రజనీని అడ్డుకుంటున్న కుటుంబసభ్యులు
►తలైవా ఇంట..రాజీకీయం!
►శారీరక, మానసిక శ్రమ తప్పదని హితవు
►అభిమాన సంఘాలతోనే ప్రజాసేవని సూచన
చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం ముందుకు మూడు అడుగులు, వెనక్కు రెండడుగులుగా సాగుతోంది. ఇంతకూ రజనీ రాజకీయ పార్టీ పెడతారా లేక మరేదైనా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వస్తారాని ప్రజలు బుర్రలు బద్దలుకొట్టుకుంటుండగా ఆయన కుటుంబ సభ్యులే బ్రేక్ వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
గత నెలలో ఐదురోజులపాటు అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ రాజకీయాలపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలపై పరోక్షంగా విమర్శలు, మరికొందరు పేర్లు ప్రస్తావించి ప్రశంసలతో వివాదాలు రేకెత్తించారు. రజనీకాంత్ తమిళేతరుడని, రాజకీయ పార్టీ పెట్టడమో, సీఎం కావడమో సహించేది లేదని కొన్నిపార్టీలు దుయ్యబట్టాయి. మరి కొందరు స్వాగతించారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లో వస్తానని యథాప్రకారం పేర్కొన్న రజనీకాంత్, ‘యుద్ధం వస్తుంది, ఇపుడు వెళ్లి అపుడు రండి’ అంటూ అభిమానులకు నర్మగర్భంగా సంకేతాలు ఇచ్చారు.
కాల షూటింగ్ కోసం ముంబయి వెళ్లినపుడు అమితాబచ్చన్‌ను కలిసి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోగా, రాజకీయాల్లో తన అనుభవాలను అమితాబ్ వివరించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి దారుణంగా విఫలమైన విషయాన్ని గుర్తుచేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో పార్టీ పెడితే తనకు ఎదురయ్యే సమస్యలు, ఫలితాలు ఎలా ఉంటోయోనని రజనీకాంత్ బేరీజు వేసుకుంటున్నారు.
జయలలిత మరణం, కరుణానిధి బైటకు రాలేని స్థితిలో అనేక పార్టీల నేతలు సీఎం కుర్చీకోసం కలలు కంటున్నారు. ఈ పరిస్థితిలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా రజనీకాంత్ సంకేతాలు ఇవ్వడం ప్రారంభించారు. జూలై లేదా ఆగస్టులో మలి విడత అభిమానుల సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రజనీ ఇటీవల ప్రకటించారు.
రజనీని వారిస్తున్న కుటుంబ సభ్యులు:
రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇంతవరకు జరిగిన కసరత్తు ఇలా ఉండగా, తాజాగా కొత్త కోణం బైటపడింది. అసలు మనకు రాజకీయాలే వద్దు అని కుటుంబసభ్యులు రజనీకాంత్‌ను వారిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. రజనీకాంత్ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలపై కుటుంబ సభ్యులు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది రజనీకాంత్ సింగపూరులో చికిత్స, అమెరికాలో విశ్రాంతి తీసుకున్నారు.
ఈనెల మరలా అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకుంటారని ఇటీవల సమాచారం వచ్చింది. కాలా షూటింగ్ షెడ్యూలు ముగిసిన తరువాత రజనీ అమెరికా పయనం ఉండొచ్చని తెలుస్తోంది. రజనీ ఆరోగ్యం ఇలా ఉండగా, రాజకీయాల్లోకి వస్తే అలుపెరగకుండా తిరగాలి, పూర్తిగా విశ్రాంతి ఉండదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. పైగా ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని జీర్ణించుకోలేక మానసిక ప్రశాంతత సైతం ఆయనకు కరవవుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితుల్లో రాజకీయాలు సమంజసం కాదని వారు రజనీకి నచ్చజెపుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాసేవే చేయదలుచుకుంటే అభిమాన సంఘాలనే చారిటబుల్ ట్రస్ట్‌గా మార్పుచేసి ద్వారా కొనసాగించవచ్చని వారు సూచిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ ఏడాది డిసెంబర్ 12వ తేదీన రజనీకాంత్ జన్మదినం సందర్భంగా రాజకీయ ప్రవేశంపై అధికారిక ప్రకటన వెలువడగలదని కొందరు నమ్ముతున్నారు.