శివాజీగణేశన్ భారతరత్నకు అర్హుడు కాదా?
మహా నటుడు శివాజీగణేశన్‌కు ఇప్పటి వరకూ భారతరత్నను ఇవ్వకపోవడానికి కారణం ఏమిటీ.
సాక్షి, తమిళసినిమా: మహా నటుడు శివాజీగణేశన్‌కు ఇప్పటి వరకూ భారతరత్నను ఇవ్వకపోవడానికి కారణం ఏమిటీ. అందుకు ఆయన అర్హుడు కాదా? అంటూ ప్రశ్నించారు గాంధీ మక్కళ్ ఇయక్కం అధ్యక్షుడు తమిళరువి మణియన్. ఈయన రాసిన తిరైయుళగిన్ తవప్పుదల్‌వన్, రామాయణ రహస్యం పుస్తకాల పరిచయ కార్యక్రమం ఆదివారం ఉదయం స్థానిక టీ. నగర్‌లోని సర్ పీటీ త్యాగరాయర్ ఆవరణలో జరిగింది. తమిళరువి మణియన్ మాట్లాడుతూ శివాజీగణేశన్ నటించిన చిత్రాలు కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించాయని పేర్కొన్నారు. సినిమాలనే అసహ్యించుకునే పెరియార్ తమిళభూమి నుంచి వాటిని పారద్రోలారని అనే వారన్నారు.
అలాంటి పెరియార్ శివాజీగణేశన్ నటనను అభినందించారని తెలిపారు. అదే విధంగా శివాజీగణేశన్ నటించిన మృదంగ చక్రవర్తి చిత్రం చూసి నటుడంటే శివాజీనే అని సహనటుడు ఎంజీఆర్ అభినందించారని గుర్తు చేశారు. తన చిత్రాల ద్వారా దేశ కీర్తిని చాటిన నటుడు శివాజీగణేశన్ అని పేర్కొన్నారు. తన అందమైన వాచకంతో తమిళ భాష గొప్పతనాన్ని తెలిపిన మహా నటుడు శివాజీగణేశన్ అని కీర్తించారు. అలాంటి మహా నటుడికి భారతరత్న అవార్డు ఇంకా అందించక పోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. శివాజీగణేశన్‌ను కేంద్రప్రభుత్వం గుర్తించడం లేదని అన్నారు. ఎంఎస్ .సుబ్బలక్ష్మి, లతామంగేష్కర్, బిస్మిల్లాఖాన్, రవిశంకర్, సత్యజిత్‌రే, సచిన్‌టెండూల్కర్ వంటి వారిని కేంద్రప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించిందని, శివాజీగణేశన్ ఎందులో తక్కువని ప్రశ్నించారు. శివాజీగణేశన్‌కు భారతరత్న అవార్డు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.