సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆమె మృతి విషయంలో తాజాగా అపోలో ఆస్పత్రి టాప్ అధికారిపలు కీలక విషయాలు వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్ 22న జయలలితను అపోలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆమె అప్పుడు శ్వాస తీసుకోలేనిస్థితిలో ఉన్నారని అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి తెలిపారు.
అన్నాడీఎంకే అధినేత్రి అయిన జయలలిత 75రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలొదిలిన సంగతి తెలిసిందే. ‘శ్వాస తీసుకోలేని స్థితిలో ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందించాం’ అని ప్రీతారెడ్డి ఢిల్లీలో ఓ తమిళ చానెల్‌కు తెలిపారు.
‘అయితే, చివర్లో అందరికి ఆశలకు భిన్నమైన ఫలితం వచ్చింది. అయినా అది విధి చేతుల్లో ఉంటుందని, ఆ విషయంలో ఎవ్వరం ఏమి చేయలేమని నేను భావిస్తాను’ అని ఆమె అన్నారు. జయలలిత మృతి పట్ల వస్తున్న అనుమానాలు, వివాదాలపై స్పందిస్తూ..ఢిల్లీ, ఎయిమ్స్, విదేశాలకు చెందిన ఉత్తమ వైద్యులతో జయలలితకు చికిత్స అందించామని, అపోలో ఆస్పత్రి ఉత్తమ చికిత్స అందించిందని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయమై విచారణ కొనసాగుతోందని, పూర్తి సమాచారాన్ని విచారించిన తర్వాత మిస్టరీ వీడిపోతుందని ఆమె అన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏ అరుముగస్వామి నేతృత్వంలో జయలలిత మృతిపై అనుమానాల నివృత్తికి ఎంక్వైరీ కమిషన్‌ను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంగతి తెలిసింది.
జయలలితకు చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె పక్కన ఆమె ఆమోదించిన వ్యక్తులు, అవసరమైన వైద్యులు, నర్సులు ఉన్నారని తెలిపారు. ఆస్పత్రిలో జయలలిత వేలిముద్రలు తీసుకున్న విషయంలో ఆమెకు తెలుసా? అన్న ప్రశ్నకు తాను ఆమె పక్కన లేనందున సమాధానం చెప్పలేనని అన్నారు. అప్పటి ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థుల ఖరారు కోసం జయలలిత వేలిముద్రలను సేకరించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment