భారత్‌కు విదేశీ నేతలు | Foreign Leaders in Delhi to Pay Vajpayee Last Respects | Sakshi
Sakshi News home page

భారత్‌కు విదేశీ నేతలు

Published Fri, Aug 17 2018 1:50 PM | Last Updated on Fri, Aug 17 2018 4:00 PM

Foreign Leaders in Delhi to Pay Vajpayee Last Respects - Sakshi

న్యూఢిల్లీ: భారతరత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు పలువురు పొరుగు దేశాల నేతలు భారత్‌కు రానున్నారు. ముందుగా బూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌..భారత్‌కు చేరుకుని వాజ్‌పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కాగా, నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రులు పీకే గ్యావల్‌, లక్ష్మణ్‌ కిరిల్లా, అబ్దుల్‌ హసన్‌ మహ్మద్‌ అలీ, పాకిస్థాన్‌ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్‌లు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుని వాజ్‌పేయి పార్థివ దేహానికి అంజలి ఘటించనున్నారు. ప్రజల సందర్శనార్థం వాజ్‌పేయి భౌతికకాయాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. సాయంత్రం స్మృతి స్థల్‌లో అధికారిక లాంఛనాల మధ్య వాజ్‌పేయీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అఫ్ఘానిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ ఖర్జాయ్‌ ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం వాజ్‌పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయీ మృతిపట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రష్యా, మాల్దీవులు, నేపాల్‌, శ్రీలంక తదితర దేశాల అధ్యక్షులు భారత రాష్ట్రపతికి సంతాప సందేశాలు పంపారు. ‘భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతి విచారకరం. ఆయన గొప్ప నాయకుడే కాదు.. సాహిత్యం, కళల్లో మంచి స్కాలర్‌ కూడా. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో మాల్దీవుల్లో పర్యటించారు. ఓ గొప్ప నేతను కోల్పోయిన భారత్‌కు మాల్దీవులు ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ అబ్దుల్ గయూమ్‌ తన సంతాపం తెలియజేశారు.  ‘భారత గొప్ప నేతల్లో వాజ్‌పేయి ఒకరు. ఆయన మృతి విచారకరం. యూకే ప్రభుత్వానికి ఆయన మంచి సన్నిహితుడు’ అని యూకే మంత్రి మార్క్‌ ఫీల్డ్‌ సానుభూతి తెలిపారు.

‘వాజ్‌పేయి ప్రపంచం గర్వించదగ్గ నేత. గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్‌, రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆయన మృతిపట్ల సానుభూతి ప్రకటిస్తున్నాం’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ తన సంతాప సందేశాన్ని పంపారు.  ‘ఈ రోజు ఓ గొప్ప మానవతావాదిని, నిజమైన స్నేహితుడిని మనం కోల్పోయాం. ఆయన అద్భుతమైన నాయకుడు, ప్రజాస్వామ్య రక్షకుడు’ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంతాపం తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement