
వాజ్‌పేయికి నితీష్ కుమార్ మద్దతు
రాజకీయంగా బీజేపీతో తెగతెంపులు చేసుకున్న జేడీ(యూ) అగ్రనేత, బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ ఒక విషయంలో మాత్రంలో మోదీ సర్కారుతో గళం కలిపారు.
పాట్నా: రాజకీయంగా బీజేపీతో తెగతెంపులు చేసుకున్న జేడీ(యూ) అగ్రనేత, బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ ఒక విషయంలో మాత్రంలో మోదీ సర్కారుతో గళం కలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి భారతరత్న ఇచ్చే విషయంలో ఎన్డీఏ సర్కారుతో ఆయన ఏకీభవించారు. దేశానికి అమూల్యమైన సేవలు అందించిన వాజపేయికి భారతరత్న ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
వాజపేయి అత్యున్నత పురస్కారం ఇవ్వాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉన్నా గత యూపీఏ ప్రభుత్వం దీన్ని విస్మరించిందని విమర్శించారు. ఇప్పటి ప్రధానితో పోల్చుకుంటే వాజపేయి స్వేచ్ఛాజీవి అని పరోక్షంగా మోదీని ఎత్తిపొడిచారు. బీజేపీ నాయకులు వాజపేయి వాడుకుంటున్నారని, ఆయన ఆదర్శాలు మాత్రం పాటించడం లేదని విమర్శించారు.
వాజపేయికి మద్దతుగా నేషనల్ కాన్ఫెరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా ప్రకటన చేసిన మరుసటి రోజే నితీష్ కుమార్ స్పందించడం గమనార్హం. కాగా, వాజ్‌పేయికి, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు మదన్ మోహన్ మాలవ్యాకు ‘భారత రత్న’ అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.