ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి ధర్నా
హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి బుధవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ధర్నాకు దిగారు. ఎన్‌టీఆర్ పేరును భారతరత్నకు సిఫారసు చేయకపోవటాన్ని నిరసిస్తూ ఆమె ధర్నా చేపట్టారు. ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో ఇచ్చే పద్మ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు, సమాజానికి ఆయా రంగాల ద్వారా సేవలందించిన వ్యక్తుల పేర్లను సిఫారసు చేస్తాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలోని సర్కారు.. తాజాగా పద్మ అవార్డుల కోసం పలువురి పేర్లు సిఫారసు చేస్తూ కేంద్ర హోంశాఖకు పంపిన జాబితాలో ఎన్‌టీఆర్ పేరును భారతరత్నకు సిఫారసు చేయలేదు.
గతంలో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా అప్పట్లో చంద్రబాబు అడ్డుపుల్ల వేశారన్న వార్తలు వచ్చాయి. ఎన్‌టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇస్తే ఆ అవార్డును నిబంధనల మేరకు ఆయన భార్య లక్ష్మీపార్వతి అందుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్లీ ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని సిఫారసు చేసే అవకాశం వచ్చినప్పటికీ చంద్రబాబు అలా సిఫారసు చేయకపోవడంపై టీడీపీ నేతల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది.