జయలలితకు భారత రత్న ఇవ్వొచ్చా?
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మరణానంతరం భారత్ అత్యుత్తమ పౌర పురస్కారమైన భారత్ రత్నను ప్రకటించాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేయాలని కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సాక్షాత్తు జయలలిత రాజకీయ గురువు ఎంజీ రామచంద్రన్ 1987లో మరణించినప్పుడు ఆయనకు భారత రత్న అవార్డు ఇవ్వాలంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఆ ఆంశాన్ని పరిశీలించిన అప్పటి కేంద్రంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1988లో ఎంజీఆర్‌కు భారత రత్న అవార్డును ప్రకటించింది.
ఆయన వారసులే కాకుండా ఆయనంత ప్రజాభిమానం కలిగిన జయలలితకు ఎందుకు ఇవ్వకూడదనే సందేహం రావచ్చు. ఎంజీఆర్‌కు ఈ అవార్డు ప్రకటించినందుకు నాడు దేశంలోని వివిధ వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కారణం భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్‌కే భారత రత్న అవార్డు ఇవ్వనప్పుడు ఎంజీఆర్‌కు ఎలా ఇస్తారన్నది విమర్శ. జరిగిన పొరపాటును గ్రహించిన కేంద్ర ప్రభుత్వం 1990లో అంబేద్కర్‌కు భారత్ రత్న అవార్డును ప్రకటించింది.
నాటి ఎంజీఆర్‌కన్నా నేడు జయలలితకే ఎక్కువ ప్రజాభిమానం ఉండవచ్చు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కువగానే చేసి ఉండవచ్చు. కానీ నాడు ఎంజీఆర్ మీద అవినీతి కేసులు లేవు. జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. 1996 నాటి ఈ కేసులో 2014, సెప్టెంబర్ నెలలో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ బెంగళూరులోని ట్రయల్ కోర్టు తీర్పు చెప్పడం, ఆమె జైలుకు వెళ్లడం, తర్వాత కర్ణాటక హైకోర్టు ఆ కేసును కొట్టివేయడం, జయ విడుదలవడం తదితర పరిణామాలు తెల్సినవే.
కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. గత జూన్ నెలలోనే విచారణ పూర్తి చేసిన సుప్రీం కోర్టు తీర్పును వాయిదా వేసింది. సాధారణంగా నిందితులు మరణిస్తే కేసును మూసేస్తారు. కానీ జయలలితతోపాటు సహ నిందితురాలిగా జైలుకెళ్లి వచ్చిన శశికళ, తదితర నిందితులు జీవించే ఉన్నారుకనుక కేసు కూడా జీవించి ఉన్నట్లే లెక్క. ఇప్పుడే జయకు భారత రత్నను ప్రకటించినట్లయితే దాని ప్రభావం సుప్రీం కోర్టుపై పడే అవకాశం ఉంది. ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పేవరకు నిరీక్షించడం మంచిదన్నది రాజకీయ విశ్లేషకుల మాట.