
సాక్షి, విజయవాడ : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి నందమూరి తారక రామారావు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చరిత్రలో ఎంతో మంది పుడతారని, కానీ చరిత్ర సృష్టించే యుగ పురుషులు కొందరే ఉంటారని, వారిలో ఎన్టీఆర్ అగ్రస్థానంలో ఉంటారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నానని వెల్లడించారు. తొలిసారి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎన్టీఆర్‌ని అనురాగ దేవత షూటింగ్ లో కలిశానని గుర్తు చేసుకున్నారు. ఎన్నో సంస్కరణలకు రామారావు నాంది పలికారని కొనియాడారు.
తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని, ఆయన బాటలో ముందుకు పోదామని చంద్రాబాబు పిలుపునిచ్చారు. కేంద్రానికి రాష్ట్రాలు బానిసలు కావని ఆనాడే ఎన్టీఆర్ చెప్పారని అన్నారు. ఇప్పటి వరకూ చాలా మందికి భారత రత్న ఇచ్చారని, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. భారతరత్నకు ఎన్టీఆర్ నిజమైన అర్హులు అని అన్నారు. ఎన్నో తీర్మానాలు పెట్టినా ఎందుకు భారతరత్న ఇవ్వటం లేదని కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. త్వరలోనే అమరావతిలో ఎన్టీఆర్ మెమోరియల్‌కు శ్రీకారం చుడతామని ప్రకటించారు.
కేంద్రంలోని అన్ని శాఖలకు యుటిలైజేషన్ సర్టిఫికేట్(యూసీ)లు పంపించామని, కానీ కేంద్ర నాయకులు ఇవ్వలేదంటూ మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. నీతీ ఆయోగ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించిందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రానికి ఏ యూసీ కావాలని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, ఇవ్వకుంటే గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందని చెప్పడానికి ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వాలని ప్రశ్నించారు. ఈ అన్యాయం పై ప్రతి ఒక్కరూ ప్రజల్ని చైతన్య పరచాలని పిలుపు నిచ్చారు. అనవసరంగా ఒక రాష్ట్రం, జాతితో పెట్టుకోవద్దంటూ కేంద్రాన్ని హెచ్చరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడుకి యూసీలు ఇవ్వలేదని చెప్పే అధికారం ఎక్కడిదంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment