
నటుడు కమల్‌హాసన్
తమిళ చలనచిత్ర రంగంలో ఎంతో నిజాయితీ కలిగిన నిర్మాతగా కమల్‌కు ఖ్యాతి ఉంది. అయితే తమిళ ఎన్నికల రంగం అంతా అవినీతిమయం. ఇప్పటిదాకా జరిగిన చాలా ఎన్ని కలలో ఓట్లకు డబ్బు వెదజల్లిన ఘనత ఉంది. దీనికి భిన్నమైన వ్యవస్థను ఇస్తానని కమల్ చెబుతున్నారు. ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏమిటంటే, డబ్బులు ఇవ్వనని చెబుతున్న కమల్ పార్టీకి తమిళ ఓట్లు పడతాయా? లేకపోతే ఓటుకు నాలుగువేల రూపాయల వంతున పంచే సంప్రదాయక పార్టీలకే మళ్లీ తమిళులు ఓట్లు కుమ్మరిస్తారా?
సెప్టెంబర్ 22, 1921న మహాత్మాగాంధీ పూర్తిగా మారిపోయారు. తల పాగా సహా తన గుజరాతీ వస్త్రధారణ మొత్తం ఆయన ఆరోజు వదిలి పెట్టేశారు. ఒక అంగవస్త్రం, పైగుడ్డ ధరించారు. ఇలాంటి వస్త్రధారణలోకి మారా లని అంతకు ముందు పలుమార్లు గాంధీజీ ఆలోచించినప్పటికీ, అంతిమంగా మద్రాస్ నుంచి మధురై (అప్పుడు మధుర అనేవారు)కు రైలులో ప్రయాణిస్తున్నప్పుడే తుది నిర్ణయానికి వచ్చారు. ఆయన మారాలని భావించిన వేషధారణతోనే వెస్ట్ మాసీ స్ట్రీట్‌లోని 251 ఏ నంబర్ ఇల్లు మొదటి ఫ్లోర్‌లోని తన గది నుంచి ఆ ఉదయం ప్రత్యక్షమయ్యారు. తన ‘కొత్త’ దుస్తులతోనే గాంధీజీ రామనాథపురం బయలుదేరారు.
ఆ వేష ధారణలో ప్రజలు మొదటిసారి ఎక్కడైతే చూశారో, అక్కడే ఇప్పుడు గాంధీజీ శిలావిగ్రహం ఉంది. ‘మహాత్మాగాంధీ సంకలిత రచనలు’ పుస్తకంలో ఈ ఉదంతాన్ని ఆయన నమోదు చేశారు కూడా. అక్కడ నుంచి 2018 సంవత్సరానికి వద్దాం. గాంధీజీ జీవితం, ఉద్య మాలతో బహుధా ఉత్తేజితుడైన ఒక వ్యక్తి ఆయన వలెనే చెన్నై నుంచి మధురైకు ప్రయాణమవుతున్నారు. తనకు ప్రేరణగా నిలిచిన గాంధీజీ వలెనే నటుడు కమల్ హాసన్ కూడా తన సినిమా నటుడి అవతారాన్ని త్యజిస్తు న్నారు. సినీ తళుకు బెళుకు వేషం నుంచి ఆ మధురైలోనే రాజకీయ నాయకుడి వేషధారణలోకి మారుతున్నారు. గాంధీజీ అడుగుజాడలలోనే ఫిబ్రవరి 21న రామనాథపురం బయలుదేరుతున్నారు కూడా.
కమల్‌లో కలాంను చూస్తున్న ప్రజలు
ఇది కూడా కమల్ సినిమాలలో మాదిరిగానే పటిష్టంగా కూర్చిన బలమైన సన్నివేశం వంటిదే కాగలదు. నిజానికి ఇదేమీ ఆశ్చర్యం కలిగించేది కాదు. సృజనాత్మక కళాకారునిగా రూపం ప్రాధాన్యం ఎలాంటిదో కమల్‌కు బాగా తెలుసు. బుధవారం సాయంత్రం తన రాజకీయ పార్టీ సిద్ధాంతం ఏమిటో చెప్పడానికి ఇలాంటి సమాంతర వేషధారణ అవసరమన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. మధురైలో అడుగు పెడితే ఇప్పుడు ఆ నగరం కమల్ సొంతమైనట్టు ఉంది. కమల్‌లో ఏపీజే అబ్దుల్ కలాంను చూసుకుంటున్న అభిమానులు ఏర్పాటు చేసిన పోస్టర్లతో నగరం నిండి ఉంది. ఇంకొన్ని పోస్టర్లలో 1992లో ఆయన నటించిన ‘దేవర్ మగన్’ను గుర్తు చేస్తూ ముద్రించిన పోస్టర్లు కనిపిస్తున్నాయి.
కొన్ని పోస్టర్లు కమల్‌ను తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతితో పోల్చి చూపుతున్నాయి. ఇంకొన్ని పోస్టర్లు ఆయనను ‘ద్రవిడ కమల్’ అని పేర్కొంటున్నాయి. తమిళనాడు రాజకీయా లలో కోలీవుడ్ ప్రభావానికి తగ్గట్టుగానే సభ ఏర్పాట్లన్నీ సినిమా పంథాలోనే ఉన్నాయి. ఇటీవలనే రాజకీయాలలోకి వస్తున్నట్టు ప్రకటించిన రజనీకాంత్‌కీ, తనకీ మధ్య పోటీలో తన బలమే తక్కువన్న వాస్తవం కమల్‌కు తెలుసు. రజనీ కాంత్ వలే కమల్ మాస్ వర్గాల నాయకుడు కాదు. కమల్ ఒకింత పై తరగతి వర్గం అభిమానించే కళాకారుడనీ, గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి అందని మేధావి అని ఒక అభిప్రాయం ఉంది.
అలాంటి అభిప్రాయాన్ని తటస్థం చేయడానికి మధురై సభ కమల్‌కు అవకాశం కల్పిస్తున్నది. తన రాజకీయ ప్రవేశం గురించి, పార్టీ గురించి ప్రకటించడానికి ఆయన మధురైను జాగ్ర త్తగానే ఎంచుకున్నారు. ఎందుకంటే అది జల్లికట్టు క్రీడ జరిగే ప్రాంతాలలో ఒకటి. అంటే ఎద్దులను లొంగదీసుకునే క్రీడను అభిమానించే ప్రాంతం. ‘విరుమాండి’ అనే చలనచిత్రంలో కమల్‌ది కథానాయకుని పాత్ర. అది ఎద్దును లొంగదీసుకునే పాత్రే కూడా. 2004లో వచ్చిన ఆ చిత్రం మధురై ప్రాంతంలో ఆయనకు ఎంతో ఆదరణను తెచ్చి పెట్టింది.
జల్లికట్టు క్రీడకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా 2017లో మెరీనాలో జరిగిన ఆందోళనకు మద్దతుగా, ఆ క్రీడ మీద నిషేధం ఎత్తివేయాలంటూ మొదట బయటకు వచ్చిన సినీ ప్రముఖడు కమల్. ‘మీరు జల్లికట్టును నిషే ధిస్తే తరువాత బిర్యానీని కూడా అలాగే నిషేధించాలి’ అని ఆయన అన్నారు. ఆ సినిమాలో నటన, మెరీనా ఉద్యమంలోకి రావడం రెండూ కూడా ఆయన కొత్త పార్టీకి శుభ సంకేతాలవుతాయని ఎదురు చూస్తున్నారు.
తనదైన ముద్ర వేయగలరా?
ప్రత్యేక ముద్ర, తనదైన గుర్తింపు కోసం చూసే వారికి మధురై సంస్కృతి సరైన నేపథ్యాన్ని కూడా అందిస్తుంది. మద్రాస్ కంటే మధురై మరింత తమిళ సంస్కృతితో ఉంటుంది. అందుకే తన వాగ్ధాటితో అక్కడి ప్రజలను సమ్మో హనం చేయడం సాధ్యమని కమల్ ఆశించవచ్చు. ఈ విషయంలో కమల్‌తో పోలిస్తే రజనీకాంత్‌కు కొంత ప్రతికూలత ఉంది. తాను కూడా నిజమైన తమి ళుడనేనని చెప్పుకుంటున్నప్పటికీ, రజనీకాంత్ పొరుగున ఉన్న కర్ణాటకలో పుట్టిన మరాఠీయేనంటూ ఎదురుదాడి తప్పదు.
రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతూ ఉండవచ్చు. ఇందుకు మీదు కట్టి ఉండవచ్చు. కానీ రాజకీయ రంగం మీద కమల్ తనదైన ముద్ర వేయగలరా అనేది మాత్రం ఆయన చెప్పే అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతవరకు ఆయన మంచి విమర్శకుడిగా కనిపించారు. అన్నాడీఎంకే పాలనలోని దోషాల గురించే మాట్లాడారు.
అయితే కొత్త సీసాలో పాత సారా చందంగా ఉంటే మిగతా రాజకీయులకీ ఆయనకీ తేడా ఉండదు. ఒక వస్తువు మీద అతికించిన కాగితం కొత్తగా ఉన్నంత మాత్రానే దానిని కొనుగోలు చేయరు. ఒకసారి దానికేసి చూస్తారు. అంతవరకే. ఆయన ప్రతిపాదించే పరిష్కారాలు అటు అన్నా డీఎంకే, ఇటు డీఎంకే చూపించే పరిష్కారాల కంటే భిన్నంగా ఉంటేనే కమల్ పట్ల సానుకూలత ఏర్పడుతుంది.
ఇంతవరకు కమల్ వ్యవహార శైలిని చూస్తే, ఆయన మంచి వ్యక్తుల వైపు మొగ్గుతున్నాడనే అనిపిస్తుంది. ఆయన ‘మరో కలాం’ కావాలంటూ మధు రైలో పోస్టర్లు వెలసినా, భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్‌తో సమావేశమైనా కమల్ సరైన పంథాలోనే ఉన్నారని భావించేటట్టు చేస్తున్నారు. అలాగే ఆలోచించే రాజకీయవేత్తగా కూడా ఆయన మాట్లాడుతు న్నారు. ఒక సాంకేతిక నిపుణుడి వలే ఆయన నీట్, పర్యావరణం వంటి అంశాల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు.
తన రాజకీయ సరళి ద్రవిడ రాజకీయ మూసలోనే ఉంటుందని కమల్ చెప్పేశారు. దానికి హేతుబద్ధతను జోడిస్తే మరింత విజయవంతంగా ఉంటుంది. ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలైన ద్రవిడ పార్టీ డీఎంకే ఉంది. దానికి కార్యకర్తలు, మందీ మార్బలం ఉంది. స్టాలిన్ అనే నేత కూడా ఉన్నారు. అలాంటప్పుడు ప్రజలు కమల్‌ను ఎందుకు ఎంచుకుం టారు? కాబట్టి ఇప్పుడు కమల్ ఎదుట ఉన్న సవాలు ఏమిటంటే, తాను కూడా ద్రవిడ రాజకీయ తానులో ముక్కనేనని చెబుతున్నప్పుడు, తన సేవలు ఎంత నాణ్యంగా ఉండబోతున్నాయో, ఉన్నతంగా ఉండబోతున్నాయో ఆయన స్పష్టం చేయాలి.
నిజానికి డీఎంకే, అన్నా డీఎంకేలకు ఉన్న ఓటర్లు భిన్నమైనవారు. అన్నా డీఎంకేలో కనిపించే ఓటర్లంతా ప్రధానంగా డీఎంకే వ్యతిరేకులు, కరుణానిధి వ్యతిరేకులే. ఇక డీఎంకే ఓటర్లు రెండు రకాలు. ఒక రకం డీఎంకే సిద్ధాంతానికి నిబద్ధులు. రెండో రకం–కరుణానిధి వక్తృత్వానికి సమ్మోహితులై ఓట్లు వేసే వారు. ఇందులో ఈ రెండో తరహా ఓటర్లు కమల్ వైపు ఆకర్షితులు కావచ్చు. ఎందుకంటే కరుణానిధి కుమారుడు స్టాలిన్ తండ్రి వలే రాజకీయోపన్యాసాన్ని కవితాత్మకంగా ఆవిష్కరించలేరు.
అయితే అన్నాడీఎంకే ఓటరు కమల్ పట్ల మొగ్గు చూపగలరా? ఈ పార్టీకి పడే ఓట్లు మూడు రకాలుగా చీలి పోయి ఉన్నాయి. అవి ఎడప్పాడి పళనిస్వామి శిబిరం ఓటర్లు, ఒ. పన్నీర్‌సెల్వం శిబిరం ఓట్లు, టీటీవీ దినకరన్ పట్ల మొగ్గు చూపే ఓటర్లు. డీఎంకే ఓటర్ల వలే కాకుండా అన్నా డీఎంకే ఓటర్లు దైవభక్తులు. వారి నాయ కురాలు జయలలిత మాదిరిగానే వారు కూడా ప్రేరణ కోసం ఆలయాలను దర్శిస్తారు. జయ నాయకత్వంలో ఆ పార్టీలోని ద్రవిడ వర్ణం పలచబడింది.
అలాగే ఆ పార్టీ నాయకులకు మూఢ నమ్మకాలు ఉన్నాయని ప్రతీతి. మంచి ముహూర్తం చూసి మాత్రమే వారు కార్యక్రమాలు చేపడతారు. కానీ అన్నాడీఎంకే ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవాలంటే కమల్ హేతువాద దృక్పథం పెద్ద అడ్డంకి అవుతుంది. రజనీకాంత్ పరిస్థితి వేరు. ఆయన అన్నా డీఎంకే కార్య కర్తలు, నేతల మాదిరిగా దైవభక్తుడు. కాబట్టి ఆ పార్టీ ఓట్లలో ఆయన తన వాటాను తెచ్చుకోగలరు.
కమల్‌కు పట్టం కడతారా?
కమల్ హాసన్ రాష్ట్రానికి ఏమి ఇస్తానని చెబుతున్నారో సుస్పష్టం. అది పార దర్శకమైన, అవినీతి రహితమైన, కుల రహితమైన, మత రహితమైన ప్రత్యా మ్నాయం ఇస్తానని చెబుతున్నారు. తమిళ చలనచిత్ర రంగంలో ఎంతో నిజాయితీ కలిగిన నిర్మాతగా కమల్‌కు ఖ్యాతి ఉంది. అయితే తమిళ ఎన్నికల రంగం అంతా అవినీతిమయం. ఇప్పటిదాకా జరిగిన చాలా ఎన్నికలలో ఓట్లకు డబ్బు వెదజల్లిన ఘనత ఉంది. దీనికి భిన్నమైన వ్యవస్థను ఇస్తానని కమల్ చెబుతున్నారు.
ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏమిటంటే, తమిళ ఓట్లు డబ్బులు ఇవ్వని కమల్ పార్టీకి పడతాయా? లేకపోతే ఓటుకు నాలుగువేల రూపాయల వంతున పంచే సంప్రదాయక పార్టీలకే మళ్లీ తమిళులు ఓట్లు కుమ్మరిస్తారా? రజనీకాంత్ వలెనే కమల్‌హాసన్‌తో వచ్చిన సమస్య ఏమిటంటే, ఆయ నది కూడా ఏకపాత్రాభినయం. తన పార్టీ వామపక్షాలతో స్నేహపూర్వక షరతులతో కూడి ఉండే కేంద్రీకృత పార్టీ అని కమల్ చెబుతున్నారు. కానీ వామ పక్షాలు ఎన్నికల వ్యవహారంలో ఇప్పుడు అంత ప్రాధాన్యం ఉన్నవి కాదు.
ఈ రెండు పార్టీలు దగ్గరవుతాయా? తన రాజకీయ పార్టీ రంగు నలుపు అని కమల్ చెబుతున్నారు. కానీ రజనీ పార్టీని చూడబోతే కాషాయ ఛాయలో ఉండేటట్టు కనిపిస్తున్నది. అది బీజేపీని సంకేతిస్తుంది. ఇప్పటికే రజనీకాంత్, విజయ్‌కాంత్, కరుణానిధి వంటి తమిళ నాయకులను కలుసుకుని ఆ ఒక్క విషయంలో తను ఎంతో భిన్నమైన వ్యక్తినని ఇప్పుటికే కమల్ నిరూపించుకున్నారు.
ఇలాంటి రాజకీయ మర్యాదలు తమిళనాట కనిపించవు. కరుణానిధి, ఎంజీఆర్‌కు ఉన్న తీవ్ర వైషమ్యాలే ఇందుకు కారణం. అదే వైషమ్యం తరు వాత జయలలితతో కూడా కరుణానిధి కొనసాగించారు. తన రాజకీయోప న్యాసంలో కమల్ నాగరికతను ధ్వనింపచేయగలిగితే ఆయన తమిళుల హృదయాలను గెలుచుకోగలరు.
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
టీఎస్ సుధీర్