Dravidian politics
-
Lok sabha elections 2024: జాతీయ పార్టిలకు... ద్రవిడ స్వప్నం!
దక్షిణాదిన జాతీయ పార్టిలకు కొరకరాని కొయ్యగా నిలుస్తున్న రాష్ట్రాల్లో ప్రధానమైనది తమిళనాడు! 50 ఏళ్లకు పైగా ఇక్కడ ప్రాంతీయ పార్టిలదే హవా. తమిళులు కూడా సినీ గ్లామర్, ప్రాంతీయ సమస్యలు, అంశాలకే ప్రాధాన్యమిస్తారు. కానీ 39 లోక్‌సభ స్థానాలతో సీట్లపరంగా దేశంలో ఐదో అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడును పక్కనపెట్టే పరిస్థితి లేదు. దాంతో కాంగ్రెస్, బీజేపీ ఇక్కడి ప్రాంతీయ పార్టితో పొత్తులు పెట్టుకోక తప్పడం లేదు. ఈసారి మాత్రం రాష్ట్రంలో బీజేపీ గట్టిగా ఉనికిని చాటే ప్రయత్నాల్లో ఉంది... ఇండియా కూటమిదే హవా? ఒకప్పుడు కరుణానిధి డీఎంకే, జయలలిత అన్నాడీఎంకేలకు కంచుకోటైన నిలిచిన తమిళనాట వారి తదనంతరం పరిస్థితులు మారుతున్నాయి. అన్నాడీఎంకే వంటి ప్రధాన ప్రాంతీయ పార్టీ బలహీనపడటంతో ఆ రాజకీయ శూన్యతను భర్తీ చేసి ఈ కీలక దక్షిణాది రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ కూడా ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పాలక డీఎంకేతో జట్టుకట్టింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన యూపీఏ కూటమి ఎన్డీఏను మట్టికరిపించింది. ఏకంగా 38 సీట్లను ఎగరేసుకుపోయింది. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే 23 స్థానాల్లో పోటీ చేసి 23 సీట్లు చేజిక్కించుకుంది. కాంగ్రెస్ 9 స్థానాలకు 8 దక్కించుకుంది. సీపీఐ, సీపీఎం చెరో రెండు, ఇతర చిన్న పార్టీలు ఒక్కో సీటు గెలుచుకున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జయలలిత సారథ్యంలో 37 స్థానాలు కొల్లగొట్టిన అన్నాడీఎంకే 2019లో బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి బొక్కబోర్లా పడింది. 21 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటు గెలుచు కుంది. బీజేపీ, పీఎంకే, డీఎండీకే, టీఎంసీ (ఎం) ఖాతా కూడా తెరవలేదు. ఈసారి ఇండియా కూటమి నుంచి డీఎంకే 21, కాంగ్రెస్ 9, సీపీఐ, సీపీఎం, వీసీకే రెండేసి స్థానాల్లో, ఎండీఎంకే, ఐయూఎంఎల్ చెరో చోట పోటీ చేస్తున్నాయి. ఒక స్వతంత్రుడు డీఎంకే మద్దతుతో ఆ పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నారు. అవినీతి వర్సిటీకి చాన్సలర్ మోదీ దేశంలో అత్యంత అవినీతిమయమైన పార్టీ బీజేపీయే. అవినీతి పేరుతో యూనివర్సిటీ పెడితే దానికి మోదీయే చాన్సలర్ అవుతారు. ఆ అర్హతలన్నీ ఆయనకే ఉన్నాయి. – చెన్నై రోడ్‌షోలో సీఎం స్టాలిన్ బీజేపీ పాగా వేసేనా? ద్రవిడ రాజ్యంలో పాగా వేయాలని తహతహలాడుతున్న కమలనాథులకు అన్నాడీఎంకే దూరమవడంతో ఈసారి ఆదిలోనే షాక్ తగిలింది. దాంతో చిన్నాచితకా పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ (ఎం)కు 3, ఎస్.రాందాస్‌కు చెందిన పట్టాలి మక్కల్ కచి్చకి 10, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)కు 2 సీట్లు కేటాయించింది. మరో 4 చోట్ల కూటమిలోని ఇతర పక్షాలు కమలం గుర్తుపై పోటీ చేయనున్నాయి. అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్‌సెల్వంకు బీజేపీ మొండిచేయి చూపింది. ప్రధాని మోదీ తమిళనాట సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అయోధ్య, డీఎంకే అవినీతి, కుటుంబ పాలనను ప్రచారా్రస్తాలుగా మలచడంతో పాటు తమిళ భాషకు పెద్దపీట వేస్తామంటూ పదేపదే ప్రకటిస్తున్నారు. దివంగత విజయకాంత్ పార్టీ డీఎండీకే (5 సీట్లు), మరో రెండు పార్టిలతో (చెరో సీటు) అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తోంది. 32 చోట్ల ఆ పార్టీ బరిలో ఉంది. అన్నామలై... బీజేపీ తురుపుముక్క బీజేపీకి తమిళనాట ఎట్టకేలకు కె.అన్నామలై రూపంలో ఫైర్‌బ్రాండ్ నాయకుడు దొరికారు. 2021లో 36 ఏళ్ల అతి చిన్న వయసులో పార్టీ పగ్గాలు అందుకుని శరవేగంగా కీలక నేతగా ఎదిగారు. ‘సింగమ్ అన్న’గా పేరొందిన ఈ మాజీ ఐపీఎస్ మొత్తం పాదయాత్రతో క్రేజ్ సంపాదించారు. డీఎంకే అవినీతిని ఎండగట్టడంతో పాటు హిందుత్వ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దూకుడు, వాగ్ధాటితో బీజేపీకి జోష్ తెచ్చారు. కోయబత్తూరు నుంచి బరిలో ఉన్నారు. రాజధానిని నాగపూర్‌కు ఎలా మారుస్తారు? అర్థంపర్థముందా? కమల్ పిచ్చాసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకుంటే మంచిది. డీఎంకే ప్రాపకం, రాజ్యసభ స్థానం కోసమే ఆయన పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు – కోయంబత్తూరు ర్యాలీలో అన్నామలై ఐదుగురు ‘సినీ’ సీఎంలు తమిళ రాజకీయాలకు, సినిమాలకు బ్రిటిష్ కాలం నుండీ విడదీయరాని బంధం! నాటి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) నుండి తాజాగా విజయ్ దాకా వెండితెరపై ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లోకి వచి్చనవారే. సినీ పరిశ్రమ నుంచి తమిళనాట ఐదుగురు ముఖ్యమంత్రులయ్యారు. ద్రవిడ సిద్ధాంతాలను సినిమాల్లో చొప్పించిన వారిలో రాష్ట్ర తొలి ద్రవిడ సీఎం సీఎన్ అన్నాదురై ముందుంటారు. ఇక కవిగా, స్క్రీన్‌ప్లే, సంభాషణ రచయితగా పేరొందిన ఎం.కరుణానిధి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడైన తమిళ సినీ దిగ్గజం ఎంజీఆర్ కూడా ముఖ్యమంత్రులయ్యారు. ఎంజీఆర్ మరణానంతరం అతి స్వల్పకాలం పాటు సీఎంగా చేసిన ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా సినీ నటే. అనంతరం ఎంజీఆర్ వారసురాలైన స్టార్ హీరోయిన్ జయలలిత సీఎంగా చెరగని ముద్ర వేశారు. తర్వాతి తరంలో విజయకాంత్ (ఎండీఎంకే), కమల్‌హాసన్ (మక్కల్ నీది మయం) పార్టిలు పెట్టినా రాణించలేదు. కమల్ ఈసారి ఇండియా కూటమికి మద్దతు తెలిపారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టినంత పని చేసి చివరికి విరమించుకున్నారు. తాజాగా సూపర్‌స్టార్ విజయ్ కూడా తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ పెట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించారు. హీరో విశాల్ కూడా పార్టీ పెడతానని ప్రకటించారు. ఇండియా కూటమికే సర్వేల మొగ్గు తమిళనాట ఇండియా కూటమి మళ్లీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకి ఓట్ల శాతం భారీగా పెరుగుతుందని, నాలుగైదు స్థానాలూ వస్తాయని మరో సర్వే అంటోంది. అవినీతికి మారుపేరు డీఎంకే. దానిపై తొలి కాపీరైట్ ఆ పార్టిదే. అదో ఫ్యామిలీ కంపెనీ. రాష్ట్రాన్ని లూటీ చేస్తోంది. భాష, కులం, మతం, విశ్వాసం అంటూ విద్వేష, విభజన రాజకీయాలు చేస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో డీఎంకే వంటి కుటుంబ పార్టిలు అవినీతిపరులకు కొమ్ముకాస్తున్నాయి. కచ్చతీవు దీవిని 1974లో శ్రీలంకకు ధారాదత్తం చేసింది ఈ రెండు పార్టిలే. – వెల్లూరు సభలో ప్రధాని మోదీ ఎన్డీఏ ఈసారి అధికారంలోకి వస్తే దేశ రాజధానిని నాగపూర్‌కు మార్చేస్తుంది. త్రివర్ణ పతాకాన్ని కూడా కాషాయ జెండాగా మర్చాలని చూస్తున్నారు. గుజరాత్ మోడల్ కంటే ద్రవిడ మోడల్ చాలా గొప్పది. మేం దాన్నే అనుసరిస్తాం. – డీఎంకే తరఫున ప్రచారంలో కమల్ హాసన్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ద్రవిడ సిద్ధాంతాలకు సవాల్
రజనీకాంత్ రాజకీయ ప్రవేశం కన్నా.. ఆయన ప్రసంగంలో పేర్కొన్న ‘ఆధ్యాత్మిక రాజకీయం’ కీలకమైన చర్చకు తెరలేపింది. రజనీకాంత్ (68) ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమిళనాట బహిరంగంగా ఓ వ్యక్తి భగవద్గీత శ్లోకాలను తన ప్రసంగంలో పేర్కొనటం దాదాపు జరగలేదనే చెప్పాలి. అలాంటిది రజనీ ‘కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన’ అని ప్రసంగించటం తమిళనాడు రాజకీయాల్లో 60 ఏళ్లుగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ద్రవిడ ఉద్యమాలకు పెను సవాల్‌గా మారనుందనే చర్చ మొదలైంది. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు ‘ద్రవిడ’ భావానికి పరీక్షగా మారనున్నాయి. ఆరెస్సెస్, హిందుత్వ శక్తులతోపాటు చాలాకాలంగా తమిళనాడులో ప్రవేశానికి ఎదురుచూస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికలు చిట్టచివరి అడ్డంకి కానున్నాయనే పరిస్థితి గోచరిస్తోంది. ఆధ్యాత్మిక రాజకీయాలంటే సంఘసంస్కర్త ఈవీ రామస్వామి ప్రారంభించిన ద్రవిడ ఉద్యమ స్ఫూర్తి మతం, ఆధ్యాత్మికతను తీవ్రంగా వ్యతిరేకించింది. భగవద్గీత, వర్ణవ్యవస్థ, ఆర్య–ద్రవిడ సిద్ధాంతం, తమిళ సంస్కృతి వంటి అంశాలపై రామస్వామి తరచూ మాట్లాడేవారు. ఆ తర్వాత హేతువాది సీఎన్ అన్నాదురై దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. అనంతరం తమిళనాడులో దేవుడిపై వ్యతిరేక వైఖరి పెరుగుతూ పోయింది. ఇలాంటి ఆలోచనలతోనే హిందీ వ్యతిరేక ఉద్యమం ద్వారా 1967లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 60 ఏళ్లుగా రాజకీయాల్లో ఆధ్మాత్మికత గురించి ఎవరూ మాట్లాడే ధైర్యం చేయలేదు సరికదా.. తమ సిద్ధాంతాలను వెల్లడించే ప్రయత్నం కూడా చేయలేదు. దేవుణ్ణి నమ్మే ఎంజీఆర్ దేవాలయ సందర్శనను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. జయలలిత తన నమ్మకాలను బహిరంగంగా ప్రదర్శించారు. దేవాలయాలకు విరాళాలిచ్చారు. దేవుని సాక్షిగానే ప్రమాణస్వీకారం చేసేవారు. కానీ.. తమిళ రాజకీయాల్లో ద్రవిడ సిద్ధాంతం పాత్రను మాత్రం ఎన్నడూ విస్మరించలేదు. ఎందుకంటే.. 2003లో మతప్రచార వ్యతిరేక బిల్లును తీసుకురాగా.. తర్వాతి పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఒక్కసీటు కూడా దక్కలేదు. దీంతో తర్వాత ఎప్పుడూ జయ అలాంటి ప్రయోగాలు చేయలేదు. ద్రవిడ సిద్ధాంత వ్యతిరేకులు తమిళప్రజల్లోని భావనలను తొలగించేందుకు చాలాసార్లు విఫలయత్నాలు చేశారు. చాలాకాలం తర్వాత రజనీకాంత్ బహిరంగంగానే భగవద్గీత శ్లోకాలను ప్రస్తావించటం ఆశ్చర్యం కలిగించింది. రజనీకాంత్‌కు ఆధ్యాత్మికతే సర్వస్వం. తమిళనాడులోని హిందుత్వ మూలాలు ప్రస్ఫుటంగా ఉన్నాయని.. కులం, మతం కంటే ఆధ్యాత్మికతే ముఖ్యమని రజనీ భావిస్తారు. కుల వ్యవస్థను వ్యతిరేకించిన రాఘవేంద్ర స్వామిని రజనీకాంత్ తన గురువుగా భావిస్తారు. హిమాలయాలను తరచూ సందర్శిస్తూ యోగి జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. అలాంటి రజనీ రాజకీయ ప్రవేశం తమిళ రాజకీయ సిద్ధాంతాల్లో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీనికితోడు 1967నాటి భాష, కులం ఆధారంగా నడిచిన ద్రవిడ రాజకీయాలు మచ్చుకైనా కనిపించటం లేదు. దీంతో రజనీకి పరిస్థితులు కలిసొస్తాయని.. ఆరెస్సెస్ చేయలేని పనిని ఈయన చేసే అవకాశముందని వారంటున్నారు. బెంగళూరులో స్థిరపడిన మరాఠీ కుటుంబంలో పుట్టిన రజనీకాంత్ దశాబ్దాల క్రితమే తమిళనాడును నివాసప్రాంతంగా చేసుకున్నారు. అయితే రాజకీయాల్లోకి వస్తే ఆయన్ను మరాఠీ వ్యక్తిగానే పరిగణించాలంటూ పలువురు విమర్శించినా దీనిపై రజనీ ఎన్నడూ పట్టించుకోలేదు. – సాక్షి నేషనల్ డెస్క్ -
‘అన్నా’ నుంచి ‘అమ్మ’ వరకూ...
-
‘అన్నా’ నుంచి ‘అమ్మ’ వరకూ...
- ఆరాధ్య ‘దైవాల’ కోసం తమిళుల ఆవేదన - ద్రవిడ రాజకీయాల ఆద్యుడు అన్నాదురై అంతిమయాత్రలో కోటిన్నర మంది.. - ఎంజీఆర్ మరణించిప్పుడు వందల మంది ఆత్మహత్య - కరుణానిధి అరెస్టయినప్పుడూ ఆత్మార్పణలు - ఇప్పుడు అమ్మ జయలలిత కోసం ఆక్రందనలు.. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) దాదాపు 47 ఏళ్ల కిందట.. అన్నాదురై మరణించినప్పుడు ఆయన అంతిమ యాత్రలో కోటిన్నర మంది పాల్గొన్నారు. అంతకు ముందు గొప్పనేతలైన మహాత్మాగాంధీ, అబ్రహంలింకన్ అంతిమయాత్రల్లో కూడా ఇంతమంది హాజరుకాలేదు. ఆయన మీద అభిమానంతో ఎన్నో గుండెల ఆగిపోయాయి. మూడు దశాబ్దాల కిందట.. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల బ్రూక్లిన్ ఆస్పత్రిలో ఎంజీఆర్ కన్నుమూసినపుడు తమిళనాడు శోకసంద్రమైంది. ఆయన ఆస్పత్రిలో ఉన్నపుడు.. తమ ‘దేవుడి’ క్షేమం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పూజలు, ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. ఆయన మరణ వార్త తెలియగానే ఎంతో మంది చనిపోగా.. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. నాడు గురువు కోసం పరితపించిన తమిళ గుండె.. ఇప్పుడు ఆయన శిష్యురాలైన తమ ‘అమ్మ’ కోసం చెరువుగా మారుతోంది!! తమిళ జనం అంతే.. ఎవరినైనా ప్రేమిస్తే గుండె లోతుల్లోంచి ప్రేమిస్తారు! ఆ వ్యక్తిని తమ జీవన సర్వస్వంగా.. దేవుడికంటే ఎక్కువగా ఆరాధిస్తారు! వారు లేకుంటే తమకు బతుకే లేదన్నంతగా కొలుస్తారు! తమ ఆరాధ్య నేతలు కన్నుమూస్తే.. తామూ జీవితం చాలించేంతగా పరితపిస్తారు!! తమిళులు తమ నాయకులను ఇంతగా ఆరాధించడానికి వారి వారి గుణగణాలే కాదు.. సాహితీ, సాంస్కృతిక రంగంలో వారి వారి విశిష్టతలు, వారు అనుసరించే విధివిధానాలు కూడా కారణమే! మరీ ముఖ్యంగా.. తమిళ సంస్కృతికి, సంప్రదాయాలకు, సాహిత్యానికి పెద్ద పీట వేయటం.. ప్రాధాన్యం ఇవ్వడం ఈ వ్యక్తి ఆరాధనకు కేంద్ర బిందువని విశ్లేషకుల అంచనా. అలాగే.. ఆయా నాయకులు తమ విశిష్టతను మరింతగా ప్రచారంలోకి తీసుకురావడానికి.. ప్రజల్లో వ్యక్తిగతంగా అభిమానాన్ని పెంపొందించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అన్నాదురై: తమిళనాడులో ద్రవిడ రాజకీయాల ఆద్యుల్లో ప్రముఖుడు.. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ వ్యవస్థాపకుడు సి.ఎన్.అన్నాదురై. ద్రవిడ రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు. 1967- 1969 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అన్నా ఒక గొప్ప ప్రసంగకర్తగా, నాటకరచయితగా కూడా ప్రఖ్యాతి గాంచారు. ఆయన సీఎంగా ఉండగానే.. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 1969 ఫిబ్రవరి 3వ తేదీన కన్నుమూశారు. ఆయన అంతిమయాత్రలో కోటిన్నర మంది అభిమానులు పాల్గొన్నారు. ప్రపంచ చరిత్రలో అప్పటికి అదే అతి భారీ అంతిమయాత్ర. అంతకుముందు గొప్ప నేతలైన మహాత్మా గాంధీ అంతిమ యాత్రలో కానీ, అబ్రహాం లింకన్ అంత్యక్రియలకు కానీ.. ఇంత భారీగా జనం హాజరుకాలేదు. అన్నా కన్నుమూసినపుడు ఎంతో మంది అభిమానులు గుండె ఆగి చనిపోయారు. ఇంకా ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎంజీఆర్: అన్నాదురై తర్వాత ఆయన పార్టీకే చెందిన ఎంజీఆర్‌ను తమిళులు ఎంతగానో అభిమానించారు. తమిళ సినీ రంగాన్ని పరిపాలించిన ఎంజీఆర్.. డీఎంకేలో చేరిన తర్వాత ఆ పార్టీ నుంచి చీలిపోయి అన్నా డీఎంకేను స్థాపించి అధికారంలోకి వచ్చారు. ఎంజీఆర్ ఆవేశపూరితమైన శక్తిమంతమైన ప్రసంగీకుడిగా ఖ్యాతిగడించారు. ‘నా రక్తంలో రక్తమైన తమిళ ప్రజలారా...’ అంటూ ఆయన ఆరంభించే ప్రసంగం తమిళులను ఉర్రూతలూగించేది. ఎంజీఆర్ అధికారంలో ఉన్నపుడు పేదలకు మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ప్రత్యేక బస్సులు ప్రవేశపెట్టారు. ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 1987లో అనారోగ్యంతో అమెరికాలో కన్నుమూశారు. ఎంజీఆర్‌ను కిడ్నీ చికిత్స కోసం అమెరికా తరలించినపుడే.. 100 మందికి పైగా నిప్పంటించుకుని ఆత్మాహుతి చేసుకున్నారు. అదే సంవత్సరం డిసెంబర్ 24న ఎంజీఆర్ తుదిశ్వాస విడిచినపుడు మరో 31 మంది ఆత్మహత్య చేసుకున్నారు. జయలలిత కోసం: ఎంజీఆర్‌ను ఎంతగానో ఆరాధించిన తమిళులు.. ఆయన వారసురాలిగా జయలలితను భావించారు. సినిమా రంగంలో ఎంతో ఖ్యాతి గల ఆమె.. రాజకీయంగానూ తనదైన విశిష్టతను ప్రతిష్టించుకున్నారు. బహు భాషా కోవిదురాలైన జయ అనర్గళంగా ప్రసంగించగలరు. రచయిత్రి కూడా. తమిళులకు పురుచ్చి తలైవి(విప్లవ నాయకి)గా.. వారి గుండెల్లో అమ్మగా స్థానం పొందారు. 2011-16 మధ్య జయలలిత తనను తమిళులు పిలుచుకునే ‘అమ్మ’ పేరుతో క్యాంటీన్లు ప్రారంభించారు. పలు ప్రభుత్వ పథకాలకు అదే పేరు పెట్టి ఉప్పు, బేబీకేర్ కిట్లు తదితరాలు అందించారు. 2014లో జయలలితను అరెస్ట్ చేసినపుడు 16 మంది ఆత్మాహుతి చేసుకున్నారు. ఇప్పుడు ఆమె కన్నుమూయడంతో తమిళులు మరోసారి తమ ఆరాధ్య నాయకురాలి కోసం గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. కరుణానిధి అరెస్టయినపుడూ.. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని కూడా తమిళులు ఎంతగానో ఆరాధిస్తారు. అన్నాదురై స్థాపించిన డీఎంకే నుంచి ఎంజీఆర్ చీలిపోయిన తర్వాత కరుణానిధి పార్టీ సారథిగా కొనసాగుతున్నారు. కరుణానిధి కవిగా, నవలా రచయితగా, సినీ గేయ రచయితగా, సంభాషణల రచయితగా పేరుగాంచారు. 1986లో తమిళనాడులో రెండోసారి హిందీ వ్యతిరేక నిరసనలు చెలరేగిన తర్వాత.. కరుణానిధిని అరెస్ట్ చేసినపుడు 21 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ఎక్కువ మంది నిప్పంటించుకుని చనిపోయారు. 2006-11 మధ్య డీఎంకే అధికారంలో ఉన్నపుడు కరుణానిధి పేద కుటుంబాల కోసం.. తన బిరుదునే పేరుగా పెట్టి ‘కళైంగర్ ఆరోగ్య బీమా పథకం’ ప్రవేశపెట్టారు.