
సాక్షి, చెన్నై : కొత్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రజనీకాంత్ గత కొంత కాలంగా అందుకు అనువైన చిత్రాలలోనే నటిస్తున్నారు. తాజాగా అయన నటించిన చిత్రం ‘కాలా’ ఈ నెల ఏడవ తేదీన విడుదలవుతున్న విషయం తెల్సిందే. నాటి బాషా నుంచి నేటి కాలా వరకు ఏ చిత్రంలో రజనీకాంత్ నటించినా అందులో పేదల పక్షమే వహించారు. రాజకీయాల్లో రాణించాలనుకునే సినీ నటులకు సినిమా పేద ప్రేక్షకులే పట్టం గడతారు. నాడు ఎంజీ రామచంద్రన్ విషయంలో అదే జరిగింది. పేదలు, అణగారిన వర్గాల పెన్నిధిగా రజనీకాంత్ కన్నా ఆయనే ఎక్కువ చిత్రాల్లో నటించారు. అలాంటి వారిని గెలిపించుకుంటే తమ అభ్యున్నతికి పాటు పడుతారని పేదవాడు ఆశిస్తాడు తప్పా. అది జరిగే పని కాదు.
1977లో తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన ఎంజీ రామచంద్రన్ పదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగినా పేద ప్రజలకు చేసిందేమీ లేదు. ఆయన అనుసరించిన పన్ను విధానం వల్ల ధనవంతులకు రాయితీ లభించగా, పేదలపై పన్ను భారం పడింది. ఆయన తీసుకొచ్చిన గూండాస్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ లా చట్టాలు ప్రజా ఆందోళనలను, ప్రతిపక్షాన్ని అణచివేసేందుకే ఉపయోగపడ్డాయి. వార్తా పత్రికలను సెన్సార్ చేయడానికి ఓ చట్టం చేయడానికి ఆయన ప్రయత్నించారు. ఎప్పుడూ తన వ్యక్తిగత ప్రతిష్టను కోరుకునే ఎంజీఆర్ సద్విమర్శలను కూడా అనుమతించేవారు కాదు.
అందుకనే ఎంజీఆర్ మరణానంతరమే ఆయనపై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. ఎంజీఆర్ దృక్పథాల గురించి ఎంఎస్‌ఎస్ పాండ్యన్ రాసిన ‘ఇమేజ్ ట్రాప్’ పుస్తకంలో మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఎంజీఆర్ లాగా కాకుండా ఏ పదవి లేనప్పుడే రజనీకాంత్‌పై విమర్శలు వస్తున్నాయి. నాడు ఎంజీఆర్‌లాగానే నేడు తమిళనాడులో రజనీకాంత్‌కు కూడా పేద, మధ్యతరగతి అభిమానులే ఎక్కువగా ఉన్నారు. అధికారంలోకి వచ్చాక ఎంజీఆర్ లాగా కాకుండా పేదల పక్షపాతిగానే రజనీకాంత్ కొనసాగుతారా? చూడాలి!