‘అన్నా’ నుంచి ‘అమ్మ’ వరకూ...
- ఆరాధ్య ‘దైవాల’ కోసం తమిళుల ఆవేదన
- ద్రవిడ రాజకీయాల ఆద్యుడు అన్నాదురై అంతిమయాత్రలో కోటిన్నర మంది..
- ఎంజీఆర్ మరణించిప్పుడు వందల మంది ఆత్మహత్య
- కరుణానిధి అరెస్టయినప్పుడూ ఆత్మార్పణలు
- ఇప్పుడు అమ్మ జయలలిత కోసం ఆక్రందనలు..
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
దాదాపు 47 ఏళ్ల కిందట.. అన్నాదురై మరణించినప్పుడు ఆయన అంతిమ యాత్రలో కోటిన్నర మంది పాల్గొన్నారు. అంతకు ముందు గొప్పనేతలైన మహాత్మాగాంధీ, అబ్రహంలింకన్ అంతిమయాత్రల్లో కూడా ఇంతమంది హాజరుకాలేదు. ఆయన మీద అభిమానంతో ఎన్నో గుండెల ఆగిపోయాయి.
మూడు దశాబ్దాల కిందట.. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల బ్రూక్లిన్ ఆస్పత్రిలో ఎంజీఆర్ కన్నుమూసినపుడు తమిళనాడు శోకసంద్రమైంది. ఆయన ఆస్పత్రిలో ఉన్నపుడు.. తమ ‘దేవుడి’ క్షేమం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పూజలు, ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. ఆయన మరణ వార్త తెలియగానే ఎంతో మంది చనిపోగా.. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు.
నాడు గురువు కోసం పరితపించిన తమిళ గుండె.. ఇప్పుడు ఆయన శిష్యురాలైన తమ ‘అమ్మ’ కోసం చెరువుగా మారుతోంది!! తమిళ జనం అంతే.. ఎవరినైనా ప్రేమిస్తే గుండె లోతుల్లోంచి ప్రేమిస్తారు! ఆ వ్యక్తిని తమ జీవన సర్వస్వంగా.. దేవుడికంటే ఎక్కువగా ఆరాధిస్తారు! వారు లేకుంటే తమకు బతుకే లేదన్నంతగా కొలుస్తారు! తమ ఆరాధ్య నేతలు కన్నుమూస్తే.. తామూ జీవితం చాలించేంతగా పరితపిస్తారు!! తమిళులు తమ నాయకులను ఇంతగా ఆరాధించడానికి వారి వారి గుణగణాలే కాదు.. సాహితీ, సాంస్కృతిక రంగంలో వారి వారి విశిష్టతలు, వారు అనుసరించే విధివిధానాలు కూడా కారణమే! మరీ ముఖ్యంగా.. తమిళ సంస్కృతికి, సంప్రదాయాలకు, సాహిత్యానికి పెద్ద పీట వేయటం.. ప్రాధాన్యం ఇవ్వడం ఈ వ్యక్తి ఆరాధనకు కేంద్ర బిందువని విశ్లేషకుల అంచనా. అలాగే.. ఆయా నాయకులు తమ విశిష్టతను మరింతగా ప్రచారంలోకి తీసుకురావడానికి.. ప్రజల్లో వ్యక్తిగతంగా అభిమానాన్ని పెంపొందించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు.
అన్నాదురై: తమిళనాడులో ద్రవిడ రాజకీయాల ఆద్యుల్లో ప్రముఖుడు.. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ వ్యవస్థాపకుడు సి.ఎన్.అన్నాదురై. ద్రవిడ రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు. 1967- 1969 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అన్నా ఒక గొప్ప ప్రసంగకర్తగా, నాటకరచయితగా కూడా ప్రఖ్యాతి గాంచారు. ఆయన సీఎంగా ఉండగానే.. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 1969 ఫిబ్రవరి 3వ తేదీన కన్నుమూశారు. ఆయన అంతిమయాత్రలో కోటిన్నర మంది అభిమానులు పాల్గొన్నారు. ప్రపంచ చరిత్రలో అప్పటికి అదే అతి భారీ అంతిమయాత్ర. అంతకుముందు గొప్ప నేతలైన మహాత్మా గాంధీ అంతిమ యాత్రలో కానీ, అబ్రహాం లింకన్ అంత్యక్రియలకు కానీ.. ఇంత భారీగా జనం హాజరుకాలేదు. అన్నా కన్నుమూసినపుడు ఎంతో మంది అభిమానులు గుండె ఆగి చనిపోయారు. ఇంకా ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు.
ఎంజీఆర్: అన్నాదురై తర్వాత ఆయన పార్టీకే చెందిన ఎంజీఆర్‌ను తమిళులు ఎంతగానో అభిమానించారు. తమిళ సినీ రంగాన్ని పరిపాలించిన ఎంజీఆర్.. డీఎంకేలో చేరిన తర్వాత ఆ పార్టీ నుంచి చీలిపోయి అన్నా డీఎంకేను స్థాపించి అధికారంలోకి వచ్చారు. ఎంజీఆర్ ఆవేశపూరితమైన శక్తిమంతమైన ప్రసంగీకుడిగా ఖ్యాతిగడించారు. ‘నా రక్తంలో రక్తమైన తమిళ ప్రజలారా...’ అంటూ ఆయన ఆరంభించే ప్రసంగం తమిళులను ఉర్రూతలూగించేది. ఎంజీఆర్ అధికారంలో ఉన్నపుడు పేదలకు మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ప్రత్యేక బస్సులు ప్రవేశపెట్టారు. ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 1987లో అనారోగ్యంతో అమెరికాలో కన్నుమూశారు. ఎంజీఆర్‌ను కిడ్నీ చికిత్స కోసం అమెరికా తరలించినపుడే.. 100 మందికి పైగా నిప్పంటించుకుని ఆత్మాహుతి చేసుకున్నారు. అదే సంవత్సరం డిసెంబర్ 24న ఎంజీఆర్ తుదిశ్వాస విడిచినపుడు మరో 31 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
జయలలిత కోసం: ఎంజీఆర్‌ను ఎంతగానో ఆరాధించిన తమిళులు.. ఆయన వారసురాలిగా జయలలితను భావించారు. సినిమా రంగంలో ఎంతో ఖ్యాతి గల ఆమె.. రాజకీయంగానూ తనదైన విశిష్టతను ప్రతిష్టించుకున్నారు. బహు భాషా కోవిదురాలైన జయ అనర్గళంగా ప్రసంగించగలరు. రచయిత్రి కూడా. తమిళులకు పురుచ్చి తలైవి(విప్లవ నాయకి)గా.. వారి గుండెల్లో అమ్మగా స్థానం పొందారు. 2011-16 మధ్య జయలలిత తనను తమిళులు పిలుచుకునే ‘అమ్మ’ పేరుతో క్యాంటీన్లు ప్రారంభించారు. పలు ప్రభుత్వ పథకాలకు అదే పేరు పెట్టి ఉప్పు, బేబీకేర్ కిట్లు తదితరాలు అందించారు. 2014లో జయలలితను అరెస్ట్ చేసినపుడు 16 మంది ఆత్మాహుతి చేసుకున్నారు. ఇప్పుడు ఆమె కన్నుమూయడంతో తమిళులు మరోసారి తమ ఆరాధ్య నాయకురాలి కోసం గుండెలు అవిసేలా రోదిస్తున్నారు.
కరుణానిధి అరెస్టయినపుడూ..
డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని కూడా తమిళులు ఎంతగానో ఆరాధిస్తారు. అన్నాదురై స్థాపించిన డీఎంకే నుంచి ఎంజీఆర్ చీలిపోయిన తర్వాత కరుణానిధి పార్టీ సారథిగా కొనసాగుతున్నారు. కరుణానిధి కవిగా, నవలా రచయితగా, సినీ గేయ రచయితగా, సంభాషణల రచయితగా పేరుగాంచారు. 1986లో తమిళనాడులో రెండోసారి హిందీ వ్యతిరేక నిరసనలు చెలరేగిన తర్వాత.. కరుణానిధిని అరెస్ట్ చేసినపుడు 21 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ఎక్కువ మంది నిప్పంటించుకుని చనిపోయారు. 2006-11 మధ్య డీఎంకే అధికారంలో ఉన్నపుడు కరుణానిధి పేద కుటుంబాల కోసం.. తన బిరుదునే పేరుగా పెట్టి ‘కళైంగర్ ఆరోగ్య బీమా పథకం’ ప్రవేశపెట్టారు.