అభిప్రాయం
‘న నిశ్చితాత్ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. అందుకు ఉదాహరణ ఎన్టీఆర్. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివనీ, గమ్యం చేరవనీ నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలుస్తారు. గొప్ప మనసున్న తండ్రి ఆయన. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పరిపాలించారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి చిత్తశుద్ధితో పాటుపడ్డారు. అందుకే – మరణించిన తరువాత కూడా ఆ మహోన్నత వ్యక్తి నేటికీ జీవించే ఉన్నారు.
తెలుగు రాష్ట్రంలో కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28న జన్మించిన మహానేత ఎన్టీఆర్ గారికి నేటికి 101 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ ఆయన దివ్య తేజస్సు తగ్గలేదు. మరణించి 28 సంవత్సరాలు అయినా ఎన్టీఆర్ పేరు అభిమానుల గుండెల్లో మారుమ్రోగుతూనే వుంది. ఆ రూపం అలరిస్తూనే ఉంది. ఆయన సినిమాలు, రాజకీయ జీవితంలో మాదిరిగానే ఆయన వ్యక్తిత్వంలోనూ అనేకానేక విశేషాంశాలు ఇమిడి ఉన్నాయి.
ఎన్టీఆర్ గారిలో మొదటి నుండి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడటం, అనుకున్నది సాధించేవరకు వెనుకడుగు వేయకపోవటం అనేవి ప్రత్యేక గుణాలు. ఇవే ఆయనను సినీ, రాజకీయ రంగాల్లో విజయపథం వైపు నడిపించాయి.
‘న నిశ్చితాత్ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. ఆ లక్షణం ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిలో చూశాను. ముక్కుసూటిగా పోయే ఇలాంటి నాయకులకు శత్రువులు కూడా ఎక్కువే అనడటానికి వీరిద్దరూ ఎదుర్కొన్న సంఘటనలే సాక్ష్యం.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా – ఆయన భార్యగా అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని కనుక ఆయన వ్యక్తిత్వాన్ని తెలియచేసే ప్రధానమైన రెండు మూడు సంఘటనలు వివరిస్తాను. ఒక్క మా పెళ్లి విషయంలోనే తీసుకుంటే పెళ్లికి ముందు– తర్వాత ఎన్టీఆర్ ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొన్నారు.
తిరుపతిలో జరిగిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా వేడుకల్లో ఎన్టీఆర్ మా వివాహ ప్రకటన చేయగానే చంద్రబాబు ఆ ప్రకటన ప్రజల్లోకి వెళ్లకూడదని మైకులాపించి, లైట్లు ఆర్పించారు. అయినా ఆయన మరుసటి రోజు ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా పెళ్లిని ప్రకటించి మరీ వివాహం చేసుకున్నారు.
అక్కడ నుండి నన్ను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా చేయటానికి చంద్రబాబు, కుటుంబ సభ్యులు కలిసి ఎన్నో పన్నాగాలు పన్నారు. ఎన్టీఆర్ ధైర్యంగా నన్ను అందరి ముందుకు తీసుకెళ్లి నా స్థానం ఏమిటో సగర్వంగా ప్రకటించారు. ప్రతి అవమానంలో అండగా నిలబడి మాకు కీడు చేస్తున్న వారందరినీ ఎదిరించారు. చీకటి రాజకీయాలకు అలవాటు పడ్డ చంద్రబాబు లాంటి వ్యక్తికి ఆయనొక సవాలుగా నిలబడ్డారు. పెద్ద వయస్సులో ఒంటరితనంతో బాధపడుతున్న ఎంతోమందికి మా వివాహం ఒక మార్గం చూపించింది. దాని మీద కొన్ని ఆర్గనైజేషన్స్ ఏర్పడటం కూడా ఒక విశేషమే!
మరో సంఘటన – 1994 ఎన్నికల ప్రచారంలో నన్ను ఇంట్లో ఉంచమని అనేకమంది ద్వారా చెప్పించారు. ఎన్.వి రమణ లాంటి అన్యాయవాదుల్ని ఇంటికి పంపి ఈ పెళ్లి చెల్లదని కూడా వాదించేటట్లు చేశారు. ఎన్టీఆర్ దేనికీ చలించలేదు. తన ఆలోచన మార్చుకోలేదు. నన్ను తీసుకునే ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. స్వయంగా 216 స్థానాలు, మిత్ర పక్షాలకు మరో 34 స్థానాలు సంపాదించి రాజకీయరంగంలో ఒక రికార్డు సాధించారు. మళ్లీ ఆ స్థాయి రికార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరగరాశారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని తమ అధికార దాహంతో లాగేయాలని కుట్రలు పన్నిన రామోజీ, చంద్రబాబు అందుకు నన్నే కారకురాలిగా చూపించారు. ఒక రాజ్యాంగేతర శక్తిగా నా ప్రాతను చిత్రీకరించి, నన్ను విడిచి పెడితేనే తిరిగి పదవి ఇస్తామని ప్రలోభపెట్టారు. ఇక్కడే ఎన్టీఆర్ గొప్ప వ్యక్తిత్వం మేరు పర్వతం లాగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవటానికి సిద్ధపడ్డారు కానీ భార్యను మాత్రం వదులుకోలేదు.
పైగా వారికో సవాల్ విసిరారు. ‘‘నా పార్టీ, నేను సాధించుకున్న పదవి నాకు తిరిగి ఇవ్వటమేమిటి? ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న స్త్రీని బయటకు పంపించటం ఏమిటి? మీ భార్యల్ని అలా వదిలేస్తారా? నా భార్య తప్పు చేసిందని నిరూపించండి. బహిరంగంగా ఆమెను శిక్షిస్తాను’’ అన్నారు. ఈ మాటలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని, తనపై నమ్మకాన్ని నిలబెట్టాయి. ఎప్పటికప్పుడు వారి నిందల నుండి నన్ను గుండెల్లో పొదువుకొని కాపాడుకున్నారు ఆయన.
ఒక సందర్భంలో ఎన్టీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ– ‘‘రాజ్యం కోసం ఆ రాముడు తన భార్యను అడవులకు పంపేశాడు. కానీ ఈ రాముడు తన భార్య గౌరవం కోసం అధికారాన్నే వదులుకున్నాడు’’ అన్నారు. ఇలాంటి నిశ్చితాభిప్రాయాలు ఎంతమంది మగవాళ్లలో ఉంటాయి?! చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు.
ఎన్టీఆర్ గారి సదభిప్రాయాలను, ఆశయాలను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుని కుటుంబ సభ్యులు ఎంతో బాధించారు– వేధించారు– అవమానాల పాలు చేశారు. అయినా చివరి క్షణం వరకు ఆయన తన కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉన్నారు. ప్రతిరోజూ వాళ్ల ఇంటికి స్వీట్లూ, ఫ్రూట్లూ పంపిస్తూనే వచ్చారు. వాళ్లు అప్పుడప్పుడూ వచ్చి డబ్బు పట్టుకుని పోతూ ఉండేవారు. మళ్లీ బయట మాత్రం వాళ్లంతా చంద్రబాబుతో చేతులు కలపడం! ఏది ఏమయినా గొప్ప మనసున్న తండ్రి ఎన్టీఆర్. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పాలించినవారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి ప్రయత్నించి భంగపడ్డ ధీరుడు.
ఎన్ని రకాలుగా చంద్రబాబు, రామోజీలు కుట్రలు పన్ని అవమానించినా, పదవి లాగేసినా తల వంచకుండా తన చివరి క్షణం వరకు ఆయన తన పోరాటాన్ని కొనసాగించారే తప్ప ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ‘‘స్థిరత్వం, ధీరత్వం, ఉచితజ్ఞతా, ప్రియ వక్తృత్వం– చత్వారో సహజాగుణాః అభ్యాసే న లభ్యంతే’’ అని పెద్దలు చెప్పినట్లు ఈ లక్షణాలు ఆయన పుట్టుకతోనే వచ్చాయి. చివరి వరకు ఆ గుణాలు నిలబెట్టుకున్న ధీర గంభీరుడు ఎన్టీఆర్.
నిబద్ధత లేని జీవితం ముళ్ల చెట్టు లాంటిది. ఎవరికీ ఉపయోగం ఉండదు. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివి. గమ్యం చేరవు. ఇది నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలుస్తారు. అందుకే మరణించి కూడా నేటికీ మన మధ్య జీవించే ఉన్నారు.
డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి
వ్యాసకర్త ఎన్టీఆర్ సతీమణి
Comments
Please login to add a commentAdd a comment