
టీ.నగర్: తమిళనాడులో 3 నియోజకవర్గాల ఉపఎన్నికల కోసం దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో జయలలిత స్పృహలో ఉండగానే సంతకం చేసినట్లు ఆమె మృతిపై విచారణ జరుపుతున్న ఆర్ముగస్వామి కమిషన్ వెల్లడించింది. ఆమె అపోలో ఆసుపత్రిలో ఉన్నకాలంలో రాష్ట్రంలో 3 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి.
రెండాకుల చిహ్నం కేటాయింపునకు సంబంధించిన బీ ఫారంలో జయలలిత వేలిముద్ర ఉంది. వేలిముద్రలు తీసుకున్న సమయంలో జయ స్పృహలోనే ఉన్నట్లు వైద్యుడు బాలాజీ వాంగ్మూలం ఇచ్చారు. బాలాజీ వాంగ్మూలం వాస్తవమేనని విచారణ కమిషన్ తాజాగా నిర్ధారించింది. ఆసుపత్రి గదిలో జయలలిత వేలిముద్రలు తీసుకున్నది నిజమేనని, తర్వాత ఆమె వేలికి అంటుకున్న సిరాను బాలాజీ తుడిచేందుకు ప్రయత్నించగా ఆయన్ని అడ్డుకుని శశికళ సిరాను తుడిచినట్లు తెలిపింది.