జయ ఆరోగ్యంపై... సీనియర్ జర్నలిస్టు ట్వీట్స్!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ‘అమ్మ’ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఊహాగానాలు వస్తుండటంతో ఆమె అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ‘అమ్మ’ ఆరోగ్యంపై వదంతులు, ఊహాగానాలకు తెరదించుతూ సీనియర్ జర్నలిస్టు, హిందూ దినపత్రిక మాజీ ఎడిటర్ మాలినీ పార్థసారథి వరుస ట్వీట్లలో స్పష్టత ఇచ్చారు.
సీఎం జయలలిత కోలుకుంటున్నారని, ఆమెకు ప్రాణాపాయం తప్పిందని మాలినీ పార్థసారథి ట్వీట్ చేశారు. జయలలితను ఆస్పత్రిలో పరామర్శించిన అత్యంత సన్నిహితుల ద్వారా ఈ శుభవార్తను తాను వెల్లడిస్తున్నట్టు ఆమె తెలిపారు. జయలలిత కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని, ఆమె వ్యక్తిగత నేస్తం ద్వారా తాను ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నట్టు వివరించారు. జయలలిత త్వరలోనే సంపూర్ణంగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ప్రస్తుతం జయలలిత స్పృహలోనే ఉన్నారని మాలినీ పార్థసారథి స్పష్టం చేశారు.
జ్వరం, డీ హైడ్రేషన్‌తో సీఎం జయలలిత గత నెల 22న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలితకు వైద్య బృందం మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అమ్మ కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు ఆదివారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసినా.. ఆమె ఆరోగ్యంపై అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన తగ్గడం లేదు. సోమవారం కూడా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న అభిమానులు పెద్దసంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మరోవైపు అన్నాడీఎంకే సీనియర్ నేతలు, మంత్రులు కూడా సోమవారం ఆస్పత్రి వద్దకు వచ్చి జయలలిత ఆరోగ్యం గురించి వాకబు చేశారు.