 1996 లోక్‌సభ ఎన్నికలలో భిన్నమైన చరిత్రను సృష్టించింది. 1996లో తొలిసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా, అద్వానీ హోంమంత్రిగా పదవులు చేపట్టారు. ఆలయ ఉద్యమం తర్వాత, అద్వానీకి ప్రజాదరణ తారాస్థాయికి చేరింది. దీంతో అద్వానీని ప్రధానిని చేయాలనే ఆలోచన నాటి బీజేపీ నేతలలో కలిగింది. అయితే అద్వానీ స్వయంగా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరును ప్రధాని పదవికి సూచించారని చెబుతారు. కాగా అద్వానీ అరడజనుకు పైగా రథయాత్రలు చేపట్టారు. వాటిలో ‘రామ రథ యాత్ర’, ‘జనదేశ్ యాత్ర’, ‘స్వర్ణ జయంతి రథయాత్ర’, ‘భారత్ ఉదయ్ యాత్ర’,‘భారత్ సురక్ష యాత్ర’ ముఖ్యమైనవి.