రజనీకి పోటీగా రాజకీయాల్లోకి కమల్ హాసన్...?
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాది చలనచిత్ర నటుడు కమల్ హాసన్ గత రెండు నెలలుగా సినిమాల గురించి కాకుండా రాజకీయాల గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. తమళి ‘బిగ్ బాస్’కు వ్యాఖ్యాతగా కొత్త అవతారం ఎత్తిన ఆయన తమిళనాడు పాలకపక్ష అఖిల భారత అన్నా డిఎంకే పార్టీనే లక్ష్యంగా పెట్టుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన విమర్శలు తాజాగా మరింత పదునెక్కాయి.
70 మంది చిన్నారులు ఆక్సిజన్ అందక ఆస్పత్రిలో మరణిస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్‌ను తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటికే ఎన్నో నేరాలు చేసిన మన ముఖ్యమంత్రి రాజీనామాను ఎందుకు కోరరంటూ తమిళనాడు సీఎం ఈకే పళని స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆయన అవినీతికి వ్యతిరేకంగా కొత్త స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రారంభించాలని కూడా తన అభిమానులకు పిలుపునిచ్చారు.
జల్లికట్టును అనుమతించాలంటూ రాష్ట్రంలో కొనసాగిన ఆందోళనకు కమల్ హాసన్ మద్దతిచ్చారు. సినిమాలకు జీఎస్టీని తగ్గించాలంటూ ఆందోళన చేశారు. జాతీయ ఉమ్మడి మెడికల్ ప్రవేశ పరీక్షల వల్ల రాష్ట్ర విద్యార్థులకు అన్యాం జరుగుతోందంటూ గళమెత్తారు. ఇలా వివిధ ప్రజా సమస్యలపై మున్నెన్నడు లేనివిధంగా కమల్ హాసన్ స్పందించడం పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయి. జయలలిత మరణంతో ఆమె లోటు కనిపించడం, పార్టీలు వర్గాలుగా చీలిపోవడం, సీనియర్ ద్రవిడ నాయకుడు ఎం. కరుణానిధి క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో రాజకీయ రంగ ప్రవేశానికి ఇదే సరైన సమయం అని కమల్ హాసన్ భావిస్తున్నారా?
‘జరగబోయే ఓ యుద్ధానికి మీరంతా సిద్ధంగా ఉండాలి’ అంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు బహిరంగంగా పిలుపునిచ్చిన నేపథ్యంతో కమల్ హాసన్ రాజకీయ వ్యాఖ్యానాలు ఎక్కువగా చేస్తున్నారు. అంటే రజనీకాంత్‌తో పోటీ పడి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? ఇంకా ముందే రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా? పాలకపక్షంతో ఆయనకు సంబంధాలు కొత్తగా ఏమీ తెగిపోలేదు. జయలలిత ఉన్నప్పుడే చెడిపోయాయి.
కమల్ హాసన్ ‘విశ్వరూపం’ సినిమా విడుదల సందర్భంగా 2013లో ముస్లింలు ఆందోళన నిర్వహించారు. తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నందున సినిమా విడుదలను నిలిపి వేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సినిమాను ప్రదర్శించరాదంటూ ముఖ్యమంత్రి జయలలిత సినిమా థియేటర్లను ఆదేశించింది. తన సినిమాను అడ్డుకున్నట్లయితే తాను దేశాన్ని విడిచే వెళ్లిపోతానని కమల్ హాసన్ హెచ్చరించారు. అనంతరం ముస్లిం పెద్దలతో రాజీకి వచ్చి వారికి అభ్యంతరకరమైన దృశ్యాలను ఎత్తివేశారు. ముస్లింలతో రాజీకీ అవకాశం కల్పించినందుకు నాడు జయలలితకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాడు తన సినిమాపై వివాదం సష్టించిందే రాష్ట్ర ప్రభుత్వమని ఆరోపించారు. ఎంజీఆర్, ఎం. కరుణానిధిలను కూర్చోపెట్టిన పీఠంపై జయలలితను కూర్చోబెట్టలేమని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్లోని అంతరార్థమేమిటీ? జయలలిత బతికుండగా రాజకీయాల గురించి ఎన్నడూ మాట్లాడని కమల్ హాసన్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రులు కూడా ప్రశ్నిస్తున్నారు.
కమల్ వర్సెస్ రజనీకాంత్
కమల్ హాసన్, రజనీకాంత్‌లు చేస్తున్న రాజకీయ వ్యాఖ్యానాలు చూస్తుంటే నాడు 1970, 1980లో శివాజీ గణేశన్, ఎంజీ రామచంద్రన్‌లు అనుసరించిన రాజకీయాలు గుర్తుకు రాక తప్పవు. తమిళ సినీ పరిశ్రమ కూడా కమల్ హాసన్‌ను శివాజీ వారుసుడిగా, రజనీకాంత్‌ను ఎంజీఆర్ వారసుడిగా పరిగణిస్తోంది. రాజకీయాల్లో కూడా వీరిద్దరు, వారి గురువులనే అనుసరిస్తారేమో! మొదటి నుంచి డీఎంకే వారసుడైన శివాజీ గణేశన్ ఓసారి తిరుమలలోని వేంకటేశ్వరస్వామిని సందర్శించుకోవడం డీఎంకే కార్యకర్తలకు కోపం తెప్పించింది. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కరుణానిధి నాస్తికుడవడం వల్ల డీఎంకే కార్యకర్తలు కూడా నాడు దేవున్ని నమ్మేవాళ్లు కాదు.
కమల్ హాసన్ నాస్తికుడు కాకపోయినా హేతువాదన్న విషయం తెల్సిందే. ఎంజీఆర్ చనిపోయిన అనంతరం ఆయన భార్య జానకీ రామచంద్రన్ సీఎం అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వనందుకు నిరసనగా శివాజీ గణేశన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. 1989 ఎన్నికల్లో ఆయన పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో అంతటితో ఆయన రాజకీయ చరిత్రకు తెరపడింది. ఇక ఎంజీఆర్ వారసురాలిగా జయలలిత రాజకీయ చరిత్ర చర్విత చరణమే.
రజనీకాంత్ కూడా గతంలో రాజకీయాల గురించి మాట్లాడినప్పుడల్లా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం జరిగింది. రాజకీయాలతో సంబంధం ఉన్నా, లేకున్నా అన్ని విషయాల్లో రజనీతోని కమల్ హాసన్ తానున్నానంటూ పోటీ పడుతుంటారు. ఇటీవల డీఎంకే పత్రిక ‘మురసోలి’ స్వర్ణోత్సవాల సందర్భంగా వేదికపై నుంచి మాట్లాడకపోవడం మంచిదని రజనీకాంత్ నిర్ణయించుకుంటే ఆత్మ రక్షణకన్నా ఆత్మగౌరవం ముఖ్యం కనుక తాను మాట్లాడుతానంటూ కమల్ హాసన్ మైక్ పుచ్చుకున్నారు. కమ్యూనిస్టుగా, హేతువాదిగా, భూస్వామిగా, కళాకారుడిగా, తాగుబోతుగా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన కమల్ హాసన్ రాజకీయ ఫిలాసఫీ ఏమిటీ ఎవరికి తెలియదు. మాస్ పాత్రల్లోనే ఎక్కువ మెప్పించిన రజనీకాంత్‌కు రాజకీయ ఫిలాసఫీ ఉంటుందా? అన్న అనుమానం రాకపోదు.
ఎవరిదీ ఏ ఫిలాసఫీ అయినా కమల్ హాసన్‌కు కలిసొచ్చే అంశం ఒకటుంది. ఆయన తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. రజనీకాంత్ మహారాష్ట్ర మరాఠా కుటుంబానికి చెందిన వారు. అందుకనే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరిగినప్పుడల్లా ద్రవిడ జాతీయవాదులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కమల్ హాసన్‌కు అలాంటి వ్యతిరేకత లేదు. కాకపోతే అదే కులానికి చెందిన జయలలిత ఇంతకాలం పదవిలో కొనసాగినప్పటికీ రాజకీయాల్లో బ్రాహ్మణులకు అంతగా బలం లేదు. ‘తమిళ బిగ్ బాస్’కు కమల్ హాసన్ ఆతిథ్యం ఇవ్వడం టీఆర్పీ రేట్ల కోసమా, రానున్న రాజకీయ అవసరాల అన్నది కాలమే తేల్చాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.