ఉలగమ్‌ సుట్రుమ్‌ వాలిబన్‌ | MGR biopic to mainly focus on his theatre days | Sakshi
Sakshi News home page

ఉలగమ్‌ సుట్రుమ్‌ వాలిబన్‌

Published Sat, Oct 20 2018 12:31 AM | Last Updated on Sat, Oct 20 2018 12:31 AM

MGR biopic to mainly focus on his theatre days - Sakshi

ఉలగమ్‌ సుట్రుమ్‌ వాలిబన్‌..అంటే.. లోకం చుట్టిన యువకుడు అని అర్థం‘ఉలగమ్‌ సుట్రుమ్‌ వాలిబన్‌...  ’ సూపర్‌ హిట్‌ సినిమా‘నాడోడి మన్నన్‌’... బంపర్‌ హిట్‌‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌’... కనకవర్షం కురిపించిన మరో హిట్‌ మూవీ‘రిక్షాకారన్‌’... బయ్యర్లను లక్షాధికారులను చేసింది.ఈ సినిమాలతో పాటు అంతకుముందు ఎంజీఆర్‌ చేసిన అన్ని చిత్రాల రికార్డులను బ్రేక్‌ చేసిన సినిమా ‘ఉలగమ్‌ సుట్రుమ్‌ వాలిబన్‌’. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో పవర్‌ఫుల్‌ పాత్రలు చేశారు ఎంజీఆర్‌.ఇప్పుడు ఆయన మీదే 3 చిత్రాలు తెరకెక్కుతున్నాయి.లెజెండరీ హీరోకు లేటెస్ట్‌ టెక్నాలజీ తోడైతే.. అభిమానుల గుండెలు నిండక మానవు.

సాధారణంగా కథలు, అందులోని పాత్రలను ఊహాజనితంగా తయారు చేస్తారు రచయితలు. ఒక కథకు కావాల్సిన కథా వస్తువు ఒక వ్యక్తి జీవితం నుంచి దొరికితే అది కచ్చితంగా చరిత్ర అవుతుంది. తమిళ నాట అలాంటి చరిత్ర ఉన్న వ్యక్తి ఎంజీఆర్‌ (మరుదూర్‌ గోపాలన్‌ రామచంద్రన్‌). తమిళనాట ప్రజలు అభిమానంతో ‘మక్కళ్‌ తిలగం’ (ప్రజల నాయకుడు) అని పిలుచుకుంటారు. 1977 వరకూ రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు. కానీ రాజకీయాలకు గ్లామర్‌ను అద్దింది ఎంజీఆర్‌. భారత దేశంలోనే సినిమా స్టార్‌ ముఖ్యమంత్రిగా మారిన ట్రెండ్‌ ఎంజీఆర్‌తోనే మొదలైంది.  కామన్‌ మ్యాన్‌ నుంచి సూపర్‌ స్టార్‌గా ఎదిగి, కలర్‌ కాస్ట్యూమ్స్‌ నుంచి ఖద్దర్‌ తొడిగి సీయం కుర్చీపై కూర్చున్న ఎంజీఆర్‌ కథ కచ్చితంగా ఆడియన్స్‌ను ఎగై్జట్‌ చేయక మానదు. ఇప్పుడు ఆయన్నే కథా వస్తువుగా పెట్టి తమిళనాట మూడు సినిమాలు ముస్తాబవుతున్నాయి. అందులో ఒకటి ఆయన జీవిత్ర చరిత్ర ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌. రెండోది ఎంజీఆర్‌ను యానిమేషన్‌ పాత్రలో తెరకెక్కిస్తున్న చిత్రం. మరోటి యంజీఆర్‌నే తిరిగి స్క్రీన్‌పై తీసుకొచ్చే గ్రాఫికల్‌ మ్యాజిక్‌. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. సో.. ఎంజీఆర్‌  అభిమానులు ఆనందపడటానికి ఒకటి కాదు.. రెండు కాదు... ఆయన మీద మూడు సినిమాలు వస్తున్నాయి. 

సినిమా జర్నీపైనే ఫోకస్‌
తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి కామరాజ్‌ బయోపిక్‌ను తెరకెక్కించిన దర్శకుడు ఎ.బాలకృష్ణన్‌ ఈసారి ఎంజీఆర్‌ జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరిస్తున్నారు. ఈ బయోపిక్‌లో ఎంజీఆర్‌ బాల్య దశ నుంచి యాక్టర్‌గా ఎదుగుతున్న రోజులపై ఎక్కువ దృష్టి పెట్టారట బాలకృష్ణన్‌. ఎంజీఆర్‌ రోల్‌ను సతీశ్‌కుమార్‌ పోషిస్తున్నారు. ఇందులో జయలలిత,  కరు ణానిథిల పాత్రల కోసం నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు దర్శకుడు. సినిమాలో ఎక్కువ భాగం ఎంజీఆర్‌ నటుడిగా పడ్డ కష్టాలను  డిస్కస్‌ చేయనున్నారట. ఎంజీఆర్‌ జీవితంలో నటుడు యం.ఆర్‌. రాధ (నటి రాధిక తండ్రి)కు కీలక పాత్ర ఉంది. ఓ ప్రాజెక్ట్‌ గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఎంజీఆర్‌ను యం.ఆర్‌. రాధ షూట్‌ చేసి, తాను కూడా షూట్‌ చేసుకున్నారని, ఇద్దరినీ వెంటనే ఆస్పత్రిలో చేర్పించడం వల్ల ప్రాణాపాయం తప్పిందని గతంలో తమిళనాడులో కథలు కథలుగా చెప్పుకున్నారు. ఆ తుపాకీ తూటా ఎంజీఆర్‌ గొంతులో దిగినందువల్లే ఆ తర్వాతి రోజుల్లో ఆయన వాయిస్‌లో మార్పొచ్చిందని చెబుతారు. ఇప్పుడు ఎంజీఆర్‌ బయోపిక్‌లో యం.ఆర్‌. రాధ పాత్ర కూడా ఉంటుందట. ఆ పాత్రలో బాలా సింగ్‌ అనే నటుడు కనిపించనున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల రిలీజ్‌ చేశారు. టీజర్‌ చూస్తే ఎక్కువ శాతం పొలిటికల్‌గా కంటే ఎంజీఆర్‌ సినిమా జర్నీ మీద దృష్టి పెట్టారని అర్థం అవుతోంది. ‘‘ఎంజీఆర్‌ మూడో భార్య జానకిగా తమిళ బిగ్‌ బాస్‌ ఫేమ్‌ రిత్విక కనిపిస్తారు. ఆయన లైఫ్‌ ఈవెంట్స్, రాజకీయాలకు ఆయన చరిష్మా ఎలా ఉపయోగపడింది? అనే విషయాలతో పాటు ఈ సినిమాలో జయలలితను కేవలం ఎంజీఆర్‌ కో–స్టార్‌గానే చూపించదలిచాను’’ అంటూ చిత్ర విశేషాలను పంచుకున్నారు దర్శకుడు బాలకృష్ణన్‌.

యంజీఆర్‌ మళ్లీ వస్తున్నారు
తమ అభిమాన నటుణ్ణి  మళ్లీ తెరపై  చూసుకునే అవకాశం రావడం అంటే అభిమానుల ఆనందం రెండింతలు అవ్వడమే. అది గ్రాఫిక్స్‌ రూపంలో అయినా ఎంజాయ్‌ చేస్తారు. ‘యమదొంగ’ సినిమాలో సీనియర్‌ ఎన్టీఆర్‌ను గ్రాఫిక్స్‌ ద్వారా కొన్ని నిమిషాలు చూపిస్తే అభిమానులు ఎంతో సంబరపడ్డారు. ‘నాగరాహువు’ చిత్రం ద్వారా కన్నడ స్టార్‌ విష్ణువర్ధన్‌ మళ్లీ తెరపై కనిపిస్తే అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇప్పుడు అలాంటి గ్రాఫిక్స్‌ వండర్‌ని ఎంజీఆర్‌ అభిమానులకు ఇవ్వడానికి సిద్ధం అవుతోంది ఓ మలేసియన్‌ కంపెనీ. ‘మగేంద్ర’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌ చేస్తున్నారు. ఈ కంపెనీ 3డీ మోడల్‌ ద్వారా ఎంజీఆర్‌ రూపు రేఖలు తీసుకురావడానికి రెండేళ్లుగా పని చేస్తోందట. హాలీవుడ్‌ చిత్రం ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ పూర్తి కాకముందే అందులోని నటుడు పాల్‌ వాకర్‌ చనిపోతే ఈ టెక్నాలజీ ద్వారానే కొన్ని సీన్లను చిత్రీకరించారు. ఇప్పుడు ఇదే పద్ధతిలో ఎంజీఆర్‌తో ఏకంగా సినిమానే ప్లాన్‌ చేసింది ఈ కంపెనీ. ఈ ప్రాజెక్ట్‌ను పి.వాసు డైరెక్ట్‌ చేయనున్నారు. ఎక్స్‌ప్రెషన్స్, మ్యానరిజం, వాయిస్‌ అన్నింట్లో చాలా కేర్‌ తీసుకోనున్నాం అని చిత్రబృందం ప్రకటించింది. ‘‘చిన్నప్పటి నుంచి ఎంజీఆర్‌ సినిమాలు చూసిన దర్శకుడు కావడంతో పి. వాసు ఈ ప్రాజెక్ట్‌ను కరెక్ట్‌గా హ్యాండిల్‌ చేస్తారనుకుంటున్నాం. సుమారు ఐదువేల ఎంజీఆర్‌ ఫొటోలు చూసి ఎక్స్‌ప్రెషన్స్‌ కరెక్ట్‌గా రావడానికి వర్క్‌ చేశాం’’ అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఎంజీఆర్‌ కల నెరవేర్చుతున్నాం
ప్రతి నటుడికీ యాక్టర్‌గా కొన్ని ఫేవరెట్‌ ప్రాజెక్ట్స్‌ ఉంటాయి. ఎలా అయినా సరే వాటిని గ్రాండ్‌గా ప్రేక్షకులకు చూపించాలనుకుంటారు. కొన్నిసార్లు అవి సెట్స్‌పైకి వెళ్లడానికి ఏవేవో కారణాలు అడ్డుపడతాయి. అలా ఆగిపోయిన ప్రాజెక్ట్‌ ‘కిళక్కు ఆఫ్రికావిల్‌ రాజు’ (తూర్పు ఆఫ్రికాలో రాజు). ఆ సినిమా ఆగిపోవడానికి కారణం పాలిటిక్స్‌. ఎంజీఆర్‌ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమా కార్యరూపం దాల్చలేకపోయింది. ఎంజీఆర్‌ బ్లాక్‌బాస్టర్‌ ‘ఉలగమ్‌ సుట్రుమ్‌ వాలిబన్‌’లో ఆయన తదుపరి చిత్రం ‘ఆఫ్రికావిల్‌ రాజు’ అని టైటిల్‌ కార్డ్‌లో ప్రకటించారు. జేమ్స్‌ బాండ్, మిషన్‌ ఇంపాజిబుల్‌ తరహాలో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్‌ చేశారట ఎంజీఆర్‌. అప్పటికి భారీ బడ్జెట్‌ చిత్రాల ట్రెండ్‌ తక్కువ. 1970లో ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు ఎంజీఆర్‌. ఈ చిత్రాన్ని ప్రపంచంలో  పలు లొకేషన్స్‌లో భారీ ఎత్తున చిత్రీకరించాలనుకున్నారట. అయితే ఆ సినిమా ఎంజీఆర్‌కి ఓ కలలా మిగిలిపోయింది. సో.. ఇప్పుడు అదే టైటిల్‌తో ఎంజీఆర్‌ను యానిమేషన్‌ పాత్రలో అరుళ్‌ మూర్తి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీతో ఈ సినిమాని రూపొందించనున్నారు. ఈ తాజా చిత్రంలో ఎంజీఆర్‌ ఫ్యాన్స్‌ కోరుకునేవన్నీ ఉంటాయి. యూత్‌కి తగ్గట్టుగా ఎంజీఆర్‌ ఇందులో ఫ్రెంచ్‌ బియర్డ్‌తో కనిపిస్తారు. అలాగే సినిమాలో ఫైట్స్, కార్‌ రేసులు, బైక్‌ స్టంట్స్‌ పుష్కలంగా ఉంటాయి అని చిత్రబృందం చెప్పుకొచ్చింది. ఇందులో ‘అఖిల్‌’ ఫేమ్‌ సయేషా సైగల్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారట.ఒకటి గ్రాఫిక్స్, మరోటి యానిమేషన్, ఇంకోటి లైవ్‌ ఆర్టిస్టులతో... ఎంజీఆర్‌ జీవితం ఆధారంగా మొత్తం మూడు సినిమాలు రానున్నాయి. ఎంజీఆర్‌ చనిపోయి దాదాపు 30 ఏళ్లకు పైగా అయింది. అభిమానుల మనసుల్లో ఉండిపోయారు. ఈ మూడు చిత్రాలూ వాళ్లను ఖుషీ చేస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే నేటి తరానికి ఎంజీఆర్‌ లైఫ్‌ గురించి తెలుసుకునే అవకాశం ఉంది. 
ఇన్‌పుట్స్‌: గౌతమ్‌ మల్లాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement