సాక్షి ప్రతినిధి, చెన్నై: కొంతకాలంగా రాష్ట్రంలో రెండే ప్రధాన చర్చలు. ఒకటి రజనీ పార్టీ, రెండోది కమల్ పార్టీ. వీటిల్లో కమల్‌హాసన్ పార్టీ ఎప్పుడు...ఏమిటి...ఎలా అనే చర్చకు ఈనెల 21వ తేదీన తెరపడింది. మక్కల్ నీది మయ్యం అని పార్టీ పేరును ప్రకటించిన కమల్‌హాసన్ తరువాత కార్యాచరణ ప్రణాళికలో ఉన్నారు. ఇక మిగిలింది రజనీకాంత్ పార్టీ. ‘నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం’ అని గత నెలలో ప్రకటించడం ద్వారా కొన్ని ఊహాగానాలకు తావులేకుండా చేశారు.
అయితే పార్టీ పేరు, పతాకం, మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేది ఎప్పుడో రజనీ చెప్పడం లేదు. సభ్యత్వ నమోదు, జిల్లా ఇన్‌చార్జ్‌ల నియామకాలు సాగిస్తున్నారు. ఎవరు ముందా అని ప్రజలు ఎదురుచూస్తుండగా ఈనెల 21న కమల్ తన పార్టీ పేరును ప్రకటించి పతాకాన్ని ఆవిష్కరించారు. దీంతో ఇక రజనీవంతైంది. జిల్లా ఇన్‌చార్జ్‌ల నియామకాల్లో భాగంగా ఈనెల 20 నుంచి ‘రజనీకాంత్ ప్రజా సంఘం’ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ మూడు రోజుల్లో కాంచీపురం, విల్లుపురం, కడలూరు జిల్లాల ఇన్‌చార్జ్‌ల ఎంపిక కార్యక్రమం జరిగింది. జాతీయ ఇన్‌చార్జ్‌లు నిర్వహించే ఈ సమావేశాలకు రజనీకాంత్ హాజరుకావడం లేదు. సుదూర జిల్లా నుంచి వచ్చే అభిమానులు రజనీని చూడలేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. అయితే ఈనెల 21న కమల్‌హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని ప్రకటించి తన కంటే ఒక అడుగు ముందుకు వేయడంతో రజనీ కూడా జోరు పెంచారు. చెన్నై రాఘవేంద్ర కల్యాణ మండపంలో శుక్రవారం తిరునెల్వేలి జిల్లా సమావేశాలు జరుగుతుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో రజనీకాంత్ అకస్మాత్తుగా హాజరయ్యారు.
రజనీ వస్తారని ఏ మాత్రం ఎదురుచూడని అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. 32 ఏళ్ల చరిత్ర కలిగిన అభిమానుల సంఘాల నుంచి మా పార్టీ ఉద్బవిస్తోంది. తాము ఇప్పుడు చేసేదల్లా వాటిని మరింత బలోపేతం చేయడం. నా అభిమానులకు ఎవ్వరూ రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. నా అభిమానులే ఇతరులకు పాఠం చెప్పగలరు. ఏమి చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం జరుపుకుంటూ రాజకీయాల్లో మార్పు తేవడం సాధ్యం అనే నమ్మకం నాకుంది.
అనంతరం మీడియాతో మాట్లాడారు. కమల్ నిర్వహించిన బహిరంగసభ బాగుంది, కమల్‌కు ముందుగానే నేను శుభాకాంక్షలు చెప్పాను. ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీలూ కలిసి పోరాడాలి. అన్ని జిల్లాల్లో ఇన్‌చార్జ్‌ల నియామకం పూర్తికాగానే రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభిస్తాను. రజనీ ఏమిటి ఇలా మౌనంగా ఉన్నారని కొంతమంది విమర్శిస్తున్నారు, వారిని అలానే విమర్శించనీయండి, మన పనిలో మనం ఉందాం. నేను కుటుంబ పెద్దగా సరిగ్గా ఉన్నాను, మనమంతా ఒక కుటుంబంలా ముందుకు సాగుతున్నాం. 32 జిల్లాల ఇన్‌చార్జ్‌లను ఒకేసారి కలుసుకునేందుకు కొద్దిరోజులవుతుంది. అన్ని జిల్లాల నియామకం పూర్తికాగానే రాష్ట్రపర్యటన తేదీలను ఖరారు చేస్తాను. కావేరీ జలాల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి ఎడపాడి అఖిలపక్ష సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నాని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment