సీఎం ఆరోగ్యంపై దుష్ర్పచారమా?
గతవారం తీవ్రజ్వరంతో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా రెండోసారి ఎన్నికై సీఎం కూర్చీని అధిష్టించిన 'అమ్మ' జయలలిత అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. అయితే ఆమె ఆరోగ్యం మెరుగుపడటం లేదని కొందరు రాజకీయ ప్రత్యర్థులు తమ లబ్ధి కోసం దుష్ర్పచారం చేస్తున్నారు. ఈ విషయంపై అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతీ మీడియాతో మాట్లాడారు. సీఎం జయలలిత ఆరోగ్యంపై పార్టీ నేతలు, కార్యకర్తలు, తమిళనాడు ప్రజలు, ఆమె అభిమానులు అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఆమె కోలుకుంటున్నారని, త్వరలో ఆస్పత్రి నుంచి సీఎం డిశ్చార్జ్ అవుతారని సరస్వతీ వెల్లడించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ర్పచారాన్ని నమ్మవద్దని ఆమె సూచించారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో బుధవారం సమావేశం అవ్వాల్సి ఉండగా, తన బదులు ఆ సమావేశానికి హాజరు కావాలని ప్రజాపనుల శాఖ మంత్రి పళనిస్వామికి ఆమె సూచించారు. ఆ సమావేశంలో తాను ఏం చెప్పదలచుకున్నదీ ఒక కాగితం మీద రాసి ఇచ్చారు. గత మూడు రోజుల్లో 107 అమ్మ క్యాంటీన్లు ప్రారంభించడంతో పాటు ఉచిత అమ్మ వై-ఫై జోన్ల పథకాన్ని కూడా ప్రకటించారు. ఆస్పత్రిలో ఉన్నా జయలలిత అన్ని పనులను పరిశీలిస్తూనే ఉన్నారని అన్నాడీఎంకే వర్గాలు కూడా చెబుతున్నాయి.