రజనీకాంత్ రాజకీయ ప్రవేశం కన్నా.. ఆయన ప్రసంగంలో పేర్కొన్న ‘ఆధ్యాత్మిక రాజకీయం’ కీలకమైన చర్చకు తెరలేపింది. రజనీకాంత్ (68) ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమిళనాట బహిరంగంగా ఓ వ్యక్తి భగవద్గీత శ్లోకాలను తన ప్రసంగంలో పేర్కొనటం దాదాపు జరగలేదనే చెప్పాలి.
అలాంటిది రజనీ ‘కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన’ అని ప్రసంగించటం తమిళనాడు రాజకీయాల్లో 60 ఏళ్లుగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ద్రవిడ ఉద్యమాలకు పెను సవాల్‌గా మారనుందనే చర్చ మొదలైంది. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు ‘ద్రవిడ’ భావానికి పరీక్షగా మారనున్నాయి. ఆరెస్సెస్, హిందుత్వ శక్తులతోపాటు చాలాకాలంగా తమిళనాడులో ప్రవేశానికి ఎదురుచూస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికలు చిట్టచివరి అడ్డంకి కానున్నాయనే పరిస్థితి గోచరిస్తోంది.
ఆధ్యాత్మిక రాజకీయాలంటే
సంఘసంస్కర్త ఈవీ రామస్వామి ప్రారంభించిన ద్రవిడ ఉద్యమ స్ఫూర్తి మతం, ఆధ్యాత్మికతను తీవ్రంగా వ్యతిరేకించింది. భగవద్గీత, వర్ణవ్యవస్థ, ఆర్య–ద్రవిడ సిద్ధాంతం, తమిళ సంస్కృతి వంటి అంశాలపై రామస్వామి తరచూ మాట్లాడేవారు. ఆ తర్వాత హేతువాది సీఎన్ అన్నాదురై దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. అనంతరం తమిళనాడులో దేవుడిపై వ్యతిరేక వైఖరి పెరుగుతూ పోయింది. ఇలాంటి ఆలోచనలతోనే హిందీ వ్యతిరేక ఉద్యమం ద్వారా 1967లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధికారంలోకి వచ్చింది.
ఆ తర్వాత 60 ఏళ్లుగా రాజకీయాల్లో ఆధ్మాత్మికత గురించి ఎవరూ మాట్లాడే ధైర్యం చేయలేదు సరికదా.. తమ సిద్ధాంతాలను వెల్లడించే ప్రయత్నం కూడా చేయలేదు. దేవుణ్ణి నమ్మే ఎంజీఆర్ దేవాలయ సందర్శనను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. జయలలిత తన నమ్మకాలను బహిరంగంగా ప్రదర్శించారు. దేవాలయాలకు విరాళాలిచ్చారు. దేవుని సాక్షిగానే ప్రమాణస్వీకారం చేసేవారు. కానీ.. తమిళ రాజకీయాల్లో ద్రవిడ సిద్ధాంతం పాత్రను మాత్రం ఎన్నడూ విస్మరించలేదు. ఎందుకంటే.. 2003లో మతప్రచార వ్యతిరేక బిల్లును తీసుకురాగా.. తర్వాతి పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఒక్కసీటు కూడా దక్కలేదు. దీంతో తర్వాత ఎప్పుడూ జయ అలాంటి ప్రయోగాలు చేయలేదు.
ద్రవిడ సిద్ధాంత వ్యతిరేకులు తమిళప్రజల్లోని భావనలను తొలగించేందుకు చాలాసార్లు విఫలయత్నాలు చేశారు. చాలాకాలం తర్వాత రజనీకాంత్ బహిరంగంగానే భగవద్గీత శ్లోకాలను ప్రస్తావించటం ఆశ్చర్యం కలిగించింది. రజనీకాంత్‌కు ఆధ్యాత్మికతే సర్వస్వం. తమిళనాడులోని హిందుత్వ మూలాలు ప్రస్ఫుటంగా ఉన్నాయని.. కులం, మతం కంటే ఆధ్యాత్మికతే ముఖ్యమని రజనీ భావిస్తారు. కుల వ్యవస్థను వ్యతిరేకించిన రాఘవేంద్ర స్వామిని రజనీకాంత్ తన గురువుగా భావిస్తారు. హిమాలయాలను తరచూ సందర్శిస్తూ యోగి జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు.
అలాంటి రజనీ రాజకీయ ప్రవేశం తమిళ రాజకీయ సిద్ధాంతాల్లో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీనికితోడు 1967నాటి భాష, కులం ఆధారంగా నడిచిన ద్రవిడ రాజకీయాలు మచ్చుకైనా కనిపించటం లేదు. దీంతో రజనీకి పరిస్థితులు కలిసొస్తాయని.. ఆరెస్సెస్ చేయలేని పనిని ఈయన చేసే అవకాశముందని వారంటున్నారు. బెంగళూరులో స్థిరపడిన మరాఠీ కుటుంబంలో పుట్టిన రజనీకాంత్ దశాబ్దాల క్రితమే తమిళనాడును నివాసప్రాంతంగా చేసుకున్నారు. అయితే రాజకీయాల్లోకి వస్తే ఆయన్ను మరాఠీ వ్యక్తిగానే పరిగణించాలంటూ పలువురు విమర్శించినా దీనిపై రజనీ ఎన్నడూ పట్టించుకోలేదు.
– సాక్షి నేషనల్ డెస్క్
ద్రవిడ సిద్ధాంతాలకు సవాల్
Published Mon, Jan 1 2018 1:46 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment