అయ్యో లక్ష్మీపార్వతి.. ‘రాబంధు’వుల రాజకీయం ఇది! | Kommineni Srinivasa Rao Comments On CBN And Purandeswari NTR Coin Cheap Politics, Details Inside - Sakshi
Sakshi News home page

అయ్యో లక్ష్మీపార్వతి.. ‘రాబంధు’వుల రాజకీయం ఇది!

Aug 30 2023 11:16 AM | Updated on Aug 30 2023 12:09 PM

Kommineni Comment On CBN Purandeswari NTR Coin Cheap Politics - Sakshi

ఎన్టీఆర్‌ గొప్పదనం గురించి చెబుతున్నవారు ఆయన భార్యను వెలివేస్తారా?.. 

దివంగత  నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మృతికి ఆయన కుటుంబ సభ్యులు నివాళి అర్పిస్తున్న తీరు వివాదాస్పదంగా కనిపిస్తోంది. తాజాగా ఆయన పేరిట ఒక నాణేన్ని తీసుకు రావడం ఆసక్తికరమైన అంశమే అయినా.. అందులో రాజకీయ దురుద్దేశాలు కనిపించడం మాత్రం ఆయన గౌరవాన్ని తగ్గించడమే అవుతుంది. అసలు కేంద్ర ప్రభుత్వం స్వయంగా చేయవలసిన ఈ పనిని కుటుంబ సభ్యులు చేసిన తీరు, దానికి ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతిని పిలవకపోవడం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన కొందరు నేతలను ఆహ్వానించడం.. ఆ కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రావడం, ఆ తర్వాత ఆయనతో చంద్రబాబు  మంతనాలు జరపడం.. ఇవన్నీ కూడా ఎన్టీఆర్‌ పేరును వీళ్లు రాజకీయంగా వాడేసుకునే యత్నమేననిపిస్తుంది.

తమను గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు సరసన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి దంపతులు కూర్చుని మంతనాలు జరపడం కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. దీనిని చంద్రబాబు తెలివితేటలు అనాలా?లేక పురందేశ్వరి అవకాశవాదం అనాలా? అనేది చెప్పలేం. ఒకప్పుడు దగ్గుబాటి దంపతులు తమను చంద్రబాబు అవమానాలపాలు చేశారని బాధపడుతుండేవారు. వెంకటేశ్వరరావు అయితే ఏకంగా పుస్తకాన్నే రాశారు. మరి అలాంటివారు ఇప్పుడు అలయ్  బలయ్ మాదిరి కూర్చోగలిగారంటే ఏమనుకోవాలన్న ప్రశ్న వస్తుంది. చంద్రబాబు చేతిలో వెంకటేశ్వరరావు ఒకసారి కాదు.. పలుమార్లు దెబ్బతిన్నారు. అవమానాలకు గురయ్యారు. వారు పూర్తిగా కలిసిపోయారో, లేదో తెలియదు కాని అందరి దృష్టిని ఆకర్షించారు.  

ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించడం , తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం ఒక సంచలనం అయితే, ఆయన తన కుటుంబ సభ్యుల చేతిలోనే ఘోర పరాభవానికి గురై పదవి కోల్పోవడం మరో పెద్ద విషాదం. ఆ తర్వాత  కొద్ది కాలానికే ఆయన గుండెపోటుతో కాలం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కుటుంబ పాత్ర ఏమిటి అన్నది ఎప్పటికీ చర్చనీయాంశంగానే ఉంటుంది.

✍️ ఎన్టీఆర్‌ మరణించిన తర్వాత ఆయన ఆస్తుల  వారసత్వాన్ని  కుటుంబ సభ్యులు పొందితే, ఆస్తులతో పాటు రాజకీయ వారసత్వం తమదేనని   అల్లుడు చంద్రబాబు నాయుడు లాగేసుకున్నారు. ఆయన జీవితం చరమాంకంలో ఉన్నప్పుడు వీరెవ్వరూ ఆయన పట్ల కనికరం చూపకపోవడం బాధాకర ఘట్టమైతే,  ఆయన  మృతి చెందిన తర్వాత మాత్రం ఎంతో అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నట్లు ప్రవర్తించడం అచ్చం అదేదో నాటకంలా అనిపిస్తుంది. మరి ఎన్టీఆర్‌ ఇష్టపడి పెళ్లి చేసుకున్న రెండో భార్య లక్ష్మీపార్వతి సంగతేమిటి?. ఎన్టీఆర్‌ గొప్పదనం గురించి చెబుతున్నవారు ఆయన భార్యను వెలివేస్తారా?ఎన్.టి.ఆర్.జీవించి ఉన్నప్పుడు తమకు అవసరమైనప్పుడు ఇదే లక్ష్మీపార్వతితో ఎలా మాట మంతీ కలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిందంతా తప్పు  అనుకుంటే.. కుటుంబ ప్రతిష్ట దెబ్బతిన్నదని భావిస్తే.. లక్ష్మీపార్వతి మాత్రమే తప్పు చేశారా?. పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్‌ సంగతేమిటి?. ఎన్.టిఆర్ కుటుంబంలో ఇంకెవరూ విడాకులు తీసుకోలేదా? మరో పెళ్ళి చేసుకోలేదా?. 

పై విషయాల జోలికి వెళ్లడం పద్దతి కాదు. కానీ, రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండి, పది మందికి నీతులు చెప్పే నేతలుగా ఉన్న పురందేశ్వరికాని, చంద్రబాబు నాయుడు కాని ఇలా చేసి ఉండాల్సింది కాదని చెప్పక తప్పదు. ఒకపక్క  మహిళలను గౌరవించాలని చెబుతూ , ఇంకో పక్క లక్ష్మీపార్వతిని వీలైనప్పుడల్లా అవమానించడం ఎలా సమర్ధించగలం?. తమకు అవసరమైతే ఒక నాయకుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నా, ఒకరిని పెళ్లి చేసుకుని మరొకరితో సంబంధం పెట్టుకున్నారన్న అబియోగాలు ఉన్నా ఆయనను సమర్ధించడం ,రాజకీయ స్నేహం కోసం వెంపర్లాడడాన్ని ఏమనాలి?.. 

✍️ సరే.. ఇది ప్రైవేటు కార్యక్రమం అని చెప్పవచ్చు. కానీ జరిగింది రాష్ట్రపతి భవన్ లో అన్న సంగతి మర్చిపోకూడదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇందులో ఇన్వాల్వ్ కాకపోయినా, కేంద్రం అనుమతితోనే ఈ నాణేల ముద్రణ జరిగిందని గుర్తుంచుకోవాలి. పైగా ఇవేవి చలామణిలో ఉండే నాణాలు కాదట. ఎవరైనా వీటిని 3,500 రూపాయల నుంచి 4,850 రూపాయలకు కొనుగోలు చేసుకోవచ్చట. అంటే  ఎవరైనా తమకు కావల్సిన నాణేలను తయారు చేసుకోవచ్చు. ఈ మాత్రం దానికి అదేదో కేంద్రం విడుదల చేస్తున్నట్లు ఎందుకు ప్రచారం చేశారు. ఇది ప్రైవేట్‌ నాణెమే అయితే ఎన్.టి.ఆర్.ను అవమానించినట్లు కాదా? అదే కేంద్రం కనుక నిజమైన  నాణాలను విడుదల చేసి ఉంటే అవి జనం చేతిలోకి వెళ్లేవి కదా! అది కదా ఆయనను గౌరవించడం అంటే!. 

✍️ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని కోరే వీళ్లు.. గతంలో వాజ్ పేయి ఉన్నప్పుడు ఇవ్వాలన్న ఆలోచన జరిగితే ఎందుకు అంత సుముఖత చూపలేదు?. కేవలం లక్ష్మీపార్వతి ఆ అవార్డు అందుకుంటారనే కదా అప్పుడు అలా చేసింది!. అదే సమయంలో చంద్రబాబు మాత్రం ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్టీఆర్‌ భారతరత్న ఇవ్వాలని అంటారు. ఎన్.టి.ఆర్. అంతటి గొప్ప వ్యక్తి అయితే చంద్రబాబే ఎందుకు కూలదోశారు?. ఆ తర్వాత ఇంటర్వ్యూలలో ఎన్.టి.ఆర్.కు విలువలు లేవని ఎలా చెప్పారు?.. ఇలాంటి ప్రశ్నలకు.. వాళ్ల దగ్గరి నుంచి సమాధానం రాదు.

నాణేం విడుదల కేవలం కుటుంబ సభ్యుల కార్యక్రమం అయితే.. వైఎస్సార్‌సీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణంరాజు, టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్లిన మాజీ ఎంపీలు  సీఎం రమేష్, సుజనా చౌదరి, మరో ఒకరిద్దరు.. అక్కడ ఎలా ఉన్నారు?. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రను ఎలా పిలిచారు?. వీళ్లంతా  ఎన్టీఆర్‌ బంధువులా? లక్ష్మీపార్వతి మాత్రం కాకపోయిందా? అదేదో పురందేశ్వరి ఇంటిలో కార్యక్రమం అయితే ఆమె ఇష్టం వచ్చినట్లు చేసుకుని ఉండవచ్చు. కానీ, రాష్ట్రపతి భవన్ లో పెట్టాక అది పబ్లిక్ కార్యక్రమంగానే ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోకూడదు.

✍️ ఇక రాజకీయం చూస్తే.. ఇటీవలికాలంలో బీజేపీతో ఎలాగొలా అంటకాగాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు దీనిని ఒక అవకాశంగా తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వారి మధ్య జరిగిన మంతనాలు ఏమిటో తెలియదుగాని, కచ్చితంగా రాజకీయ స్నేహం చేయడానికి చంద్రబాబు అర్రులు చాస్తున్న వేళ ఈ భేటీ జరిగింది. దీనికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి చొరవ తీసుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడంలో తనకు సహకరించిన వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి  పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పి, ఆ తర్వాత  అవమానించి బయటకు పంపేశారు. ఆయన లక్ష్మీపార్వతి పార్టీ టిక్కెట్ మీద రాజ్యసభ సభ్యుడు అయ్యారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. తన భార్య పురందేశ్వరి ఎంపీ అయి కేంద్ర మంత్రి అయ్యారు. అప్పట్లో పార్లమెంటులో చంద్రబాబుతో సంబంధం లేకుండా  ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పురందేశ్వరి ఏర్పాటు చేశారు. సోనియాగాంధీకి ఆమె ధన్యవాదాలు కూడా తెలిపారు. అది అధికారిక కార్యక్రమంగా జరిగితే అప్పుడు కూడా లక్ష్మీపార్వతిని పిలవకపోతే ఆమె ఎలాగోలా ఎవరి సహకారంతోనే లోపలికి వెళ్లగలిగిందట. తన ఇంటిలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి చంద్రబాబు వస్తే పలకరించడానికి కూడా ఇష్టపడని పురందేశ్వరి.. రాజకీయం కోసం ఇప్పుడు  జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీకి  సహకరించడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది.

పురందేశ్వరికి మరి తన తండ్రి చివరి రోజుల్లో దగ్గర ఉండి సేవలందించిన లక్ష్మీపార్వతి మాత్రం ఎలా  కొరగాకుండా పోయింది?. ఇలా చేస్తే ఎన్టీఆర్‌ ఆత్మ సంతోషిస్తుందా?తండ్రి గురించి ఎంత గొప్ప ఉపన్యాసం చేసినా విలువ ఉంటుందా? చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ ఏమన్నది వీడియో సహితంగా ఉన్నా.. దానిని పట్టించుకోని పురందేశ్వరి తన తండ్రి ప్రేమించిన లక్ష్మీపార్వతిని మాత్రం అవమానిస్తున్నారు. ఇదేనా తండ్రికి ఇచ్చిన నివాళి అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది.


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement