అప్పుడు జయ.. ఇప్పుడామె వారసులు!
తమిళనాడులో రాజకీయ చరిత్ర పునరావృతం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటిలాగే గతంలోనూ అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ అనారోగ్యంపాలై అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆస్పత్రిలో చేరిన వెంటనే అన్నాడీఎంకే పార్టీలో వర్గ రాజకీయాలు వెలుగులోకి వచ్చాయి. సినీ నిర్మాత, సీనియర్ నాయకుడు ఆర్‌ఎం వీరప్పన్ నేతృత్వంలోని ఈ వర్గం అప్పట్లో ఆస్పత్రిలో ఉన్న ఎంజీఆర్‌ను కలిసేందుకు జయలలితను అనుమతించలేదు. 1982లో అన్నాడీఎంకేలో చేరిన జయలలిత అతి త్వరలోనే ముఖ్య నాయకురాలిగా పేరుతెచ్చుకున్నారు.
ఆమె ఎదుగుదలను ఓర్వలేకపోయిన వీరప్పన్ వర్గం జయలలితను అణచివేసేందుకు ప్రయత్నించింది. జపాన్ నుంచి వచ్చిన వైద్యబృందం ఎంజీఆర్‌కు చికిత్స అందజేస్తున్నట్టు ఆమె పార్టీ తరఫున ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ. ఈ ప్రకటనను ఖండించిన అప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శి పీయూ షణ్ముగం.. జయలలితకు షోకాజ్ నోటీసులు జారీచేస్తామని హెచ్చరించారు కూడా.
ఇదంతా గతం కాగా.. ఇప్పుడు వర్తమానంలోనూ గతంలాంటి పరిస్థితే కనిపిస్తోంది. గత 15 రోజులకుపైగా జయలలిత అదే అపోలో ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో ఆమె రాజకీయ వారసులు ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. తన రాజకీయ వారసుడిగా ప్రముఖ సినీ నటుడు అజిత్ కుమార్‌ను పేర్కొంటూ జయలలిత వీలునామా రాశారని కథనాలు కూడా వస్తున్నాయి. మరోవైపు జయలలిత రాజకీయ వారసురాలిని నేనేనంటూ ఆమె అన్న కూతురు దీప ముందుకొచ్చారు. జయలలిత సొంత సోదరుడు జయకుమార్, విజయలక్ష్మి దంపతుల కూతురు దీప. ఆమె ఇటీవల అపోలో ఆస్పత్రి వద్ద జయ వారసురాలినంటూ హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అన్నాడీఎంకే నేతలు జయలలితను కలిసేందుకు దీపను అనుమతించలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగిన ఆమె.. జయ వారసత్వం కోసం తనదైన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కథనాల సంగతి ఎలా ఉన్నా జయలలిత త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు కోరుకుంటున్నారు.