
చెన్నై: మహానటుడు శివాజీ గణేషన్ తెరపై నటనకంటూ ఒక మైలురాయిని నిర్ణయించి వెళ్లారని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ పేర్కొన్నారు. నటనకే అడుగులు నేర్పిన నటుడు శివాజి గణేషన్ తెరపై ఆయన ధరించని పాత్రలు లేవు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఒక తమిళ భాషలోనే 275 చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా తెలుగు వంటి ఇతర భాషల్లోనూ శివాజీ గణేషన్ అద్భుతమైన పాత్రలో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి దిగ్గజ నటుడు 2001 జులై 21న కళామతల్లిని వదలి వెళ్లిపోయారు.
కాగా బుధవారం శివాజీ గణేషన్ 20వ వర్ధంతి సందర్భంగా పలు వురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. శివాజీ గణేషన్ పెద్దకొడుకు రామ్‌కుమార్ ఉదయాన్నే స్థానిక అడయారులో నెలకొల్పిన శివాజీ గణేషన్ స్మారక మండపానికి వెళ్లి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెండవకొడుకు నటుడు ప్రభు, మనవడు విక్రమ్ ప్రభు వేరే ఊరులో ఉన్నందున అక్కడే వారు నివాళులర్పించారు. కాగా నటుడు కమలహాసన్ శివాజిగణేషన్‌కు నివాళులు అర్పించారు.