సాక్షి, చెన్నై: విశ్వనటుడు కమల్, సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేసినా, పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వచ్చేదెప్పుడో అన్న ప్రశ్న బయలు దేరింది. రాజకీయాల మీద కన్నా, నటన మీదే దృష్టి అన్నట్టుగా వీరిద్దరి అడుగులు సాగుతున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో ఈ ఇద్దరు కొత్త సినిమాలకు సంతకాలు చేసి ఉండడం గమనార్హం. ఒకరు దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్, మరొకరు విశ్వ నటుడు కమల్. ఈఇద్దరు ప్రస్తుతం తమిళనాట రాజకీయ చర్చల్లో ఉన్నవారే. తమిళనాడు రక్షణ, తమిళుల సంక్షేమం, సామాజిక న్యాయం నినాదాలతో ఈ ఇద్దరు రాజకీయ అరంగ్రేటం చేశారు.
రజనీకాంత్ రాజకీయ పార్టీ కసరత్తుల వేగం పెంచిన సమయంలో కమల్ ఒక అడుగు ముందుకు వేశారు. మక్కల్ నీధి మయ్యం పేరుతో రాజకీయ పార్టీని కమల్ ప్రకటించేశారు. పార్టీ ›ప్రకటన తదుపరి రాష్ట్ర పర్యటన అని ప్రకటించినా, అందుకు తగ్గ చర్యలు తీసుకోవడంలో విశ్వనటుడు వెనక్కు తగ్గారని చెప్పవచ్చు. మరింత సమయాన్ని ఆయన తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.కమల్ రాజకీయ పార్టీ ప్రకటనతో కథానాయకుడి పార్టీ, రూపు రేఖల మీద అంచనాలు పెరిగి ఉన్నాయి. అయితే, తలైవా రాక మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరురాజకీయ పార్టీని ప్రకటించేసి మరింత సమయాన్ని తీసుకునే పనిలో నిమగ్నం కాగా, మరొకరు పార్టీ ప్రకటనకు మరింత సమయాన్ని తీసుకునేందుకు నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకు తగ్గ పరిణామాలు తాజాగా చోటు చేసుకుంటున్నాయి.
తలైవా ..ఆలస్యమేనా:
ప్రస్తుతం రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో ‘2.ఓ’, పా రంజిత్ దర్శకత్వంలో ధనుష్ నిర్మిస్తున్న ‘కాలా’ చిత్రాలను ముగించారు. ఈ రెండు చిత్రాలు విడుదలకు ముస్తాబు అవుతున్నాయి. ఈ చిత్రాల తదుపరి ఇక, రజనీ కాంత్ సినిమాల్ని పక్కన పెట్టి రాజకీయాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడుతారన్న భావనలో సర్వత్రా నిమగ్నం అయ్యారు. మక్కల్ మండ్రం కు ఇన్‌చార్జ్‌ల నియమకం పూర్తి కాగానే, తలైవా రాష్ట్ర పర్యటన ప్రారంభం కావచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ప్రస్తుతానికి పార్టీ మీద కన్నా, షూటింగ్ మీద రజనీ కాంత్ దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇందుకు తగ్గట్టు కొత్త సినిమాలకు సంతకాలు చేసి ఉండటం గమనార్హం.
డిఎంకే అధినేత ఎం కరుణానిధి మనవడు, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ సోదరుడు, సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ నిర్మించనున్న చిత్రానికి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండటం సర్వత్రా విస్మయంలో పడేసి ఉన్నది. ఎన్నికలు వస్తే పార్టీతో పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అని కథానాయకుడు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఈ దృష్ట్యా, రాష్ట్రంలో ఇప్పట్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవన్న భావనలో ఆయన ఉన్నట్టున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటుగా కొనసాగుతుందని సిఎం పళని స్వామి ధీమా వ్యక్తం చేస్తుండటాన్ని రజనీ పరిగణించినట్టున్నారు. మరో వైపు ఈ ప్రభుత్వం కుప్ప కూలేందుకు తగ్గ పరిస్థితులు కనిపించని దృష్ట్యా, కాస్త ఆలస్యంగానే రాజకీయ పయానాన్ని మొదలెట్టేందుకు రజనీ నిర్ణయించారా...? అన్న చర్చ ఊపందుకుంది.
భారతీయుడి –2 మీదే :
ప్రస్తుతం కమల్ ‘విశ్వరూపం–2 పూర్తి చేసి విడుదలకు ముస్తాబు చేసే పనిలో ఉన్నారు. అలాగే, . శభాష్‌నాయుడు షూటింగ్ మీద దృష్టి పెట్టిందుకు నిర్ణయించి ఉన్నారని చెప్పవచ్చు. ఈ సమయంలో శంకర్ దర్శకత్వంలో భారతీయుడు–2 చిత్రానికి కమల్ సంతకం పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, బిగ్‌బాస్–2కు రెడీ అవుతున్న సమాచారంతో రాజకీయ గెటప్‌ను కాస్త పక్కన పెట్టిమ సినీ మేకప్ మీద దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్థానిక ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల మీద కన్నా, 2021 మీదే దృష్టి అన్నట్టు కమల్ సైతం ముందుకు సాగేందుకు నిర్ణయించి ఉండటం బట్టి చూస్తే, స్టార్ల రాజకీయ అడుగుల వేగం ప్రస్తుతానికి మందగించినట్టేనా..? అన్న ప్రచారం ఊపందుకుని ఉన్నది. ఇదిలా ఉండగా, ‘మక్కల్ నీది మయ్యం’ చిహ్నం లోగో ముంబయి తమిళ సంఘం లోగోను పోలి ఉందన్న వివాదం తెర మీదకు రావడం కమల్‌కు షాక్ తగిలినట్టుగా అవుతోన్నది. ఆ పేరుకు నిషేధం విధించాలని తమిళనాడు ఎన్నికల సంఘాన్ని ఆ సంఘం వర్గాలు ఆశ్రయించి ఉండటం గమనార్హం. అదే సమయంలో శనివారం తన అభిమాన సంఘాల నేతలతో, మద్దతు దారులతో జరిగిన సమావేశంలో ఏప్రిల్‌లో తిరుచ్చిలో పర్యటించేందుకు విశ్వనటుడు నిర్ణయించడం ఆలోచించాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment